బ్రహ్మ మహా పురాణము
శ్రాద్ధ విధి వర్ణనం
మునులు శ్రాద్ధకల్పము ఎవరెవరికెప్పుడు ఆనతిచ్చిరో సవిస్తరముగ తెల్పుడు అనగా వ్యాస భగవానుడు ఇట్లు అనియె. “బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులములవారు తమ తమకు చెప్పబడిన విధానమున మంత్రపూర్వకముగ శ్రాద్ధము అనుష్టింపవలెను. స్త్రీలు మరి శూద్రాదులు బ్రాహ్మణులు చెప్పినట్లు అగ్ని హోత్రము లేకుండ అమంత్రకముగ శ్రాద్ధము పెట్టవలెను. పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధము పెట్టవలసిన ప్రదేశములు; పుష్కరాది తీర్ధములు, పుణ్యక్షేత్రములు, పర్వతశిఖరములు, పవిత్రనదులు, నదములు, సరస్సులు, నదీ సంగమములు, సముద్రతీరములు-ఇవి ముఖ్యములు. గోమయముతో అలికిన స్వగృహము నందు దివ్య వృక్షమూలములందు యజ్ఞార్హములైన మడుగుల యందు శ్రాద్ధము పెట్టుట ప్రశస్తము. కిరాత దేశములందు కళింగము, కొంకణము, కృమి, దశార్ణవము, కుమార్య దేశములందు, తంగణమను దేశమునందు క్రథమను దేశమునందు సముద్రము యొక్క ఉత్తర తీరమునందు (సింధునదీ ఉత్తర తీరమునందు) నర్మదానదీ దక్షిణ తీరములందు కరతోయ అనునదికి తూర్పు ప్రదేశమునందును శ్రాద్ధము పెట్టరాదు. ఇదే విధముగ నిత్య శ్రాద్ధ విధానము కూడ చెప్పబడినది. ప్రతి సంవత్సరము నైమిత్తికము కామ్యము అను శ్రాద్ధములు నిత్య శ్రాద్ధముతో పాటు నిర్వర్తింపవలెను. జాతకర్మాదుల యందు వృద్ధి శ్రాద్ధము పెట్టవలెను. మంత్ర పూర్వకముగ శ్రాద్ధము పెట్టవలసిన వారు ద్విజులు అనగా (బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు) మాత్రమే. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు పదునైదు రోజులు శ్రాద్ధము పెట్టుటకు ఉత్తమములని చెప్పబడినవి.
శ్రాద్ధము పాడ్యమినాడు పెట్టిన ధనలాభము, విదియ పశుసంపద ఇచ్చును. తదియ పుత్రప్రదము. చతుర్ధి శత్రు నాశకము. పంచమి ఐశ్వర్య ప్రదము. షష్టి లోక పూజ్యుని చేయును. సప్తమి గణాధిపత్యమును కూర్చును. అష్టమి జ్ఞానప్రదము. నవమి స్త్రీ లాభము కలిగించును. దశమి సర్వాభీష్టములను చేకూర్చును. ఏకాదశి సర్వవేద సంపన్నుని చేయును. ద్వాదశీ జయకరము. త్రయోదశి సంతానాభివృద్ధి పశు సంపద మేధ స్వాతంత్ర్యము మంచి పుష్ఠిని దీర్ఘాయుర్దాయమును ఐశ్వర్యమును చేకూర్చును. ఇందు సందేహము లేదు. చతుర్దశి నాడు లభించినంత అన్నముతో శ్రద్ధతో శ్రాద్ధము పెట్టిన యెడల ఆయుధముల దెబ్బతిని చనిపోయినవారు యువకులుగ చనిపోయినవారు సంతృప్తిని పొందుదురు. అమావాస్య నాడు శ్రాద్ధము పెట్టిన, అతడు సర్వ కామములును బడసి స్వర్గము బడయును.
