ఏకామ్రక్షేత్ర మాహాత్మ్యము

లోమహర్షణుడు ఇట్లనియె-

మునివరులార! వ్యాసులు తెలుపుచుండ రుద్రుడు కోపించిన మీదట జరిగిన పుణ్య కథా వృత్తాంతమైన పార్వతిరోషము, శంభుని క్రోధము, వీరభద్రుని యొక్కయు, భద్రకాళి యొక్క అవతారము, దక్షయజ్ఞధ్వంసము, శంకరుని అద్భుత విక్రమము, తిరిగి అయన మహాత్ముడగు దక్షునికి ప్రసన్నుడగుట, రుద్రునకు యజ్ఞ భాగమిచ్చుట దక్షునికి క్రతుఫలము లభించుట చూచి సంప్రీతులు విస్మితులు, ఋషులు వ్యాసుని తక్కిన కథను తెలుపుమని అడిగిరి. వ్యాస భగవానుడు ఏకామ్ర క్షేత్రమును గురించి వారడుగ ఇట్లు తెలుప దొడంగెను. వ్యాసుడు పలికెను-

బ్రహ్మ తెలిపిన పుణ్యకథను అలించి మునిపుంగవుల ఒడలు పులకరింప అనందభరితులై వ్యాసులను కథను కొనియాడిరి. ఋషులు-

“ఆహా! శంభుదేవుని మహిమ నీవు చక్కగ తెల్పితివి. ఇప్పుడు ఏకామ్ర క్షేత్రమును గురించి తెలుపుము. వినవలెనని మిక్కిలి కుతూహలముతో ఉన్నా”మనిపలికిరి. వ్యాసుడు వారి వచనము విని లోకేశ్వరుడు చతుర్ముఖుడు భూతలమున పాపహరమగు ఆ శివ క్షేత్రమును గూర్చి మునులకిట్లు తెలిపెను.

“సర్వపాపహరము, పరమ దుర్లభము, కోటిలింగ సహితము, కాశీ క్షేత్ర సమానము ఎనిమిది తీర్థములతో కూడినదియు ఏకామ్రమని ప్రసిద్ధిగల పుణ్య క్షేత్రమును గురించి చెప్పుచున్నాను” వినుడు.

పూర్వకల్పమందక్కడ ఏకామ్రవృక్షము (ఒంటి మామిడిచెట్టు) ఉన్నందున ఆ క్షేత్రము నకు ఆ పేరు వచ్చినది. అందు సంతుష్టి, పుష్టియుగల స్త్రీ పురుషులు ఉందురు. పండిత సమూహముతోను ధన ధాన్యములతోను గూడినది. గృహ గోపురముల ఒత్తిడి గొన్నది. త్రికోణాకార ద్వారబంధ శోభితము, నరక బృంద సహితము సర్వరత్నోప శోభితము, కోట బురుజులతో ఒప్పునదియు రథికులచే శోభించునది, రాజహంసలట్లు తెల్లని ప్రాసాదముతో రాణించునది, పురద్వారములతో ఒప్పునదియు తెల్లని ప్రాకారములతో వ్యాప్తమైనదియు, ఆయుధ ధారులచే అభిరక్షితమైనది, కందకములతో రాణించునదియు, గాలిచే చలింపజేయబడిన బహువర్ణ పతాక పరిశోభితము, నిరంతర ఉత్సవ ప్రముదితము, నానావాద్యధ్వని సంకులము, దేవాలయములు, ప్రాకారములు, ఉద్యానవనములతో పరమసుందరము. అందలి స్త్రీలు పరమసుందరులు, ఆనందభరితులు. సర్వాభరణ భూషితులు, పద్మనేత్రలు. పూర్ణచంద్రాననలు, కాంచీనూపుర శబ్దశోభితులు, కొందరు బంగరు చాయవారు, కొందరు గజగమనలు, కొందరు పీనోన్నత కుచభారావనమ్రలు, దివ్యగంధానులిప్తలు, కొందరు కర్ణాభరణ భూషితలు, మరికొందఱు మదవతులు, సుశ్రోణులు, కొందరు నగుమోము గలవారు, అపుడించుక వెలువడు పలువరుస గలవారు కొందరు బింబాధరోష్ఠులు. కొందరు మధురస్వర మనోహరులు. తాంబూల రంజిత ముఖులు, ప్రియదర్శనులు, మనోహారిణులు. క్రియవాదినులు, నిత్య యౌవనగర్వితులు. అందరు దివ్యాంబరాభరణ ధారిణులు, పరమ పతివ్రతలు ఆ క్షేత్రమున యువతులు అప్సరల సమానులు, క్రీడా విలాసినులు. రేయింబవళ్ళు తమతమ గృహములందు ఆనందభరితులై ఉండు ఉత్తమ గృహిణులు.

