బ్రహ్మ మహా పురాణము
34 - రుద్రాఖ్యానమ్
బ్రహ్మ:
యోసౌ సర్వగతో దేవ స్త్రిపురారి స్త్రిలోచనః ఉమాప్రియకరో రుద్ర శ్చంద్రార్ధకృతశేఖరః
విద్రావ్య విబుధా న్సర్వాన్ సిద్ధవిద్యాధరా నృషీన్ గంధర్వయక్షనాగాంశ్చ తథాన్యాంశ్చ సమాగతాన్
జఘాన పూర్వం దక్షస్య యజతో ధరణీతలే యజ్ఞం సమృద్ధం రత్నాఢ్యం సర్వసంభారసంభృతమ్
యస్య ప్రతాపసంత్రస్తాః శక్రాద్యా స్త్రిదివౌకసః శాంతిం న లేభిరే విప్రాః కైలాసం శరణం గతాః
స ఆస్తే యత్ర వరద శ్శూలపాణి ర్వృషధ్వజః పినాకపాణి ర్భగవాన్ దక్షయజ్ఞవినాశనః
మహాదేవో కలే దేశే కృత్తివాసా వృషధ్వజః ఏకామ్రకే మునిశ్రేష్ఠాః సర్వకామప్రదో హరః
బ్రహ్మ:
సర్వాంతర్యామి యైన రుద్రుడు ఉమా దేవికి ప్రియము చేయువాడై సర్వ దేవతలను సిద్ధ విద్యాధరులను ఋషులను గంధర్వ నాగ యక్షాదులను మఱి యజ్ఞమునకు వచ్చిన యందఱిని పారద్రోలి సర్వ శ్రేష్ఠ పదార్థములతో నిండిన యజ్ఞమును సర్వ సంభారములతో నశింప జేసెను. స్వామి ప్రతాపమున కడలి యింద్రాదులు శాంతి కరవై కైలాసమున కేగి వరదుడైన యా శూలపాణిని దక్ష యజ్ఞ ధ్వంసకుడైన భగవంతుని శరణందిరి. అప్పుడు పరమశివు డేకామ్రక (కాంచీ) క్షేత్ర మందు సర్వకామ ప్రదుడై యుండెను.
మునులు:
కిమర్థం స భవో దేవః సర్వభూతహితే రతః జఘాన యజ్ఞం దక్షస్య దేవై స్సర్వై రలంకృతమ్
న హ్యల్పం కారణం తత్ర ప్రభో మన్యామహే వయం శ్రోతు మిచ్ఛామహే బ్రూహి పరం కౌతూహలం హియ నః
మునులు:
సర్వ భూత హితాభిలాషి యైన శివు డేల యా యజ్ఞమును సంహరించెను. సర్వ దేవతలు నందలంకరించి యున్నారు గదా స్వల్ప కారణమున నట్లు జరిగినదని మే మనుకొనము. మీ వలన విన మిక్కిలి గుతూహల మగు చున్నది.
బ్రహ్మ:
దక్షస్యా స న్నష్ట కన్యా యాశ్చైవం పతిసంగతాః స్వేభ్యో గృహేభ్య శ్చానీయ తాః పితా భ్యర్చయ ద్గృహే
తతస్త్వభ్యర్చితా విప్రాః! న్యవసం స్తాః పితుర్‌గృహే తాసాం జ్యేష్ఠా సతీనామ పత్నీ యా త్ర్యంబకస్యవై
నా జుహావా త్మజాం తాం వై దక్షో రుద్ర మభిద్విషన్ అకరో త్సన్నతిం దక్షే నచ కాంచి న్మహేశ్వరః
జామాతా శ్వశురే తస్మిన్ స్వభావా త్తేజసి స్థితః తతో జ్ఞాత్వా సతీ సర్వాస్తాస్తు ప్రాప్తాః పితుర్గృహమ్
జగామ సా ప్యనాహూతా సతీతు స్వపితుర్ గృహం తాభ్యో హీనాం పితా చక్రే సత్యాఃపూజా మసంమతామ్
తతో బ్రవీ త్సా పితరం దేవీ క్రోధసమాకులా
బ్రహ్మ:
దక్షుని కెనమండుగురు కూతుండ్రు. వారందరు వివాహితులు. వారిని తండ్రి రావించి తన యింట సత్కరించెను. వారును బుట్టింట నాదరమంది వసించిరి. వారిలో బెద్దది యగు సతి యను శివుని భార్యను దక్షుడు రుద్రుని ద్వేషించి పిలువ డయ్యెను. అందుల కల్లుడు పరమేశ్వరుడు నైజముగ దన ప్రభావమున దానున్న వాడు గావున నా మామగారి యెడ నేకొంచెము వినయము చూప డయ్యెను. సతీ దేవి తండ్రి గృహమునకు జెల్లెండ్రందరు వచ్చిరని యెఱింగి తానును బిలువ కున్నను నట కేగెను. తండ్రి అందరు కూతురుల కంటె నామెను హీనముగ జూచి వారి కంటె తక్కువగ నాదరించెను. అంతట సతీ దేవి కినుక గొని తండ్రితో నిట్లనియె.
