బ్రహ్మ మహా పురాణము

231 - వ్యాస ముని సంవాదే ద్వాపర యుగాంత కథనమ్‌

భవిష్య కథనము

మునులు:

ఆసన్నం విప్రకృష్టం వా యది కాలం న విద్మహే

తతో ద్వాపరవిధ్వంసం యుగాంతం స్పృహయామహే

ప్రాప్తా వయం హి తత్కాల మనయా ధర్మతృష్ణయా

ఆదద్యా మపరంధర్మం సుఖమల్పేన కర్మణా

సంత్రాసోద్వేగజననం యుగాంతం సమువస్థితమ్‌

ప్రనష్టధర్మం ధర్మజ్ఞ నిమిత్తై ర్వక్తు మర్హసి

మునులు:

ఓ వ్యాస మహామునీ! ప్రళయ కాలము దగ్గరలో నున్నదో దూరములో నున్నదో మాకు తెలియదు. కనుక ఎప్పుడు ద్వాపర యుగము అంతమై కలి యుగము ఆరంభ మగునో ప్రళయము ఎప్పుడు వచ్చునో గుర్తించు విధము తెలిసికొన గోరి ఇటకు వచ్చితిమి. అల్పమగు ధర్మానుష్ఠానము తోనే అధికమగు ధర్మ ఫలము లభించు విధమును ధర్మము నాశము నొందుటచే మహా భయంకర మగు ప్రళయ సమయమును గుర్తించు విధమును ఓ మునీ! మాకు తెలుపుము.

వ్యాసులు:

అరక్షితారో హర్తారో బలిభాగస్య పార్థివాః

యుగాంతే ప్రభవిష్యంతి స్వరక్షణపరాయణాః

అక్షత్రియాశ్చ రాజానో విప్రాః శూద్రోపజీవినః

శూద్రాశ్చ బ్రాహ్మణాచారా భవిష్యంతి యుగక్షయే

శ్రోత్రియాః కాండపృష్ఠాశ్చ నిష్కర్మాణి హవీంషి చ

ఏకపంక్త్యా మశిష్యంతి యుగాంతే మునిసత్తమాః

అశిష్టవంతోర్థపరా నరా మద్యామిషప్రియాః

మిత్రభార్యాం భజిష్యంతి యుగాంతే పురుషాధమాః

రాజవృత్తిస్థితా శ్చౌరా రాజానశ్చౌరశీలినః

భృత్యా హ్య నిర్దిష్టభుజో భవిష్యంతి యుగక్షయే

ధనాని శ్లాఘనీయాని పతాం వృత్త మపూజితమ్‌

అతుత్సనా చ పతితే భవిష్యంతి యుగక్షయే

ప్రనష్టనాసాః పురుషా ముక్తకేశా విరూపిణః

ఊనషోడశవర్షాశ్చ ప్రసోష్యంతి తథాస్త్రియః

అట్టశూలా జనపదాః శివశూలా శ్చతుష్పథాః

ప్రమదాః కేశశూలాశ్చ భవిష్యంతి యుగక్షయే

సర్వేబ్రహ్మ వదిష్యంతి ద్విజా వాజసనేయికాః

శూద్రాభా వాదినశ్చైవ బ్రాహ్మణా శ్చాంత్యవాసినః

శుక్లదంతా జితాక్షాశ్చముండాః కాషాయవాసనః

శూద్రా ధర్మం వదిష్యంతి శాఠ్యబుద్ధ్యోపజీవినః

శ్వాపద ప్రచురత్వం చ గవాం చైవ పరిక్షయః

సాధూనాం పరివృత్తిశ్చ విద్యా దంతగతే యుగే

అంత్యా మధ్యే నివత్స్యంతి మధ్యాశ్చాంత్యనివాసినః

నిర్హ్రీకాశ్చ ప్రజాః సర్వా నష్టా స్త్ర యుగక్షయే

తపోయజ్ఞ ఫలానాం చ విక్రేతారో ద్విజోత్తమాః

ఋతవో విపరీతాశ్చ భవిష్యంతి యుగక్షయే

తథా ద్విహాయనా దమ్యాః కలౌ లాంగలధారిణః

చిత్రవర్షీ చ వర్జన్యో యుగే క్షీణే భవిష్యతి

వ్యాసులు:

