బ్రహ్మ మహా పురాణము
బ్రహ్మపురాణ ప్రశంస-ఫలశ్రుతి
రోమహర్షణుడు మునులతో ఇట్లు పలికెను:
ఓ బ్రాహ్మణులారా! పూర్వము మహామతియగు వ్యాసమహాముని శాస్త్రమునందు చెప్పబడినవియు ఉచ్చారణమునకు సంబంధించినవియు (వ్యాకరణ భాష్యమునందు చెప్పబడి ఉన్నవి). అగు పదునెనిమిది దోషములు లేనివియు మిగుల సారభూతములును దోషములు లేనివియు శుద్ధములును అనేక శాస్త్ర సముదాయ రూపములును అయిన వాక్యములతో నిండినదియు స్వభావము చేతనే శుద్ధమగు విషయ సమాయోజనముతో కూడినదియు సాధువులగు-వ్యాకరణ విరుద్ధములును శిష్టులకు అసమ్మతములును కాని-శబ్దములతో ఉపశోభితమును పూర్వపక్ష వచనములతో సిద్ధాంత వ్యవస్థాపనముతో కూడినదియు అగు ఈ బ్రహ్మపురాణమును శాస్త్ర న్యాయానుసారముగ నుండునట్లు మృదువగు వాక్కుతో వినిపించి ముగించెను. ఆ ముని శ్రేష్ఠులును వేదములతో సమానమును సర్వవాంఛా ఫలప్రదమును ఆద్యమును అగు బ్రహ్మ పురాణమును విని హర్షమును ప్రీతిని ఆశ్చర్యమును పొందినవారై కృష్ణద్వైపాయన వ్యాసమహామునిని మరల మరల ప్రశంసించిరి.
మునులు వ్యాసుని ప్రశంసించిన విధము:
ఎంత ఆశ్చర్యమిది! ఓ మునిశ్రేష్ఠా! మీరు వేదములతో సమానమును సర్వాభీష్ట ఫలప్రదమును సర్వ పాపహరమును ఉత్తమమును విచిత్ర పదములతో అక్షరములతో కూర్చబడినదియు అగు పురాణమును ప్రవచింపగా మేము వింటిమి. ఓ ప్రభూ! త్రిలోకముల యందును మీకు తెలియనిది ఏదియులేదు. మీరు దేవతలలో బృహస్పతి వంటివారు. ఓ మహాభాగా! తాము సర్వజ్ఞులు. మహా ప్రాజ్ఞులును బ్రహ్మ తత్త్వజ్ఞులలో శ్రేష్ఠులును మహామునియునగు మీకు నమస్కరించుచున్నాము. తాము భారతము నందు వేదములందు ప్రతిపాదింపబడిన విషయములను అనేకములను ప్రతిపాదించితిరి. ఓ మహామునీ! తాము ప్రతిపాదించిన సర్వగుణములను ఎవరు చెప్పగలరు? షడంగములతో కూడ వేదములను నాల్గింటిని వ్యాకరణములను అధ్యయనముచేసి భారతమును రచించిన జ్ఞానస్వరూపుడగు వ్యాసునకు నమస్కారము. భారతమను తైలముతో నింపబడిన జ్ఞానమయమగు ప్రదీపమును వెలిగించిన వాడవును, విశాలబుద్ధి కలవాడవును వికసించిన పద్మముల ఱేకులవలె విశాలములగు కన్నులు కలవాడవును అగు ఓ వ్యాసా! నీకు నమస్కారము. అజ్ఞానమను తిమిరముచే గ్రుడ్డివారై కుదృష్ణులచే భ్రాంతి నొందింపబడిన వారి నేత్రములను జ్ఞానమను కాటుకతో కూడిన శలాకతో మీరు విప్పారించితిరి” అని వారందరును ఇట్లు పలికి వ్యాసుని పూజించి కృతార్థులై తాము తాము వచ్చిన మార్గముల తమ తమ ఆశ్రమములకు వెళ్ళిరి.
ఓ ముని శ్రేష్ఠులారా! సనాతనమును-శాశ్వతములగు ధర్మములను ప్రతిపాదించు నదియు-సర్వపాప ప్రణాశనమును మహాపుణ్య ప్రదమును అగు ఈ పురాణమును మీకు చెప్పితిని. మీరు అడిగిన ప్రశ్నముల ననుసరించి దానికి అంతటికిని సమాధానమును వ్యాసుని అనుగ్రహమువలన ప్రతిపాదించితిని.
