విద్యా - కర్మ - గతి వివేచనము
మునులు:
యద్యేవం వేదవచనం కురు కర్మ త్యజేతి చ
కాం దిశం విద్యయా యాంతి కాం చ గచ్చంతి కర్మణా
ఏతద్వై శ్రోతుమిచ్ఛామ స్తద్బవాన్ర్పబ్రవీతు నః
ఏతదన్యోన్య వై రూప్యం వర్తతే ప్రతికూలతః
వేద విధి ననుసరించి కర్మల నాచరించ వలెననియు కర్మలను విడువ వలెననియు మీరు చెప్పు చున్నారు. ఇది పరస్పరము విరుద్ధముగా నున్నది. కావున కర్మల నాచరించినచో ఏ గతి కలుగునో వానిని విడిచి విద్యను, జ్ఞానమును ఆశ్రయించినచో ఏ గతి కలుగునో విన కుతూహల మగుచున్నది. తెలుపుడు. అని మునులు వ్యాసుల నడిగిరి.
వ్యాసులు:
శృణుధ్వం ముని శార్దూలా యత్ప్సచ్ఛధ్వం సమాసతః
కర్మవిద్యామయౌ చోభౌ వ్యాఖ్యాస్యామి క్షరాక్షరౌ
యాం దిశం విద్యయా యాంతి యాం గచ్ఛంతి చ కర్మణా
శృణుధ్వం సాంప్రతం విప్రా గమనం హ్యేతదు త్తరమ్
ఆస్తి ధర్మ ఇతి యుక్తం నాస్తి తత్రైన యో వదేత్
యక్షస్య సాదృశ్యమిదం యక్షస్యేదం భవే దథ
ద్వావిమావథ పంథానౌ యత్ర వేదాః ప్రతిష్ఠితాః
ప్రవృత్తిలక్షణో ధర్మో నివృత్తో వా విభాషితః
కర్మణా బధ్యతే జందు ర్విద్యయా చ విముచ్యతే
తస్మాత్కర్మ న కుర్వంతి యతయః పారదర్శినః
కర్మణా జాయతే ప్రేత్య మూర్తిమాన్షోడశాత్మకః
విద్యాయా జాయతే నిత్య మవ్యక్తం హ్యక్షరాత్మకమ్
కర్మ త్వేకే ప్రశంసంతి స్వల్పబుద్ధిరతా నరాః
తేన తే దేహజాలేన రమయంత ఉపాసతే
యే తు బుద్ధిం పరాం ప్రా ప్తా ధర్మనై పుణ్యదర్శినః
న తే కర్మ ప్రశంసంతి కూపం నద్యాం పిబన్నివ
కర్మాణాం ఫలమాప్నోతి సుఖదుఃఖే భవాభవౌ
విద్యయా తదవాప్నోతి యత్ర గత్వా న శోచతి
యత్ర గత్వాన మ్రియతే యత్ర గత్వాన జాయతే
న జీర్యతే యత్ర గత్వా యత్ర గత్వా న వర్ధతే
యత్ర తద్బ్రహ్మ వరమ మవ్యక్తమచలం ధ్రువమ్
అవ్యాకృతమానాయామ మమృతం చాధియోగవిత్
ద్వంద్వైర్న యత్ర బాధ్యంతే మానసేన చ కర్మణా
సమాః సర్వత్ర మైత్రాశ్చ సర్వభూతహితే రతాః.
