బ్రహ్మ మహా పురాణము

244 - విద్యావిద్యయోః స్వరూప కథనమ్‌

వసిష్ఠుడు:

సాంఖ్యదర్శన మేతావ దుక్తం తే నృపసత్తమ

విద్యావిద్యే త్విదానీం మే త్వం నిబోధాను పూర్వశః

అభేద్య మాహు రవ్యక్తం సర్గప్రలయ ధర్మిణః

సర్గప్రలయ ఇత్యుక్తం విద్యావిద్యే చ వింశకః

పరస్పరస్య విద్యా వై త న్నిభో ధానుపూర్వశః

యథోక్త మృషిభి స్తాత సాంఖ్య స్యాతి నిదర్శనమ్‌

కర్మేంద్రియాణాం సర్వేషాం విద్యా బుద్ధీంద్రియం

స్మృతమ్‌ బు ద్దీంద్రియాణాం చ తథా విశేషా ఇతి నః స్మృతమ్‌

విషయాణాం మనస్తేషాం విద్యా మాహు ర్మనీషిణః

మనసః పంచభూతాని విద్యా ఇ త్యభిచక్షతే

అహంకరాస్తు భూతానాం పంచానాం నాత్ర సంశయః

అహంకార స్తథా విద్యా బుద్ధిర్విద్యా నరేశ్వర!

బుద్ధ్యాః ప్రకృతి రవ్యక్తం తత్త్వనాం పరమేశ్వర

విద్యా జ్ఞేయా నరశ్రేష్ఠ విధి శ్చ పరమః స్మృతః

అవ్యక్త మపరం ప్రాహు ర్విద్యా వై పంచవింశకః

సర్వస్య సర్వ మిత్యుక్తం జ్ఞేయజ్ఞానస్య పారగః

జ్ఞాన మవ్యక్త మి త్యుక్తం జ్ఞేయం వై పంచవింశకమ్‌

తథైవ జ్ఞాన మవ్యక్తం విజ్ఞాతా పంచవింశకః

విద్యావిద్యా - క్షరాక్షర - బుద్ధత్వా ప్రతిబుద్ధత్వ ప్రతిపాదనము

వసిష్ఠుడు:

ఓ నృపసత్తమా! ఇంత వరకును నీకు సాంఖ్య దర్శనమును తెలిపితిని. ఇక మీద విద్యావిద్యల తత్త్వమును క్రమా నుసారము తేలిపెదను. ఎఱుగుము. సృష్టి ప్రళయములు జనన మరణములు ధర్మములుగా నుండి సంసార చక్రము నందు సంసరించు వాడు అవ్యక్త తత్త్వమును వివేచించి తెలిసికొన జాలడు. ఒకదాని కంటె మఱి యొకటి ఉత్తరోత్తరము విద్యా రూపము అయినది. పైదాని కంటె ముందఱిది అవిద్యా రూప మయినది. విద్య అవిద్య అనుభేదము రెండు స్థూల స్థూలతర సూక్ష్మాసూక్ష్మతర తత్త్వముల నడుమ నుండెడి యోగ్యతా భేదముచే చేయు నిర్ణయము. ఇది సాంఖ్య తత్త్వవేత్తలు వివేచించి ప్రతిపాదించిన విషయము. ఎట్లనిన, వరుసగా 1.కర్మేంద్రియములు 2. జ్ఞానేంద్రియములు 3. పంచ తన్మాత్రలు లేదా విషయములు 4. మనస్సు (5. పంచభూతములు) 6. అహంకారము 7. బుద్ధి 8. అవ్యక్తము ఇవి వరుసగా ఒక దానికంటె మఱి యొకటి విద్యా రూప మయినవి. అనగా ఉత్తరోత్తరము సూక్ష్మతర మయినవి. అన్నిటి కంటె విద్యా రూపమయి నది పంచ వింశలి తమమగు పరమాత్మ తత్త్వము.

