బ్రహ్మ మహా పురాణము
236 - సాంఖ్య యోగ నిరూపణమ్
సాంఖ్య యోగము
మునులు:
తవ వక్త్రాభ్ది సంభూతమమృతం వాఙ్మయం మునే
పిబతాం నో ద్విజశ్రేష్ట న తృప్తిరిహ దృశ్యతే
తస్మాద్యోగం మునే బ్రూహి విస్తరేణ విముక్తిదమ్
సాంఖ్యం చ ద్విపదాం శ్రేష్ఠ శ్రోతుమిచ్చామహే వయమ్
ప్రజ్ఞావాన్ర్శోత్రియో యజ్వాఖ్యాతః ప్రాజ్ఞోనసూయకః
సత్యధర్మమతిర్ర్బహ్మన్కథం బ్రహ్మాదిగచ్ఛతి
తపసా బ్రహ్మచర్యేణ సర్వత్యాగేన మేధయా
సాంఖ్యే వా యది వా యోగ ఏతత్పృష్టో వదస్వ నః
మనవశ్చేంద్రియాణాం చ యథైకాగ్ర్య మవాప్యతే
యేనోపాయేన పురుషస్తత్వం వ్యాఖ్యాతుమర్హసి
మునులు:
ఓ వ్యాస మహామునీ! నీ ముఖమను క్షీర సముద్రము నుండి ఉద్భవిల్లిన వాగ్రూప మగు అమృతమును ఎంత త్రావినను మాకు తృప్తి కలుగుట లేదు. అందుచేత సంసార విముక్తిని కలిగించు యోగమును ఓ పురుషోత్తమా! సాంఖ్యమును గూడ మాకు విస్తరించి చెప్పుము. మాకు వినుటకు కుతూహలము కలుగు చున్నది. ప్రజ్ఞా వంతుడును శ్రోత్రియుడు తన శాఖకు చెందిన వేదమును సంపూర్ణముగా అధ్యయనము చేసిన ద్విజుడు యజ్ఞము లాచరించి ప్రసిద్దుడు, విశేషముగ అన్ని విషయముల నెఱిగిన వాడు అసూయ లేనివాడు సత్య ధర్మముల యందు స్థిర బుద్ది కలవాడు అగు ముముక్షువు తపస్సు బ్రహ్మ చర్యము సర్వ కర్మఫల త్యాగము చేసియు మేధా వంతుడయ్యు ఏ సాధనమున్నచో ముక్తి నందును? యోగము చేతనా? మాకు తెలుపుము. పురుషుడు ఏ యుపాయముచే ఇంద్రియముల కును మనస్సున కును తత్త్వము నందు ఏకాగ్రత సంపాదించ గలగును? వివరింప వలయును. అని ప్రార్ధించిరి. (పురుషు డనగా జీవుడు, మగ వాడని కాదు.)