యుగాంత కాలమున రాజులు ప్రజలను రక్షింపకయే పన్నులు గ్రహించుచు తమ్ము తాము రక్షించు కొనుట యందాసక్తి కలిగి యుందురు. క్షత్రియులు కానివారు రాజు లగుదురు. బ్రాహ్మణులు శూద్రుల సేవించి జీవింతురు. శూద్రులు బ్రాహ్మణుల ఆచారములను పాటింతురు. వేద పండితులు కాండపృష్ఠులు వేదములను నిరర్థకముగా మోయువారు అగుదురు. కర్మానుష్ఠానము సరిగా చేయకయే హవిస్సును అగ్నిలో వేల్చెదరు. అన్ని కులముల వారును ఒకే పంక్తితో భుజింతురు. జనులు శిష్టాచారములు లేక ధనము ముఖ్యమని భావించుచు మద్య మాంసముల యందు ప్రీతి కల వారగుదురు. నరాధములై మిత్రుల భార్యల ననుభవింతురు. దొంగలు రాజుల వలెను రాజులు దొంగల వలెను ప్రవర్తింతురు. భృత్యులు తమకు అర్హము కాని దానిని అనుభవింతురు. ధనములకు గౌరవము కలుగును. సత్ర్పవర్తనకు ఆదరము కలుగదు. భ్రష్టుడైన వానిని ఎవరును నిందింపక మెచ్చు కొందురు. పురుషులు వివేక హీనులు జుట్టు ముడివేసి కొనక విడిచిన వారు విరూపులు అగుదురు. పదునా ఱేండ్లలోపు స్త్రీలకే కాన్పు అగును. జనపదము లలో అన్నము అమ్మ బడును. నడి వీథులలో వేదము విక్రయించ బడును. స్త్రీలును మానమును అమ్ము కొందురు. బ్రాహ్మణులు అంత్యజులగు వారితో కలిసి వసించుచు శూద్రుల వలె మాటలాడు చుందురు. శూద్రులు తెల్లని దంతములు కలవారు ఇంద్రియముల జయించిన వారునై తలలు బోడిగా చేసికొని కాషాయ వస్త్రములు ధరించి కపట ధూర్త బుద్ధితో జీవించుచు ధర్మము ప్రవచింతురు. కుక్కలు ఎక్కు వగును. గోవులు తగ్గును. సాధువులును తగ్గి పోవుదురు. గ్రామాంతరముల యందు నివసింప వలసిన వారు గ్రామ మధ్యమునను, గ్రామ మధ్య నుండ వలసినవారు గ్రామాంతమున నివసింతురు. జనులు అందరు సిగ్గు లేని వారయి తత్ఫలముగా నశింతురు. బ్రాహ్మణులు తపోయజ్ఞ ఫలమ్ము కొందురు. ఋతు ధర్మములు తారు మారగును. రెండేండ్ల గిత్తలచే నాగళ్ళు లాగింతురు. వానలు క్రమము ననుసరించి కురియ కుండును.

