బ్రహ్మ మహా పురాణము
దేవాసురుల ఉత్పత్తి కథనము
మునులు లోమహర్షణుడు తమకు తెలిపిన సృష్టి కథనమును సాకల్యముగా విని దేవ దానవ గంధర్వోరగ రాక్షసుల యొక్క ఉత్పత్తిని విపులముగ తెలుపుమని ఆ మహామునిని ప్రార్థించిరి. అంతట ఆ మహామునుల ప్రార్థనను సహర్షముగా విన్న లోమహర్షణుడు ఇట్లనియె....
స్వయంభువు ఆజ్ఞచే దక్షుడు సృష్టి చేయుట ఆరంభించెను. తొలుత మనస్సుచే భూతములను సృజించెను. వారు దేవదానవ గంధర్వ యక్షరాక్షసాదులు. కాని అసంతతి అంతగ పెరుగదయ్యెను. అప్పుడు మైథున ధర్మముచే దానిని పెంపదలచి అసిక్నియను దానిని, వీరణుడను ప్రజాపతి కూతురును గ్రహించెను. తపస్విని లోకముల ధరింప గలదియు అయిన అ అసిక్ని యందు దక్షుడు ఐదువేల మంది పుత్రులను గాంచెను. సృష్టిని పెంపొందింపదలచిన ఆ దక్షపుత్రులను చూచి దేవర్షి (నారదుడు) మీరు ఎందుకు ఈ సృష్టికార్యము చేయుదురు, వద్దు అని ఆదేశించెను. అందుచే వారికి వినాశము కలిగినది. అట్లే ఆ నారద మహామునికి దక్షశాపము సంభవించెను. మున్ను బ్రహ్మకు ఉదయించిన వాడు నారదుడు, వీరణుని కూతురగు ఆసిక్నియందు ఉదయించెను. తండ్రివలె దక్షుడు ఆతనిని కొడుకుగా కనెను. అందువలన దక్షుని కుమారులు హర్యశ్వులని పేరొందిరి. వారు నారదుని మాటవిని ఎచ్చటకో పోయిరి. అపుడు పరమేష్టి (బ్రహ్మ) బ్రహ్మర్షుల పురస్కరించుకొని పోయి దక్షుని క్రోధము ఉపసంహరించుకొనవలసినదని వేడుకొనెను. ఆవల వారిరువురకు ‘నా కన్య అందు నారదుడు నీకు పుత్రుడయి ఉదయింపవలెను’ అని. సంధి అయ్యెను అందులకు దక్షుడు పరమేష్ఠికి ప్రియ అను కన్యనిచ్చెను. ఆమెయందు దక్షశాప భయముచే నారదుడు జనించెను” అని చెప్పెను. అంతట ఆ మునులు ఆయనతో ఇట్లు అనిరి.
“ప్రజాపతి కుమారులు ఎట్లు నారదునిచే నాశనము పొందిరి? ఆ వృత్తాంతము ఉన్నదున్నట్టు మేము వినగోరుచున్నాము” లోమహర్షణుడు వారితో
దక్ష సుతులయిన హర్యశ్వులు ప్రజావృద్ధి చేయగోరి రాగా నారదుడు వారిని చూచి మీరు మూఢులు. ఈ భూమి ప్రమాణము ఎంతో ఎఱుగరు. అట్లు ఎఱుగకయే సంతానమును కననెంచినారు. క్రిందును, మీదును, అంతరమును ఎఱుంగని వారు ఎట్లు బిడ్డలను పొందుదురు అనగా విని వారు నలుదిశలకు బోయిరి. సముద్రమును జొచ్చిన నదులు వెనుకకు తిరుగని విధముగా వారు ఇప్పటికిని వారు తిరిగిరారైరి. ప్రాచేతసుడైన దక్షుడు హర్యశ్వులు అట్లు పోగా, వైరిణియందు ఇంకను వేయిమంది పుత్రులను కనెను. వారు పూర్వము నారదుడు పలికిన పలుకులు స్మరించి దేవర్షి (మన అన్న) బాగుగ చెప్పినాడు. మనమును మన అన్నల జాడ వెంట పోవుదము భూమి ప్రమాణమెఱిగి ఆ మీద సృష్టి చేయుదము అని కూడబలుకుకొని అందరు అన్ని దిక్కులకును పోయిరి. వారును ఇంతవరకు వెనుతిరిగి రారైరి. అది మొదలు సోదరుడు సోదరుని జాడ వెదుక పోయెనేని అక్కడ నశించును, కాని తిరిగిరాడు. ఇది ఎఱిగిన వాడు ఈపనిని చేయరాదు.