సతీ దేవి:
యవీయసీభ్య శ్శ్రేష్ఠా హం కిం న పూజయసి ప్రభో అసత్కృతా మవస్థాం యః కృతవా నసి గర్హితామ్
అహం జ్యేష్ఠా వరిష్ఠాచ మాం త్వం సత్కర్తు మర్హసి
సతీ దేవి:
నా కన్న నీ కన్యలు చిన్నలు. నేను పెద్ద ఆడ పడుచును. నన్ను బూజింప వైతివి. అంతే కాదు అలుసు సేసితివి. నేనిందఱిలో పెద్దను యోగ్యత లోను బెద్దను. నన్ను సత్కరింప దగిన వాడవు.
ఏవ ముక్తో బ్రవీ దేనాం దక్ష స్పంరక్తలోచసః
అని సతీ దేవి యన విని దక్షుడు కన్నెఱ్ఱ చేసి యిట్లనియె.
త్వత్తః శ్రేష్ఠా వరిష్ఠాశ్చ పూజ్యా బాలాః సుతా మమ తాసాం యే చైవ భర్తారః తే మే బహుమతా స్సతి
బ్రహ్మిష్ఠాశ్చ వ్రతస్థాశ్చ మహాయోగాః సుధార్మికాః గుణౖ శ్చైవాధికాః శ్లాఘ్యాః సర్వే తే త్య్రంబకా త్సతి
వశిష్ఠో త్రిః పులస్త్యశ్చ అంగిరాః పులహః క్రతుః భృగు ర్మరీచిశ్చ తథా శ్రేష్ఠా జామాతరో మమ
తైశ్చాపి స్పర్ధతే శర్వః సర్వే తే చైవ తం ప్రతి తేన త్వాం న బుభూషామి ప్రతికూలో హి మే భవః
ఇత్యుక్తవాం స్తదా దక్షః సంప్రమూఢేన చేతసా శాపార్థ మాత్మన శ్చైవ యేనోక్తా వై మహరక్షయః
తథోక్తా పితరం సావై క్రుద్ధా దేవీ త మబ్రవీత్
ఆ నా కన్నియలు నీ కన్న నన్నివిధములు మిన్నలు. యోగ్యలు. వారి భర్తలు గూడ నాకెంతేని గూర్తురు. బ్రహ్మిష్ఠులు వ్రతనిష్ఠులు ధర్మిష్ఠులు. యోగ నిష్ఠులు గుణ గరిష్ఠులు నిటలాక్షుని కంటె పలు విధముల నందఱు మెచ్చ దగిన వారు. వారు వశిష్ఠుడు అత్రి పులస్త్యుడు అంగిరుడు పులహుడు క్రతువు భృగువు మరీచి అనువారు. పశుపతి వారితో గూడ స్పర్థ గొనును. వారును నాతనిని ద్వేషింతురు. అందు వలన నిన్ను నేను గౌరవింపను. నాకు శివుడు ప్రతికూలుడని మూఢ బుద్ధియైన దక్షు డామెతో ననెను. శాపమునకు దాను గురి కావలసిన విధి ననుసరించి యిట్లు ఋషులను నల్లుని దూలనాడెను. అంత నా దేవి కోపము దెచ్చికొని తండ్రితో నిట్లనియె.
సతీ దేవి:
వాఙ్మనఃకర్మభి ర్యస్మా దదుష్టాం మాం విగర్హసి తస్మాత్త్యజా మ్యహం దేహ మిమం తాత తవా త్మజం
సతి దేవి:
త్రికరణముల చేత పరిశుద్ధురాల నైన నన్ను గర్హించితివి. కావున నీ వలన వచ్చిన యీ దేహము నిదిగో విడుచు చున్నాననెను.
బ్రహ్మ:
తత స్తేనావమానేన సతీ దుఃఖా దమర్షితా ఆబ్రవీ ద్వచనం దేవీ సమస్కృత్య స్వయంభువమ్
బ్రహ్మ:
అని ఆ యవమానము సైవనేరక దుఃఖముతో నా దేవి దక్షున కిట్లనియె
యేనా హ మపదేహా వై పున ర్దేహేన భాస్వతా తత్రా ప్యహ మసంమూఢా సంభూతా ధార్మికీ పునః
గచ్ఛేయం ధర్మపత్నీత్వం త్ర్యంబకస్తైవ ధీమతః
ఈ మేను విడిచి మఱియొక్క ఉపాధితో వెలుగొందుచు నేను పొరపాటు పడని దాననై ధర్మ నిష్ఠనై పరమేశ్వరునికి ధర్మ పత్ని నయ్యెదను గాక.
బ్రహ్మ:
తత్రై వాథ సమాసీనా రుష్టా త్మానం సమాదధే ధారయామాస చాగ్నేయీం ధారణా మాత్మనా త్మని
బ్రహ్మ:
అని యక్కడనే కూర్చుండి, దుష్టుడగు దక్షుని సాధించుటకు తాన తన యందగ్ని ధారణ చేసెను.
