బ్రహ్మ మహా పురాణము

192 - అక్రూర ప్రత్యాత గమనమ్‌

వ్యాసులు:

చింతయన్నితి గోవింద ముపగమ్య సయాదవః

అక్రూరోస్మీతి చరణౌ ననామ శిరసా హరేః

సోప్యేనం ధ్వజవజ్రాబ్జ కృతచిహ్నేన పాణినా

సంస్పృ శ్యాకృష్య చప్రీత్యా సుగాఢం పరిషస్వజే

కృతసంవదనౌ తేన యథావద్బలకేశవౌ

తతః ప్రవిష్టౌ సహసా తమాదాయాత్మమందిరమ్‌

సహ తాభ్యాం తదాక్రూరః కృతసంవదనాదికః

భుక్తభోజ్యో యథాన్యాయ మాచచక్షే తత స్తయోః

యథా నిర్భర్త్సిత స్తేన కంసే నానకదుందుభిః

యథాచ దేవకీదేవీ దానవేన దురాత్మనా

ఉగ్రసేనే యథాకంసః స దురాత్మాచ వర్తతే

యంచై వార్థం సముధ్దిశ్య కంసేన స విసర్జితః

తత్సర్వం విస్తరాచ్ఛ్రుత్వా భగవాన్‌ కేశిసూదసః

ఉవా చాఖిల మేతత్తు జ్ఞాతం దానపతే మయా

కరిష్యేచ మహాభాగ యదత్రౌపయికం మతమ్‌

విచింత్యం నాన్యథైత త్తే విద్ధి కంసం హతం మయా

అహం రామశ్చ మథురాం శ్వో యాస్యావః సమంత్వయా

గోపవృధ్థాశ్చ యాస్యంతి అదా యోపాయనం బహు

నిశేయం నీయతాం వీర న చింతాం కర్తుమర్హసి

త్రిరాత్రాభ్యంతరే కంసం హనిష్యామి సహానుగమ్‌

వ్యాసులు:

ఇట్లా యాదవు డక్రూరుడు గోవిందుని దలచుచు వచ్చి నేనక్రూరుడ నని పేరు సెప్పికొని తల వంచి హరికి నమస్కరించెను. (గోత్ర నామములు సెప్పికొని నమస్కరించుట విశిష్ట గౌరవపాత్రులగు గురువులకు దైవ సమానుల యెడ జేయ వలసిన లక్షణము శాస్త్రీయము.) శ్రీహరియు ధ్వజ వజ్ర పద్మ చిహ్నములు గల హస్తముచే నక్రూరుం దాకి దరికి దీసికొని ప్రీతితో గాఢాలింగనము సేసికొనెను. బలరామ కృష్ణు లాతనితో కుశల సంభాషణాదులు నెఱిపి వెంటనే యాతనిం జేకొని తమ మందిరమునం బ్రవేశించిరి. అతడును వారితో ముచ్చట లాడుచు విందారగించి సముచితముగ వారికి దావచ్చిన విశేషముం దెలిపెను. కంసుడు దేవకీ వసుదేవులను బెదరించుట తన తండ్రి యగు నుగ్రసేనుని యెడ నతడు వర్తించు తీరు తన్నెందులకు కంసుడు పంపెనో యా విషయము నెల్లను నాతడు తెలుప విని కేశి సంహారకు డగు భగవంతుడు దానపతీ! (ఓ అక్రూరా) ఇదెల్ల నాకు దెలిసినది. ఇందేమి యుచితమో యదియా లోచించి చేసెదను. ఓ మహానుభావ! నీవింకొక లాగను కొనకుము. నాచే కంసుడు హతు డయినట్లే తెలియుము. నేనును నన్నయ్య బలరాముడును నీతో రేపు మథురకు వత్తుము. గోప వృద్ధులు గూడ యుపాయనములం బెక్కింటిని గొని వత్తురు. ఈ రేయి విశ్రమింపుము. చింతింపం బనిలేదు మూడు రాత్రుల లోగా గంసుని పరివారముతో సంహరింతునని కృష్ణుడు పల్కెను.

