బ్రహ్మ మహా పురాణము
సోమ వంశ వర్ణనము
సూతుడు ఇట్లనియె-
ఓ మునిశ్రేష్ఠులారా! బుధుని కుమారుడు పురూరవుడు. విద్వాంసుడు, తేజశ్శాలి, దాత. విపుల దక్షిణలు ఇచ్చిన యజ్వ. బ్రహ్మవాది. యుద్ధమునందు శత్రువులకు అందనివాడు. నిత్యాగ్నిహోత్రి, యజ్ఞకర్త. మహీపతి, సత్యవాది, పుణ్యమతి, నిగూఢ మైధనుడు, ముల్లోకములందు అనుపమ కీర్తిశాలి. అట్టి వానిని బ్రహ్మవాదిని (వేదాధ్యయనరతుని) శాంతుని ధర్మజ్ఞుని సత్యవచనుని యశస్విని యగు ఊర్వశి అభిమానము (గుట్టు) విడిచి వరించెను.
బ్రాహ్మణులారా! ఆ రాజు ఊర్వశితో గూడి చైత్ర రథమను సుందర వనమందు పది సంవత్సరములు, మందాకినీ నదీ తీరమున ఐదు సంవత్సరములు, అలకాపురమందు ఆరు సంవత్సరములు, బదరీ పురమునందు అయిదు సంవత్సరములు, నందనవనము నందు ఏడుసంవత్సరములు, మనోహర ఫలవృక్షములతో గూడిన ఉత్తరకురు దేశమునందు ఎనిమిది సంవత్సరములు, గంధమాదన పర్వతముపై పది సంవత్సరములు సుమేరు పర్వత ఉత్తర భాగమున ఎనిమిది సంవత్సరములు నివసించెను. ఈ ప్రధాన వనములందును, దేవతల క్రీడాస్థానములందును, ఊర్వశితోగూడ ఆ రాజు పరమ హర్షమున క్రీడించెను. ఇలా పుత్రుడగు పురూరవుడు పవిత్రతమము మహర్షులచే స్తుతింపబడి నదియు అగు ప్రయాగ క్షేత్రమునందు రాజ్యము ఏలుచు మహా ప్రభావశాలియగు నరశ్రేష్టుడై ఒప్పెను అని చెప్పి సూతుడు ఇంకను ఇట్లు అనెను-
ఆ ఇలుని (పురూరవుని) కుమారులు ఏడుగురు. దేవ కుమారోపములు. గంధర్వలోక ప్రసిద్ధులు. ఆయువు, ధీమంతుడగు అమావసువు, ధర్మాత్ముడగు విశ్వాయువు, శ్రుతాయువు, దృఢాయువు, వనాయువు, బహ్వాయువు అను వారు ఊర్వశికి జన్మించినారు.
అమావసు పుత్రుడు రాజరాజగు భీముడు. వాని కొడుకు శ్రీమంతుడగు కాంచన ప్రభ నామధేయుడు. వాని తనయుడగు సుహోత్రుడు బలశాలి. విద్వాంసుడు. వాని తనయుడు. జహ్నువు కేశిని కుమారుడు.
అతడు సర్పమేధము అను మహాయాగమును ఆచరించెను. గంగ పతిలోభముచే అతని పతిగ వరించి అభిసరించెను. అతని అంగీకారము లభింపగా యజ్ఞ సదస్సును ముంచెతెను. యజ్ఞవాటమును అట్లు ముంచుట చూచి సుహోత్రుని కుమారుడు ఆ జహ్నువు క్రుద్ధుడై ‘ఈ నీ ప్రయత్నమును విఫలము ఒనరించునట్లు ఇదిగో ఈ నీటిని త్రాగెదను. నీ గర్వమునకు ఫలమిపుడే అనుభవింపుమని శపించి గంగను అంతను త్రాగివైచెను. ఆ వింతను చూచి, మహర్షులు ఆతనికి అభ్రాపగ(అనగా గంగను)ను కన్న కూతురు గావించిరి. దాని వలన ఆమె జాహ్నవి అయ్యెను.
