48 - ప్రతిమా నిర్మాణ విధాన పర్యాలోచనమ్‌

మునులు:

బ్రూహినో దేవదేవేశ యత్పృచ్ఛామః పురాతనమ్‌

యథా తాః ప్రతిమాః పూర్వమిద్రద్యుమ్నేన నిర్మితాః

కేన చైవ వప్రకారేణ తుష్టస్తస్మై స మాధవః

తత్సర్వం వద చాస్మాకం పరం కౌతూహలం హినః

మునులు:

దేవదేవా! ఆ ప్రతిమ లింద్రద్యుమ్నునిచే నెట్లు నిర్మింప బడినవి, ఏ ప్రకారమున మాధవుడు సంతుష్టు డయ్యె నదియెల్ల నానతిమ్ము, విన వలెనన. మా మనసు లువ్విళ్ళూరు చున్నవి.

బ్రహ్మ:

శృణుధ్వం మునిశార్దూలాః పురాణంవేద సమ్మితమ్‌

కథయామి పురావృత్తం ప్రతిమానాం చ సంభవమ్‌

ప్రవృత్తే చ మహాయజ్ఞే ప్రాసాదేచై వ నిర్మితే

చింతాతస్య బభూవాథ ప్రతిమార్థమహర్నిశమ్‌

న వేద్మికేన దేవేశం సర్వేశం లోకపావనమ్‌

సర్గస్థత్యంతకర్తారం పశ్యామి పురుషోత్తమమ్‌

చింతావిష్టస్త్వభూద్రాజా శేతే రాత్రౌ దివాసిన

న భుజ్క్తే వివిధాన్‌ భోగా న్నచ స్నానం ప్రసాధనం

నైవ వాద్యేన గన్ధేవ గాయనై ర్వర్ణకై రపి

న గజైర్మదయుక్తైశ్చ నచానేకైర్హయాన్వితైః

నేంద్రనీలై ర్మహానీలైః పద్మరాగమయైర్నచ

సువర్ణరజతాద్యైశ్చ వజ్రస్ఫటిక సంయుతైః

బహూరాగార్థకామైర్వా నవన్యైరంతిరిక్షగైః

బభూవతస్యనృపతే ర్మనసస్తుష్టి వర్థనమ్‌

శైలమృద్దారుజాతేషు ప్రశస్తంకింమహీతలే

విష్ణుప్రతిమాయోగ్యం చ సర్వలక్షణ లక్షితమ్‌

ఏతై రేవ త్రయాణాం తు దయితం స్యాత్సురార్చితమ్‌

స్థాపితే ప్రీతిమభ్యేతి ఇతి చింతావరోభవత్‌

పంచరాత్రవిధానేన సంపూజ్య పురుషోత్తమమ్‌

చింతావిష్టో మహీపాలః సంస్తోతుముపచక్రమే

బ్రహ్మ:

ముని వరులారా! వినుండు. వేద తుల్యమైన పురాణ మిది. యజ్ఞారంభము కాగా దేవ ప్రాసాద నిర్మాణము జరుగగా నాఱేనికి విగ్రహ నిర్మాణమును గూర్చిన యాలోచన రేయిం బవళ్ళతని మనసునం దిరవు కొనెను. సృష్టి స్థితి లయ కర్తయైన యా సర్వేశ్వరుని నేనెఱుంగను. ఆ స్వామిని నేనెట్లు గను గొందునను నూహతో రాత్రియుం బవలును పండు కొనడు. ఆ యావేదనలో నాతని కష్టైశ్వర్య సమృద్ధి మనస్తుష్టి నీయ జాలదయ్యె రాళ్ళు మన్ను కట్టెలం దేది విష్ణు ప్రతిమకు యోగ్య మగును? ఎట్టి మూర్తిని ప్రతిష్టించిన విష్ణువు ప్రీతు డగునను నాలోచనలో నతడు మునింగెను. అంతట నాతడు పాంచరాత్ర విధానమున పురుషోత్తమ దేవుని బూజించి యదే యాలోచన గొని స్వామిని స్తుతింప నారంభించెను.