దక్షుడు ఆ పుత్ర నష్టమును తెలుసుకొని వైరిణియందు అరువది మంది గన్యలను మరల పుట్టించెను. ఆతడు పదిమందిని ధర్మునికి, పదముగ్గురను కశ్యపునకు, ఇరువది ఏడుగురను సోమునికి, నల్గురను అరిష్టనేమికి, ఇర్వురను బహుపుత్రునకు, ఇద్దరను అంగిరసునికి, ఇద్దరను విద్వాంసుడైన కృశాశ్వునికి ఇచ్చెను. వారి పేరులు వినుడు.
ధర్మునికి ఇచ్చిన పదిమంది అరుంధతి, వసువు, యామి, లంబా, భానువు, మరుత్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ అను వీరు పదిమంది. వీరి సంతానమును వినుడు, విశ్వకుమారులు, విశ్వదేవులు, సాధ్యకొడుకులు సాధ్యులు, మరుత్వతి కొడుకులు మరుత్వంతులు, వసువు కుమారులు వసువులు, భాను బిడ్డలు భానువులు, ముహూర్త కొడుకులు ముహూర్తులు, లంబ కొడుకు ఘోషుడు, యామి కూతురు నాగవీధి పృథివికి సంబంధించిన సంతతి అంతా అరుంధతి యందు జనించెను. సంకల్పకు విశ్వాత్ముడైన సంకల్పుడు పుట్టెను. యామిజ అయిన నాగవీధియందు వృషలుడుపుట్టెను. ప్రచేతన కుమారుడయిన దక్షుడు సోమునికి ఇచ్చిన కన్యలందరు నక్షత్రముల యొక్క నామములతో జ్యోతిశ్శాస్త్రమునందు ప్రసిద్ధులై ఉన్నారు. జ్యోతిర్మండలము నందు పురోగమించువారు దేవతలు. ఖ్యాతివంతులు మఱి ఎనిమిది మంది అనలుడు, వసువులు, ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధవుడు, అనిలుడు, అగ్ని ప్రత్యూషుడు, ప్రభాసుడు అనువారు. ఆపుని కొడుకులను లెక్కింపగా, వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, మునియు. ధ్రువ కుమారుడు కాల భగవానుడు అనువారు (లోక ప్రకాలనుడు) లోకమందు కాల గణమున పడును. సోముని కొడుకు వర్చస్సుడు, (ఆయనయే వర్చస్వి) ధవునికి మనోహర అనుదాని యందు ఉదయించిన వారు ద్రవిణుడు, హుతహవ్యవహుడు, శిశిరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు. అనిలుని భార్య శివ. ఆమె బిడ్డలు మనోజవుడు అవిజ్ఞాతగతి అను వారు ఇద్దరు. అనలుని కొడుకు కుమారుడు రెల్లుదుబ్బునందు శోభిల్లువాడు, అతని తమ్ములు శాఖ, విశాఖ, నైగమేయులను వారు. కృత్తికలుకన్న సంతానం అగుట కార్తికేయుడు అను కుమారుడు. ప్రత్యూషుని కొడుకు దేవలుడను ఋషి. దేవలునికి ఇద్దరు కొడుకులు క్షమాశీలురు, పండితులు, బృహస్పతి చెల్లెలు పరస్త్రీ బ్రహ్మవాదిని. యోగ సిద్ధినంది యెల్ల జగమ్ములందును సంచరించెను. ఆమె ప్రభాసుని భార్య. అతడు వసువులలో ఎని మిదవవాడు. విశ్వకర్మ అను ప్రజాపతి ఆమెయందే ఉద్భవించిరి. వేల శిల్ప ములకు ఆయన కర్త, త్రిదశులకు (దేవతలకు) ఆతడు వార్ధకి (వడ్రంగి). సర్వ భూషణ శిల్ప కల్పనము చేయువాడు. అతడు దేవతా విమాన నిర్మాత. కశ్యపుని వలన సురభి ఏకాదశ రుద్రులను పొందెను. ఆమె మహాదేవుని ప్రసాదమువలన తపస్సుచే ప్రభావితయై ఈ సంతతిని కనెను.