విద్యావిద్యే తు తత్త్వేన మ యోక్తే వై విశేషతః

అక్షరం చ క్షరం చైవ య దుక్తం త న్నిబోధ మే

ఉభా వేతౌ క్షరా వుక్తౌ ఉభా వేతా వన క్షరౌ

కారణం తు ప్రవక్ష్యామి యథా జ్ఞానం తు జ్ఞానతః

అనాదినిధనా వేతౌ ఉభా వే వేశ్వరౌ మతౌ

తత్త్వసంజ్ఞా వుభా వేవ ప్రోచ్యేతే జ్ఞాన చింతకైః

సర్గప్రలయ ధర్మిత్వా దవ్యక్తం ప్రాహు రవ్యయమ్‌

త దేత ద్గుణసర్గాయ వికుర్వాణం పునః పునః

గుణానాం మహదాదీనా ముత్పద్యతి పరస్పరమ్‌

అధిష్ఠానం క్షేత్ర మాహు రేత ద్వై పంచవింశకమ్‌

య దంతర్గుణజాలం తు త ద్వ్యక్తాత్మని సంక్షిపేత్‌

త దహం త ద్గుణౖ స్తత్తు పంచవింశే విలీయతే

గుణా గుణేషు లీయంతే త దేకా ప్రకృతి ర్భవేత్‌

క్షేత్రజ్ఞోపి తదా తావ త్క్షేత్రజ్ఞః సంప్రణీయతే

యదాక్షరం ప్రకృతి ర్యం గచ్ఛతే గుణసంజ్ఞితా

నిర్గుణత్వం చ వై దేహే గుణేషు పరివర్తనాత్‌

ఏవ మేవ చ క్షేత్రజ్ఞః క్షేత్రజ్ఞాన పరిక్షయాత్‌

 ప్రకృత్యా నిర్గుణ స్త్వేష ఇత్యేవ మనుశుశ్రుమ

క్షరో భవ త్వేష యదా గుణవతీ గుణే ష్వథ

ప్రకృతిం త్వథ జానాతి నిర్గుణత్వం త థాత్మనః

తథా విశుద్ధో భవతి ప్రకృతేః పరివర్జనాత్‌

అన్యోహ మన్యేయ మితియదా బుద్ధ్యతి బుద్ధిమాన్‌

త దైషోవ్యథతా మేతి న చ మిశ్ర త్వ మావ్రజేత్‌

ప్రకృత్యా చైష రాజేంద్ర మిశ్రోన్యో న్యస్యదృశ్యతే

యదా తు గుణజాలం త త్ర్పాకృతం విజుగుప్సతే

పశ్యతే చ పరం పశ్యం స్తదా పశ్య న్ను సంసృజేత్‌

ఇక క్షరాక్షర తత్త్వమును తెలిపెదను, వివేచించగా వ్యక్తము అవ్యక్తము అను రెండును క్షరములే. అవి రెండును అక్షరములే. ఇది కొంత సంశయ జనకము గాను విచిత్రము గాను కనబడి నను రెండును క్షరమును అక్షరమును అగు ననుటకు హేతువు ఏమో సాంఖ్య దర్శన వివేచ నానుసారము ప్రతిపాదింతును. వాస్తవ స్థితిలో రెండును ఆదియు నాశమును లేనివే. రెండును సర్వశక్తి మంతము లగు ఈశ్వర తత్త్వములే. రెండును పరమార్థ తత్త్వములే. ఎట్లన పంచ వింశకత్త్వము అనబడు పరమార్థ తత్త్వము సృష్టి, ప్రళయ, జనన మరణ, రూప సంసార ప్రవృత్తికై మొదట అవ్యక్తమై క్రమముగా మహదాదిగా భూత భౌతిక సృష్టి వరకు తన్ను తానే మాయా వశమున పరిణమింప జేసికొని ఇట్టి తనలో సృష్టి కాలమున తాను ప్రవేశించుచు ప్రళయ కాలమున ఈ వ్యక్త సంసార రూప మగు తన్నే తనలో లయము చేసికొనుచు ఉన్నది. వరమార్థమున ఇవి యన్నియు అఖండ ఏకైక తత్త్వమే కదా! ఒకే ప్రకృతియే కదా! కనుక వ్యవహారమున మాత్రమే అపరాప్రకృతి, పరాప్రకృతి. క్షరము, అక్షరము అను భేదము. వస్తవ స్థితిలో రెండును క్షరములే, రెండును అక్షరములే. అనగా అక్షర తత్త్వము తన్ను తాను క్షర రూపమున పరిణమింప జేసికొని తన రూపాంతరమే అగు జడ దేహమున తాను ప్రవేశించి ఉపాధిచే తానును క్షరుని వంటి వాడై అహ మను అభిమానముతో కర్తయై భోక్తయై సుఖియై దుఃఖియై వీటికి భయపడి విరక్తుడై ముముక్షువై జ్ఞాతయగు చున్నాడు. అప్పుడు ఈ భ్రాంతి కల్పిత క్షర తత్త్వమును దృష్టిలో ఉంచు కొనగా అక్షర తత్త్వము జ్ఞేయ మగును. ఈ జ్ఞాతయగు క్షర సదృశ తత్త్వము ముక్తు డయినపుడు ఈతడు జ్ఞాతయు కాక జ్ఞేయమును కాక త్రిపుటి లోని జ్ఞాధాత్వర్థ రూపమైన జ్ఞానమును కాక వీట న్నిటికిని అతీతమగు చిద్రూపి జ్ఞాన తత్త్వమగు చున్నాడు. కనుక ఈ వివేచనము ననుసరించి ఏది యవ్యక్తము? ఏది వ్యక్తము? ఏది క్షరము? ఏది అక్షరము? అంతయు క్షరమే. అంతయు అక్షరమే. అంతయు వ్యక్తమే. అంతయు అవ్యక్తమే. అక్షరుడే మాయా వశమున క్షరుడై సగుణుడై నపుడు క్రమముగా సంసార విషయములపై నిర్వేదము చెంది విరక్తుడై సాంఖ్య వివేచనముచే తాను నిర్గుణుడ ననియు తాను పరాప్రకృతియే యనియు ఎరుగును. అపుడు అపరా ప్రకృతి స్థితిని విడిచి శుద్ధు డగును. అప్పుడు ఇతనికి ఏ దుఃఖములును ఉండవు. కేవలము సుఖ, ఆనంద, శుద్ధ స్వరూపుడగు చున్నాడు. సుఖ దుఃఖ మిశ్ర స్వరూపము తొలగు చున్నది. సంసారమున సంసరించ వలసిన బంధము దూరమగు చున్నది.

