బ్రహ్మ మహా పురాణము

238 - గుణ సర్జన కథనమ్‌

వ్యాసులు:

సృజతే తు గుణాన్సత్త్వం క్షేత్రజ్ఞ స్త్వధితిష్ఠతి

గుణాన్విక్రయతః సర్వాసుదాసీనవ దీశ్వరః

స్వభావయుక్తం తత్సర్వం యదిమాన్సృజతే గుణాన్‌

ఊర్ణనాభిర్యథా సూత్రం సృజతే తద్గుణాం స్తథా

ప్రవృత్తా న నివర్తంతే ప్రవృత్తి ర్నోపలభ్యతే

ఏవమేకే వ్యవస్యంతి నివృత్తమితి చాపరే

ఉభయం సంప్రధార్యైతదధ్యవస్యేద్యథామతి

అనేనైవ విధానేన భవేద్వై సంశయో మహాన్‌

అనాదినిధనో హ్యాత్మాతం బుద్ధ్వా విహరేన్నరః

అక్రుధ్యన్నప్రహృష్యంశ్చ నిత్యం విగవతమత్సరః

ఇత్యేవం హృదయే సర్వో బుద్ధి చింతామయం దృఢమ్‌

అనిత్యం సుఖమాసీన మశోచ్యం ఛిన్నసంశయః

తారయేత్ర్పచ్యుతాం పృథ్వీం యథా పూర్ణాం నదీం నరాః

అవగాహ్య చ విద్వాంసో విప్రా లోలమిమం తథా

న తు తప్యతి వౌ విద్వాస్థ్సలే చరతి త త్త్వవిత్‌

ఏవం వించింత్య చాత్యానం కేవలం జ్ఞానమాత్మనః

తం తు బుద్ధ్వా నరః సర్గం భూతానామాగతిం గతిమ్‌

సమచేష్టశ్చ వై సమ్యగ్లభతే శతముత్తమమ్‌

ఏతద్ద్విజన్మ సామగ్ర్యం బ్రాహ్మణస్య విశేషతః

ఆత్మజ్ఞాన సమస్నేహ పర్యాప్తం తతర్పాయణమ్‌

తత్త్వం బుద్ధ్వా భవేద్బుద్ధః కిమన్య ద్బుద్ధలక్షణమ్‌

విజ్ఞాయైతద్విముచ్యంతే కృతకృత్యా మనీషిణః

న భవతి విదుషాం మహద్భయం య దవిదుషాం మనుహద్భయం పరత్ర

న హి గతిరధికాస్తి కస్యచిద్భవతి హి యా విదుషః సనాతనీ

లోక మాతరమసూయతే నరస్తత్ర దేవమనీరీక్ష్య శోచతే

తత్ర చేత్కుశలో న శోచతే యే విదు స్తదుభయం కృతాకృతమ్‌

యత్కరోత్యనభిసంధి పూర్వకం తచ్చ నిందయతి యత్పురా కృతమ్‌

యత్ర్పియం తదుభయం న వాప్రియం తస్య తజ్జనయతీహ కుర్వతః

వ్యాసులు:

సత్త్వము, సత్తా అనునది గుణ త్రయమును క్షేత్రజ్ఞుడగు ఆత్మ తత్త్వము ఈ గుణ త్రయమునకు సత్త్వమునకు అధిష్టాతయై ప్రపంచ రూపమున పరిణామము నొందు గుణములను ఉదాసీన భావముతో చూచుచు ఈశ్వరుడై యుండును. సత్త్వము గుణములను సృజించుట సాలెపురుగు తన కంటే వేరుకాని పదార్ధముతో దారమును తీసి గూడు అల్లుట వంటిది. గుణములు ఎప్పుడును ప్రవృత్తి వైపే ఉండి ముందునకు పోవు చుండును. ఆ ప్రవృత్తి గోచరము కాదు అని కొందరును నివృత్తియు వాటికి కలదని కొందరును అందురు. ఈ విషయములో గొప్ప సంశయమునకు అవకాశ మున్నది. కాని విచారణ చేసి ఏదో యొక పక్షమును నిర్ణయించుకొన వలయును. మొత్తము మీద ఆత్మ తత్త్వము జనన మరణములు లేనిది. దాని నెఱిగి ఆనందించ వలెను. క్రోధము, హర్షము, మత్సరము విడువ వలెను. తత్త్వము నెఱిగిన వాడే బుద్దుడన బడదగి యున్నాడు. ఈ ఆత్మ తత్త్వము నెఱిగిన మనుష్యులు కృతకృత్యులై ముక్తి నందుదురు. ఇట్టి వారికి పరలోక విషయమై భయ ముండదు. లేని వారికీ భయము కలదు. తత్త్వవేత్తకు కలుగు శాశ్వత గతియగు పరమ ముక్తి కంటె మించిన ఉత్తమ స్థితి మఱి ఏదియు లేదు. నరుడు కృతమును కార్య రూపమగు ప్రపంచ తత్త్వమును, ఆకృతమును, జనన మరణములు లేని పరతత్త్వమును, ఎరుగ నంత వరకును భేద బుద్ది కల వాడగుటచే ఇది ప్రియము ఇది అప్రియము అని తలచుచు ఒకప్పుడు తల్లిని కూడా ద్వేశించును. శోకమును అనుభవించును. తత్త్వము నెరిగిన వానికి శోకము లేదు. కర్మలను ఫలము అభిసంధితో చేయునంత వరకు ఇది ప్రియము ఇది ప్రియము ఇది అప్రియము అను భావముండును. తత్త్వమును ఎరిగి ఫలముపై అభిసంధి లేక కర్మల నాచారించు వాడు తాను పూర్వము నందు కర్మలు చేసి సంపాదించిన సంచిత కర్మమును కూడా నశింప చేసి కొనును. అనగా ముక్తి పొందును.

