అనంతవాసుదేవ మాహాత్మ్యము

ఋషులు ఇట్లు అనిరి-”భగవంతుని కథలను ఎంత విన్నను మాకు తృప్తి కలుగుట లేదు. అనంత వాసు దేవుని మహిమను తాము వర్ణించినారు. కాని అందలి రహస్యమును విస్తరించి పలుకుడు అన బ్రహ్మ ఇట్లు అనియె.

మునిశ్రేష్ఠులార! పరమసారమైన అనంత వాసుదేవుని మహిమ భూలోకవాసుల కందనిది. ఆది కల్పమందు అవ్యక్త జన్ముండనగు నేను దేవశిల్పి, శ్రేష్ఠుడు, విశ్వకర్మలందరికి అగ్రేసరుడయిన పనివాడు అగు విశ్వకర్మను పిలిచి వాసుదేవుని ప్రతిమను శిలామయమైన దానిని జేయుము. దానిని దర్శించి ఇంద్రాది దేవతలు మనుష్యాది భూలోకవాసులు దానవులవలన, రాక్షసులవలన కలుగు భయము తొలగి స్వర్గమును పొంది, సుమేరు శిఖరమందు ఎల్లకాలము ఆ వాసుదేవుని ఆరాధించుచు ఏ అడ్డును లేక నివశింపగలరు అని ఆదేశించితిని.

ఇట్లు నేను తెలుప విని విశ్వకర్మ క్షణము పురుషోత్తముని యొక్క ప్రతిమను తయారు చేసెను. శంఖ చక్ర గదలంగొని శ్రీవత్సచిహ్నము వనమాలయు ధరించి తెల్లతామర పూవులట్టి నేత్రములు గల్గి, కిరీటము భుజకీర్తులు ధరించి పీతాంబరము కట్టుకొని మణి కుండలము మెరయ శోభించు అందమగు విగ్రహమును నిర్మింపజేసి రహస్య మంత్రములచే నేనే ఒక పుణ్య లగ్నమందు ప్రతిష్ఠ చేసితిని. ఆ సుముహూర్తమునకు దేవరాజు ఇంద్రుడు వేల్పులతో గూడి ఐరావత మెక్కి బ్రహ్మ సదనమునకు ఏగి, స్నానదానాదులు ఒనరించి ఆ విగ్రహమును మఱిమఱి పూజించి తన నగరమునకు తిరిగి వచ్చెను. అచట ఆ విగ్రహమును అర్చించి త్రికరణములను నియమించుకొని వృత్రుడు, నముచి మొదలుగా గల అసురులను చంపి ముల్లోకములను పాలించెను.

రెండవ త్రేతాయుగము రాగా మహావీర్యుడు రావణుడు పుట్టెను. పదివేలేండ్లు నిరాహారియై జితేంద్రియుడై అసాధ్యమైన ఉగ్రతపములను చేసెను. దానిచే నేను సంతుష్టుడనై దేవతలకు, దైత్యులకు, నాగులకు, రాక్షసులకును నీవు అవధ్యుడవగుదువని వరమిచ్చితిని. యమ కింకరులకు కూడ వాడు అవధ్యుడయ్యెను. వాని కొడుకు ఇంద్రజిత్తు మేఘనాథుడను పేరొంది. ఇంద్రుని గెల్చి స్వర్గ రాజ్యమును వడసెను. రావణుడు అమరావతిని స్వాధీనము చేసుకొని ఇంద్రగృహమందు వాసుదేవ మూర్తిని ఇంతకుమున్ను వర్ణించిన ఆకృతిని దర్శించెను. అంతట నట గెల్చుకొన్న రత్నములను (శ్రేష్ఠములగు సామాగ్రిని)వదలి వేసి ఆ వాసుదేవ విగ్రహమును విమానముమీద లంకకు గొని తెచ్చెను.

అప్పుడు మంత్రియు నగరాధ్యక్షుడు అయియున్న విభీషణుడు ధర్మమూర్తి గావునను నారాయణ భక్తిపరాయణుడయినందున ఇంద్ర భవనమునుండి దిగివచ్చిన ఆ విష్ణు విగ్రహముంగని మేను పులకరించి అచ్చెరువంది తలవంచి నమస్కరించి సంతుష్టాంత రంగుడై ఇప్పుడు నా జన్మము ధన్యమయ్యె. ఇప్పుడు నాతపస్సు ఫలించినది అని మఱిమఱి మ్రెక్కి, పెద్దన్నయగు రావణుని కడకేగి దోసిలొగ్గి ప్రభూ! ఈ ప్రతిమను నాకు ప్రసాదింపుము. దీని నారాధించి సంసార సముద్రమును దాటెదను అన దశాననుడు తీసికొనుము ఇదిగో విగ్రహము. దీనితో నేనేమి చేయుదును. సర్వభూత కారణుడగు బ్రహ్మనారాధించి ముల్లోక విజయమును అందితిని అని పలికెను.

