బ్రహ్మ మహా పురాణము

8 - ఆదిత్యవంశాను కీర్తనమ్‌

లోమహర్షణుడు:

సత్యవ్రతస్తు భక్త్యా చ కృపయా చ ప్రతిజ్ఞయా

విశ్వామిత్రకలత్రం తు బభార వినయే స్థితః

హత్వా మృగాన్వరాహాంశ్చ మహిషాంశ్చవనేచరాన్‌

 విశ్వామిత్రాశ్రమాభ్యాసే మాంసంవృక్షే బబంధ చ

ఉపాంశువ్రతమాస్థాయ దీక్షాం ద్వాదశ వార్షికీమ్‌

 పితుర్నియో గాదవస త్తస్మి న్వనగతే నృపే

అయోథ్యాం చైవ రాజ్యంచ తథై వాంతఃపురం మునిః

 యాజ్యోపాధ్యాయ సంయోగాద్వశిష్ఠః పర్యరక్షత

సత్యవ్రతస్తు బాల్యాచ్చ భావినోర్థస్య వై బలాత్‌

 వశిష్ఠేభ్యధికం మన్యుం ధారయామాస నిత్యశః

పిత్రా హి తం తధా రాష్ఠ్రాత్త్యజ్యమానం ప్రియం సుతమ్‌

 న వారయామా స ముని ర్బహునా కారణేచ

పాణిగ్రహణమంత్రాణాం నిష్ఠా స్యా త్సప్త మే పదే

న చ సత్యవ్రతస్త స్మా ద్ధృతవా న్సప్తమేపదే

జాన న్ధర్మం వశిష్ఠస్తు న మాం త్రాతీతి భో ద్విజాః

సత్యవ్రత స్తదా రోషం వశిష్ఠే మనసాకరోత్‌

గుణబుద్ధ్యా తు భగవా న్వశిష్ఠః కృతవాం స్తథా

 న చ సత్యవ్రత స్త స్య త ముపాంశు మబుధ్యత

తస్మి న్న పరితోషశ్చ పితు రాసీ న్మహాత్మనః

తేన ద్వాదశవర్షణి నావర్ష త్పాకశాసనః

తేన త్విదానీం విహితాం దీక్షాం తాం దుర్వహాం భువి

 కులస్య నిష్కృతి ర్విప్రాః కృతా సా వై భవేదితి

న తం వశిష్ఠో భగవా న్పిత్రా త్యక్తం న్యవారయత్‌

 అభిషేక్ష్యా మ్యహం పుత్ర మస్యేత్యేవం మతి ర్మునిః

స తు ద్వాదశ వర్షాణి తాం దీక్షామావహ ద్బలీ

అవిద్యమానే మాంసే తు వశిష్ఠస్య మహాత్మనః

సర్వకామదుఘాం ధోగ్థ్రీంసదదర్శ నృపాత్మజః

తాం వై క్రోధాచ్చ మోహాచ్చ శ్రమాచ్చైవక్షుధాన్వితః

దేశధర్మగతో రాజా జఘాన మునిసత్తమాః

తన్మాంసం స స్వయం చైవ విశ్వామిత్రస్య చా త్మజాన్‌

భోజయామాస తచ్ఛృత్వా వశిష్ఠోప్యస్య చుక్రుథే

లోమహర్షణుడు:

సత్యవ్రతుడు భక్తితో కృపతో పట్టుదలతో వినయముతో విశ్వామిత్రుని భార్యను భరించెను. మృగముల వేటాడి తెచ్చిన మాంసము నమ్ముని యాశ్రమ సమీపమున చెట్టు కొమ్మకు వ్రేలాడ గట్టెను. ఉపాంశు వ్రతమూని (ఇంద్రియములను మనసును నిగ్రహించి చేయు వ్రతము) ద్వాదశ వార్షిక దీక్షగొని తండ్రి యాదేశమున నాదేశ మందు వసించెను. యజ్ఞ కర్తలకు కుల గురువులకు గల సంబంధము నమసరించి వశిష్ఠు డయోధ్యా రాజ్యమును రాణి వాసమును దానే బర్య వేక్షించెను. సత్యవ్రతుడు మాత్ర మజ్ఞానము వలన భావిదైవ ఘటనము వలనను కుల గురువగు వశిష్ఠునెడ నధికమైన క్రోధము వహించెను. తండ్రి కుమారుని బహిష్కరించు తఱి వశిష్ఠుడు పెక్కు కారణములచే వలదన డయ్యె. పాణి గ్రహణ మంత్రములకు సప్తపదితో సమగ్రత యేర్పడును కావున సత్యవ్రతుడు సప్తపదిలో కన్య నపహరింప లేదు. ఓ బ్రాహ్మణులారా! వశిష్ఠుడా ధర్మ మెఱిగియు నన్ను రక్షించుట లేదని సత్యవ్రతుడు వసిష్ఠునిపై కోపము గొనెను. వసిష్ఠ భగవానుడు గుణ బుద్ధితోనే అట్లు చేసెను. కాని సత్యవ్రతుడు వానిని తటస్థునిగ తలంచెను. తండ్రియగు వసిష్ఠునకు కుమారుడగు సత్యవ్రతునిపై అసంతుష్ఠి కలిగెను. ఆ కారణమున నా రాజ్యామున నింద్రుడు పండ్రెండు సంవత్సరములు వర్షముల లేకుండ జేసెను. అందులకు ప్రాయశ్చిత్తముగా సత్యవ్రతుడు ద్వాదశ వార్షికమైన కఠోర దీక్షను బూన గలడని దాని వలన నీ కులమున కుగల కళంకము పోగలదని యెఱిగియే వశిష్ఠుడా నాడు వన ప్రవేశము వలదన డయ్యె. మాంసము కరవై సత్యవ్రతు డవ్వల క్షుధాతురుడై క్రోధ మోహములచే మిక్కిలి శ్రమించి వశిష్ఠుని కామధేనువు హరించెను. తాను వసించు దేశధర్మము ననుసరించి యాటవిక క్రూర వృత్తిచే దానిం జంపి యా మాంసమును విశ్వామిత్రుని కుమారులచే గూడ దినిపించెను. అది విని వశిష్ఠుం డతని యెడ కుపితుడై యిట్లనియె.

పాతయేయ మహం క్రూర తవ శంకు మసంశయమ్‌

యది తే ద్వావిమౌ శంకూ న స్యాతాం వై కృతౌ పునః

పితు శ్చాపరితోషేణ గురుదోగ్థ్రీవధేన చ

అప్రోక్షితోపయోగాచ్ఛ త్రివిధ స్తే వ్యతిక్రమః

ఏవం త్రీ ణ్యస్య శంకూని తాని దృష్ట్వా మహాతపాః

త్రిశంకురితి హోవాచ త్రిశంకు స్తేన స స్మృతః

విశ్వామిత్రస్య దారాణా మనేన భరణం కృతమ్‌

 తేన తస్మై వరం ప్రాదా న్మునిః ప్రీత స్త్రిశంకవే

ఛంద్యమానో వరేణాథ వరం వవ్రే నృపాత్మజః

సశరీరో వ్రజే స్వర్గ మిత్యేవం యాచితో వరః

అనావృష్టిభయే తస్మి న్గతే ద్వాదశవార్షికే

పితూ రాజ్యేభిషిచ్యాథ యాజయామాస పార్థివమ్‌

మిషతాం దేవతానాం చ వశిష్ఠస్య చ కౌశికః

దివ మారోపయామాస సశరీరం మహాతపాః

ఓరి క్రూరుడా! ఇపుడు గురు ధనమగు గోవు నపహరించి సంహరించుట యా మాంసమును ప్రోక్షింపకయే నారగించుట యను నీరెండు శంకువులను ( పాపములను) చేసి యుండవేని తండ్రి యెడ జేసిన నీ మొదటి యపరాధమును నిస్సంశయముగా పోగొట్టి యుండెడి వాడను. ఇప్పుడు మూడు శంకువులను జేసి నీవు త్రిశంకు వైతివని వశిష్ఠ మహర్షి పలికెను. అవ్వల దన కుటుంబ భరణము చేసి నాడని ప్రీతుడై విశ్వామిత్రుండు వర మేదేని యడుగుమన నా నృప కుమారుడు సశరీర స్వర్గ మనుగ్రహింపు మని యాచించెను. అనావృష్టి భయము పోయిన తరువాత విశ్వామిత్రుడు వానిం దండ్రి రాజ్యమున నభిషిక్తు జేసి సశరీస స్వర్గము కొఱుకు యజింప జేసెను. దేవతలు వశిష్ఠులు జూచు చుండగనే వాని నమ్ముని స్వర్గ మెక్కించెను.