ఏకాదశరుద్రులు-అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, బహు రూపుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభువు, కపర్ది, రైవతుడు, మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి. అనువారు రుద్రశతము పురాణము లందు వర్ణింపబడి ఉన్నది. చరాచర భూత సంఘమువారిచే నిండి ఉన్నది. కశ్యప ప్రజాపతి భార్యలు-అదితి, దితి, దనువు, అరిష్ట, సురస, ఖన, సురభి, వినత, తామ్ర, క్రోధవశ, ఇల, కద్రువు, ముని అనువారు పూర్వ మన్వంతరమువారు. చాక్షుష మన్వంతరమునందు సర్వలోక హితము గోరి దేవతలొకరికొకరు కలిసికొని వేగముగా రండు అదితి యందు ప్రవేశించి జనింతము. అందు వలన మనకు శ్రేయస్సు కలుగఁగలదు అనుకొనిరి” అని లోమహర్షణ సూతుడు పలికెను.
ఇంకను వారిని సంతోష పెట్టుటకై సూతుడు ఇట్లు అనెను..... ఇట్లు అనుకొని ఆ దేవతలు చాక్షుషమన్వంతరమందు కశ్యపునకు దక్ష కుమార్తెయగు అదితియందు జన్మించిరి. విష్ణువు, ఇంద్రుడు తిరిగి పుట్టిరి. అర్యముడు, ధాత, త్వష్ట, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, అంశుడు, మహాతేజస్వియగు భగుడు అను ద్వాదశాదిత్యులు (పన్నెండుమంది ఆదిత్యులు) ఉదయించిరి.
సోముని భార్యలు ఇరువది ఏడుగురు మంచి కాంతివంతులైన కుమారులను కనిరి. అరిష్టనేమి భార్యల యొక్క సంతతి పదునార్వురు జ్ఞాని అయిన బహుపుత్రునియొక్క సంతతి నలుగురు విద్యుత్తులు (మెఱుపులు) చాక్షుష మన్వంతరమందు ఋక్ఛాఖీయులు కృశాశ్వుడను దేవర్షియొక్క కుమారులు. బ్రహ్మర్షిచేత సత్కరింపబడినవారు మహాపురుషులు దేవ ప్రహరణులను వారు జనించిరి. వీరందరూ సహస్ర యుగాంతమున మరల అవతరింతురు. వీరు స్వేచ్చా జన్ములు. ముప్పది మూడు దేవ గణములు అని వీరినే పిలుతురు. ఆకాశమున సూర్యునకు ఉదయాస్తమయములు గల్గినట్లు వీరికిని యుత్పత్యవసానములు కలవు. ప్రతియుగమునందు ఇట్లు దేవతలు కల్గుచుందురు.
కశ్యపుని వలన దితికి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులు జనించిరి విప్రచిత్తి భార్య సింహిక. ఆమె పుత్రులు మహాబలవంతులు, సైంహికేయులు. హిరణ్య కశిపుని పుత్రులు బలశాలురు. వారు నల్గురు హ్లాదుడు, అనుహ్లాదుడు, ప్రహ్లాదుడు, సంహ్లాదుడు. హ్లాదుని కుమారుడు హ్లదుడు. హ్లాదుని కుమారులు ఇద్దరు. శివుడు, కాలుడు అనువారు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. అతని కొడుకు బలి. బలి కుమారులు బాణుడు మొదలుగాగల నూర్గురు. వారందరూ తపోధనులు. ధృతరాష్ట్రుని మొదలు విప్రచిత్తి వరకు కశ్యప ప్రజాపతికి పెక్కుమంది కలిగిరి. ఈ దానవులకు విప్రచిత్తి ప్రధానుడు. వీరి పుత్రపౌత్రగణము గణించి చెప్పుట సాధ్యముగాదు. వీరిలో స్వర్భానుని కూతురు ప్రభ.