విభీషణుడు ఆశ్చర్యము కల్గించు ఆ మూర్తిని గ్రహించి నూట ఎనిమిదేండ్లు పూజించి జరామరణములు లేని స్థితిని (చిరంజీవిత్వమును) అణిమాది విభూతులను పొంది లంకా రాజ్యాధిపతియై అభీష్ట భోగములను అనుభవించుచున్నాడు. అనవిని మనులు అహో! చాల ఆశ్చర్యకరమైన కథ వింటిమి. ఆ అనంత వాసుదేవ ప్రభావము ఇంకను విస్తరముగ తెలుపుము అన బ్రహ్మ ఇట్లు అనియె.

అయ్యెడ నా రాక్షసుడు దశకంఠుడు దేవ, గంధర్వ, కిన్నరులను ఓడించి లోక పాలుర అవనీపాలురు, తపస్వులను, సిద్ధులను గెలిచి వారి ఇల్లాండ్ర కొని తెచ్చి తన రాజధాని యందు లంకలో ఉంచి, సీతాదేవి యెడ మోహవివశుడై బంగారు లేడిరూపు ధరించిన (మారీచు)నితో బయలుదేరి సీతను అపహరించెను. అంత కోపించిన రాముడు లక్ష్మణునితో గూడి యుద్ధమునందు రావణుని చంపుటకై తొలుత వాలిని జంపి, సుగ్రీవుని వానర రాజ్యమందు అభిషిక్తుని గావించెను. అంగదుని యువరాజుగా చేసెను. హనుమ దాది కపివీరులతో కొండలను పడవైచి సముద్రమునకు సేతువును గట్టి సేనలతో వారధి దాటి, అనుపమమైన రణమొనరించి ప్రహస్త నికుంభ కుంభకర్ణాదులతో ఇంద్రజిత్తును చంపి రావణుని పరిమార్చి అగ్ని శోధనము చేసి జానకిని గ్రహించి విభీషణునికి లంకా రాజ్య మొసంగి అక్కడనున్న వాసుదేవమూర్తిని గొని పుష్పక మెక్కి అవలీలగ లీలామానుష మూర్తి రామచంద్రమూర్తి అయోధ్య కేతెంచి భక్తవత్సలుండు, రామచంద్ర ప్రభువు భక్తి భరితునిం తమ్ముని భరతుని పినతమ్ముని, శత్రుఘ్నుని సర్వసామ్రాజ్యాధి నేతలట్లు గౌరవించి సనాతన వాసుదేవమూర్తిని ఆరాధించి పదునొకండు వేలేండ్లు అయోధ్యను పాలించి ఆ విష్ణు విగ్రహమును సముద్రునికి ప్రసాదించెను. అట్లాసంగుచు ఓ వారథీ! నీవు ధన్యుడవు. ఈ మూర్తిరక్షణము నీ పని. నీవు సర్వరత్న నిధివి అనెను.

ఇంకను ద్వాపర యుగమందు జగన్నాధుడు హరి, భూదేవి ప్రార్థనచే ఆమెకు కల్గిన భావ వైకల్యమును వారింప వసుదేవు కులమునందు అవతరింపగా సర్వాభీష్ట ప్రదమగు ఈ విగ్రహమును సర్వలోక క్షేమము కొఱకు మరి కారణాంతరమునను ‘పురుషోత్తమము’ అను పుణ్యక్షేత్రమందు సముద్రుడు నీళ్ళనుండి తానుగా ఈ మూర్తిని పైకి లేవనెత్తెను.

అప్పటినుండి ముక్తిదమయిన అ క్షేత్రమున ఈ మూర్తి వెలసియున్నది. భక్తితో ఈ సర్వేశ్వరుని త్రికరణములను నిగ్రహించి ఆరాధించు భక్తులు పరమపదమందుదురు. ఈ అనంత వాసుదేవుని ఒక్కమారేని దర్శించి నమస్కరించిన, అతడు దశాశ్వమేధ రాజసూయ ఫలమందును. ఆ మీద కామగ విమానమెక్కి సూర్య సమాన వర్చస్సుతో చిఱు గంటలు మ్రోయ, ఆనందభరితుడై విష్ణు లోక మేగును. ఇరువది యొక్క తరముల వారిని ఉద్ధరింపగలడు. ప్రళయ పర్యంతము అచట అనంత భోగములను అనుభవించి పుణ్యానుభవమయిన తరువాత ఈ యవని కేతెంచి చతుర్వేదవిదుడై వైష్ణవ యోగమున మోక్షమును బొందును. అనంత వాసుదేవుని మహిమ ఇది. నేను కీర్తించితిని. ఓ మునివరులారా! వందల ఏండ్లు వర్ణించినను, ఇది తుదముట్ట స్తుతింప శక్యముగాదు. (176)