సృష్టి కథనము

ఇట్లు ప్రజాపతి ప్రజలను సృజించి అయోనిజయైన శతరూపను పత్నిగ పొందెను. ద్యులోకమును ఆవరించి ఉండెడి ఆ భగవానునియొక్క మహిమచే శతరూప జనించినది, ఆమె పదివేల ఏండ్లు దుశ్చరతపము జేసి, తపోదీప్తుడైన, స్వాయంభువ మనువును భర్తగ పొందెను. డెబ్బది యొక్క మహాయుగములు ఆ మనువు యొక్క ఆయుర్దాయము. అదే మన్వంతర మనబడును.

అటుపిమ్మట స్వాయంభువమనువను తన భర్తయైన, రాజువలన శతరూప వీరుడను కుమారుని గనెను. ప్రియవ్రత-ఉత్తానపాదులను కూడ కనెను. వీరునికి కామ్య జనించెను. కామ్య యొక్క కుమారులు నల్వురు. వారు సమ్రాట్టు, కుక్షి, విరాట్టు, ప్రభువు అనువారు. ఉత్తానపాదుని వలన సూనృత అను అతని భార్య నల్వురు కొడుకులను గాంచెను. ఆమె ధర్ముని కూతురు. సూనృత (సునీతి) అశ్వమేధము చేయుటచే జనించినది. ఆమె ధ్రువుని తల్లి. ఉత్తానపాదునికి ధ్రువుడు, కీర్తిమంతుడు, ఆయుష్మంతుడు, వసువు అను నల్వురు కుమారులు సూనృతయందు గల్గిరి. ఆ కుమారులలో జ్యేష్ఠుడైన ధ్రువుడు గొప్పకీర్తి కావలెనని కోరి మూడువేల దివ్య సంవత్సరములు తపమాచరించెను.

అతనియెడ బ్రహ్మదేవుడు అత్యంత ప్రీతుడై, తన స్థానమునకు సమానమైన స్థానమును ఇచ్చెను. అది సప్తర్షుల పురోభాగమందు అచలమయి (ధ్రువమయి) వెలుగుచున్నది. అతని అభిమానమును సమృద్ధిని మహిమను గని దేవాసుర గురుడు శుక్రుడు

అహోZస్య తపసోవీర్యమహోశ్రుతమహాద్భుతమ్

యమద్య పురతః కృత్యాధ్రువం సప్తర్షయః స్థితాః –

(‘ఆహా ఈ ధ్రువుని తపస్సు, వీర్యము, పాండిత్యము, అద్భుతము. ఈతని ముందిడుకొని సప్తర్షులు విలసించుచున్నారు’’ అని చెప్పెను. ధ్రువుని వలన శంభువను ఆమె శ్లిష్టి, భవ్యుడు అను కుమారులను కనెను. శ్లిష్టి వలన సుచ్ఛాయ అను నామె రిపువు, రిపుంజయుడు, వీరుడు, వృకలుడు, వృకతేజసుడు అను ఐదుగురు తనయులను పొందెను. రిపువు వలన బృహతి అను అంగన సర్వ తేజశ్శాలియైన చక్షుస్సును కనెను, ఆతడు వీరణుడను ప్రజాపతి యొక్క కూతురగు పైరణి అందు చాక్షువును పొందెను.

అతనికి నడ్వల అను ఆమెయందు గొప్ప తేజస్సుగల సుతులు పదిమంది పుట్టిరి. నడ్వలపై రాజప్రజాపతి కుమార్తె పది మందికి జన్మనిచ్చెను. ఆ పదిమంది కుత్సుడు, పురుషుడు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్కు, కవి, అగ్నిష్టుత్తు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అభిమన్యుడు అనువారు. పురునివలన ఆగ్నేయి అను అమె అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అను ఆఱ్వురు కుమారులను కనెను. అంగుని వలన సునీథుని కుమార్తె వేనుడను కొడుకును గాంచెను. వాడు చేసిన అపచారముచే ఋషులు కోపోద్రిక్తులైరి. వాని సంతానమునకై వాని కుడి హస్తమును మథించిరి. అపుడు ఒక మహానుభావుడు ఉదయించెను. మునులు ఆతనిని చూచి ఇతడు ప్రజారంజకుడగుననిరి. ఆ బాలుడు ధనుస్సును పూని, కవచము తొడిగికొని జ్వలించు అగ్నివలె ఉదయించెను. అతడే పృథువు. ఈ నేలను ఏలినవాడు. (అతని పేర ఈ భూమి పృథివి అనబడెను.)

