సోమోత్పత్తి వర్ణనము

 పితృ కన్యయగు విరజ అందు మహాతపస్వి అగు నహుషునికి ఇంద్ర తుల్యులైన ఆర్గురు కుమారులు ఉదయించిరి. వారు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, యాతి, సుయాతి అనువారు. అందు యయాతి రాజయ్యెను. ఆ పరమ ధార్మికుడు కకుత్ధ్స కన్యను గోవు అను అమెను వివాహమాడెను. యతి మునియై, మోక్షమార్గమందు ఉండి బ్రహ్మీ భావమందెను.

యయాతి సోదరులు ఐదుగురు రాజ్యమును గెల్చుకొని ఉశనసుని (శుక్రుని) తనయను దేవయానిని భార్యగ గైకొనెను. మఱియు వృషపర్వుడను అసురుని కుమార్తె శర్మిష్ఠను గూడ పత్నిగగైకొనెను. దేవయాని యదువును తుర్వసుని కనెను. శర్మిష్ట ద్రుహ్యుని అనువును-పురువును పుత్రులుగా పొందెను. దేవేంద్రుడు అతనికి (యయాతికి) ప్రీతుడై, దివ్యమైన, భుజకీర్తిని దివ్యములు మనోజవములైన తెల్లని అశ్వములను పూన్చిన స్వర్ణమయమైన రథమును ప్రసాదించెను. ఆ రథముతో విజయయాత్రచేసి యుద్ధమునందు అజేయుడై యయాతి ఆరు దినములలో మహీమండలమంతటిని జయించెను. దేవదానవులను నిగ్రహించెను. సంవర్తనమను పేరుగల ఆ రథము కౌరవులదాయెను. కురు వంశీయుడును పరీక్షిత్తుని కుమారుడును అగు జనమేజయుని నుండి గర్గశాపమున అరథము అంతరించెను.

బాలుడైన గర్గుని కుమారుని జనమేజయుడు కాలవశమున చంపి బ్రహ్మహత్యా పాపమునందెను. దానిచే లోహగంధియై (ఇనుప వాసనగొట్టు శరీరముగలవాడై) ఆ రాజర్షి ఇందందు వెఱ్ఱి పరుగులు పెట్టుచు పౌర జానపద పరిత్యక్తుడై, దుఃఖ సంతప్తుడై ఎచటను శాంతిని పొందలేని వాడాయెను. అతడు ద్విజ శ్రేష్ఠుడగు శౌనకుని శరణ మందెను, జ్ఞానియైన శౌనకుడు పవిత్రతకై అతనిచే అశ్వమేధము చేయించెను. అవబృధ స్నానము కాగానే అతని దుర్వాసన పోయెను. ఆ యయాతి దివ్యరథము ఛేది రాజునకు చిక్కగ, ఇంద్రుడు తుష్టుడై దానిని కొనివచ్చి బృహద్రథునకు ఇచ్చెను. బృహద్రథునినుండి అది అతని కొడుకునకు జరాసంధునికి దక్కెను. భీముడు వానిని చంపి ఆ రథమును వాసుదేవునకు అర్పించెను.

నహుషుని కుమారుడగు యయాతి సాగరముతో, సప్త ద్వీపము అగు వసుంధర నెల్ల గెలిచి అయిదు భాగములుచేసి పుత్రుల కొసంగెను. తూర్పు దిశను జ్యేష్టుడగు యదువును, నడుమ పూరుని అభిషేకించెను. ఆగ్నేయమున తుర్వసుని ఉంచెను. వారిచే ఈ విశ్వంభర (భూమి) నేటికిని ధర్మముతో పరిపాలింపబడుచున్నది. బ్రాహ్మణులారా! ఆ దేశముల ప్రజలను గూర్చిముందు చెప్పగలను.

యయాతి తన ఐదుగురు కుమారులు, దురంధరులు రాజ్యభారము వహించగా వార్ధక్య దశలో ధనుర్బాణ సన్యాసము జేసి భూమియందు సంచరించుచు సంప్రీత మనస్కుడయ్యెను. ఇట్లు భూ విభాగముచేసి అతడు తన కుమారుని యదువుని జూచి నా ముసలితనము నీవు గ్రహించి నీ యౌవనము నాకు ఇమ్ము. నా ముసలితనమును నీయందుంచి నీ రూపములో యువకుడనై వేరొక కార్యమువలన ఈ భూమిపై సంచరింతును అని అర్థించెను. ఆ మాటలు వినిన యదువు ఇట్లు బదులు పలికెను.