ఇది బ్రహ్మచారులును గృహస్థులును యతులును కూడ శ్రవణము చేయదగినది. పవిత్రము. నరులకు ధనసౌఖ్యప్రదము; పాపనాశనము. బ్రహ్మతత్త్వము నెరుగగోరిన బ్రాహ్మణాది వర్ణములవారందరును శ్రేయోZభికాంక్షులగువారును ప్రయత్నముతో లెస్సగా దీనిని వినవలెను. అందువలన బ్రాహ్మణుడు విద్యను క్షత్రియుడు రణమున విజయమును వైశ్యుడక్షయ ధనమును శూద్రుడు సుఖమును పొందును. పురుషుడు శుచి మనస్కుడై ఏఏకోరికను అభిధ్యానించుచు ఈపురాణమును వినునో ఆ కోరికనెల్ల పొందును. అందు సందేహము లేదు. ఈ పురాణము విష్ణుని పరమ దైతముగా ప్రతిపాదించునది. సర్వపాప నాశనము. పురుషార్థముల నన్నింటిని సంపాదింపజేయునది. అన్ని శాస్త్రముల కంటె విశిష్ట మయినది. నేను మీకు వినిపించిన వేదసంమీతమగు ఈ పురాణము వినినవారికి సర్వదోషముల వలన కలిగిన పాపరాశియు నశించును. ప్రయాగ పుష్కర కురుక్షేత్రార్బుద క్షేత్రములందు ఉపవసించుట వలన కలుగు పుణ్యము కలుగును. నరుడు సంవత్సరము పాటు అగ్ని హోత్రమును చక్కగ వేల్చుటవలన కలుగు సుమహాపుణ్యము కలుగును. జ్యేష్ఠకు శుక్లైకాదశినాడు మధురలో యమునా జలమున స్నానముచేసి శ్రీకృష్ణుని దర్శించుటచే కలుగు ఫలము కలుగును. కేశవునియందు మనస్సు అర్పించి నిలిపి-సరియగు మనస్సమాధానముతో హరికీర్తనము చేయుటచే కలుగు ఫలము ఈ పురాణశ్రవణము నందు(ని)హితమై-నిలుపబడి యున్నది. దీని శ్రవణము వలన యజ్ఞక్రియా దర్శనముచే కలుగు ఫలము కలుగును. వేదసదృశమగు ఈ పురాణమును పఠించినను విన్నను అతడు విష్ణులోకమునకు ఏగును. ఏకాదశి ద్వాదశి వంటి పర్వదినములందు శుచియై బ్రాహ్మణులచే ఈ పురాణమును వినిపించిన-వినిపించుకొనిన-వారు విష్ణు లోకమునకు పోవుదురు. ఇది యశమును ఆయువును సుఖమును కీర్తిని బలమును పుష్టిని కలిగించును. ధన్యునిగా చేయును. దుఃస్వప్నముల నశింపజేయును. చక్కని మనస్సమాధానముతో శ్రద్ధతో ఈ శ్రేష్ఠమగు ఆఖ్యానమును వినినవారు సర్వములగు ఈప్సితములను పొందుదురు. రోగార్తుడు రోగము నుండి బద్ధుడు బంధనము నుండి బీతుడు భయము నుండి ఆపన్నుడు ఆపదల నుండి విముక్తుడగును. నరుడు పూర్వజన్మ స్మృతిని విద్యను పుత్రులను మేధను పశువులను ధైర్యమును ధర్మార్థ కామ మోక్షములను ఇంతయే కాదు ప్రయతమగు, శుచియగు, మనస్సుతో ఏకోరికలను సంకల్పించి వినునో ఆ కోరికలనెల్ల పొందును. అందు సందేహమే లేదు. స్వర్గమోక్షప్రదుడును లోకములకు గురుడును (తల్లి తండ్రి విద్యను ఉపదేశించిన వాడు హితమును ఉపదేశించువాడు ఇట్టివారు గురువులు అనబడుదురు), వరములను ఇచ్చువాడునగు విష్ణునికి నమస్కరించి భక్తియుక్తమగు ఏకచిత్తముతో శుచియై ఈ పురాణమును నిరతమును వినువారు సమస్త పాపములను నశింప జేసికొని ఇహలోకమున సమస్త సుఖములను అనుభవించి స్వర్గమున దివ్యసుఖమును పొంది, కడపట ఈ ప్రకృతి జన్యములగు గుణములనుండి విడుదల పొంది, ముక్తులై మిగుల విమలమగు శ్రీహరి స్థానమును చేరుదురు. అందువలన స్వధర్మ నిరతులును ముక్తిమార్గమును మాత్రమే కోరువారును అగు బ్రాహ్మణ శ్రేష్ఠులును, నియమపరులును, శాశ్వత శ్రేయస్సును కోరువారునగు క్షత్రియ పుంగవులును, విశుద్ధ వంశమున జన్మించిన వైశ్యులును, ధార్మికులగు శూద్రులును, ఉత్తమమును బహుఫలప్రదమును ధర్మార్థమోక్ష ప్రదమునగు ఈ పురాణమును అనుదినమును వినవలయును.
పురుషోత్తములగు మీకందరకును ధర్మమునందు బుద్ధి స్థిరమగు గాక! పరలోకమునకు మీరు ఏగినప్పుడు మీకు బంధువు అది ఒక్కటియే. అర్థ కామములను రెండు పురుషార్థములను మీరు ఎంత జాగరూకులై సేవించినను, అవి మీ పై సత్ఫలమును చూప జాలవు. వాని ఫలములు స్థిరములై ఉండవు.
ధర్మముచే నరుడు రాజ్యమును స్వర్గమును ఆయువును కీర్తిని తపస్సును దానిచే మోక్షమును పొందును. ఇహమునను పరలోకమునను ధర్మము తప్ప మఱింకేదియులేదు అగును. ధర్మమే తల్లి దండ్రులును, మిత్రుడును, రక్షకుడును, మోక్ష ప్రదమును.
ఈ పురాణము రహస్యము, శ్రేష్ఠమును, వేదములతో సమానమును, బుద్ధి దోషము కలవానికిని-విశేషించి నాస్తికునకును-ఇంద్రియ గోచరముకానిది ఏదియు నమ్మ తగినది కాదనువానికిని-దీనిని అందించరాదు.
ఇదం మయోక్తం ప్రవరం పురాణం
పాపాపహం ధర్మవివర్ధనంచ
శ్రుతం భవద్భిః పరమం రహస్యమ్
ఆజ్ఞాపయధ్వం మునయో వ్రజామి
శ్రేష్ఠమును పాపనాశకమును, ధర్మమును వృద్ధి చేయునదియు అగు ఈ పురాణమును నేను ప్రవచించితిని. పరమ రహస్యమగు దీనిని మీరు వింటిరి. అయ్యా! పోయి వచ్చెదను. ఆజ్ఞ ఇండు అని లోమహహర్షణుడు సెలవు తీసుకొనెను.
ఆది బాహ్మ పురాణము సమాప్తము.