విష్ణులోక వర్ణనము

విష్ణులోక ప్రమాణము అచటి భోగములు కాంతి బలముల గురించి మాకు తెల్పుము అని మునులు అడిగిరి. ఏ ధర్మా చరణము వలన విష్ణులోకము లభించునో తెల్పుము అన బ్రహ్మ ఇట్లు అనియె.

“విష్ణులోకము సంసార నాశకము. సర్వాశ్చర్య స్థానము. అశోకాది సర్వవృక్ష సంకులము. కల్పవృక్ష స్థానము. సర్వర్తు పుష్ప ఫలసుందరము. పద్మములు కలువలు నానా విధ జలపక్షులు గల దిగుడు బావులు, సరస్సులు అందు గలవు. కామగములైన బంగారు విమానములపై వేల్పులు విహరింతురు. అవి వాయువు కంటె మనస్సు కంటె మించిన వేగముగలవి. పరమ సుందరులైన దేవతాస్త్రీలు అటకేగిన పుణ్యాత్ములను చుట్టుకొని వారికి ఛత్ర చామరములుపట్టి సంగీత నృత్యాదులచే ఆనందింపచేయుదురు.

దక్షిణ సముద్ర తీరమున పెద్దమఱ్ఱిచెట్టు దగ్గరగల కృష్ణభగవానుడు అప్సరసలతో దర్శన మిచ్చును. కృష్ణసారూప్యము నందిన కృష్ణ భక్త బృందము విష్ణు పురమునందు దర్శనమిత్తురు.

మేలిమి బంగారము రంగుగల్గి అనేక రత్నభూషితమై బహుపతాక సమలంకృతమై, బంగారు ప్రాకారముచేత చుట్టుకొని యోజన విస్తారమైన హరి మందిరము ఆ విష్ణు పురమధ్యమందు భాసిల్లుచుండును. చుక్కల నడుమనున్న శరశ్చంద్రునివలె అది ప్రకాశించు చుండును. కంచుకధారులైన ద్వారపాలకులు ఆ పురమునకు గల నాలుగు ద్వారములకు రక్ష ఇచ్చుచుందురు. ఆ లోపల స్వర్ణమయము. మరకత మణిమయము ఇంద్ర నీలము మహానీలము పద్మరాగ మణిమయము వజ్రమయము వైడూర్య మయము అయిన ఏడు పురములు వైకుంఠ లోకములో ఉన్నవి. అందలి స్తంభములు రత్న మయములు. పగడపు కర్రతో తయారుచేసినవి. అచట మహా సిద్ధులు తమ తేజస్సుచేత దశదిశలను వెళ్లింతురు. వారి నడుమ నక్షత్రముల నడుమనున్న పున్నమి చంద్రునివలె మేఘశ్యాముడు, పీతాంబరధారి, శ్రీవత్సాంకితుడు అయిన శ్రీహరి శ్రీదేవితో ప్రకాశించు చుండును. ఆయన కుడిచేతిలో సుదర్శన చక్రము ఎడమచేత అచ్చము తెల్లనైన శంఖము విలసిల్లుచుండును. ఆశంఖము వేయిసుడులు గలది. పాంచజన్యమను పేరుగలది. ఆ శంఖనాదమున సకల జనము సంక్షోభించును. ఆయన యొక్క కుడిచేతిలో దైత్య దానవ నాశకము, జ్వలదగ్ని ప్రకాశము, సర్వపాప వినాశకము అయిన కౌమోదకి అను గద రాణించుచుండును. ఎడమ చేత సూర్యునట్లు వెల్గు శార్ఙ్గమను ధనువు అగ్నిజ్వాలలను చిమ్ము బాణములను దీపించు చుండును. ఆ స్వామి సర్వలోక సృష్టి స్థితి సంహారకుడు సర్వశాస్త్ర నిపుణుడు. సర్వ జగద్గురువు. సహస్రశీర్షుడు. సహస్రపాదుడు. ఆ ప్రభువు సింహాసనమందు ఆసీనుడై ఉండును. ఆయన కనులు తామర రేకులు. ఆయన మేని తళుకు మెఱుపుతీగ సొంపులొలుకు చుండును. సురసిద్ధ గంధర్వాదులతో, మునులతో, సురవరులతో ఇంకను సురాసుర ప్రభువులందరితో పేరోలగముండి వారుచేయు స్తుతుల అవధరించుచుండును. అచట కీర్తి మొదలుకొని మాయ వఱకుగల ఆయాశక్త్యధిష్టాన దేవతలు ఆయన భవనమున కొలువు చేయుచుందురు. ఘృతాచి మొదలు నవగర్భ వరకుగల అప్సరసలు రూప యౌవన శాలినులు స్వామి పేరోలగమునందు ఆడుచు పాడుచు హరిని సేవించు చుందురు. అటగలవారికి రోగము, నీరసము, మృత్యువు, యెండ, చలి, ఆకలి, దప్పిక, దుఃఖము విరూపము కలుగవు. విష్ణుభువనము పరమానంద జనకము. సర్వాభీష్ట ప్రదము. పుణ్యులు పొందు ఉత్తమలోకములు అన్నియు విష్ణు లోకముయొక్క పదునాఱవ కళకు కూడ సరితూగవు. ఇట్టి పుణ్య లోకమునకు నాస్తికులు, విషయలంపటులు, కృతఘ్నులు, పిసినారులు, దొంగలు, అజితేంద్రియులు చేరలేరు. విష్ణుభక్తులై దక్షిణ సముద్ర తీరమందలి క్షేత్రమును సేవించి సుభద్రా రామకృష్ణుల అర్చించిన ధన్యులే పొందగలరు. పురుషోత్తమ క్షేత్రమందు కల్ప వటవృక్ష సముద్ర మధ్యమందు మరణించినవారు ఈ పరమోత్తమ స్థానమునకు ఏగుదురు. సనాతనము సర్వానం దకరము. భుక్తిముక్తి ప్రదము అయిన హరి లోకమును గురించి మీకు తెలిపితిని. (68)