వ్యాసులు:
నాన్యత్ర జ్ఞానతసపోర్నాన్యత్రేంద్రియ నిగ్రహాత్
నాన్యత్ర సర్వసంత్యాగాత్సిద్దిం విందతి కశ్చన
మహాభూతాని సర్వాణి పూర్వసృష్టిః స్వయంభువః
భూయిష్టం ప్రాణభృద్గ్రామే నివిస్టాని శరీరిషు
భూమేర్దేహో జలాత్న్సేహో జ్యోతిషశ్చక్షుషీ స్మృతే
ప్రాణాపానాశ్రయో వాయుః కోష్ఠాకాశం శరీరిణామ్
క్రాంతౌ విష్ణుర్బలే శక్రః కోష్ఠేగ్నిర్భోక్తుమిచ్ఛతి
కర్ణయోః ప్రదిశః శ్రోత్రే జిహ్వాయాం వాక్సరస్వతీ
కర్ణౌ త్వక్చక్షుషీ జిహ్వా నాసికా చైవ పంచమీ
దశ తానీంద్రియో క్తాని ద్వారాణ్యాహురసిద్దయే
శబ్దస్పర్శౌ తథా రూపం రసం గంధం చ పంచమమ్
ఇంద్రియార్థాన్పృథగ్విద్యా దింద్రియేభ్యస్తు నిత్యదా
ఇంద్రియాణి మనో యుంక్తే అవ శానిన వాజినః
మనశ్చాపి సదా యుంక్తే భూతాత్మా హృదయాశ్రితః
ఇంద్రియాణాం తథైవేషాం సర్వేషామీశ్వరం మనః
నియమే చ విసర్గే చ భూతాత్మా మనసస్తథా
ఇంద్రియాణీంద్రియార్థాశ్చ స్వభావశ్చేతనా మనః
ప్రాణాపానౌ చ జీవశ్చ నిత్యం దేహేషు దేహినామ్
అశ్రయో నాస్తి సత్త్వస్య గుణశబ్దో న చేతనాః
సత్త్వం హి తేజః సృడతి న గుణాన్వై కథంచన
ఏవం సప్తదశం దేహం వృతం షోడశభిర్గుణైః
మనీషీ మనసా విప్రాః పశ్యత్యాత్మాన మాత్మని
న హ్యయం చక్షుషా దృశ్యో న చ సర్వైరపీంద్రియైః
మనసా తు ప్రదీప్తేన మహానాత్మా ప్రకాశతే
అశబ్ద స్పర్వరూపం త చ్చా రసాగంధ మవ్యయమ్
అశరీరం శరీరే స్వే నిరీక్షేత నిరింద్రియమ్
అవ్యక్తం సర్వదేహేషు మర్త్యేషు పరమార్చితమ్
యోనుపశ్యతి స ప్రేత్య కల్పతే బ్రహ్మభూయతః
విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః
స హి సర్వేషు భూతేషు జంగమేషు ధ్రువేషు చ
వసత్యేకో మహానాత్మా యేన సర్వమిదం తతమ్
వ్యాసులు:
జ్ఞాన తపస్సులు ఇంద్రియ నిగ్రహము సర్వసంగ పరిత్యాగము లేనిదే ఎవరును సిద్ధి పొందలేరు. స్వయంభూ బ్రహ్మయొక్క మొదటి సృష్టి యగు ఐదు మహా భూతములను జీవుల దేహ సముదాయము నందు ఇమిడి యున్నవి. భూమి నుండి దేహము (దేహము లోని గట్టి అంశ) జలము నుండి ద్రవాంశము అగ్ని నుండి కన్నులు వాయువు నుండి ప్రాణాపానాది వాయువు లైదు ఆకాశము నుండి ఉదరము ఏర్పిడి నవి. జీవుల నడకలో విష్ణువు బలము నందు ఇంద్రుడు ఉందురు. ఉదరమున అగ్ని యుండి అకలి నేర్పరచును. చెవులలో దిక్కులు జిహ్వ యందు సరస్వతి ఉండును. చెవులు చర్మము కన్నులు నాలుక ముక్కు అను జ్ఞానేంద్రియుములు మరి ఐదు కర్మేంద్రియములు కలిసి ఈ పదియు తమకు ఆహారమునకై శబ్ధ స్పర్శ రూప రస గంధములను ఆయా కర్మేంద్రియ వ్యాపారములను కోరు చుండును. జీవాత్ముడు మనస్సును మనస్సు ఇంద్రియములను ప్రేరణ చేయుటచే ఆయా పది ఇంద్రియ వ్యాపారములను జరుగు చున్నవి. మనీషి, విద్వాంసుడు, మనస్సుతోనే తనలో నున్న ఆత్మను చూచును. ప్రకాశము నొందిన మనస్సుతో తప్ప ఆత్మను ఇంద్రియము లతో దర్శింప అనుభవింప శక్యము కాదు. ఈ దృశ్య ప్రపంచ మంతయు ఆ మహా త్తత్వముతో వ్యాప్తమై యున్నది. స్థిర చర జడ చేతన పదార్థము లన్నింటి యందును ఆతడొక్కడే నిలిచి యున్నాడు.
సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని
యదా పశ్యతి భూతాత్మా బ్రహ్మ సంపద్యతే తదా
యావానాత్మని వేదాత్మా తావానాత్మా పరాత్మని
య ఏవం సతతం వేద సోమృతత్వాయ కల్పతే
సర్వభూతాత్మ భూతస్య సర్వభూత హితస్య చ
దేవాపి మార్గే ముహ్యంతి అపదస్య పదైషిణిః
శకుంతానామివాకాశే మత్స్యానామివ చోదకే
యథా గతిర్న దృశ్యేత తథా జ్ఞానవిదాం గతిః
కాలః పచతి భూతాని సర్వణ్యేవాత్మనాత్మని
యస్మింస్తు పచ్యతే కాల స్తన్న వేదేహ కశ్చన
న తదూర్థ్వం న తిర్యక్ఛ నాధో న చ పునః పునః
న మధ్యే ప్రతిగృహ్ణీతే నైవ కించిన్న కశ్చన
సర్వే తత్థ్సా ఇమే లోకా బాహ్యమేషాం న కించన
యద్యప్యగ్రే సమాగచ్ఛే ద్యథా బాణో గుణచ్యుతః
నైవాంతం కారణస్యేయా ద్యద్యపి స్యా న్మనోజవః
తస్మాత్సూక్ష్మతరం నాస్తి నాస్తి స్థూలతరం తథా
సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖమ్
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి
తదేవాణోరణుతరం తన్మహద్భ్యో మహత్తరమ్
తదంతః సర్వభూతానాం ధ్రువం తిష్ఠన్న దృశ్యతే
అక్షరం చ క్షరం చైవ ద్వేధా భావోయమాత్మనః
క్షరః సర్వేషు భూతేషు దివ్యం త్వమృతమక్షరమ్
నవద్వారం పురం కృత్వా హంసో హి నియతో వశీ
ఈ దృశః సర్వభూతస్య స్థావరస్య చరస్య చ
హానేనాభివికల్సానాం నరాణాం సంచయేన చ
శరీరాణామజస్యాహు ర్హంసత్వం పారదర్శినః
హంసోక్తం చ క్షరం చైవ కూటస్థం యత్తదక్షరమ్
తద్విద్వానక్షరం ప్రాప్య జహాతి ప్రాణజన్మనీ
జీవుడు తనలో సర్వ భూతములును సర్వ భూతములలో తన కంటే అభిన్నుడగు పరమాత్ముని చూడ గలిగినచో బ్రహ్మమే తానగును. దృశ్య ప్రపంచము నందే రూపమున ఎంత యాత్మ కలదో పరమాత్ముని యందును అదే అంతే తత్త్వము కలదని ఎఱిగిన వాడు అమృతత్వమును మోక్షమును పొందును. తాను బ్రహ్మమే యగును. సర్వ భూతములను తానై సర్వ భూతములకు హితుడగు ఆ మహానుభావుడు పాదములు లేకయే సంచరించు వాడు. కాన అతడు నడచు మార్గము ఏదియో దేవతలు కూడ ఎఱుగ జాలరు. ఆకాశమున పక్షుల మార్గము వలె నీటిలో చేపల మార్గము వలె జ్ఞానుల మార్గము ఎవరికిని కనబడదు. అన్ని భూతములను కాలము పరిపాకము నొందించి తనకు లోబరుచు కొనును. కాని కాలమును కూడ పరిపాకము నొందించుచు తన యధీనములో నుంచుకొను పరతత్త్వమును ఎవరో తప్ప ఎఱుగ జాలరు. ఆ పర తత్త్వమునకు మీద, క్రింద, అడ్డముగా, ప్రక్కగా మరల మరల మధ్యలో ఇది యున్నది అని చెప్ప శక్యము కాదు. ఏలయన అంతయు తానే యగు ఏకైక అఖండ పదార్థమది. ఈ లోకము లన్నియు దానయం దున్నవి. అవి అదియే కనుక వానికి వెలుపల ఏదియు లేదు. వింటి త్రాటి నుండి వెడలిన బాణము వలె సూటిగా మనో వేగముతో ఎంత దూరము ఎంత సేపు పరుగుతో పోయినను ఆ మహా తత్త్వము యొక్క కడపటి మేర దొరకదు. దాని కంటె చిన్నది కాని పెద్దది కాని ఏదియు లేదు. ఆ తత్త్వమునకు కాలు సేతులు కన్నులు తలలు నోళ్ళు చెవులు అన్ని వైపులకును కలవు. అది అంతట అన్నిటిని ఆవరించి యున్నది. అది చాల చిన్న వాని కంటె చాల చిన్నది. చాల పెద్ద వాని కంటె చాల పెద్దది. అన్ని భూతముల లోపల ఎప్పుడు ఉండియు అది కనబడ కుండును. ఈ తత్త్వము క్షరము, అక్షరము అని రెండు విధములు. సర్వ భూతముల యందును సర్వ భూతముల రూపము తోను నున్నది క్షరము నశించునది. దివ్యము అమృతము నగు తత్త్వము అక్షరము నశింపనిది. హంస అని వ్యవరింపబడు ఈ పర తత్త్వమును స్థావరములు చరములు కదలని కదల గల సర్వ భూతముల యందును దేహము అనెడి నవ ద్వారములు కల పురమును (రెండు ముక్కలు రెండు చెవులు రెండు కన్నులు నోరు గుదము మర్మాంగము మొత్తము తొమ్మది) నిర్మించుకొని నియమము లతో ఇంద్రియములను తన అధీనములో నుంచుకొని యుండును. ఆయనకు మనకు వలె సంకల్ప వికల్పములు ఉండవు కనుకను అన్ని ప్రాణుల శరీరములను తన అధీనమున నుంచు కొనుట చేతను అతనిని హంస అందురని తత్త్వవేత్తలు చెప్పుదురు. ఇది ప్రపంచ రూపమున నుండుటచే క్షరరూప మైనది. ఈ రూప వికల్పములు లేని అవికారి యైన కూటస్థ రూపము అక్షరము. దానిని ఎఱిగిన వాడు అది తానే యగును. ఇదియే తత్త్వ సారము.
వ్యాసులు:
భవతాం పృచ్ఛతాం విప్రా యథావదిహ తత్త్వతః
సాంఖ్యం జ్ఞానేన సంయుక్తం తదేతత్కీర్తితం మయా
యోగకృత్యం తు బో విప్రాః కీర్తయిష్యామ్యతఃపరమ్
ఏకత్వం బుద్దిమనసో రింద్రియాణాం చ సర్వశః
అత్మనో వ్యాపినో జ్ఞానం జ్ఞానమేత దనుత్తమమ్
తదేతదుపశాంతేన దాంతేనాధ్యాత్మశీలినా
ఆత్మారామేణ బుద్దేన బోద్ధవ్యం శుచికర్మాణా
యోగదోషాన్సముచ్చిద్య పంచ యాన్కవయో విదుః
కామం క్రోధం చ లోభం చ భయం స్వప్నం చ పంచమమ్
క్రోధం శమేన జయతి కామం సంకల్పవర్జనాత్
సత్త్వసంసేవనాద్దీరో నిద్రముచ్ఛేత్తు మర్హతి
ధృత్యా శిశ్నోధరం రక్షే త్పాణిపాదం చ చక్షుషా
చక్షుః శ్రోత్రం చ మనసా మనో వాచం చ కర్మణా
అప్రమాదాద్భయం జహ్యా ద్దంభం ప్రాజ్ఞోపసేవనాత్
ఏవమేతా న్యోగదోషా న్జయేన్నత్య మతంద్రితః
అగ్నీంశ్చ బ్రాహ్మణాంశ్చాథ దేవతాః ప్రణమేవత్సదా
వర్జయే దుద్దతాం వాచం హింసాయుక్తాం మనోనుగామ్
బ్రహ్మతేజోమయం శుక్రం యస్య సర్వమిదం జగత్
ఏతస్య భూతభూతస్య దృష్టం స్థావరజంగమమ్
ధ్యానమధ్యయనం దానం సత్యం హ్రీ రార్జవం క్షమా
శౌచం చై వాత్మనః శుద్ది రింద్రియాణాం చ నిగ్రహః
ఏతైర్వివర్ధతే తేజః పాప్మానం చాపకర్షతి
సమః సర్వేషు భూతేషు లభ్యాలభ్యేన వర్తయన్
ధూతపాప్మా తు తేజస్వీ లఘ్వాహారో జితేంద్రియః
కామక్రోధౌ వశే కృత్వా నిషేవేద్బ్రహ్మణః పదమ్
మనసశ్చేంద్రియాణాం చ కృత్త్వై కాగ్ర్యం సమాహితః
పూర్వ రాత్రే పరార్ధే చ ధారయేన్మన ఆత్మనః
జంతోః పంచేంద్రియస్యాస్య య ద్యేకంక్లిన్నమింద్రియమ్
తతోస్య స్రవతి ప్రజ్ఞా గిరేః పాదా దివోదకమ్
మనసః పూర్వమాద ద్యా త్కూర్మాణామివ మత్స్యహా
తతః శ్రోత్రం తతశ్చక్షు ర్జిహ్వా ఘ్రాణం చ యోగవిత్
తత ఏతాని సంయమ్య మనసి స్థాపయేద్యది
తథైవాపోహ్య సంకల్పా న్మనో హ్యాత్మని ధారయేత్
పంచేంద్రియాణి మనసి హృది సంస్థాపయేద్యది
యదైతాన్యవ తిష్ఠంతే మనఃషష్టాని చాత్మని
ప్రసీదంతి చ సంస్థాయాం తదా బ్రహ్మ ప్రకాశతే
విధూమ ఇవ దీప్తార్చి రాదిత్య ఇవ దీప్తిమాన్
వైద్యుతోగ్నిరివాకాశే పశ్యంత్యాత్మానమాత్మని
సర్వం తత్ర తు సర్వత్ర వ్యాపకత్వాచ్చ దృశ్యతే
తం పశ్యంతి మహాత్మానో బ్రాహ్మణా యే మనీషిణః
ధృతిమంతో మహాప్రాజ్ఞాః సర్వభూతహితే రతాః
ఏవం పరిమితం కాల మాచరన్సంశితవ్రతః
ఆసీనో హి రహస్యేకో గచ్ఛేదక్షర సామ్యతామ్
ప్రమోహో భ్రమ ఆవర్తో ఘ్రాణం శ్రవణ దర్శనే
అద్భుతాని రసః స్పర్శః శీతోష్ణ మారుతాకృతిః
ప్రతిభానుప సర్గాంశ్చ ప్రతి సంగృహ్య యోగతః
తాంస్తత్త్వవిదానాదృత్య సామ్యేనైన నివర్తయేత్
కుర్యాత్పరిచయం యోగే త్రైలోక్యే నియతో మునిః
గిరిశృంగే తథా చైత్యే వృక్షమూలేషు యోజయేత్
సంనియమ్యేంద్రియగ్రామం కోష్ఠే భాండమనా ఇవ
ఏకాగ్రం చింతయేన్నిత్యం యోగాన్నోద్విజతే మనః
యేనోపాయేన శక్యేత నియంతుం చంచలం మనః
తత్ర యుక్తో నిషేవేత న చైవ విచలేత్తతః
శూన్యాగారాణి చైకాగ్రో నివాసార్థ ముపక్రమేత్
నాతివ్రజేత్పరం వాచా కర్మణా మనసాపి వా
ఉపేక్షకో యతాహారో లభ్ధాలబ్ధసమో భవేత్
యశ్చైనమభినందేత యశ్చైనమభివాదేయేత్
సమస్తయోశ్చాప్యుభయో ర్నాభిధ్యాయేచ్చుభాశుభమ్
న ప్రహృష్యేత లాభేషు నాలాభేషు చ చింతయేత్
సమః సర్వేషు భూతేషు సధర్మా మాతరిశ్వనః
ఏవం స్వస్థాత్మనః సాధోః సర్వత్ర సమదర్శినః
షణ్మాసాన్నిత్యయు క్తస్య శబ్ద బ్రహ్మాభివర్తతే
వేదనార్తన్పరాన్దృష్ట్వా సమలోష్టాశ్మ కాంచనః
ఏవం తు నిరతో మార్గం విరమే న్న విమోహితః
