210 - కృష్ణ నిర్యాణ కథనమ్‌

వ్యాసులు:

ఏవం దైత్యవధం కృష్ణో బలదేవసహాయవాన్‌

చక్రే దుష్టక్షితీశానాం తథైవ జగతః కృతే

క్షితేశ్చ భారం భగవా స్ఫల్గునేన సమం విభుః

అవతారయామాసహరిః సమస్తాక్షాహిణీవధాత్‌

కృత్వా భారావతరణం భువో హత్వాఖిలా న్నృపాన్‌

శాపవ్యాజేన విప్రాణా ముపసంహృతవాన్కులమ్‌

ఉత్సృజ్య ద్వారాకం కృష్ణ స్త్యక్తా మానుష్య మాత్మభూః

స్వాంశో విష్ణుమయం స్థానం ప్రవివేశ పున ర్నిజమ్‌

వ్యాసులు:

ఇట్లు కృష్ణుడు బలదేవుని సాయమున విశ్వ రక్షణకునై దుష్ట రాజన్య శిక్షణము సేసెను. ఫల్గునునితో గూడి నారాయణుడు అక్షౌహిణు లన్నింటిం గూల్చి భూదేవి బరువుం దించెను. ఇటు సేసి విప్రు లిచ్చిన శాపము నెపమున యదుకులముం గూడ యుప సంహరించెను. ద్వారకను వదలి మానవాకరము విడిచి యా స్వయంభువు నిజాంశమున తిఱిగి నిజ స్థానమును విష్ణు పదముం బ్రవేశించెను.

మునులు:

సవిప్రశాపవ్యాజేన సంజహ్రే స్వకులం కథమ్‌

కథం చ మానుషం దేహ ముత్ససర్జ జనార్దనః

మునులు:

ఆతడు విప్రశాప మిషమ్మున స్వకులము నెట్లు పసంహరించెను. మనుష్య దేహము నెట్లు వదలెను? అన వ్యాసుడిట్లు పలుక దొడంగెను.

వ్యాసులు:

విశ్వామిత్ర స్తథా కణ్వో నారదశ్చ ముహామునిః

పిండారకే మహాతీర్థే దృష్టా యదుకుమారకైః

తతస్తే యౌవనోన్మత్తా భావికార్యప్రచోదితాః

సాంబం జాంబవతీపుత్రం భూషయిత్వా స్త్రియం యథా

ప్రసృతా స్తాన్మునీ నూచుః ప్రణిపాతపురఃసరమ్‌

ఇయం స్త్రీ పుత్రకామా తు ప్రభో కం జనయిష్యతి

దివ్యజ్ఞానోపపన్నాస్తే విప్రలుబ్ధా కుమారకైః

శాపం దదు స్తదా విప్రా స్తేషాం నాశాయ సువ్రతాః

మునయః కుపితాః ప్రోచు ర్ముసలం జనయిష్యతి

యేనాఖిలకులోచ్ఛేదో యాదవానాం భవిష్యతి

ఇత్యుక్తాస్తైః కుమారాస్త ఆచచక్షుర్య థాతథమ్‌

ఉగ్రసేనాయ ముసలం జజ్ఞే సాంబస్య చోదరాత్‌

యదు కుమారులు పిండారక మను తీర్థమున కణ్వ నారద విశ్వామిత్రులం గాంచిరి. నడిప్రాయంపు మదము చేత భావికార్య ప్రేరణము చేతను జాంబవతీ పుత్రునికి సాంబునికి ఆడు వేసము వేసి సాగి నడచి ప్రణామ పూర్వకముగ వారిం గూర్చి ఈవిడ కొడుకు గావలయును నను చున్నది. స్వామీ! పుత్రుం గన గలదా? అనిరి. యదు బాలురచే వంచితులై యమ్మునులు దివ్యజ్ఞాన సంపన్నులు గావున సువ్రతులు గావున వారి నాశనమున కప్పుడు శాప మిచ్చిరి. కుపితులై ఈమె ముసలముం గన గలదనిరి. దాన నఖిల యాదవ కులము విచ్ఛిన్నము కాగల దనిరి. ఇట్లు శపింప బడి యయ్యాదవ బాలురు వోయి యుగ్రసేనునికి యథాతథముగా తెలిపిరి. సాంబుని కడుపు నందుండి ముసలము పుట్టెను.

