కారుణ్యస్తవము

ఇంద్రద్యుమ్నుడు పురుషోత్తమ దేవుని స్తుతించుట- వాసుదేవా! మోక్షకారణ! జన్మసంసార సాగరమునుండి రక్షింపుము. అచ్చమైన ఆకాశమువంటి వాడవు. నిర్లేపుడవు. (గుణసంగములేని వాడవు)

వాసుదేవ! నమస్తేZస్తు నమస్తే మోక్షకారణ |

త్రాహిమాం సర్వలోకేశ జన్మసంసార సాగరాత్ ||

నిర్మలాంబర సంకాశ నమస్తే పురుషోత్తమ |

సంకర్షణ నమస్తేZస్తు త్రాహిమాం ధరణీధరా ||

నమస్తే హేమగర్భాభ నమస్తే మకరధ్వజ |

రతికాంత నమస్తేZస్తు త్రాహిమాం సంవరాంతక ||

నమస్తేZ జన సంకాశ నమస్తే భక్తవత్సల |

అనిరుద్ధ నమస్తేZస్తు త్రాహిమాం వరదో భవ ||

నమస్తే విబుధావాస నమమ్తే విబుధప్రియ |

నారాయణ నమస్తేZస్తు త్రాహిమాం శరణాగతమ్ ||

నమస్తే బలినాం శ్రేష్ఠ నమస్తే లాంగలాయుధ |

చతుర్ముఖ జగద్ధామ త్రాహిమాం ప్రపితామహ ||

నమస్తే నీలమేఘాభ నమస్తే త్రిదశార్చిత |

త్రాహి విష్ణో జగన్నాథ మగ్న మాం భవసాగరే ||

ప్రళయానల సంకాశ నమస్తే దితిజాంతక |

నరసింహ మహావీర్య త్రాహిమాం దీప్తలోచన ||

యథా రసాతలాదుర్వీ త్వయా దంష్ట్రోద్ధృతా పురా |

తథా మహావరాహస్త్వం త్రాహిమాం దుఃఖసాగరాత్ ||

తవైతా మూర్తయః కృష్ణ వరదాః సంస్తుతా మయా |

తవేమే బలదేవాద్యాః పృథగ్రూపేణ సంస్థితాః ||

అంగాని తవ దేవేశ గరుడ్మాద్యా స్తథా ప్రభో |

దిక్పాలాః సాయుధాశ్చైవ కేశవాద్యా స్తథాZచ్యుత ||

బలరామాది వివిధ మూర్తులన్నియు నీవే. వేఱువేఱుగా అనిపించుచున్నవి. గరుడుడు శంఖచక్రాదులు దిక్పాలురు కేశవాది రూపములు అన్నియు నీ అవయవములే.

జగన్నాథ! నీ ఆ స్వరూపము అను అన్నింటిని అర్చించితిని. నీ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్నాది మూర్తులను నేను కీర్తించితిని. నిన్ను ఏకరూపుని భిన్నరూపుల పేర్కొందురు. ఔపచారికము, అద్వైతుడవైన (ఏకైకవస్తువైన) నిన్నుద్వైతునిగా బేర్కొనుట ఎట్లు పొసగును?

హరీ! నీవు చిత్స్వరూపమున (కేవలము జ్ఞానమై) ఒక్కడివై సర్వము వ్యాపించి ఉన్నావు. నీ పరమ రూపము భావాభావ వర్జితము. ఉనికి మనుకులు లేనిది. కూటస్థము సర్వసాక్షి అచలము ధ్రువము. నామరూపములు గలదానికి ఉపాధియని పేరు. నీ రూపము ఉపాధి విడిచినది. కేవలము సత్తామాత్రము. దానిని దేవతలే ఎఱుగరు. నేనెట్లెఱుంగుదును? పీతాంబరధారి చతుర్భుజము. శంఖచక్రగదాపాణి కిరీటము భుజకీర్తులు ధరించిన శ్రీవత్సవక్షము వనమాలా భూషితమునైన నీ మఱొక మూర్తిని (అర్చామూర్తిని) దేవతలు నీ భక్తులు అర్చింతురు. ప్రభూ రక్షింపుము. నేను శరణు పొందుటకు నీకంటె మఱియొక్కని కానను. కర్మపాశబద్ధుడనై సంసార సాగరమున బడి కొట్టుకొను మాయా మోహమున బడిన వానినైన నన్ను ఉద్ధరింపుము.

