లోమహర్షణుడు:
శ్రుత్వైవం యమమార్గం తే నరకేషు చ యాతనామ్
పప్రచ్ఛుశ్చ పునర్వ్యాసం సంశయం మునిసత్తమాః
లోమహర్షణుడు:
మునివరులు యమ మార్గము నరక యాతనలను గురించి విని తిఱిగి వ్యాసుని యీ క్రింది సందేహ మడిగిరి.
మునులు:
భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద
మర్త్యస్య కః సహాయోవై పితా మాతా సుతో గురుః
జాతిసంబంధివర్గశ్చ మిత్రవర్గస్తథైవ చ
మృతం శరీరముత్సృజ్య కాష్ఠలోష్టసమం జనః
గచ్ఛంత్యముత్ర లోకేవై కశ్చ తాననుగచ్ఛతి
మునులు:
భగవంతుడా! సర్వ ధర్మజ్ఞా! సర్వశాస్త్ర విశారద! మానవునకు సహాయులు తండ్రియా తాతయా కొడుకా గురువా! జ్ఞాతులు, బంధు వర్గమా, మిత్రవర్గమా జనులు చని పోయిన వాని శరీరము కట్టెను రాతినట్లు విసరి పార వేయుదురు గాని వాని వెంబడిని బోవు వాడెవ్వడు? అన వ్యాస దేవులు
వ్యాసులు:
ఏకః ప్రసూయతే విప్రా ఏక ఏవహి నశ్యతి
ఏకస్తరతి దుర్గాణి గచ్ఛత్యేకస్తు దుర్గతిమ్
అసహాయః పితామాతా తథా భ్రాతా సుతోగురుః
జ్ఞాతిసంబంధివర్గశ్చ మిత్రవర్గస్తథైవ చ
మృతం శరీరముత్సృజ్య కాష్ఠలోష్టసమం జనాః
ముహూర్తమివ రోదిత్వా తతోయాంతి పరాఙ్ముఖాః
తైస్తచ్ఛరీరముత్సృష్టం ధర్మ ఏకోనుగచ్ఛతి
తస్మాద్ధర్మః సహాయశ్చ సేవితవ్యః సచానృభిః
ప్రాణీ ధర్మసమాయుక్తో గచ్ఛేత్స్వర్గతిం పరామ్
తథైవాధర్మసంయుక్తో నరకం చోపపద్యతే
తస్మాత్పాపాగతైరర్థెర్నానురజ్యేత పండితః
ధర్మఏకో మనుష్యాణాం సహాయః పరికీర్తితః
లోభాన్మోహాదనుక్రోశాద్భయాద్వాథ బహుశ్రుతః
నరః కరోత్యకార్యాణి పరార్ధే లోభమోహితః
ధర్మశ్చార్థశ్చ కామశ్చ త్రితయం జీవతః ఫలమ్
ఏతత్త్రయమవాప్తవ్య మధర్మపరివర్జితమ్
వ్యాసులు:
నరు డొక్కడే పుట్టును ఒక్కడు గానే గిట్టును. ఒక్కడే దుర్గతిని దాటును. ఒక్కతే దుర్గతి నందును. జీవుడు నిస్సహాయుడు. చచ్చిన శరీరమును మీరు అన్నట్లు పారవేసి బంధువులు కొలది సేపేడ్చి వెను దిరిగి పోవుదురు. వారు పారవేసిన యా జీవుని ధర్మ మొక్కటే వెంబడించును. అందుచే ధర్మమన్ని యవస్థ లందు అన్ని లోకము లందు సహాయ మగును గావున నరులు దానిని సేవింప వలయును. లోభ మోహముల వలన జాలి వలన భయము వలన బహు శ్రుతుడు (పండితుడు) కూడ యితరుల కొరకు లోభ వశుడై తప్పిదములు చేయును. బ్రతుకునకు ఫలము ధర్మము అర్థము కామమునను మూడు పురుషార్థములు. ధర్మము తప్పకుండ నీ మూడు ఫలములను బొంది తీర వలెను. అన విని మునులిట్లనిరి.
మునులు:
శ్రుతం భగవతో వాక్యం ధర్మయుక్తం పరం హితమ్
శరీరసిచయం జ్ఞాతుం బుద్ధిర్నోత్ర ప్రజాయతే
మృతం శరీరం హి నృణాం సూక్ష్మమవ్యక్తతాం గతమ్
ఆచక్షుర్విషయం ప్రాప్తం కథం ధర్మోనుగచ్ఛతి
మునులు:
వ్యాసదేవా! నీవలన పరమ హితమైనది ధర్మ యుక్తము నైన వాక్యము విన్నాము. శరీర సిచయము = శరీర నాశస్థితి నెఱుంగ గోరెదము. మానవుల మృత శరీరము సూక్ష్మమై అవ్యక్త స్థితి నంది కనబడని దైనప్పుడు దానిని ధర్మమెట్లు వెంబ డించును? అన వ్యాసు లిట్లనిరి.