గోపికా పరితాపః

వ్యాసులు:

సమాదిశ్య తతో గోపా నక్రూరోపి సకేశవః

సుష్వావ బలభద్రశ్చ నందగోపగృహే గతః

తతః ప్రభాతే విమలే రామకృష్ణా మహాబలౌ

అక్రూరేణసమం గంతు ముద్యతౌ మథురాం పురీమ్‌

దృష్ట్వా గోపీజనః సాస్రః శ్లథద్వలయబాహుకః

నిశ్వసంశ్చాతాదుఃఖార్తః ప్రాహచేదం పరస్పరమ్‌

మథురాంప్రాప్యగోవిందః కథం గోకులమేష్యతి

నాగరస్త్రీకలాలాపమధు శ్రోత్రేణ పాస్యతి

విలాసివాక్యాజాతేషు నాగరీణాం కృతాస్పదమ్‌

చిత్త మస్య కథం గ్రామ్యగోపగోపీషుయాస్యతి

సారం సమస్తగోష్ఠస్య విధినా హరతా హరిమ్‌

ప్రహృతం గోప యోషిత్సు నిర్ఘృణేన దురాత్మనా

భావగర్భస్మితం వాక్యం విలాసలలితా గతిః

నాగరీణా మతీవై తత్‌ కాటాక్షేక్షితమేవతు

గ్రామ్యో హరి రయం తాసాం విలాసనిగదైర్యతః

భవతీనాం పునః పార్శ్వం కయా యుక్త్యా సమేష్యతి

ఏషోహి రథమారుహ్య మథురాం యాతికేశవః

అక్రూర క్రూరకేణాపి హతాశేన ప్రతారితః

కింన వేత్తి నృశంసోయ మసురాగపరంజనమ్‌

యేనే మమక్షరాహ్లాదం నయ త్యన్యత్ర నోహరిమ్‌

ఏష రామేణసహితః ప్రయాత్యత్యంతనిర్ఘృణః

రథమారుహ్య గోవింద స్త్వర్యతా మస్యవారణే

గురూణామగ్రతో వక్తుం కిం బ్రవీషిన నః క్షమమ్‌

గురవః కింకరిష్యంతి దగ్ధానాం విరహాగ్నినా

నందగోపముఖా గోపా గంతుమేతే సముద్యతాః

నోద్యమం కురుతే కశ్చిత్‌ గోవిందవినివర్తనే

సుప్రభాతాద్య రజనీ మథురావాసియోషితామ్‌

యాసా మచ్యుత వక్త్రాబ్జే యాతి నేత్రాణి భోగ్యతామ్‌

ధన్యాస్తే పథి యే కృష్ణమితో యాంత మవారితాః

ఉద్వహిష్యంతి పశ్యంతః స్వదేహం పులకాంచితమ్‌

మధురానగరీ పౌరనయనానాం మహోత్సవః

గోవిందవదనాలోకా దతీవాద్య భవిష్యతి

కోను స్వప్నః సభాగ్యాభి ర్ధృష్టస్తాభి రథోక్షజః

విస్తారి కాంతనయనా యా ద్రక్షం త్వనివారితమ్‌

ఆహో! గోపీజనస్యాస్య దర్శయిత్వా మహానిధిమ్‌

ఉద్ధృతా న్యద్య నేత్రాణి విధాత్రాకరుణాత్మనా

అనురాగేణ శైథిల్య మస్మాను వ్రజతో హరేః

శైథిల్య ముపయాం త్యాశు కరేషు వలయాన్యపి

అక్రూరః క్రూరహృదయః శీఘ్రంప్రేరయతే హయాన్‌

ఏవమార్తాసు యోషిత్సు ఘృణా కస్య నజాయతే

హే హే కృష్ణరథస్యో చ్చైశ్చక్రరేణు ర్నిరీక్ష్యతామ్‌

దూరీకృతో హరి ర్యేన సోపి రేణు ర్నలక్ష్యతే

ఇత్యేవ మతిహార్దేన గోపీజననిరీక్షితః

తత్యాజ వ్రజభూభాగం సహ రామేణకేశవః

అక్రూరుడు నా రాత్రి గోపకులకుం జెప్పి కృష్ణునితో బల భద్రునితో నందుని మందిరమున నిదురించెను. బలశాలు రగు రామకృష్ణు లవ్వల సుప్రభాతమునం దక్రూరునితో మధురకేగ సన్నద్ధు లైరి. గోపిక లది చూచి కన్నుల నీర్నిండ దుఃఖము నంజిక్కి ముంజేతుల గంకణములు జార నిటూర్పుపుచ్చుచు నొండొరులతో నిట్ల నుకొనిరి. గోవిందుడు మధుర కేగి మరి వ్రేపల్లె కెట్లు రాగలడు. ఆ నాగరిక సుందరుల అవ్యక్త మధుర భాషణ మధుధారల వీనులం గ్రోలును. ఆ నగర కాంతల మెరమెచ్చుల ముచ్చట లందిరపుకొన్న యీతని చిత్త మిక నీపల్లెం గల గొల్ల పడుచుల వంక కెట్లు తిఱుగును. ఈ గోష్ఠము యొక్క (వ్రేపల్లె యొక్క) సమగ్ర సారమైన హరి నిట్లు హరించుకొని పోవు నా పాడు దైవము నిర్థయమై గోపాంగనల సర్వస్వము దోచు కొన్నాడు. పరిహాస భావగర్భిత మైన యాపలుకు లాయొయ్యారపు నడక లా నెఱజాణలు మధురాపురీ సుందరుల య వ్వాల్చూపు టురులం జిక్కి ఈ పల్లెటూరి దేవయ్య మీ ప్రక్కకు మఱి యే యుక్తిని రాగలడు. పేరు మాత్రమున కక్రూరు డయిన యీ క్రూరునిచే నీహతాశునిచే మోసగింప బడి యిదె మాధవుడు రథమెక్కి మధుర కేగు చున్నాడు. ఈ నీచుడింత యెరుగడా యీతని పై వలపుగొన్న యీజనమును తఱుగని తఱి తీవుగొని మఱగిన మనసామిని హరిని గొంపోవు చున్నాడు. ఇతడో! దయమాలి రమ్మన్నదే తడవుగ నివ్వనమాలి హలితో వీని వెంటం బడి రథ మెక్కి (ఎన్నడు నెక్కని రథమెక్క నుబలాట వడి కాబోలు) చను చున్నాడు. వలదని వారింపం ద్వర పడుదము? పెద్దల యెదుటంబడి మా కేదిగతి ఏమందు వని మొర వెట్టుదము. ఆ పెద్దవాండ్రు మాత్రము విరహాగ్నిచే గ్రాగుమన కేమిసేయ గలరు? నంద గోపుడు మున్ను గానిచె వీరును ప్రయాణ సన్నద్దులగు చున్నారు. గోవిందుని మఱలింప నొక్కరే నిందు యత్నించుట లేదు. మథురా వాసులగు విలాసినుల కీరేయి యిపుడు సుప్రభాతము. అచ్యుతుని ముఖా రవిందమునకా సుందరుల కనుగవలు భోగ్య వస్తువులు కాగలవు. (అనగా కృష్ణుడా పడతుల వాల్చూపుల సొంపుల ననుభవించు నన్న మాట) ఇట నుండి కృష్ణు డేగుచుండ దారిలో నిలిచి యెవ్వరు వలదు వలదని వారింప బడక స్వేచ్ఛగా నా సొగసుగాని సొగసు గని నెమ్మేనం బులకింతురో యయ్యింతులు ధన్యులు గదె. గోవింద వదనా రవింద సందర్శనమున నిపుడు మధురా పుర పౌరుల నయనముల కిదియొక మహోత్సవము గానున్నది. కను లంతంతలు సేసికొని యే యభ్యంతరము లేకుండ భాగ్యవతులగు నాపుర యువతుల ధోక్షజుం జూడ నున్నారిది యొక కలగాదు గదా? ఈ గోపికల కొక పెన్నిధిం జూపించి నయవ్విధి (బ్రహ్మ) యింతలో జాలిమాలి మన కన్ను లందిగ నడచి నాడు. మాధవు నెడ ననురాగమున నతడేగుటకు మన యందు శైథిల్య మేర్పడ (ఏ కీలున కాలు పట్టు విడుచుండ) మాతో బాటు మా ముంజేతుల నున్న వలయములును (కంకణములు) పట్టుదప్పి జారిపోవు చున్నవి. అక్రూరుడు క్రూర హృదయుడు, అల్లదె గుఱ్ఱములను త్వరత్వరగా దోలు చున్నాడు. ఇట్లార్తలై యలమటించు నబలల పై నెవ్వనికిం దయ పుట్టదు? ఓఓ కృష్ణా! అల్లదె రథ చక్రముల రేగిన రేణు వరదముపై గ్రమ్మినది చూడుడు. దానహరి దూరము సేయబడి నాడు ఆ రేణువు గూడ గనబడుట లేదు అని యిట్లు హార్దమైన భావముతో గోపిక లలమటింప నెవరికి జాలి కలుగదు!