కిం మయా కృత మేతావ ద్యోహం కాల నిమజ్జనః

యథామత్స్యో హ్యభిజ్ఞానా దనువర్తితవాన్జజలమ్‌

అహ మేవ హి సంమోహా దన్య మన్యం జనా జ్జనమ్‌

మత్స్యో య థోదకజ్ఞానా దనువర్తితవా నిహ

మత్స్యోన్యత్వ మథాజ్ఞానా దుదకా న్నాభిమన్యతే

ఆత్మానం త దవజ్ఞానా దన్యం చైవ న వే ద్మ్యహమ్‌

మమాస్తు ధి క్కుబుద్ధస్య యోహం మగ్న ఇమం పునః

అనువర్తితనా న్మోహా దన్య మన్యం జనాజ్జనమ్‌

అయ మనుభవే ద్బంధు రనేన సహ మే క్షయమ్‌

సామ్య మేకత్వతాం యాతో యాదృశ స్తాదృశ స్త్వహమ్‌

తుల్యతా మిహ పశ్యామి సదృశోహమనేన వై

అయం హి విమలో వ్యక్త మహ మీదృశక స్తదా

యోహ మజ్ఞానసంమోహా దజ్ఞాయా సంప్రవృత్తవాన్‌

సంసర్గా దతిసంసర్గా త్థ్సితః కాల మిమం త్వహమ్‌

సోహ మేవం వశీభూతః కాల మేతం న బుద్ధవాన్‌

ఉత్త మాధమ మధ్యానాం తా మహం కథ మావసే

సమాన మాయయా చేహ సహవాస మహం కథమ్‌

గచ్ఛా మ్యబుద్ధభావత్వా ది హేదానీం స్థిరో భవ

సహవాసం న యాస్వామి కాల మేతం వివంచనాత్‌

వంచితో హ్యనయా యద్ధి నిర్వికారో వికరాయా

న తత్త దపరాద్ధం స్యా దపరాధో హ్యయం మమ

యోహ మ త్రాభవం సక్తః పరాఙ్ముఖ ముపస్థితః

తతోస్మి న్బహురూపోథ స్థితో మూర్తి రమూర్తిమాన్‌

ఆమూర్తి శ్చాప్యమూర్తాత్మా మమత్వేనప్రధర్షితః

ప్రకృత్యా చ మయా తేన తాసు తా స్విహ యోనిషు

నిర్మమస్య మమల్వేన వికృతం తాసు తాసు చ

యోనీషు వర్తమానేన నష్టసంజ్ఞేన చేతసా

సమతా న మయా కాచి దహంకారే కృతా మయా

ఆత్మానం బహుధా కృత్వా సోయం భూయో యునక్తిమామ్‌

ఇదానీ మవబుద్ధోస్మి నిర్మమో నిరహంకృతః

మమత్వం మనసా నిత్య మహంకార కృతాత్మకమ్‌

అపలగ్నా మిమాం హిత్వా సంశ్రయిష్వే నిరామయమ్‌

అనేన సామ్యం యాస్యామి నానయాహ మచేతసా

క్షేమం మమ సహానేన నైవైక మనయా సహ

ఏవం పరమసంబోదా త్పంచవింశోనుబుద్ధవాన్‌

అక్షరత్వం నిగచ్ఛతి త్యక్త్యా క్షర మనామయమ్‌

అవ్యక్తం వ్యక్తధర్మాణం సగుణం నిర్గుణం తథా

నిర్గుణం ప్రథమం దృష్ట్వా తాదృ గ్భవతి మైథిల

అక్షరక్షరయో రేత దుక్తం తవ నిదర్శనమ్‌

మయేవా జ్ఞాన సంపన్నం యథా శ్రుతినిదర్శనాత్‌

నిఃసందిగ్ధం చ సూక్ష్మం చ విశుద్ధం విమలం తథా

ప్రవక్ష్యామి తు తే భూయ స్త న్నిబోధ యథాశ్రుతమ్‌

సాంఖ్య యోగో మయా ప్రోక్తః శాస్త్రద్వయ నిదర్శనాత్‌

యదేవ సాంఖ్య శాస్త్రోక్తం యోగదర్శన మేవ తత్‌

