పురుషోత్తమ క్షేత్ర వర్ణనము

మునులు ఇట్లు అనిరి -

పురుషోత్తమమను ఆ పుణ్య వైష్ణవ క్షేత్రమును ఆ రాజు ససైన్య పరివారముగ సేవించి అందు బలరామకృష్ణులను ప్రతిష్ఠించి పూజించెనని విందుము. ఆకథ సవిస్తరముగ ఆనతిమ్మన బ్రహ్మ వారలకు ఇట్లనియె.

శ్రీదేవి అడుగగా మున్ను శ్రీహరి తెలిపిన పుణ్యకథను వినుడు. సుమేరు పర్వతము యొక్క సువర్ణ శిఖరమునందు సిద్ధ విద్యాధర కిన్నరులు, సంచరించుచోట, వాలఖిల్యాది మహర్షులు విహరించు చక్కని ప్రదేశమందు నానా తరులతా కుసుమ ఫలభరితమైన చోట, కోకిలలు, చిలుకలు, నెమళ్ళు మనోహరముగ కూయు తావున దేవతలు కొలువున్న వాసుదేవుని జగన్నాధుని సమీపించి శిరసువంచి నమస్కరించి శ్రీదేవి సర్వలోక హితము గోరి ఇట్లని ప్రశ్నించెను.

సర్వేశ్వరా! నా సంశయము వారింపుము. మర్త్యలోకమున మిక్కిలి ఆశ్చర్యము కొలుపునది కర్మ భూమి అగు భారతదేశము అచట జన్మ అంత సులభముగాదు. లోభ మోహాదులు అను మొసళ్ళు సంచరించుచు, కామక్రోధములు అను మహాసముద్రమునందు జనన మరణాదుల నుండి తరించుటకు అనువైన ఉపాయము తెలుపుము. నీ కన్న ఈ సంశయమును వారింపగలవక్తలేడు. మాయెడల దయగొని తెలుపతలపు గలదేని అనుగ్రహింపుము.

అనగా బ్రహ్మ ఇట్లు అనియె- శ్రీదేవి పలుకులు విని దేవదేవుడు పరమ ప్రీతితో అమృతోపమానము సర్వవేద శాస్త్రసారము అయిన విషయమును ఇట్లుపన్యసించెను.

“సుఖముగను, సులభముగను ఉపాసించి సాధింపదగిన మహాఫలమును ఒసంగు దివ్య క్షేత్రమొకటి పురుషోత్తమమను పేర ప్రసిద్ధమై ఉన్నది. అది కీర్తన, స్మరణ, వందనాదులచే సర్వ పాపముక్తిని ఈయగలది. సురాసురులు మరీచ్యాది మునివరులు కూడ దానిని ఎఱుగరు. అట్టి తీర్థరాజమును గూర్చి నీకు తెలుపుచున్నాను. సుందరీ! ఏకాగ్రచిత్తవై వినుము. కల్పాంత ప్రళయమందు, స్థావర జంగమాత్మకమైన జగమెల్లలయ మందెను. అంధకార బంధురమయ్యెను. ఆ పెంజీకటికి అవ్వల ఉన్నవాడు మేలుకొన్నవాడు ఒక్కడే పరమాత్మ. ఆయనయే సర్వభూత స్వరూపుడు. త్రిమూర్తులకు కర్త. వాసుదేవుడను వాడు యోగీశ్వరుడు. ఆయన యోగనిద్రనుండి మేల్కొని తన నాభికమలము నుండి కమలదళ కాంతి సంపన్నమగు బ్రహ్మ అనెడి ఒక మూర్తిని పంచతన్మాత్రలకు కారణములైన ఆకాశము, వాయువు, తేజస్సు, ఉదకము, భూమి అనెడి స్థూలసూక్ష్మములైన పంచభూతములను సృజించెను. బ్రహ్మ క్షత్ర-వైశ్య-శూద్రులను నాలుగు వర్ణములను, అంత్యజులను, మ్లేచ్ఛులను వేర్వేర సృజించెను. ఆ మీద ఆ ప్రజాపతి మనసును ఆత్మవంకకు మరల్చి సంకల్పించి మరీచ్యాది మునులను సర్వదేవతలను, పితృదేవతలను, యజ్ఞములను, విద్యాధరులను, గంగాదినదులను, నరవానరసింహ శార్దూలాదిమృగములను, జరాయుజ-అండజ-శ్వేదజ ఉద్భిజ్జములను నాలుగు విధములైన చరాచర భూత జాలమును సృజించెను. పిపీలికాది జీవకోటి ఆయన సృజించినదే. ఆ సృష్టికర్త తన కుడి భాగమందు తననే పురుష రూపముగా భావించి, ఎడమ భాగమున స్త్రీని భావించి స్త్రీ-పుంస రూపమున ద్విధా భావము నందెను. మానసిక సృష్టి ఇట్లు జరిగిన తరువాత స్త్రీ పుంసాత్మక మిథునము నుండి సృష్టి ఆవిర్భవించెను. అటనుండియే మైధున సంభవమైన సృష్టి ఆరంభమైనది. ఉత్తమ, మధ్యమ అధమ భేదమున తయారయిన ఈ ఉపాధులు అన్నియు నాయొక్క క్షేత్రములు. ఇట్లు చతుర్ముఖ బ్రహ్మ సృష్టి యొనరించి, ఇంచుక ఆలోచించి, ధ్యాననిష్ఠుడై వాసుదేవ తత్త్వమందు వాసుదేవాత్మకమైన మూర్తిని ధరించెను. ధ్యానమాత్రముచే ఆ జనార్దనుడు తానే ఆ క్షణమున సహస్రాక్షుడు, సహస్రపాదుడు, సహస్రశీర్షుడునైన పురుషుడై ఆవిర్భవించెను. తెల్లతామరపూల వంటి నేత్రములు సజల జలదచ్ఛాయమైన శరీరము, శ్రీవత్సచిహ్నము, మొదలైన లక్షణములతో ఒక ప్రాకృత మంగళ స్వరూపమున సాక్షాత్కరించెను. లోక పితామహుడగు బ్రహ్మ హఠాత్తుగా ఆమూర్తిని దర్శించి ఆసన అర్ఘ్య పాద్య సమర్పణముచేసి అక్షతల పూజించి అభివాదనము చేసి పరమ మంగళ స్తుతులచే స్తుతించెను. విరించి మనస్సును ఒదిగించి చేసిన ఆ స్ర్తోత్రమును విని తండ్రీ ఇపుడు నన్ను ధ్యానించుటకు కారణమేమని ప్రశ్నించితిని.