మునులు:

యస్మాద్ధర్మాత్పరో ధర్మో విద్యతే నేహ కశ్చన

యో విశిష్టవ్చ భూతేభ్యస్తద్భవాన్ర్పబ్రవీతు నః

మునులు:

అన్ని భూత తత్త్వముల కంటె ఉత్తమ మగు తత్త్వమును అన్ని ధర్మముల కంటె మేలగు ధర్మమును మాకు తెలుపుమని మునులు వ్యాసుల నడిగిరి.

వ్యాసులు:

ధర్మం చ సంప్రపక్ష్యామి పురాణమృషిభిః స్తుతమ్‌

విశిష్టం సర్వధర్మేభ్యః శృణుధ్వం మునిసత్తమాః

ఇంద్రియాణి ప్రమాథీని బుద్ధ్యా సంయమ్య తత్త్వతః

సర్వతః ప్రసృతానీహ పితా బాలానివాత్మజాన్‌

మనసశ్చేంద్రియాణాం చాప్యైకాగ్ర్యం పరమం తపః

విజ్ఞేయః సర్వధర్మేభ్యః స ధర్మః పర ఉచ్యతే

తాని సర్వాణి సంధాయ మనఃషష్ఠాని మేధయా

ఆత్మతృప్తం స ఏవాసీద్భహుచింత్యమచింతయన్‌

గోచరేభ్యో వివృత్తాని యదా స్థాస్యంతి వేశ్మని

తదా చైవాత్మ నాత్మానం పరం ద్రక్ష్యథ శాశ్వతమ్‌

సర్వాత్మానం మహాత్మానం విధూమమివ పావకమ్‌

ప్రపశ్యంతి మహాత్మానం బ్రాహ్మణా యే మనీషిణః

యథా పుష్పఫలోపేతో బహుశాభో మహాద్రుమః

ఆత్మనో నాభిజానీతే క్వ మే పుష్పం క్వ మే ఫలమ్‌

ఏవమాత్మా న జానీతే క్వ గమిష్యే కుతోన్వహమ్‌

అన్యో హ్యస్యాంతరాత్మాస్తి యః సర్వమనుపశ్యతి

జ్ఞానదీపేన దీప్తేన పశ్యత్యాత్మానమాత్మనా

ద్పష్ట్వాత్మానం తథా యూయం విరాగా భవత ద్విజాః

విముక్తాః సర్వపాపేభ్యో ముక్తత్వచ ఇవోరగాః

పరాం బుద్ధిమవాప్యేహా ప్యచింతా విగతజ్వరాః

సర్వతః స్రోతసం ఘోరాం నదీం లోకప్రవాహిణీమ్‌

పంచేంద్రియ గ్రహవతీం మనఃసంకల్పరోధసమ్‌

లోభమోహతృణచ్ఛన్నాం కామక్రోధ సరీసృపామ్‌

సత్యతీర్థానృతక్షోభాం క్రోధపంకాం సరిద్వరామ్‌

అవ్యక్తప్రభావాం శీఘ్రాం క్రామక్రోధ సమాకులామ్‌

ప్రతరధ్వం నదీం బుద్ధ్యా దు స్తరా మకృతాత్మభిః

సంసారసాగరగమాం యోనిపాతాళదు న్తరామ్‌

ఆత్మజన్మోద్భవాం తాం తు జీహ్వావర్త దురాసదామ్‌

యాం తరంతి కృత ప్రజ్ఞా ధృతిమంతో మనీషిణః

తాం తీర్ణః సర్వతో ముక్తో విధూతాత్మాత్మ వాన్‌ శుచిః

ఉత్తమాం బుద్ధిమాస్థాయ బ్రహ్మభూయాయ కల్పతే

ఉత్తీర్ణః సర్వసంక్లేశా న్ర్పసన్నాత్మా వికల్మషః

భూయిష్ఠానీవ భూతాని సర్వస్థానా న్నిరీక్ష్య చ

అక్రుధ్యన్న ప్రసీదంశ్చ ననృశంసమతి స్తథా

తతో ద్రక్ష్యథ సర్వేషాం భూతానాం ప్రభవాప్యయాత్‌

ఏతద్ధి సర్వధర్మేభ్యో విశిష్టం మేనిరే బుధాః

ధర్మం ధర్మభృతాం శ్రేష్ఠా మునయః సర్వదర్శినః

ఆత్మానో వ్యాపినో విప్రా ఇతి పుత్రాసుశాననమ్‌

ప్రయతాయ ప్రవక్తవ్యం హితాయానుగతాయ చ

