బ్రహ్మ మహా పురాణము
181 - హరేరంశావతార నిరూపణమ్
వ్యాసులు:
శృణుధ్వం మునిశార్దూలాః! ప్రవక్ష్యామి సమాసతః
ఆవతారం హరేశ్చాత్ర భారావతరణేచ్ఛయా
యదా యదా త్వధర్మస్య వృద్ధిర్భవతి భో ద్విజాః
ధర్మశ్చ హ్రాసమభ్యేతి తదా దేవో జనార్దనః
అవతారం కరోత్యత్ర ద్విధా కృత్వాత్మన స్తనుమ్
సాధూనాం రక్షణార్థాయ ధర్మసంస్థాపనాయచ
దుష్టానాం నిగ్రహార్థాయ అన్యేషాం చ సురద్విషామ్
ప్రజానాం రక్షణార్థాయ జాయతేసౌ యుగేయుగే
పురా కిల మహీ విప్రాః! భూరిభారావపీడితా
జగామ ధరణీ మేరౌ సమాజే త్రిదివౌకసామ్
సబ్రహ్మకా న్సురా న్సర్వాన్ ప్రణిపత్యాథమేదినీ
కథయామాస తత్సర్వం ఖేదా త్కరుణభాషిణీ
వ్యాసులు:
భూభారము హరింప నీ భారత వర్షమందు హరి యవతరించిన వృత్తాంతము దెలిపెద. ఓ మునివరులార వినుండు. ధర్మహ్రాసము అధర్మాభి వృద్ది యయిన తఱి జనార్దనుడు తన మూర్తిని రెండు విధము లొనర్చికొని సాధు రక్షణకు ధర్మ స్థాపనకును దుష్టుల దేవ ద్వేషుల నిగ్రహమున కును యుగయుగ మందు నుదయించును. మున్నీ భూమి బహుభార పీడితమై మేరువు నందున్న దేవ సమాజమున కేగి బ్రహ్మాది దేవతలకు మ్రొక్కి తన కష్టము నిట్లు మొఱవెట్టు కొనెను.
ధరణి:
అగ్నిః సువర్ణస్యగురు ర్గవాం సూర్యోపరో గురుః
మమాప్యఖిలలోకానాం వంద్యో నారాయణో గురుః
తత్సాంప్రత మిమే దైత్యాః కాలనేమిపురోగమాః
మర్త్యలోకం సమాగమ్య బాధన్తేహర్నిశం ప్రజాః
కాలనేమి ర్హతో యోసౌ నిష్ణునాప్రభవిష్ణునా
ఉగ్రసేనసుతః కంసః సంభూతః సమహాసురః
ఆరిష్టో ధేనుకః కేశీ ప్రలంబో నరక స్తథా
సుందోసుర స్తథాత్యుగ్రో బాణశ్చాపిబలే స్సుతః
తథాన్యేచమహావీర్యా నృపాణాం భవనేషు యే
సముత్పన్నా దురాత్మాన స్తాన్నసంఖ్యాతు ముత్సహే
అక్షౌహిణ్యోహి బహులా దివ్యమూర్తి ధృతాః సురాః
మహాబలానాం దృప్తానాం దై త్యేంద్రాణాం మమోపరి
తద్భూరిభారపీడార్తా న శక్నోమ్యమరేశ్వరాః
బిభుర్తుమాత్మాన మహి మితివిజ్ఞాపయామివః
క్రియతాం తన్మహాభాగామమ భారావతారణమ్
యథారసాతలం నాహం గచ్ఛేయమితి విహ్వలా
ఇత్యాకర్ణ్య ధరావాక్య మశేషైస్త్రీదశైస్థితః
భవో భారావతారార్థం బ్రహ్మాప్రాహ చ చోదితః
ధరణి:
అగ్ని బంగారమునకు గురువు. గ్రహములకు సూర్యుడు గురువు. నాకును మఱి యెల్ల లోకములకు వంద్యుడైన గురువు నారాయణుడు. ఇపుడు కాలనేమి మొదలుగా గల యీ దైత్యులు మర్త్య లోకమునకు వచ్చి రేయిం బవళ్ళు ప్రజలను బాధించు చున్నారు. ప్రభువైన విష్ణువుచే కాలనేమి గూల్ప బడెను. ఉగ్రసేనుని కొడుకు కసుండను మహాసురుడు పుట్టి యున్నాడు. అరిష్టుడు ధేనుకుడు కేశి ప్రలంబుడు నరకుడు సుందుడు మహోగ్రు డగు బాణుడు (బలికొడను) మఱి యెందరో రాజుల యిండ్ల బుట్టి నారు. వారిని లెక్కపెట్ట నుత్సహించను. దివ్యమూర్తి ధరులగు దేవతలు మదించి యున్న దైత్య రాజులుం గలిసి యక్షౌహిణు లనేకములు నామీద నున్నవి. ఆ బరువు సైప లేకున్నా నని మీకు విన్నవించు కొనుచున్నాను. నేను బాతాళమునకు గ్రుంగి పోకుండ యీ నా బరువును మీరు దింప వలయును. అని యవని మాట విని సురల ప్రేరణచే బ్రహ్మ భూభార హరణార్థ మయి యిట్లు పలికెను.