ఒక బ్రాహ్మణునికైనేను ఇత్తునని ప్రతిజ్ఞ జేసిన భిక్షను ఇంతదాక ఈయలేదు. అది చెల్లింపక నీ జరాభారమెట్లు స్వీకరింపగలను? అదిగాక ముదిమియందు అన్న పాన నిమిత్తమయిన దోషములనేకములు గలవు. కావున నీ ముసలితనము నేను గ్రహించుటకు ఉత్సహింపను. రాజా! నాకంటెను ప్రియతములైన పుత్రులు నీకనేకులు గలరు. ధర్మజ్ఞా! నీ జరాభారము గ్రహింప మరొక్కని కోరుకొమ్ము అని చెప్పగావిని వక్తలలో శ్రేష్ఠుడగు యయాతి కోపవశుడై తనయుని గర్హించుచు ఇట్లనియె.

దుర్బుద్ధీ! నన్ను నిరాకరించిన నీకు మరి ఆశ్రమమేమి ఉన్నది? ధర్మమేమి ఉన్నదిరా! నేను నీకు దేశికుడను గద! నీసంతతికి రాజ్యముండదు, ఈ పలుకులయందు సందేహము లేదని శపించెను. అట్లే కొడుకులందరిని అడిగెను. వారు నలుగురు కాదని చెప్పగా వారిని కూడా ఇట్లే శపించెను. చివరకు పూరుని అదేమాట అడిగెను. వెంటనే ఆ పూరుడు తండ్రీ వృద్ధాప్యాన్ని స్వీకరించి తండ్రికి తన యౌవనము ఇచ్చెను. అట్లు తిరిగి యౌవనమును పొందుటచేత, యయాతి భూమియందు తిరుగుచు, కోరికలు అన్నింటిని తీర్చుకొనుచు విశ్వాచితో గూడి చైత్రరథోద్యాన మందు స్వేచ్ఛావిహారములు ఒనరించుచు, పెక్కుకాలము క్రీడించెను. తృప్తుడైన తరువాత వచ్చి పూరున కాతని యౌవనము ఇచ్చివేసి తన ముదిమిని తాను గ్రహించెను.

మునిశ్రేష్టులారా! ఆ సమయమున యయాతిచే గానము చేయబడిన గాథ (అనుభవము)లు విన్నవాడు, తాబేలు తన అవయవములను లోపలికి ముడుచుకొనిన విధముగ తనకు కలిగిన కామము (కోరిక)లను సంకోచింప చేసికొనును. ఒకప్పుడును కోరికల అనుభవముచే కామము తీరదు. పైగా హవిస్సుచే అగ్ని పెంపొందినట్లు పెంపొందును. భూమియందుగల ధాన్య సంపద, బంగారము, పశువులు, స్త్రీలు, ఇవి అన్నియు ఒక్కనికి గూడ తృప్తిని ఈయజాలవని తెలిసినవాడు మోహపడడు. ఎపుడు సర్వభూతములపై త్రికరణము (మనస్సు, వాక్కు, శరీరము)లచే పాపాలోచన చేయడో, అపుడా జీవుడు  బ్రహ్మయే అగును. ఎప్పుడు ఎవరెవరి వల్లగాని జడియడో, తనవలన ఎవ్వరు గాని జడియకుందురో, ఎప్పుడు ఎవ్వడేదియు కావలయునని గాని అక్కరలేదనిగాని అనడో అపుడాతడు బ్రహ్మ భావమందును. దుర్మతులకేది వదిలించుకొనరానిదో, ఏది నరునికి ముదిమి కదిపిన కొలది తాను ముదిమిగొనదో, ఏది ప్రాణాంతకమయిన రోగమో ఆ తృష్ణ (ఆశ) అనుదానిని వదిలించుకొన్నవానికే సుఖము లభించును. జరితుడైన కొలది కేశములు జర్జిరితములగును. జుట్టు నెఱియును, దంతములు జరితములగును కాని ధనాశ, జీవితాశ మాత్రము జరితములుగావు. లోకమున కామసుఖముగాని దివ్య మయినది అనగా స్వర్గాది తేజోమయ లోకములలోగల్గు సుఖముగాని తృష్ణా క్షయమువలన గలుగు సుఖము యొక్క పదునారవ కళకు గూడ సరికాదు. అనిచెప్పి రాజర్షియైన యయాతి భార్యతో అడవిని ప్రవేశించెను. (వానప్రస్థాశ్రమము స్వీకరించెను) అతడు చాలకాలము విపుల తపమాచరించి అంతమందు భృగుతుంగ (పర్వతశిఖర) మందుండి నిరాహారియైమేను విడచి పత్నితో స్వర్గమునకేగెను. సూర్యుడు కిరణములచే ఆవరించినట్లు అతని వంశీయులు రాజర్షులు అయిదుగురు అఖిల భూమండలము ఆవరించిరి. వృష్టి కులవర్ధనుడై నారాయణుడు శ్రీకృష్ణుడుగ అవతరించిదైన రాజన్యులచే పొగడ్తగాంచిన యదువంశమును కీర్తించెదను. వినుడు! మునిసత్తములారా! ఈ యయాతి చరితము నిత్యము వినునతడు స్వస్థుడు, సంతానవంతుడు, ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు కాగలడు. (12)