ఆ మహారాజు రాజసూయ యాగ అభిషేకము పొందిన రాజులందరిలోను మొట్ట మొదటివాడు. అతనికి నిపుణులైన సూత, మాగధులు అను కుమారులు ఇర్వురు జనించిరి. అతడే భూమిని గోపుగా ఒనరించి సస్య రూపమైన క్షీరమును పిదికిన మహానుభావుడు. అట్లు పిదుకబడిన గోవు (భూమి), ప్రజా జీవనమునకు పాలు చేపినది. దేవతలు, ఋషులు, పితృదేవతలు, దానవులు, అప్సరసలు, నాగులు (సర్పములు), పుణ్యజనులు (రాక్షసులు), వీరుధులు, పర్వతులు, తమ తమకు ఆయా పాత్రములందు పిదుకబడిన క్షీరమును త్రాగి ప్రాణధారణము ఒనరించుకొనిరి. వసుంధర వారివారికి పాలిచ్చెను. పృథునికి కుమారులుగా ధర్మజ్ఞులైన అంతర్థి, పాతి అనువారు కల్గిరి. అంతర్థానునివలన శిఖండిని అను నామె హవిర్ధానుడు అను కొడుకును పొందెను. హవిర్ధానుని వలన ఆగ్నేయి ఆర్గురు కుమారులను గాంచెను. వారు ప్రాచీనబర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వ్రజుడు, అజినుడు అనువారు. ప్రాచీనబర్హి భగవానుడు మహానుభావుడు ప్రజాపతి అయ్యెను. హవిర్ధానుని కుమారుడు ప్రాచీనబర్హి పాలించునేలలో దర్భలు నీటిలో ప్రాచీనాగ్రములుగానే మొలచెనట. అందుచే నాతడు ప్రాచీన బర్హియని పిలువబడెను. ఆ ప్రభువు సముద్రుని కూతురు సవర్ణయ అను వనితను పరిణయము ఆడెను. తీవ్ర తపస్సు చేసిన మీదటనే అతడు పెండ్లి చేసికొని సవర్ణయందు ధనుర్వేద పారగులైన పదిమంది కుమారులను గాంచెను. ప్రాచేతనులగు వారందరు ఒక్కటియై తపమాచరించిరి. ఏకరీతిగ ధర్మము నిర్వహించిరి. పదివేలేండ్లు సముద్ర జలములందు ఉండి తీవ్ర తపస్సు చేసిన మహానుభావులు వారు. వారు తపము సేయు తఱి-రక్షణలేని కతన మహావృక్షములు (అంగుళము ఎడములేకుండ) మొలచి ఈ పృథివిని కప్పివేసినవి. అందువలన ప్రజాక్షయము ఏర్పడెను. వాయువు వీచరాదయ్యెను, వాయు పథము చెట్లచే నిండి నిబిడీకృతమయ్యెను. పదివేలేండ్లు ప్రజలకు కదలను మెదలను వశముకాదయ్యెను. అది విని తపస్వులు, ప్రాచేతనులు కోపించి మొగముల నుండి వాయువును, అగ్నిని జనింపజేసిరి. వాయువు తరువులను అన్నింటిని మొదటికి పెల్లగించి పడద్రోసి తడియార్చివైచెను. వానిని నగ్ని దహించెను. ఇట్లు సర్వద్రుమ నాశనమయ్యెను. కొద్దిగా మిగిలిన వృక్షములను చూచి, సోముడు ఏతెంచి, వారిని చూచి, ఇట్లనియె. రాజులారా! కోపమును ఆపుడు. పృథివి అంతయును వృక్ష శూన్యముగా అయినది. అనలానిలములను (అగ్ని వాయువులను) శమింపజేయుడు. ఈ వృక్షము లను కన్న కన్యారత్నము ఇదిగో! పరమ సుందరి-భవిష్యవృత్తాంతము ఎరిగి నేను ఈమెను కడుపులో దాచితిని. ఈమెకు మారిష అని పేరుకలదు. ఈమె మీకు భార్య అగుగాక! సోమవంశవర్ధని ఈమె. మీ తేజస్సులు సగము, నా తేజస్సులో సగము వహించి ఈమె యందు దక్షుడను ప్రజాపతి ఉదయింపగలడు. మీ తేజముచే దగ్ధమయిన ఈ పృథివిని అగ్ని కల్పుడగు అతడు చల్లార్చి, ప్రజలను వృద్ధి పొందింపగలడు అని చెప్పగా, ప్రచేతనులా సోముని పలుకులు ఆదరించి, కోపము ఉపసంహరించి, వృక్షముల నుండి మారిష అను ఆ కన్యను గైకొనిరి. ఆ ప్రచేతనులు పదిమంది వలన మారిష యందు సోమాంశమున మహాతేజస్వియగు దక్షుడు ఉదయించెను.