అపి వర్ణావకృష్ణస్తు నారీ వా ధర్మకాంక్షిణీ
తావప్యేతేన మార్గేణ గచ్ఛేతాం పరమాం గతిమ్
అజం పురాణమజరం సనాతనం యమింద్రియాతిగమగోచరం ద్విజాః
అవేక్ష్య చేమాం పరమేష్టిసామ్యతాం ప్రయాంత్యనావృత్తి గతిం మనీషిణః
వ్యాసులు:
ఓ విప్రులారా! మీరడిగిన తత్త్వ వివేచన రూప మగు సాంఖ్య తత్త్వమును ఉన్న దున్నట్లు తెలిపితిని. ఇక మీదట యోగ ప్రకారమును తెలిపెదను. బుద్ది మనస్సు ఇంద్రియములు ఏకత్వ మొందు నట్లు చేయుచు సర్వవ్యాపి యగు ఆత్మను ఎఱుగు ఉత్తమ జ్ఞానము మనస్సును బాహ్య ఇంద్రియము లను నిగ్రహించు కొని ఆధ్యాత్మ తత్త్వము నెఱుగుట నభ్యసించుచు కామము క్రోధము లోభము భయము స్వప్నము అనెడి ఐదు యోగ దోషము లను విడిచి తనలో తానే అనందమును తృప్తిని పొందుచు పవిత్రము లగు కర్మలు మాత్ర మనుష్టించుచు ఆత్మ తత్త్వము నెఱుగ వలెను. మనో నిగ్రహముచే క్రోధమును సంకల్పములు విడిచి కామమును సత్త్వ గుణము పెంచు కొనుటచే స్వప్నము, నిద్ర, మనస్సు నిబ్బరముచే తిండిపై కామ సుఖముపై వాంఛను కంటితో కాలు సేతులతో చేయు పనులను మనస్సుతో కన్నులను చెవులను పవిత్ర కర్మతో మనస్సును వాక్కును ఏమఱు పాటు లేకుండుటచే, భయమును వివేకవంతులను సేవించుటచే కపట ప్రవృత్తిని ఇట్లీ యోగ దోషములను ప్రయత్నముతో జయింప వచ్చును. ఎప్పుడును అగ్నులను బ్రాహ్మణులను దేవతలను నమస్కరించు చుండవలెను. మనస్సునకు తోచినట్లు ఇతరులను నొప్పించు పొగరు మాటలు పలుక రాదు. సర్వ చరాచర భూతాత్మాకు డగు పరమాత్ముడు స్వయం జ్యోతియై ప్రకాశించు తేజో రూపుడు. ఈ పరమాత్మ రూప మగు తేజస్సు వృద్ది నొందుటకు పాపము నశించుటకు ధ్యానము అధ్యయనము దానము సత్యము బిడియము ఋజు (వంకర గాని) స్వభావము క్షమ శౌచము మనః శుద్ది ఇంద్రియ నిగ్రహము అనునవి సాధనములు. సర్వ భూతముల యందు సమబుద్ది కలిగి యత్నము లేకయే లభించిన దానితో జీవించుచు పాపములు విడిచి తేజస్సు వృద్ది పరచుకొని లఘు ఆహారము తినుచు ఇంద్రియము లను కామ క్రోధములను జయించి ఇంద్రియములను మనస్సును ఏకాగ్రములుగా చేసి రాత్రి మొదటి కడపటి జాములందు పర తత్త్వమున మనస్సు నిలిపి తత్త్వ సాధనము చేయ వలెను. ఏ ఒక్క ఇంద్రియ మైనను కోరికలతో తడిసినచో పర్వతము ప్రక్క నుండు మిట్ట నుండి నీరువలె జీవుని ప్రజ్ఞ పరతత్త్వము నుండి క్రిందికి జారును. కనుక చేపల పట్టువాడు గాలముతో వలె మనస్సుతో శ్రోత్రము చక్షుస్సు జిహ్వ ఘ్రాణము అను క్రమమున జ్ఞానేంద్రియము లను