పితృదేవతలు సంప్రీతులు అగుటకు శ్రాద్ధములందు వినియోగింపవలసిన ద్రవ్యములను గురించి చెప్పెద విసుడు. హవిష్యాన్నముతో పితృ శ్రాద్ధము పెట్టిన ఎడల పితృ దేవతలకు నెల రోజులు తృప్తికలుగును. మత్స్య మాంసముచేత పితృ దేవతలు రెండు మాసములు తృప్తులగుదురు. లేడి మాంసము మూడు నెలలు పితృ దేవతలకు తృప్తి కలిగించును. శశ మాంసము (కుందేలు) నాలుగు మాసములు తృప్తిని కలిగించును. పక్షి మాంసము ఐదు నెలలు తృప్తినిచ్చును. శూకర మాంసము (పంది మాంసము) ఆరు మాసములు తృప్తిని ఇచ్చును. మేక మాంసము ఏడు నెలలు. ఐణేయము (నల్లని ఇఱ్ఱిది) ఎనిమిది మాసములును. రురు (దుప్పి, మాంసము తొమ్మిది నెలలు తృప్తిని కూర్చును. గోమాంసము పితృ దేవతలకు దశమాస తృప్తిని ఒసంగును. ఔరభ్రము (పొట్టేలు మాంసము) పదకొండు మాసముల తృప్తినిచ్చును. ఆవుపాలు గాని పాయసము గాని సంవత్సర తృప్తి కలిగించును. గండక పక్షి మాంసము, నెత్తురన్నము, కరివేపకూర తేనె ఎఱ్ఱమేక మాంసము అన్నము తన వంశీయులచే పెట్టబడినవి. అనంత తృప్తిని పుత్రులను కలుగజేయును.
గయా శ్రాద్ధము అనంతఫలము. బెల్లముతో కలిపి నువ్వులను శ్రాద్ధమందు ఉపయోగించిన విశేష ఫలమొసగును. తేనెకాని, తేనెతో కూడిన పదార్థముగాని పితృ దేవతలకు ఒసంగిన అక్షయఫల మొసగును. మా కులమందు పుట్టినవాడు మాకు జలాంజలులు ఒసగి (పితృ తర్పణములు చేసి) వర్ష ఋతువు నందు మాఘ ఫాల్గుణములందు తేనెతో కూడిన పాయసమును మాకు నివేదించునా అని పితృ దేవతలు ఉవ్విళ్ళూరుచుందురు. బహు పుత్ర సంతానము మాకు కావలయునని కోరుట అందరిలో ఏ ఒక్కడేని గయకు వెళ్ళునేమోఅని? గౌరీ (కన్యావివాహము చేయునా? దశ వర్ష) నీల వృషభోత్సర్జనము చేయునా? అని పితృ దేవతలు ఉబలాటపడుదురు. కృత్తికా నక్షత్రమందు శ్రాద్ధము పెట్టిన స్వర్గము నందును. రోహిణీ నక్షత్ర మందు పితృ శ్రాద్ధము సంతాన ప్రదము. సౌమ్యదేవతా (మృగశిర) నక్షత్రమునందు పెట్టిన శ్రాద్ధము మంచి తేజశ్శాలిని చేయును. అర్థా నక్షత్ర శ్రాద్ధము శౌర్యవంతునిచేయును. పునర్వసు నక్షత్రము క్షేత్ర సందర్శన భాగ్యము నొసగును. పుష్యమి అక్షయధన మొసగును. ఆశ్లేష పూర్ణాయుర్దాయము ఇచ్చును. మఘ సంతానమును, పుష్టిని కూర్చును. పూర్వ ఫల్గుణీ నక్షత్రములు సౌభాగ్య ప్రదములు. ఉత్తర ఫల్గునియందు పెట్టిన శ్రాద్ధము సంతాన మొసగును. హస్తా నక్షత్రమందు శ్రాద్ధము పెట్టిన అతడు శాస్త్ర పారంగతుడగును. చిత్రా నక్షత్రము తేజస్సును, సంతానమును ఒసంగును. స్వాతి వ్యాపారమందు లాభము గూర్చును. విశాఖ పుత్ర ప్రదము. అనూరాధా నక్షత్రమందు పితృశ్రాద్ధమొనరించిన చక్రవర్తిత్వము ఒసంగును. జ్యేష్ఠ అధిపత్య మొసంగును. మూలా నక్షత్ర మారోగ్యప్రదము. పూర్వాషాఢ యశస్కరము. ఉత్తరాషాఢ శోకమును హరించును. శ్రవణము శుభలోక ప్రదము. ధనిష్ఠ ధన సమృద్ధిదము. అభిజిత్తు వేదవేత్తను గావించును. వారుణము (శతభిషము) వైద్యసిద్ధిని ఇచ్చును. పూర్వాభాద్ర మేకలమందను, ఉత్తరాభాద్ర గోసంపద ఒసంగును. రేవతి రజత సమృద్ధిదము. అశ్విని అశ్వసంపత్తి కూర్చును. భరణీ నక్షత్ర శ్రాద్ధము దీర్ఘాయుర్భాగ్యము ఇచ్చును. కావున కామ్యములయిన శ్రాద్ధములచే గూడ పితృ దేవతా సంప్రీతి కావింపవలయును.