బ్రహ్మ:
యదాహ వసుథా సర్వం సత్యమే తద్దివౌకసః
అహం భవో భవన్తశ్చ సర్వం నారాయణాత్మకమ్
విభూతయస్తు యా స్తస్య తాసామేవ పరస్పరమ్
అధిక్యం న్యూనతా బాధ్యబాధకత్వేన వర్తతే
తదాగచ్ఛత గచ్ఛామః క్షీరాబ్ధేస్తట ముత్తమమ్
తత్రారాధ్య హరిం తస్మై సర్వం విజ్ఞాపయామవై
సర్వదైవ జగత్యర్థే స సర్వాత్మా జగన్మయః
స్వల్పాం శేనావతీర్యోర్వ్యాం ధర్మస్య కురుతే స్థితిమ్
ఇత్యుక్త్వా ప్రయయౌ తత్ర సహ దేవైః పితామహః
సమాహిత మనా భూత్వా తుష్టావ గరుఢధ్వజమ్
బ్రహ్మ:
ఓ వేల్పులార! భూదేవి యిపుడన్నది యెల్ల నిజము. నేను భవుడు (శివుడు) మీరు మఱి యంతయు నారాయణ స్వరూపము. ఇవన్నియు హరి యొక్క విభూతులే. ఆ విభూతుల హెచ్చు దగ్గుల ననుసరించియే యొకరి నొకరు బాధింప బడువారు ఒకరు బాధించు వారుగ దోచు చుందురు. అందుచే మన మందరము పాలకడలి యొడ్డునకు వెళ్ళుదము. అచట హరిని యారాధించి యాయనకు విన్నవింతము. ఆ దేవుడు జగన్మయుడు భూమి యుపకారమునకై సత్వ గుణాంశమున నవనిపై నవతరించి ధర్మస్థితిని గావించును. అని నలువ సురలతో నేగి మనసు నిలిపి గరుడ ధ్వజునిట్లు స్తుతించెను.