వ్యాసులు:
పృథివీ వాయురాకాశ మాపో జ్యోతిర్మనోంతరమ్
బుద్ధిరాత్మా చ సహితా ధర్మం పశ్యంతి నిత్యదా
ప్రాణినా మిహసర్వేషాం సాక్షిభూతా దివానిశమ్
ఏతై శ్చ సహధర్మో హి తం జీవ మనుగచ్ఛతి
త్వగస్థిమాంసం శుక్రం చ శోణితం చ ద్విజోత్తమా
శరీరం వర్జయంత్యేతే జీవితేన వివర్జితమ్
తతో ధర్మసమాయుక్తః స జీవః సుఖమేధతే
ఇహలోకే పరేచైవ కిం భూయః కథయామి వః
వ్యాసులు:
భూమి వాయువు ఆకాశము నీరు జ్యోతి (తేజస్సు) అంతరంగము (మనస్సు) బుద్ధీ యనునవేకీ భావమొంది ధర్మమును జూచును. అన్ని జీవులకు వారు వారు చేయు పను లన్నిటికిని రేయిం బవళ్ళు సాక్షులయి యుండును. వీనితో పాటు ధర్మము జీవుని వెంట నేగును. చర్మము ఎముకలు మాంసము శుక్రము రక్తము ననునిది ప్రాణము పోయిన వెంటనే శరీరమును విడిచి పెట్టును. అందు వలన ధర్మవరు డొక్కడే ఇహమందు పరమందును సుఖ పడువాడు. ఇంకేమి తెలుపుదు నన మునులిట్లనిరి.
మునులు:
తద్దర్శితం భగవతా యథా ధర్మోనుగచ్ఛతి
ఏతత్తు జ్ఞాతు మిచ్ఛామః కథం రేతః ప్రవర్తతే
మునులు:
ధర్మమెట్లు వెంట బడునో తాము కనుల గట్టినట్లు తెలిపినారు. ఇక రేతస్సు ఎట్లు ప్రవర్తించునో యిదియు పిండోత్పత్తి క్రమమును తెలుపుమని ప్రార్థింప వ్యాసుడిట్లనియె.
వ్యాసులు:
అన్నమశ్నంతి యే దేవాః శరీరస్థాః ద్విజోత్తమాః
పృథివీ వాయురాకాశ మాపో జ్యోతిర్మనస్తథా
తతస్తృప్తేషు భో విప్రా స్తేషు భూతేషు పంచసు
మనః షష్ఠేషు శుద్దాత్మా రేతః సంపద్యతే మహత్
తతో గర్భః సంభవతి శ్లేష్మా స్త్రీపుంసయోర్ద్విజాః
ఏతద్వః సర్వమాఖ్యాతం కిం భూయః శ్రోతుమిచ్ఛథ
అఖ్యాతం నో భగవతా గర్భః సంజాయతే యథా
యథా జాతస్తు పురుషః ప్రపద్యేత తదుచ్యతామ్
ఆసన్నమాత్ర పురుష స్తైర్భూతై రభిభూయతే
విప్రయుక్తస్తు తైర్భూతైః పునర్యాత్యపరాం గతిమ్
సచ భూతసమాయుక్తః ప్రాప్నోతి జీవమేవ హి
తతోస్య కర్మ పశ్యంతి శుభం వా యది వాశుభమ్
దేవతాః పంచభూతస్థాః కిం భూయః శ్రోతుమిచ్ఛథ
ఓ విప్ర శ్రేష్ఠులార! శరీర మందున్న దేవతలు (ఆయా యింద్రి యాధిష్ఠాన దేవతలు) అన్నము నార గింతురు. వారు పృథివ్యప్తేజో వాయ్వాకాశము లను పంచ భూతములు మనస్సు స్వరూపమున నుందురు. ఆ రూపమున పంచ భూతములు మనస్సు తృప్తిపడ గానే పరి శుద్ధమైన రేతస్సు రూపొందును. దాని వలన స్త్రీ పురుష సంయోగమున గర్భ మేర్పడును. ఇదంతయు మీ కెఱింగించితిన నేమి విన వలతురన మునులిట్లనిరి.
మునులు:
త్వగస్థిమాంస ముత్సృజ్య తైస్తు భూతై ర్విపద్జితః
జీవః స భగవాన్క్వస్థః సుఖదుఃఖే సమశ్నుతే
మునులు:
ఎముకలు చర్మము మాంసమును విడిచి ఆ జీవాత్మ ఎక్కడ నిలచి సుఖ దుఃఖము లను అనుభవించును. అని ఋషులడుగగా వ్యాసు లిట్లనిరి.