తతః స్వాత్మాన ముత్థాప్య వాయునా సముదీరితః సర్వాంగేభ్యో వినిఃసృత్య వహ్ని ర్భస్మ చకార తామ్
త దుపశ్రుత్య విధనం సత్యా దేవ్యాః స శూలధృక్ సంవాదంచ తయో ర్బుద్థ్వా యాథాతథ్యేన శంకరః
దక్షస్య చ వినాశాయ చుకోప భగవాన్ ప్రభుః
ఆ అగ్ని వాయు ప్రేరితుడై యామె అన్ని యవయము లందుండి వెలువడి యామెను భస్మ మొనరించెను. శూలపాణి యామె నిర్యాణ వార్త విని తండ్రి కూతుండ్ర యా సంవాదము నున్న దున్నట్లు దెలిసి కొని భగవంతుడా శంకరుడు దక్ష వినాశమునకై కుపితు డయ్యెను.
శ్రీశంకరుడు:
యస్మా దవమతా దక్ష సహసైవా గతా సతీ ప్రశస్తా శ్చేతరా స్సర్వాః త్వత్సుతా భర్తృభిస్సహ
తస్మా ద్వైవస్వతే ప్రాప్తే పున రేతే మహర్షయః
ఉత్పత్స్యంతి ద్వితీయే వై తవ యజ్ఞే హ్యయోనిజాః
హుతే వై బ్రహ్మణ స్సత్రే చాక్షుష స్యాంతరే మనోః అభివ్యాహృత్య సప్తర్షీన్ దక్షం సో భ్యశప త్పునః
భవితా మానుషో రాజా చాక్షుష స్యాంతరే మనోః ప్రాచీనబర్హిషః పౌత్రః పుత్ర శ్చాపి ప్రచేతసః
దక్ష ఇత్యేవనామ్నా త్వం మారిషాయాం జనిష్యసి కన్యాయాం శాఖినాం చైవ ప్రాప్తే వై చాక్షుషాంతరే
అహం తత్రాపి తే విఘ్న మాచరిష్యామి తుర్మతే ధర్మకామార్థయుక్తేషు కర్మ స్విహ పునఃపునః
తతో వై వ్యాహృతో దక్షో రుద్రం సో భ్యశప త్పునః
అట్లు కోపించి శంకరు డిట్లనియె. ఓ దక్షా! పిలువని పేరంటముగ వచ్చి సతీ దేవి నీచే నవమానితు రాలైనది కావున నీ తక్కిన కూతుళ్లు మగలతో నుత్తమరాండ్రు గావున వైవస్వత ద్వితీయ మన్వంతరమున నీ మహర్షులు అయోనిజులై నీ యజ్ఞమునకు వత్తురు. చాక్షుష మన్వంతరమున బ్రహ్మ గావించు సత్రయాగ మందు హోమము జరుగగా నిట్లు జరుగును. అని సప్తర్షులను శపించి రుద్రుడు దక్షునికిట్లు శాప మిచ్చెను. చాక్షుష మన్వంతరమున ప్రాచీన బర్హిపౌత్రుడు ప్రచేతసుని పుత్రుడు వైదక్షుడను నీ పేరుతోనే మారిష యందు నీవు జనింతువు ఆమారిష వృక్షములకు కన్యయై జనించును. నే నక్కడ గూడ దుర్బుద్ధివగు నీకు ధర్మ కామార్థ యుక్తము లయిన నీ కర్మాచరణము లందు మఱి మఱి విఘ్నములు గావింతును ఇట్లు శప్తుడై యా దక్షుడును రుద్రున కెట్లు ప్రతిశాప మిచ్చెను.
యస్మా త్త్వం మత్కృతే క్రూర ఋషీన్ వ్యాహృతవానసి తస్మా త్సార్ధం సురై ర్యజ్ఞే న త్వాం యక్ష్యంతి వైద్విజాః
కృత్వాహుతిం తవ క్రూర అపః స్పృశతి కర్మసు ఇహైవ వత్స్యసే లోకే దివం హిత్వా యుగక్షయాత్
తతో దేవై స్తుతే సార్ధం న తు పూజా భవిష్యతి
ఓ క్రూరుడా! నా కొఱకు ఈ మహర్షులను గూడ తూల నాడితివి. కావున యజ్ఞము లందు దేవతలతో బాటు నిన్నెవ్వరును యజింపరు. ఒక వేళ నీకాహుతి యిచ్చినను, (రుద్రుని కిచ్చిన యాహుతి యనంతరము) పవిత్రులగుట కుదక స్పర్శ గావింతురు. యుగాంతము వరకీ లోకముననే నీవుందువు. దేవతలతో బాటు పూజ నీ కుండదనెను.
రుద్రుడు:
చాతుర్వర్ణ్యం తు దేవానాం తే చాప్యేకత్ర భుంజతే నభోక్ష్యే సహిత సైస్తు తతో భోక్ష్యా మ్యహం పృథక్
సర్వేషాం చైవ లోకానా మాది ర్భూ ర్లోక ఉచ్యతే త మహం ధారయా మ్యేకః స్వేచ్ఛయా న తవాజ్ఞయా
తస్మిన్ ధృతే సర్వలోకా నూనం తిష్ఠంతి శాశ్వతాః తస్మా దహం వసామీహ సతతం న తవాజ్ఞయా
రుద్రుడు:
దేవతలు తమలో గల చతుర్వర్ణముల వారితో గలిసి భుజింతురు. వారితో గలిసి నేను భుజింపను. వేరే భుంజితును. అన్ని లోకములకు మొదటిది భూలోక మందురు. ఆ లోకమును నా యంతట నేనొక్కడనే ధరింతును. నీ యాజ్ఞతో గాదు. (నీ యాన అక్కర లేదు) ఈ కర్మ భూమిని ధరించి నంతట నెల్ల లోకములు శాశ్వతముగ సుస్థిరములై నిలువ గలవు. అందుచే నే నీ భూలోక మందే యుందును. అదియు నీ యాజ్ఞ చేత గాదు. అని రుద్రుడనెను.
