బ్రహ్మ మహా పురాణము

2 - సృష్టికథనము

లోమర్షణుడు:

స సృష్ట్వాతు ప్రజాస్త్వేవ మాపవో వై ప్రజాపతిః

లేఖే వై పురుషః పత్నీం శతరూపా మయోనిజామ్‌

ఆపవస్య మహిమ్నా తు దివ మావృత్య తిష్ఠతః

ధర్మేణైవ మునిశ్రేష్ఠాః శతరూపా వ్యజాయత

సాతు వర్షాయుతం తప్త్వా తపః పరమదుశ్చరమ్‌

భర్తారం దీప్తతపనం పురుషం ప్రత్యపద్యత

స వై స్వాయంభువో విప్రాః పురుషో మను రుచ్యతే

తస్యైకసప్తతియుగం మన్వంతర మిహోచ్యతే

లోమర్షణుడు:

ఇట్లు ప్రజాపతి ప్రజలను సృజించి అయోనిజయైన శతరూపను బత్నిగ బడసెను. ద్యులోకము నావరించి యుండెడి ఆపవుని యొక్క మహిమచే ధర్మముచే శతరూప జనించినది, ఆమె పదివేలేండ్లు దుశ్చర తపమ్ము జేసి తపో దీప్తుని స్వాయంభువ మనువును భర్తనుగ బొందెను. డెబ్బది యొక్క మహా యుగము లా మనువు యొక్క ఆయుర్దాయము. అదే మన్వంతర మన బడును.

వైరాజాత్పురుషా ద్వీరం శతరూపా వ్యజాయత

ప్రియవ్రతోత్తానపాదౌ వీరా త్కామ్యా వ్యజాయత

కామ్యానామ సుతా శ్రేష్ఠా కర్దమస్య ప్రజాపతేః

కామ్యాపుత్రాస్తు చత్వారః సమ్రా ట్కుక్షిర్విరాట్ప్రభుః

ఉత్తానపాదం జగ్రాహ పుత్రమత్రిః ప్రజాపతిః

ఉత్తానపాదా చ్చతురః సూనృతా సుషువే సుతాన్‌

ధర్మస్య కన్యా సుశ్రోణీ సూనృతా నామ విశ్రుతా

ఉత్పన్నా వాజిమేథేన ధ్రువస్య జననీ శుభా

ధ్రువం చ కీర్తిమంతం చ ఆయుష్మంతం వసుం తథా

ఉత్తానపాదోజనయత్సూనృతాయాం ప్రజాపతిః

ధ్రువో వర్షసహస్రాణి త్రీణి దివ్యాని భోద్విజాః

తపస్తేసే మహాభాగః ప్రార్థయ న్సుమహద్యశః

ఆ పైరాజుని వలన శతరూప వీరుడను కుమారుని గనెను. ప్రియవ్రత ఉత్తాన పాదులను గూడ గనెను. వీరునికి కామ్య జనించెను. కామ్య యొక్క కుమారులు నల్వురు సమ్రాట్టు, కుక్షి, విరాట్టు, ప్రభువు అనువారు, ఉత్తాన పాదుని వలన సూసృత నల్వురు కొడుకులం గాంచెను. ఆమె ధర్ముని కూతురు. సూనృత (సునీత) అశ్వ మేధము చేయుటచే జనించినది. ఆమె ధ్రువుని తల్లి. ఉత్తాన పాదునికి ధ్రువుడు, కీర్తి మంతుడు, ఆయుష్మంతుడు, వసువు అను నల్వురు కుమారులు సూనృత యందు గల్గిరి. ధ్రువుడు గొప్ప కీర్తి కావలెనని కోరి మూడు వేల దివ్య సంవత్సరములు తప మాచరించెను.

