కేశివధ నిరూపణమ్

వ్యాసులు అనిరి -

అరిష్ట ధేనుకాది రాక్షసులు హతులుకాగా గోవర్ధనోద్ధరణము జరిగిన తరువాత, నారదుడు కంసుని సమీపమునకుపోయి, అతనికి యశోదా గర్భము మార్పు మొదలైన విశేషములు అశేషముగా నివేదించెను. అదివిని కంసుడు వసుదేవునిపై పగబట్టెను. యాదవ సభలో అతడు యాదవులను దుయ్యబట్టి తనలో ఇట్లు ఆలోచించెను.

బాలురైన బలరామకృష్ణులను బలవంతులు కాకుండనే నేను వధింపవలయును. యౌవన మొందిన తరువాత వారు అసాధ్యులు అయ్యెదరు. ఇక్కడ చాణూరుడు ముష్టికుడును మంచి బలశాలురు. వీరితో ఆ బాలురకు మల్లయుద్ధము పెట్టి ఆ దుర్మార్గులను చంపెదను గాక! ధనుర్యాగమను మిషపెట్టి వ్రేపల్లెనుండి వారల రావించి వారు కడతేఱుటకు ఎట్లెట్లు చేయవలెనో అట్లు చేసెదను అనితలచి, ఆదుష్టుడు ఒక నిశ్చయమునకు వచ్చి అక్రూరునితో ఇట్లు అనెను.

ఓ దానవేశ! నా ప్రీతి కొఱకు నీవిట నుండి రథమెక్కి గోకుల మేగుము. హరి అంశమున బుట్టిన వసుదేవుని కొడుకులను గైకొనిరమ్ము. వారలు నా చావునకు పుట్టి పెరుగుచున్నారు. ఈ చతుర్దశినాడు ధనురుత్సవమను మహాయాగము జరుగగలదు. అందు మల్లయుద్ధమునకై ఏర్పాటు జరుగును. నాకడ చాణూర ముష్టికులను మల్లురు యుద్ధ కుశలురు. వారలతో ఈ బలరామ కృష్ణులకు జరుగు యుద్ధమును సర్వలోకము చూచుగాక! మావటీండ్రకెల్ల మేటియైన వానిచే కువలయాపీడమను ఏనుగు తోలబడుటచే, ఆఇద్దఱు శిశువులను మట్టుపెట్టగలదు. వారిని చంపి వసుదేవుని, నందుని కూల్చి, నా తండ్రి దుష్టుడగు ఉగ్రసేనుని చంపెదను. అటుపై గోపాలుర గోధనములను కొల్లగొట్టె దను. వారు నాకు శత్రువులు. నీవుతప్ప ఈ యాదవులందరు పరమదుష్టులు. నాకు గిట్టరు. ఈ అందఱను కూడ చంపుటకు క్రమముగ నీతో నేను ప్రయత్నించెదను. ఆ గొల్లలు గేదెనెయ్యి, పెరుగును కాన్కగకొని నీ వెంబడి వచ్చునట్లు నీ వట్లట్ల నచ్చచెప్పుము అని ఇట్లు ఆజ్ఞాపించబడి మహాభాగవతుడు (భక్తాగ్రేసరుడు) మధు ప్రియుడు, (మద్య ప్రియుడు) అగు అక్రూరుడు అట్లేయని కంసరాజునకు తెల్పి, మధురాపురము నుండి బయలు వెడలెను.