నానాయోనులందు పుట్టి, నానాకష్ట సుఖములను అనుభవించితిని. సాంగములైన వేదములను, శాస్త్రములను చదివితిని. కళలను, శిల్పములను నేర్చితిని. సుఖాలు, దుఃఖాలు ఎన్నింటినో అనుభవించితిని. సంతోష, అసంతోషములు, సంచయ అపచయములు (కూడ బెట్టుట పోగొట్టుట), పుత్ర, మిత్ర, కళత్రాదులు, తల్లిదండ్రులు, అన్నదమ్ముల కలయికలు, ఎడబాటులెన్నో నాకైనవి. విణ్మూత్రముల (మల మూత్రముల) రొంపిలో (ఆడుదాని గర్భములో) నే ఇరికికొన్నాను. మహాదుఃఖములు అందినాను. బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యాది దశలందు అంతులేని వంతలొందినాను. మరణమంది యమ మార్గమున, నరకమందు పలుయాతనలు పడినాను. క్రిమి, కీటకాదులు, పలుమృగములు, పక్షులు, పలుపశువులు, బ్రాహ్మణాది, శూద్రాంత యోనులందు, ధనికులు, దరిద్రులు, రాజులు, రాజర్షులు, రాజసేవకులు మఱి పెక్కు దేహుల గేహములందు మఱలమఱల పుట్టితిని, గిట్టితిని. పెక్కుమంది దాసులకు దాసుడనైతిని. దరిద్రుడనైతిని. రాజులకు రాజనైతిని. భిక్షులకు భిక్షకుడైతిని. ఒరులకు నేనిచ్చితిని. ఒరులకడ దీనుడనై నేను చెయి సాచితిని. ఒరులచే కష్టములు పడితిని. నాచే ఒరులెందఱో పడిరి. తండ్రులు, తాతలు, మిత్రులు, భ్రాతలు, పుత్రులు, కళత్రముల కొఱకు సిగ్గువిడిచి దైన్యము వెళ్లబోసికొన్నాను. పశు పక్ష్యాదులలో చరాచర ప్రపంచమునందు దిగులుగుడిచి నేను పోయి ఈడిగిలబడని చోటన్నది లేనేలేదు. నరకమెప్పుడో, స్వర్గ మెప్పుడో, వసుధ యెప్పుడో, పశు పక్ష్యాదులందు ఎప్పుడో, నా ఉనికి యెపుడు ఎక్కడో ఎరుగను. నీరు తోడు యంత్ర చక్రమున త్రాటితో గట్టిబడిన ఒకమారు క్రిందికి ఒకపరి మీదికి, ఒకపరి నడిమికి వచ్చిన విధముగా భైరవమైన ఈ సంసార చక్రమున చిరకాలము పరిభ్రమించుచున్నాను. ఈ తిఱుగుడున అంతుగానక ఉన్నాను. ఇంద్రియములు వ్యాకులములై ఇప్పుడు నేనేమి సేయవలెనో తెలియకున్నాను. శోకము, తృష్ణకు (ఆశకు) చిక్కి నేను మతిపోయి కాందిశీకుడనై (భ్రాంతుడనై= భయముచే అట్టిట్టు పరుగులెత్తువాడనై) దేవా! ఇప్పుడు నేను విహ్వలుడనై (తపనచే అవయవములు పట్టుతప్పి) బెగ్గలించుచు మ్రగ్గుచు విరవిర పోవుచు విలవిల తన్నుకొనుచు నిన్ను శరణందుచున్నాను. కృష్ణా! సంసారమందు మునిగిపోయిన నన్ను కాపాడుము. జగన్నాథ నన్ను భక్తుడని అనుకొందువేని నాయెడ దయ చూపుము. నన్ను గురించి ఆలోచించు బంధువు నీకంటె నాకు లేదు. నిన్ను నా నాథునిగ (దిక్కుగ) పొంది తిని. మఱి నాకు ఎక్కడను బ్రతుకున చావున యోగమున క్షేమమున ఏమ్రగ్గుచు విరవిర పోవుచు భయముండదు. జగద్ధాతయైన కేశవునందు భక్తి కలుగని వారికి నిన్ను యథావిధిగ సేవింపనివారికి నరాధములకు సంసార బంధమునుండి సుగతి (విముక్తి) ఎట్లుకలుగును.