తస్య సత్యరథానామ పత్నీ కేకయ వంశజా

కుమారం జనయామాస హరిశ్చంద్ర మకల్మషమ్‌

సవై రాజా హరిశ్చంద్ర స్త్రైశంకవ ఇతి స్మృతః

ఆహర్తా రాజాసూయస్య సమ్రాడితి మా విశ్రుతః

హరిశ్చంద్రస్య పుత్రోభూ ద్రోహితో నామ పార్థివః

హరితో రోహితస్యాథ చంచు ర్హారిత ఉచ్యతే

విజయశ్చ మునిశ్రేష్ఠా శ్చంచుపుత్రో భూవ హ

 జేతా స సర్వపృధివీం విజయస్తేన స స్మృతః

రురుక స్తన యస్తస్య రాజా ధర్మార్థకోవిదః

రురుకస్య వృకః పుత్రో వృకా ద్భాహుస్తు జజ్ఞివాన్‌

హైహయాసాలజంఘాంశ్చ నిరస్యంతిస్మ తంనృపమ్‌

తత్పత్నీ గర్భమాదాయ ఔర్వస్యాశ్రమ మావిశత్‌

నాసత్యో ధార్మికశ్చైవ స హి ధర్మ యుగే భవత్‌

సగరస్తు సుతో మాహో ర్జజ్ఞే సహగరేణ వై

ఔర్వస్యా శ్రమ మాసాద్య భార్గవే ణాభిరక్షితః

అగ్నేయ మస్త్రం లభ్థ్వా చ భార్గవా త్సగరో నృపః

జిగాయ పృథివీం హత్వా తాలజంఘా న్సహైహయాన్‌

 శకానాం పహ్ల వానాం చ ధర్మం నిరస దచ్యుతః

క్షత్రియాణాం మునిశ్రేష్ఠాః పారదానాం చ ధర్మవిత్‌

ఆఱేని భార్య సత్యరధ కేకయ వంశజ. ఆమె పుణ్యాత్ముడగు హరిశ్చంద్రుడను కుమారుని గనెను. ఆ హరిశ్చంద్రుడు త్రై శంకవుడు (త్రిశంకుని కుమారుడు) అను పేర ప్రఖ్యాతి నంచెను. రాజ సూయము గావించి సమ్రాట్టు (చక్రవర్తి) అను యశ మందెను. ఆయన పుత్రుడు రోహితుడు. అతని కొడుకు హరితుడు, హరితుని కొడుకు చంచువు, చంచువు పుత్రుడు విజయుడు. అతడు సర్వంసహా(భూమి) విజేత. అందు వలన నతడు విజయుడన బడెను. వాని కొడుకు రురుకుడు. ధర్మార్థ కోవిదుడైన రాజు వాని కొడుకు వృకుడు. వాని కుమారుడు బాహువు. హైహయులు, తాలంజఘులు నాఱేనింద్రో రాజనిరి. అతని భార్య గర్భవతియై ఔరుని యాశ్రమ మందు జేరెను. బాహువు కుమారుడు సగరుడు. అతడును ధర్మ పరుడు. సత్య నిష్ఠుడు. కృత యుగము వాడు. తల్లికి సవతి పెట్టిన గరముతో (విషముతో) బాటు పుట్టి నందున సగరుడని పేరొందెను. ఔర్వుని యాశ్రమ మందు జనన సమయమున శుక్రుని రక్షణ మొంది క్షేమముగా జన్మించెను. ఆ భార్గవుని వలననే యాగ్నే యాస్త్రము నంది తాల జంఘులను, హైహయులను సంహరించి భూ మండల మెల్ల జయించెను. శక పహ్లవ పారదులను పేరంబరగిన క్షత్రియుల యొక్క ధర్మమును (నాస్తిక ధర్మమును) ఖండించెను.

మునులు:

కథం స సగరో జాతో గరేణైన సహాచ్యుతః

కిమర్థం చ శకాదీనాం క్షత్రియాణాం మహౌజసామ్‌

ధర్మా న్కులోచితా న్రాజా క్రుద్దో నిరస దచ్యుతః

ఏత న్నః సర్వ మాచక్ష్వ విస్తరేణ మహామతే

మునులు:

 సగరుడు విషముతో నెట్లు జనించెను. శకాదుల ధర్మములను క్రుద్ధుడై యేల నిరసించెను. ఈ కథ మాకు సవిస్తరముగ నానతి మ్మనిన లోమహర్షణు డిట్లనియె.

