223 - సంకర జాతి లక్షణ వర్ణనమ్‌

మునులు:

సర్వజ్ఞస్త్వం మహాభాగ సర్వభూతహితే రతః

భూతం భవ్యం భవిష్యంచ న తే స్త్యవిదితం మునే

కర్మణా కేన వర్ణానా మధమా జాయతే గతిః

ఉత్తమా చ భవేత్కేన బ్రూహి తేషాం మహామతే

శూద్రస్తు కర్మణా కేన బ్రాహ్మణత్వం చ గచ్చతి

శ్రోతుమిచ్ఛా మహే కేన బ్రాహ్మణః శూద్రతామియాత్‌

మునులు:

మహానుభావ! నీవు సర్వజ్ఞుడవు. మఱియు సర్వ భూత హితా భిలాషివి. భూత భవిష్య వర్తమానములు నీకు గరతలా మలకములు. ఏకర్మచే నటచే వర్ణముల కధమ స్థితి వచ్చును? ఉత్తమ స్థితియుం గల్గు నానతిమ్ము. శూద్రుడే కర్మ మాచరించి బ్రాహ్మణత్వ మందును. వినగోరెదమన వ్యాస భగవాను లిట్లనిరి.

వ్యాసులు:

హిమవచ్చిఖరే రమ్యే నానాధాతు విభూషితే

నానాద్రుమలతాకీర్ణే నానాశ్చర్య సమన్వితే

తత్ర స్థితం మహాదేవం త్రిపురఘ్నం త్రిలోచనమ్‌

శైలరాజసుతా దేవీ ప్రణిపత్య సురేశ్వరమ్‌

ఇమం ప్రశ్నం పురా విప్రా అపృచ్చచ్చారు లోచనా

తదహం సంప్రవక్ష్యామి శృణుధ్వం మమ సత్తమాః

వ్యాసులు:

హిమగిరి శిఖరి మందాసీనుడై యున్న మహాదేవుం ద్రిలోచనుని శైలరాజ తనయ మ్రొక్కి యిట్లదే ప్రశ్న మడిగినది.

ఉమాదేవి:

భగవన్భగనేత్రఘ్న పూష్ణో దంతవినాశన

దక్షక్రతుహర త్ర్యక్షసంశయోమే మహానయమ్‌

చాతుర్వర్ణ్యం భగవతా పూర్వం సృష్టం స్వయం భువా

కేన కర్మవిపాకేన వైశ్యో గచ్ఛతి శూద్రతామ్‌

వైశ్యో వాక్షత్రియః కేన ద్విజో వాక్షత్రియో భవేత్‌

ప్రతిలోమే కథం దేవ శక్యో ధర్మోనివర్తితుమ్‌

కేన వా కర్మణా విప్రః శూద్రయోనౌ ప్రజాయతే

క్షత్రియః శూద్రతామేతి కేన వాకర్మణా ప్రభో

ఏతం మేసంశయం దేవ వద భూతపతేనఘ

త్రయోవర్ణాః ప్రకృత్యేహ కథం బ్రాహ్మణ్య మాప్నుయుః

ఉమాదేవి:

ఓ భగనేత్ర నాశన! పూషదంత వినాశన! దక్షక్రతు హర! బ్రహ్మమున్ను చాతుర్వర్ణ్య ధర్మముల నడిగెను. ఏకర్మ విపాకముచే బ్రాహ్మణాదులు క్షత్రియాది జన్మము లందుదురు. ఈ అనులోమ విలోమ వర్ణ సాంకర్య మెట్లు గలుగునో నాసంశయ వారింపు మన శివుండిట్లనియె.

శివుడు:

బ్రాహ్మణ్యందేవి దుష్ప్రాపం నిసర్గాద్ర్బాహ్మణః శుభే

క్షత్రియో వైశ్య శూద్రౌవా నిసర్గాదితి మే మతిః

కర్మణా దుష్కృతేనేహ స్థానాద్ర్బశ్యతి సద్విజః

శ్రేష్టం వర్ణమనుప్రాప్య తస్మాదాక్షిప్య తేపునః

స్థితో బ్రాహ్మణ ధర్మేణ బ్రహ్మణ్యముపజీపతి

క్షత్త్రియో వాథవై శ్యోవా బ్రహ్మభూయం సగచ్చతి

యశ్చ విప్రత్వ ముత్సృజ్య క్షత్ర ధర్మాన్ని షేవతే

బ్రాహ్మణ్యాత్స పరిభ్రష్టః క్షత్త్రయోనౌ ప్రజాయతే

వైశ్యకర్మ చ యో విప్రో లోభమోహ వ్యపాశ్రయః

బ్రాహ్మణ్యం దుర్లభం ప్రాప్య కరోత్సల్పమతిః సదాః

సద్విజో వైశ్యతామేతి వైశ్యో వా శూద్రతామియాత్‌

స్వధర్మాత్ర్పచ్యుతో విప్రస్తతః శూద్రత్వమాప్నుయాత్‌

తత్రాసౌ నిరయం ప్రాప్తో వర్ణభ్రష్టో బహిష్కృతః

బహ్మలోకాత్ర్పరి భ్రష్టః శూద్రయోనౌ ప్రజాయతే

క్షత్రియో వా మహాభాగే వైశ్యో వా ధర్మచారిణి

స్వాని కర్మాణ్యపాకృత్య శూద్రకర్మణిషేవతే

స్వస్థానాత్స పరిభ్రష్టో వర్ణసంకరతాం గతః

బ్రాహ్మణః క్షత్త్రియో వైశ్యః శూద్రత్వం యాతి తాదృశః

శివుడు:

దేవి! బ్రాహ్మణ్యము దుర్లభము. బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు స్వభావము చేత నేర్పడి రని నా తలంపు. తరువాత దుష్కర్మ మొనరించి సహజ సిద్దమైన బ్రాహ్మణ్యము నుండి దిగజారును. బ్రాహ్మణుడు మొదలయిన వారు తమ స్వధర్మ మందుండి రేని బ్రాహ్మణ్యమును పరమా వధిగ బడయుదురు. ఎవ్వడు విప్ర ధర్మము విడిచి క్షత్రియ ధర్మము నాచరించు నతడు విప్రత్వము గోల్పోయి క్షత్రియ యోనిం జనించును. ఇట్లే వైశ్యాది వర్ణము లందును స్వధర్మ పరిత్యాగము చేసిన వాడు జనించును. శూద్రత్వము దాక పతన మైన విప్రుడు బ్రహ్మ లోక భ్రష్టుడై వర్ణ సాంకర్య మందును.

