మార్కండేయ వట దర్శనము

ఇంకను బ్రహ్మ ఇట్లు అనియె-

“ఓ మునివరులార! కల్పాంతమందు ప్రళయమైన తఱి సూర్యచంద్రులు వాయువు చరాచర ప్రపంచము నశించి ప్రచండ ప్రళయ ఆదిత్యుడు ఉదయింప, మేఘములు ఉరుముచుండగా, విద్యుదుత్పాతమున పిడుగులు పడి, చెట్లు గుట్టలుగా పడిపోయి భగ్నమై ఎల్ల లోకములు ఉల్కలుపడి నశింపగా ఎల్ల నదులు సరస్సులు ఇంకిపోవ, సంవర్తకాగ్ని వాయువుతో కూడ ఆదిత్య శోభితమైన లోకమున ప్రవేశించును. అటుపిమ్మట భూమిని బ్రద్దలు గొట్టి పాతాళమున ప్రవేశించి దేవదానవ యక్షాదులకు భయముకూర్చును. అది నాగలోకము దహించి ఈ భూమిని ఏకొంచెమైనను లేకుండ కాల్చి ఈ క్రిందను అంతయును క్షణములో నశింపచేయును. భయంకర జ్వాలలతో మహాధ్వనితో ప్రజ్వలించు ఈ రౌద్రాగ్ని కల్పాగ్ని అని శ్రుతుల వినబడును. ఇది కోటి సూర్య ప్రభతో విజృంభించును. ముల్లోకములను దహించును.

ఇట్టి మహాదారుణ ప్రళయమందు మార్కండేయుడను పరమ ధర్మాతుడు ఋషి ధ్యానయోగనిష్ఠలో ఉండెను. అయన ఒక్కడే ఇప్పుడుండునని శ్రుతి అనగా వేదము తెల్పును. ఆయన మోహపాశముల కట్టుపడి, ఆకలిదప్పులకు, ఇంద్రియములు చెదర అమ్మహాగ్నిని చూచి కంఠము, పెదవులు, నాలుకయు ఎండి, భయమొంది తడబడుచు ఎల్ల భూమి అంతయు కాందిశీకుడై తిఱుగాడుటకు విశ్రమించుటకు ఇంచుకచోటు గానక ఏమి చేయుదు ఎవ్వని శరణంద వలయునో తెలియకున్నాను అన, ఆముని పురుషోత్తముని ఎట్లు కనుగొందును అని ఏకాగ్ర మనస్కుడై ధ్యానించి ఆ దివ్యమైన పరమపదమును మహాప్రళయ కారణమైన దానిని పురుషోత్తమ నామకమైన సుప్రసిద్ధ వటరాజమును చేరెను. ఆ ముని ఆ మఱ్ఱి వృక్షము వద్దకు త్వరగాపోయి, దాని మొదలున కూర్చుండెను. అక్కడ కాలాగ్ని భయములేదు. అక్కడ నిప్పులు కురియవు. సంవర్తాగ్ని ఇక్కడకు చొరదు. అచ్చట పిడుగులు పడవు. అట్టి అభభయస్థానమందు ఆ సనాతన ఋషి విశ్రమించెను. (52)