గచ్ఛంతో జవనాశ్వేన రథేన యమునాతటమ్‌

ప్రాప్తా మధ్యాహ్నసమయే రామాక్రూరజనార్దనాః

అథాహకృష్ణ మక్రూరో భవద్భ్యాం తావదాస్యతామ్‌

యావత్కరోమి కాలింద్యామాహ్నికార్హణ మంభసి

తథేత్యుక్తే తతఃస్నాతః స్వాచాంతః స మహామతిః

దధ్యౌ బ్రహ్మ పరం విప్రాః ప్రవిశ్య యమునాజలే

ఫణాసహ స్రమాలాఢ్యం బలభద్రం దదర్శ సః

కుందమాలాంగ మున్ని ద్రపద్మపత్రాయతేక్షణమ్‌

వృతం వాసుకిడింభౌఘై ర్మహద్భిః పవనాశిభిః

సంస్తూయమానం సద్గంథివనమాలావిభూషితమ్‌

దధానమసితే వస్త్రేచారురూపావతంసకమ్‌

చారుకుండలినం మత్త మంతర్జలతలే స్థితమ్‌

తస్సోత్సంగే ఘనశ్యామ మాతామ్రాయతలోచనమ్‌

చత్సుర్బాహు ముదారాంగం చక్రాద్యాయుధ భూషణమ్‌

పీతే వసానం వసనే చిత్రమాల్యవిభూషితమ్‌?

శక్రచాపతటిన్మాలా విచిత్రమివతోయదమ్‌

శ్రీవత్సవక్షసం చారుకేయూర ముకుటోజ్జ్వలమ్‌

దదర్శ కృష్ణమక్లిష్టం పుండరీకావతంసకమ్‌

సనందనాద్యైర్మునిభిః సిద్ధయోగై రకల్మషైః

సంచింత్యమానం మనసా నాసాగ్రన్యస్తలోచనైః

జవనాశ్వమ్మగు రథమునం జని బలరామ కృష్ణులు నక్రూరుండును మధ్యాహ్నమునకు యమునా తీరమును జేరిరి. అంతట నక్రూరుడు తామిద్దరు నిట గూర్చుండుడు. నేనీ కాళి జలములం దాహ్నిక కృత్యము నొనరింతు ననియె. వారట్లేయన నతడు యమునా జలములం జొచ్చి యాచ మించి స్నానము సేసి పరబ్రహ్మాముం ధ్యానించెను. అన్నీటిలో నత డయ్యెడ వేయి పడగలతో నున్న శేషునిగ బలరాముం దర్శించెను. అతడు మల్లెదండ వంటి శరీరము ధరించి తామర రేకులట్లున్న కన్నులలో వాసుకి గన్న డింభకులు పవన భక్షులు చుట్టు నుండి స్తుతింప వనమాలం దాల్చి నల్లని వస్త్రముం దాల్చి చక్కని అవతంసముతో (శిరో భూషణముతో) నింపైన కుండలములు దాల్చి నీటిలో నుండం గనెను. ఆతని యొడిలో మేఘ శ్యాముని అంతట నెఱ్ఱనగు కన్నులు గల వానిని నలు చేతలు గల వానిని ఉన్నత శరీరుని చక్రాద్యాయధ ధారిని పీతాంబ రోత్తరీయముల రంగు రంగుల పూల మాలల దాల్చి ఇంద్రధనుస్సు మెఱపు దీగల తోడి విచిత్ర మగు తోయదము(మేఘము) వలె నున్న వానిని శ్రీవత్సాంకిత వక్షుని చక్కని భుజ కీర్తులు కీరీట ముందాల్చి మిఱుమిట్లు గొల్పుచున్న వానిని తెల్ల దామర పువ్వు సిగపూవు ధరించి యున్న యానంద మూర్తిని గృష్ణుని పుణ్యులగు సనకస నందనాది సిద్ద యోగులు ముక్కుగొనం జూపు విలిపి మనస్సుచే ధ్యానించు వానిని గృష్ణునిం గనెను.