విద్యామయోన్యః పురుషా ద్విజాః కర్మమయోపరః
విప్రాశ్చంద్ర సమస్పర్మః సూక్ష్మయా కళయా స్థితః
తదేతదృషిణా ప్రోక్తం విస్తరేణాను గీయతే
న వక్తుం సక్యతే ద్రష్టుం చక్రతంతు మివాంబరే
ఏకాదశవికారాత్మా కలా సంభారసంభృతః
మూర్తిమానితి తం విద్యా ద్విప్రాః కర్మగుణాత్మకమ్
దేవో యః సంశ్రిత స్తస్మి న్బుద్ధీందురివ పుష్కరే
క్షేత్రజ్ఞం తం విజానీయా నిృత్యం యోగజితాత్మకమ్
తమో రజశ్చ సత్త్వం ద జ్ఞేయం జీవగుణాత్మకమ్
జీవమాత్మగుణం విద్యా దాత్మానం పరమాత్మనః
సచేతనం జీవగుణం వదంతి స చేష్టతే జీవగుణం చ సర్వమ్
తతః పరం క్షేత్రవిదో వదంతి ప్రకల్పయంతో భువనాని సప్త
వ్యాసులు:
ముని శ్రేష్ఠలారా! మీరడిగినది చెప్పెదను. కర్మమయ మగు క్షర తత్త్వమును విద్యామయ మగు అక్షర తత్త్వమును కర్మానుష్ఠానము వలన విద్యా లాభము వలన కలుగు గతులను కూడ వివరింతును. వినుడు. ఈ ప్రశ్నలకు సమాధానము చాల గహన గంభీర మైనది. ధర్మ మున్నది అనుచునే అదే ధర్మము లేదని చెప్పుట పరస్పర విరుద్ధము. వేదానుసారి యగు ప్రవృత్తి మార్గము విద్యాను సారియగు నివృత్తి మార్గము అని రెండు మార్గములు కలవు. కర్మము బంధ హేతువు. విద్య ముక్తి హేతువు. అందుచే తత్త్వము నెఱిగిన మునులు కర్మల నాచరింపరు. కర్మల నాచరించుటచే షోడశ తత్త్వ రూపుడగు పురుషుడు మరణించి మరల పుట్టును. విద్యచే అక్షర రూపుడై ముక్తి నందును. (షోడశ కలలు అనగా ముఖ్య ప్రాణము, శ్రద్ధ, పంచ భూతములు ఇంద్రియములు, మనస్సు, అన్నము, వీర్యము, తపస్సు, వేద మంత్రములు, కర్మములు, లోకములు, నామము ఇవి పదునారు ప్రశ్నోపనిషత్ = 6 ప్రశ్న , 4 మంత్రము) అపరా విద్యను ఆశ్రయించిన వారు కర్మలను మెచ్చుచు జన్మ మరణ పరంపరలో చిక్కి దేహముల తోనే ఆనందించు చుందురు. పరా విద్యను ఆశ్రయించిన వారు ధర్మ తత్త్వము నెఱిగిన వారు కావున నది నీరు త్రావువారు బావి నీటిని మెచ్చ నట్లు కర్మ మార్గమును మెచ్చరు. కర్మా నుష్ఠానము వలన సుఖ దుఃఖములను జన్మ మరణములను పొందుదురు. విద్యచేత దుఃఖ శోకములు కాని జన్మ మరణములు కాని హాని వృద్ధులు కాలేని స్థానమును పొందుదురు. అవ్యక్తము అచలము ధ్రువము అవ్యాకృతము అనామయము అమృతము యోగముచే ప్రాప్యము అగు పరబ్రహ్మ స్థానమును పొందుదురు. అట్టివారు సుఖ దుఃఖముల వంటి ద్వంద్వముల చేతను సంకల్ప కృతము లగు కర్మల చేతను బాధింప బడక అన్ని ప్రాణుల యందు మైత్ర భావము హితబుద్ధి కలిగి యుందురు. పురుషుడును (జీవుడు) కర్మ మయుడు విద్యా మయుడు అని రెండు విధములు. వీరిలో కర్మమయ పురుషుడు చంద్రుని వలె సుకుమార స్పర్శ కలిగి చంద్ర కల వంటి సూక్ష్మ కలా రూపమున నుండును. అని ఋగ్వేద పురుషుడు చెప్పెను. దానిని విస్తరించి అనుగానము చేయుదును. వస్త్రములో దారపు ఏసె వలె సూక్ష్మ మగు ఆ తత్త్వము సులభముగా మాటలతో చెప్పుటకు గాని ఇంద్రియములతో చూచుటకు గాని శక్యము కాదు. పంచ తన్మాత్రలు గుణ త్రయము మనో బుద్ధ్య హంకారములు అంతఃకరణ త్రయము అనెడి ఏకాదశ తత్త్వ వికారములు షోడశ కలలు కర్మలు గుణములు మూర్తీ భవించిన తత్త్వముగా ఆ కర్మమయ పురుషుని తెలియ వచ్చును. అతడు ఈ షోడశ కలామయ మగు దేహమును ఆశ్రయించి సముద్ర జలము నందు ప్రతిబింబించిన చంద్రుడు వలె నుండి యోగ సాధనచే జయింప బడు తత్త్వమై క్షేత్రజ్ఞుడని వ్యవహరింప బడుచుండును. తమస్సు రజస్సు సత్త్వము ఈ మూడును జీవుని గుణములు. జీవుడు ఆత్మ యొక్క గుణము. ఆత్మ పరమాత్మ యొక్క గుణము. ఈ గుణ త్రయాత్మక మగు ఈ దృశ్య ప్రపంచము అంతయు ఈ సప్త లోకములను ఈ జీవుని సృష్టియే అని క్షేత్రతత్త్వము నెఱిగిన వారి వచనము.