యస్తు శూద్రః స్వధర్మేణ జ్ఞాన విజ్ఞానవాంఛుచిః

ధర్మజ్ఞో ధర్మనిరతః సధర్మపలమశ్నుతే

ఇదం చైవాపరం దేవి బ్రహ్మణా సముదాహృతమ్‌

ఆధ్యాత్మం నైష్టికి సిద్ది ర్దర్మకామైర్నషేవ్యతే

ఉగ్రాన్నం గర్హితం దేవి గణాన్నం శ్రాద్ద సూతకమ్‌

మూష్టాన్నం నైవ భోక్తవ్యం శూద్రాన్నం నై వవాక్వచిత్‌

శూద్రాన్నం గర్హితం దేవి సదా దేవై ర్మహాత్మభిః

పితామహా ముఖోత్స్పృష్టం ప్రమాణమితి మేమతిః

శూద్రాన్నేనాశేషేణ జఠరే మ్రియతే ద్విజః

అహితాగ్ని స్తథా యజ్వా స శూద్రగతి భాగ్భవేత్‌

తేన శూద్రాన్న శేషేణ బ్రహ్మస్థానాదపాకృతః

బ్రాహ్మణః శూద్రతామేతి నాస్తితత్ర విచారణా

యస్యాన్నేనావశేషేణ జఠరే మ్రియతే ద్విజః

తాం తాం యోనిం ప్రజేద్విప్రో యస్యాన్నము పజీవతి

బ్రహ్మణత్వం సుఖం ప్రాప్య దుర్లభం యోవమన్యతే

అభోజ్యాన్నాని వాశ్నాతి సద్విజత్వాత్పతేత వైః

సురాపో బ్రహ్మహా స్తేయీ చౌరౌ భగ్నవ్రతోశుచిః

స్వాధ్యాయ వర్జితః పాపోలుబ్దో నైకృతికః శఠః

అవ్రతీ వృషలీ భర్తా కుండాశీ సోమ విక్రయీ

విహీనసేవీ విప్రో హి పతతే బ్రహ్మయోనితః

గురుతల్పీ గురుద్వేషీ గురుకుత్సారతిశ్చయః

బ్రహ్మద్విడ్వాపి పతతి బ్రాహ్మణో బ్రహ్మయోనితః

ఏభిస్తు కర్మభి ర్దేవి శుభై రాచరితై స్తథా

శూద్రో బ్రాహ్మణతాం గచ్చే ద్వైశ్యః క్షత్రియతాం వ్రజేత్‌

శూద్రః కర్మాణి సర్వాణి యథాన్యాయం యథా విధి

సర్వాతిథ్యముపాతిష్ఠన్‌ శేషాన్న కృత భోజనః

శుశ్రూషాం పరిచర్యాం యో జ్యేష్ట వర్ణే ప్రయత్నతః

కుర్యాదవిమనాః శ్రేష్ఠః సతతం సత్పథే స్థితః

దేవద్విజాతి సత్కర్తా సర్వాతిథ్య కృతవ్రతః

ఋతుకాలాభిగామి నియతో నియతాశనః

దక్షః శిష్టజనాన్వేషీ శేషాన్న కృత భోజనః

వృథా మాంసం న భుంజీత శూద్రో వైశ్యత్వమృచ్చతి

శూద్రుడు స్వధర్మముచే జ్ఞాన విజ్ఞానముల నంది శుచియై ధర్మజ్ఞుడై ధర్మ నిరత్తుడై స్వదర్మ ఫలము వడయును. అనగా క్రమముగ ఉన్నత వర్ణము లందు జన్మించి బ్రహ్మత్వ సిద్దిని గూడ నందును. మున్ను బ్రహ్మా యుదాహరించిన అధ్యాత్మ జ్ఞానము నిష్ఠా సిద్దిని ధర్మ పరులెట్లు పొందుదురో యా విషయము లివి. ఉగ్రాన్నము గణాన్నము శ్రాద్దాన్నము మైల అన్నము ముష్టాన్నము శూద్రాన్నము నెన్నడుం దినరాదు. ఇది బ్రహ్మ ముఖము నుండి వచ్చిన వాక్కుగాన (వేదము) పరమ ప్రమాణ మని నా అభిప్రాయము.

శూద్రాన్న శేషము కడుపులో నుండగా చని పోయిన ద్విజుడు అహితాగ్ని యజ్ఞ కర్తయు శూద్రడై పుట్టును. దానికి ప్రాయశ్చిత్తము గూడలేదు. ఏయే వర్ణముల వారి యన్నము జఠర మందుండగా నెవ్వడు చని పోవునో వాడు వాడా వర్ణము లందు బుట్టును. అక్కడ విమర్శ లేదు. దుర్లభ మైన బ్రాహ్మణ జన్మ మంది యభోజ్యాన్న ములం దిన్నవాడో పతితుడై తీరునో బ్రాహ్మణుడు సురా పానము బ్రహ్మ హత్య దొంగతనము వ్రత భంగము శౌచ లోపము స్వాధ్యాయ లోపముసే లుబ్దుడై నైకృతికుడై శదుడై వ్రత దూరడై వృషలిని సంగ మించి కుండాశనము సేసి సోమమమ్మి నీచుల సేవించి భ్రష్టు డగును. గురుతల్పగుడు గురుద్వేషి గురువుల పరిహసించు వాడు బ్రహ్మద్వేషి బ్రాహ్మణ్య పతితుడు గాను శూద్రుడు న్యాయము దప్పక యథావిధిగ స్వధర్మా చరణము సేసి అందరికిం దానతిథియై అందరి భుక్త శేషముందిన్న వాడు, వారికి శుశ్రూష పరిచర్య చేసిన వాడు సన్మార్గ మందు స్థిరుడైన వాడు దేవతల భూ దేవులను బూజించిన వాడు ఋతకాల స్త్రీ సంగమము చేసిన వాడు నియత మయిన ఆహారము దిన్నవాడు. వృథా మాంసము తినని వాడు వైశ్యత్వముం బడయ గలడు.