ఆత్మజ్ఞానమిదం గుహ్యం సర్వగుహ్యతమం మహత్‌

ఆబ్రవం యదహం విప్రా ఆత్మసాక్షిక మంజసా

నైవ స్త్రీ న పుమా నేవం న చై వేదం సపుంసకమ్‌

ఆదుఃఖమసుఖం బ్రహ్మ భూతభవ్యభవాత్మకమ్‌

నైతజ్జాత్వా పుమాన్త్ర్సీ వా పునర్భవమవాప్పుయాత్‌

యథా మతాని సర్వాణి తథైతాని యథా తథా

కథితాని మయా విప్రా భవంతి న భవంతి చ

తత్ర్పీతియుక్తేన గుణాన్వితేన పుత్రేణ సత్పుత్రదయాన్వితేన

దృష్ట్వా హితం ప్రీతిమనా యథార్థం బ్రూయా త్సుతస్యేహ యదుక్త మేతత్‌

వ్యాసులు:

అతి ప్రాచీనమును ఋషులును మెచ్చినదియు నన్ని ధర్మముల కంటె శ్రేష్ఠమునునగు ధర్మము తెలిపెదము వినుడు. ఇంద్రియములు జీవుని కలవర పరచునవి. కనుక బుద్ధితో వాటిని బాలురను తండ్రివలె అదుపులో నుంచు కొని ఇంద్రియము లకును మనస్సు నకును ఏకాగ్రత అనెడి ఉత్తమ తపస్సుచే ఆ ఉత్తమ ధర్మమును ఎరుగ వలెను. గోచరించు వేటిని అనుభవింప గోరక ఇంద్రియములు నివృత్తి నొంది నపుడు శాశ్వతు డగు పరమాత్మ తత్త్వము సాక్షాత్కారమును పొందును. ఎన్నో కొమ్మలు పండ్లు పూలు ఆకులు కల వృక్షమునకు తన ఏ పండెక్కడనో ఏ పూవెక్కడనో ఏ కొమ్మ ఏ యాకు ఎక్కడనో తెలియ నట్లే అనేక వస్తు భేదములతో నిండిన ఈ సంసారము లోని జీవుడును తానెవడు? ఎక్కడ నుండి తాను వచ్చెను? ఎక్కడకు పోవలెను? అని తెలియ కుండును. కాని జ్ఞాన దీపమును ప్రకాశింప జేసికొని నచో అతడు తన అంతరాత్మతో తనలో తన్ను తాను చూడ గలుగును. కనుక ఓ విప్రులారా! అందులకై మీరును మొదట వైరాగ్యమును పూనుడు. దానిచే మీరు కుబుసము విడిచిన పాము వలె పాపములను వదలించు కొనగలరు. జ్ఞానము సంపాదించి చింతా సంతాపములు విడువ గలరు. లోకగతి అనాది ప్రవాహము. నది వంటిది. ఘోర మైనది. ఇది అన్ని వైపులకు వ్యాపించును. ఇంద్రియములు మొసళ్లు. మనః సంకల్పములు దీని గట్లు. లోభ మోహములు దీనిని కప్పిన గడ్డి. కామ క్రోధములు దానిలో తిరుగు పాములు. సత్యము స్నానమాడ దగిన రేవు. అనృతము కల్లోలములు. క్రోధము బురద. అవ్యక్త తత్త్వము నుండి ఇది పుట్టినది. మహా వేగము కలది. సంసార సాగరములో అది కలియును. జన్మ పరంపర అను పాతాళ ములోనికిది పోవును. కామముచే ఇది పుట్టును. జిహ్వా చాపలము సుడులు. దీనిని జ్ఞాన వంతులు మాత్రమే దాట గలరు. సమస్త భూతము సృష్టి ప్రళయములు తెలిసికొన గలరు. ఇదియే సర్వశ్రేష్ఠ మగు ధర్మము. దీనిని హితుడై అనుగతుడై శుచి మనస్కుడైన శిష్యునకుచు కుమారున కును మాత్రమే బోధించ వలయును.