తదుగ్రసేనో ముసల మయశ్చూర్ణ మకారయత్‌

జజ్ఞే తచ్చైరకా చూర్ణం ప్రక్షిప్తం వై మహోదధౌ

ముసల స్యాథ లౌహస్య చూర్ణిత స్యాంధకైర్ద్విజాః

ఖండం చూర్ణయితుం శేకు ర్నైవ తే తోమరాకృతి

తదప్యంబునిధౌ క్షిప్తం మత్స్యో జగ్రాహ జాలిభిః

ఘాతిత స్యోదరా త్తస్య లుబ్ధో జగ్రాహ తజ్జరా

విజ్ఞాత పరమార్థోపి భగవా న్మధుసూదనః

నైచ్ఛ త్తద న్యధా కర్తుం విధినా యత్సమావృతః

ఉగ్రసేను డా ముసలము నినుప రజనుగా గొట్టించెను. అది సముద్రమునం బడవేయ బడి మేకపెంటిక లట్లు పొడియయ్యె ఇనుప రోకలి యది చూర్ణితమై ఇనుప గుదియగా (తోమరముగా) తయారయ్యె గాని దానిని మఱి వారు పొడిసేయ లేని దానిని గూడ కడలిం బడవేసి నంత నొకచేప దానిని మ్రింగెను. ఆ చేపం జంపి దాని కడుపు నుండి యా యినుప గుదియ నొక జాలరి గైకొనెను. మధు వైరి భగవంతుడా నిజ మెఱింగియు విధి వశుడై దానిని మఱొక లాగున జేయుట కిచ్ఛగింప డయ్యె.

దేవై శ్చ ప్రహితో దూతః ప్రణిపత్యాహ కేశవమ్‌

రహ స్యేవ మహం దూతః ప్రహితో భగవ న్సురైః

వస్వశ్విమరుతాదిత్య రుద్రసాధ్యాదిభిః సహ

విజ్ఞాపయతి వః శక్ర స్తదిదం శ్రూయతాం ప్రభో

దేవతలు వంప నొక దూత వచ్చి కేశవునికి ప్రణతి సేసి యేకాంత మందు నేను దేవ దూతను ఏలిన వారి కడకు దేవత లంప వచ్చితిని. వసువు లశ్వినులు మరలత్తులు రుద్రాదిత్యులు సాధ్యులం గూడి యింద్రుడు తమ కిట్లు విజ్ఞాపనము సేయు చున్నారు.

దేవతలు:

భారావతరణార్థాయ వర్షాణా మధికం శతమ్‌

భగవానవతీర్ణోత్ర త్రిదశైః సంప్రసాదితః

దుర్వృత్తా నిహతా దైత్యా భువో భారోవతారితః

త్వయా సనాథా స్త్రిదశా వ్రజంతు త్రిదివేశతామ్‌

త దతీతం జగన్నాథ వర్షాణా మధికం శతమ్‌

ఇదానీం గమ్యతాం స్వర్గో భవతే యది రోచతే

దేవై ర్విజ్ఞాపితో దేవోప్యథాత్రైవ రతి స్తవ

తత్థ్సీయతాం యధాకాలం మాఖ్యేయ మనుజీవిభిః

దేవతలు:

ఇదె వినుండు త్రిదశుల పార్థనచే భూభార హరణమునకై నూరేండ్లకు పైని భగవంతుడ వీ ధరణి నవతరించితివి. దుష్ట దైత్యులు నీచే హతులైరి భూమి బరువు దింప బడినది. ముక్కోటి దేవత లిప్పుడు ననాథులైరి. (దిక్కుగల వారైరి) దేవాధి పత్య మందుదురు గాక! జగన్నాథ! నూరేండ్లు గడచి నవి. తమకభిమత మేని యిపుడు స్వర్గమునకు దయచేయ వలయును మఱియు నీ కిక్కడన (భూలోక మంద) యభిలాష యేని యిక్కడనె యుండ నగును. ఏలిన వారి సేవకులము మేమిట్లు సేయుమని చెప్పదగిన వారము గాము.

శ్రీభగవానుడు:

యత్త్వమాత్థాఖిలం దూత వేద్మి చైత దహం పునః

ప్రారభ్థ ఏవ హి మాయా యాదవానా మపి క్షయః

భువో నామాతిభారోయం యాదవై రనిబర్హితైః

అవతారం కరోమ్యస్య సప్తరాత్రేణ సత్వరః

యథాగృహీతం చాంభోదౌ హృత్వా హం ద్వారకాం పునః

యాదవానుపసంహృత్య యాస్యామి త్రిదశాలయమ్‌

మనుష్యదేహ ముత్సృజ్య సంకర్షణ సహాయవాన్‌

ప్రాప్త ఏవాస్మి మంతవ్యో దేవేంద్రేణ తథా సురైః

జరాసంధాదయో యేన్యే విహతా భారహేతవః

క్షితేస్తేభ్యః సభారో హి యదూనాం సమధీయత

తదేత త్సుమహాభార మవతార్య క్షితే రహమ్‌

యాస్యా మ్యమరలోకస్య పాలనాయ బ్రవీమి తాన్‌

శ్రీభగవానుడు:

అంతట భగవంతు డిట్లనియె. నీవన్న దంతయు నేనె ఱుంగుదును. కాని యాదవుల యొక్క క్షయము గూడ నాచే నారంభింప బడినది. ఎవ్వరికిం జంపరాని యాదవులచే గూడ భూమికి బరు వనునది తప్పదు. దీని నేడు రాత్రులలో సత్వరమ దింపెదను. సముద్రమునకు గొంపో బడిన ద్వారకను దిఱిగికొని వచ్చి యాదవుల నుప సంహరింప జేసి స్వర్గము నలంకరింతును. మానవ దేహము వదలి సంకర్క్షణునితో నటకు వచ్చినాడ ననియె యింద్రుడు దేవతలును ననుకొన వలసినది. భూభార కారణమైన జరాసంధాదులు హతులైరి. వారి వలన వసుధ భారము యాదవుల పైకెత్త బడినది. ఆయా భారమును నేను దింపి యమర లోక పరిపాలన మునకు రాగలను.

వ్యాసులు:

ఇత్యుక్తో వాసుదేవేన దేవదూతః ప్రణమ్య తమ్‌

ద్విజాః స దివ్యయా గత్యా దేవరాజాంతికం యయౌ

వ్యాసులు:

ఇట్లు వాసుదేవునిచే దెలుప బడి దేవదూత యాయనకు బ్రణమిల్లి దేవ యానమున నింద్రుని సన్నిధి కేగెను.