నిగ్రహించి మనస్సున నిలిపి పిమ్మట మనస్సు లోని సంకల్పము లను కూడ అణిచి దానిని హృదయమున నిలుప వలెను. దానిని అత్మ తత్త్వముపై నిలుప వలెను. అప్పుడు పొగ లేని నిప్పువలె మేఘ వరణము లేని సూర్యుడు వలె ఆకాశ మందలి మెఱుపు వలె పరమాత్మ తత్త్వము ప్రకాశించును. అది తన యందు తానై అంతయు తన యందు అంత యందు తానై వ్యాపించి యున్నది. బ్రాహ్మణులు మనుషులు (బ్రహ్మ తత్త్వము నందు శ్రధ్ద గలవారు. మనస్సును దానిపై నిలిపిన వారు అగు మహాత్ములు, మహత్ = గొప్ప, ఆత్మ = మనస్సు కలవారు.) నిబ్బరము కలవారు మహా వివేకంతులు సర్వ భూతముల కును హితము కోరు వారును మాత్రమే ఆ తత్త్వమును దర్శింప గలరు. ఈ చెప్పిన విధమున ఏకాంతము నందు పరిమిత మగు నియత కాలమున కూర్చుండుచు నిశితమైన పవిత్ర కర్మలు మాత్రమే ఆచరించుచు తత్త్వమును అభ్యసించి నచో అక్షర తత్త్వముతో ఏక మగును. (అభ్యసించుట యనగా ఆ పనిలో సిద్ది కలుగు నంత వరకు మరల మరల చేయు చుండుట) ఇతరుల పొగడి నను తిట్టినను నమస్కరించి నను లేకన్నను దానిని మంచిగా గాని చెడుగా గాని తలచక లాభమున సంతోషించక లభించ నపుడు దుఃఖించక అన్ని విషయము లందు సమ దృష్టియై అన్ని భూతముల యందు వాయువు వలె సమాన భారము కలవాడయి ఎడ తెగక ఆరు మాసములకు తక్కవ లేకుండ సాధనము చేసినచో శబ్ద బ్రహ్మా నుభవము కలుగును. ఇది మట్టిగడ్డ, ఇది బంగారము, ఇది గొప్పది, ఇది కాదు అని తలచుచు లోకులు పొందు దుఃఖముల చూచి తాను ఆ భేద బుద్ది వదల వలెను. ఎన్నడును అజ్ఞాన ముచే ఈ అభ్యాస యోగమును విడువ రాదు. అట్లైనచో ఎంత తక్కువ కులమున పుట్టినను స్త్రీకాని పురుషుడు కాని ముక్తిని పొందుదురు. ఓ బ్రహ్మణులారా! మనీషు లైన వారు ఇట్టి మార్గము నను సరంచినచో అజుడు, పురాణుడు, సనాతనుడు, ఇంద్రి యాతీతుడు అగు ఆ వాసుదేవుని దర్శించి ఆ బ్రహ్మ తత్త్వముతో ఒక్కటిగా అగుదురు.
Summary of chapter 129 of the Brahma Mahā Purana is as follows:
The relationship between the three guṇas (sattva, rajas, tamas) and the development of the twenty-three tattvas from Prakṛti is elaborated in greater technical detail. The specific operations of each guṇa in binding the soul — sattva through pleasure, rajas through activity, tamas through ignorance — and the means of transcending all three through Sāṃkhya-jñāna and Yoga-abhyāsa are analyzed.