బ్రహ్మ:
నమోనమస్తేస్తు సహస్రమూర్తే సహస్రబాహో! బహువక్త్రపాద
నమోనమస్తే జగతః ప్రవృత్తి వినాశ సంస్థానపరాప్రమేయ
సూక్ష్మాతి సూక్ష్మం చ బృహత్ప్రమాణం గరీయసామప్యతి గౌరవాత్యన్
ప్రధాన బుద్ధీంద్రియ వాక్ప్రధానమూలా పరాత్మన్భగవన్ప్రసీద
ఏషా మహీ దేవ! మహీప్రసూతై ర్మహాసురైః పీడితశైలబంధా
పరాయణం త్వాం జగతాముపైతి భారావతారార్థమపారపారమ్
ఏతే వయం వృత్రరిపు స్తథాయం నాసత్యదస్రౌ వరుణ స్తథైషః
ఇమేచ రుద్రా వసవః ససూర్యాః సమీరణాగ్ని ప్రముఖాస్తథాన్యే
సురాః సమస్తాః సురనాథ కార్యమేభిర్మయా యచ్చ తదీశ సర్వమ్
ఆజ్ఞాపయా జ్ఞాం ప్రతిపాలయంత స్తవైవ తిష్టామ సదా స్తదోషాః
సహస్ర మూర్తీ! సహస్ర పాద సహస్ర ముఖ సృష్టి స్థితి లయ కారణ అప్రమేయ నీకు నమస్కారము. సూక్ష్మాతి సూక్ష్మము. బృహ త్ప్రమాణము గొప్పవాని కెల్ల గొప్పది ప్రధానము బుద్ధి యింద్రియ ములు వాగ్రూప మయిన వేదములకు మూలము పరమునైన యో భగవంతుడా! ప్రసన్నుడ వగుము. ఈ భూమి భూమిం బుట్టిన మహా సురులచే బీడ నొందిన పర్వత బంధములు గలదై జగత్పరాయణ మైన నిన్ను భారము దింప గోరి యరు దెంచెను. ఈ మేము ఇంద్రుడు అశ్వినీ దేవులు. వరుణుడు ఇరుగో రుద్రులు వసువులు సూర్యులు వాయువు అగ్ని మొదలగు నెల్లర మరు దెంచితిమి. మా యొనరింప వలసిన పని యానతిమ్ము. నీ చెప్పినది విధేయులమై యొన రింతుము. దోషములు వాసి నీ హద్దున నిలుతుము.
వ్యాసులు:
ఏవం సంస్తూయమానస్తు భగవాన్పరమేశ్వరః
ఉజ్జహారాత్మనః కేశౌ సితకృష్ణౌ ద్విజోత్తమాః
ఉవాచ చ సురానేతౌ మత్కేశౌ వసుధాతలే
అవతీర్య భువో భారక్లేశహానిం కరిష్యతః
సురాశ్చ సకలాః స్వాంశై రవతీర్య మహీతలే
కుర్వంతు యుద్ధమున్మత్తైః పూర్వోత్పన్నై ర్మహాసురైః
తతఃక్షయ మశేషాసై దైతేయా ధరిణీ తలే
ప్రయాస్యంతి వ సందేహో నానాయుధ విచూర్ణితాః
వసుదేవస్యయా పత్నీ దేవకీ దేవతోపమా
తస్య గర్భోష్టమోయం తు మత్కేశో భవితాసురాః
అవతీర్య చ తత్రాయం కంసం ఘాతాయితా భువి
కాలనేమి సముద్భూత మిత్యుక్త్వాస్తర్దధే హరిః
వ్యాసులు:
భగవంతుడిట్లు స్తుతింప బడి పరమేశ్వరుడు గావున వారి ననుగ్రహింప తన రెండు శిరోజములను తెలుపు నలుపు వానిని నూడ బెరికి వారికి జూపి యీ కేశములు వసుధ యంద వతరించి భూభార క్లేశమును హరింప గలవు. సుర లెల్లరుం దమదమ యంశములచే నవనీ తలమంద వతరించి మదోన్మత్తులయి పుట్టి యున్న మహా రాక్షసులతో యుద్ధము నొనరింతురు గాక! అందుచే నానాయుధ హతులై యశేష దైత్య కూటము నశించును. సందియము లేదు. వసుదేవుని ధర్మపత్ని దేవతా సమానురాలు దేవకి. ఆమె యెనిమిదవ గర్భముగ నీ నాకేశమవ తరించును. కంసాదులను సంహరించును అని హరి యంతర్థాన మందెను.