సర్వే శూరకూలే జాతాః క్షమానాథా భవంతి హి

యథానామ్నాః ప్రజాః సర్వా భవిష్యంతి యుగక్షయే

పితృదేయాని దత్తాని భవిష్యంతి తథా సుతాః

న చ ధర్మ చరిష్యంతి మానవా నిర్గతే యుగే

ఊషరా బహూశా భూమిః పంథాన స్తస్కరావృతాః

సర్వే వాణికాశ్చైవ భవిష్యంతి యుగక్ష యే

పితృదాయా న్యదత్తాని విభజంతి తథా సుతాః

హరణే యత్నవంతోపి లోభాదిభి ర్విరోధినః

సౌకుమార్యే తథారూపే రత్నే చో పక్షయంగతే

భవిష్యంతి యుగస్యాంతే నార్యః కేశైరలంకృతాం

నిర్వీర్యస్య రతిస్తత్ర గృహస్థస్య భవిష్యతి

యుగాంతే సమనుప్రాప్తే నాన్యా భార్యాసమా రతిః

కుశీలానార్యభూయిష్ఠా వృథారూపసమన్వితాః

పురుషాల్పం బహుస్త్రీకం త ద్యుగాంతస్య లక్షణమ్‌

బహూయాచనకో లోకో స దాస్యతి పరస్పరమ్‌

రాజాచౌరాగ్ని దండాది క్షీణః క్షయ ముపైష్యతి

అఫలాని చ సస్యాని తరుణా వృద్ధశీలినః

అశీలాః సుఖినో లోకే భవిష్యంతి యుగక్షయే

వర్షాసు పరుషా వాతా నీచాః శర్కర వర్షిణః

సందిగ్ధః పరలోక శ్చ భవిష్యతి యుగక్షయే

వైశ్యా ఇవ చ రాజన్యా ధన ధన్యోప జీవినః

యుగాపక్రమణే పూర్వం భవిష్యంతి న బాంధవాః

అప్రవృత్తాః ప్రణశ్యంతి సమయాః శపథా స్తథా

ఋణం సవినయ భ్రంశం యుగే క్షీణే భవిష్యతి

భవిష్య త్యఫలో హర్హః క్రోధ శ్చ సఫలో నృణామ్‌

అజా శ్చాపి నిరోత్స్యంతి వయసోర్ధే యుగక్షయే

అశాస్త్ర విహితో యజ్ఞ ఏవ మేవ భవిష్యతి

అప్రమాణం కరిష్యంతి నరాః పండిత మానినః

శాస్త్రోక్త స్యాప్ర వక్తారో భవిష్యంతి స సంశయః

సర్వః సర్వం విజానాతి వృద్ధా ననుపనేవ్య వై

న కశ్చి దకవి ర్నామ యుగాంతే సమువస్థితే

నక్షత్రాణి వియోగాని న కర్మస్థా ద్విజాతయః

చౌరప్రాయా శ్చ రాజానో యుగాంతే సమువస్థితే

కుండీవృషా నైకృతికాః సురాపా బ్రహ్మవాదినః

అశ్వమేధేన యక్ష్యంతే యుగాంతే ద్విజసత్తమాః

యాజయిష్యం త్యయాజ్యాం స్తు తథాభక్ష్యస్య భక్షిణః

బ్రాహ్మణా ధనతృష్ణార్తా యుగాంతే సముపస్థితే

భోఃశబ్ద మభిధాస్యంతి స చ కశ్చి త్పఠిష్యతి

ఏకశంఖా స్తథా నార్యో గవేధుక పినద్ధకాః

నక్షత్రాణి వివర్ణాని విపరీతా దిశో దశ

సంధ్యారాగో విదగ్ధాంగో భవిష్యతి యుగక్షయే

ప్రేషయంతి పితౄ న్పుత్రా వధూః శ్వశ్రూః స్వకర్మసు

యుగే ష్వేవం నివత్స్యంతి ప్రమదాశ్చ నరా స్తథా

అకృత్వాగ్రాణి భోక్ష్యంతి ద్విజాశ్చైవాహుతాగ్నయః

భిక్షాం బలి మదత్త్వా చ భోక్ష్యంతి పురుషాః స్వయమ్‌

వంచయిత్వా పతీ న్సుప్తా న్గమిష్యంతి స్త్రియోన్యతః

వ వ్యాధితా న్నాప్యరూపా న్గ్నోద్యతా న్నాప్యసూయకాన్‌

కృతే న ప్రతికార్త చ యుగే క్షీణే భవిష్యతి