ప్రబోధన పరం జ్ఞానం సాంఖ్యానా మవనీపతే

విస్పష్టం ప్రోచ్యతే తత్ర శిష్యాణాం హితకామ్యయా

బృహచ్చైవ మిదం శాస్త్ర మి త్యాహు ర్విదుషో జనాః

అస్మంశ్చ శాస్త్రే యోగానాం పునర్భవపురఃసరమ్‌

పంచవింశాత్పరం తత్త్వం పఠ్యతే చ నరాధిప

సాంఖ్యానాం తు పరం తత్త్వం యథావ దనువర్ణితమ్‌

బుద్ధ మప్రతిబుద్ధం బుద్ధ్యమానం చ తత్త్వతః

బుధ్యమానం చ బుద్ధత్వం ప్రాహు ర్యోగనిదర్శనమ్‌

ఇట్లు క్షర స్థితి నుండి అక్షర స్థితికి, మిశ్రస్థితి నుండి శుద్ధతా స్థితికి పోవుట లోని క్రమమునే అప్రతి బుద్ధత్వ దశనుండి ప్రతి బుద్ధత్వ దశకు పోవుట అందురు. అది ఎట్లనిన, సుఖ దుఃఖ సంమిశ్ర మగు ఈ సంసారము నందు గల దోషములను గుర్తించి విరక్తుడైన జీవుడు ఇట్లను కొనును, నేను ఇంత కాలమును ఏమి చేసితిని? నీటిలో నున్న చేప ఆ నీరు వేరు నేను వేరు అని తెలియక ఆ నీరుతన కొరకే యున్నట్లు భావించి కొని ఆ నీటిని విడువ లేక ఆ మహాజల రాశిలోనే ఒకచోటి నుండి మరియొక చోటికి సంచరించుచు దాని నుండి బయటకు వచ్చినచో తన గతి ఏమగునో యని భయపడు నట్లే నేనును నన్నీ దృశ్య ప్రపంచము కంటె అతీత మగు, భిన్న మగు తత్త్వమునుగా ఎఱుగక ఇంత కాలము సుఖ దుఃఖ సంమిశ్రమును జనన మరణ పరంపరా బహుళమును నగు ఈ సంసార ప్రవాహములో కొట్టుకొని పోవు చుంటిని. ఇక్కడ నున్న వారందరును నా వలెనే యున్నారు. కాని ఈ అవ్యక్త, జ్ఞేయ, అక్షర తత్త్వము విమల మైనది. నేనును పూర్వము ఇట్టి స్థిలోనే యుంటిని. ఇంత వరకు అజ్ఞానముచే కలిగిన సంమోహముచే ప్రవృత్తుడనై అజ్ఞుడనుగా ఉంటిని. దీనికి అంతటికిని సంసర్గము అతి సంసర్గము కారణము. దీనికి వశీభూతుడ నై ఇంత కాలమును ఉత్తమ మధ్యమాధమ స్థితులను వాని వ్యత్యాసమును కూడ గుర్తించ లేకపోతిని. ఇంక మీదట కూడ నేను ఈ స్థితిలోనే ఇట్లుండ జాలను. ఆ స్థిర స్థితికి పోవలెను. ఇంత కాలమును ఈ అపరాప్రకృతి తో సహవాసముచే వంచితుడనై ఇట్లుంటిని. ఇక వంచితుడను కాజాలను. నేను వస్తుతః నిర్వికారుడను. వికారములను పొందితిని. ఇది ఈ అపరాప్రకృతి యొక్క అపరాధము కాదు. నా యపరాధమే. తాత్త్విక స్థితికి పరాఙ్ముడనై ఈ మాయా కల్పిత సుఖముల యందు ఆసక్తుడ నైతిని. వాస్తవమున రూపము లేని నేను బహు రూడుడనై మమకారా హంకారాభి మానములకు వశుడనై యుంటివి. నిర్మముడ నగు నేను మమకార