బ్రహ్మ:
తతోభివ్యాహృతో దక్షో రుద్రే ణామితతేజసా స్వాయంభవీం తనుం త్యక్త్వా ఉత్పన్నో మానుషే ష్విహ
యదా గృహపతి ర్దక్షో యజ్ఞానా మీశ్వరః ప్రభుః నమస్తే నేహ యజ్ఞేన సోయజు ద్దైవతైః సహ
బ్రహ్మ:
అమిత తేజో మూర్తి యగు రుద్రునిచే నిట్లు దక్షుడు నొవ్వనాడ బడి స్వాయంభువ మూర్తిని విడిచి (ప్రజాపతత్వము గోల్పోయి) మనుజులం దిక్కడ మానవ లోకమున జనించి దక్షుడను పేరుతోనే గృహస్థుడై యజ్ఞము లందు యజమానుడై దేవతలతో గూడ నెల్ల యజ్ఞముల నాచరించెను.
ఆథ దేవీ సతీ జజ్ఞే ప్రాప్తే వైవస్వతేంతరే మేనాయాం తా ముమాం దేవీం జనయామాస శైలరాట్
సా తు దేవీ సతీ పూర్వ మాసీ త్పశ్చా దుమా భవత్ సహవ్రతా భవస్యైషా నైతయా ముచ్యతే భవః
యావదిచ్ఛతి సంస్థానం ప్రభు ర్మన్వంతరే ష్విహ మారీచం కశ్యపం దేవీ యథాదితి రనువ్తరా
సార్ధం నారాయణం శ్రీస్తు మఘవంతం శచీ యథా విష్ణుం కీర్తి రుషా సూర్యం వశిష్ఠం చా ప్యరుంధతీ
నైతాం స్తు విజహ త్యేతా భర్తౄన్ దేవ్యః కథంచన ఏవం ప్రాచేతసో దక్షో జజ్ఞే వై చాక్షుషాంతరే
ప్రాచీనబర్హిషః పౌత్రః పుత్ర శ్చాపి ప్రచేతసాం దశభ్య స్తుప్రచేతోభ్యో మారిషాయీం పున ర్నృప
జజ్ఞే రుద్రాభిశాపేన ద్వితీయ మితి న శ్శ్రుతం భృగ్వాదయ స్తు తే సర్వే జిజ్ఞిరే వై మహర్షయః
ఆద్యే త్రేతాయుగే పూర్వం మనో ర్వైవస్వతస్య హ దేవస్య మహతో యజ్ఞే వారుణీం బిభ్రత స్తనుమ్
ఇత్యేషో ೭నుశయో హ్యాసీ త్తయో ర్జాత్యంతరం గతః ప్రజాపతేశ్చ దక్షస్య త్య్రంబకస్య చ ధీమతః
తస్మా న్నానుశయః కార్యో వరే ష్విహ కదాచన జాత్యంతరగతస్యాపి భావితస్య శుభాశుభైః
జింతో ర్న భూతయే ఖ్యాతి స్తన్నకార్యం విజానతా
ఆ మీదట సతీ దేవి వైవస్వత మన్వంతరము రాగానే హిమవంతునికి మేనక యందు “ఉమా” నామ్నియై అవతరించెను. ముందు సతియను పేరంది యా మీద “ఉమ” అను నామమందెను. శంభుని కీమె సహధర్మ చారిణి. ఆయన యీమె నెన్నడును విడిచి యుండడు. మరీచి కుమారుడైన కశ్యపుని అదితి నారాయణుని శ్రీదేవి, ఇంద్రుని శచీదేవి, విష్ణుని కీర్తి, సూర్యుని ఉష, వశిష్ఠు నరుంధతియు నట్లు శంకరు నీమె యెన్నడును విడువదు. పరమేశ్వరున కీమె నిత్యానపాయిని. మున్నిట్లా దక్షుడును చాక్షుష మన్వంతర మందు బ్రహ్మ గావించిన యజ్ఞము నందు ప్రాచీన బర్హికి పౌత్రుడుగను బ్రచేతసులకు పుత్రుడు గనునై మారిష యందు జనించెను. ఇది మునుపు త్రేతా యుగమున వైవస్వత మనువు కాలమున బ్రహ్మ వరుణ దేవతాకమైన మూర్తి ధరించి గావించిన యజ్ఞము నందు దక్షుని జన్మము జరిగినది. అల్లుడు మామలకు కలిగిన యీ విరోధము జన్మాంతరమును పొందినది. కావున నుత్తము లొండొరులు విరోధము పెట్టుకొన గూడదు. శుభా శుభకర్మ ఫలములచే భావితుడై (అనగా ప్రారబ్ధమునకు అధీనుడై) యుండు జీవుడు ఆ కారణముచే జాత్యంతర మందు పుట్టి నపుడు వానికిని పూర్వ జన్మ ఖ్యాతి (యోగ్యత) రాదు. ఆ పుట్టువులో కార్యాకార్య విఛక్షణత యున్నను తొల్లిటి కర్మానుభవ మెంత వారికిని దప్పదన్న మాట.