వ్యాసులు:
ప్రకృత్యాస్తు వికారా యే క్షేత్రజ్ఞాస్తే పరిశ్రుతాః
తే చైనం న ప్రజానంతి న జానాతి స తానపి
తైశ్చైవ కురుతే కార్యం మనః షష్ఠెహేంద్రియైః
సుదాంతైరివ సంయంతా దృఢః పరమవాజిభిః
ఇంద్రియేభ్యః పరా హ్యర్థా అర్థేభ్యః పరమం మనః
మనసస్తు పరా బుద్ది ర్బుద్ధేరాత్మా మహాన్పరః
మహతః పరమవ్యక్త మవ్యక్తాత్పరతో మృతమ్
అమృతాన్న పరం కించి త్సా కాష్ఠా పరమా గతిః
ఏవం సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశతే
దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః
అంతరాత్మని సంలీయ మనఃషష్ఠాని మేధయా
ఇంద్రియైరింద్రియార్థాంశ్చ బహుచి త్తమచింతయన్
ధ్యానేపి పరమం కృత్వా విద్యాసంపాదితం మనః
అనీశ్వరః ప్రశాంతాత్మా తతో గచ్ఛేత్పరం పదమ్
ఇంద్రియాణాం తు సర్వేషాం వశ్యాత్మా చలితస్మృతిః
ఆత్మనః సంప్రదానేన మర్త్యో మృత్యుముపాశ్రుతే
విహత్య సర్వసంకల్పా స్సత్త్వే చితం నివేశయేత్
సత్త్వే చిత్తం సమావేశ్య తతః కాలంజరో భవేత్
చిత్తప్రసాదేన యతి ర్జమాతీహ శుభాశుభమ్
ప్రసన్నాత్మాత్మని స్థిత్వా ముఖమత్యంత మశ్నుతే
లక్షణం తు ప్రసాదస్య యథా స్వప్నే సుఖం భవేత్
నిర్వాతే వా యథా దీపో దీప్యమానో స కంపతే
ఏవం పూర్వాపరే రాత్రే యంజన్నాత్మానమాత్మనా
లఘ్వాహరో విశుద్ధాత్మా పశ్యత్యాత్మానమాత్మని
రహస్యం సర్వవేదానా మనై తిహ్యమనాగమమ్
ఆత్మప్రత్యాయకం శాస్త్ర మిదం పుత్రానుశాసనమ్
ధర్మాఖ్యేనేషు సర్వేషు సత్యాఖ్యేనేషు యద్వసు
దశవర్ష సమస్రాణి నిర్మథ్యామృతముద్ధృతమ్
నవనీతం యథాదధ్నః కాష్ఠాదగ్నిర్యథై వ చ
తథైవ విదుషాం జ్ఞానం ముక్తి హేతోః సముద్ధృతమ్
స్నాతకానామిదం శాస్త్రం వాచ్యం పుత్రానుశాసనమ్
తదిదం నాప్రశాంతాయ నాదాంతాయ తపస్వినే
నావేదవిదు షే వాచ్యం తథానానుగతాయ చ
నాసూయ కాయాసృజవే న చానిర్దిష్టకారిణే
న తర్కశాస్త్రదగ్ధాయ తథైవ పిశునాయ చ
శ్లాఘినే శ్లాఘనీయాయ ప్రశాంతాయ తపస్వినే
ఇదం ప్రియాయ పుత్రాయ శిష్యాయానుగతాయ తు
రహస్యధర్మం వక్తవ్యం నాన్యస్మైతు కథంచన
యదప్యస్య మహీం దద్యా ద్రత్న పూర్ణా మిమాం నరః
ఇదమేవ తతః శ్రేయ ఇతి మన్యేత తత్త్వవిత్
అతో గుహ్యతరార్థం త దధ్యాత్మ మతిమానుషమ్
యత్తన్మహర్షిభిర్దృష్టం వేదాంతేషు చ గీయతే
తద్యుష్మభ్యం ప్రయచ్ఛామి యన్మాం పృచ్ఛథ సత్తమాః
యన్మే మనసి వర్తేత యస్తు వో హృది సంశయః
శ్రుతం భవద్భి స్తత్సర్వం కిమన్యత్కథయామి వః
వ్యాసులు:
ప్రకృతి యొక్క వికారములు అగు దృశ్య ప్రపంచము క్షేత్రజ్ఞు డనబడు ఆత్మ తత్త్వము అను ఈ రెంటిలో అవి ఇతని నెరుగ జాలవు. కాని అతడు వాని నెరుగును. సమర్థుడగు సారథి మేలైన గుఱ్ఱములతో రథమును నడిపి నట్లు మనస్సుతో ఐదు జ్ఞానేంద్రియము లతో ఆయా పనులు చేయించును. ఇంద్రియముల కంటె ఇంద్రియము లతో అనుభవించు విషయములు వాటి కంటె మనస్సు మనస్సు కంటె బుద్ధి బుద్ధి కంటె హిరణ్య గర్భుడను తత్త్వము దాని కంటె జగద్బీజ మగు అవ్యక్త మను ఈశ్వర తత్త్వము దాని కంటె అమృత తత్త్వము ఒక దానికంటె మఱియొకటి సూక్ష్మ తరములు. అమృత తత్త్వము కంటె సూక్ష్మ తరము లేదు. అదే అందరకును కడపటి గమ్య స్థానము. ఈ విధముగా సర్వ భూతముల యందు రహస్యముగా ప్రత్యక్తత్త్వమై యున్న పరాత్మ తత్త్వము బహిర్గతమై ప్రకాశింపక కనబడక యుండును. కాని సూక్ష్మ దృష్టి కల మహనీయులు నిశిత మగు బుద్ధితో చూడ గలుగుదురు. పంచ జ్ఞానేంద్రియముల మనస్సున లీనము చేసి ఆ ఆఱిటితో సుఖ విషయము లను ఆలోచింపక అనుభవింపక జ్ఞాన సంపన్న మగు మనస్సును పరతత్త్వ ధ్యానమున నిలిపి తనపై ఇంద్రియములను అధికారము చేయ నీయక ప్రశాంత మనస్కు డగు వాడు ముక్తి పొందును. ఇంద్రియముల కన్నిటికి వశుడయి ధ్యానము తత్త్వముపై నిలుప లేక ఆత్మను మనశ్చాంచల్యము నకు వదలిన వాడు మృత్యువును, సంసారమును పొందును. సర్వ సంకల్పము లను అణచి చిత్తమున సత్త్వ గుణమును నింపి తత్త్వ విచారణా పరుడు కావలెను. చిత్తము నిర్మల మగటచే ఇది శుభము ఇది అశుభము అను భేదబుద్ధి తొలగి అత్యంత సుఖమును పొందును. చిత్త ప్రసాదము గాఢసుషుప్తి సుఖము వలె స్వచ్ఛ మయినది. అప్పుడు చిత్తము గాలిలేని చోట దీపము వలె నిశ్చలమై ప్రకాశించును. ఈ తత్త్వ విచార శాస్త్రము సర్వవేద రహస్యము. ఐతిహ్యములచే అగమములచే లభించదు. ఆత్మ జ్ఞనము కలిగించునది. భృగువను నతనికి అతని తండ్ర యగు వరుణు డుపదేశించినది. పెరుగును మథించి నవనీతమును వలె కాష్ఠము మథించి అగ్నిని వలె ధర్మ సత్య ప్రతిపాదకము లగు శాస్త్రములను పదివేలు కొలదిగ సంవత్సరముల పాటు మథించి తత్త్వ వేత్తలు ముముక్షువులకు ముక్తిని సంపాదించు ఈ తత్త్వమును వారి నుద్ధరించుటకై బయల్పరచిరి. వేద విద్యాధ్యయనము చేసిన వానికి దీనిని తెలుప వలెను. ప్రశాంత చిత్తము ఇంద్రియ నిగ్రహము తపస్సు వేదార్థ జ్ఞానము పెద్దలను అనువర్తించుట అననూయత బుజు ప్రవర్తనము చెప్పినట్లు చేయుట అను మంచి లక్షణములు లేని వానికిని తర్క శాస్త్రముతో బుద్ధి చెడిన వానికిని కొండె గానికిని ఆత్మస్తుతి చేసికొను వానికిని అతడు భూమి నంతటిని ప్రతి ఫలముగా ఇచ్చినను బోధించ రాదు. ఇది అన్ని ధనముల కంటె జ్ఞానముల కంటె శ్రేయో రూపము. రహస్య తరము. మనుష్యులకు దుర్లభము. మహర్షులు దర్శించినది. ఉపనిషత్తులలో తెలిప బడినది. ఓ మహర్షులారా! మీరు నన్నడిగితిరి కావున తెలిపితిని. అదంతయు వింటిరి. నాకు తెలిసినది మీకు సంశయము కలిగినది ఏదైన అడుగుడు. చెప్పెదను.
మునులు:
అధ్యాత్మం విస్తరేణేహ పునరేవ వదస్వ సః
యదధ్యాత్మం యథా విద్మో భగవన్నృపి సత్తమ
మునులు:
ఓ భగవన్! ఋషి సత్తమా! అధ్యాత్మమును మాకు ఇంకను విస్తరించి తెలుపుము.
