వ్యాసులు:
యథో క్తం సాజగద్ధాత్రీ దేవదేవేన వై పురా
షడ్గర్భ గర్భ విన్యాసం చక్రేచాన్యస్య కర్షణమ్
సప్తమే రోహిణీం ప్రాప్తే గర్భే గర్భేతతోహరిః
లోకత్రయోపకారాయ దేవక్యాః ప్రవివేశ వై
యోగనిద్రా యశోదాయా స్తస్మిన్నేవతతోదినే
సంభూతాజఠరే తద్వద్యథోక్తం పరమేష్ఠినా
తతోగ్రహగణం సమ్యక్ప్రచచార దివిద్విజాః
విష్ణోరంశే మహీంయాతే ఋతవో ప్యభవన్ శుభాః
నోత్సేహే దేవకీం ద్రష్ఠుం కశ్చిదప్యతితేజసా
జాజ్వల్యమానాం తాం దృష్ట్వా మనాంసి క్షోభమాయయః
అదృష్టాం పురుషైః స్త్రీభి ర్దేవకీం దేవతాగణాః
బిభ్రాణాం వపుషా విష్ణుం తుష్టువు స్తా మహర్నిశమ్
వ్యాసులు:
జగత్కర్త్రియైన యా విష్ణుమాయ దేవ దేవుడు సెప్పినట్లు దేవకి యారు కాన్పుల నొనరించి తరువాతి గర్భమును నాకర్షించెను. ఈ తరువాత దేవకీ గర్భ మందు హరి ప్రవేశించెను. అదే సమయమున యోగ నిద్ర యశోద యుదర మందు బ్రహ్మ చెప్పిన విధముగ జనించినది అంతట గ్రహములు శుభ స్థానము లందు సంచరించి నవి. విష్ణ్వంశము భూమియంద వతరించు సమయమున ఋతువులు సుశోభన మయ్యెను. దేవకి ముఖకాంతి యతిశయించి యామె వంక జూచుటకు నెల్లరకు నశక్య మయ్యెను. దేదీప్యమాన మైయున్న యామెను జూచిన వారి మనసులు కలత జెందినవి. ఎవరికిని తేరిపార చూడ శక్యము గాని దివ్య ప్రభతో విష్ణువును దనయుదర మందు భరించు చున్న యామెను దేవత లహర్నిశము నిట్లు స్తుతించిరి.
దేవతలు:
త్వం స్వాహా త్వం స్వధా విద్యా సుధా త్వం జ్యోతిరేవచ
త్వం సర్వలోకరక్షార్థమవతీర్ణా మహీతలే
ప్రసీద దేవి సర్వస్య జగత స్త్వం శుభంకురు
ప్రీత్యాత్వం ధారయేశానం ధృతం యేనాఖిలం జగత్
దేవతలు:
దేవీ నీవు స్వాహా స్వధా విద్యా సుధా స్వరూపిణివి. జ్యోతి స్వరూపు రాలవు. సర్వలోక రక్షణమునకై భూలోక మంద వతరించితివి. దేవీ ప్రసన్నురాల వగుము. ఎల్ల జగత్తునకు మేలొనరింపుము. ఎవ్వనిచే నెల్ల జగము తరింప చేయ బడెనో యయ్యీశ్వరుని నీవు ప్రీతితో ధరింపుము.
వ్యాసులు:
ఏవం సంస్తూయమానాసా దేవైర్దేవమధారయత్
గర్భేణ పుండరీకాక్షం జగతాం త్రాణకారణమ్
తతో ఖిలజగత్పద్మబోధాయా చ్యుత భానునా
దేవక్యాః పూర్వసంధ్యాయా మావిర్భూతం మహాత్మనా
మధ్యరాత్రే ఖిలాధారే జాయమానే జనార్దనే
మందం జగర్జు ర్జలదాః పుష్ప వృష్టి ముచః సురాః
పుల్లేందీవరపత్రాభం చతుర్బాహుముదీక్ష్య తమ్
శ్రీవత్సవక్షసం జాతం తుష్టావా నక దుందుభిః
అభిష్టూయ చతంవాగ్భిః ప్రసన్నాభిర్మహామతిః
విజ్ఞాపయామాస తదా కంసాద్భీతో ద్విజోత్తమాః
వ్యాసులు:
ఇట్లు స్తుతింప బడి యాతల్లి జగద్రక్షణ కారణమైన పుండరీకాక్షుని గర్భమున దాల్చెను. అవ్వల యెల్ల లోకము లనెడి పద్మములను వికసింప జేయుటకు నత్యుతుడను సూర్యడు పూర్వసంధ్యా సమయ మందు దేవకీ యందా విర్భావము జేసెను. అఖిల జగదా ధారమూర్తి యైన జనార్దనుడు నడిరేయి జనించు చుండగ మేఘము లల్లన గర్జనము చేసినవి. దేవతలు పుష్ప వృష్టి కురిపించిరి. వికసించిన నల్లకలువ రంగులో నాల్గు బాహువులతో శ్రీవత్స వక్షుడై యున్న యామూర్తిని చూచి వసుదేవుడు స్తుతించెను. ప్రసాద గుణ భరితములైన వాక్కులతో స్తుతించి యాతడు కంసుని వలన జడిసి యిట్లు విన్న వించెను.