అచట పురుషులు రూపయౌవన గర్వితులు, సర్వలక్షణ సంపన్నులు, నిగనిగ మెరయు మణిమండనములు ధరించువారు. బ్రాహ్మణాది వర్ణములవారు స్వధర్మ నిరతులు. అందువారాంగనలు కూడ పరమ సుందరులై ఒప్పుదురు. ఊర్వశీ, మేనకాది దేవ సుందరీమణుల అందమున ఒప్పువారు. సంగీతాది సకల కళానిపుణులు. ప్రియవాదినులు. సర్వ లక్షణ లక్షితులు, నృత్య గీత విశారదులు. సర్వరమణీ రమణీయ గుణ గర్వితులు. వాలు చూపులలో మాటలలో నిపుణులు, కురూపులు, కుబుద్ధులు, పరద్రోహి పరాయణులు అందుకానరారు. వారి కటాక్ష ప్రసరణ మాత్రమున మానవులు మోహవీవశులు అగుదురు.

నిర్ధనులు, మూర్ఖులు, పరద్వేషులు, రోగులు, లోభులు, మాయకులు, జగత్ప్రసిద్ధమైన ఆ క్షేత్రమున ఉండరు. సర్వసుఖ సంచారము. సర్వసత్త్వ సుఖకరము. సర్వసస్య సంభరితము. సర్వజన సంకులము ఆ ప్రదేశము. అందుకల ఫలవృక్షములు ఎందును లేవు. అందలి ఉద్యానములు నందనవనములు. సర్వ ఋతుకుసుమఫల భారావనమ్ర వృక్ష శోభితములు.

అందు శుక పిక చకోర చక్రవాత ప్రముఖ సకల పక్షికుల కిలకిలారావ సంకులములగు వనములు, సరస్సులు, దిగుడు బావులు, చూడముచ్చట గొల్పుచుండును. అందుకమలములు, కలువలు, ఎర్ర తామరలతో నిండిన పుణ్య సరస్సులు ఎటు చూచినను కన్నుల పండువు చేయుచుండును. అచట పరమశివుడు సన్నిహితుడు. ఆ పరమేశ్వరుడు భూమి యందున్న నదులు పుష్కరిణులు చెరువులు నూతులు, సాగరములు అనువాని నుండి జలబిందువులను సేకరించి సురలతో ఆ పుణ్యక్షేత్రమున బిందుసరమను తీర్థమును నిర్మించెను. మార్గశీర్ష బహుళ అష్టమినాడు జితేంద్రియుడై అచట యాత్ర చేసి శ్రద్ధతో స్నానము చేసి వాఙ్నియమమును పాటించి దేవర్షి పితృతర్పణము ఆచచరించి తిలాంజలులు చేసినవాడు అశ్వమేధ ఫలమందును. గ్రహణ పర్వకాలమున విషువమున (పగలు రాత్రి సమానముగా ఉండు కాలమున) సంక్రమణమందు ఆయన సమయమున యుగాదులందు షడశీతిని (తుల మొదలుకొని 86వ రోజున వచ్చెడి పుణ్యకాలము. ఇది సంవత్సరమునకు నాలుగు పర్యాయములు వచ్చును. ద్విస్స్వభావ రాశియందే ఇదివచ్చును.) మత ఇతర శుభ సమయములందు ధనాది పుణ్యదానములు చేసినవారు ఇతర తీర్థములకంటె నూరురెట్ల ఫలమును అందుదురు. ఆ బిందు సరస్తీర్థము నందు పితృదేవతలకు పిండ ప్రదానము చేసినవారు పితృదేవతలకు అక్షయతృప్తిని కలుగజేసిన వారగుదురు సంశయము లేదు.