దొంగల వంశములలో పుట్టిన వారందరును ప్రభువు లగుదురు. దానికి తగిన వారుగానే ప్రజలు నుందురు. తండ్రులకు ఈయ దగినవి అన్నియు ఇతరులకు ఈయ బడును. కుమారులు గాని ఇతర మానవులు గాని తాము తాము ఆచరించ వలసిన ధర్మములను ఆచరింపరు. భూమి ఎక్కువ చవిటి నేల యగును. త్రోవలు అన్నియు దొంగలతో నిండి పోవును. తండ్రి నుండి దాయ భాగముగా వచ్చిన ఆస్తిని కుమారులు పంచు కొనుటలో లోభముతో నిండిన వారై పరస్పరము కలహించు కొనుచు తామే ఎక్కువ హరించుకొన వలెనను ప్రయత్నముతో కూడిన వారై యుందురు. స్త్రీలు తమ సౌకుమార్యము రూపము నశించి పోగా కేశములతో మాత్రమే అలంకారము చేసి కొందురు. పురుషుడు నిర్వీర్యుడై యుండియు అట్టి భార్యలతో సుఖింతురు. భార్యతో సుఖించుటయే పరమ సుఖముగా భావింతురు. జనులు చాల భాగము దుఃశీలము కలవారు అనార్యులు ఐయుందురు. నిరుపయోగముగా రూప సౌందర్యముల పోషించు కొందురు. పురుషులు తగ్గి పోవుదురు. స్త్రీల సంఖ్య అధిక మగును. పైరులలో పంట తక్కు వగును. యాచకు లెక్కు వగుదురు. ఒకరి కొకరు ఇచ్చు కొనుట ఉండదు. రాజ దండనము చోరపీడల వలన బాధ నొంది జనులు నశింతురు. యువకులు కూడ వృద్ధుల వలె అలవాటులు కలవారుగా నుందురు. శీలము లేనివారు సుఖింతురు. వర్షాకాల మందును పరుష మైన గాలులు ఇసుకను వర్షించు చుండును. పర లోకము లేదా ఉన్నదా అని సందేహింతురు. క్షత్త్రియులును వైశ్యుల వలె ధన ధాన్యములపై అధార పడి జీవింతురు. బంధు ప్రీతి తగ్గి పోవును. ఒడంబడికలు శపథములు పని చేయక నశించును. ఋణము తీర్చు విషయములో సద్వ్యవహార ముండదు. సంతోషము నిష్ఫలమై క్రోధము సఫల మగును. అనగా కోపము చేసిన వారికి మనుష్యులు భయ పడుదురే కాని నిదానముగా చెప్పిన మాట వినరు. పాడికే మేకలను గొర్రెలను కట్టివేసి కొందురు. యజ్ఞములు శాస్త్ర విధానము ననుసరింపకయే జరుగు చుండును. నరులు ఎవరికి వారు తామే పండితుల మనుకొనుచు శాస్త్ర ప్రమాణము లతో పనిలేక అయా కార్యము లాచరింతురు. శాస్త్ర విషయములను ప్రవచించు వారుండరు. పెద్దలను సేవించి విషయములను తెలిసి కొనకయే తనకు విషయము తెలిసెనను. ప్రతి వాడును కవియే. నక్షత్రములు సరియైన యోగములతో నుండవు. బ్రాహ్మణులు తమ ధర్మ కర్మములను సరిగా ఆచరింపరు. రాజులు దొంగల వంటి వారగుదురు. బ్రాహ్మణులు మోస గాండ్రు కల్లు త్రాగువారు నగుదురు. అశ్వమేధ యాగము చేయుదురు. యాగము చేయింప తగని వారిచే యజ్ఞముల చేయింతురు. తినరాని దానిని తిందురు. ధనాశాపరు లగుదురు. అందరును ‘‘భోః’‘ అను శబ్దమును ఉచ్చరింతురే కాని ఒక్కడును అధ్యయనము చేయడు. స్త్రీలు గడ్డితో తలలు కప్పికొందురు. నక్షత్రములు కాంతి తగ్గును. దిక్కులు తారు మారగును. సాయం సంధ్యా కాలపు ఎఱుపు దిక్కులు మండు చున్నట్లు కనబడును. కుమారులు తండ్రులకును కోడళ్ళు అత్తలకును పనులు ఆజ్ఞాపింతురు. బ్రాహ్మణులు హోమములు చేయరు. ఏమియు ఇతరులకు మిగుల్చక అంతయు తామే తిందురు. నిద్రించు చున్న భర్తలను మోసగించి స్త్రీలు మఱియొక చోటికి పోవుదురు. స్త్రీలు రోగులు గాను రూపహీనులు గాను ప్రయత్న పరులు గాను తన తప్పులు గుర్తించు వారు గాను నుండు భర్తలను పొందరు. ఉపకారికి ఎవరును ప్రత్యుపకారము కూడ చేయరు.