యువనాశ్వుని పుత్రియగు కావేరిని జహ్ను మహర్షి పరిణయమాడెను. యవనాశ్వుడు ఇచ్చిన శాపముచే గంగలో నర్ధాంశమయి ఏతెంచి జహ్ను భార్య, సరిద్వర (నదులలో శ్రేష్ఠురాలైనది) అగు కావేరిలో కలసెను. జహ్నుడు ధర్మపరుడయిన సునద్యుడు అను కుమారుని కావేరియందు బడసెను. వాని కుమారుడు అజకుడు. వాని బిడ్డడు బలాకాశ్వుడను రాజు. మృగయాభిరక్తుడగు కుశుడు వాని కొడుకు. వాని కుమారులు దేవ వర్చస్కులు నల్వురు. 1. కుశికుడు; 2. కుశనాభుడు; 3. కుశాంబుడు, 4. మూర్తిమంతుడను వారు. పల్లవులతో నిరంతరము పెంపు వడసి, వనచరుడై కుశికుడు ఇంద్రతుల్యుడైన కుమారుని కోరి తపమొనరించెను. అతనికి బెదరి వేయేండ్లు ముగియగా ఉగ్రతపమ్మున ఉన్న ఆ రాజును చూచి పుత్రుని ప్రసాదించుటకు సమర్థుడైనను తానే అతనికి పుత్రుడు అయెను. కుశికు పుత్రుడగు ఇంద్రుడే గాధి అను రాజయ్యెను.
కుశికుని భార్యయగు పౌరయందు గాధిపుట్టెను. గాధి కుమార్తె సత్యవతి. మహానుభావురాలు. గాధి రాజామెను వక్రుని పుత్రుడగు ఋచీకునికి ఇచ్చెను. ఆమె యెడగల ప్రీతిచే భార్గవుడు (ఋచీకుడు) గాధికి (మామగారికి) కుమారుడు కలుగవలెనని యజ్ఞమున చరువును సాధించి ఇచ్చెను. ఋచీకుడు తన భార్య సత్యవతిని పిల్చి ఈ చరువును నీవును, మీ అమ్మాయి స్వీకరింపుడు. ఆమె యందు దీప్తిగల క్షత్రియోత్తముడు ఉదయించగలడు. క్షత్రియుల కతడు అజేయుడు. అతడు క్షత్రియాంతకుడును కాగలడు. కల్యాణీ! నీవీ రెండవ చరువు సేవించినంతట ధృతిమంతుడు తపోధనుడు శాంతుడైన ద్విజశ్రేష్ఠుడు ఉదయించును అని పలికి తపోనిరతుడై అరణ్యమున ప్రవేశించెను.
గాధియు భార్యతో అప్పుడు ఋచీకుని ఆశ్రమమున కేగెను. తీర్థ యాత్రా ప్రసంగమున కూతురిని చూచుటకు ఆ రాజు జామాతృ (మామాగారి) స్వగృహమున కేతెంచెను. సత్యవతి యారెండు చరువులను గైకొని తల్లికి నివేదించెను ఆ తల్లి దైవవశమున తాను గైకొనవలసిన చరువును కూతురునకిచ్చి, అమెకీయదగిన దానిని తాను గైకొనెను. అటుపై సత్యవతి సర్వక్షత్రియాంతక తేజముం గర్భమున దాల్చిన కతన ఘోరమైన ఆకారముతో కనిపింపసాగెను. ద్విజశ్రేష్ఠుడైన ఋచీకుడా ఇంతింగని యోగదృష్టిచే గ్రహించి భార్యతో కల్యాణి! చరువ్యత్యాసముచే మీ అమ్మచే నీవు వంచింపబడితివి. నీకు క్రూరవర్తనుడు అతిదారుణుడు అగు తనయుడు ఉదయించును. వానికి భ్రాత బ్రహ్మణ్యుడు, తపోధనుడు కల్గును. తపస్సుచే నేనీ సమస్త బ్రహ్మమును వాని యందు అర్పించితిని అని చెప్పగావిని సత్యవతి నీవలన నాకిట్టి క్రూర కర్ముడు బ్రాహ్మణావసదుడు కొడుకు వద్దు అనిన ఋచీకముని ఆమెతో