భగవానప్యథోత్పాహ న్దివ్యాన్భౌమాంతరిక్షగాన్‌

దదర్మ ద్వారకాపుర్యాం వినాశాయ దివానిశమ్‌

తా స్దృష్ట్వా యాదవా నాహ పశ్యధ్వ మతి దారుణాన్‌

మహోత్పాతశమాయైషాం ప్రభాసం యామమాచిరమ్‌

మహాభాగవతః ప్రాహ ప్రణి ప్యతోద్దవో హరిమ్‌

భగవ స్యన్మయా కార్యం తదాజ్ఞాపయ సాంప్రతమ్‌

మన్యే కుల మిదం సర్వం భగవా న్సంహరిష్యతి

నాశాయాస్య నిమిత్తాని కుల స్యాచ్యుత లక్షయే

భగవంతుడు నప్పుడు దివ్య భౌమాం తరిక్షములైన యుత్పాతములం గని వెంటనే ప్రభాస తీర్థమున కేగుద మనియె. అప్పుడు పరమ భాగవతుడు (భగవద్భక్తుడు) ఉద్ధవుడు ప్రణతుడై హరితో నిట్లనియె. ఇప్పుడునా చేయ వలసిన పని సెలవిమ్ము. ఏలిన వారిప్పుడు యదుకుల మెల్ల నుప సంహరింతు రని తోచు చున్నది. యదుకుల నాశనము కాగల నిమిత్తములను జూచు చున్నాను. అన భగవంతుడిట్లనియె.

శ్రీభగవానుడు:

గచ్ఛత్వం దివ్యాయా గత్యా మత్ప్రసాదసముత్థయా

బదరీ మాశ్రమం పుణ్యం గంధమాదన పర్వతే

నర నారాయణ స్థానే పవిత్రిత మహీతలే

మన్మనా మత్ర్పసాదేన తత్ర సిద్ధి మవాప్స్యసి

అహం స్వర్గం గమిష్యామి ఉపసంహృత్య వైకులమ్‌

ద్వారకాంచ మయా త్యక్తాం సముద్రః ప్లావయిష్యతి

శ్రీభగవానుడు:

ఉద్ధవ! నా ప్రసాదముచే నీవు దివ్య గమనమున గంధ మాదన పర్వత మందున్న పుణ్యమగు బదరి కాశ్రమ మునకు జనుము. మహీతల మంతటిని బవిత్రము సేయు నా నర నారాయణ స్థానమందు నాపై మనసుంచి నా ప్రసాదమున నక్కడ నీవు సిద్ధి నంద గలవు. నేను కులమెల్ల నుపసంహరించి స్వర్గమున కేగుదును. నేను విడిచిన ద్వారకను సముద్రుడు ముంచును.

వ్యాసులు:

ఇత్యుక్తః ప్రణిపత్యైనం జగామ స తదోద్ధవః

నర నారాయణ స్థానం కేశవేనానుమోదితః

వ్యాసులు:

అని పలుక విని ఉద్ధవుడు పదముల వ్రాలి నారాయణా నుమోదితుడై నర నారాయణ స్థానమున కేగెను.

