అన్నదాన ప్రశంస

మునులు అనిరి-

నీవు అధర్మమువలన గలుగు గతులను గూర్చి తెల్పితివి. ధర్మగతుల గూర్చి వినగోరెదము. ఏ పనిచేసి అశుభగతిని పొందునో దేనిచే శుభగతినందునో ఆనతిమ్ము అన వ్యాసుడు ఇట్లు అనెను. పాపపు పనులను ధర్మపరుడై విపరీత మనస్సుతో చేసినవాడు నరక మందును. పొరబడి అధర్మము చేసి పశ్చాత్తాపబడి మనస్సును కుదుట పరచుకొన్నవాడు పాపమును అనుభవింపడు. ఎంతెంత వరకు వాని మనస్సు దుష్కర్మమును గర్హించునో అంతంతవరకు వాని ఉపాధి (శరీరము) ఆధర్మమునుండి విడివడును. చేసిన తప్పును ధర్మవాదులగు విప్రులకు తెల్పిన ఎడల అధర్మమువలన చేసిన అపరాధము నుండి వేగముగ ముక్తుడగును. మానవుడు తాను చేసిన తప్పిదమును మనసు సమాధాన పరచుకొని నలుగురలో వెల్లడించుకొన్నకొలది అతడు దానినుండి విడివడును. పాము కుబుసమును విడిచినట్లు పూర్వము అనుభవించిన పాప ఫలముల నుండి విమోచనమందును. మనస్సమాధితో విప్రునికి వివిధ దానములు చేసిన అతడు సుగతినందును. మానవుడు పాపము ఆచరించియు తత్పలము అనుభవింపకుండుటకు చేయవలసిన దానములను తెల్పెదను వినుడు.

అన్ని దానముల కంటె అన్నదానము మిన్న, ధర్మాపేక్ష కలవాడు వక్రముగాని బుద్ధితో సర్వాన్నదానము చేయనగును. మనుజులకు ప్రాణము అన్నము గదా! అన్నము వలననే జీవుడు పుట్టును. లోకము అన్నము నందు ప్రతిష్ఠతములై ఉన్నవి. (బ్రతుకంతయు అన్నముమీద ఆధారపడి ఉన్నదన్నమాట!) అందువలన అన్నము ప్రశంసార్హ మగును. దేవర్షి పితృ మానవులు అన్నమునే మెచ్చుకొందురు. అన్నదానముచే స్వర్గమందును. ఎంతలభించునో అంత అన్నము ద్విజులకు పెట్టవలెను. నిండు మనసుతో వేదాధ్యయన సంపన్నులగు బ్రాహ్మణులకు అన్నదానము చేయవలెను. ఒక్కమారైన పది మంది బ్రాహ్మణులు ఎవ్వడు పెట్టిన అన్నము అరగింతురో మనస్ఫూర్తిగా అట్లు పెట్టిన వాడు పశుపక్ష్యాది జన్మము లెత్తడు. పదివేల మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణము గావించినాతడు మున్ను పాపరహితుడై చేసిన అధర్మము నుండి విముక్తి నందును. వేదములు చదివి భిక్షాటనము చేసికొని తెచ్చిన అన్నమును వేదవేత్తయగు విప్రునికి పెట్టిన వాడు. ఇహలోకమున సుఖాభివృద్ధినందును. క్షత్రియుడు బ్రాహ్మణ ద్రవ్యమునకు హానిచేయక న్యాయ పరిపాలన చేయుచు సుసమాహిత మనస్కుడై, వేదవిదులయిన ద్విజులకు బలాత్కారముగ లభించిన అన్నమును దానము చేసిన ఎడల ఈతడు ధర్మాత్ముడై రాజసముచే చేసిన దుష్కర్మను ఎడబాపుకొనును. కృషి (వ్యవసాయము) చేసి వైశ్యుడు ఆర్జించుకొన్న ద్రవ్యము ఆరవ వంతుగ పరిశుద్ధమైన దానిని ద్విజులకు దానముచేసిన పాపవిముక్తుడగును. శూద్రులు ద్విజాతులకు అన్నదానముచేసి పాప ముక్తుడగును. ప్రాణములిక పోవునన్న సమయమున శూద్రుడు కర్కశుడై (కఠినుడై) సంపాదించిన అన్నమును కన్న కొడుకుచేత కూడబెట్టించి అన్నము విప్రులకు పెట్టినవాడు దుర్గమున (కడవరాని కష్టముల) దాటును. న్యాయార్జితమైన అన్నమును ఆనందముతో వేదవృద్ధులైన విప్రులకు విందుచేసిన వాడు పాపమును పోగొట్టుకొనును. అన్నము లోకమందు ఊర్జస్కరము. కావున దానిని పెట్టినవాడు ఊర్జస్వి అగును. సత్పురుషులు ఏగిన దారినేగినవాడు సర్వపాపవిముక్తుడగును. దానిచే ధర్మము ఎఱింగిన వారు ఏర్పరచిన దారిని బుద్ధిమంతులు పోవుదురు. అందులోగూడ అన్నదాతలు ఉత్తములు. వారి వలననే సనాతన ధర్మము నిలుచును.

అందువలన అన్నదానము న్యాయము తప్పకుండ చేయవలసినది. ఏ గృహస్థుముందు ప్రాణాహుతులు చేసి అన్నము అరగించునో ఎవ్వడు అన్నదానముచే రోజును సార్థకమైనదానిని గావించునో, నిత్యము వేదవిదులను ధర్మవేత్తలను ఇతిహాసపురాణ విదులను నూరుమందిని విందు ఆరగింపజేయునో, అతడు ఘోరనరకము పాలుగాడు. సంసారమునంబడడు. చనిపోయియు అతడు సర్వకామ్య సాఫల్యమంది సుఖమందును. ఇట్లు సత్కర్మ సమన్వితుడై ఏ బాధలు లేకుండ ఆనందపడును. చక్కనివాడు కీర్తిశాలి ధనవంతుడునై మరుజన్మ మందును. మీకు ఇట్లు అన్నదాన మహాఫల మంతయు దెలిపితిని. సర్వధర్మములకు దానములకును మూలమిదియే” అని తెల్పెను. (218)