సురభి ఆవులను, గేదెలను ప్రసవించెను. ఇతర చెట్లను, తీగలను, తృణ జాతులను కనెను. ఖస యక్షులను కనెను. ముని అనునామె అప్సరలను గాంచెను. అరిష్ట సిద్ధ గంధర్వులను ప్రసవించెను. స్థావర జంగమాత్మకమైన ఈ సంతతి కశ్యపునకు సంబంధించినది. వారి మనుమలు, మునిమనుమలు వేలకొలది పుట్టిరి. ఇది స్వారోచిష మన్వంతరమున జరిగిన సృష్టి, వైవస్వత మన్వంతరమునందు వరుణ దేవతాకమైన క్రతువు జరుగగా బ్రహ్మ హోతగా ఉండి చేసిన హోమమువలన కల్గిన సృష్టిని ఇప్పుడు చెప్పుచున్నాను.
లోగడ కల్పమునందు పుట్టిన సప్తమహర్షులను ఈ కల్పమందు తిరిగి బ్రహ్మ సప్తర్హులుగా గల్పించెను. ఆ మీద దేవ, దానవులకు యుద్ధము జరిగెను. అందు దితి సంతానము రాక్షసులు నశించిరి. దితి కశ్యపునకు మొఱపెట్టుకొనెను. కశ్యపుడు అమె మొఱను విని ఇంద్రుని చంపగలిగిన కుమారుని వరముగా అనుగ్రహించెను.
నీ గర్భమందు జనించువాడు ఇంద్రుని చంపగలడు. కాని నీవు ఆ గర్భమును శుచిగా వ్రతముచేయుచు ధరింపవలెను అనగా అమె అట్లేయని గర్భవతి అయ్యెను. అప్పుడు కశ్యపుడు ఆమె యందు గర్భాధాన మొనరించి వెళ్ళిపోయెను. ఆమె దేవతలను అందరిని నిరోధింపగల్గు తేజస్సును గర్భమున దాల్చి, వ్రతము పూని, ఒకానొక పర్వత మునకు తపస్సు చేయుట కొఱకు పోయెను.
ఆమె వ్రతలోపము ఎప్పుడు జరుగునా అని చూచుచున్న ఇంద్రుడు నూరేండ్ల తరువాత పాదములు కడుగుకొనక పరుండుట చూచి ఆమె గర్భమున ప్రవేశించి వజ్రాయుధముతో దానిని ఏడు తునకలు గావించెను. వజ్రహతుడైన ఆ శిశువు రోదనము చేసెను. ఇంద్రుడు ‘మారోదీః’ ఏడువకుమని మరిమరి చెప్పెను. ఆ గర్భము ఏడు తునకలయ్యెను, ఇంద్రుడు రోషముతో దానిని మరి ఏడు తునకలుగా ఉండగా, ఆ తునకలే మరుత్తులు అను పేర ఏర్పడిరి. ఆ నలుబది తొమ్మిది మందియును ఇంద్రునకు సహాయులైన దేవతలు గూడ అయిరి.
తరువాత దేవతా గణములను ప్రజాపతులనుగా ఒనరించి, పృథువు మొదలుగా గల వారికి రాజ్యములను గూడ విభాగించి ఇచ్చెను. హరియే సాక్షాత్ విష్ణువు, ప్రజాపతియు, పర్జన్యుడును, పవనుడు జిష్ణువునై ఈ జగత్తును సృష్టించెను. ఈ భూత సృష్టిని చక్కగ ఎరిగిన వారికి పునర్జన్మము కలుగదు. అట్టివారికి పరలోక భయము కూడా ఉండదు. (3)