ద్వాదశ యాత్రా మాహాత్మ్యము

మునులు అడుగ బ్రహ్మ ఇట్లు అనియె. ఉత్థాన ఏకాదశినాడు ఫాల్గుణ పూర్ణిమనాడు విషువ పుణ్యకాల మందు గుడివా యాత్రా దర్శనముచేసిన వాడు పదునల్గురు ఇంద్రుల పరిపాలన కాలము వరకు విష్ణులోకమునందు ఉండును. పురుషోత్తమ క్షేత్రమునకు జ్యేష్ఠమందు యాత్ర చేసినవాడు కల్పాంతము వరకు విష్ణు లోకమందు సుఖించును. విధానమున లోభత్వము డాంబికము లేకుండ భగవత్ప్రతిష్ఠ చేసి పూజించిన అతడు వైకుంఠ భోగములను అనుభవించి మోక్షము నందును.

భగవత్ర్పతిష్ఠా విధానము. అర్చనము, దానము మొదలైనవాని ఫలమును గురించి మునులడుగ బ్రహ్మ ఇట్లు అనియె.

జ్యేష్ఠ శుక్ల ఏకాదశినాడు ఇంద్రద్యుమ్న సరసునందు యథావిధిగ స్నానమాచరించి దేవర్షి పితృ తర్పణములు ఒనరించి ముడి వస్త్రములను ధరించి సూర్యాభిముఖుడై వేదమాత గాయత్రిని అష్టోత్తర శతము (108)మార్లు జపించి సౌరమంత్ర పారాయణము చేసి ముమ్మార్లు ప్రదక్షిణముజేసి త్రివర్ణములవారు వేదోక్త విధానమున సూర్య నమస్కారములను చేయవలెను. స్త్రీ శూద్రులు స్నానాదులందు జపములందు వేదోక్తముగాగాక పురాణోక్త విధానమును అనుసరింపవలెను.