తస్మై బ్రహ్మా దదౌ ప్రీతః స్థానమాత్మసమం ప్రభుః

అచలం చైవ పురతః సప్తర్షీణాం ప్రజాపతిః

త్సయాభిమాన మృద్దిం చ మహిమానం నిరీక్ష్య చ

దేవాసురాణా మాచార్యః శ్లోకం ప్రాగుశానా జగౌ

అహోస్య తపసోవీర్య మహో శ్రుత మహోద్భుతమ్‌

య మద్య పురతఃకృత్వాధ్రవంస ప్తర్షయః స్థితాః

తస్మాచ్ల్ఛిష్టిం చ భవ్యం చ ధ్రువా చ్ఛంభుర్వ్యజాయత

శ్లిష్టేరాధ త్త సుచ్ఛాయపంచపుత్రా నకల్మషాన్‌

రిపుం రిపుంజయం వీరం వృకలం వృకతేజసమ్‌

 రిపో రాధత్త బృహతీ చక్షుషం సర్వతేజసమ్‌

అజీజన త్సుష్కరిణ్యాం వైరిణ్యాం చాక్షుషం మనుమ్‌

ప్రజాపతే రాత్మజాయాం వీరణస్య మహాత్మనః

ఆతని కబ్జయోని ప్రీతుడై తన స్థాసమునకు సమాన మైన స్థానము నిచ్చెను. అది సప్తర్షుల పురో భాగమందు అచలమయి (ధ్రువమయి) వెలుగు చున్నది. ఆతని అభిమానము సమృద్ధిని మహిమను గని దేవాసుర గురుండు శుక్రు డీక్రింది శ్లోకమును జెప్పెను. “ఆహా ఈ ధ్రువుని తపస్సు, వీర్యము, శ్రుతము (పాండిత్యము) అద్భుతము. ఈతని ముందిడుకొని సప్తర్షులు విలసించు చున్నారు”. అని, ధ్రువుని వలన శంభువను నామె శ్లిష్టి, భవ్యుడు నను కుమారుల గనెను. శ్లిష్టి వలన సుచ్ఛాయ యను నామె రిపువు, రిపుంజయుడు, వీరుడు, వృకలుడు, వృకతేజనుడు నను నైదుగురు తనయులం గాంచెను. రిపువు వలన బృహతి యను నంగన సర్వ తేజ శ్శాలియైన చక్షుస్సును గనెను. అతడు వీరణుడును ప్రజాపతి యొక్క కూతురగు పైరణి యందు చాక్షుష మునువుం గాంచెను.

మనో రజాయంత దశ నడ్వలాయాం మహౌజసః

కన్యాయాం మునిశార్దూల వై రాజస్య ప్రజాపతేః

కుత్సః పురుః శతద్యుమ్న స్తపస్వీ సత్యవా క్కవిః

అగ్నిష్టు దతిరాత్రశ్చ సుద్యుమ్నశ్చేతి తే నవ

అభిమన్యుశ్చ దశమో నడ్వలాయాం మహౌజసః

పురో రజనయత్పుత్రా న్ష డాగ్నేయీ మహాప్రభాన్‌

అంగంసుమనసంస్వాతిం క్రతుమంగిరసం గయమ్‌

అంగాత్సునీథా పత్యం వై వేన మేకం వ్యజాయత

అపచారేణ వేనస్య ప్రకోపః సుమహానభూత్‌

ప్రజార్థ మృషయో యస్య మమంథు ర్దక్షిణం కరమ్‌

వేనస్య మథితే పాణౌ సంభభూవ మహా న్నృపః

తందృష్ట్వామునయః ప్రాహురేష వై ముదితాః ప్రజాః

కరిష్యతి మహాతేజా యశశ్చ ప్రాప్స్యతే మహత్‌

స ధన్వీ కవచీ జాతో జ్వలజ్జ్వలన సంనిభః

అతనికి నడ్వలయను నామె యందు పది మంది పుట్టిరి. నడ్వల పైరాజ ప్రజాపతి కుమార్తె. ఆ పది మంది కుత్సుడు, పురుషుడు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్కు, కవి, అగ్నిష్టుత్తు, అతిరాత్రుడు,సుద్యుమ్నుడు, అభిమన్యుడు ననువారు, పురుని వలన ఆగ్నేయి యనునామె అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడునను నాఱ్వురు కుమారులం గనెను. అంగుని వలన సునీథుని కుమారి వేనుడను కొడుకుం గాంచెను. వాడు చేసిన యపచారముచే ఋషులు కోపోద్రిక్తులైరి. వాని సంతానమునకై వాని కుడి హస్తమును మథించిరి. అపుడు ఒక మహాను భావుడు దయించెను. మును లాతనిం గని యితడు ప్రజా రంజకుడుగ ననిరి. ఆ బాలుడు ధనువూని కవచము తొడిగికొని జ్వలించు నగ్నివోలె నుదయించెను. అతడె పృథువు. ఈ నేల నేలిన వాడు. (అతని పేర నిల పృథివి నాబడెను.)

