బ్రహ్మ మహా పురాణము
మార్తండుని కీర్తనము
బ్రహ్మ ఇట్లు అనెను.
“ఓ మునులార! సదేవాసుర మానుషమైన సర్వజగత్తు ఆదిత్యమూలము. ఈ తేజస్సు ఇంద్ర ఉపేంద్రాది సర్వ దేవతామయము. పరమదైవతము ఇదియే. అగ్నియందు యథా విధి వేల్వబడిన ఆహుతి ఆదిత్యునందును ఆదిత్యునివలన వృష్టి. వర్షమువలన అన్నము, దానివలన, ప్రజలు కల్గుదురు. ధ్యాననిష్ఠులకు ధ్యానము, మోక్షులకు మోక్షము-ఈతత్వమే. క్షణ-ముహూర్త-దివస-నిశా-పక్ష-మాస-సంవత్సర-ఋతు-యుగాది కాలగణనము అదిత్యుని వలననే. కాలము లేక నియమములేదు. అగ్ని విహరణ క్రియలేదు. ఋతు విభాగములేదు. అపుడు పుష్పఫలము లెక్కడ ఉండగలవు. సస్య నిష్పత్తి యెక్కడిది. తృణ ఓషధి గణమెక్కడ ఉండును? ఇక్కడ దివంబునను జీవ వ్యవహారము లేనేలేదు. నీటిని హరించునట్టి భాస్కరుని వలననే జగద్వ్యవహారముసాగును. వృష్టి లేక సూర్యుడు తపింపడు నీటిని శోషింపజేయడు. గుడికట్టడు. ఉదకముననే వెలుగును. వసంతమున కపిలవర్ణుడు. గ్రీష్మమున బంగారురంగువాడు. వర్షఋతువున తెల్లనివాడు. శరత్కాలమున పాండువర్ణము వాడు. హేమంతమున రాగిరంగుగలవాడు. శిశిరమున లోహితుడు (ఎఱ్ఱని వాడు). ఋతు స్వభావ సిద్ధములయిన రంగులంబట్టి కూడ సూర్యుడు క్షేమము, సుభిక్షము చేయునట్టివాడు.
సూర్యునకు ఆదిత్య, సవితృ, సూర్య, మిహిర, అర్క ప్రభాకర, మార్తాండ, భాస్కర, భాను, చిత్రభాను, దివాకర, రవి-ఇత్యాదిగ పండ్రెండు సామాన్య నామములు. విష్ణుధాత, భగ, పూష, మిత్ర, ఇంద్ర, వరుణ, అధ్యమ, వివస్వత్, అంశుమత్, త్వష్ట, పర్జన్య అను ఈ పండ్రెండు నామములు విశేషనామములు. విష్ణువు చైత్రమందు పండ్రెండు వందల కిరణములతో వెలుగును. అర్యముడు వైశాఖమందు పదమూడు వందల రశ్ములలో దీపించును. వివస్వంతుడు జ్యేష్ఠమందు పదునాల్గు వందల కరములతోడను, అంశుమంతుడు ఆషాఢమున పదునేను వందల అంశువులతోను, పర్జన్యుడు శ్రావణ మందు పదునాల్గు వందలును, వరుణుడు భాద్రపదమందు అన్నియే కిరణములచేతను, ఇంద్రుడు ఆశ్వయుజమున పన్నెండు వందల కిరణములతోను ధాత కార్తీకమందు పదు నొకండు వందల కిరణములచేతను మార్గశిరమున మిత్రుడు పై విధముగాను, పౌషమున పూష తొమ్మిది వందల కిరణములతోను మాఘమున భగుడును ఫాల్గుణమున త్వష్ట పదునొకండు వందల కిరణములతోను వెలుగుదురు, ఉత్తరాయణము నుండి సూర్య కిరణములు పెంపొందును. దక్షిణాయనము నుండి తగ్గును. ఇట్లు వేలకొలది కిరణములు గ్రహములను అనుసరించి సూర్యునినుండి వెలువడి వెలుంగును. సూర్య సామాన్య నామములు. విశేష నామములును కలిసి ఇరువది నాల్గు ప్రసిద్ధములు. ఇవి గాక సూర్య సహస్ర నామములు వేఱుగా నున్నవి.
అంతట మునులు-ఓ పరమేశ్వరా! ప్రజాపతీ! సహస్రనామములతో సూర్యుని స్తుతించిన మానవునకు ఏ పుణ్యము ప్రాప్తించును? ఏ గతి సిద్ధించును? తెలుపుమని అడిగిరి. బ్రహ్మ ఇట్లు చెప్పెను-మునులారా ! సూర్యసహస్రనామ పారాయణమువలన ఏఫలము గల్గునో పవిత్రము శుభావహము, గుహ్యములునైన ఆ సూర్యనామములను మీకు తెల్పెదను వినుడు. 1. వికర్తనుడు 2. వివస్త్వాంశుడు 3. మార్తాండుడు 4. భాస్కరుడు 5. రవి 6. లోకప్రకాశుడు 7. శ్రీమాన్ 8. లోకచక్షుడు 9. మహేశ్వరుడు 10. లోకసాక్షి 11. త్రిలోకేశుడు 12. కర్త 13. హర్త 14. తమిస్రుడు 15. తపసుడు 16. తాపసుడు 17. శుచి 18. సప్తాశ్వవాహనుడు 19. గభస్తిహస్తుడు 20. బ్రహ్మ 21. సర్వదేవుడు అనునవి సూర్యుని ఇరువది ఒక్క నామములు. ఈ పవిత్ర నామస్తుతి సూర్యునకు సదా ప్రీతిని గూర్చును.
ఇది శరీరారోగ్యము, ధనవృద్ధి, యశస్సును కూర్చును. రెండు సంధ్యలందు ఈ స్తుతి పఠించిన పాపములెల్ల పోవును. ఒకసారి జపించిన త్రికరణకృతమైన దురితము నశించును. ఒకమారీ నామములచే హోమము సంధ్యోపాసనము చేసిన అర్ఘ్యమందు బలియందు, అన్నదానమందు, స్నానమున, నమస్కారమందు, ప్రదక్షిణమందు ఈ మహామంత్రము పఠించిన సర్వపాపక్షయమగును. శుభమగును. కావున మీరీమంత్రము పఠించి వరదుడైన సూర్యదేవుని నుతింపుడు”(31)