ఋతువాగనహం వాదీ నిర్ద్వంద్వః సామ కోవిదః

యజతే నిత్యయజ్ఞైశ్య స్వాధ్యాయ పరమః శుచిః

దాంతో బ్రాహ్మణ సత్కర్తా సర్వవర్ణానసూయకః

గృహస్థ వ్రతమాతిష్ఠన్ద్వి కాలకృతభోజనః

శేషాశీ విజితాహారో నిష్కామో నిరహంవదః

అగ్నిహోత్రముపాసీనో జుహ్వానశ్చ యథావిధి

సర్వాతిథ్యముపాతిష్ఠన్‌ శేషాన్నకృత భోజనః

త్రేతాగ్ని మాత్రవిహితం వైశ్యో భవతి చ ద్విజః

స వైశ్యః క్షత్రియకులే శుచిర్మహతి జాయతే

స వైశ్యః క్షత్రియోజాతో జన్మ ప్రభృతి సంస్కృతః

ఉపనీతో వ్రతపరో ద్విజో భవతి సంస్కృతః

దదాతి యజతో యజ్ఞైః సమృద్దైరాప్త దక్షిణైః

అధీత్య స్వర్గమన్విచ్ఛం స్త్రేతాగ్నిశరణః సదా

అర్ద్రహస్తప్రదో నిత్యం ప్రజాధర్మేణ పాలయన్‌

సత్యః సత్యాని కురుతే నిత్యం యః శుద్దిదర్శనః

ధర్మదండేన నిర్దగ్దో ధర్మ కామార్థసాదకః

యంత్రితః కార్యకరణైః షడ్భాగ కృతరక్షణః

గ్రామ్యధర్మాన్న సేవేత స్వచ్చందే నార్థకోవిదః

ఋతుకాలే తు ధర్మాత్మా పత్నీ ముపాశ్రయేత్సదా

సదోపవాసీ నియతః స్వాధ్యాయ నిరతః శుచిః

వహిష్కాంతరితే నిత్యం శయానోస్తి సదాగృహే

సర్వాతిథ్యం త్రివర్ణస్య కుర్వాణః సమనాః సదా

శూద్రాణాం చాన్నకామానాం నిత్యం సిద్దమితి బ్రువన్‌

స్వార్థాద్వా యదివా కామాన్న కించిదుపలక్షయేత్‌

పీవృదేవాతిథికృతే సాధనం కురుతేచ యాత్‌

స్వవేశ్మని యథాన్యాయ ముపాస్తే భైక్ష్య మేవ చ

ద్వికాలమగ్నిహోత్రం చ జుహానో వై యథావిధి

గ్రోబ్రాహ్మణ హితార్థాయ రణే చాభిముఖోహతః

త్రేతాగ్ని మంత్ర పూతేన సమావిశ్య ద్విజో భవేత్‌

జ్ఞాన విజ్ఞానసంపన్నః సంస్కృతో వేదపారగః

వైశ్యో భవతి ధర్మాత్మా క్షత్రియః స్వేన కర్మనా

ఏతైః కర్మఫలైర్దేవి న్యూనజాతి కులోద్భవః

శూద్రోప్యాగమ సంపన్నో ద్విజో భవతి సంస్కృతః

బ్రాహ్మణో వాప్య సద్వృత్తః సర్వసంకర భోజనః

ఋత వచనుడు అహంభావము లేని వాడు. సుఖ దుఃఖాది ద్వంద్వముల కతీతుడు. సామ నిపుణుడు బ్రహ్మ యజ్ఞాది నిత్య యజ్ఞములు సేయు వాడు స్వాధ్యాయ పరుడు అచార శీలుడు ఇంద్రియముల నదిమిన వాడు సత్కార్య కర్త సర్వ వర్ణముల యెడ నసూయ లేనివాడు గృహస్థ వ్రతమూని రెండు వేళల మాత్రమే భూజించుచు శిష్ట శేషము యజ్ఞ శేషము నారగించుచు నిష్కాముడు నిరహం మతి యథావిధి కాలముగ హోమము సేయుచు నగ్న్యు పాసన సేయు వాడు నర్వులకు నాతిథ్య మొసంగుచు శేషాన్నము మాత్రమే తాను భుజించు వాడు నగు వైశ్యుడు త్రేతాగ్ని మాత్ర సంపాద్య మైన బ్రాహ్మణ త్వము లడుగ ఆ వైశ్యుడు తొలుత క్షత్రియుడై పుట్టి జన్మాది సంస్కారములు వొంది మంచి దక్షిణ నిచ్చి యజ్ఞములు సేయు వారికి దానములు సేసి స్వర్గము కోరి అధ్యయనము సేసి త్రేతాగ్ని హోత్రియై ఎల్లపుడు తడి చేతితో దానములు సేయును. చేయు ఆరకుండ ధారా పూర్వకముగ (బహుదానములు చేయుచు నన్నమాట) ప్రజలను ధర్మమున బాలించుచు సత్య వచనుడై ఆచార వంతుడై సత్యము అయిన ధర్మములను జేయుచు ధర్మ దండముచే దగ్దుండు గాక (రాజందఱిని దండించు వాడయ్యును నాతనిపై శాస్త్ర విహిత ధర్మ దండన మనునది యొకటి యుండి యాతని నదుపులో పెట్టు చుండును. దానిచే రాజు దగ్ధుండు కాక పోవుట యనగా దానికి లోబడి ప్రజా రక్షణ శిక్షణలు చేసి దానికి విదేయుడై యుండవలె నన్నమాట) ధర్మ కామార్థము లను మూడు పురు షార్థములను సాధించుచు కార్యములచే కార్య సాధనములచే నియమింప బడిన వాడై ప్రజల వలన నాఱవ వంతు మాత్రమే పన్ను గ్రహించు వాడై స్వేచ్చగొని గ్రామ్య ధర్మ ములను సేవింపక అర్థ శాస్త్రము చక్కగ నెఱిగి ఋతు కాలమందు పత్నీ సమావేశము నొంది (సదా బ్రహ్మచారియై) సదోప వాసియై (నియమిత భోజనములు రెండిటి నడుమ నెట్టి అల్పాహారములు గొనకుండు వాడు సదోవవాసి) స్వాధ్యాయ నిరతుడై శుచియై గృహమంద యుండి మూడు వర్ణముల వారికిని అతిథ్య మిచ్చుచు మంచి మనసుతో నిత్యము నన్న మడుగు శూద్రులకు సిద్దమై యున్నది రండనుచు స్వార్థముచే కాని కామముచే గాని యేకొంచెమును జూడక కేవలము పితృ దేవాతిథి నిమిత్తము గానే సాధనము సేయుచు దన యింటనే తాను భిక్షాన్నమును సేవించి ద్వికాల మగ్ని హోత్రములు సేయుచు గో బ్రాహ్మణ హితమునకై మాత్రమే ప్రవర్తించుచు యుద్ద మందు వెన్ను జూపక యటం గూలి యత్రేతాగ్ని మంత్ర పూత మయిన ఉపాధితో శరీరమిం కోకటి ప్రవేశించి ద్విజు డగును. అప్పుడు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడై వేద పారగుడై సుసంస్కృతుడై వైశ్యుడిట్టి క్షత్రి యత్వమును బడయును. శూద్రుడును అగమ విధానముచే (వైదిక ప్రక్రియతో గాదు) సంస్కారముల నంది ద్విజు డగును.