మునులు:
కథం రోషేణ సా పూర్వం దక్షస్య దుహితా సతీ త్యక్త్వా దేహం పున ర్జాతా గిరిరాజగృహే ప్రభో
దేహాంతరే కథం తస్యాః పూర్వదేహో బభూవ హ భవేన సహ సంయోగ స్సంవాదశ్చ తయోః కథమ్
స్వయంవరః కథం వృత్త స్తస్మిన్ మహతి జన్మని వివాహశ్చ జగన్నాథ సర్వాశ్చర్య సమన్వితః
తత్సర్వం విస్తరా ద్ర్బహ్మన్ వక్తు మర్హసి సాంప్రతమ్ శ్రోతు మిచ్ఛామహే పుణ్యాం కథాం చాతిమనోహరామ్
బ్రహ్మ పలుకులు విని మును లిట్లనిరి. దక్ష కన్య సతీదేవి రోషము గొని మేరు విడిచి పర్వతరాజింట జనించె గదా! అపుడు మఱల నా భవానికి భపునితో సమావేశ మెట్లయినది. వారికా ఘట్టము నందు జరిగిన సంవాదమేమి? ఆ మహా పుణ్య జన్మ మందు స్వయంవర మెట్లయ్యె వారి కల్యాణ మహోత్సవ మచ్చెరువు గొల్పునది గదా! అదెల్ల సవిస్తరముగ నానతీయ దగుదువు. అ పుణ్య కథ మనోహరము మేము విన గుతూహల పడు చున్నామన బ్రహ్మ యిట్లనియె.
బ్రహ్మ:
శృణుధ్వం మునిశార్దూలాః కథాం పాపప్రణాశినీం ఉమాశంకరయోః పుణ్యాం సర్వకామఫలప్రదామ్
కదాచి త్స్వగృహా త్ప్రాప్తం కశ్యపం ద్విపదాంవరం అపృచ్ఛ ద్ధిమవాన్ వృత్తం లోకే ఖ్యాతికరం హితమ్
కే నాక్షయాశ్చ లోకా స్ప్యుః ఖ్యాతిశ్చ పరమా మునే తథైవ చార్చనీయత్వం సత్సు తత్కథయస్వ మే
బ్రహ్మ:
ఓ ముని వర్యులార! పాప హరమగు నా ఉమా శంకర కల్యాణము పవిత్రము. కామ ఫలదము. ఒకప్పుడు తన యింటి కరుదెంచిన కశ్యప మహర్షిని హిమవంతుడు పుణ్య యశఃకరమగు నొక వృత్తాంతము నిట్లడిగెను. మునీ! ఏమి చేసిన నక్షయ పుణ్య లోకములు గల్గును? పరమోత్తమ ఖ్యాతి దేని వలన వచ్చును? సత్పురుషు లెవ్వరెట్లు పూజింప వలసి యుందురది యాన తిమ్మన కశ్యపు డిట్లనియె.
కశ్యపుడు:
అపత్యేన మహాబాహో సర్వ మేత దవాప్యతే మయా ఖ్యాతి రపత్యేన బ్రహ్మణా ఋషిభి స్సహ
కిం న పశ్యసి శైలేంద్ర యన్మాం త్వం పరిపృచ్ఛసి వర్తయిష్యామి యచ్చాపి యథాదృష్టంపురాచల
వారణాసీ మహం గచ్ఛ న్నపశ్యం సంస్థితం దివి విమానం సునవం దివ్య మనౌపమ్యం మహర్ధిమత్
తస్యాధస్తా దార్తనాదం గర్తస్థానే శృణో మ్యహం త మహం తపసా జ్ఞాత్వా తత్రై వాంతర్హితః స్థితః
ఆథాగా త్తత్ర శైలేంద్ర విప్రో నియమవాం చ్ఛుచిః తీర్థాభిషేక పూతాత్మా పరే తపసి సంస్థితః
ఆథ స వ్రజమానస్తు వ్యాఘ్రే ణాభీషితో ద్విజః వివేశ తం తథా దేశం స గర్తో యత్ర భూధర
గర్తాయాం వీరణస్తమ్బే లంబమానా న్మునీంస్తదా అపశ్య దార్తో దుఃఖార్తాం స్తా నపృచ్ఛ చ్చ స ద్విజః
కే యూయం వీరణస్తంబే లంబమానా హ్యథోముఖాః దుఃఖితాః కేన మోక్ష శ్చ యుష్మాకం భవితా నఘాః
కశ్యపుడు:
నీ తెల్పిన భాగ్యమెల్ల సంతానము వలన గలుగును. నేను (చతుర్ముఖ బ్రహ్మ) పరమర్షు లెల్లరు సంతాన లాభముచే ఖ్యాతి గన్నారము. గిరీంద్ర! నీవు చూచుట లేదా! మఱి యడిగెద వేమి? మున్ను నేను గన్న వృత్తాంతమిదె చెప్పెద వినుము. వారణాసి కేగుచు నాకాశ మందున్న యొక నూతన దివ్య విమానము గాంచితిని. దానికి గ్రిందుగ నొక గుంట నుండి యొక యేడుపు ధ్వని విన్నాను. నా తప శ్శక్తిచే దాని నెఱింగి యచట కేగి దాగి నిలిచితిని. అటనొక పవిత్ర మూర్తి తపస్వి తీర్థముల సేవించి యభిషేకము గావించుకొని యా దారి నేగుచు నొక బెబ్బులికి బెదరి యాగుంట దరికి పరువిడి వచ్చెను. అక్కడ నొక అవురు గడ్డికాడను బట్టుకొని వ్రేలాడు మునుల గాంచెను. అట్లుగని యార్తుడై దుఃఖించు చున్న వారల నెవ్వరు మీరు ఈ గడ్డి దుబ్బు నూతగొని మొగములు క్రిందికి వాల్చి వ్రేలాడు చున్నారు. మీ దుఃఖమునకు విముక్తి గలుగ గలదు చెప్పుడు. అన పితరు లిట్లనిరి.
