బ్రహ్మ మహా పురాణము
సూర్యవంశ నిరూపణము
మన్వంతర వృత్తాంతములను మునులకు తెలుపుచు ఇంకను లోమహర్షణుడు ఇట్లు పలికెను ......
వైవస్వత మనువునకు తొమ్మండ్రు కుమారులు గల్గిరి. వారు తండ్రి అంతవారు. వారు ఇక్ష్వాకుడు, నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు, రిష్టుడు, కరూశుడు, పృషధృడు అనువారు. వారు కల్గకముందు మనువు మిత్రావరుణులను ఉద్దేశించి పుత్రకామేష్టిని చేసెను. అందు అతడు మిత్రావరుణుల ఎంచి ఆహతులిచ్చెను. అక్కడ దివ్యాంబర ఆభరణములు దాల్చి దివ్య శరీరముతో ఇల అను అంగన ఆవిర్భవించెనని వినికిడి. మనువు దండధరుడై ఆమెను ‘ఇలా, ఇలా’ అని పేర్కొని ఓ కల్యాణి! నావెంట రమ్మని పిలిచెను. పుత్రకామియైన ఆ ప్రజాపతిని చూచి ఆమె ధర్మయుక్తముగ ఇట్లు పల్కెను.
నేను మిత్రావరుణుల అంశమున పుట్టిన దానను. వారి సన్నిధికేగెదను. నన్ను ధర్మదూరురాలిని కావింపకుమని పలికి వారికడకు ఏగి ప్రాంజలియై ఇట్లనెను.
“ఓ మిత్రావరుణ దేవతలార! మీ అంశముచే జనించినదానను. మీకేమి చేయుదును. మనువు తనను అనువర్తింపుమన్నాడని” ఇల పలికినంత వారు ధర్మపరాయణయగు ఆ సాధ్వితో ఇట్లు పలికిరి.
మానిని! నీ ధర్మము, వినయము, ఇంద్రియ నిగ్రహము, సత్యము అనువానికి ప్రీతులమైతిమి. ఓ సుందరి! మహానుభావయగు నీవు మా కన్యవుగా ఖ్యాతినందుదువు. మనువునకు వంశకరుండగు కుమారుడవు గూడ నీవే అయ్యెదవు. జగత్ర్పియుడవు ధర్మ శీలుడవు. మను వంశవర్ధనుడవు అయ్యెదవు. సుద్యుమ్నుడను పేర ముల్లోకములందు ప్రసిద్ధుడవు అయ్యెదవు. అంత ఆమె వారిమాటలు విని వెనుదిరిగిపోవుచు దారిలో బుధునిచే కామింపబడి సంగమమువడసి సోమపుత్రుడగు అతని వలన పురూరవుడను కొడుకును కనియెను. అటు తరువాత ఆమె సుద్యుమ్నుడను పేర మగవాడయ్యెను. సుద్యుమ్నుని దాయాదులు పరమ ధార్మికులు ముగ్గురు.
వారు ఉత్కలుడు, గయుడు, వినతాశ్వుడు అనువారు. ఉత్కలుని భార్య ఉత్కల. వినతాశ్వుని వల్లభ పశ్చిమదిక్కు గయుని భార్య ప్రాగ్దిక్కు గయ అను పేర్లను పొందినది. మనువు సూర్యుని యందు జొచ్చినంతట ఈతని దాయాదులు క్షత్రజాతివారీ పృథివిని పదిభాగములు ఒనరించిరి. జ్యేష్ఠుడు ‘ఇక్ష్వాకుడు మధ్యదేశమునుఁ బడసెను. సుద్యుమ్నుడు మున్ను కన్యయై యున్నందున రాజ్యభాగములేని వాడయ్యెను. వశిష్ఠవచనముచే ప్రతిష్ఠానము నందు ధార్మికుడైన సుద్యుమ్నునికి ప్రతిష్ఠ (ఉనికి) లభించెను. దాని నతడు పురూరవునకు ఒసంగెను. సుద్యుమ్నుడు మనువు కుమారుడైనను, స్త్రీ పుంస లక్షణములు గలవాడై (ఇల-సుద్యుమ్నుడు అని పిలువబడుచు) పృథివిని ధరించెను.