వ్యాసులు:
జీవః కర్మసమాయుక్తః శీఘ్రం రేతః సమాగతః
స్త్రీణాం పుష్పం సమాసాద్య తతః కాలేన భో ద్విజాః
యమస్య పురుషైః క్లేశో యమస్య పురుషై ర్వధః
దుఃఖం సంసార చక్రం చ నరః క్లేశం చ విందతి
ఇహ లోకే సతు ప్రాణీ జన్మ ప్రభృతి భో ద్విజాః
సుకృతం కర్మ వై భుంక్తే ధర్మస్య ఫలమాశ్రితః
యది ధర్మం సమాయుజ్య జన్మప్రభృతి సేవతే
తతః సపురుషో భూత్వా సేవతే నిత్యదా సుఖమ్
ఆథాంతంరాంతరం ధర్మ మధర్మ ముపసేవతే
సుఖస్యానంతరం దుఃఖం సజీవోప్యధిగచ్ఛతి
ఆధర్మేణ సమాయుక్తో యమస్య విషయం గతః
మహాదుఃఖం సమాసాద్య తిర్యగ్యోనౌ ప్రజాయతే
కర్మణా యేన యేనేహ యస్యాం యోనౌ ప్రజాయతే
జీవో మోహనసమాయుక్త స్తన్మే శృణుత సాంప్రతమ్
వ్యాసులు:
అది పురుషుడై పుట్టి ప్రవర్తించు రీతి తెలుపుమన వ్యాసులు పురుషుడు (జీవుడు) పంచ భూత సమావేశ మంది వానికి లోబడి యుండును. వానితో విడివడి తిరిగి మఱొక గతి కేగును. భూత సంబంధము పొంది ప్రాణ ధారణము చేయును. అప్పుడు జీవ రూపమున నున్న వీడు చేయు పుణ్య పాపములను బంచ భూతములం దంతర్యామి రూపమున నున్న దేవతలు గాంచు చుందురు. మఱి మేమి విననెంతురు? అన మునులిట్లనిరి. చర్మాస్థి మాంసములను విడిచి యా భూతము లన్నింటిని విడిచి జీవుడు తనకు దానై సుఖ దుఃఖముల ననుభవించును గద? యన వ్యాసుడు, జీవుడు కర్మ సంబంధము నంది రేతస్సును బొంది స్త్రీ యొక్క పుష్పమును (ఆర్తవమును)బొంది జనించును. అవ్వల యమ భటుల వలన బాధలను చావును దుఃఖములను సంసార చక్ర పరిభ్రమణమును బొంది నానా క్లేశములకు వశు డగును. ఇహ లోకమున నా ప్రాణి పుట్టినది మొదలు మున్ను దా జేసిన పుణ్యము ధర్మము యొక్క ఫలము నాశ్రయించి సుఖ మనుభవించును. పుట్టిన దాదిగ ధర్మమునే సేవించిన యెడల పురుషుడై నిత్యమును సుఖించును. అనంతరము తాజేసిన యధర్మ ఫలము ననుభవించును. సుఖము తర్వాత దుఃఖముం బొందును. అధర్మ యుక్తుడు యమలోక మేగి మహాదుఃఖ మొంది పశు వక్ష్యాదు లందు పుట్టును. ఏ యే కర్మ మిక్కడ జేసి యేయే యోని యందు మోహ వశుడై పుట్టునో యిపుడు విరముగ వినుండు.
యదేతదుచ్యతే శాస్త్రైః సేతిహాసైశ్చ ఛందసి
యమస్య విషయం ఘోరం మర్త్యలోకం ప్రవర్తతే
ఇహ స్థానాని పుణ్యాని దేవతుల్యాని భో ద్విజాః
తిర్యగ్యోన్యతిరిక్తాని గతిమంతి చ సర్వశః
యమస్య భవనే దివ్యే బ్రహ్మలోకసమే గుణైః
కర్మభిర్నియతైర్బద్ధో జంతు ర్దుఃఖాన్యుపపాశ్నుతే
యేన యేన హి భావేన యేన వై కర్మణాం గతిమ్
ప్రయాతి పురుషో ఘోరాంతథా వక్ష్యామ్యతః పరమ్
అధీత్య చతురో వేదా న్ద్విజోమోహ సమన్వితః
పతితాత్ప్రతిగృహ్యాథ ఖరయోనౌ ప్రజాయతే
ఖరో జీవతి వర్షాణి దశపంచచ భో ద్విజాః
ఖరో మృతో బలీవర్దః సప్తవర్షాణి జీవతి
బలీవర్దో మృతశ్చాపి జాయతే బ్రహ్మరాక్షసః
బ్రహ్మరక్షస్తు మాసాం స్త్రీంస్తతో జాయేత బ్రాహ్మణః
పతితం యాజయిత్వా తు కృమియోనౌ ప్రజాయతే
తత్ర జీవతి వర్షాణి దశపంచచ భోద్విజాః
క్రిమిభావాద్వినిర్ముక్త స్తతో జాయేత గర్దభః
గర్దభః పంచ వర్షాణి పంచ వర్షాణి శూకరః
కుక్కుటః పంచ వర్షాణి పంచ వర్షాణి జంబుకః
అశ్వా వర్షమేకం భవతి తతో జాయేత మానవః
ఈ విషయము శాస్త్రములు ఇతిహాసాదులు వేదము నందును తెలుప బడినది. మర్త్య లోకము ఘోర యమ లోకమునకు విషయమై యున్నది. ఈలోక మందు దేవ తుల్యములు పుణ్యములగు స్థానము లున్నవి. అవి పశు పక్ష్యాది జీవ భావమునకు భిన్నములు. బ్రహ్మ లోకము వంటి దివ్యమైన యమ మందిర మందు జీవుడు కర్మ బద్ధుడై దుఃఖముల నుభవించును. ఏయే స్వరూపమున నేయే కర్మ ఫలమును బురుషు డందునో అయా ఘోరగతులను దెలిపెదను. నాల్గు వేదములు చదివి ద్విజుడు మోహము నొంది పతితుని వలన (కుల భ్రష్ఠుని వలన) పరిగ్రహము సేసి (దానము పట్టి) గాడిదయై పుట్టును. గాడిద పదు నైదేండ్లు బ్రతుకును. గాడిదయై చచ్చి యేడేండ్లు ఎద్దగును. ఎద్దు చచ్చి బ్రహ్మ రాక్షస్సగును. అందు మూడేండ్లుండి బ్రాహ్మణు డగును. కులభ్రష్ఠుని చేత యజ్ఞము సేయించిన వాడు కృమి (పురుగు)గా పుట్టును. అందు పదు నైదేండ్లుండి గాడిద యయి యైదేండ్లు నక్కగా నైదేండ్లు కుక్కగా నొక యేడు నుండి యటుపై మానవు డగును.