స బ్రాహ్మణ్యం సముత్సృజ్య శూద్రోభవతి తాదృశః

కర్మభిః శుచిభిర్దేవి! శుధ్దాత్మా విజితేంద్రియః

శూద్రోపి ద్విజవత్సేవ్య ఇతి బ్రహ్మాబ్రవీత్స్వయమ్‌

స్వభావకర్మనా చైవ యశ్చశూద్రోధితిష్టతి

విశుద్దః స ద్విజాతిభ్యో విజ్ఞేయ ఇతి మేమతిః

న యోని ర్నాపి సంస్కారో న శ్రుతిర్న చ సంతతిః

కారణాని ద్విజత్వప్య వృత్తమేవ తు కారణమ్‌

సర్వోయం బ్రాహ్మణో లోకే వృత్తేన తు విధీయతే

వృత్తే స్థితశ్చ శూద్రోపి బ్రాహ్మణత్వం చ గచ్చతి

బ్రహ్మ స్వభావః సుశ్రోణి సమః సర్వత్ర మేమతః

నిర్గుణం నిర్మలం బ్రహ్మ యత్ర తిష్టతి స ద్విజః

ఏతే యేనిమలా దేవి! స్థానాభావనిదర్శకాః

స్వయం చ వరదేనోక్తా బ్రహ్మణా సృజతా ప్రజాః

బ్రహ్మణో హి మహత్క్షేత్రం లోకే చరతి పాదవత్‌

యత్తత్ర బీజం పతతి సా కృషి ప్రేత్య భావినీ

సంతుష్టేన సదా భావ్యం సత్పథా లంబినా సదా

బ్రాహ్మం హి మార్గమాక్రమ్య వర్తితవ్యం బుభూషతా

సంహితాధ్యాయినా భావ్యం గృహే వై గృహమేధినా

నిత్యం స్వాధ్యాయ యుక్తేన న ఛాధ్యయన జీవినా

ఏవంభూతో హి యో విప్రః సతతం సత్పథే స్థితః

అహితాగ్ని రధీయానో బ్రహ్మభూయాయ కల్పతే

బ్రాహ్మణ్యందేవి సంప్రాప్య రక్షితవ్యం యతాత్మనా

యోనిప్రతి గ్రహాదానైః కర్మభిశ్చశుచిస్మితే

ఏతత్తే గుహ్యమాఖ్యాతం యథా శూద్రో భవేద్విజః

బ్రాహ్మణో వా చ్యుతో ధర్మా ద్యథా శూద్రత్వ మాప్నుయాత్‌

బ్రాహ్మణుడుడేయగు గాక అసద్వృత్తముచే సర్వ సంకర భోజనముచే బ్రాహ్మణ్యముం గోల్పోయి శూద్రత్వ మందును. శుచి కర్మా చరణముచే దేవీ కటాక్షముచే మనస్సు శుద్దినంది జితేంద్రియు డైన శూద్రుడును ద్విజుని యట్ల సేవింప దగిన వాడని బ్రహ్మ స్వయముగ బల్కెను. స్వభాకర్మ చేత శూద్రుడు ప్రవర్తించు నేని అతడు ద్విజుల కంటెను విశుద్దుడని నాతలంపు. యోని కాదు (జన్మకాదు) సంస్కారము కాదు శ్రుతి కాదు సంతానము గాదు. ద్విజత్వమునకు కారణము కేవలము వృత్తమే (నడవడియే). బ్రాహ్మణుడను నీ సర్వ జాతియు లోకమందు వృత్తము ననుసరించి విధింప బడును. వృత్తమున నున్న శూద్రుడు గూడ బ్రాహ్మణత్వ మందును. ఓ రమణి! బ్రహ్మ స్వభావ మనగా సర్వత్ర సమత్వమని నా తలంపు. నిర్గుణము నిర్మలము నైన బ్రహ్మ యెవ్వని యందుండు నతడు ద్విజుడు (బ్రహ్మ విషయక జ్ఞానము కలవాడన్న మాట) ఇట్టి పవిత్రులు ఒక స్థానము ఒక అధికారము నని లేని యొక విలక్షణ స్థితికి నిదర్శనమై యుందురు. ప్రజాసృష్టి సేయు బ్రహ్మయే స్వయముగా నిట్లు సెప్పెను. బ్రహ్మ పదార్థము యొక్క మహా క్షేత్రము పాదములచే నీలోక మందు బ్రాహ్మణ రూపమున సంచారము సేయు చున్నది. అక్కడ పడిన విత్తనము ఈ కృషి (వ్యవసాయము) పరమందు ఫలవంత మగును. నిత్య సంతుష్టుడై బ్రాహ్మ మార్గము ననుసరించి సంహితా ధ్యయనము నిత్యము సేయుచు గృహ మందుత్తము గృహస్థై నిత్యము స్వాధ్యాయమే బ్రతుకుగా వేదాధ్యయన ముచే సంపాదన సేసి బ్రతుకక యుండు విప్రుడు నిత్య సన్మార్గ వర్తి అహితాగ్ని అధ్యయన పరుడునైన విప్రుడు బ్రహ్మ భావమున కర్హు డగును. బ్రహ్మాణ్యము వీడక మనసు నియమించు కొని దానిం జన్మ కారణమైన సహజ ద్విజత్వము. చేతను సత్ర్పతి గ్రహము చేత దానముల చేయుట చేతను విహిత కర్మాచరణముల చేతను గాపాడు కొన వలయును. ఇది చాల గుహ్యమైన విషయము. శూద్రుడు ద్విజుడు కాగల విధానము ద్విజుడు ధర్మచ్యుతి నొంది శూద్రుడగు రీతియు నీకు దెల్పితిని.