బుద్ధత్వా ప్రతిబుద్ధత్వ ప్రతిపాదనము

వషిష్ఠ మహర్షి జనకునితో ఇట్లు పలికెను:

ఓ నృపసత్తమా! ఇంతవరకును నీకు సాంఖ్య దర్శనమును తెలిపితిని. ఇకమీద విద్యాZవిద్యల తత్త్వమును క్రమానుసారము తెలిపెదను. ఎఱుగుము. సృష్టి ప్రళయములు జనన మరణములు ధర్మములుగా నుండి సంసార చక్రమునందు సంచరించువాడు అవ్యక్త తత్త్వమును వివేచించి తెలిసికొన జాలడు. ఒకదాని కంటె మఱియొకటి ఉత్తరోత్తరము విద్యారూపము అయినది. పై దానికంటె ముందఱిది అవిద్యా రూపమయినది. విద్య-అవిద్య అనుభేదము రెండు-స్థూల-స్థూలతర-సూక్ష్మ-సూక్ష్మతర తత్త్వముల నడుమనుండెడి యోగ్యతా భేదముచే చేయు నిర్ణయము. ఇది సాంఖ్య తత్త్వవేత్తలు వివేచించి ప్రతిపాదించిన విషయము. ఎట్లనిన-వరుసగా 1. కర్మేంద్రియములు; 2. జ్ఞానేంద్రియములు; 3. పంచ తన్మాత్రలు-లేదా విషయములు; 4. మనస్సు; 5. పంచ భూతములు; 6. అహంకారము; 7.బుద్ధి; 8. అవ్యక్తము ఇవి వరుసగా ఒకదానికంటే మఱియొకటి విద్యారూప మయినవి. అనగా ఉత్తరోత్తరము సూక్ష్మతరమయినవి. అన్నిటి కంటె విద్యారూపమయినది పంచవింశతితమమగు పరమాత్మతత్త్వము.

ఇక క్షరాక్షరతత్త్వమును తెలిపెదను:

వివేచించగా వ్యక్తము అవ్యక్తము అను రెండును క్షరములే. అవి రెండును అక్షరములే. ఇది కొంత సంశయ జనకముగాను విచిత్రముగాను కనబడినను రెండును క్షరమును అక్షరమును అగుననుటకు హేతువు ఏమో సాంఖ్య దర్శన వివేచనానుసారము ప్రతిపాదింతును. వాస్తవ స్థితిలో రెండును ఆదియు నాశమును లేనివే. రెండును సర్వశక్తి మంతములగు ఈశ్వర తత్త్వములే. రెండును పరమార్థ తత్త్వములే. ఎట్లన పంచవింశక తత్త్వము అనబడు పరమార్థ తత్త్వము సృష్ఠి ప్రళయ జనన మరణ రూపసంసార ప్రవృత్తికై మొదట అవ్యక్తమై క్రమముగా మహదాదిగా భూతభౌతిక సృష్టివరకు తన్నుతానే మాయావశమున పరిణమింప జేసికొని ఇట్టి తనలో సృష్టికాలమున తాను ప్రవేశించుచు ప్రళయ కాలమున ఈ వ్యక్త సంసార రూపమగు తన్నేతనలో లయముచేసికొనుచున్నది. పరమార్థమున ఇవియన్నియు అఖండ-ఏకైక-తత్త్వమే కదా! ఒకే ప్రకృతియే కదా! కనుక వ్యవహారమున మాత్రమే అపరాప్రకృతి-పరాప్రకృతి-క్షరము-అక్షరము-అనుభేదము. వస్తు స్థితిలో రెండును క్షరములే-రెండును అక్షరములే. అనగా అక్షర తత్త్వము తన్నుతాను క్షరరూపమున పరిణమింపజేసికొని తన రూపాంతరమే అగు జడ దేహమున తాను ప్రవేశించి ఉపాధిచే తానును క్షరునివంటివాడై అహమను అభిమానముతో కర్తయై భోక్తయై సుఖియై దుఃఖియై వీటికి భయపడి విరక్తుడై ముముక్షువై జ్ఞాత యగుచున్నాడు. అప్పుడు ఈ భ్రాంతి కల్పిత క్షర తత్త్వమును దృష్టిలో ఉంచుకొనగా అక్షర తత్త్వము జ్ఞేయమగును. ఈ జ్ఞాతయగు క్షర సదృశతత్త్వము ముక్తుడయినపుడు ఈతడు జ్ఞాతయుకాక జ్ఞేయమును కాక త్రిపుటిలోని జ్ఞాధాత్వర్థ రూపమైన జ్ఞానమునుకాక వీటన్నిటికిని అతీతమగు చిద్రూప జ్ఞానతత్త్వ మగుచున్నాడు. కనుక ఈ వివేచనము ననుసరించి ఏది యవ్యక్తము? ఏది వ్యక్తము? ఏది క్షరము? ఏది అక్షరము? అంతయు క్షరమే. అంతయు అక్షరమే. అంతయు వ్యక్తమే. అంతయు అవ్యక్తమే. అక్షరుడే మాయా వశమున క్షరుడై సగుణుడైనపుడు క్రమముగా సంసార విషయములపై నిర్వేదము చెంది విరక్తుడై సాంఖ్య వివేచనముచే తాను నిర్గుణుడననియు తాను పరాప్రకృతియే యనియు ఎరుగును. అపుడు అపరా ప్రకృతి స్థితిని విడిచి శుద్ధుడగును. అప్పుడు ఇతనికి ఏ దుఃఖములను ఉండవు. కేవలము సుఖ-ఆనంద-శుద్ధ స్వరూపుడగుచున్నాడు. సుఖదుఃఖ మిశ్ర స్వరూపము తొలగుచున్నది. సంసారమున సంచరించవలసిన బంధము దూరమగుచున్నది.