బలకృష్ణా తదాక్రూరః ప్రత్యభిజ్ఞాయ విస్మితః

ఆచింతయదథో శీఘ్రం కథ మత్రాగతావితి

వివక్షోః స్తంభయామాస వాచం తస్య జనార్దనః

తతో నిష్క్రమ్య సలిలా ద్రథమభ్యాగతః పునః

దదర్శ తత్ర చైవోభౌ రథస్యోపరి సంస్థితౌ

రామకృష్ణా యథాపూర్వం మనుష్యవపుషాన్వితౌ

నిమగ్నశ్చ పునస్తోయే దదృశే స తథైవ తౌ

సంస్తూయమానౌ గంధర్వైర్ముని సిద్ధ మహోరగైః

తతో విజ్ఞాతసద్భావః సతు దానపతి స్తదా

తుష్టావ సర్వవిజ్ఞానమయ మచ్యుత మీశ్వరమ్‌

అయ్యెడ నక్రూరుడు వీరు బలరామ కృష్ణులని దెలిసికొని యాశ్చర్యపడి యా వెంటనె వీరెట్లిచ్చటికి వచ్చి నారని యాలోచించెను. పలుక బోయిన యాతని వాక్కును హరి స్తంభింప జేసెను. అంతట నాతడు నీరు వెడలి వెలి కేగుదెంచి రథము నందుమ నయ్యిరువురిం దర్శించెను. మునుపటి యట్ల వారు మానవులట్లు ప్రాకృత రూపమున గోచరించురి. తిరిగి యతడు నీటను మునిగి మున్నట్లవ్రాకృత దివ్యమూర్తుల నందు గనియె. గంధర్వులు మునులు సిద్ధులు నాగులు నయ్యిద్దఱ నయ్యెడ స్తుతించు చుండం జూచెను. అంత నద్దాన పతి (అక్రూరుడు) సర్వసత్తా స్వరూపము నెఱింగికొని సర్వ విజ్ఞాన మయుడగు నచ్యుతు నీశ్వరుని స్తుతించెను.

అక్రూరకృత స్తవః

అక్రూరుడు:

తన్మాత్రరూపిణేచింత్యమహిమ్నే పరమాత్మనే

వ్యాపినే నైకరూపైక స్వరూపాయ నమో నమః

శబ్ధరూపాయ తేచింత్య హవిర్భూతాయ తే నమః

నమో విజ్ఞాన రూపాయ పరాయ ప్రకృతేః ప్రభో

భూతాత్మా చేంద్రియాత్మా చ ప్రధానాత్మా తథా భవాన్‌

ఆత్మా చ పరమాత్మా చ త్వమేకః పంచధాస్థితః

ప్రసీద సర్వధర్మాత్మన్‌ క్షరాక్షర మహేశ్వర

బ్రహ్మ విష్ణు శివాద్యాభిః కల్పనాభిరుదీరితః

ఆనాఖ్యేయస్వరూపాత్మ న్ననాఖ్యేయ ప్రయోజన

అనాఖ్యేయాభిధాన త్వాం నతోస్మి పరమేశ్వరమ్‌

న యత్ర నాథ విద్యంతే నామజాత్యాది కల్పనాః

తద్ర్బహ్మ పరమం నిత్య మవికారి భవానజః

న కల్పనామృతేర్ధస్య సర్వస్యా ధిగమోయతః

తతః కృష్ణాచ్యుతానంత విష్ణుసంజ్ఞాభిరీడ్యసే

సర్వాత్మన్త్వమజ వికల్పనాభిరే తైర్దేవా స్త్వం జగదఖిలం త్వమేవ విశ్వమ్‌

విశ్వా త్మన్త్వమసివికారభేదహీనః సర్వస్మి న్నహి భవతోస్తి కించిదన్య(ంయ)త్‌

త్వం బ్రహ్మా పశుపతిరర్యమా విధాతాత్వం ధాతా త్రిదశపతిః సమీరణోగ్నిః

తోయేశో ధనపతి రంతకృత్త్వ మేకో భిన్నాత్మా జగదపి పాసి శక్తి భేదైః

విశ్వం భవాన్‌ సృజతి హంతి గభస్తి రూపోవిశ్వం చ తే గుణమయోయ మజ ప్రపంచః

రూపం పరం సదితివాచక మక్షరం యజ్ఞానాత్మనే సదసతే ప్రణతోస్మి తస్మై

ఓం నమో వాసుదేవాయ నమ స్సంకర్షణాయచ

ప్రద్యుమ్నాయ నమస్తుభ్య మనిరుద్ధాయ తేనమః

అక్రూర స్తవము

పంచతన్మాత్ర రూపుడు ఊహింప నలవి గాని మహిమ గలవాడు సర్వ వ్యాపకుడు అనేక రూపుడు నైన వాడు నగు పరమాత్మకు నమస్కారము. శబ్ద రూపము హవి స్స్వరూపము విజ్ఞాన రూపము నైన వానికి బ్రకృతి కంటె పరునికి నమస్కారము. భూతాత్మయు నింద్రియాత్మయు ప్రధానాత్మయు నీవే. ఆత్మయు (జీవుడు) పరమాత్మయు నీవే. ఇట్లు నీవోక్కడవే యైదుగా నున్నావు. క్షరము (సర్వ భూతము) అక్షరము (కూటస్థుడు) సర్వధర్మ మూర్తిని బ్రహ్మ విష్ణు శివాది నానా విధ కల్పనలచే బిలువ బడు నీవు ప్రసన్నుడవు కమ్ము. నీ స్వరూపము పలుక నలవి గానిది. నీవేమి ప్రయోజనము గలవాడనో తెలుప శక్యము గాదు. నీ యభిదాన మిదియని చెప్ప వశము గాదు. అట్టి పరమేశ్వరుని నిన్ను గూర్చి వినతుడ నయ్యెదను. నామము జాతి మొదలైన కల్పన లెందులేవో అట్టి పరబ్రహ్మము నిత్యము అవికారి అజము నైనది నీవే. కల్పన గాకుండ సకల పదార్ధము అందదు గావున కృష్ణ అచ్యుత విష్ణు నామములచే (కల్పన లచే) నీవు స్తుతింప బడు చున్నావు.

నీవు సర్వమున కాత్మవు. వికల్పనములచే నీవే దేవతలు విశ్వమును. ఓ విశ్వాత్మ! నీవు వికార భేదము లేని వాడవు. అంతట నీకంటే వేరొకటి యించుకయు లేదు. నీవు బ్రహ్మవు పశు పతివి అర్యముడవు (సూర్యుడు) విధాతవు ధాతవు ఇంద్రుడవు వాయువు అగ్నివి. జలాధిపతి వరుణుడవు. ధనేశుడవు (కుబేరుడు) నీవు. అంతము చేయు వాడు (యముడు) నీవు. ఒక్క డయ్యు భిన్న భిన్న శక్తులచే భిన్న భిన్న రూపుడవై జగత్తును రక్షించు చున్నావు. కిరణ రూపమున నీవు జగత్తును సృజించి హరింతువు. ఈ విశ్వము పంచభూత వికారము. గుణ మయము. సత్‌ అను శబ్దమున కర్ధమైన పరము స్వరూపము అక్షరమునై సదస ద్రూపుజ్ఞాన రూపునగు నీకు నమస్కారము. వాసు దేవుడవు సంకర్షణుడవు ప్రద్యుమ్నుడవు అనిరుద్దుడవు నగు నీకు నమస్కారము (చతుర్వ్యూహాత్మకమైన పరమాత్మకు నమస్కారము).

వ్యాసులు:

ఏవమంతర్జలే కృష్ణమభిష్టూయ స యాదవః

ఆర్చయామాస సర్వేశం ధూపపుష్పై ర్మనోమయైః

పరిత్యజ్యాన్యవిషయం మన స్తత్ర నివేశ్య సః

బ్రహ్మభూతే చిరం స్థిత్వా విరరామ సమాధితః

కృతకృత్య మివాత్మానం మన్యమానో ద్విజోత్తమాః

ఆజగామ రథం భూయో నిగమ్య యమునాంభసః

రామకృష్ణౌ దదర్శాథ యథాపూర్వ మవస్థితౌ

విస్మితాక్షం తదాక్రూరం తం చ కృష్ణోభ్యభాషత

అని యిట్లు నీళ్లలో కృష్ణునిం బొగడి యయ్యాదవుడు మనస్సు చేత గల్పింప బడిన ధూప దీప పుష్పాదులచే షోడశోప చారములచే శ్రీహరి నర్చించెను. మానసిక పూజ చేసెనన్న మాట. ఇతర విషయముల విడిచి మనస్సును కృష్ణ రూప పరబ్రహ్మ మందు నిలిచి చిర కాలమునకు సమాధి నుండి విరమించెను. తనును గృతార్ధునిగ భావించి యమునా జలముల నుండి వెడలి మరల రథము దరికి వచ్చెను. వచ్చి రామ కృష్ణులను ముంటివోలె నున్నవారిం గాంచెను.