పితరులు:
వయం తే కృతపుణ్యస్య పితర స్సపితామహాః ప్రపితామహాశ్చ క్లిశ్యామ స్తవ దుష్టేన కర్మణా
నరకో యం మహాభాగ గర్తరూనేణ సంస్థితః త్వం చాపి వీరణస్తంబ స్త్వయి లంబామహే వయమ్
యావ త్త్వం జీవసే విప్ర తావదేవ వయం స్థితాః మృతే త్వయి గమిష్యామో నరకం పాపచేతసః
యది త్వం దారసంయోగం కృత్వాపత్యం గుణోత్తరం ఉత్పాదయసి తే నాస్మాన్ముచ్యేమ వయ మేనసః
నా న్యేన తపసా పుత్ర తీర్థానాం చ ఫలేన చ ఏత త్కురు మహాబుద్ధే తారయస్వ పితౄ న్భయాత్
పితరులు:
మేము పుణ్య కర్ముడవగు నీ తండ్రులము, తాతలము, ముత్తాతలమును. నీ పాప కర్మముచే మేమిట్లు క్లేశపడు చున్నాము. ఈ గుంట గుంట గాదు నరకమే. నీవే యీ అవురు గడ్డి దుబ్బు. నిన్నే యూత చేసికొని వ్రేలాడు చున్నాము. నీవు బ్రతికినన్నాళ్ళు మేమిచ్చట నిట్లుందుము. నీవు మరణించి నంతట మేము నరకము పాలగుదుము. నీవు పెండ్లి సేసికొని గుణవంతుని పుత్రుని గంటివేని మే మీ పాపము నుండి ముక్తు లగుదుము. మఱి యే తపస్సు యొక్క తీర్థముల యొక్క ఫలమునను మాకు విముక్తి రాదు. బుద్ధిమంతుడవు గావున నీ పితరులను మమ్మీనరక భయము నుండి తరింప జేయుము. అన గశ్యపు డనియె.
కశ్యపుడు:
స తథేతి ప్రతిజ్ఞాయ ఆరాధ్య వృషభద్వజం పితౄ న్గర్తా త్పముద్ధృత్య గణపాంశ్చచకారహ
స్వయం రుద్రస్య దయితః సువేశోనామ నామతః సమ్మతో బలవాం శ్చైవ రుద్రస్య గణపో భవత్
తస్మా త్కృత్వా తపో ఘోర మపత్యం గుణవ ద్భృశం ఉత్పాదయస్వ శైలేంద్ర సుతాం త్వం వరవర్ణినీమ్
కశ్యపుడు:
అట్ల చేసెదనని యాతడు వృషభ వాహను నారాధించి యాగర్తము నుండి పితరుల నుద్ధరించి శివుని ప్రమథ గణముల నాయకులం గావించెను. తాను సువేశుడను పేర బలశాలియై రుద్రుని గణ నాయకుండయ్యె. కావున నో శైలేంద్ర! తీవ్ర తపస్సు సేసి గుణ శాలియైన సంతానముం గనుము. పరమ సుందరిని గూతురుం గాంచుము.
బ్రహ్మ:
స ఏవ ముక్తో ఋషిణా శైలేంద్రో నియమస్థితః తప శ్చకారాప్యతులం తేన తుష్టి రభూ న్మమ
తదా తముత్పపాతాహం వరదో స్మీతి చా బ్రువం బ్రూహి తుష్టో స్మి శైలేంద్ర తపసానేన సువ్రత
బ్రహ్మ:
ఇట్లా ఋషిచే దెలుప బడి కొండఱేడు నియమమూని అనుపమ మయిన తపస్సు గావించెను. దాన నాకు సంతుష్టి గల్గినది. వెంటనే నేనాతని కడ వ్రాలితిని. నీ తపమ్మునకు మెచ్చితిని. వరమిచ్చెద నడుగు మంటిని.