తతస్తే యాదవాః సర్వే రథానారుహ్య శీఘ్రగాన్‌

ప్రభాసం ప్రయయుః సార్ధం కృష్ణరామాదిభి ర్ద్విజాః

ప్ర్యాప ప్రభాసం ప్రయతా ప్రీతాస్తే కుకురాంధకాః

చక్రు స్తత్ర సురాపానం వాసుదేవానుమోదితాః

పిబతాం తత్ర వై తేషాం సంఘర్షేణ పరస్పరమ్‌

యాదవానాం తతో జజ్ఞే కలహాగ్నిః క్షయావహః

జఘ్నుః పరస్పరం తేతు శస్త్రేర్దేవ బలాత్కృతాః

క్షీణశస్త్రాస్తు జగృహుః ప్రత్యాసన్నామథైరకామ్‌

ఏరకా తు గృహీతా తై ర్వజ్రభూతేవ లక్ష్యతే

తయా పరస్పరం జఘ్నుః సంప్రహారైః సుదారుణైః

ప్రద్యుమ్నసాంబప్రముఖాః కృతవర్మాథ సాత్యకిః

అనిరుద్ధాదయశ్చాన్యే పృథుర్విపృథురేవ చ

చారువర్మా సుచారు శ్చ తథాక్రూరాదయో ద్విజాః

ఏరకారూపిభిర్వజ్రై స్తే నిజఘ్నుః పరస్పరమ్‌

అవ్వల నయ్యాదవు లందరు శీఘ్రగము లైన రథముల నెక్కి కృష్ణ బలరాములతో ప్రభాసమునకుం జనిరి. కుకు రాంధకులు వారు నియమము పూని వాసుదేవు నామోదమున సురాపాన మొనరించిరి. అట్లు తప్ప ద్రావిన వారికి అన్యోన్య సంఘర్షణమున కలహాగ్ని రేగి యాదవ వంశ క్షయహేతు వయ్యెను. వారు దైవముచే బలాత్కరింప బడిన వారై శస్త్రాస్త్రముల నొండొరులం గొట్టు కొనిరి. శస్త్రములయి పోయి దగ్గర నున్న ఏరకమును (గుంద్రమూలా తృణమును గడ్డి పోచను) బట్టిరి. వారది పట్టినంత వజ్రమట్లు కనిపించెను. దానితో మిగుల దారుణముగ నొకరి నొకరు గొట్టు కొనిరి. ప్రద్యుమ్న సాంబాదులు కృతవర్మ సాత్యకి అనిరుద్ధాదులు పృధువు విపృధువు చారువర్మ చారువు అక్రూరుడు ఏరకా రూపమైన వజ్రములచే గొట్టి కొనిరి.

నివారయామాస హరి ర్యాదవాస్తే చ కేశవమ్‌

సహాయం మేనిరే ప్రాప్తం తే నిజఘ్నుః పరస్పరమ్‌

కృష్ణొపి కుపితస్తేషా మేరకాముష్టిమాదదే

వధాయ తేషాం ముసలం ముష్టిలోహమభూత్తదా

జఘాన తేన నిఃశేషా నాతతతాయిన యాదవాన్‌

జఘ్నుశ్చ సహసాభ్యేత్య తథాన్యేతు పరస్పరమ్‌

హరి వారిని, వారు హరిని వారించు కొనిరి. హరి సాయపడ వచ్చి నాడను కొని యొండొరుల గొట్టు కొనిరి. కృష్ణుడును కుపితుడై యేరకా తృణ పుంజము గుప్పిట బట్టెను. అది యాదవ వధ కనువైన ముసలము. (గుప్పెడు ఇనుప దుడ్డు) అయ్యెను. ఆతతాయులై దానిచే యాదవులను హరి నిశ్శేషముగా గొట్టెను. వారుం ద్వరగ వచ్చి నొండొరులం బాదు కొనిరి.