అతడు చరాచర భూతములను ద్విపాద చతుష్పాద పశువులను, మనసుచేతనే సృజించి ఆ మీదట స్త్రీ సంతానమును కనెను. అందు ధర్మునికి పదిమందిని, కశ్యపునకు పదుమువ్వురను ఇచ్చి, తక్కిన వారిని నక్షత్ర నామ ధారిణులను ఇర్వది యేడ్గురను సోమునికి ఒసంగెను. వారియందు దేవతలు, పక్షులు, గోవులు, నాగులు, దైత్యులు, దానవులు, గంధర్వులు, అప్సరసలు అను జాతులును ఇంకను పెక్కు జాతులు జనించెను. అది మొదలు మైథున సంభవులైన ప్రజలు పుట్ట ఆరంభించిరి. పూర్వము సంకల్ప మాత్రమున, దర్శన మాత్రమున, స్పర్శ మాత్రమున సృష్టి అచ్చట జరుగుచుండెను అని తెలుపగా ఇంకను మునులు ఇట్లనిరి -

“సూత! శుభవ్రతియైన దక్షుడు బ్రహ్మ యొక్క అంగుష్ఠమునుండి కదా జనించెనని చెప్పగా వినుచున్నాము. ఆయన బొటనవ్రేలినుండి కదా! ఈయన భార్య జనించెను. అట్టితఱి దక్షుడు ప్రాచేతనులకు జనించెనంటిరే ఇది ఎట్లు? అని ఈ సంశయము మాకు కలుగుచున్నది. ఈ సంశయము వివరింప నీవు అర్హుడవు. సోముని కూతురు బిడ్డ వీరి మామ యెట్లు అయ్యె” అని అడుగగా ఆ మునులతో

లోమహర్షణుడు ఇట్లనియె -

విప్రులార! భూతములందు జరుగు పుట్టువు నిరోధమును గురించి తెలియక మునులు తికమక పడుచుందురు. విద్యావంతులకే ఇది దురవగాహము. ఈ దక్షాదులు రాజులు యుగయుగమందు తిరిగి పొడముచుందురు. తిరిగి చాటగుచుందురు. విద్వాంసుడైనను కూడా అక్కడ పొరబడును. వీరిలో జ్యేష్ఠ, కనిష్ఠ భావములు మున్ను లేకుండెను. తపస్సుప్రభావమును బట్టియే చిన్న పెద్ద పరిగణనము. దక్షుని ఈ విసృష్టిని ఎఱిగినవాడు సంతానవతుడై, పూర్ణాయువై స్వర్గమందు వసించును. (2)