నాభాగుని కొడుకులు నరిష్యంతులు శకులు అనువారు. అతనికి అంబరీషుడును పుత్రుడై జనించెను. ధృష్టునికి రణదృప్తమయిన క్షత్రజాతి ధార్ష్టికమను పేర ఉదయించినది. కరూశునికి కారూశులు కల్గిరి. వారును యుద్ధమునందు ఉద్ధతులు. నాభాగ ధృష్ట సంతాన క్షత్రియులు వైశ్యత్వమునందిరి. ప్రాంశువునకు ప్రజాపతి అను కుమారుడు గల్గెను. నరిష్యంతుని దాయాది దంతధరుడు. శర్యాతికి ఆనర్తుడను కుమారుడు సుకన్యయను కన్యయు ఇద్దరు జన్మించిరి. సుకన్య చ్యవనమహర్షికి ఇల్లాలు అయ్యెను. అనర్తుని దేశము ఆనర్తము. అతని రాజధాని కుశస్థలి. ఆనర్తుని దాయాది రైవుడు అను అతడు మహా తేజస్వి. రైవుని పెద్దకొడుకు (రైవతుడు) కకుద్మియను పేరుగలవాడు ధార్మికుడు. కుశస్థలి రాజధానిగా రాజ్యమేలినవాడు. తన కన్యకతో నేగి బ్రహ్మసన్నిధి ఒక్క ముహూర్తకాలము ఉండి గాంధర్వమును (సంగీతమును) విన్నవాడు. ఆ ముహూర్తకాలము పుడమిపై పెక్కు యుగమ్ములయ్యెను. అతడు తన రాజధానికిఁ దిరిగివచ్చెను. అప్పుడా నగరమును యాదవు లావరించియుండిరి. పెక్కుద్వారములు గలదియై అప్పుడది ద్వారక అను పేర మనోహర మయ్యెను. అది భోజవృష్ణ్యంధక కులములవారగు వసుదేవాదుల పాలనమందుండెను. రైవతుడు అది తెలిసికొని బలదేవునకు తన కన్యను (రేవతిని) సుభద్రయను పేరుగలదానిని ఒసంగెను. ఆ మీద మేరు శిఖరమునకు వెళ్ళి తపస్సునందు ఉండెను. ధర్మాత్ముడగు బలరాముడును రేవతీదేవితో సుఖముగ విలసించెను.
ఆ వృత్తాంతమును సాకల్యముగా విన్న మునులు ఇట్లు అడిగిరి -
అప్పటికి అనేక యుగములు గడచెను గదా రేవతికి కకుద్మికి (రేవతుని కుమారునికి) ముదిమి రాలేదేమి? మేరువునకు ఏగిన శర్యాతికిని గల్గిన సంతతి ఇప్పటికిని పృథివి యందు ఎట్లున్నది. ఈ విషయము స్పష్టముగ వినగోరుచున్నాము అన్న వారి ప్రశ్నకు లోమహర్షుడు.