అదృశ్యాయ తతస్తేపి ప్రణిపత్య మహాత్మనే
మేరు పృష్ఠం సురాజగ్ము రవతేరుశ్చ భూతలే
కంసాయ చాష్టమో గర్భో దేవక్యా ధరణీతలే
భవిష్యతీ త్యాచచక్షే భగవాన్నారదోమునిః
కంసోపి తదుపశ్రుత్య నారదా త్కుపిత స్తతః
దేవకీం వసుదేవంచ గృహేగుప్తావధారయత్
జాతం జాతంచ కంసాయ తేనైవోక్తం యథాపురా
తథైవ వసుదేవోపి పుత్రమర్పితవాన్ద్విజాః
హిరణ్యేకశిపోః పుత్రాః షడ్గర్భా ఇతి విశ్రుతాః
విష్ణుప్రయుక్తా తాన్నిద్రా క్రమాద్గర్భే న్యయోజయత్
యోగనిద్రా మహామయా వైష్ణవీ మోహితం యయా
అవిద్యయా జగత్సర్వం తామాహ భగవాన్హరిః
అదృశ్యుడయిన య మ్మహాత్మునికి నమస్కరించి యా దేవతలును మేరుగిరి నెత్తమున కేగి యట నుండి యవనికిం దిగిరి. నారద భగవానుడు కంసుని కడకేగి దేవకి యెనిమిదవ గర్భము (శిశువు) అవతరించు నని తెల్పెను. కంసుడు విని కోపగించి దేవకీ వసుదేవులను కారాగారమున నుంచెను. తాను మున్నిచ్చిన మాట ననుసరించి వసుదేవుడు పుట్టిన వానిం బుట్టినట్లు బిడ్డలంగొని పోయి కంసుని కప్పగించెను.అట్లు జనించిన కొడుకు లార్వురు. తొలి జన్మమున హిరణ్య కశిపుని పుత్రులట. విష్ణు ప్రేరణము నొంది నిద్రాదేవి (యోగనిద్ర) గర్భము నందు వారి నావేశించెను. ఆమె వైష్ణవి యైన మాయ అవిద్యా రూపమైన యా మాయ చేతనే జగమెల్ల మోహిత మగు చుండును. ఆమెంగని హరి యిట్లనియె.
విష్ణుదేవుడు:
గచ్ఛనిద్రే మమాదేశాత్పాతాళతల సంశ్రయాన్
ఏకైకత్వేన షడ్గర్భాన్దేవకీ జఠరే నయ
హతేషుతేషు కంసేన శేషాఖ్యోంశస్తతోనఘః
అంశాంశేనోదరే తస్మాః సప్తమః సంభవిష్యతి
గోకులే వసుదేనన్య భార్యా వై రోహిణీ స్థితా
తస్యాః ప్రసూతి సమయే గర్భోనేయ స్త్వయోదరమ్
సప్తమో భోజరాజస్య భయా ద్రోధోపరోధతః
దేవక్యాః పతితో గర్భ ఇతిలోకో వదిష్యతి
గర్భ సంకర్షణాత్సోథ లోకే సంకర్షణేతి వై
సంజ్ఞామవాప్స్యతే వీరః శ్వేతాద్రి శిఖరోపమః
తతోహం సంభవిష్యామి దేవకీ జఠరే శుభే
గర్భే త్వయా యశోదాయా గంతవ్యమవిలంబితమ్
ప్రావృట్కాలే చ నభసి కృష్ణాష్టమ్యామహం నిశి
ఉత్పత్స్యామి నవమ్యాం చ ప్రసూతిం త్వమవాప్స్యసి
యశోదాశయనే మాం తు దేవక్యాస్త్వామనిందితే
మచ్ఛక్తిప్రేరితమతి ర్వసుదేవో నయిష్యతి
కంసశ్చ త్వాముపాదాయ దేవి శైలశిలాతలే
ప్రక్షిపత్యంతరిక్షే చ త్వం స్థౌనం సమవాప్స్యసి
తతస్త్వాం శతథా శక్రః ప్రణమ్య మమగౌరవాత్
ప్రణిపాతానతశిరా భగినీత్వే గ్రహీష్యతి
తతః శుంభనిశుంభాదీన్హ త్వా దైత్యాన్సహస్రశః
స్థానైరనేకైః పృథివీమశేషాం మండయిష్యసి
త్వంభూతిః సన్నతిః కీర్తిః కాంతిర్వై పృథావీధృతిః
లజ్జా పుష్టి రుషా యాచ కాచిదన్యా త్వమేవ సా
యే త్వామార్యేతి దుర్గేతి వేదగర్భేంబికేతిచ
భద్రేతి భద్రకాళీతి క్షేమ్యా క్షేమంకరీతి చ
ప్రాతశ్చై వాపరాహ్ణే చ స్తోష్యం త్యానమ్రమూర్తయః