హిమవంతుడు:
భగవ న్పుత్ర మిచ్ఛామి గుణౖ స్సర్వై రలంకృతం ఏవం వరం ప్రయచ్ఛస్వ యది తుష్టొసి మే ప్రభో
హిమవంతుడు:
సర్వ గుణాలంకారుం గుమారుం గోరెవ నాయెడ సంతుష్టు డైతివేని అనుగ్రహింపుమని శైల రాజనియె.
బ్రహ్మ:
తస్య తద్వచనం శ్రుత్వా గిరిరాజస్య భోద్విజాః తదా తస్మై వరం చాహం దత్తవా న్మన సేప్సితమ్
కన్యా భవిత్రీ శైలేంద్ర తపసా నేన సువ్రత ప్రభావా త్సర్వత్ర కీర్తి మాప్స్యసి శోభనామ్
అర్చిత స్సర్వదేవానాం తీర్థకోటి సమావృతః పావన శ్చైవ పుణ్యేన దేవానా మపి సర్వతః
జ్యేష్టాచ సా భవిత్రీ తే అన్యే చాత్ర తత శ్శుభే
ఆతని మాట విని యాతని మదికనువైన వర మిచ్చితిని. ఓ శైల రాజ! ఈ తపః ప్రభావమున నీ కొక కన్య యుదయించును. దాన నీవు పరమ శోభనమైన కీర్తి నొందెదవు. ఎల్ల వేల్పులు నిన్నర్చింప కోటి తీర్థములకు నెలవై పావనుడవై దేవతల కెల్ల పూజనీయుడ వయ్యెదవు. ఆ కన్నియ నీకు పెద్ద కూతురగును. మరి ఇద్దఱు కన్యలు కలుగుదురు.
సోపి కాలేన శైలేంద్రో మేనాయా ముదపాదయత్ అపర్ణా మేకపర్ణాం చ తథా చై వైకపాటలామ్
న్యగ్రోధ మేకపర్ణంతు పాటలం చైకపాటలాం అశిత్వా త్వేకపర్ణంతు అనికేత స్తపో చరత్
శతం వర్షసహస్రాణాం దుశ్చరం దేవదానవైః ఆహార మేక పర్ణంతు ఏకపర్ణా సమాచరత్
పాటలేన తథైకేన విధధే చైకపాటలా పూర్ణే వర్షసహస్రేతు ఆహారం తాః ప్రచక్రతుః
అపర్ణాతు నిరాహారా తాం మాతా ప్రత్యభాషత నిషేధయంతీ చోమేతి మాతృస్నే హేన దుఃఖితా
సా తథోక్తా తయా మాత్రా దేవీ దుశ్చరచారిణీ తేనైవ నామ్నా లోకేషు విఖ్యాతా సురపూజితా
ఏతత్తు త్రికుమారీకం జగత్ స్థావర జంగమం ఏతాసాం తపసాం వృత్తం యావద్భూమి ర్ధరిష్యతి
తపశ్చరీరా స్తాస్సర్వా స్త్రిస్రో యోగం సమాశ్రితాః సర్వా శ్చైవ మహాభాగా స్తథాచ స్థిర¸°వనాః
తా లోకమాతరశ్చైవ బ్రహ్మచారిణ్య ఏవచ అనుగృహ్ణంతి లోకాంశ్చ తపసా స్వేన సర్వదా
ఉమా తాసాం వరిష్ఠాచ జ్యేష్ఠా చ వరవర్ణినీ మహాయోగబలోపేతా మహాదేవ ముపస్థితా
బ్రహ్మ యన్నట్లు హిమవంతుడు మేన యందు కన్యకం గాంచెను. మేనాదేవి యందు హిమవంతుడు మఱి కొంత కాలమునకు అపర్ణ ఏక పాటల ఏక పర్ణ అను కన్యల వడసెను. ఆకు కూడ తినక అపర్ణయు మఱ్ఱియాకు నొక దానిని తిని యేక పర్ణయు పాటలమను చెట్టు నాకొకటి తిని నీడను నిలువక ఏక పాటలయు తపస్సు చేసిరి. ఇట్లు వారు వే యేండ్లు తపస్సు గావించిరి. అప్పుడు తల్లి మేనమాతృ ప్రేమతో ఉ+మా తపస్సు వద్దు చాలింపు మనియె. అట్లు తనను నిషేధించు చున్నను దీవ్ర తపంబు గావించి నందున అదే పేరుతో అనగా “ఉమా” అను పేరుతో దేవతలకు బూజనీయయై ప్రఖ్యాతి నందెను. చరా చరాత్మక మైన యీ జగత్తు త్రికుమారీకము అనగా నీ ముగ్గురు కుమార్తెలతో (శక్తులతో) నిండినది. వీరి తపో వృత్తాంతమును భూమి యెంత వఱకు ధరించునో అనగా ఈ చరిత్ర భూలోకము నందు వాడబడి నంత కాలము తపోమూర్తులైన యీ ముగ్గుర శక్తులు యోగ భూమిక యందుండి స్థిర యౌవనులై లోక మాతృకలయి బ్రహ్మచారిణులై తమ తపస్సుచే నెల్లప్పుడు లోకముల ననుగ్రహింతురు. వారిలో జ్యేష్ఠురాలు (పెద్దది) శ్రేష్ఠురాలు గూడ. మహా యోగ బలముతో గూడి మహేశ్వరుని బొందినది.