ఉపాధ్యాయస్య యః పాపం శిష్యః కుర్యాదబుద్ధిమాన్
స జన్మానీహ సంసారే త్రీనాప్నోతి న సంశయః
ప్రాక్శ్వా భవతి భో విప్రా స్తతః క్రవ్యాత్తతః ఖరః
ప్రేత్య చ పరిక్లిష్టేషు పశ్చాజ్జాయేత బ్రాహ్మణః
మనసాపి గురోర్భార్యాం యః శిష్యో యాతి పాపకృత్
ఉదగ్రాన్ప్రైతి సంసారా న ధర్మేణేహ చేతసా
శ్వయోనౌ తు స సంభూత స్త్రీణి వర్షాణి జీవతి
తత్రాపి నిధనం ప్రాప్తః క్రిమియోనౌ ప్రజాయతే
కృమిభావమను ప్రాప్తో వర్షమేకం తు జీవతి
తతస్తు నిధనం ప్రాప్య బ్రహ్మయోనౌ ప్రజాయతే
యది పుత్రసమం శిష్యం గురుర్హన్యాదకారణమ్
ఆత్మనః కామకారేణ సోపి హింస్రః ప్రజాయతే
పితరం మాతరం చైవ యస్తు పుత్రోవమన్యతె
సోపి విప్రో మృతో జంతుః పూర్వం జాయేత గర్దభః
గర్దభత్వం తు సంప్రాప్య దశవర్షాణి జీవతి
సంవత్సరం తు కుంభీర స్తతో జాయేత మానవః
పుత్రస్య మాతా పితరౌ యస్య రుష్టావుభావపి
గుర్వపధ్యానతః సోపి మృతో జాయేత గర్దభః
ఖరో జీవతి మాసాంశ్చ దశ చాపి చతుర్దశ
బిడాలః సప్తషూసాంస్తు తతో జాయేత మానవః
మాతాపితర వాక్రుశ్య శారీకః సంప్రజాయతే
తాడయిత్వా తు తావేవ జాయతే కచ్ఛపో ద్విజాః
కచ్ఛపో దశ వర్షాణి త్రీణి వర్షాణి శాల్యకః
వ్యాళో భూత్వా తు షణ్మాసాం స్తతో జాయేత మానుషః
భర్తృపిండముపాశ్నానో రాజద్విష్టాని సేవతే
సోపి మోహసమాపన్నో మృతోజాయేత వానరః
వానరో దశవర్షాణి సప్తవర్షాణి మూషకః
శ్వాచ భూత్వాతు షణ్మాసాం స్తతో జాయేత మానవః
న్యాసాపహర్తా తు నరో యమస్య విషయం గతః
సంసారాణాం శతం గత్వా కృమియోనౌ ప్రజాయతే
తత్ర జీవతి వర్షాణి దశ పంచ చ భో ద్విజాః
దుష్కృతస్య క్షయం కృత్వా తతో జాయేత మానుషః
అసూయకో నరశ్చాపి మృతో జాయేత శృంగికః
విశ్వాసహర్తా చ నరో మీనో జాయేత దుర్మతిః
భూత్వా మీనోష్ట వర్షాణి మృగో జాయేత భో ద్విజాః
మృగస్తు చతురో మాసాం తతచ్ఛాగః ప్రజాయతే
ఛాగస్తు నిధనం ప్రాప్య పూర్ణే సంవత్సరే తతః
కీటః సంజాయతే జంతు స్తతో జాయేత మానుషః
ధ్యాన్యాన్యవాం స్తిలాన్మాషా న్కుళుత్థాన్సర్షపాంశ్చణాన్
కలాయానథ ముద్గాంశ్చ గోధూమానతసీ స్తథా
నస్యాన్యన్యాని హృత్త్వాచ మర్త్యో మోహాదచేతనః
సంజాయతే మునిశ్రేష్ఠా మూషికో నిరపతప్రః
తతః ప్రేత్యమునిశ్రేష్ఠా మృతో జాయేత శూకరః
శూకరో జాతమాత్రస్తు రోగేణ మ్రియతే పునః
శ్వా తతో జాయతే మూకః కర్మణా తేన మానవః
భూత్వా శ్వా పంచ వర్షాణి తతో జాయేత మానవః
వరదారాభి మర్శం తు కృత్వా జాయేత వై బకః
శ్వా శృగాలస్తతో గృధ్రో వ్యాళః కంకో బక స్తథా
భ్రాతుర్భార్యాం తు పాపాత్యా యోధర్షయతి మోహితః
పుంస్కోకిలత్వ మాప్నోతి స్యోపి సంపత్సరం ద్విజాః
సఖిభార్యాం గురోర్భార్యాం రాజభార్యం తధైవ చ
ప్రధర్షయిత్వా కామాత్మా మృతో జాయేత శూకరః
శూకరః పంచవర్షాణి దశవర్షాణి వై బకః
పిపీలికస్తు మాసాంస్త్రీ న్కీటః స్యా న్మాసమేవ చ