పృథుర్వైన్య స్తథా చేమాం రరక్ష క్షత్ర పూర్వజః

రాజసూయాభిషిక్తానా మాద్యః స వసుధాధిపః

తస్మాచ్చైవ సముత్పన్నౌ నిపుణౌ సూత మాగధౌ

తేనేయం గౌర్ముని శ్రేష్ఠా దుగ్ధా సస్యాని భూభృతా

ప్రజానాం వృత్తికామేన దేవైః సర్షిగణై స్సహ

పితృభి ర్దానవైశ్చైవ గంధర్వై రప్సరోగణౖః

సర్పైః పుణ్యజనైశ్చైవ వీరుద్భిః పర్వతై స్తథా

తేషు తేషు చ పాత్రేషు దుహ్యమానా వసుంధరా

ప్రాణా ద్యథేప్సితం క్షీరం తేన ప్రాణా నధారయన్‌

పృథోస్తు పుత్రౌ ధర్మజ్ఞౌ యజ్ఞాం తేంతర్థిపాతినౌ

శిఖండినా హవిర్ధాన మంతర్ధానా ద్వ్యజాయత

హవిర్థానాత్‌ షడాగ్రేయీ ధిషణా జనయ త్సుతాన్‌

ప్రాచీన బర్హిషం శుక్రం గయం కృష్ణం వ్రజాజినౌ

ప్రాచీన బర్హిర్భగవా న్మహా నాసీ త్ప్రజాపతిః

హవిర్ధానా న్మునిశ్రేష్ఠా యేన సంవర్ధితాః ప్రజాః

ప్రాచీనబర్హి ర్భగవాన్‌ పృథివీతలచారిణీః

సముద్రతనయాయాంతు కృతదారో భవత్ప్రభుః

మహతస్తపసః పారే సవర్ణాయాం ప్రజాపతిః

సవర్ణా ధత్త సాముద్రీ దశ ప్రాచీనబర్హిషః

సర్వాన్‌ ప్రచేతసోనామ ధనుదర్వేదస్య పారగాన్‌

అపృథగ్ధర్మాచరణా స్తేతప్యంత మహత్తపః

దశవర్షసహస్రాణి సముద్రసలిలేశయాః

తపశ్చర్యత్సు పృథివీం ప్రచేతస్సు మహీరుహాః

అరక్ష్యమాణా మావవ్రు ర్బభూవాథ ప్రజాక్షయః

నాశక న్మారుతో వాతుం వృతం ఖ మభవ ద్ద్రుమైః

దశవర్షసహస్రాణి న శేకు శ్చేష్టితుం ప్రజాః

తదుపశ్రుత్య తపసా యుక్తాః సర్వేప్రచేతనః

ముఖేభ్యో వాయు మగ్నించ ససృజు ర్జాతమన్యవః

ఉన్మూలా నథ వృక్షాంస్తు కృత్వా వాయు రశోషయత్‌

తానగ్ని రదహ ద్ఘోర ఏవ మాసీ ద్ద్రుమక్షయః

ద్రుమక్షయ మథోబుద్ధ్వా కించి చ్చిష్టేషు శాఖిషు

ఉపగమ్యాబ్రవీ దేతాం స్తదా సోమః ప్రజావతీన్‌

కోపం యచ్ఛత రాజానః సర్వే ప్రాచీనబర్హిషః

వృక్షశూన్యా కృతా పృధ్వీ శామ్యేతా మగ్నిమారుతౌ

రత్నభూతా చ కన్యేయం వృక్షాణాం వరవర్ణినీ

భవిష్యం జానతా తాత ధృతాగర్భేణ వైమయా

మారిషా నామ నామ్నైనా వృక్షాణా మితి నిర్మితా

భార్యా వోస్తు మహాభాగాః సోమవంశవివర్థినీ

యుష్మాకం తేజసోర్థేన మమ చార్ధేన తేజసః

అస్యా ముత్పత్స్యతే విద్వా న్దక్షోనామ ప్రజాపతిః

స ఇమాం దగ్ధభూయిష్ఠాం యుష్మ త్తేజోమయేన వై

అగ్నినా గ్నిసమో భూయః ప్రజాః సంవర్థయిష్యతి

తతః సోమస్య వచనా జ్జగృహుస్తే ప్రచేతసః

సంహృత్య కోపం వృక్షేభ్యః పత్నీం ధర్మేణ మారిషామ్‌

దశభ్యస్తు ప్రచేతోభ్యో మారిషాయాం ప్రజాపతిః

దక్షో జిజ్ఞే మహాతేజాః సోమస్యాంశేన భో ద్విజాః