తతశ్చార్ణమధ్యేన జైత్రోసౌ చక్రిణో రథః

పశ్యతో దారుకస్యాశు హృతోశ్వైర్ద్విజసత్తమాః

చక్రం గదా తథా శార్ఙ్గం తూణౌ శంఖోసిరేవ చ

ప్రదక్షిణం తతః కృత్వా జగ్ము రాదిత్యవర్త్మనా

క్షణమాత్రేణ వై తత్ర యాదవానామభూ తక్షయః

ఋతే కృష్ణం మహాబాహుం దారుకం చ ద్విజోత్తమాః

చంక్రమ్యమాణౌ తౌ రామం వృక్షమూల కృతాసనమ్‌

దదృశాతే ముఖా చ్చాస్య నిష్క్రామంతం మహోరగమ్‌

నిష్క్రమ్య సముఖాత్తస్య మహాభోగో భుజంగమః

ప్రయాత శ్చార్ణవం సిద్ధైః పూజ్యమాన స్తథోరగైః

తమర్ఘ్య మాదాయ తదా జలధిః సంముఖం యయౌ

ప్రవివేశ చ తత్తోయం పూజితః పన్నగోత్తమైః

దృష్ట్వా బలస్య నిర్యాణం దారుకం ప్రాహ కేశవః

అటుపై నర్ణవ మధ్యము నుండి చక్రాయుధుని జైత్ర రధము (జయ శీలమైన యరదము) దారుకుడు (సారథి) చూచు చుండగనే ఆశ్వములచే గొంపో బడెను. చక్రము గద (కౌమోదకి) శార్ఙ్గ (హరివిల్లు) తూణము (అమ్ముల పొది) శంఖము(పాంచజన్యము) కత్తి (నందకము) హరికి ప్రదక్షిణము సేసి ఆదిత్య మండల మార్గముం బట్టి యేగెను. (స్వరాదిత్యే అనుశ్రుతి ననుసరించి స్వర్గమాదిత్య మండలమని రహస్యము) ఒక్క క్షణము లోనే యట యాదవ వంశ క్షయ మయ్యెను. మహాశూరు లొక్క కృష్ణుడు దారుకుడును (రథసారధి) మిగిలిరి. ఒక చెట్టు మొదట నాసనము వైచికొని కూర్చుండి యున్న బలరాముని దరికి డేకి వారిద్దరు నాతని ముఖము నుండి వెడలుచున్న మహా సర్పముం దర్శించిరి. ఆ సర్పము పెద్ద పడగలతో నాతని మొగము వెలువడి సిద్ధులు నాగులు పూజింప సముద్రమున కేగెను. సముద్రు డర్ఘ్యముం గొని యెదురేగెను. మహేంద్రులచే బూజితుడై యానీటం బ్రవేశించెను. బలరామ స్వామి నిర్యాణముం గని హరి దారుకునితో నిట్లనియె.

శ్రీభగవానుడు:

ఇదం సర్వం త్వ మాచక్ష్వ వసుదేవోగ్రసేనయోః

నిర్యాణం బలదేవస్య యాదవానాం తథా క్షయమ్‌

యోగే స్ధిత్వాహమప్యేత త్పరిత్యక్ష్యే కళేబరమ్‌

వాచ్య శ్చ ద్వారకావాసీ జనః సర్వస్తథాహుకః

యథేమాం నగరీం సర్వాం సముద్రః ప్లావయిష్యతి

తస్మా ద్రథైః సుసజ్జైస్తు ప్రతీక్ష్యో హ్యర్జునాగమః

నస్థేయం ద్వారకామధ్యే నిష్క్రాంతే తత్ర పాండవే

తేనైవ సహ గంతవ్యం యత్ర యాతి స కౌరవః

గత్వా చ బ్రూహి కౌంతేయ మర్జునం వచనం మమ

పాలనీయ స్త్వయా శక్త్యా జనోయం మత్పరిగ్రహః

ఇత్యర్జునేన సహితో ద్వారవత్యాం భవాన్‌ జనమ్‌

గృహీత్వా యాతు వజ్ర శ్చ యదురాజో భవిష్యతి

బలరాముని నిర్యాణము యాదవ కులక్షయ మిది యెల్ల నీవు వసుదేవునికి నుగ్రసేనుని కిందెల్పుము. నేనును యోగ సమాధి నిలిచి యీ కళేబరమును విడిచితి నని ద్వారకా వాసి జనమునకుం జెప్పుము. ఈ ద్వారకా నగరమును సముద్రుడు ముంచి వేయును. అందు వలన సిద్ధముగా బూన్ప బడిన రథములతో నర్జునుని రాక కెదురు చూడుడు. పాండవు డాతడు నిష్క్రమింపగా ద్వారకా మధ్య మందు మీరుండ వలదు. అతడెట కేగు నటకాతనితో మీరు నేగ వలయు. నీవేగి కుంతీ కుమారుని కర్జునునకు నా చెప్పిన మాట చెప్పుము. నా పరిగ్రహము (భార్యా వర్గము) నీవు నీశక్తి కొలది పాలింప దగినది. అని పలికి యర్జురునితో గూడి నీవు ద్వారవతి యందలి జనముం గొని వెశ్లుదువు గాక! వజ్రుడు యాదవులకు రాజు గాగలడు.