“కల్యాణి! నేనిట్లు కావలయునని సంకల్పింపలేదు. పితృ మాతృ భూమి నిమిత్తమునఁ తనయుడు ఉగ్రమూర్తి కాగలడు అని అనెను. అది విని మరల సత్యవతి ఇట్లనియె. నీవు తలచుకొనిన లోకములను సృజింపగలవాడవు. కొడుకును ఇచ్చు మాట లెక్కేమి శమాత్మకుని ఋజుస్వభావుని పుత్రుని నాకు అనుగ్రహింపుము. ఇది వేరొక విధముగ జేయవీలు పడని ఎడల మనకు ఉదయింపగల మనుమడు మీరన్నట్లు క్రూరమూర్తి అయగునట్లు అనుగ్రహింపుడని భర్తను వేడుకొనెను. అదివిని ఆ మహాముని తపోబలమున అట్లు అగుగాక అని అనుగ్రహము చేసెను. మరియు సుందరి! పుత్రునందును పౌత్రునందును నాకు భేదములేదు. నీవెట్ల అనిన అట్లేయగుట నా అభిమతమని ఆమెను ఆ తపస్వి లాలించెను. అటుతరువాత సత్యవతి భార్గవుడను కుమారుని కనెను. అతడే తపోనిరతుడు, అతిదాంతుడు, శాంతుడు అగు జమదగ్ని ఈ భృగు వంశమందు అవతరించెను. పుణ్యురాలు సత్యవతి సత్యధర్మ పరాయణ కౌశికియను పేర మహానదియై ప్రవర్తిల్లెను.
ఇక్ష్వాకు వంశజుడు రేణువను రాజుకూతురు కామలి అనుపేరుగలది (రేణుక) మహానుభావురాలు. ఆమె యందు తపో విద్యాసమన్వితుడు ఆర్చీకుడు (జమదగ్ని) భయంకరుడైన జమదగ్నుని (పరశురాముని) కనెను. అతడు సర్వ విద్యాపారంగతుడు ధనుర్వేద విశారదుడు. క్షత్రియాంతకుడు ప్రజ్వలితాగ్ని ఒలె ఉండెను. పరశురాముడా జమదగ్ని తపోవీర్యమున జన్మించెను. మధ్యముడు శునశ్శేపుడు, కనిష్ఠుడు శునఃపుచ్ఛుడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి సముడై బ్రహ్మయు అయ్యెను. విశ్వరథుడనియు ఆయనకుపేరు. విశ్వామిత్రుని కుమారులు దేవరాతుడు మొదలయినవారు. విఖ్యాతులు. దేవరాతుడు, కలి అయన సంతతి వారు కాత్యాయనులు. శాలావతి యందు హిరణ్యాక్షుడు రేణువు. రేణుకుడు సాంకృతి గాలవుడు ముద్గలుడు. మధుచ్ఛందుడు జయుడు, దేవలుడు, కచ్ఛపుడు, హారితుడు అనువారు జనించిరి. కౌశికుల గోత్రములు ప్రఖ్యాతి చెందియున్నవి. పాణినులు, బభ్రవులు, ధాన్యజప్యులు, దేవరాతులు, శాలంకాయనులు, బాష్కలులు, లోహితులు, యమదూతలు, కారూషకులు అనువారు కౌశికులు, పౌరవుడను బ్రహ్మర్షి యొక్కయు కౌశికుని యొక్కయు వంశమందు బ్రహ్మ క్షత్ర సంబంధము ప్రసిద్ధమయ్యెను. విశ్వామిత్రుని కొడుకులలో శునఃశ్శేపుడు పెద్దవాడు. భార్గవుడు కౌశికత్వమును బడసినవాడు. శునఃశ్శేపుడు హరిదశ్వుని యజ్ఞమందు పశువుగా నియుక్తుడయ్యెను. దేవతలు అతనిని తిరిగి విశ్వామిత్రునకు క్షేమముగా ఇచ్చిరి. దేవతలచే ఈయబడిన వాడగుటచే దేవరాతుడనియు పేరొందె. దేవరాతాదులు ఏడ్వురు విశ్వామిత్రుని కుమారులు. దృషద్వతి సుతుడును అష్టకుడును వైశ్వామిత్రుడే. అష్టక కుమారుడు లౌహి. జహ్నుముని గణము. నాచే చెప్పబడినది. ఇటుపైని అయువుయొక్క వంశమును తెల్పెదను. శ్రద్ధగా అలకింపుడు. (10)