వశుడనై ఆయా జన్మల యందు వికృత రూపుడనై తెలివిని కోల్పోయి అహంకారముతో సమత్వమును పొంది దానిని వదలుకొన లేకుంటిని. ఈ అపరాప్రకృతి తన్ను బహు రూపములతో పరిణమింప జేసికొని ఇంకను నన్ను తనలో మునిగి యుండు నట్లు ఆజ్ఞాపించు చున్నది. నేనామె యాజ్ఞను పాటించను. ఇప్పటికి నా తప్పు తెలిసినది. నేను అహంమమకార రహితుడను. మమకారము కూడ అహంకార జనితము. ఈ రెంటిని విడిచి నిరామయతా స్థితిని పొందుదును. కాని ప్రతిబోధ రహిత మగు ఈ అపరా ప్రకృతిని ఆశ్రయించి యున్నంత వరకు నేను ఈ పరమార్ధ తత్త్వముతో సామ్యమును పొంది ముక్తుడను కాజాలను. కనుక నేను అందులకై మొదట ఈ అహంతత్త్వముతో సామ్య సహవాస ములను విడిచెదను. ఈమెతో కూడి యున్నంత వరకు నాకు క్షేమము కలుగదు. అని యిట్లు ప్రతి బుద్ధుడై క్షరత్వ వ్యక్తత్వ సగుణత్వ, స్థితులను వదలి అక్షరత్వ, అవ్యక్తత్వ, నిర్గుణత్వ, స్థితికి చేరును. ఓజనక మహారాజా! నీకు ఇట్లు క్షరాక్షర తత్త్వ వివేచన ప్రకారమును ప్రతిపాదించితిని. ఇది సంశయ రహితము. విమలము, విశుద్ధము, సూక్ష్మము. పరంపరా గతమగు సంప్రదాయ సిద్ధమైన మఱియొక అంశము చెప్పెదను. వినుము సాంఖ్యము యోగము అను రెండు దర్శనములను నీకు తెలిపితిని కదా. వానిలో సాంఖ్యమే యోగము. యోగమే సాంఖ్యము. సాంఖ్య దర్శనము శిష్యుల, ముముక్షువుల హితమును కోరి తత్త్వమును విస్పష్టముగా వివేచించి ప్రతిపాదించును. విద్వాంసులగు వారు ఈ శాస్త్రము చాల గొప్పది యని చెప్పుదురు. ఈ శాస్త్రములో ప్రతిపాదించిన విషయమునే యోగ దర్శన మున పునర్భవ పురఃసరముగా అనగా అనుభవ పూర్వకముగా అందుకొను విధానము అధ్యయనము చేయ బడుచున్నది. ఇంత వరకును సాంఖ్యుల పరమార్థ తత్త్వ వివేచన ప్రకారము శాస్త్ర ప్రమాణా నుసారము అనువర్ణించితిని. బుద్ధము, ఆప్రతి బుద్ధము. అక్షరము, క్షరము ఈ రెండును వీటికి రెంటికి నడుమ నున్న బుధ్య మానము అను మూడు తత్త్వములును సాంఖ్య దర్శనమున వేచించ బడును. బుద్దము, అనగా బోధాత్మక మగు పరమార్థ తత్త్వము. అప్రతి బుద్ధ మనగా అపరా ప్రకృతికి మూలమగు మాయా తత్త్వము. బుధ్యమాన మనగా ముముక్షుని శ్రవణ మననాది విచారణావ స్థయును ఆత్మ దర్శనమును కోరి యోగ సాధనచేయు దశయును. యోగ దర్శనము నందు బుధ్య మానత్వ బుద్ధత్వ దశలు మాత్రము అనుభవ దశలో ప్రతిపాదింప బడును.