శ్రీకృష్ణుడు:

కింత్వయా దృష్టమాశ్చర్య మక్రూర యమునాజలే

విస్మయోత్ఫుల్లనయనో భవాన్‌ సంలక్ష్యతే యతః

శ్రీకృష్ణుడు:

ఆశ్చర్యము నంజూచు నక్రూరునితో గృష్ణుడు యమునా జలమున నీవేమి వింత చూచితివి నీకన్ను లాశ్చర్య వికసితము లైన వని యనగ నక్రూరుం డిట్లనియె.

అక్రూరుడు:

అంతర్జలే యదాశ్చర్యం దృష్టం తత్ర మయాచ్యుత

తదత్రైవ హి పశ్చామి మూర్తిమత్పురతః స్థితమ్‌

జగదేతన్మమహాశ్చర్య రూపం యస్యమహాత్మనః

తేనాశ్చర్య పరేణాహం భవతా కృష్ణ సంగతః

తత్కిమేతేన మథురాం ప్రయామో మధుసూదన

బిభేమి కంసాద్ధిగ్జన్మ పరపిండోప జీవినః

అక్రూరుడు:

అచ్యుతా! నీళ్ళలో నేనేమి వింత గన్గొంటినో యది యిచటనే రూపొంది నా ముందర గను గలదు. ఈ జగచ్చిత్రమే మహాత్మనిచే యాశ్చర్య రూపమై యున్నదో అట్టి యాశ్చర్యముల కవధియైన నీతో నేనిపుడు గూడి కొన్నాను. ఈ వింతతో మనము మధురకు వెళ్ళుదమా! కంసునకు నేను జడియు చున్నాను. ఛీ!ఛీ! పరులు పెట్టిన పిండముచే బ్రతుకు వాని జన్మమేమి జన్మము.

వ్యాసులు:

ఇత్యుక్త్వా చోదయామాస తాన్‌ హయాన్వాతరంహనః

సంప్రా ప్తశ్చాపి సాయాహ్నేసో క్రూరోమథురాం పురీమ్‌

విలోక్య మథురాం కృష్ణం రామం చహ స యాదవః

వ్యాసులు:

అని వాయు వేగమున రథాశ్వములను దోలెను. సాయాహ్నామున కక్రూరుడు మధురం బ్రవేశించెను. మధురం గని బలరామ కృష్ణులతో నాత డిట్లనియె.

అక్రూరుడు:

పద్భ్యాం యాతం మహావీర్యౌ ర థేనైకో విశామ్యహమ్‌

గంతవ్యం వసుదేవస్య నో భవద్భ్యాం తథా గృహే

యువయో ర్హి కృతేవృద్ధః కంసేన స నిరస్యతే

వ్యాసులు:

ఇత్యుక్త్వా ప్రవివేశాసావక్రూరో మధురాం పురీమ్‌

ప్రవష్టౌ రామకృష్ణౌ చ రాజమార్గముపాగతౌ

స్త్రీభిర్నరైశ్చ సానందలోచనై రభివీక్షితౌ

జగ్మతు ర్లీలయా వీరౌ ప్రాప్తౌ బాలగజావివ

భ్రమమాణౌ తు తౌ దృష్ట్వా రజకం రంగకారకమ్‌

అయాచేతాం సురూపాణి వాసాంసి రుచిరాణి తౌ

కంసస్య రజకః సోథ ప్రసాదారూఢ విస్మయః

బహున్యాక్షేప వాక్యాని ప్రాహోచ్ఛై రామకేశవౌ

తత స్తల ప్రహారేణ కృష్ణ స్తస్య దురాత్మనః

పాతయామాస కోపేన రజకస్య శిరోభువి

హత్వాదాయ చ వస్త్రాణి పీతనీలాంబరౌతతః

కృష్ణరామౌ ముదాయుక్తా మాలాకార గృహం గతౌ

వికాసినేత్రయుగలో మాలాకారోతివిస్మితః

ఏతౌ కస్య కుతో యాతౌ మనసాచింతయ త్తతః

పీతనీలాంబరధరౌ దృష్ట్వాతి సుమనోహరౌ

స తర్కయామాస తదా భువం దేవా పుపాగతౌ

వికాసిముఖపద్మాభ్యాం తాభ్యాం పుష్పాణి యాచితః

భువం విష్టభ్య హస్తాభ్యాం పస్పర్శ శిరసామహీమ్‌

ప్రసాద సుముఖౌనాథౌ మమ గేహముపాగతౌ

ధన్యోహ మర్చయిష్యామీత్యాహ తౌ మాల్యజీవికః

తతః ప్రహృష్టవదన స్తయోః పుష్పాణికామతః

చారూణ్యేతాని చైతాని ప్రదదౌస విలోభయన్‌

పునః పునః ప్రణమ్యాసౌ మాలాకారో త్తమో దదౌ

పుష్పాణి తాభ్యాం చారూణి గంధవంత్యమలాని చ

మాలాకారాయ కృష్ణోపి ప్రసన్నః ప్రదదౌవరమ్‌

శ్రీస్త్వాం మత్సంశ్రయా భద్ర న కదాచిత్త్యజిష్యతి

బలహాని ర్నతే సౌమ్య ధనహాని రథాపివా

యావద్ధరణిసూర్యౌ చ సంతతిః పుత్రపౌత్రికీ

భుక్త్వా చ విపులాన్‌ భోగాం స్త్వమంతే మత్ప్రసాదతః

మమానుస్మరణం ప్రాప్య దివ్యలోకమవాప్స్యసి

ధర్మే మనశ్చ తే భద్ర సర్వకాలం భవిష్యతి

యుష్మత్సంతతి జాతానాం దీర్ఘమాయుర్భవిష్యతి

నోపసర్గాదికం దోషం యుష్మత్సతంతి సంభవః

ఆవాప్స్యతి మహాభాగ యావత్సూర్యో భవిష్యతి

ఇత్యుక్త్వా తద్గృహాత్కృష్ణో బలదేవ సహాయవాన్‌

నిర్జగామ మునిశ్రేష్టా మాలాకారేణ పూజితః

మీరిరువురు నడచి రండు. నేను రథమున నొక్కడనే నగరముం బ్రవేశింతును. మీరు వసుదేవు గృహమున కేగకుడు మీ నిమిత్తమున నా వృద్ధుని గంసుడు లేవగొట్టును. అని యక్రూరుం డొక్కడే మధురం జొచ్చెను. రామ కృష్ణులు రాజ మార్గమున వచ్చిరి. స్త్రీల పురుషుల యానంద భరితములైన చూపులం జూడ బడుచు వారు విలాసముగ నేనుగు గున్నలట్లు రాజ వీధిలో నడచిరి. అచట నట్టిట్టు దికుగుచు వారొక చాకలిం జూచి చక్కని చలువ మడతల నిమ్మని యడిగిరి. వాడు కంసుని చాకలి గావున మిగుల విస్మయ మంది రామకృష్ణులం గూర్చి యాక్షేప వాక్యములు పెక్కులు బిగ్గఱగా నరచెను. అంతట గినుక గొని కృష్ణుండర చేతం గొట్టి వాని తలను బుడమిం బడ గొట్టెను. వానిం జంపి పీత నీలాంబరులు కృష్ణుడు రాముడును నా బట్టలం గొని ముదమున మాలాకారు నింటికిం జనిరి. చక్కని వారింగని వాడు దేవత లవనికిం దిగిరని యెంచి మోములు వికసింప వారు పువ్వు లిమ్మని యడిగి నంతట చేతులం బుడమిందాకి తలతో నేలనంటి ప్రసన్న సుముఖులై ప్రభువులు నా యింటికి వచ్చితిరి నేను ధన్యుడను. మిమ్మర్చిం చెదనని యామాల్య జీవికుండు పలికి హర్ష వదనుడై పరమళించు చక్కని పువ్వులేరి యేరి మురిపించుచు మఱిమఱి మ్రొక్కి యా పెద్దమనిషి కోరి వారికి కాన్క వెట్టెను. కృష్ణుడును బ్రసన్నుడై మాలా కారునికి వరమిచ్చెను. ఓ భద్రుడా! (శుభ లక్షణా యన్నమాట) నన్నా శ్రయించిన సిరి నిన్నెప్పుడును విడువదు. నీ బలమునకు హాని గలుగదు. ఓ మంచివాడ! ధన హానియు నీకు గలుగదు. నీవు విపులము లైన భోగము లనుభవించి తుదకు నా ప్రసాదము వలన నా అనుస్మరణ మంది దివ్యలోక మందెదవు. నీమన నెల్లవేళల ధర్మము నందుండ గలదు. నీ సంతతికి బుట్టిన వారికి దీర్ఘాయువు గల్గును. నీ సంతరి సూర్యు డున్నంత కాలమెట్టి యిబ్బందులకు లోను గాదు అని యిట్లు పల్కి మాలాకారుని పూజగొని వాని యింటి నుండి కృష్ణుడు బలదేవుని తోడుగా బయలు వెడలెను.