అటుమీద గృహమునకేగి మౌనము వహించి పురుషోత్తముని ధ్యాన ఆవాహనాది విధానమున పూజింపవలెను. ఆ దేవుని ఆవునేతితో పాలతో నభిషేకింపవలెను. పంచామృత స్నానము కూడ చేయింపవలెను. చందనోదకముతో స్నానమాడింపవలెను. ఆ మీద వస్త్రయుగ్మ సమర్పణ చేయవలెను. చందన అగరు కర్పూర కుంకుమములు పూయవలెను. విష్ణుప్రియములైన తామర, మల్లియలతో జగన్నాథుని పూజింపవలెను. ధూపమీయవలెను. అవునేతితోగాని నువ్వుల నూనెతోగాని పండ్రెండు దీపములను పెట్టవలెను. పాయసము చక్కిలములు లడ్డూ వంటకము బెల్లపు పాకము నివేదింపవలెను. మధుర ఫలములను గూడ నివేదింపవలెను. పంచ ఉపచారములచే ఇట్లు పూజించి ‘నమః పురుషోత్తమాయ’ అను మంత్రము108 మార్లు జపింపవలెను. అటుపై, ఆ దేవుని నమస్తే సర్వలోకేశ అని ప్రారంభించి స్తుతించి ఈ పండ్రెండు యాత్రలు నీ యనుగ్రహమున సంపూర్ణ ఫలవంతములగుగాక అని అదేవుని అనుగ్రహింపజేసుకొని దండవత్ర్పణామము గావింపవలెను. పుష్ప వస్త్ర గంధాదులచే అటుపై గురువుని పూజింపవలెను గురువునకును దేవునకును భేదములేదు. ఆ మీదట పుష్పమండప నిర్మాణము జేసి వేదాది విద్యలను స్వామికి అవధరింపజేసి ఆ రాత్రి జాగరణ చేయవలెను. అందు వాసుదేవకథా ప్రసంగము. సంకీర్తనము చేయవలెను. చేయించవలెను. ధ్యానించుచు పఠించుచు శ్రీహరిని స్తుతించుచు నమస్కరించుచు ఆరేయి గడుపవలెను. ద్వాదశి యందు ప్రభాతమున పండ్రెండుగురు వ్రత స్నాతులు వేదపారగులు ఇతిహాస పురాణజ్ఞులు జితేంద్రియులు నయిన బ్రాహ్మణులను ఆహ్వానింపవలెను. తాను యథావిధి స్నానము జేసి పురుషోత్తముని పూజింపవలెను. బ్రాహ్మణులను పూజించి గో, స్వర్ణ, ఛత్ర, పాదుకాదులను వస్త్రాభరణములను ఒసంగి బూజింపవలెను. ఆచార్యునకుకూడ పైన చెప్పిన ద్రవ్యముల ఒసంగి అందరికిని మృష్టాన్న భోజనము పెట్టవలెను. ఆ బ్రాహ్మణులకు మోదకములతోగూడ పండ్రెండు ఉదకుంభములను సదక్షిణముగ దానము చేయవలెను. జ్ఞానప్రదుడైన గురువును బ్రాహ్మణులను విష్ణుతుల్యులుగా భక్తితో భావించి ఇట్లు బూజింపవలెను. అటుపై వారికి నమస్కరించుచు శ్లోక రూపమయిన మంత్రమును పఠింపవలెను. ఆ శ్లోక భావమిది. “అంతటను నిండి యున్నవాడు. ఆది మధ్యాంతములు లేనివాడు శంఖచక్ర గదాధరుడు జగన్నాధుడు అగు పురుషోత్తమ దేవుడు సంప్రీతుడగుగాక. అని ఇట్లు పలికి విప్రులకు నమస్కరించి ఆచార్యుని తోబాటు వారికి శిరసువంచి నమస్కరించి వారిని తనయింటి సరిహద్దుల వరకు సాగనంపి నమస్కరించివచ్చి బంధుజనముతో వాజ్నియమము వహించి భగవత్ప్ర సాదము ఆరగింపవలెను. ఉపాసకులకు దీనులకు భిక్షుకులకు అన్నాతురులకుకు కూడ భోజనము పెట్టవలెను. ఇట్లు చేసిన పురుషుడేని స్త్రీ యేని యశ్వమేధ రాజసూయ శతసహస్ర పుణ్యము పొందును. నూరు తరములు వెనుకవారిని ముందువారిని తరింపజేసి దివ్యరూపధారియై సూర్యునట్లు వెలుగు కామగమగు విమానమున గంధర్వాప్సరో బృందము స్తుతింప తనపుణ్య విశేషముచే దశదిశలను వెలిగించుచు అతడు హరిపురమునకు చేరుకొనును. నూరు కల్పములు వైకుంఠ భోగములను అనుభవించి సర్వస్తుతిపాత్రమై జగన్నాథస్వామి సారూప్యమంది సర్వభోగములను అనుభవించి బ్రహ్మలోకమేగును. అచట తొంబది కల్పములు సుఖించి రుద్రలోకమున కేగును. అచట ఎనుబది కల్పములు సుఖము అనుభవించి గోలోకమునకు ఏగును. డెబ్బది కల్పములచ్చట ఉండును. అటనుండి ప్రజాపతి లోకమేగి అఱువది కల్పములు నానా భోగములను అనుభవించును. అట నుండి ఇంద్ర భవనమునకు ఏతెంచి ఏబది కల్పములు సుఖించి నలుబది కల్పములు సురలోకమున సుఖమనుభవించి, నక్షత్ర లోకమునకుఏగి ముప్పది కల్పములుండి చంద్ర లోకమున ఇరువది కల్పములుండి, ఆదిత్య లోకమునకేగి పది కల్పములు సుఖించి గంధర్వ భువనమున నొక కల్పము భోగించి భూమికేతెంచి ధర్మపరుడైన చక్రవర్తి అగును. ఇచట రాజ్యమును ధర్మముగ పాలించి సంపూర్ణ దక్షిణములగు యజ్ఞములు ఆచరించి యోగిగమ్యమగు మోక్ష ప్రదమయిన శివలోక మందును. అందు భూత ప్రళయముదాక సర్వభోగములను అనుభవించి మరల ఇటకు వచ్చి యోగుల కులమందు విష్ణు భక్తుడైన విప్రుల వంశమందు జనించి చతుర్వేదాధ్యాయియై సుదక్షిణములైన యజ్ఞములను జేసి విష్ణుభక్తి యోగముపూని మోక్షమందుదురు.

భుక్తి ముక్తులను సమకూర్చు గుడివా యాత్రాఫలము మీకు చక్కగ వినిపించితిని. ఓ విప్రులార! మరి ఏమి వినవలతురు? ఆనతిండు” (67)