అటుపైన ఇంద్రియములను ఇమిడించుకొని వాక్కును నిగ్రహించుకొని, శివాలయము నకు (ఏకామ్రేశ్వరాలయము) పోయి, అందు శంకరుని పూజింపవలెను. అంతకు ముందు ఆలయమునకు ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను. ఆవునేతితో గోక్షీరముతో శుచియై స్వామికి అభిషేకించి చందనము, కుంకుమయు పూసి అటుతరువాత ఉమాపతియగు చంద్రమౌళీశ్వరుని పుష్పములచే పవిత్రములగు బిల్వార్కకమలాదులచే ఆగమ విధానమున వైదిక మంత్రములతో ఆరాధించవలెను. దీక్షాపరుల పూజావిధానమిది. దీక్షనొందనివారు మూల మంత్రముతోను, నామములతోను అర్చించవలెను. ఈ విధముగ గంధ పుష్పాదులతో షోడశోపచారములతోను నృత్యగీతాదులతోను ఆరాధించి పాపవిముక్తులగుదురు. రూపసి యువకుడు అగును. ఇరువది ఒక్క తరముల వారిని ఉద్ధరించి దివ్యాభరణముల దాల్చి, చిరు గంటలు మ్రోయు బంగరు విమానమున గంధర్వ అప్సరసాదులు కీర్తింప సర్వ దిశల మిరుమిట్లు గొల్పుచు తుదకు శివలోకము చేరును. అచటి భక్తులతో భూత ప్రళయ పర్యంతము అచ్చట ఉండి భూ లోకమునకువచ్చి యోగి గృహమునందు చతుర్వేది అగును. అచట పాశుపత దీక్షగొని మోక్షము పొందును.

శయనైకాదశి, ఉత్థాన ఏకాదశులందు సంక్రమణములందు, అయన పుణ్యకాలములందును, అశోకాష్టమి పవిత్రారోపణములందును శివ దర్శనము చేయువారు సూర్య ప్రభగల విమానమున శివలోకమునకు ఏగుదురు. మేధావంతులు ఎల్లకాలము శివ దర్శనము చేసి శివలోకమందుదురు. ఈ శివ క్షేత్రమునకు నలుదిక్కులందుగల రెండున్నర యోజనముల ప్రదేశము భుక్తి ముక్తులను ఇచ్చు క్షేత్రము. ఆ క్షేత్రమునందుగల లింగము భాస్కరేశ్వర మనబడును. అచట ఉన్న కుండమున స్నానముచేసి ఆదిత్యునిచే అర్చింపబడిన ఆ భాస్కరేశ్వరుని దర్శించినవారు విమానమెక్కి గంధర్వగానములను వినుచు శివలోకమునకు ఏగుదురు. అచట అనందభరితులై ఒక కల్పకాలము మనోహర భోగములను అనుభవించి పుణ్య క్షయముకాగా, భూలోకముచేరి యోగి గృహమునందు పుట్టి వేద వేదాంగ పారగులై సర్వభూత హితముకోరు బ్రాహ్మణులై సర్వసములై, మోక్షశాస్త్ర కుశలురై, శివయోగమంది మోక్షమందుదురు. పూజ్యమైనను, అపూజ్యమైనను ఒక శివలింగము అడవిలో, రాచబాటలో, నాల్గుదార్లు కలిసినచోట, శ్మశానమునందుగాని ఎక్కడో అక్కడ అక్షేత్రమునందు ఉన్న యెడల దానిని జూచి తొట్రుపడక, శ్రద్ధతో మనసునిలిపి భక్తితో అభిషేకము చేసి సుగంధ పుష్పాదులచే ధూపదీప నైవేద్యాదులచే నమస్కారములచే నమస్కరించి సాష్టాంగ దండప్రణామము గావించిన అతడు శివలోకమేగును. స్త్రీ యైనను శ్రద్ధతో శివుని పూజించిన ఈ చెప్పిన ఫలమందును. ఇందు ఆలోచించవలసిన పనిలేదు.

ఆ ఏకామ్ర క్షేత్రముయొక్క సమగ్ర గుణ విశేషములను పరమేశ్వరునికంటె మఱి ఎవ్వడు వర్ణింపగలడు? ఏయే స్థితిలోనున్నను వైశాఖాది మాసములందు, బిందు సరోవర జలమందు స్నానముచేసి అటనున్న శివుని, వరదాత్రియగు పరమేశ్వరిని, ప్రమథ గణములను, కుమారస్వామిని, గణపతిని, నందిని, కల్పవృక్షమును, సావిత్రీదేవిని దర్శింపవలెను. అందువలన శివుని సాలోక్య మందును. కపిల తీర్థమున యధావిధిగా స్నానమాచరించి అభీష్టములనంది శివలోకమందును. ఆ క్షేత్రముననే జితేంద్రియుడై యధావిధి స్తంభ ప్రతిష్ట చేయునతడు ఇరువది యొక్కతరములు కులమును ఉద్ధరించి శివలోకమునకు పోవును. కాశీ క్షేత్రసమయమున శివ క్షేత్రమగు ఏకామ్ర క్షేత్రమునందు స్నానము చేసిన అతడు తప్పక మోక్షమందును. (41)