ఇట్లు క్షరస్థితి నుండి అక్షరస్థితికి-మిశ్రస్థితి నుండి శుద్ధతా స్థితికి పోవుటలోని క్రమమునే అప్రతిబుద్ధత్వ దశనుండి ప్రతిబుద్ధత్వ దశకు పోవుట అందురు.

అది ఎట్లనిన:

సుఖదుఃఖ సంమిశ్రమమగు ఈ సంసారమునందుగల దోషములను గుర్తించి విరక్తుడైన జీవుడు ఇట్లనుకొనును: నేను ఇంతకాలమును ఏమిచేసితిని? నీటిలోనున్న చేప ఆ నీరువేరు నేనువేరు అని తెలియక ఆ నీరు తనకొరకే ఉన్నట్లుగా భావించుకొని ఆ నీటిని విడువలేక ఆ మహాజలరాశిలోనే ఒకచోటినుండి మరియొక చోటికి సంచరించుచు దాని నుండి బయటకు వచ్చినచో తనగతి ఏమగునో అని భయపడినట్లే నేనును నన్నీ దృశ్య ప్రపంచము కంటె అతీతమగు భిన్నమగు తత్త్వమునుగా గుర్తెఱుగక ఇంతకాలము సుఖదుఃఖ సంమిశ్రమును జనన మరణ పరంపరా బహుళమును నగు ఈ సంసార ప్రవాహములో కొట్టుకొని పోవుచుంటిని. ఇక్కడ నున్న వారందరును నావలెనే ఉన్నారు. కాని ఈ అవ్యక్త-జ్ఞేయ-అక్షర-తత్త్వము విమలమైనది. నేనును పూర్వము ఇట్టి స్థితిలోనే యుంటిని. ఇంతవరకు అజ్ఞానముచే కలిగిన సంమోహముచే ప్రవృత్తుడనై అజ్ఞుడనుగా ఉంటిని. దీనికి అంతటికిని సంసర్గము-అతిసంసర్గము కారణము. దీనికి వశీభూతుడనై ఇంతకాలమును ఉత్తమ మధ్యమాధమ స్థితులను వాని వ్యత్యాసమును కూడ గుర్తించలేకపోతిని. ఇంక మీదటకూడ నేను ఈ స్థితిలోనే ఇట్లుండజాలను. ఆ స్థిర స్థితికి పోవలెను. ఇంతకాలమును ఈ అపరాప్రకృతితో సహవాసముచే వంచితుడనై ఇట్లుంటిని. ఇక వంచితుడను కాజాలను. నేను వస్తుతః నిర్వికారుడను. వికారములను పొందితిని. ఇది ఈ అపరా ప్రకృతియొక్క అపరాధము కాదు. నా అపరాధమే. తాత్త్విక స్థితికి పరాఙ్ముఖుడనై ఈ మాయాకల్పిత సుఖములయందు ఆసక్తుడనైతిని. వాస్తవమున రూపములేని నేను బహురూపుడనై మమకార అహంకార అభిమానములకు వశుడనై యుంటిని. నిర్మముడనగు నేను మమకారవశుడనై ఆయా జన్మలయందు వికృతరూపుడనై తెలివిని కోల్పోయి అహంకారముతో సమత్వమును పొంది దానిని వదలుకొనలేకుంటిని. ఈ అపరా ప్రకృతి తన్ను బహురూపములతో పరిణమింపజేసికొని ఇంకను నన్ను తనలో మునిగి ఉండునట్లు అజ్ఞాపించుచున్నది. నేనామె ఆజ్ఞను పాటించను. ఇప్పటికి నా తప్పు తెలిసినది. నేను అహంమమకార రహితుడను. మమకారముకూడ అహంకార జనితము. ఈ రెంటిని విడిచి నిరామయతా స్థితిని పొందుదును. కాని ప్రతిబోధ రహితమగు ఈ అపరా ప్రకృతిని ఆశ్రయించి యున్నంత వరకు నేను ఈ పరమార్ధతత్త్వముతో సామ్యమును పొంది ముక్తుడను కాజాలను. కనుక నేను అందులకై మొదట ఈ అహంతత్త్వముతో సామ్య సహవాసములను విడిచెదను. ఈమెతో కూడి ఉన్నంత వరకు నాకు క్షేమము కలుగదు. అనియిట్లు ప్రతిబుద్ధుడై క్షరత్వ-వ్యక్తత్వ-సగుణత్వ-స్థితులను వదలి అక్షరత్వ-అవ్యక్తత్వ-నిర్గుణత్వ-స్థితికి చేరును.