లోమహర్షణుడు:

బాహో ర్వ్యసనినః పూర్వం హృతం రాజ్య మభూత్కిల

హైహయైస్తాలజంఘైశ్చ శకైః సార్థం ద్విజోత్తమాః

యవనాః పారదాశ్చైవ కాంభోజాః పహ్లవా స్తథా

 ఏతే హ్యపి గణాః పంచ హైహయార్థే పరాక్రమన్‌

హృతరాజ్య స్తదా రాజా స వై బాహు ర్వనం యయౌ

పత్న్యా చానుగతో దుఃఖీ తత్ర ప్రాణా నవాసృజత్‌

పత్నీ తు యాదవీ తస్య సగర్భా పృష్ఠతోన్వగాత్‌

సపత్న్యా చ గరస్తస్యైదత్తః పూర్వః కిలానఘాః

సా తు భర్తు శ్చితాం కృత్వా వనే తా మభ్యరోహత

ఔర్వస్తాం భార్గవో విప్రాః కారుణ్యా త్సమవారయత్‌

తస్యాశ్రమేచ గర్భః స గరేణైవ సహ చ్యుతః

వ్యజాయత మహాబాహుః సగరో నామ పార్థివః

ఔర్వస్తు జాతకర్మాదీం స్తస్య కృత్వా మహాత్మనః

అధ్యాప్య వేదశాస్త్రాణి తతోస్త్రం ప్రత్యపాదయత్‌

ఆగ్నేయంతు మహాభాగా అమరై రపి దుస్సహమ్‌

స తేనాస్త్రబలేనాఔ బలేన చ సమన్విత

హైహయా న్విజఘానాశు క్రుద్ధో రుద్రః పశూనివ

 ఆజహార చ లోకేషు కీర్తింకీర్తి మతాంవరః

తతః శకాంశ్చ యవాన న్కాంభోంజా న్పారదాంస్తథా

 పహ్లవాంశ్చైవ నిశ్శేషా న్కర్తుం వ్యవసితో నృపః

తే వధ్యమానా వీరేణ సగరేణ మహాత్మనా

 వశిష్ఠం శరణం గత్వా ప్రణిపేతు ర్మనీషిణమ్‌

వశిష్ఠ స్త్వథ తా న్దృష్ట్వా సమయేన మహాద్యుతిః

 సగరం వారయామాస తేషాం దత్వా భయం తదా

సగరః స్వాం ప్రతిజ్ఞాం తు గురో ర్వాక్యం నిశమ్య చ

 ధర్మం జఘాన తేషాం వై వేషా నన్యాంశ్చకారహ

అర్థం శకానాం శిరసో ముండయిత్వా వ్యసర్జయత్‌

 యవనానాం శిరః సర్వం కాంభోజానాం తథైవ చ

ఫారదా ముక్త కేశాశ్చ పహ్లవా శ్శశ్రుధారిణః

 నిస్సాధ్వాయవషట్కారాః కృతా స్తేన మహాత్మనా

శకా యవనకాంబోజాః పారదాశ్చ ద్విజోత్తమాః

కోణిసర్పా మాహిషికా దర్వా శ్చోలాః సకేరలాః

సర్వే తే క్షత్రియా విప్రా ధర్మస్తేషాం నిరాకృతః

 వశిష్ఠవచనా ద్రాజ్ఞా సగరేణ మహాత్మనా

లోమహర్షణు:

 బాహువు వ్యసనియయి నందున హైహయులు తాల జంఘులు శకులును నాతని రాజ్యము గాజేసిరి. హైహయుని పక్షమున శకులు యవనులు, పారదులు, కాంబోజులు, పహ్లవులు నను నైదు గణముల వారుకూడ చేరిరి. రాజ్యము పోయి బాహువు వనమున కేగెను. పత్నియు నతని వెంట జనెను. అతడక్కడ ప్రాణములు వాసెను. అప్పటి కతని భార్య గర్భవతి. అమెకు సవతి గరము (విషము) పెట్టెను. వనమం దాసాధ్వి భర్తతో సహగమనము సేయుటకు జితి యెక్కెను. భృగు వంశీయు జౌర్వుడు కరుణగొని యామెను నివారించెను. అయన యాశ్రమ మందా శిశువు గరముతో గూడ జన్మించెను. అందుచే సగరుడను పేరొందెను. జౌర్వుడాతనిని వేదశాస్త్ర బలముచే చదివించి ఆగ్నేయాస్త్ర మందు శిక్షణ మొసంగెను. క్రుద్ధుడైన రుద్రుడు పశువులం జంపునట్లా తడాగ్నేయాస్త్ర బలముచే హైహయుల వధించి మంచి ప్రతిష్ఠ వడసెను. అవ్వల శక యవన కాంభోజ పారద పహ్లవులను నిశ్శేషముగా బరిమార్ప బూనెను. వారు వశిష్ఠుని శరణందిరి. ఆయన వారి కభయ మొసగి సగరుని వారించెను, గురు వచన మాలించి యాతడు వారింగాక వారి ధర్మమును ఖండించి వారందరి వేషములను మార్చెను. అదెట్లన శకుల కర్థ ముండనము (సగము తల గొరుగుట) గావించి వదలెను. యవన కాంభోజులకు సంపూర్ణ ముండనము గావించెను. పారదులను తల విరజోసికొన జేసెను. పహ్లవులకు గడ్డముల నుంచెను. వారెల్లరను నిస్వాధ్యాయ వషట్కారులం గావించెను (యజన యాజనాది వేద కర్మదూరులం జేసెనని భావము.) శకాదులు కోణి సర్పులు మహిషకులు దర్వులు, చోళులు, కేరళులు నను పేర వారందరు క్షత్రియులే. కాని వారి ధర్మ మాతనిచే నిరాకరింప బడినది. అనగా వెలివేయ బడినారన్న మాట. ఇదంతయ వశిష్ఠు నాజ్ఞ చేతనే యాత డొనరించెను.