వ్యాసులు:
ఆధ్యాత్మం యదిదం విప్రాః పురుష న్యేహ పఠ్యతే
యుష్మభ్యం కథయిష్యామి తస్య వ్యాఖ్యావధార్యతామ్
భూమి రాపస్తథా జ్యోతి ర్వాయురాకాశమేవ చ
మహాభూతాని యశ్చైవ సర్వభూతేషు భూతకృత్
వ్యాసులు:
విప్రులారా! పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచ మహా భూతములను వాటి యందు నిలిచి యున్న భూత స్రష్టయగు పరమాత్ముడును అనునదియే అధ్యాత్మము.
మునులు:
ఆకారం తు భవేద్యస్య యస్మిన్దేహం న పశ్యతి
ఆకాశాద్యం శరీరేషు కథం తదుప వర్ణయేత్
ఇంద్రియాణాం గుణాః కేచిత్కథం తానుపలక్షయేత్
మునులు:
వీనిలో వేనికి రూపము కలదు? వేనికి రూపము లేదు? ఇవి శరీరమున ఎట్లు ఉన్నవి? ఇంద్రియము లును వాని గుణములను ఏవి? ఎట్లు వానిని గుర్తించ వలెను?
వ్యాసులు:
ఏతద్వో వర్ణయిష్యామి యథావదను దర్శనమ్
శృణుధ్వం తదిహైకాగ్ర్యా యథాతత్త్వం యథా చ తత్
శబ్దః శ్రోత్రం తథా ఖాని త్రయ మాకాశ లక్షణమ్
ప్రాణశ్చేష్టా తథా స్పర్శ ఏతే వాయుగుణాస్త్రయః
రూపం చక్షుర్విపాకశ్చ త్రిధా జ్యోతిర్విధీయతే
రసోథ రసనం స్వేదో గుణాస్త్వేతే త్రయోంభసామ్
ఘ్రేయం ఘ్రాణం శరీరం చ భూమేరేతే గుణాస్త్రయః
ఏతావానింద్రియ గ్రామో వ్యాఖ్యాతః పాంచభౌతికః
వాయోః స్పర్శో రసోద్భ్యశ్చ జ్యోతిషో రూపముచ్యతే
ఆకాశప్రభవః శాబ్దో గంధో భూమిగుణః స్మృతః
మనో బుద్ధిః స్వభావశ్చ గుణా ఏతే స్వయోనిజాః
తే గుణానతివర్తంతే గుణేభ్యః పరమా మతాః
యథా కూర్మ ఇవాంగాని ప్రసార్య సంనియచ్ఛతి
ఏవమేవేంద్రియ గ్రామం బుద్ధిశ్రేష్ఠో నియచ్ఛతి
యదూర్ధ్వం పాదతలయో రవాక్చోర్ధ్వం చ పశ్యతి
ఏతస్మిన్నేవ కృత్యే సా వర్తతే బుద్ధిరుత్తమా
గుణైస్తు నీయతే బుద్ధి ర్బుద్ధిరేవేంద్రియాణ్యపి
మనఃషష్ఠాని సర్వాణి బుద్ధ్యా భావాత్కృతో గుణాః
ఇంద్రియాణి సరైః పంచ షష్ఠం తన్మన ఉచ్యతే
సప్తమీం బుద్ధిమేవాహుః క్షేత్రజ్ఞం విద్ధిచాష్టమమ్
చక్షురాలోకనాయైవ సంశయం కురుతే మనః
బుద్ధిరధ్యవసానాయ సాక్షీ క్షేత్రజ్ఞ ఉచ్యతే
రజస్తమశ్చ సత్త్వం చ త్రయ ఏతే స్వయోనిజాః
సమాః సర్వేషు భూతేషు తాన్గుణా నుపలక్షయేత్
తత్ర యత్ర్పీతి సంయుక్తం కించి దాత్మని లక్షయేత్
ప్రశాంతమివ సంయుక్తం సత్త్వం తదుపధారయేత్
యత్తు సంయోహసంయుక్తం కాయే మనసి వా భవేత్
ప్రవృత్తం రజఇత్యేవం తత్ర చాప్యుపలక్షయేత్
యత్తు సంయోహసంయుక్త మవ్యక్తం విషమం భవేత్