అనఘులార! బ్రహ్మలోకమున ముదిమి ఉండదు. ఆకలిదప్పికలుండవు మృత్యువు ఉండదు. ఋతుచక్రము తిఱుగదు. స్వర్లోకమేగిన రేవత కుమారుడగు కక్కుద్మియొక్క రాజధాని కుశస్థలి రాక్షసులచే హరింపఁబడెను. ఆతనికి సోదరులు నూరుగురుండిరి. కాని వారు రక్షోగణము బారిబడి చావుతప్పి నలుదిసలకు పారిపోయిరి. వారి వంశ మందందు చెల్లాచెదరైనది. వారి పరంపరవారు శర్వాతులను పేరందిరి. గుణవంతులయిన ఆ క్షత్రియులు సర్వ దిక్కులంటిపోయి గహనముల జొచ్చిరి. నాభగుని యొక్కయు, నరిష్టుని యొక్కయు కొడుకులు ఇర్వురు వైశ్యులు బ్రాహ్మణత్వమును బడసిరి. కరూశుని సంతతి కారూశులు. వృషదుడను వాడు గురు ధేనువును హింసించి, గురు శాపముచే శూద్రత్వ మందెను. ఇది ఆ తొమ్మిది మంది చరిత్ర,
వైవస్వతమనువు మునియే. అతడు తుమ్మగా అందుండి ఇక్ష్వాకువు పుట్టెను. అతనికి నూర్గురు పుత్రులు పుట్టిరి. వారు భూరిదక్షిణలు ఇచ్చి యజ్ఞములు గావించినవారు. వారిలో వికుక్షి పెద్దవాడు. కుక్షిలేని వాడగుటచే అయోధ్యత్వమును పొందెను. (విరోధి ఎవ్వడు యుద్ధము చేయుటకు అశక్యముగాని వాడయ్యెను) అందుచేతనే అతని రాజధాని అయోధ్య అనబడెను. ఆయన పుత్రులు శకుని మొదలయిన వారయిదువందల మంది ఉత్తరాపథము ఏలువారైరి. మహాబలశాలురు. ఏబది ఎనిమిది మంది దక్షిణ దిశను పాలించిరి. ఇక్ష్వాకువు వికుక్షిని, అష్టకా శ్రాద్ధమందు మాంసము తెమ్మని పంపెను. శ్రాద్ధ నిమిత్తము గనుక శశమును (కుందేటి జాతి) చంపి అతడామాంసమును తానే తిని శశాదుడను పేరంది, వశిష్ఠుని మాటనుబట్టి ఇక్ష్వాకుచే పరిత్యక్తుడై వేటకు పోయెను.
ఇక్ష్వాకువు ఉండగనే శశాదుడు రాజయ్యెను. శశాదుని దాయాదుడే కకుత్థ్సుడు. మంచి బలశాలి. ఆయన కొడుకు అనేనుడు (ఏనస్సు పాపము అదిలేని వాడు అనేనస్సు) అతని కొడుకు పృథుడు. వానికి విష్టరాశ్వుడు. వానికి యవనాశ్వుడు, వానికి శ్రావుడు అనువారు కల్గిరి. శ్రావస్తకుడు శ్రావుని కుమారుడు. శ్రావస్తి నగర నిర్మాత. వాని కొడుకు బృహదశ్వుడు వాని సుతుడు కువలాశ్వుడు. పరమ ధర్మమూర్తి, ధుంధువను వానిని సంహరించి ధుంధుమారుడని పిలువబడెను.