ఆ వసుధాధీశుడు రాజసూయ యాగాభిషేకము నందిన రాజుల కెల్ల మొట్ట మొదటి వాడు. అతనికి నిపుణులయిన సూత మాగధు లిర్వురు జనించిరి. అతనే భూమిని గోవు నొనరించి సస్యరూప మయిన క్షీరమును బిదికిన మహానుభావుడు. అట్లు పిదుక బడిన గోవు (భూమి) ప్రజా జీవన మునకు పాలు చేసినది. దేవతలు ఋషులు పితృ దేవతలు దానవులు అప్సరసలు నాగులు (సర్పములు) పుణ్య జనులు (రాక్షసులు) వీరుధులు పర్వతులు తమతమ కాయా పాత్రము లందు పిదుక బడిన క్షీరమును ద్రావి ప్రాణధారణ మొనరించు కొనిరి. వసుంధర వారి వారికి పాలిచ్చెను. పృథుని కుమారులు ధర్మజ్ఞులు అంతర్థి, పాతి, యనువారు గల్గిరి. అంతర్థానుని వలన శిఖండిని యను నామె హవిర్ధానుడను కొడుకుం గాంచె. హవిర్ధానుని వలన ఆగ్నేయి యార్వురు కుమారులం గాంచెను. వారు ప్రాచీన బర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వ్రజుడు, అజినుడు ననువారు. ప్రాచీనబర్హి భగవానుడు మహానుభావుడు ప్రజాపతి యయ్యెను. హవిర్ధానుని కుమారుడు ప్రాచీనబర్హి యేలు నేలలో నీటిలో దర్భలు ప్రాచీనాగ్రములు గానే మొలచెనట. (అందుచే నాతడు ప్రాచీన బర్హియయ్యె.). ఆ ప్రభువు సముద్రుని కూతురు సవర్ణ యను నామెం బరిణయ మాడెను. తీవ్ర తపస్సు చేసిన మీదటనే యతడు పెండ్లి చేసికొని సవర్ణ యందు పది మంది కుమారులను ధనుర్వేద పారగులను గాంచెను. ప్రాచేతసులగు వారందరు నొక్కటియై తప మాచరించిరి. ఏక రీతిగ ధర్మము నిర్వహించిరి. పది వేలేండ్లు సముద్ర జలము లందుండి తీవ్ర తపము సేసిన మహాను భావులు వారు. వారు తపము సేయు తఱి, రక్షణ లేనిక తన మహా వృక్షములు (అంగుళ మెడము లేకుండ) మొలచి యీ పృథివిని కప్పి వేసినవి. అందు వలన ప్రజాక్షయ మేర్పడెను. వాయువు వీచరాదయ్యె. వాయు పధము చెట్లచే నిండి నిబిడీకృత మయ్యె. పది వేలేండ్లు ప్రజలు కదలను మెదలను వశము గాదయ్యె. అది విని తపస్సులు ప్రాచేతనులు కోపించి మొగముల నుండి వాయువును అగ్నిని జనింప జేసిరి. వాయువు తరువుల నెల్ల మొదలిటికి బెల్లగించి బడద్రోసి తడియార్చి వైచెను. వాని నగ్ని దహించెను. ఇట్లు సర్వద్రుమ నాశన మయ్యెను. కొలదిగ మిగిలిన తరువులం గని సోముడేతెంచి వారింగని యిట్లనియె. రాజులారా ! కోపము నాపుడు. పృథివి యెల్ల వృక్ష శూన్యయయ్యె. అనలా నిలములను శమింప జేయుడు. ఈ వృక్షములు గన్న కన్యారత్న మిదిగో పరమ సుందరి, భవిష్య వృత్తాంత మెరిగి నేనీమెం గడుపులో దాచితిని. ఇది మారిషయను పేరు గలది. ఈమె మీకు భార్య యగు గాక ! సోమవంశ వర్ధని ఈమె. మీ తేజస్సులు సగము నా తేజస్సులో సగము వహించి యీమె యందు దక్షుడను ప్రజాపతి ఉదయింప గలడు. మీ తేజముచే దగ్ధ మయిన యీ పృథివిని అగ్ని కల్పుడగు నాతడు చల్లార్చి ప్రజలను వృద్ధి నందింప గలడు. ప్రచేతనులా సోముని పలుకు లాచరించి కోప ముపసంహరించి వృక్షముల నుండి మారిషయను నా కన్యం గైకొనిరి. ఆ ప్రచేతసులు పదిమంది వలన మారిష యందు సోమాంశమున మహాతేజస్వి దక్షుడు దయించెను.