అప్రతర్క్యమవిజ్ఞేయం తమ స్తదుపధారయేత్
ప్రహర్షః ప్రీతిరానందం స్వామ్యం స్వస్థాత్మచింతతా
అకస్మాద్యది వా కస్మా ద్వదంతి సాత్త్వికాన్గుణాన్
అభిమానో మృషావాదో లోభో మోహ స్తథాక్షమా
లింగాని రజసస్తాని వర్తంతే హేతుతత్త్వతః
తథా మోహః ప్రమాదశ్చ తంద్రీ నిద్రాప్రబోధితా
కథంచి దభి వర్తంతే విజ్ఞేయా స్తామసా గుణాః
శబ్దము ఆకాశపు గుణము, చెవి దానిని గ్రహించు ఇంద్రియము. శూన్యము దేహములో దాని ఉనికి. స్పర్శ వాయువునకు గుణము. ప్రాణ వాయువు దేహమున దాని రూపము. చేష్ట, చలనము దాని వ్యాపారము. రూపము అగ్నికి గుణము. నేత్రము దాని ఇంద్రియము. విపాకము దేహమున దాని వ్యాపారము. రసము, రుచి, నీటికి గుణము, నాలుక దాని ఇంద్రియము, చెమట దేహమున దాని రూపము. గంధము భూమికి గుణము. ముక్కు దాని ఇంద్రియము. శరీరము దాని రూపము. మనస్సు, బుద్ధి, స్వభావము, ఇవి స్వతః సిద్ధము లైనవి. ఇవి ఈ భూత గుణములకు అతీతములు. బుద్ధితో వాటిని వివేకులు నిగ్రహించు కొందురు. శబ్దాది గుణములు, విషయములు బుద్ధిని ప్రేరించును. బుద్ధి ఇంద్రియములను ప్రేరించును. మనస్సుతో ఇంద్రియములు ఆరు, బుద్ధ ప్రేరణ లేనిచో గుణ విషయ అనుభవమునకు లేదు. కనుక అది ఆరింద్రియము లపై ఏడవ తత్త్వము క్షేత్రజ్ఞుడగు జీవుడు ఎనిమిదవ తత్త్వము. క్షేత్ర మనగా దేహము. దాని యందుండి ఆయా కర్మలు చేయుచు వాని ఫలముల ననుభవించు జీవుడు క్షేత్రజ్ఞుడు. వీనిలో చక్షుస్సు మొదలగు ఇంద్రియములు రూపము మొదలగు విషయముల గ్రహించును. మనస్సు సంకల్ప వికల్పములను సంశయమును కలిగించునున. బుద్ధి, ఇది ఇట్టి దని నిశ్చయమును కలిగించును. క్షేత్రజ్ఞుడు వీటి సహాయమున ఆయా పనులు చేయు చుండును. సత్త్వ రజస్తమో గుణములును స్వతఃసిద్ధము లైనవి. ఇవి అన్ని భూతముల యందును సమత్వము తోనే ఉండును. కాని జీవులలో ఎవరి యందేది అధికముగా నుండునో వారికి దానిని బట్టి ప్రవృత్థులు కలుగు చుండును. ప్రహర్షము, ప్రీతి, ఆనందము, నిశ్చల చిత్తము అన్నిటిని తన అధీనములో ఉంచుకో గలుగుట. ఇవి సత్త్వ గుణ లక్షణములు. అభిమానము, వ్యర్థముగా మాటాడుట,లోభము, మోహము, క్షమ ఇవి రజో లక్షణములు. అధిక మోహము, మూఢత్వము, ఏమరుపాటు, బద్ధకము, నిద్ర, ఎచ్చరిక, మెలకువ లేకుండుట తెలియ వలసిన వాటిని ఎంతో శ్రమ మీద కాని తెలిసి కొన లేకుండుట, ఇవి తమోగుణ లక్షణములు.