తరువాత కంసుని వాహనమగు గుఱ్ఱము రూపముగల కేశియనువాడు కంస ప్రేరితుడై కృష్ణుని చంపనెంచి, బృందావనమునకు వచ్చెను. వాడు కాలిడెక్కలచే ధరణి తలమునగల దుమ్ము చిమ్ముచు, జూలు విదిలించి మేఘముల చెదరగొట్టుచు, చంద్ర సూర్య మార్గము ఆక్రమించి గోపకుల వద్దకు ఏతెంచెను. వాని సకిలింపునువిని, గోపాలురు గోపికలు భయమున బెదరిపోయి గోవిందుని త్రాహి త్రాహి (రక్షింపు రక్షింపుము) అని శరణొందిరి. అదివిని జలములతో ఉన్న మేఘము యొక్క గర్జనమట్ల గంభీరముగ హరి ఇట్లు పల్కెను. “గోపకులార జడియ వలదు. గోపజాతి పరాక్రమము లోపమగును. అల్పబలము రాక్షస బలభారముచే చిందులు ద్రొక్కుచు సకిలించుచున్న ఈ పాడు గుఱ్ఱమువలన ఏమగును”. అని “ఓ క్రూర! రా! రా! నేను కృష్ణుడను. పినాకపాణి (శివుని) చేత పూషుని (సూర్యుని) పండ్లెల్ల ఊడ గొట్టబడిన విధముగా మీ పండ్లెల్ల ఊడ గొట్టెదను అని కృష్ణుడు వాని కెదురు నడచెను”. వాడును నోరుతెఱచి హరిపై కెగబడెను. కృష్ణుడు తన నిండుభుజమును వాని నోటిలో దూర్చెను. దాన, వాని పండ్లెల్ల తెలిమేఘవు తునుకలవలె ఊడి రాలిపోయెను. కృష్ణ బాహువులోన కేగిన కొలది బంధువులు ఉపేక్షింప పెఱిగిన వ్యాధివలె ఊరక పెరిగి, దవడలు బ్రద్దలై నురుగులతోడి రక్తము గ్రక్కికొని వాడు నెలవులు విచ్చి, కీలుకలు ఊడి పడి పాదములు చాచి విణ్మూత్రములు విడుచుచు పుడమిపై బను. మఱియు ముచ్చెమటలు పోసి, చచ్చువడి చేష్టలు దక్కెను. హరి బాహువుచే నోరు విచ్చిపోవ, మహా రౌద్రాకారియగు వాడు పిడుగువడిన చెట్టువలె బెండై రెండై కూలెను. రెండుపాదములు, పిరుదుతోక రెండుగానై చెవి కన్ను ముక్కు ఒక్కటివంతుననై, మొత్తము శరీరము రెండు ముక్కలై వాడు కూలబడెను. కృష్ణుడు ఇట్లు కేశిసంహారము చేయ సంతోషపడిన గోపకులతో గూడుకొని శరీరమించుకయు ఆయాస పడకుండ స్వస్థుడై నవ్వుచు, అచ్చటనే ఉండెను. గోపికలును గోపకులును కేశి హతుడగుట చూచి వింతబడి ఆ అనురాగ మనోహరముగ పుండరీకాక్షుని కొనియాడిరి. కేశి హతుడగుటచూచి నారదుడంత మేఘముల నుండి వెలువడి వేవేగ వచ్చి మనసు ఆనందభరితముకాగా కృష్ణుని ఇట్లు కొనియాడెను. “బాగు బాగు జగన్నాథ స్వర్గ వాసులకు పీడగల్గించు కేశిని, లీలామాత్రముగ చంపితివి. ఈ అవతారమున నీవు చేసిన లీలలు అద్భుతములు. దీనికి నామనసు ఆశ్చర్యమును ఆనందమును చెందినది. ఇంద్రుడు దేవతలును ఈ హయాసురునకు హడలి పోవుదురు. వీడు విదిలించి సకిలించుచు ఆకాశమువంకకు చూచిన వానినిజూచి దేవతలు హడలెత్తి పోవుదురు. కేశవధ చేసినందున లోకమందు నీవు కేశి నామమున కీర్తింపబడుదువు. నీకు మంగళమగుగాక. వెళ్ళుచున్నాను. కంసునితోడి యుద్ధమున ఎల్లుండి నిన్ను కలిసికొందును. ఉగ్రసేనుని కొడుకు కంసుడు సపరివారముగ కూలగనే, నీవు పృథివీ భారమును తొలగించినవాడవు అగుదువు. అక్కడ రాజులతోడి యుద్ధములు అనేకములు నాకు దర్శనీయము కాగలవు. ఓ జనార్దన! గోవింద! నేను వెళ్ళివచ్చెదను. దేవకార్యము చాల గొప్పగ జరుపబడినది. నీచే నేను గౌరవింప బడితిని. నీకు శుభమగుగాక” అని నారదుడు వెళ్ళగా, తమ నయనములచే తనలీలా సౌందర్యపానము చేయు గోపికలుగల గోకులమున కృష్ణుడు గోపకులతో ప్రవేశము చేసెను. (189)