తేషాం హివాంఛితం సర్వం మత్ర్పసాదాద్భవిష్యతి
సురామాంసోపహారైస్తు భక్ష్యభోజ్యైచ్ఛపూజితా
నృణామశేషకామాంస్త్వం వ్రసన్నాయాన్ ప్రదాన్యసి
తే సర్వే సర్వదా భద్రా మత్ర్పసాదాదసంశయమ్
అసందిగ్ధం భవిష్యంతి గచ్ఛదేవి యథోదితమ్
విష్ణుదేవుడు:
ఓ నిద్రా! నా యాజ్ఞచే నీవేగి పాతాళ మందున్న వారి నొక్కక్కని గొని దేవకీ జఠరముం జేర్పుము. కంసునిచే వారు చంప బడగా శేషుని యంశమున బుణ్యమూర్తి యా దేవకి యేడవ గర్భ మగును. గోకులము నందు వసుదేవుని భార్య రోహిణి గలదు. అమె ప్రసవ సమయ మందు ఈ సప్తమ గర్భముం గొని యేగి యామె యుదర మందునుపుము. భోజరాజగు కంసుని వలని జడుపుచే బంధన ముచే దేవకి గర్భము భంగమైన దని జనశ్రుతి పుట్టును. గర్భ సంకర్షణముచే నా శిశువు “సంకర్షణుడు” అని పేరొందును. అవ్వల నేనా దేవకి శుభస్థాన మైన గర్భమం దుందును. నీవప్పుడు యశోద యుదరము నందు విలంబము లేకుండ నుండ దగును. వర్షర్తువున శ్రావణ బహుళాష్టమి నాడర్థ రాత్రి నేను బుట్టెదను. నా శక్తి ప్రేరణ మందిన బుద్ధితో వసుదేవుడు దేవకి ప్రక్కలో నున్న నిన్ను యశోద ప్రక్కలోనికిం జేర్చును. కంసుడు నిన్ను బట్టి ఒక కొండబండ పైకి విసరి కొట్టును. నీ వంతరిక్షమున కెగిరి నిలుతువు. అంతట నిన్నింద్రుడు నామీది గౌరవముచే పలుమారులు నమస్కరించి తలవంచి తన చెల్లెలుగా గారవించును. అటుపై నీవు శుంభ నిశుంభాది దైత్యులను వేల కొలది సంహరించి పృథివి యందు వేఱు వేఱు స్థానము లందు వేఱువేఱు రూపములచే నలంకరింతువు. నీవే భూతివి సన్నతివి కీర్తివి కాంతివి పృథివివి ధృతివి లజ్జ పుష్ఠి రుపా (రోషము) మఱి యేమేమి శక్తులు గల వన్నియు నీవే. ఆర్య దుర్గ వేద గర్భ అంబిక భద్ర భద్రకాళీ క్షేమ్య క్షేమంకరి యని ప్రాతః కాలమునం దపరాహ్ణమున జనులు వినతులై నిన్ను బెక్కురీతుల స్తుతింతురు. వారి వాంఛిత మెల్ల నా ప్రసాదమున సమకూరును కల్లు మాంసము భక్ష్య భోజ్యములు నివేదించి పూజించిన మానవుల యెల్ల కోరికల నెవ్వరికి నీవు ప్రసన్నవై యను గ్రహింతువో వారందఱు నన్నివేళల నా యనుగ్రహమున భద్రమూర్తు లగుదురు. సందేహము లేదు. దేవి! నే నుడివినట్లు చనుము.
Summary of chapter 74 of the Brahma Mahā Purana is as follows:
Having heard Devī's prophecy that the one destined to kill him has escaped, Kaṃsa summons his demon allies and orders the massacre of all infants. He dispatches various demons to Gokula and surrounding areas to destroy the divine child. The chapter describes Kaṃsa's fear expressed as violent despotism, and the divine child Kṛṣṇa's existence in Gokula under the loving protection of Nanda and Yaśodā.