మనః ప్రసృజతే భావం బుద్ధి రధ్యవసాయినీ
హృదయం ప్రియమేవేహ త్రివిధా కర్మచోదనా
ఇంద్రియేభ్యః పరా హ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః
మననస్తు పరా బుద్ధి ర్బుద్ధే రాత్మా పరః స్మృతః
బుద్ధి రాత్మా మనుష్యస్య బుద్ధిరేవావాత్మనాయికా
యదా వికురుతే భావం తదా భవతి సా మనః
ఇంద్రియాణాం పృథగ్భావా ద్బుద్ధి ర్వికురుతే హ్యను
శృణ్వతీ భవతి శ్రోత్రం స్పృశంతీ స్పర్శ ఉచ్యతే
పశ్యంతి చ భవేద్దృష్టీ రసంతీ రసనా భవేత్
జిఘ్రంతీ భవతి ఘ్రాణం బుద్ధి ర్వికురుతే పృథక్
ఇంద్రియాణి తు తాన్యాహు స్తేషాం వృత్త్యా వితిష్ఠతి
తిష్ఠతి పురుషే బుద్ధి ర్బుద్ది ర్బావవ్యవస్థితా
కదాచి ల్లభతే ప్రీతిం కదాచిదపి శోచతి
న సుఖేన న దుఃఖేన కాదాచిదిహ ముహ్యతే
స్వయం భావాత్మికా భావాం స్త్రీనేతానతి వర్తతే
సరితాం సాగరో భర్తా మహావేలామివోర్మిమాన్
యదా ప్రార్థయతే కించి త్తదా భవతి సా మనః
అధిష్ఠానే చ వై బుద్ధ్యా పృథగేతాని సంస్మరేత్
ఇంద్రియాణి చ మేధ్యాని విచేతవ్యాని కృత్స్నశః
సర్వణ్యేవాసు పూర్వేణ యద్యదా చ విధీయతే
అభిభాగమనా బుద్ధి ర్భావో మనసి వర్తతే
ప్రవర్తమానస్తు రజః సత్త్వ మప్యతివర్తతే
యే వై భావేన వర్తంతే సర్వే ష్వేతేషు తే త్రిషు
అన్వర్థాస్సంప్రవర్తంతే రథనేమి మరా ఇవ
ప్రదీపార్థం మనః కుర్యా దింద్రియైర్ముద్ధిసత్తమైః
నిశ్చరద్భిర్యథాయోగ ముదాసీనైర్యదృచ్ఛయా
ఏవం స్వభావమేవేద మితి బుద్ధ్యా స ముహ్యతి
అశోచస్సంప్రహృష్యంశ్చ నిత్యం విగతమత్సరః
న హ్యాత్మా శక్యతే ద్రష్టు మింద్రియైః కామగోచరైః
ప్రవర్తమానైరనేకై ర్దుర్ధరైరకృతాత్మభిం
తేషాం తు మనసా రశ్మీ న్యదా సమ్యజ్నియచ్చతి
తదా ప్రకాశతేస్యాత్మా దీపదీప్తా యథాకృతిః
సర్వేషామేవ భూతానాం తమస్యుపగతే యథా
ప్రకాశం భవతే సర్వం తథైవ ముపధార్యతామ్
యథా వారిచరః పక్షీ న లివ్యతి జలే చరన్
విముక్తాత్మా తథా మోగీ గుణదోషై ర్న లిప్యతే
ఏవమేవ కృతప్రజ్ఞో న దోషై ర్విషయాం శ్చరన్
ఆసజ్జమానః సర్వేషు న కథంచిత్ర్పలిప్యతే
త్యక్త్వా పూర్వకృతం కర్మ రతి ర్యస్య సదాత్మని
సర్వభూతాత్మభూతస్య గునసంగేన సజ్జతః
న్వయమాత్మా ప్రసవతి గుణేష్వపి గుణేష్వపి కదాచన
న గుణా విదురాత్మానం గుణా న్వేద స సర్వదా
పరిదధ్యాద్గుణానాం స ద్రష్టా చైవ యథాతథమ్
సత్త్వక్షేత్రజ్ఞయోరేవ మంతరం లక్షయే న్నరః
సృజతే తు గుణానేక ఏకో న సృజతే గుణాన్
పృథగ్భూతౌ ప్రకృత్యైతౌ సంప్రయుక్తౌ చ సర్వదా
యథాశ్మనా హిరణ్యస్య సంప్రయుక్తౌ తథైవ తౌ
మశకోదుంబరౌ వాపి సంప్రయుక్తౌ యథా నహ
ఇషీకా వా యథా ముంజే పృథక్చ సహ చైవ హ
తథైవ సహితావేతా అన్యోన్యస్మి న్ర్పతిష్ఠితౌ
భావములను సృజించునది మనస్సు. అధ్యవసాయమును, నిశ్చయమును, కలిగించునది బుద్ధి. ఆనందము మొదలగు భావములను అనుభూతి పొందునది హృదయము అని కర్మలకై జీవుని ప్రేరించు తత్త్వములు మూడు విధములు. ఈ అంశములను ఇట్లు వివరించుకొన వలయును, ఇంద్రియముల కంటె సూక్ష్మ తరములు శబ్ద స్పర్శ రూప రస గంధము లనెడి విషయములు. వాటి కంటె సూక్ష్మ తరము మనస్సు. దానికంటె సూక్ష్మ తరము బుద్ధి. బుద్ధి కంటె సూక్ష్మ తరమై ఈ అన్నింటి చేత పని చేయించు వాడు జీవుడు. కాని జీవునకు గల ఉపకరణము లలో బుద్ధియె సూక్ష్మ తమము. ఈ స్వతంత్ర శక్తి కల బుద్ధిలో సంకల్ప వికల్పములు కలిగిన స్థితియే మనస్సు. అట్లే బుద్ధియే వినుచో శ్రోత్రము స్పృశించు చోత్వక్ చూచుచో చక్షుస్సు, రుచి చూచుచో రసన, వాసన చూచుచో ఘ్రాణము అని ఐదింద్రియములుగా వ్యవహరింప బడును. జీవుని ఆశ్రయించి యుండు ఈ బుద్ధి ఆయా భావములను బట్టి వ్యవస్థ నొందును. అవి 1. సుఖము 2. దుఃఖము. 