తిరిగి మునులు ఇట్లు ప్రశ్నించిరి. “ఓ సూత! ఎవనిని వధించి కువలాశ్వుడు ధుంధుమారు అయ్యెనో ఆ ధుంధు వధను గూర్చి వినగోరుచున్నాము”
వారి ప్రశ్నకు సూతుడు ఇట్లు చెప్పదొడగెను -
కువలాశ్వునికి నూరుగురు కొడుకులు. ఉత్తమ ధానుష్కులు. అందరు విద్వాంసులు. అజేయులు ధార్మికులు. ఎల్లరు భూరిదక్షిణులయిన యజ్వలు. బృహదశ్వుడు, కువలాశ్వుని రాజ్యమందుంచి వనమునకు ప్రస్థానము చేయబోగా, అతనిని ఉత్తంక మహర్షి పోవలదని వారించగా ఉత్తంకుడు
నీవు రక్షణ చేయవలసినవాడవు, అందులకు అర్హుడవు. నేను ఆందోళనములేకుండ తపస్సుఁజేయుటకు చాలను. నా ఆశ్రమ సమీపమున చదునైన మరుధన్వములనెడి ప్రదేశములందు సముద్రుడు వాలుకాపూర్ణుడై (ఇసుకమేటలు వేసినది) ఉద్దాకుడని పిలువబడును. ఆ సముద్రమందు దేవతలకేని అవధ్యుడు మహాకాయుడు బలశాలి. ఇసుకలోనే శయనించియుండు మధుపుత్రుడగు ధుంధుడను మహాసురుడు, లోకనాశనమునకు దారుణ తపమొనరించుచుండును. సంవత్సరము చివర వాడొకసారి నిట్టూర్పు పుచ్చును. అప్పుడు భూకంపము వచ్చును. వాని నిఃశ్వాస వాయువుచే ఇసుకలేచి ఏడురోజులు ఆదిత్య మండలముదాక కప్పివైచును. మిణుగురులతో, నిప్పులతో, పొగతో అది అతి దారుణముగ నుండును. నేను అచట తపమొనరింప నిలువలేకుంటిని, లోక క్షేమమునకు నీవు వానిని సంహరింపుము. తన్మారణ మొనరింప లోకములు స్వస్థలములగును. నీవొక్కడవే వానిని సంహరింప సమర్థుడవు. వానిని జంపినవానికి వరములిచ్చి వాని ప్రతాప ఖ్యాతిగావింపుము అని విష్ణువు నాకు వరమిచ్చెను. వాడు మహాతేజస్వి. అల్ప తేజస్వి చేత మడియడు అనగా ఆ ఉత్తంకుని పలుకులు విని తనసుతుని కువలాశ్వుని జూపి స్వామి! నేనస్త్ర త్యాగము చేసితిని. ఈతడు ధుంధువధ యొనరింపఁజాలునని చెప్పి తాను తీవ్ర తపోనిష్ఠకై పర్వతమున కేగెను.
ఇంకను లోమహర్షణుడు ఇట్లనియె -
ఓ బ్రాహ్మణులారా! కువలాశ్వుడు నూర్గురు కొడుకులతో ధుంధుని పైకి దండెత్తెను. ఉత్తంకుడు అతని వెంటనుండెను. అప్పుడు విష్ణుభగవానుడు అతని ఆవేశించెను. అతడు దండెత్తిపోవు సమయమునందు ‘ఇతడు శ్రీమంతుడు, అవధ్యుడు, తప్పక ధుంధువును చంపగలడ’ను శబ్దము ఆకాశమున వినబడెను. అతనిని దేవతలు దివ్య గంధ మాల్యములచే ముంచెత్తిరి. దేవ దుందుభులు మ్రోగెను. అతడు సుతులతో పోయి సముద్రమును మూలమట్టుగ త్రవ్వించెను. పడమటి దిశ ఆ రాక్షసుడు బయలువడి వారిని ఎదిరించెను. వాని ముఖాగ్ని పెనుగాలితో రేగి లోకముల దహించి నట్లయ్యెను. వెల్లువలై నీరు ఉబికెను. మువ్వురు తప్ప తక్కిన వారెల్లరు దగ్ధులయిరి. అటుతరువాత రాజు వానిని పైకెత్తెను. యోగి కావున, యోగబలమున జలమునించి అగ్నిని శమింపజేసెను. ఉదక రాక్షసుడగు వానిని చంపి, యుత్తంకునికి చూపెను. అక్షయ ధనము, అరి విజయము, ధర్మమందాసక్తి, అక్షయ స్వర్గ వాసము అను వరములు ఉత్తంకుడు ఆ ఱేనికి ఇచ్చెను. రాక్షసునిచే కూలిన కుమారులకు అక్షయలోకములు కలుగునట్లును వరమిచ్చెను.