కులముతో, శీలముతో, విద్యతో, బ్రతుకుతో పనిఏమి? ఎవరు మోహవశులై నిను నిందింతురో వారు అసుర ప్రకృతిలో నుండి మఱల మఱల పుట్టుచు ఘోర నరకమందు పడుచుందురు. నీ దూషణము చేయువారికి ఆనరకము కంటే వేఱు ప్రాయశ్చితములేదు. నా ప్రారబ్ధమును బట్టి ఎందెందు నాకు జన్మము గల్గునో అందందు నీయందు నాకు దృఢ భక్తి ఎల్లపుడు కల్గుగాక! నిన్నారాధించి సురాసురులు నరులును మనసు నిమిడించుకొని పరమసిద్ధిని పొందిరి. నిన్ను పూజింపని వాడు ఎవరు? బ్రహ్మాదులేని పొగడలేని ప్రకృతి కంటె పరుడైన నిన్ను మానుషబుద్ధిని నేను ఎక్కడ పొగడగలను. అయినను తెలియని తనముచే నాచేత వినుతుడనైతివి. నాయెడ దయగలదేని దీనికి నన్ను క్షమింపుము. సాధువులు మహానుభావులు అపరాధుల యెడ గూడ క్షమ సేయుదురు. భక్త వాత్సల్యము ననుసరించి దేవేశ్వర! నాయెడ బ్రసన్నుడవగుము. భక్తిభరిత చిత్తమున నుతించితినిగాన నా చేసిన పూజయెల్ల సాంగమగును గాక! వాసుదేవ! నమస్కారము.

అని ఇట్లు అతనిచే పొగడబడిన గరుడధ్వజుడు ప్రసన్నుడై, అతడు మనసార ఏది కోరిన అది ఎల్ల ఇచ్చెను. దినదినము ఎవ్వడు పూజించి హరి నీ స్తోత్రముచే వినుతించునో అతడు నిక్కముగ మోక్షమందును. ఈ స్తోత్ర వరమును ఎవ్వడు తెలిసి (అర్థమెఱిగి) త్రిసంధ్యము శుచియై జపించునో ఆ నరుడు ధర్మ, అర్థ, కామ, మోక్షములను బొందును. దీని జదివిన విన్న వినిపించిన యాతడు పాపములెడ బాసిశాశ్వతమైన విష్ణులోకమందును. ధన్యము, పాపహరము, భుక్తి, ముక్తిదము, శివము (మంగళము), గుహ్యము (రహస్యము), సుదుర్లభము, పుణ్యము అయిన ఈ స్తుతి ఎవ్వనికి బట్టిన వానికీయరాదు. నాస్తికుడు, మూర్ఖుడు, కృతఘ్నుడు, మాని (నేనే ఘనుడు అనుకొనువాడు), దురాలోచనుడు (దుష్టజ్ఞానము గలవాడు), అభక్తుడు అయిన వానికి ఎప్పుడును దీనిని ఈయరాదు. భక్తుడు, గుణవంతుడు, శీలవంతుడు, విష్ణుభక్తుడు, శాంతుడు, శ్రద్ధతో అనుష్ఠానము చేయువాడు అయిన వానికిది సర్వపాప విఘాతకము (సమస్త పాపములను పోగొట్టునది) సుఖ మోక్షదము, అశేషవాంఛా ఫలదము, వరిష్ఠము అయి ‘కారుణ్య’మను పేరుగల ఈ పురుషోత్తమ స్తోత్రమును నేను చెప్పితిని. విశుద్ధులు ఎవ్వరు అసూక్ష్మవస్తువైన మురారిని పురాణపురుషుని నిచ్చలు ధ్యానింతురో వారు ముక్తులై మంత్రములచే యజ్ఞాగ్నియందు హోమముచేయబడిన ఆజ్యమువలె హరిని ప్రవేశింతురు. ఆతడొక్కడే దైవము. సంసార దుఃఖహరుడు, పరుడు, పరాత్పరుడు, అంతకంటె మఱి ఒకడు లేరు.

ఆకృష్టుడు ద్రష్ట (సర్వసాక్షి), పాత (రక్షకుడు), నాశకర్త, సమస్త సారభూతుడు, జగద్గురువు, మోక్షసుఖ ప్రదాతయునగును. కృష్ణునందు, ఇహమందు ఎవరికి భక్తి కలుగదో వారికి విద్యచేనేమి? గుణముల చేనేమి యజ్ఞములను దానమును ఉగ్రతపములచే నేమి ప్రయోజనము? ఎవనికి బురుషోత్తమునందు భక్తి ఉండునో, అతడు లోకమందు ధన్యుడు. అతడు శుచి, అతడు విద్వాంసుడు. సుఖములతో, తపస్సులతో, గుణములతో అతడు శ్రేష్ఠుడు. జ్ఞాని, దాత, అతడే సత్యవక్త. (49)