బ్రహ్మ ఇట్లు అనియె –

దేవేశ! స్వర్గ ద్వారమునకు దారులు, యజ్ఞదాన వ్రతములు. యోగము, సత్యము, శ్రద్ధ వివిధ తీర్థములు తెలుపబడినవి. ఆ అనుష్ఠానము దుర్లభము. వానినన్నిటిని మించిన సులభ సాధనము లోకహితము కొఱకు తెల్పుము. ఓ వాసుదేవ! పరమోత్తమ మయిన పుణ్య స్థానమును ఆనతిమ్ము అన విధాత పలుకులు విని, ఆతనికి ఇట్లు చెప్పితిని.

సంసారతారకము సర్వోత్తమ క్షేత్రము, చాతుర్వర్ణ సుఖసాధనము. భుక్తిముక్తి ప్రదము. శీఘ్రసిద్ధిదము, చతుర్యుగములందును సుస్థిరమై సేవింపదగినది. సర్వదేవ దానవ యోనులకును సుసేవ్యమై ఉన్న తీర్థరాజము పురుషోత్తమునికి ఆవాసమైన ‘పురుషోత్తమము’ అనుక్షేత్రము గలదు. అది దక్షిణ సముద్రతీరమందున్నది. పది యోజనముల వైశాల్యము గలది. అచ్చట ఒక మఱ్ఱివృక్షము గలదు. కల్పాంతమందు కాలాగ్ని విజృంభించినపుడు కూడ అది నశింపదు. నేను స్వయముగా అచటనే ఉన్నాను. ఆ వటవృక్షమును దర్శించి, ఆ వృక్షము క్రిందినీడలో విశ్రమించిన వాడు బ్రహ్మహత్యా పాపమునుండి విడివడును. తక్కిన మహాపాపముమాట చెప్పనేల! దానికి ప్రదక్షిణ నమస్కారములు చేసినవారు విష్ణు లోకమునకు ఏగుదురు. ఆ మర్రికి కొద్ది దూరమున దక్షిణమున కేశవుని ఆలయమున్నది. అది ధర్మమయము. భగవంతుడు తానే నిర్మించుకొన్న ప్రతిమ (విగ్రహం) గలదు. దానిని దర్శించినవారు అనాయాసముగ వైకుంఠమునకు ఏగుదురు. అట్లు ఏగుచున్న జీవులను చూచి యమధర్మరాజు నాకడకు ఏతెంచి శిరసు వంచి మ్రొక్కి ఇట్లనియె.

జగన్నాథస్వామీ! నీకు నమస్కారము. శ్రీవత్సవక్షస్థల, పద్మమాలాభూషిత, పీతాంబరధారీ, శంఖచక్ర గదాధరా! హారకేయూర భూషితా! కిరీటగద ధారియునై సాక్షాత్కరించు జగద్గురువగు సగుణమూర్తి నీకు వందనము. ప్రకృతికి అవల సర్వేంద్రియ రహితుడై కేవల జ్ఞానజ్యోతియై, సర్వసాక్షియై, నిర్విశేష సుఖానుభవము, జ్ఞానము సర్వరూపముగా కల్గియున్న కేవలాత్మవైన నీకు నమస్కరించుచున్నాను. అనవిని పరమాత్మ నన్ను నీవిపుడు ఎందులకు స్తుతించితివో క్లుప్తముగ ఆనతిమ్ము అని పురుషోత్తముడనెను.

స్వామీ! పురుషోత్తమము అను ఈ పుణ్యాలయమున ఇంద్రనీలమణిమయమైన ఈ ప్రతిమ సర్వాభీష్టములను తీర్చునది. దానిని శ్రద్ధతో దర్శించి ఏకాగ్రచిత్తమున సేవించి మానవులు నిష్కాములై శ్వేతభవనమునకు వెళ్ళుదురు. కావున పాపులన్నవారు లేరు. పాపులను దండించు అధికారము నాకున్నను దాని అవసరము లేనందున నా పదవికి గౌరవము పోయి నది. కావున నీ ప్రతిమను ఉపసంహరింపుమనెను. అది విని ఇసుకలో దాచెదను అంటిని. అన్నట్లు నేను దాచితిని. బంగారు తీగల పొదరింట దాచి యముని దక్షిణదిశకు పంపితిని అని చెప్పెను. అందుకు బ్రహ్మ ఇట్లు అనియె-ఇంద్రనీల ప్రతిమ అట్లు మరుగుపడిన మీదట జరిగిన కథను విష్ణువు లక్ష్మికి చెప్పెను. (45)