దత్తక శ్చోశనా స్తస్య పుత్ర స్స భృగునందనః ఆసీ త్తస్యైకపర్ణాతు దేవలం సుషువే సుతమ్
యాతు తాసాం కుమారీణాం తృతీయా హ్యేకపాటలా పుత్రం పా త మలర్కస్య జైగీషవ్య ముపస్థితా
తస్యా శ్చ శంఖలిఖితౌ స్మృతౌ పుత్రా వయోనిజౌ ఉమాతు యా మయా తుభ్యం కీర్తితా వరవర్ణినీ
అథ తస్యా స్తపోయోగా త్త్రైలోక్య మఖిలం తదా ప్రధూపిత మథాలక్ష్య వచ స్తా మహ మబ్రవమ్
దేవి కింతపసా లోకాం స్తాపయిష్యసి శోభనే త్వయా సృష్ట మిదం సర్వం మా కృత్వా త ద్వినాశయ
త్వం హి ధారయసే లోకా నిమా న్సర్వాన్ స్వతేజసా బ్రూహి కింతే జగన్మాతః ప్రార్థితం సంప్రతీహ నః
యదర్థం తపసో హ్యస్య చరణం మే పితామహ త్వమేవ త ద్విజానీషే తతః పృచ్ఛసి కిం పునః
భృగు కుమారునికి ఏకపర్ణ భార్యయయ్యె. ఆమె దేవలుడను పుత్రునిం గనియె. ఆ మువ్వురు కుమారికలలో మూడవ యామె ఏకపాటల అలర్కుని కుమారుడగు జైగీషవ్యునిం బెండ్లాడినది. ఆమెకు శంఖ లిఖితులను నిద్దరు పుత్రులు అయోనిజులు గల్గిరి. నేకేను దెల్పిన ఉమాదేవి పరమ సుందరి. ఆమె తపన్తీ వ్రత చేత ముల్లోకములు పొగలు గ్రమ్ముట చూచి నేను (బ్రహ్మ) ఆమెతో దేవీ కళ్యాణివి నీవు తపస్సుచే లోకముల నేల తపింప జేయుదువు. నీ చేత నీ జగత్తు సృష్టింప బడినది. నీవదానిం బట్టించిన దానవు. నీవు దీనిని నశింప జేయ దగదు. నీ తేజముచే నీ లోకముల నన్నిటిని ధరించు చున్నావు. ఓ జగన్నాతా! నీవు కోరునదేమో మా కిపుడిక్కడ తెలు మన దేవి నేనెందుల కీ తపస్సు చేయు చున్నానో నీవే యెఱుంగుదువు. మఱి నన్నేల ప్రశ్నింతు వనెను.
బ్రహ్మ:
తత స్తా మబ్రవం చాహం యదర్థం తప్యసే శుభే స త్వాం స్వయ ముపాగమ్య ఇహైవ వరయిష్యతి
శర్వ ఏవ పతి శ్శ్రేష్ఠ స్సర్వలోకేశ్వరేశ్వరః వయం సదైవ యస్యేమే వశ్యావై కింకరా ళ్ళుభే
స దేవదేవః పరమేశ్వర స్స్వయం స్వయంభు రాయాస్యతి దేవి తేంతికం ఉదారరూపో వికృతాదిరూప స్సమాన రూపోపి నయస్య కస్యచిత్
మహేశ్వరః పర్వతలోకవాసీ చరాచరేశః ప్రథమో ప్రమేయః వినేందునా హీంద్రసమానవర్చసా విభీషణం రూప మివాస్థితో యః
బ్రహ్మ:
అంతట నేనామె కిట్లంటిని. ఎవని కొఱకు నీవీ తపస్సు చేయు చున్నావో యాతడు తానేవచ్చి యిచట నిన్ను వరింప గలడు. నీకు దగిన వాడాశర్వుడు. సర్వ లోకేశ్వరుల కీశ్వరుడు. మే మాయన వశము లోని కింకరులము. ఆ దేవదేవుడు స్వయంభువు. ఆయన ఉదార రూపుడు. విలక్షణ రూపుడును. ఆయనకు సమాన రూపుడు మఱిలేరు. కొండల మీద వసించు వాడతడు. చరాచర సృష్టి కీశ్వరుడాయన. మొట్టమొదటి వాడు. ఊహ కందని వాడు. ఇంద్రుని కీడగు వర్చస్సుతో నిందు బింబము భరింప కుండ ఆదిశేష సమానమైన వర్చస్సుతో భీకరమగు రూపముతో నీ దరికి తాన రాగలడు.
Summary of chapter 34 of the Brahma Mahā Purana is as follows:
The sacred marriage of Śiva and Pārvatī is narrated in full splendor. Himavat gives Pārvatī's hand to Śiva, and the entire assembly of Devas, Gandharvas, Apsaras, Siddhas, and Ṛṣis gathers on the Himālaya for the divine wedding. Brahmā officiates. The sacred union of Śiva and Śakti is celebrated as the supreme event that ensures the continued well-being of all the three worlds.