ఓ జనక మహారాజా! నీకు ఇట్లు క్షరాక్షరతత్త్వ వివేచన ప్రకారమును ప్రతిపాదించి తిని. ఇది సంశయ రహితము. విమలము-విశుద్ధము-సూక్ష్మము. పరంపరాగతమగు-సంప్రదాయ సిద్ధమైన-మఱియొక అంశము చెప్పెదను. వినుము-సాంఖ్యము యోగము అను రెండు దర్శనములను నీకు తెలిపితినికదా. వానిలో సాంఖ్యమే యోగము. యోగమే సాంఖ్యము. సాంఖ్య దర్శనము శిష్యుల-ముముక్షువుల హితమునుకోరి తత్త్వమును విస్పష్టముగా వివేచించి ప్రతిపాదించును. విద్వాంసులగువారు ఈ శాస్త్రము చాల గొప్పది అని చెప్పుదురు. ఈ శాస్త్రములో ప్రతిపాదించిన విషయమునే యోగ దర్శనమున పునర్భవ పురఃసరముగా-అనగా అనుభవ పూర్వకముగా అందుకొను విధానము అధ్యయనము చేయబడుచున్నది.

ఇంతవరకును సాంఖ్యుల పరమార్థతత్త్వ వివేచన ప్రకారము శాస్త్ర ప్రమాణానుసారము అనువర్ణించితిని. బుద్ధము-అప్రతిబుద్ధము; అక్షరము-క్షరము-ఈ రెండును వీటికి రెంటికి నడుమనున్న బుధ్యమానము అను మూడు తత్త్వములును సాంఖ్య దర్శనమున వివేచించబడును. బుద్ధము-అనగా బోధాత్మకమగు పరమార్థతత్త్వము. అప్రతి బుద్ధమనగా అపరా ప్రకృతికి మూలమగు మాయాతత్త్వము. బుధ్యమాన మనగా ముముక్షుని శ్రవణమననాది విచారణావస్థయును ఆత్మ దర్శనమును కోరి యోగసాధన చేయు దశయును. యోగ దర్శనమునందు బుధ్యమానత్వ బుద్ధత్వ దశలు మాత్రము అనుభవ దశలో ప్రతిపాదింపబడును. (244)