ఏతానాసాద్య సంసార న్క్రమియోనౌ ప్రజాయతే
తత్ర జీవతి మాసాంస్తు కృమియోనౌ చతుర్దశ
నరోధర్మక్షయం కృత్వా తతో జాయేత మానుషః
పూర్వం దత్త్వా తు యః కన్యాం ద్వితీయే దాతుమిచ్ఛతి
సోపి విప్రా మృతో జంతుః క్రిమియోనౌ ప్రజాయతే
తత్ర జీవతి వర్షాణి త్రయోదశ ద్విజోత్తమాః
అధర్మ సంక్షేమయేముక్త స్తతో జాయేత మానుషః
దేవకార్య మకృత్వా తు పితృ కార్యమథాపి వా
అనిర్వాప్య పితౄ న్దేవా న్మృతో జాయేత వాయసః
వాయసః శతవర్షాణి తతో జాయేత కుక్కుటః
జాయతే వ్యాలకశ్చాపి మాసం తస్మాత్తు మానుషః
జ్యేష్ఠం పితృసమం చాపి భ్రాతరం యోవమన్యతే
సోపి మృత్యుముపాగమ్య క్రౌంచయోనౌ ప్రజాయతే
క్రౌంచో జీవతి వర్షాణి దశ జాయేత జీవకః
తతో నిధన మాప్నోతి మనుషత్వ మవాప్నుయాత్
వృషలో బ్రాహ్మణీం గత్వా కృమియౌనౌ ప్రజాయతే
తతః సంప్రాప్య నిధనం జాయతే శూకరః పునః
శూకరో జాతమాత్రస్తు రోగేణ మ్రియతే ద్విజాః
శ్వా చ వై జాయతే మూఢః కర్మణా తేనభో ద్విజాః
శ్వా భూత్వా కృత కర్మాసౌ జాయతే మానుష స్తతః
తత్రాపత్యం సముత్పాద్య మృతో జాయత మూషకః
కృతఘ్నస్తుమృతో విప్రా యమస్య విషయం గతః
యమస్య విషయే క్రూరై ర్బద్ధః ప్రాప్నోతి వేదనామ్
దండకం ముద్గరం శూల మగ్నిదండం చ దారుణమ్
అసిపత్రవనం ఘోరం వాలుకాం కూటశాల్మలీమ్
ఏతశ్చాన్యాశ్చ బహవో యమస్య విషయం గతాః
యాతనాః ప్రాప్య ఘోరాస్తు తతో యాతి ద భో ద్విజాః
సంసారచక్ర మాసాధ్య క్రిమియో నౌ ప్రజాయతే
క్రిమిర్భవతి వర్షాణి దశపంచ చ భో ద్విజాః
తతోగర్భం సమాసాద్య తత్రైవ మ్రియతే నరః
తతో గర్భశతైర్జంతు ర్బహుశః సంప్రపద్యతే
సంసారాన్సుబహూన్గత్వా స్తతస్తిర్యక్ప్రజాయతే
తతోదుఃఖమనుప్రాప్య బహువర్షగణానివై
స పునర్భవసంయుక్త స్తతః కూర్మః ప్రజాయతే
వధిహృత్వా బకశ్చాపి ప్లవో మత్స్యానసంస్కృతాన్
చోరయిత్వాతు దుర్భిద్ధి ర్మధుదంశః ప్రజాయతే
ఫలం వా మూలకం హృత్వా పూపం వాపి పిపీలికః
చోరయిత్వాతు నిష్పావం జాయతే ఫలమూషకః
పాయసం చోరయిత్వాతు తిత్తిరత్వ మవాప్నుయాత్
హృత్వా పిష్టమయం పూపం కుంభోలూకః ప్రజాయతే
అపోహృత్వాతు దుర్భుద్ధి ర్వాయసో జాయతేవరః
కాంస్యం హృత్వా తు దుర్బుద్ధి ర్హారీతో జ్యాయతేనరః
రాజతం భాజనం హృత్వా కపోతః సంప్రజాయతే
హృత్వాతు కాంచనం భాండం కృమియోనౌ ప్రజాయతే
పత్రోర్ణం చోరయిత్వా తు కురరత్వం నియచ్ఛతి
కోశకారం తతో హృత్వా నరో జాయేత నర్తకః
అంశుకం చోరయిత్వాతు శుకో జాయేతన మానవః
చోరయిత్వా దుకూలంతు మృతో హంసః ప్రజాయతే
క్రౌంచః కార్పాసికం హృత్వ మృతో జాయేత మానవః
చోరయిత్వా నరః పట్టం త్వావికం చైవ భోద్విజాః
క్షౌమం చ వస్త్రమాహృత్యా శశో జంతుః ప్రజాయతే
చూర్ణంతు హృత్వా పురుషో మృతో జాయేత బర్హిణః
హృత్వా రక్తాని వస్త్రాణి జాయతే జీవజీవకః
వర్ణకాదీంస్తథా గంధాం శ్చోరయిత్వేహ మానవః
చుచ్ఛుందరిత్వమాప్నోతి విప్రో లోభపరాయణః