అచరాంశ్చ చరాంశ్చైవ ద్విపదోథ చతుష్పదః

స సృష్ట్యా మనసా దక్షః పశ్చా దసృజత స్త్రియః

దదౌ దశ స ధర్మాయ కశ్యపాయ త్రయోదశ

శిష్టాః సోమాయ రాజ్ఞేచ నక్షత్రాభ్యా దదౌ ప్రభుః

తాసు దేవాః ఖగాః గావో నాగా దితిజ దానవాః

గంధ ర్వాప్సర శ్చైవ జజ్జిరేన్యాశ్చ జాతయః

తతః ప్రభృతి విప్రేంద్రాః ప్రజా మైథునసంభవాః

సంకల్పాద్దర్శనా త్స్పర్శా త్పూర్వేషాం ప్రోచ్యతే ప్రజా

అతడు చరాచర భూతములను ద్విపాచ్చ తుష్పాద పశువులను మనసు చేతనే సృజించి యా మీదట స్త్రీ సంతా నమునం గనెను. అందు ధర్మునికి పది మందిని, కశ్యపునకు ఐదుమువ్వుర నిచ్చి తక్కిన వారిని నక్షత్ర నామ ధారిణుల నిర్వది యేడ్గురను సోముని కొసంగెను. వారి యందు దేవతలు, పక్షులు, గోవులు, నాగులు, దైత్యులు, గంధర్వులు, అప్సరసలు మఱి పెక్కు జాతులు జనించెను. అది మొదలు మైథున సంభవు లయిన ప్రజలు పుట్ట నారంభించిరి. పూర్వము సంకల్ప మాత్రమున, దర్శన మాత్రము, స్పర్శ మాత్రమున సృష్టి యయ్యెడ జరుగు చుండెను.

మునులు:

దేవానాం దానవానాం చ గంధర్వోరగ రక్షసామ్‌

సంభవస్తు శ్రుతోస్మాభి ర్దక్షస్య చ మహాత్మనః

అంగుష్ఠా ద్బ్రహ్మణో జజ్ఞే దక్షః కిల శుభవ్రతః

వామాంగుష్ఠా త్తదా చైవం తస్య పత్నీ వ్యజాయత

కథం ప్రాచేతసత్వం న పున ర్లేభే మహాతపాః

ఏతం నః సంశయం సూత వ్యాఖ్యాతుం త్వ మి హార్హసి

దౌహిత్ర శ్చైవ సోమస్య కథం శ్వశురతాం గతః

మునులు:

సూత! శుభవ్రతి యైన దక్షుడు బ్రహ్మ యొక్క అంగుష్ఠము నుండి కదా జనించెనని వినబడును. ఆయన బొటనవ్రేలి నుండి కదా యీయన భార్య జనించెను. అట్టితఱి దక్షుడు ప్రాచేతసులకు జనించె నంటిరే! ఇది సంశయము వివరింప నీవ యర్హుడవు. సోముని కూతురు బిడ్డ వీరి మామ యెట్లయ్యె అన

లోమహర్షణుడు:

ఉత్పత్తిశ్బ నిరోధశ్చ నిత్యం భూతేషు భో ద్విజాః

ఋషయోత్ర సముహ్యంతి విద్యావంతశ్చ యే జనాః

యుగేయుగే భవంత్యేతే పున ర్దక్షాదయో నృపాః

పునశ్చైవ నిరుధ్యంతే విద్వాం స్తత్ర నముహ్యతి

జ్యైష్ఠ్యం కానిష్ఠ్య మప్యేషాం పూర్వం నాసీ ద్ద్విజోత్తమాః

తవ ఏవ గరీయో భూత్ప్రభావ శ్చైవ కారణమ్‌

ఇమాం విసృష్టిం దక్షస్య యో విద్యాత్సచరాచరమ్‌

ప్రజావా నాయురుత్తీర్ణః సర్వలోకే మహీయతే

లోమహర్షణుడు:

విప్రులార! భూతము లందు జరుగు పుట్టువు నిరోధమును గురించి తెలియక మునులే తికమక పడు చుందురు. విద్యా వంతులకే ఇది దుర వగాహము. ఈ దక్షాదులు రాజులు యుగయుగ మందు తిరిగి పొడము చుందురు. తిరిగి చాటగు చుందురు. విద్వాంసుడేని యక్కడ పొరబడును. వీరిలో జ్యేష్ఠ కనిష్ఠ భావములు మున్ను లేకుండెను. తపస్సు ప్రభావమును బట్టియే చిన్న పెద్ద పరిగణనము. దక్షుని యీ విసృష్టి నెఱింగిన యాతడు సంతాన వతుడయి, పూర్ణాయువై స్వర్గ మందు వసించును.