మునులు:

ఏవం విలంబితేధర్మే మానుషాః కరపీడితాః

కుత్ర దేశే నివత్స్యంతి కి మాహారవిహారిణః

కిం కర్మాణః కి మీహంతః కిం ప్రమాణాః కి మాయుషః

కాం చ కాష్ఠాం సమాసాద్య ప్రపత్స్యంతి కృతం యుగమ్‌

మునులు:

ఇట్లు యుగాంతమున ధర్మము లోపింపగా మనుష్యులు కష్టములు పొందుచు ఏ ఆహార విహారములు కలిగి ఏ కర్మ లాచరించుచు ఏ కోరికలు కోరుచు ఎంత ప్రమాణము (ఎత్తు కొలతలు) ఎంత ఆయువు కలవారై కాలము గడుపుచు మరల కృత యుగమును అందు కొందురు ? అని మునులు వ్యాసులు నడిగిరి.

వ్యాసులు:

ఆత ఊర్ధ్వం చ్యుతే ధర్మే గుణహీనాః ప్రజా స్తథా

శీలవ్యసన మాసాద్య ప్రాప్స్యంతి హ్రానమాయుషః

ఆయుర్హాన్యా బలగ్నా నిర్బలగ్నాన్యా వివర్ణతా

వై వర్ణ్యా ద్వ్యాధి సంపీడా నిర్వేదో వ్యాధిపీఢనాత్‌

నిర్వేదా దాత్మ సంబోధః సంబోధా ద్ధర్మశీలతా

ఏవం గత్వా పరాం కాష్ఠాం ప్రపత్స్యంతి కృతం యుగమ్‌

ఉద్దేశతో ధర్మశీలాః కేచి న్మధ్యస్థతాం గతాః

కింధర్మశీలాః కేచి త్తు కేచి దత్ర కుతూహలాః

ప్రత్యక్ష మనుమానం చ ప్రమాణ మితి నిశ్చితాః

అప్రమాణం కరిష్యంతి సర్వ మిత్యపరే జనాః

నాస్తిక్యపరతా శ్చాపి కేచి ద్ధర్మవిరోపకాః

భవిష్యంతి సరా మూఢా ద్విజాః పండితమానినః

తదాత్వ మాత్ర శ్రద్ధేయాః శాస్త్ర జ్ఞాన బహిష్కృతాః

దాంభికా స్తే భవిష్యంతి నారా జ్ఞానవిలోపితాః

తథా విలులితే ధర్మే జనాః శ్రేష్ఠ పురస్కృతాః

శుభా స్పమాచరిష్యంతి దానశీలపరాయణాః

సర్వభక్షాః స్వయంగుప్తా నిర్ఘ్రణా నిరపత్రపాః

భవిష్యంతి తదాలోకే త త్కమాయస్య లక్షణమ్‌

కషా మోపప్లవే కాలే జ్ఞాననిష్ఠా ప్రణాశనే

సిద్ధి మల్పేన కాలేన ప్రాప్స్యంతి నిరుపస్కృతాః

విప్రాణాం శాశ్వతీం వృత్తిం యదా వర్ణవరే జనాః

సంశ్రయిష్యంతి భో విప్రా స్తత్కషాయస్య లక్షణమ్‌

మహాయుద్ధం మహావర్షం మహావాతం మహాతపః

భవిష్యతి యుగే క్షీణే త త్కషాయస్య లక్షణమ్‌

విప్రరూపేణ యక్షాంసి రాజానః కర్ణవేధినః

పృథివీ ముపభోక్ష్యంతి యుగాంతే సమువస్థితే

నిఃస్వాద్యాయవషట్రారాః కునేతారో భిమానినః

క్రావ్యాదా బ్రహ్మరూపేణ సర్వభక్ష్యా వృథావ్రతాః

మూరా శ్చార్థపరా లుబ్ధాః క్షుద్రాః క్షుద్ర పరిచ్ఛదాః

వ్యవహారోవవృత్తా శ్చ చ్యుతా చ్చ శాశ్వతాత్‌

హర్తారః పరరత్నానాం పరదారప్రధర్షకాః

కామాత్మానో దురాత్మానః సోపధాః ప్రియసాహసాః

తేషు ప్రభవమానేషు జనే ష్వపి చ సర్వశః

అభావినో భవిష్యంతి మునయో బహూరూపిణః

కలౌయుగే సముత్పన్నాః ప్రధానపురుషా శ్చ యే

కథాయోగేన తా న్సర్వా న్పూజయిష్యంతి మానవాః

సస్య చౌరా భవిష్యంతి తథా చై లాపహారిణః

భోక్ష్య భోజ్యహరా శ్చైవ కరండానాం చ హారిణః

చౌరాశ్చౌరస్య హర్తారో హంతా హంతు ర్భవిష్యతి

చౌరై శ్చౌరక్షయే చాపి కృతే క్షేమం భవిష్యతి

నిఃసారే క్షుభితే కాలే నిష్క్రియే సంవ్యవస్థితే

నరా వనం శ్రయిష్యంతి కరభారప్రపీడితాః

యజ్ఞకర్మ ణ్యుపరతే కక్షాంపి శ్వాపదాని చ

కీటమూషికనర్పాశ్చ ధర్షయిష్యంతి మానవాన్‌

క్షేమం సుభిక్ష మారోగ్యం సామగ్ర్యం చైప బంధుషు

ఉద్ధేశేషు నరాః శ్రేష్టా భవిష్యంతి యుగక్షయే

స్వయంపాలాః స్వయం చౌరాః ప్లవసంభార సంభృతాః

మండలైః సంభవిష్యంతి దేశేదేశే పృథ క్పృథక్‌

స్వదేశేభ్యః పరిభ్రష్టా నిఃసారాః సహ బంధుభిః

నరాః సర్వే భవిష్యంతి తదా కాలపరిక్షయాత్‌

వ్యాసులు:

అటు మీదట క్రమముగా ధర్మము భ్రష్టమై పోగా ప్రజలు సద్గుణ హీను లగుదురు. శీలము నశించును. ఆయువు క్షీణ మగును. బలము తగ్గును. దానిచే దేహము వన్నె తఱుగును. దానిచే వ్యాధుల బాధ కలుగును. దానిచే వైరాగ్యము కలుగును. దానిచే ఆత్మజ్ఞాన సిద్ధికై ప్రయత్నించి దానిని పొంది మఱల జనుల ధర్మశీలు రగుదురు. ఇట్లు మరల ఉన్నత స్థితికి పోయి పోయి కృతయుగమును అందు కొనెదరు. అంతకు లోగా మాత్రము కొందఱు నామ మాత్రమునకు ధర్మ శీలము కలవారు కొందఱు ధర్మము తెలిసియు పట్టించు కొనని తటస్థులు కొందఱు అల్పముగా ధర్మ శీలము కలవారు కొందఱు వేడుకకు మాత్రము ధర్మమును అనుష్ఠించు వారు అగుదురు. ప్రత్యక్షముగా ఇంద్రియములకు గోచరించు నదే ప్రమాణమని కొందఱు అనుమానము హేతువుచే నిర్ణయించినది కూడ ప్రమాణ మేయని మఱి కొందరు ఏ ప్రమాణముతోను పనిలేదు మఱి కొందరు వాదింతురు. నాస్తికత్వమును పూనువారు ధర్మమును లోపింప జేయువారు అగుదురు. బ్రాహ్మణులను తామే పండితులమను అహంకారముతో నుందురు. అప్పటికి పని జరుగు విషయముల మీద మాత్రము శ్రద్ధకల వారై శాస్త్ర జ్ఞానము లేక దాంభికులై పరమార్థత త్త్వజ్ఞానము లేకుందురు. ఇట్లు ధర్మము నశించగా జనులు మరల శ్రేష్ఠులగు పెద్దలను ముందు పెట్టుకొని దాన గుణము సుశీలము కలవారై శుభము కలిగించు కర్మలను ఆచరింతురు. జనులు సిగ్గులేక సర్వము భక్షింతురు. తమకై అన్నియు దాచు కొందురు. నిర్దయు లగుదురు. జ్ఞానము సాధించుట యందు నిష్ఠ ఉండదు. అట్టి స్థితిలో జ్ఞాన నిష్ఠ కలవారు మాత్రము అల్పకాల తపము తోనే సిద్ది పొందుదురు. యుగాంతమున తక్కువ కులముల వారు బ్రాహ్మణుల ప్రవర్తనమును వహింతురు. మహా యుద్ధములు మహా వర్షములు పెను గాలులు తీవ్రమగు ఎండలు సంభవించును. రాజులు కర్మవాదులు అయి భూమిని రాజ్యమును అనుభవింతురు. రాక్షసులు బ్రాహ్మణులై జన్మింతురు. వారు స్వాధ్యాయము వషట్కారములు మొదలగు యజ్ఞ వాక్కులు లేక జనులను చెడు మార్గములలో నడపుచు దురభిమానులై సర్వము భక్షించుచు వ్యర్థముగా కపటమునకు మాత్రము కర్మానుష్ఠానము చేయుదురు. వారు మూర్ఖులు ధన ప్రధానులు లోభులు క్షుద్రులు క్షుద్రులను పరివార జనముగా పెట్టుకొనిన వారు శాశ్వత మగు ధర్మమును వదలి లోక వ్యవహారము నకై పాటు పడువారు అగుదురు. పర ధనముల హరింతురు. పరదారలను ఆశింతురు. కామముతో దురాత్ములై కపటులై సాహసము మీద ఇష్టము కలవారై ఉందురు. బ్రాహ్మణులు ఇట్లు కాగా మునులు అనేక లక్షణము లతో ఉందురు. జనులలో జరుగ రాని చెడుగులు జరుగును. ప్రధాన పురుషులుగా ఏర్పడిన వ్యక్తులను గూర్చిన కథలకు ప్రాముఖ్య మిచ్చి అట్టి వారిని పూజించు చుందురు. జనులు పంటలు పైరులు వస్త్రములు భక్ష్య భోజ్యములు వస్తువులు దాచుకొను డబ్బీలు దొంగిలించు వారగుదురు. దొంగల ధనము హరించు దొంగలు వధించు వారిని కూడ వధించు క్రూరులు అగుదురు. ఇట్లు దొంగలు ప్రాణివధ చేయు వారు నశించిపోగా ప్రజలకు క్షేమము కలుగును. ఇట్లు లోకము నిఃసారమై క్షోభము చెందగా ఏమియు చేయలేక పన్నుల బరువు మోయలేక జనులు అడవులకు పారి పోవుదురు. యజ్ఞ కర్మలు లోపించుటచే జనులకు రాక్షసుల క్రూర మృగముల కీటక మూషిక సర్పముల వలన భయమెక్కు వగును. ప్రజలలో క్షేమము సుభిక్షము ఆరోగ్యము బంధు సమృద్ధి ఉండ వలెనను ఉద్దేశము కలవారె వరైన నున్నచో అట్టివారు నర శ్రేష్ఠులని భావించ వలసిన కాలము వచ్చును. ఇట్టి స్థితిలో జనులు నిఃసారులై తమ వారితో కూడ స్వదేశములు విడిచి పోవుదురు.

