బ్రహ్మ మహా పురాణము
భారత వర్ష వర్ణనము
బ్రహ్మ ఇట్లు అనియె.......
భక్తి ముక్తి ప్రదమై వేద సమ్మితమైన పురాణమును ఎరిగించెద వినుడు. భారత వర్షము కర్మభూమి అనబడు. కర్మఫల భూములు స్వర్గము, నరకమును కూడా కలిగించును. బ్రాహ్మణాదులీ భారతవర్షమందే స్వకీయ కర్మములను ఆచరించి సిద్ధిపొందిరి. ఇందు సందియము లేదు. ధర్మాది పురుషార్థ ప్రదము ఈ భూమి. ఇంద్రాదులు ఇచట శుభకర్మ మాచరించి ఇంద్రాది పదవులందిరి. ఈ వర్షమందలి బుధులు, శాంతులు, వీతరాగులు, విమత్సరులు అయిన మరి కొందరు మోక్షమునందిరి. విమాన యానమున స్వర్గమున నిర్భయముగ ఉండు సురలు కూడ ఈవర్షమునందు శుభకర్మముల నాచరించియే స్వర్గమున కేగినారు. సురాసురులు కూడ ఈ భారత భూమియందు వసింప వేడుక పడుదురు. ఎన్నడు ఆ పుణ్యభారతము దర్శింతుమాయని ఉవ్విళ్ళూరుచుందురు.
నీచే చెప్పబడిన కర్మ భారతవర్షమున తప్ప ఇతరలోకమున ఫలప్రదము కాదు. కావున భారత భూమియే ఉత్తమము, స్వర్గాదులు మధ్యమములనుచు ఆనతిచ్చితిరి. అట్లయిన నా పవిత్ర భూమి వృత్తాంతము సమగ్రముగ, ఆనతిమ్మన పద్మజుడు ఇట్లు చెప్పెను.
భారత వర్షమున భాగములు తొమ్మిది. ఇంద్రద్వీపము, కశేరువు, తామ్రపర్ణము, గభస్తిమంతము, నాగద్వీపము, సౌమ్యము, గాంధర్వము, వారుణము అను తొమ్మిది భాగములు కలవు. ఈ భారత ఖండము సముద్ర పరివృతము. ఇచటి నదులు ఉపనదులు ఈ పురాణమునందు పందొమ్మిదవ అధ్యాయమున పేర్కొనబడినవి.
మహాత్ముడైన భార్గవుని పురము గోవర్ధన మతిరమ్యము. ఇందు ఉత్తర దేశములు వాహేక, వాటథాన, సుతీర, కాలతోయద, అవరాస్త, శూద్ర వర్షాకాలమందు మాత్రమే ప్రవహించునవి. ఎల్లప్పుడు ప్రవహించునవియు అగు నదులు గలవి మత్స్యములు మకుట కుల్యములు కుంతలములు కాశీ కోశములు. అంధ్రకములు, కళింగములు, సమకములు, వృకములు అనుదేశములు మధ్య ప్రదేశమందలి దేశములు. సహ్యపర్వతమునకు ఉత్తరమున గోదావరి పుట్టి ప్రవహించిన ప్రదేశము. మొత్తము భూమండలమునకు ఎల్ల. ఇది, మనోహరమైనది. వాహ్లీక, వాటధాన, సుతీర, కాలతోయద, అపరాంత, శూద్ర, బాహ్లిక, కేరళ, గాంధార, యవన, సింధు సౌవీర, మద్రక, శతద్రుహ, కళింగ, పాద, హారభూషిక, మాఠర, కనక, కైకేయ, దంభమాలిక అనునవి క్షత్రియ, వైశ్య, శూద్ర జాతి నివాసములైన దేశములు కాంభోజ, బర్బర, లౌకిక, వీర, తుషార, పహ్లవ, ఆధాయత, నర, ఆత్రేయ, భరద్వాజ, పుష్కల, దశేరక, లంవక, శునశ్శోకకులిక, జాంగల, ఔషథి, చలచంద్రములు, కిరాత జాతులుగల దేశములు. తోమర హంస, మార్గ, కాశ్మీర, కరుణ, శూలిక, కుహక మాగధములు అనునవి భారతోత్తర దిశనున్న దేశములు. ఇక తూర్పు దేశములందు తెల్పెద తెలిసికొనుడు.
ఆంధ్ర వామజ్కరాక బల్లక మఖాంతక అంగ, వంగ, మలద, మాలవ, ఋత్తిక, భద్రతుంగ, ప్రతిజయ, భార్యాంగ (దర్భాంగ), అపమర్దక, ప్రాగ్జ్యోతిష, మద్ర, విదేహ, తామ్ర లిప్తక, మల్ల మగధక నందములు. దక్షిణాపథ దేశములు. పూర్ణ కేవల, గోలాంగూల, ఋషిక, ముషిక, కుమార, రామఠ, శక మహారాష్ట్ర, మూహిషక, కళింగ, అభీర, వైళిక్య, అటప్య, సరవ, పులింద, మౌలేయ, వైదర్భ, దందక, పౌలిక, మౌలిక, అశ్మక, భోజ వర్థన, కాలిక, కుంతల, దంభక నీల కాలకములు. ఇవి దాక్షిణాత్య దేశములు.
శూరివక-కాలిధనలోల తాంకటములు-అపరాంత దేశములని చెప్పబడును. మలజ-కర్కశ-మేలక-జోళక, ఉత్తమర్ణ దశార్ణ-భోజ-కిష్కింధ, తోషల-కోశల-త్రైపుర-వైదిశ తుంబుర-చర-యనన-పవన-అభయ-రుండికేర-బర్బర-హోత్ర ఋతువులు. వింధ్యపర్వత ప్రాంతములు. ఇక పర్వతాశ్రయములైన దేశములు. నీహార-తుషమార్గ కురు, తంగణ స్వస కర్ణ ప్రావరణ ఊర్ణ దర్ఘ కుంతక చిత్రమార్గ-మాలవా కిరాత తోమరములు. ఇక్కడ చతుర్యుగ ధర్మము నడచును. ఈ భారత వర్షమునకు పూర్వ దక్షిణములుగా ‘మహోదధి’ యను పేరుగల సముద్రమున్నది. ఉత్తరమున హిమవంతము వింటినారి యట్లున్నది. ఈ భారత వర్షము సర్వబీజము. సర్వజీవులు కర్మాచరణముచేసి తత్తత్ఫలభాజనులగుటకు ఇదియే స్థానము. దేవతలుకూడ ఇందు మానవ జన్మమెత్తి సుకృత మొనరించి తత్ఫల మవ్వలి లోకములను అనుభవింప గోరుదురు. ఇది తపః ఫలమిచ్చు భూమి. తీర్థ క్షేత్ర యాత్రాదాన దేవతారాధన స్వాధ్యాయాది సకల సత్కర్మ ఫలప్రద పుణ్య భూమి ఇది. బ్రహ్మచర్యా ద్యాశ్రమములు శాస్త్రములు వ్రతములు ఇష్టాపూర్తములు మఱి యేకల్యాణాచరణమేని ఇచట సఫలము కాక తప్పదు. ఈ భారతవర్ష ప్రశంస సర్వపాపహరము పుణ్యము ధన్యము జ్ఞాన వర్థనము. ఇది చదివిన విన్నవారు సర్వపాప విముక్తులై విష్ణు లోకమందురు. (27)