వసుదేవుడు:
జ్ఞాతో సి దేవదేవేశ శంఖ చక్ర గదా ధర
దివ్యం రూపమిదం దేవ ప్రసాదేనోపసంహర
అద్యైవ దేవ కంసో యం కురుతే మమ యాతనామ్
అవతీర్ణ ఇతి జ్ఞాత్వా త్వా మస్మిన్మందిరే మమ
వసుదేవుడు:
ఓ దేవదేవ శంఖచక్ర గదా ధరా నీకల రూపు జూపితివి. నేనది తెలిసి కొంటిని. దయచేసి ఈ రూపమును మరుగు పరపుము. ఇది తెలిసిన యెడల కంసు డీక్షణమ నన్ననేక యాతనలకు గురి చేయును. ఈ కారా గారమున నీవవతారము జేసితివని వానికి దెలియుట ప్రమాదము. అవ్వల దేవకియు నిట్లనియె.
దేవకి:
యోనంత రూపోఖిల విశ్వరూపో గర్భేపి లోకాన్వపుషాబిభర్తి
ప్రసీదతామేష స దేవదేవః స్వమాయయా విష్కృత బాలరూపః
ఉపసంహర సర్వాత్మన్రూప మేతచ్చతుర్భుజమ్
జానాతు మా వతారం తే కంసో యం దితిజాంతక
దేవకి:
అనంత రూపుడు విశ్వ రూపుడునై తన యందెల్ల లోకములను భరించు దేవదేవుడు తన మాయంగొని బాల రూపమున వెలువడిన యీ స్వామి మా యెడల బ్రసన్నుడగు గాక! ఓ సర్వాత్మ మూర్తి! ఈ చతుర్భుజ రూపము నుప సంహరింపుము. ఓ దైత్యాంతక నీయీ యవతారమును కంసు డెరుగకుండు గాక.
శ్రీమహా విష్ణువు:
స్తుతోహం యత్త్వయా పూర్వం పూత్రార్థిన్యా త దద్య తే
సఫలం దేవి సంజాతం జాతో హం యత్తవోదరాత్
శ్రీమహా విష్ణువు:
అన విని శ్రీ భగవంతుడు పుత్రార్థినివై మున్ను నన్ను స్తుతించితివి కావున నది యిపుడు సఫల మైనది. నీ యుదరము నుండి యిపుడందులకే యవతరించితిని. అని స్వామి మిన్నకుండెను.
వ్యాసులు:
ఇత్యుక్త్వా భగవాంస్తూష్ణీం బభూవ మునిసత్తమాః
వసుదేవోపి తం రాత్రావాదాయ ప్రయయౌ బహిః
మోహితాశ్చాభవం స్తత్ర రక్షిణో యోగనిద్రయా
మధురాద్వార పాలాశ్చ వ్రజత్యానక దుందుభౌ
వర్షతాం జలదానాంచ తత్తోయ ముల్బణం నిశి
సంఛాద్య తం యయౌ శేషః ఫణై రానకదుందుభిమ్
యమునాం చాతి గంభీరాం నానావర్తశతాకులామ్
వసుదేవో వహాన్విష్ణుం జానుమాత్ర వహాం యయౌ
కంసస్య కరమాదాయ తత్త్రెవాభ్యాగతాంస్తటే
నందాదీన్గోపవృద్ధాంశ్చ యమునాయాం దదర్శసః
వసుదేవో పి విన్యస్య బాలమాదాయ దారికామ్
యశోదాశయనే తూర్ణమాజగామామితద్యుతి
వ్యాసులు:
వసుదేవుడా రాత్రియే యా శిశువు నెత్తుకొని కారాగారము వెడలెను. కారాగార రక్షకులు యోగనిద్రా మోహితు లైరి. మధురా నగర పాలకులు గూడ నయ్యెడ నిద్రావశు లయిరి. నడిరేయి మేఘములు మిక్కిలిగా వర్షించు చుండ శేషుడు తన పడగలు విప్పి పైని గప్ప సుళ్ళు తిరిగి కెరట మువ్వెత్తుగ పరవళ్ళు ద్రొక్కు లోతైన యమునా నదిని మోకాలి బంటి లోతు గొన్న దానిని వసుదేవుడు విష్ణువు నెత్తుకొని దాటెను. అదే సమయమున కంసునికి గప్పము జెల్లింప నటకు వచ్చి యున్న నందుడు మొదలగు గోప వృద్దుల నాతడు యమున దరిని దర్శించెను. మఱియు నతడు బాలుని యశోద ప్రక్కలో నుంచి యందున్న పిల్ల నెత్తుకొని వచ్చెను.