తత్ర జీవతి వర్షాణి తతో దశ చ పంచ చ
అధర్మస్య క్షయం కృత్వా తతో జాయేత మాసవః
చోరయిత్వా పయశ్చాపి బలాకా సంప్రజాయతే
యస్తు చోరయతే తైలం నరో మోహసమన్వితః
సోసి విప్రా మృతో జంతు స్తైలపాయీ ప్రజాయతే
ఆశస్త్రం పురుషం హత్వా స శస్త్రః పురుషాధమః
అర్థార్థం యదివా వైరీ మృతో జాయేత వై ఖరః
ఖరోజీవతి వర్షే ద్వే తతః శఃస్త్రేణ వధ్యతే
సమృతో మృగయోనౌతు నిత్యోద్విగ్నోభిజాయతే
మృగో విధ్యేత శస్త్రేణ గతేసంవత్సరే తతః
హతోమృగస్తతోమీనః సోపి జాలేన బధ్యతే
ఉపాధ్యాయు నెడ బుద్ధి పూర్వముగ బాపము సేసిన శిష్యుడు మూడు జన్మము లిహ లోకమున సంసార మందు గుములును. అవ్వల కుక్కగును. అటుపై పచ్చి మాంసము తిను జంతువై గాడిదయై చచ్చి నరక మనుభవించి యవ్వల బ్రాహ్మణ జన్మ మెత్తును. ఏ శిష్యుడు గురు పత్నిని మనసు చేతనైన బొందునో వాడధర్మ చిత్త సంస్కారముచే భయంకర సంసార దుఃఖితు డగును. కుక్కగా మూడేండ్లు జీవించి చచ్చి బ్రాహ్మణ జన్మ మెత్తును. గురువు బుద్ధి పూర్వకముగ పుత్రు డట్లున్న శిష్యుని హనన మొనర్చినచో ఘాతుక మృగ మగును. ఏ కొడుకు దల్లిని దండ్రిని యవమానించునో వాడు తొలుత గాడిద యగును. పదేండ్లట్లుండి యొక యేడు కుంభీర మగును. ముసలి తలిదండ్రు లిద్దరు నెవ్వనికి దుష్టులుగ దోచుదురో దారుణమైన యా అపధ్యానము వలన (పొరపాటు తలంపు వలన) వాడు గార్దభ మగును. ఆ విధముగ రెండేడ్లుండి వాడు పిల్లియై యేడు నెలలుండును. తల్లి దండ్రులను గోలపెట్టిన వాడు కోకిల యగును. వారిని గొట్టిన వాడు మూడేండ్లు శాత్వక మగును (డేగ). అటుపై నాఱు మాసములు వ్యాళమై (పామై) యామీద మానవుడు పుట్టును. యజమాని యన్నము గాజేసిన వాడు రాజ ద్వేషుల యన్నము దిన్న వాడు కోతి యగును. పదేండట్లుండి యేడేండ్లెలుక యగును. ఆఱు మాసములు కుక్కయై యవ్వల మానవు డగును. అసూయా గ్రస్తుడు శార్జక మగును. విశ్వాస ఘాతకుడు చేప యగును. ఎనిమిదేండ్ల ట్లుండి నాల్గు నెలలు మృగ మగును. అవ్వల మేక యగును. ఒక్క యేడాదికి జచ్చి కీటక మయి యా మీద మానుష జన్మ మందును. ధాన్యములు యవలు దొంగిలించిన వాడెలుక యగును. అటుపై జచ్చి పందియై రోగముచే జచ్చును. అవ్వల మూగ కుక్కయై యైదేడ్లుండి మానవు డగును. పరదార గమనము చేసినవాడు తోడే లగును. కుక్క నక్క గ్రద్ద పాము కంకము రాబందు కొంగయు నగును. ఏ పాపి సోదరుని భార్యను బలాత్కరించి మగ కోకిల యయి యొక్క యేడుండును. స్నేహితుని యొక్క గురువు యొక్క రాజు యొక్క భార్యను గామించిన వాడు పంది యగును. అయిదేండ్ల ట్లుండి పదేండ్లు కొంగయై మూడు నెలలు చీమయై యొక నెల కీటమై క్రిమియై పదునాల్గు నెలలుండి యవ్వల మనుజు డగును. తొలుత కన్య నిత్తునని వాగ్దానము సేసి మఱొక్కని కిచ్చిన వాడు క్రిమి యగును. పద మూడేండ్లట్లు బ్రతికి పాపము క్షయించి మనజు డగును. దేవ పితృ కార్యములు సేయక