3. ఏమియు తెలియని మూఢస్థితి. బుద్ధి ఈ మూడు ప్రభావముల కును అతీత మైనది. సముద్రము నదులను చెలియలి కట్టను తనలో ఇముడ్చు కొన్నట్లు బుద్ధి ఆయా భావములను తనలో ఇముడ్చు కొనును. బుద్ధి ఆయా భావముల యందు ప్రవర్తించు నప్పడు గుణములు మూడును తమ తమ ప్రభావమును చూపును. ప్రవృత్తి కాలములో రజో గుణము సత్త్వ గుణముపై తన అధికారము చూపును. ఈ మూడు గుణములును చక్రనాభినేముల నడుమ చక్రపు అరల, ఆకుల వలె బుద్ధి యందు ఇమిడి యుండి ఆయా విషయముల ననుసరించి ప్రవర్తించు చుండును. వివేకులు ఇంద్రియములను మనస్సును కూడ ఆత్మ తత్త్వమును సాక్షాత్కరించు కొనుటకే వినియోగించు కోవలెను. కాని మనస్సును అదుపులో ఉంచు కొననిదే ఇంద్రియములు తమ విషయముల మీద స్వేచ్ఛగా ప్రవర్తించు చున్నంత వరకు ఆత్మ సాక్షాత్కారము సాధ్యము కాదు. కనుక ముముక్షువు వివేకముతో మనస్స హాయమున ఇంద్రియములను నిగ్రహించ వలెను. చీకటి తొలగ గానే లోకము నందలి ప్రాణులకు ఆయా వస్తువులు కనబడు నట్లు అజ్ఞానము తొలగ గానే ఆత్మ సాక్షాత్కారము జరుగును. నీటి పక్షి నీటిలో తిరుగు చున్నను నీరుకాని అచటి మలినములు కాని అంటు నట్లు జీవన్ముక్తు డగు యోగి ఇంద్రియ విషయములలో ప్రవర్తించి నను వాని దోషముల తనికి అంటవు. ఆత్మా నుభవముతో తన యందు తానే ఆనందించు వారు సంచిత కర్మను నశింప జేసికొని ప్రారబ్ధము అనుభవముతో నిశించి సర్వ భూతములు తానై నందున త్రిగుణ సంబంధముచే విషయములలో ప్రవర్తిల్లినను ఆత్మ స్వయం జ్యోతి స్తత్త్వముతో ప్రకాశించును. ఆత్మ గుణములను ఎరుగును. జడము లగుటచే గుణములు ఆత్మను ఎరుగ లేవు. అతడు ధ్యాన యోగముచే త్రిగుణముల తత్త్వమును గ్రహించ గలడు. సత్త్వాది గుణములకును క్షేత్రజ్ఞునకు గల భేదము ఇది. వీనిలో సత్త్వాదులు గుణములను సృజించ జాలవు. ఆత్మ గుణాదులను సృజించ గలదు. ఇట్లు ఇవి వేరు వేరయి యుండియు లోక వ్యవహారమున ఇవి అవినాభావముతో ఒక దానిని మఱి యొకటి ఎడ బాయక యుండును. ఇది ఖనిజ శిల, బంగారముల వంటివి. మేడికాయ, దాని యందలి పురుగుల వంటివి. ముంజదర్భ యందలి ముల్లు వంటివి. ఇవి వేరు తత్త్వము లయి యును కలిసియే యుండును. వీనిని వేరు పరచు కొనుటయే ఆత్మతత్త్వ వివేకము. ఇదియే ఆత్మ సాక్షాత్కారమునకు సాథనము.
Summary of chapter 130 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The advanced stages of yogic practice are described: the nature of dhāraṇā (concentration) on divine objects, the progression from dhāraṇā through dhyāna to samādhi, and the specific signs and experiences accompanying each stage. The liberation (mokṣa) attained through perfected Yoga — identified with the recognition of the Puruṣa's eternal nature as pure witness-consciousness — is affirmed as the supreme fruit of all spiritual endeavor.