దదర్శ చ విబుద్ధ్వా సా యశోదా జాతమాత్మజమ్
నీలోత్పల దశశ్యామం తతో త్యర్థం ముదంయయౌ
ఆదాయ వసుదేవో పి దారికాం నిజమందిరమ్
దేవకీ శయనే న్యస్య యథా పూర్వ మతిష్ఠత
తతో బాలధ్వనిం శ్రుత్వా రక్షిణః సహసోత్థితాః
కంస మావేదయామాసు ర్దేవకీ ప్రసవం ద్విజాః
కంసస్తూర్ణ ముపేత్యైనాం తతో జగ్రాహ బాలికామ్
ముంచ ముంచేతి దేవక్యాసన్న కంఠం నివారితః
చిక్షేప చ శిలాపృష్ఠే సా క్షిప్తా వియతి స్థితిమ్
అవాప రూపం చ మహత్సాయుధాష్ట మహాభుజమ్
వ్రజహాస తథైవోచ్చైః కంసం చ రుషితాబ్రవీత్
అవ్వల యశోద మెళుకువ గొని పుట్టిన కుమారుని జూచెను. నల్ల కలువ రేకుల బోలి నిగనిగ లాడు నల్లని మేని వానిని శిశువును చూచి యెంతేని సంబర బడెను. అట వసుదేవుడును నా బాలికంగొని యింటికి వచ్చి దేవకి పక్కలోనుంచి యప్పటి యట్ల నుండెను. అవ్వల కారాగార రక్షకులు పిల్ల యేడుపు విని తటాలున లేచి దేవకి ప్రసవించిన వార్తను కంసునికి నివేదించిరి. కంసుడు నపుడు వేవేగ వచ్చి యా పిల్లను బట్టుకొనెను. దేవకి మృదు స్వరమున విడువు విడువు మని వారించు చున్నను వాడట నున్న బండపై నా బాలికను విసరి కొట్టెను. ఆ శిశువా క్షణమ యాకశ మందు నిలచి యాయుధములతో గూడిన ఎనిమిది బాహువులతో నపురూప మైన రూపుగొని బిగ్గరగా నవ్వి రోషముగొని కంసునింగని
యోగ మాయ:
కిం మయా క్షిప్తయా కంస! జాతో యస్త్వాం హనిష్యతి
సర్వస్వభూతో దేవానా మాసీ న్మృత్యుః పురా స తే
తదేత త్సం ప్రధార్యాశు క్రియతాం హిత మాత్మనః
యోగ మాయ:
కంసా! నన్ను విసరి నంతన నే మయ్యెను. నిన్ను జంపు వాడొకడు పుట్టి యున్నాడు. క్రూరుడ వగు నీ పాలిటికి మృత్యువు దేవతల సర్వస్వ మూర్తి యవతరించి యున్నాడు ఇది నీ మనస్సులో బెట్టుకొని నీకేది హితమో యది చేసి కొనుము.
వ్యాసులు:
ఇత్యుక్త్వా ప్రయయౌ దేవీ దివ్యస్రగ్గంధభూషణా
పశ్యతో భోజరాజస్య స్తుతా సిధ్ధై ర్విహాయసా
వ్యాసులు:
ఇట్లాదేవి దివ్యగంధ మాల్య భూషణ దారిణి యైన కంసుడు చూచు చుండ సిద్ధులు పొగడు చుండ నాకసము వెంట జనియె.
Summary of chapter 75 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The demon Pūtanā, disguised as a beautiful woman, approaches infant Kṛṣṇa in Gokula and offers her poisoned breast. Kṛṣṇa sucks out her life along with the milk, killing her; her body falls with a tremendous crash, revealing her true monstrous form. Subsequently, Kṛṣṇa overturns a decorated cart (Śakaṭa) under which he lies, killing the demon Śakaṭāsura hidden within — performing these feats as a mere infant.