వారికి తర్పణము సేయకున్న వాడు కాకియై నూరేండ్లు మీదట కోడి యగును. ఆ మీద నొక నెల పామై నరజన్మ మందును. తండ్రితో సముడైన పెద్ద యన్నను దమ్ముని నెవ్వ డవమానించునో వాడు బెగ్గురు పక్షిగ పదేండ్లుండి జీవక మగును. (చకోర పక్షి) అవ్వల నరుడగును. వృషలుడు (శూద్రుడు) బ్రాహ్మణ స్త్రీని సంగమించి కృమియై పందియై రోగముచే జచ్చును. అటుపై కుక్కయై తుదకు నరు డగును. అపుడు సంతానముం గని చచ్చి ఎలుక యగును. కృతఘ్నుడు (చేసిన మేలు మరచిన వాడు) యమలోక మేగి యమ భటుల క్రౌర్యమునకు గుమిలి కుమిలి వారి దండా ఘాతములకు ముద్గర శూరాగ్ని దండముల దెబ్బలకు గురియై ఘోరమైన అసిపత్ర వనము నందు (కత్తుల బోనున) కూటశాల్మలి యను మిడమిడ గాలు నిసుక మేట లందు నడిపింప బడి ఘోర యాతన లనుభవించి సంసార చక్ర పరిభ్రమణ మంది క్రిమి యగును. పదేనేండ్లట్లుండి యక్కడ కడుపు వచ్చి యటనే చచ్చును. అవ్వల ననేక గర్భముల నంది తుదకు పశు పక్షి జన్మ మందు పెక్కేండ్ల ట్లుండి తాబేలగును. పెరుగు దొంగిలించి కొంగ యగును. పచ్చి చేపలను హరించిన వాడు తేనెటీగ యగును. పండు మూలకము (ముల్లంగి) అప్పము దొంగిలించి చీమ యగును. పాయసము దొంగ తిత్తిరి (తీతువు) పక్షి యగును. పిండితో జేసిన యప్పచ్చి నపహరించి గ్రుడ్లగూబ యగును. మంచినీళ్లు హరించి కాకి యగును. కంచు దొంగిలించి హారితము (పచ్చపిట్ట) యగును. వెండిగిన్నె కాజేసిన పావుర మగును. బంగారు బిందెను హరించి క్రిమి యగును. పట్టుబట్ట దొంగిలి కురరము (టిట్టిభము=తీతువు పక్షి) యగును. పట్టు పురుగులను హరించిన వాడు నర్తకుడు (నటకుడు) అగును. వస్త్ర సామాన్యమును హరించిన వాడు చిలక యగును. నార పట్టు బట్ట హరించి హంస జన్మ మెత్తును. నూలుబట్ట హరించి తీతువు పక్షి యగును. పట్టునూరు ఆవికము గొఱ్ఱ ఉన్నితో నేసిన బట్ట నార చీరను (తెల్ల పట్టుబట్ట) దొంగిలించి కుందేలు (చెవుల పిల్లి) యై పుట్టును. ఎఱ్ఱ వస్త్రముల హరించి చకోర పక్షి యగును. చందనాది సుగంధ వస్తువుల హరించిన వాడు చుంచుగా బుట్టును. ఆ జన్మములో బదియేనేండ్లుండి యా పాపము క్షమింప జేసికొని మానవుడై జనించును. పాలు దొంగిలించిన వాడు బలాక పక్షి (పెద్ద కొక్కెర) యై పుట్టును. నూనె (నువ్వుల నూనె) హరించిన గబ్బిలము (తైలముంద్రావు) జంతు వగును. అర్థము కొఱకు (డబ్బు కొఱకు) చేతిలో నాయుధము లేనివాని సాయుధుడై కొట్టిన వాడు (చంపిన వాడు) గాడిద యగును. ఆ జన్మలో రెండేండ్లు బ్రతికి చివరకు ఆయుధముచే నరక బడును. అట్లు చచ్చి వాడు మృగముగా బుట్టి నిరంతరాం దోళనముతో నుండును. ఒక్క యేడాది తర్వాత వాడాయుదము దెబ్బతిని కూలును. ఆ మీద వాడే వలలో దగుల్కొన్న చేపయై నాల్గవ నెలలో అడవి జంతు వగును. పదేండ్లంట్లుండి పులిజన్మ మెత్తి యైదేడ్లుండి మరణించి అధర్మ క్షయమై మనజు డగును.