వానికి మిగిలిన కుమారులు ముగ్గురు. పెద్దవాడు దృఢాశ్వుడు చంద్రాశ్వ-కపిలాశ్వులు తరువాతివారు. ధుంధుమార కుమారుడైన దృఢాశ్వునికి హర్యశ్వుడు అనువాడు కలిగెను. వానికి నికుంభుడు ఉదయించెను. అతడు క్షత్ర ధర్మపరుడు. అతని కొడుకు నంహతాశ్వుడు. రణవిశారదుడు. వాని తనయులు అకృశాశ్వ, కృశాశ్వులు. కూతురు హైమవతి, ఆమె దృషద్వతి అని ఖ్యాతిని పొందినది. ఆమె కొడుకు ప్రసేనజిత్తు. అతడు గౌరి అను భార్యను బడసెను. ఆమె మహాసాధ్వి. భర్తృశాపముచే ఆమె బాహుద అనునది అయ్యెను. అతని కొడుకు యవనాశ్వుడు. వాని కొడుకు మాంధాత. అతడు త్రిలోకములను జయించినవాడు. అతని భార్య చైత్రరథి. శశిబిందుని కూతురు సాధ్వి. బిందుమతి అను పేరు కలది. పరమ సుందరి పదివేలమంది కామె అప్పగారు. ఆమె యందు మాంధాత ఇరువురు కుమారులను కనెను. వారు పురుకుత్సుడు ముచికుందుడను వారలు. పురుకుత్సుని సుతుడు త్రసదస్యుడు. నర్మదయందు కలిగినవాడు, వానికొడుకు సంభూతుడు వాని కుమారుడు త్రిధన్వుడు. శత్రుమర్దనము జేసినవాడు. ఆయన తనయుడు విద్వాంసుడైన త్రయ్యారుణుడు ప్రభువు. వాని కుమారుడు సత్యవ్రతుడు మహాబలశాలి క్రూరుడు. పరిగ్రహణ మంత్రములకు విఘ్నముల కల్పించి మరొకని భార్యను హరించిన వాడు. బాల్యముచేత కామముచే మోహముచే సాహసముచే చాపల్యముచే వాడు అంతఃపురమున నివసించు ఒక గృహస్థుని కన్యను హరించెను. త్రయ్యారుణుడు ఆ అధర్మశంకచేత క్రోధసమన్వితుడై, ఆతనిని నిందించి పరిత్యజించెను. నేను ఎక్కడకు పోదునని వాడు అనెను. “నీవు శ్వపచులతో కూడి ఉండు”మని తండ్రి అనెను. నీవు కులపాంసనుడవు. నీచే నేను పుత్రవంతుడను కాను అనియెను. వాడు తండ్రి మాటను బట్టి నగరమును వీడిపోయెను. ఋషియైన వశిష్ఠ భగవానుడు పోవలదని వానిని వారింపలేదయ్యను. ఆ సత్యవ్రతుడు శ్వపాకుల పాకల సమీపమున వసించుచుండెను. కొన్నాళ్ళకు తండ్రియు ఆవనముకు పోయెను. అంతట ఇంద్రుడు ఆ రాజ్యమున వర్షింపడయ్యెను. ద్వాదశ వర్ష క్షామమేర్పడెను. విశ్వామిత్రుడు తన భార్యను ఆతని దేశమున వదలి సాగరాంతమున విపుల తపము చేసెను. ఆయన భార్య నడిమి కొడుకును గళమందు బంధించి కొనిపోయి తక్కిన బిడ్డలను పోషించుటకై, నూరు గోవులను వెలకు అమ్మెను. అట్లు గళమందు బంధితుడైన వానిని జూచి సత్య వ్రతుడు (రాజ కుమారుడు) విడిపించి, ఆతనిని తాను భరించెను. విశ్వామిత్రుని సంతోష పెట్టుటకు, అతని అనుగ్రహము పొందుటకు అతడట్లు చేసెను. గళ బంధనమందిన కతన నాతడు ‘గాలవుడు’ అనబరగెను. కౌశిక మహర్షి ఆ వీరునివలన అట్లు విముక్తిని పడసెను. (7)