తతః సర్వే సమాదాయ కుమారా న్ప్రద్రుతా భయాత్‌

కౌశికీం సంతరిష్యంతి నరాః క్షుద్భయ పీడితాః

అంగా న్వంగా న్కశింగాం శ్చ కాశ్మీరా వథ కోసలాన్‌

ఋషికాంత గిరిద్రోణీః సంశ్రయిష్యంతి మానవాః

కృత్స్నం చ హిమవ త్పార్శ్వం కూలం చ లవణాంభనః

వివిధం జీర్ణపత్రం చ వల్కలా వ్యజినానిచ

స్వయం కృత్వా నివత్స్యంతి తస్మి న్భూతే యుగక్షయే

అరణ్యేషు చ వత్స్యంతి నరా మ్లేచ్ఛగణైః సహ

నైవ శూన్యా నవారణ్యా భవిష్యతి వసుంధరా

అగోప్తార శ్చ గోప్తారో భవిష్యంతి నరాధిపాః

మృగై ర్మత్స్యై ర్విహంగై శ్చ శ్వాపదైః సర్పకీటకైః

మధుశాకఫలై ర్మూలై ర్వర్తయిష్యంతి మానవాః

శీర్ణవర్నఫలాహారా వల్కలాన్యజినాని చ

స్వయం కృత్వా నివత్స్యంతి యథా మునిజన స్తథా

బీజానా మకృతస్నేహా ఆహతాః కాష్ఠశంకుభిః

అజైణకం ఖరోష్ట్రం చ పాలయిష్యంతి నిత్యశః

నదీ స్రోతాంసి రోత్స్వంతి తోయార్థం కూలమాశ్రితాః

పక్వాన్న వ్యవహారేణ విపణంతః పరస్పరమ్‌

తనూరుహైర్యథాజాతైః సమలాంతరసంభృతైః

బహ్వపత్యాః ప్రజాహీనాః కులశీల వివర్జితాః

ఏవం భవిష్యంతి తదా నరా శ్చాధర్మ జీవినః

హీనా హీనం తథా ధర్మం ప్రజా సమనువత్స్యతి

అయు స్తత్ర చ మర్త్యానాం పరం త్రింశ ద్భవిష్యతి

దుర్బలా విషయగ్లానా జరాశోకై రభిప్లుతాః

భవిష్యంతి తదా తేషాం రోగై రింద్రియ సంక్షయః

అయుఃప్రత్యయసంరోధా ద్విషయా దుపరంస్యతే

శుశ్రూషవో భవిష్యంతి సాధూనాం దర్శనే రతాః

సత్యం చ ప్రతిపత్స్యంతి వ్యవహారోప సంక్షయాత్‌

భవిష్యంతి చ కామానా మలాభాద్ధర్మ శీలినః

కరిష్యంతి చ సంస్కారం స్వయం చ క్షయపీడితాః

ఏవం శుశ్రూషవో దానే సత్యే ప్రాణ్యభిరక్షణే

తతః పాదప్రవృత్తే తు ధర్మే శ్రేయో నిపత్స్యతే

తేషాం లబ్ధానుమానానాం గుణేషు పరివర్తతామ్‌

స్వాదు కింత్వితి విజ్ఞాయ ధర్మ ఏవ చ దృశ్యతే

యథాహావిక్రమం ప్రాప్తా స్తథా బుద్ధిక్రమం గతాః

ప్రగృహీతే తతో ధర్మే ప్రపశ్యంతి కృతం యుగమ్‌

సాధువృత్తిః కృతయుగే కషాయే హాని రుచ్యతే

ఏక ఏవ తు కాలోయం హీనవర్ణో యథా శశీ

ఛన్నశ్చ తమసా సోమో యథా కలియుగం తథా

ముక్తశ్చ తమసా సోమ ఏవం కృతయుగం చ తత్‌

అర్థవాదః పరం బ్రహ్మ వేదార్థ ఇతి తం విదుః

అవివిక్త మవిజ్ఞాతం దాయాద్య మిహ ధార్యతే

ఇష్టవాద స్తపో నామ తపో హి స్థవిరీకృతః

గుణైః కర్మాభినిర్వృత్తి ర్గుణాః శుధ్యంతి కర్మణా

ఆశీస్తు పురుషం దృష్ట్వా దేశకాలానువర్తినీ

యుగే యుగే యథా కాల మృషిభిః సముదాహృతా

ధర్మార్థకామమోక్షణాం దేవానాం చ ప్రతిక్రియా

ఆశిష శ్చ శివాః పుణ్యా స్తథైవా యు ర్యుగే యుగే

తథా యుగానాం పరివర్తనాని చిరప్రవృత్తాని విధిస్వభావాత్‌

క్షణం న సంతిష్ఠంతిచ జీవలోకః క్షయోదయాభ్యాం పరివర్తమానః