మాసే చతుర్థే సంప్రాప్తే శ్వాపదః సంప్రజాయత్
శ్వాపదో దశవర్షాణి ద్వీపీ వర్షాణి పంచ చ
తత స్తునిధనం ప్రాప్తః కాలపర్యాయ చోదితః
అధర్మస్యక్షయం కృత్వా మానుషత్వ మవాప్నుయాత్
వాద్యం హృత్వాతు పురుషో తోమశః సంప్రజాయతే
తథా పిణ్యాకసంమిశ్ర మన్నం యశ్చోరయేన్నరః
స జాయతే బభ్రుసటో దారుణో మూషికోనరః
దశన్వై మానుషాన్నిత్యం పాపాత్మా సం ద్విజోత్తమాః
ఘృతం హృత్వాతు దుర్బిద్ధిః కాకో మద్గుః ప్రజాయతే
మత్స్యమాంస మథోహృత్వా కాకో జాయేత మానవః
లవణం చోరయిత్వా తు చిరికాకః ప్రజాయతే
విశ్వాసేన తు నిక్షిప్తం యోపనిహ్నోతి మానవః
స గతాయుర్నరస్తేన మత్స్యయోనౌ ప్రజాయతే
మత్స్యయోని మనుప్రాప్య మృతో జాయేత మానుషః
మానుషత్వ మనుప్రాప్య క్షీణాయురుపజాయతే
పాపాని తు నరః కృత్వా తిర్యగ్జాయేత భో ద్విజాః
నచాత్మనః ప్రమాణంతు ధర్మం జానాతి కించన
యే పాపాని నరాః కృత్వా నిరస్యంతి వ్రతైః సదా
సుఖదుఃఖసమాయుక్తా వ్యాధిమంతో భవంత్యుత
అసంవీతాః ప్రజాయంతే శ్ల్శేచ్ఛాశ్చాపి న సంశయః
నరాః పాపసమాచారా లోభమోహసమన్యితాః
వర్జయంతి హి పాపాని జన్మప్రభృతి యేనరాః
అరోగా రూపవంతశ్చ ధ్యనినస్తే భవంత్యుత
స్త్రియోప్యేతేన కల్పేన కృత్వా పాపమవాప్నుయుః
ఏతేషాం మేవ పాపానాం భార్యాత్వముపయాంతి తాః
ప్రాయేణ హరణే దోషాః సర్వ ఏవ ప్రకీర్తితాః
ఏతద్వైలేశమాత్రేణ కథితం వో ద్విజర్షభాః
అపరస్మిన్కథాయోగే భూయః శ్రోష్యథ భోద్విజాః
ఏతన్మయా మహాభాగా బ్రహ్మణో వదతః పురా
సురర్షీణాం శ్రుతం మధ్యే పృష్టం చాపి యథా తథా
మయాపి తుభ్యం కార్త్స్యేన యధావదను వర్ణితమ్
ఏతచ్ఛ్రుత్వా మునిశ్రేష్ఠా ధర్మే కురుత మానసమ్
వాద్యమును హరించినవాడు గొఱ్ఱె యగును. పిండితో కూడిన అన్నమును దొంగిలించిన వాడు బభ్రుసటువు అను (ముంగి పింగళ వర్ణము గల వేంట్రెకలు గలది) దారుణమైన మూషికముగా బుట్టును. అట్టి మనుజులను నిత్యము గఱచు చుండును. నేతిని హరించిన వాడు నీరు కాకియగును. చేప మాంసము దొంగిలి కాకి యగును. ఉప్పు దొంగిరి చిరి కాక మగును. చెముడు కాకి బొంత కాకి మొదలగు వానిలో రకము. తనపై విశ్వాసము (నమ్మకము) గల్గియున్న వాని మోసగించిన వాడు చేపయై పుట్టి మనుజు డగును. అప్పుడా యుర్దాయు తక్కువ యుండును. నరుడు పాపములు సేసి పశు పక్ష్యాది జన్మము లందును తన తాహతేదో ధర్మమేదో వాడెరుంగ లేడు. అట్టివారు వ్రతదూరులై వ్యాదిగ్రస్తులై దుఃఖితులగు చుందురు. ఒడలిపై బట్ట కూడ లేకుండ మ్లేచ్చులై పావులై లోభమోహాది వశులై పుట్టుదురు. (మ్లేచ్ఛుడు అనార్యుడు గోమాంస భక్షకుడు అప శబ్దములు భాషించు వాడు శిష్టాచార రహిత మగు కామ రూపాది దేశముల నుండు వాడు) పుట్టిననాటి నుండి యెవ్వరు పాపములను విడిచెదరో వారా రోగ్యవంతులు. ఐశ్వర్య వంతులు రూప వంతులు నగుదురు. ఈ చెప్పిన కల్పము ప్రకారము స్త్రీలు కూడ యాయా పాప ఫలము లందుదురు. అట్టి పాపాత్ములకే భార్య లగుదురు. ఇంత వరకు విశేషించి యాయా వస్తువుల దొంగ తనము వలని దోషములు తెలుప బడినవి. ఇది వేశ మాత్రముగ మీకెఱింగించితిని. వాటి యొక కథా సందర్భ మందు ఓద్విజులారా! ఇంకను విశేషముగ విందురు గాక! నేనిది బ్రహ్మ దేవర్షులకు దెలుపు తఱి విన్నది విన్నట్లు మీకు దెలిపితిని. ఇది విని ముని వరులార! మీరు మనస్సును ధర్మము నందు నిలుపుడు.
Summary of chapter 110 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The Śrāddha (ancestral rites) is established as a sacred duty of paramount importance, and its associated origin legend is narrated. The cosmic significance of Śrāddha as the means by which the living nourish and maintain their bonds with departed ancestors is expounded, along with the grave consequences of neglecting these rites.