సధర్మవిజయీ రాజా విజిత్యేమాం వసుంధరామ్‌

 అశ్వం ప్రచారయామాస వాజిమేధాయ దీక్షితః

తస్య చారయతః సోశ్వః సముద్రే పూర్వదక్షిణే

వేలాసమీ పేపహృతో భూమిం చైవ ప్రవేశితః

సతం దేశం తదా పుత్రైః ఖానయామాస పార్థివః

ఆసేదు స్తే తదా తత్ర ఖన్యమానే మహార్ణవే

తమాదిపురుషం దేవం హరిం కృష్ణం ప్రజాపతిమ్‌

 విష్ణుం కపిలరూపేణ స్వపంతం పురుషం తదా

తస్య చక్షుస్సముత్థేన తేజసా ప్రతిబుధ్యతః

దగ్థా స్సర్వే ముని శ్రేష్ఠా శ్చత్వార స్త్వవశేషితాః

బర్హికేతుః సుకేతుశ్చ తథా ధర్మరథో నృపః

శూరః పంచనదశ్చైవ తస్య వంశకరా నృపాః

ప్రాదాచ్చతస్మై భగవాన్‌ హరి న్నారాయణో వరం

 ఆక్షయం వంశమిక్ష్వాకోః కీర్తిం చాప్యనివర్తనీమ్‌

పుత్రం సముద్రంచ విభుః స్వర్గే వాసం తథాక్షయం

సముద్రశ్చార్ఘ్యమాదాయ వవందే తం మహీపతిమ్‌

సాగరత్వం చలేభే స కచ్మణా తేన తస్యహ

 తం చాశ్వమేధికం సోశ్వం సముద్రా దుపలబ్దవాన్‌

ఆజహారాశ్వమేధానాం శతం స సుమహాతపాః

పుథ్రానాంచ నహప్రాణి మష్టి స్తస్యేతి నశ్శ్రుతమ్‌

సగరస్యాత్మజా వీరాః కథం జాతా మహాబలాః

విక్రాంతాః షష్టిసాహస్రా విధినా కేన సత్తమ

ధర్మముచే జయ మందిన యా సగర చక్రవర్తి వసుంధర నెల్ల గెల్చి యశ్వమేధ దీక్షగొని గుఱ్ఱమును వదలెను. అ గుఱ్ఱము తూర్పు దక్షిణ సముద్ర ప్రాంత తీరమున సంచరించు చుండగా నెవ్వని చేతనో హరింప బడి భూమి యందు బ్రవేశింప జేయ బడెను. అపుడా రాజు తన కొడుకు లఱువది వేలమంది చేత నీ భూమిని ద్రవ్వించెను. వారందఱు సముద్రముం జొచ్చి భూమిం ద్రవ్విపోయి పోయి ఆది పురుషుడగు హరిని కపిల రూపమున నున్న విష్ణువుం గాంచిరి. అ సమయమున నా దేవుడు నిదురలో నుండెను. వారి రాకచే గల్గిన చప్పుడు వలన నాతడు కను దెఱచెను. అందుండి వెడలిన తేజస్సుచే నా సగరులు నల్గురు తరువాయిగా నఱువది వేల మందియు దగ్ధులైరి. అ మిగిలిన సగం వంశ వర్థములు బర్హికేతువు సుకేతువు భర్మరధుడు శూరుడైన పంచ జనుడు ననువారు. భగవంతుడు కపిలుడు ఱేనికి ఇక్ష్వాకు వంశ మక్షయముగ నుండు నట్లును. మంచి కీర్తిమంత మగునట్లు వరము ననుగ్రహించె. సముద్రుని కుమారునిగ నిచ్చి అక్షయ స్వర్గవాస సౌఖ్యమును గూడ నొసంగెను. సముద్రుడా సగరుని కర్ఘ్యముం గొని వచ్చి యిచ్చి నమస్కరించెను. ఆ పుణ్యకర్మ ప్రభావముచే సముద్రుడు సాగరుడు గూడ నయ్యెను. (సగరుని కుమారుడను ప్రఖ్యాతి నంచెను) సగర చక్రవర్తి యన్య శ్వమేదాశ్వమును బడసి తిఱిగి వచ్చి నూఱశ్వమేధ యాగము లాచరించెను. అతని కుమారులే సాగరులను ప్రఖ్యాతి నందిన వార ఱువదివేల మందియని విన్నాము. అన విని మునులు సగరునికి వీరులగు కుమారు లఱువది వేలమంది యెట్లు కల్గిరి? ఎట్లు విక్రమించిరో తెలుపుమన లోమహర్ణణుం డిట్లనియె

లోమహర్షణుడు:

ద్వే భార్యే సగరస్యాస్తాం తపసా దగ్ధకిల్బిషే

 జ్యేష్ఠా విదర్భదుహితా కేశినీ నామ నామతః

కనీయసీ తు మహతీ పత్నీ పరమధర్మిణీ

 అరిష్ఠనేమి దుహితా రూపేణాప్రతిమా భువి

ఔర్వ స్తాభ్యాం వరం ప్రాదా త్తద్బుధ్యద్వం ద్విజోత్తమాః

 షష్టిం పుత్రసహస్రాణి గృహ్ణా త్వేకా నితంబినీ

ఏకం వంశధరం త్వేకా యధేష్టం పరయత్వితి

 తత్త్రేకా జగృహే పుత్రా న్షష్టిసాహస్రసంమితాన్‌

ఏకం వంశధరం త్వేకా తథేత్యాహతతో మునిః

లోమహర్షణుడు:

సగరుని కిద్దరు భార్యలు. విదర్భ దేశాధీశుని కూతురు కేశిని పెద్దభార్య. అరిష్టనేమి కూతురు మిక్కి యందగత్తె మహతి యునునది రెండవది. ఔర్వుడు వారింగని, అరువది వేలమంది కొడుకులు గావలెనో, వంశో ద్ధారకుడైన కొడుకొక్కడు గావలెనో కోరుకొండని వరమొసంగె. ఒకతె అరువదివే లమంది కొడుకులను, మరొకతె యొక్క వంశధరుడగు పుత్రుని గోరిరి. అంత నమ్ముని యట్లే యగుగాక అనెను.

రాజాపంచజనో నామ బభూవ స మహాద్యుతిః

ఇతరా సుషువే తుంబీం బీజపూర్ణా మితి శ్రుతిః

 తత్ర షష్టిసహస్రాణి గర్భాస్తే తిలసంమితాః

సంబభూవు ర్యథాకాలం వవృధుశ్చ యథా సుఖమ్‌

 ఘృతపూర్ణేఘ కుంభేషు తాన్గర్భా న్నిదధే తతః

ధాత్రీ శ్చైకైకశః ప్రాదా త్తావతీః పోషణే నృపః

 తతోదశసు మాసేషు సముత్తస్థు ర్యథాక్రమమ్‌

కుమారాస్తే యథాకాలం సగర ప్రీతివర్థనాః

 షష్టిపుత్ర సహస్రాణి తస్యైవ మభవ న్ద్విజాః

గర్భా దలాబుమధ్యాద్వై జాతాని పృథివీపతేః

పంచజనుడను మహా తేజస్వియగు రాజు ఒకతెకు గల్గెను. రెండవ యామె బీజ పూర్ణమైన యొక తుంబుని (సొర కాయను) ప్రసవించెనని ప్రసిద్ధి. అందు నువ్వు గింజలంత వారు అరువది వేలమంది శిశువు లుండిరి. సమయము ననుసరించి సుఖముగ పెంపొందిరి. వారి నామె ఘృత పూర్ణ కుంభముల నుంచెను. ఒక్కొక్కని పోషణమున కొక్కొక్కతె దాది నేర్ప రచెను. పది నెలలో క్రమముగ నా శిశువు లందుండి బయలు దేరి సగరునికి ప్రీతి వర్థనులైరి.