మునులు:

మోక్షః పితామహేనోక్త ఉపాయాన్నానుపాయతః

తముపాయం యథాన్యాయం శ్రోతు మిచ్ఛామహే మునే

స్వయంభూ బ్రహ్మము మోక్షమునకై నిర్ణయించిన ఉపాయమును యథాశాస్త్ర న్యాయా నుసారముగ మాకు తెలుప వేడు చున్నామని మునులు వ్యాసులను అడిగిరి.

 వ్యాసులు:

అస్మాసు తన్మహాప్రాజ్ఞా యుక్తం నిపుణదర్శనమ్‌

యదుపాయేన సర్వార్థాన్మృగయధ్వం సదానఘాః

ఘటోపకరణే బుద్ధిర్ఘటోత్పత్తౌ స సా మతా

ఏవం ధర్మాద్యుపాయార్థే నాస్యధర్మేషు కారణమ్‌

పూర్వే సముద్రే యః పంథా స స గచ్ఛతి పశ్చిమమ్‌

ఏకః పంథా హి మోక్షస్య తచ్ఛృణుధ్వం మమానఘాః

క్షమయా క్రోధముచ్ఛింద్యాత్కామం సంకల్పవర్జనాత్‌

సత్త్వసంసేవనాద్ధీరో నిద్రా ముచ్ఛేత్తుమర్హతి

అప్రమాదాద్భయం రక్షేద్రక్షేత్క్షేత్రం చ సంవిదమ్‌

ఇచ్ఛాం ద్వేషం చ కామం చ ధైర్యేణ వినివర్తయేత్‌

నిద్రాం చా ప్రతిభాం చైవ జ్ఞానాభ్యాసేన తత్త్వవిత్‌

ఉపద్రవాం స్తథా యోగీ హితజీర్ణమితాశనాత్‌

లోభం మోహం చ సంతోషాద్విషయాం స్తత్త్వదర్శనాత్‌

అనుక్రోశాదధర్మం చ జయేద్ధర్మముపేక్షయా

ఆయత్యా చ జయేదాశాం సామర్థ్యం సంగవర్జనాత్‌

అనిత్యత్వేన చన్నేహం క్షుధాం యేగేన పండితః

కారుణ్యేనాత్మానాత్మానం తృష్ణాం చ పరితోషతః

ఉత్థానేన జయేత్తంద్రాం వితర్కం నిశ్చయాజ్జయేత్‌

మౌనేన బహూభాషాం చ శౌర్యేణ చ భయం జయేత్‌

యచ్ఛేద్వాజ్మనసీ బుద్ధ్యా తాం యచ్ఛేన చక్షుషా

జ్ఞానమాత్మా మహాన్యచ్ఛే త్తం యచ్ఛేచ్ఛాంతిరాత్మనః

తదేతదుపశాంతేన బోద్ధవ్యం శుచికర్మణా

యోగదోషాస్సముచ్ఛిద్య పంచ యాన్కవయో విదుః

కామం క్రోధం చ లోభం చ భయం స్వప్నం చ పంచమమ్‌

పరిత్యజ్య నిషేవేత యథావద్యోగసాధనాత్‌

ధ్యానమధ్యయనం దానం సత్యం హ్రీరార్జవం క్షమా

శౌచమాచరతః శుద్ధిరింద్రియాణాం చ సంయమః

ఏతైర్వివర్ధతే తేజః పాప్మాన ముపహంతి చ

సిధ్యంతి చాస్య సంకల్పా విజ్ఞానం చ ప్రవర్తతే

ధూతపాపః స తేజస్వీ లఘ్వాహారో జితేంద్రియః

కామక్రోధౌ వశే కృత్వా నిర్వశేద్ర్బహ్మణః పదమ్‌

అమూఢత్వ ముసంగిత్వం కామక్రోధ వివర్జనమ్‌

అదైన్యమనుదీర్ణత్వమనుద్వేగో హ్యవస్థితిః

ఏష మార్గో హి మోక్షస్య ప్రసన్నో విమలః శుచిః

తథా వాక్కాయమనసాం నియమాః కామతోవ్యయాః

వ్యాసుడు:

 మునుల కిట్ల చెప్పెను. ఓమహా ప్రాజ్ఞులారా! మనవంటి వారికి వివేక జ్ఞానము సరియగు ఉపాయము. దాని సహాయమున సర్వ విషయములను అన్వేషించి కనుగొన వచ్చును. కాని మనకు ఒక కడవతో పనిపడి నపుడు దాని నొక్క దానిని సరియైన దానిని సంపాదించు కొనవలయునే కాని లోకములో అన్ని కడవలను గూర్చి తెలిసికొన వలసిన పని కాని అన్ని కడవలను సంపాదించ వలసిన పనికాని లేదు. అట్లే మోక్షమును కోరిన వారు మోక్ష ధర్మమును మాత్రమే కాని ఇతర ధర్మములను తెలిసికొన నక్కర లేదు. తూర్పు సముద్రమునకు చేర్చు మార్గము పశ్చిమ సముద్రమునకు చేర్చదు. అట్లే మోక్షము సిద్ధింప జేయు ధర్మము ఒక్కటియే. ఇతర మార్గములు దానిని సిద్ధింప జేయ జాలవు. అట్టి ధర్మమును తెలిపెదను. యోగ సాధనకు మూలముగా క్షమచే క్రోధమును సంకల్పము లను విడుచుటచే కోరికలను సత్త్వ వృద్ధిచే నిద్రను ఎచ్చరిక చే భయమును మనస్సు నిబ్బరముచే ఇచ్ఛను ద్వేషమును కామ ప్రవృత్తిని జ్ఞాన వివేకము నభ్యసించుటచే బుద్ది మాంద్యమును ఏ విషయములును చిత్తమున స్ఫురించక పోవుటను హితములు సులభముగా జీర్ణమగు మితాహారముచే దైహికములు మానసికములు అగు ఉపద్రవములను తృప్తిచే లోభ మోహములను తత్త్వా జ్ఞానముచే విషయ భోగములను దయా భావముచే అధర్మమును ఫలానభిసంధిచే యజ్ఞ దానాది ధర్మ కర్మములను అయతిచే ఆశను సంగము విడుచుటచే కార్య సామర్థ్యమును దృశ్య ప్రపంచ వస్తువులు అనిత్యములను భావముచే వాటిపై ప్రీతిని యోగముచే ఆకలిని జయించ వలెను. నిత్య ప్రయత్నముతో సోమరి తనమును సంశయములను నిశ్చయము తోను జయించ వలెను. మౌనముచే వాగుడు తనమును శౌర్యముచే భయమును విడువ వలెను. వాక్కును మనస్సును బుద్ధితో బుద్ధిని జ్ఞాన నేత్రములతో అదుపు లోనుంచి జ్ఞానముచే ఆత్మ తత్త్వ మెరిగి ఆత్మ శాంతిని సాధించ వలెను. ఫలాభిసంధి లేక పవిత్ర కర్మ లాచరించి శుద్ధమైన చిత్తముతో జ్ఞానము సాధించ వలెను. కామ క్రోధ లోభ భయ స్వప్నములను యోగ దోషముల నైదింటిని విడిచి యోగ సాధనము చేయుచు ధ్యానము అధ్యయనము దానము సత్యము బిడియము ఋజు వర్తనము క్షమ శౌచము ఆచార శుద్ది ఇంద్రియ జయము కలిగి యున్నచో తేజస్సు వృద్ధి యగును. పాపము నశించును. సంకల్పముల నెరవేరును. విజ్ఞానము ప్రవర్తిల్లును. చివరకు బ్రహ్మ స్థానమున ప్రవేశించును. అ మూఢత్వము సంగ రాహిత్యము కామ క్రోధముల విడుచుట దైన్యము కాని పొగరు కాని లేకుండుట భయము లేక నిబ్బరముతో నుండుట ఇది ప్రసన్నమును విమలమును శుచియు నైన మోక్షమార్గము. మనో వాక్కాయ నిగ్రహము తప్పక యుండ వలసిన నియమము.