జనులంతట కుమారులను వెంట తీసికొని భయముతో పారి పోవుచు కౌశికీ నదిని (హిమాలయ సమీపమున) దాటి ఆకలితో బాధ పడుచు అంగవంగ కశింగ కాశ్మీర కోసల దేశములను కొండ లోయలను హిమ వత్పర్వత ప్రాంతమును సముద్ర తీరము నంతటిని ఆశ్రయించి నివసించుచు తమకు తామే శ్రమించి సంపాదించు కొనిన ఎండుటాకులు తినుచు చర్మములు చెట్ల నారలు ధరించుచు జీవింతురు. భూమి శూన్యమును కాక అడవియును కాక యుండును. ప్రభువులు ప్రజల రక్షింపని వారగుదురు. మానవులు మృగములను చేపలను పక్షులను క్రూర మృగములను పాములను పురుగులను తేనెను ఆకు కూరలను పండ్లను దుంపలను వేళ్ళను ఎండు టాకులను తిని జీవింతురు. తమ వంశము వారిపై కూడ స్నేహ భావము లేక కర్రలతో చేసిన శంకువులతో కొట్లాడు కొనుచు మేకలను గొర్రెలను గాడిదలను ఒంటెలను పశువులుగా పోషించు కొను చుందురు. నదీ తీరములను ఆశ్రయించి నివసించుచు నీటికై నదీ జల ప్రవాహములను అడ్డు కట్టలతో అడ్డగింతురు. జుట్టు మొలచినది మొలిచి నట్లు లోపల మురికితో నిండి పెరుగు చుండ అట్లే వదలుదురు. కొందఱికి సంతానము అధికము. కొందఱికి సంతానమే కలుగదు. కుల శీలము లుండవు. వండిన ఆహార పదార్థములు అమ్ముచు కొనుచు వానితో వ్యాపారము చేయుదురు. ప్రజలు హీనులై హీన ధర్మమును అనుసరింతురు. విషయ సుఖములకు పాల్పడి దుర్బలులు రోగులునై ఇంద్రియములు క్షీణములై జరా శోకములచే బాధ నొందుదురు. ఆయువు తగ్గునని భయము కలుగగా చివరకు ఇంద్రియ సుఖముల నుండి వెనుకకు మరలుదురు. లోక వ్యవహారము చేతకాక పోవుటచే వైరాగ్యము కలిగి సత్పురుషుల దర్శించి సేవించ వలెనను కోరిక కలుగును. సత్యముపై శ్రద్ధ కలుగును. పెద్దల ఆజ్ఞను పాటించి సద్గుణముల వైపునకు మరలుట చేత ధర్మమే మంచిదని తోచి దాని ననుష్ఠింతురు. కోరికలు తీరుటకు అవకాశము లేక పోవుటచే ధర్మశీలులు లగుదురు సుఖ క్షయముచే బాధనొంది చిత్తసంస్కారము సంపాదింతురు. ప్రాణులపై దయ కలుగును. ఇట్లు పాదపాద క్రమమున మరల ధర్మము వృద్ధి యగుట కారంభమగును. ఇట్లు మరల జనులు కృత యుగము లోనిక వత్తురు. కాలము ఎప్పుడును ఒక్కటియే. కలి యుగమున ధర్మక్షయము కృత యుగమున ధర్మవృద్ధి ఇదే భేదము. చంద్రు డొక్కడే రాహువు కప్పినచో మలినుడై విడిచి నపుడు ప్రకాశించును కదా! కలి యుగమున పర బ్రహ్మతత్త్వము అర్థ వాదముగా పొగుడుటకు చెప్పిన గొప్ప మాటగా భావింతురు. కృత యుగములో ఆ పర బ్రహ్మమును వేదముచే తెలియ దగిన వస్తువుగా గ్రహింతురు. ఆ తత్త్వము కలిలో తెలియ రానిదై వివేచింప రానిదై శత్రు భావముతో చూడ బడును. కలిలో తపస్సు అనునది ఇష్ఠముతో వేడుకకు చేయు పనిగా ఉండును. కృత యుగములో అదే తపస్సు గౌరవించ బడును. ఇదే రెంటికి భేదము. సద్గుణము లున్నచో కర్మ లనుష్ఠించ గలరు. కర్మలు అనుష్ఠించినచో గుణములు సంస్కారము నొంది శుద్ధము లగును. ఆయా యుగము లందలి పురుషుని యోగ్యతను బట్టి దేశ కాలాను సారముగా వారివారి కోరికలును ఆచరణములు నుండునని ఋషులు చెప్పిరి. యుగ యుగమునను పురుషుని యోగ్యతా నుసారమే ధర్మార్ధ కామ మోక్ష సాధనకై కర్మా నుష్ఠానము దేవతల అనుగ్రహము శుభములు పుణ్యములు నగు కోరికలు జనులకు కలుగును. ఇట్లు యుగముల పరివర్తన ములు విధి చేసిన సృష్టి స్వభావము ననుసరించి అనాది నుండియు ప్రవర్తిల్లు చున్నవి. ముందును ఇట్లే ప్రవర్తిల్లు చుండును. ఈ జీవ లోకము కూడ యుగ స్వభావము ననుసరించి క్షయమును వృద్ధిని పొందుచు మార్పుల నొందు చుండునే కాని ఒక్క క్షణము కూడ మార్పులేక నిలుకడగా నుండదు.