తేషాం నారాయణం తేజః ప్రవిష్టానాం మహాత్మనాం

ఏకః పంచజనో నామ పుత్రో రాజా బభూవ హ

శూరః పంచజనస్యాసీ దంశుమాన్నామ వీర్యవాన్‌

దిలీపస్తస్య తనయః ఖట్వాంగ ఇతి విశ్రుతః

యేన స్వర్గాదిహాగత్య ముహూర్తం ప్రాప్య జీవితమ్‌

త్రయోభిసంధితా లోకా బుద్ధ్యా సత్యేన చానఘాః

దిలీపస్యతు దాయాదో మహారాజో భగీరథః

యః స గంగాం సరిచ్ఛ్రేష్టా మవతారయత ప్రభుః

 సముద్ర మానయచ్చైనాం దుహితృత్వే ప్యకల్పయత్‌

తస్మాద్భాగీరథీ గంగా కథ్యతే వంశచింతకైః

నారాయణ తేజస్సున బ్రవేశించిన యా మహానుభావులలో నొకడు పంచజను డనువాడు రాజయ్యెను. అతని కుమారుడు వీర్యవంతుడగు నంశమంతుడు. అంశుమంతుని సుతుడు దిలీపుడు. ఖట్వాంగు డనుపేర నతడు సుప్రసిద్ధుడు. ఈతడు స్వర్గము నుండి యీ లోకమునకు వచ్చి ముహూర్త కాలముండి బుద్ధితోను సత్యము తోను ముల్లోకముల నొక్కటి చేసెను. దిలీపుని దాయాది భగీరథుడు. అతడు గంగ నవని కవతరింప జేసిన వాడు. ఆ గంగను సముద్ర మందు గంగ సంగమింప జేసిన మహానుభావుడు. భగీరథుడు సరిచ్చ్రేష్ట యైన గంగ నా విధముగా తన కూతురుగా చేసి కొనెను. అందు వలననే గంగ భాగీరతథి యయ్యెను.

భగీరథసుతో రాజా శ్రుత ఇత్యభి విశ్రుతః

నాభాగస్తు శ్రుతస్యాసీత్పుత్రః పరమధార్మికః

 అంబరీషస్తు నాభాగిః సిధుద్వీపపితాభవత్‌

అయుతాజిత్తు దాయాదః సింధు ద్వీపస్య వీర్యవాన్‌

 అయుతాజిత్సుత స్త్వాసీ ద్దృతుపర్ణో మహాయశాః

దివ్యాక్షహృదయాభిజ్ఞో రాజా నలసఖో బలీ

 ఋతుపర్ణసుత స్త్వాసీ దత్తపర్ణి ర్మహా యశాః

సుదాస స్తస్య తనయో రాజా ఇంద్రసఖోభవత్‌

సుదాసస్య సుతః ప్రోక్తః సౌదాసోనామ పార్థివః

ఖ్యాతః కల్మాషపాదో వైరాజా మిత్రసహోభవత్‌

 కల్మాష పాదస్య సుతః సర్వకర్మేతి విశ్రుతః

అనరణ్యస్తు పుత్రోభూద్విశ్రుతః సర్వకర్మణః

 అనరణ్యసుతో నిఘ్నో నిఘ్నతో ద్వౌ బభూవతుః

అనమిత్రో రఘుశ్చైవ పార్థివర్షభసత్తమౌ

 అనమిత్రసుతో విద్వా న్దువిదుహోభవత్‌

దిలీపస్తనయస్తస్య రామస్య ప్రపితామహః

దీర్ఘబాహు ర్దిలీపస్య రఘుర్నామాసుతోభవత్‌

అయోధ్యాయాం మహారాజో యఃపురాసీ న్మహాబలః

భగీరథుని కుమారుడు శ్రుతుడు. అతని పుత్రుడు నాభాగుడు ఉత్తముడు. నాభాగుని పుత్రుడు అంబరీషుడు (నాభాగి) సింధుద్వీవుని కాతడు జనకుడు. సింధు ద్వీవుని కొడుకు అయితాజిత్తు. అతని కొడుకు అయుతాజిత్తు. అతని కొడుకు ఋతుపర్ణుడు. అక్షహృదయ మెరిగిన ప్రోడ. బలశాలి. నలునికి మిత్రము. ఋతుపర్ణుని కొడుకు అత్తపర్ణి. గొప్ప కీర్తి మంతుడు. వాని కుమారుడు సుదాసుడు ఇంద్రుని స్నేహితుడు. వాని బిడ్డడు సౌదాసుడు రాజై కల్మాష పాదుడు, మిత్ర సహుడనియు పేరందెను. వాని కొడుకు సర్వకర్మ. వాని కుమారుడు అనరణ్యుడు. వాని తనయుడు నిఘ్నుడు. నిఘ్నుని వలన అనమిత్రుడు రఘువు అని ఇద్దరు రాజ శ్రేష్ఠులు గల్గిరి. అనమిత్రుని సుతుడు విద్వాంసుడు దువిదుహుడు. అవ్వాని కొడుకు దిలీపుడు. దిలీపుని కొడుకు వీరుడగు రఘవు. రఘువు రాముని ముత్తాత. ఇతడు మహా బలుడై అయోధ్యా పట్టణమున మహా రాజుగ నుండెను.

అజస్తు రాఘవో జజ్ఞే తథా దశరథోప్యజాత్‌

రామో దశరథాజ్జజ్ఞే ధర్మాత్మా సుమహాయశాః

రామస్య తనయో జజ్ఞే కుశ ఇత్యభిసంజ్ఞితః

అతిథిస్తు కుశాజ్జజ్ఞే ధర్మాత్మా నుమహాయశాః

అతిథే స్త్వభవ త్పుత్రో నిషధో నామ వీర్యవాన్‌

నిషధస్య నలః పుత్రో నభః పుత్రో నలస్యతు

 నభస్య పుండరీకస్తు క్షేమధన్వా తతః స్మృతః

క్షేమధన్వసుత స్త్వాసీ ద్దేవావీకః ప్రతాపవాన్‌

 అసీ దహీనగు ర్నామ దేవానీకాత్మజః ప్రభుః

అహీనగోస్తు దాయాదః సుధన్వా నామ పార్థివః

 సుధన్వనః సుతశ్చాపి తతో జజ్ఞే శలో నృపః

ఉక్యో నామ సధర్మాత్మా శలపుత్రో బభూవ హ

 వజ్రనాభః సుత స్తస్య నల స్తస్య మహాత్మనః

నలౌ ద్వావేవ విఖ్యాతౌ పురాణే మునిసత్తమాః

వీరసేనాత్మజశ్చైవ యశ్చేక్ష్వాకుకు లోద్వహః

ఇక్ష్వాకు వంశ ప్రభవాః ప్రాధాన్యేన ప్రకీర్తితాః

ఏతే వివస్వతో వంశే రాజానో భూరితేజసః

పఠ న్సమ్య గిమాం సృష్టి మాదిత్యస్య వివస్వతః

శ్రాద్ధదేవస్య దేవస్య ప్రజానాం పుష్టిదస్య చ

ప్రజావా నేతి సాయుజ్య మాదిత్యస్య వివస్వతః

అయన కొడుకు అజుడు. అయనకు దశరథు డుదయించెను. దశరథ కుమారుడు రాముడు. రాముని కుమారుడు కుశుడు కుశనందను డతిథి. అతని పుత్రుడు నిషధుడు. నిషధుని సుతుడు నలుడు. నలాత్మజుడు నభుడు. నభుని బిడ్డడు పుండరీకుడు. వానికి క్షేమధన్వుడు, వానికి దేవానీకుడు నుదయించిరి. దేవానీకుని కొడుకు అహినగువు వాని కొడుకు సుధన్వుడు. వాని కొడుకు శలుడు. శల పుత్రు డుక్యుడు. ఉక్యుని కొడుకు వజ్రనాభుడు. వాని కొడుకు నలుడు. పురాణము లందు నలులిద్దరే ఖ్యాతి కెక్కినారు. ఒకడు వీరసేనుని కుమారుడు రెండవ వాడు ఇక్ష్వాకు వంశజుడు వీరు వివస్వతుని వంశ మందలి తేజస్స మృద్ధులైన రాజులు. ప్రజలకు పోషకుడును శ్రాద్ధదేవుడును నగు అదిత్యుని యీ వంశవృత్తము పఠించునాతడు సంతాన వంతుడయి అదిత్యుని యొక్క సాయుజ్యము నందును.