బ్రహ్మ మహా పురాణము

185 - కాలీయ దమనమ్‌

వ్యాసులు:

ఏకదాతు వినారామం కృష్ణో బృందావనం యయౌ

విచచార వృతో గోపైర్వన్య పుష్పస్రగుజ్వలః

నజగామాథ కాలిందీం లోలకల్లోల శాలినీమ్‌

తీరసంలగ్న ఫేనౌఘై ర్హసంతీమివ సర్వతః

తస్యాం చాతి మహాభీమం విషాగ్నికణ దూషితమ్‌

హ్రదం కాళీయనాగస్య దదర్శాతి విభీషణమ్‌

విషాగ్నినా విసరతా దగ్ధతీర మహాతరుమ్‌

వాతాహతాంబు విక్షేప స్పర్శదగ్ధ విహంగమమ్‌

తమతీవ మహారౌద్రం మృత్యువక్తృమివాపరమ్‌

విలోక్య చింతయామాస భగవాన్మధు సూదనః

అస్మిన్వసతి దుష్టాత్మా కాళీయోసౌ విషాయుధః

యోమయా నిర్జిత స్త్యక్త్వా దుష్టో నష్టః పయోనిధౌ

తేనేయం ధూషితా సర్వా యమునా సాగరంగమా

న సరైర్గోధనై ర్వాపి తృషారైరుపభుజ్యతే

తదస్య నాగరాజస్య కర్తవ్యో నిగ్రహో మయా

నిత్యత్రస్తాః సుఖం యేన చరేయుర్ర్వవాసినః

ఏదర్థం నృలోకేస్మిన్నవతారో మయా కృతః

యదేషాసత్పథస్థానాం కార్యా శాస్తిర్దురా త్మనామ్‌

తదేత న్నాతి దూరస్థం కదంబ మురుశాఖినమ్‌

అధిరుహ్యోత్పతిష్యామి హ్రదేష్మిన్‌ జీవనాశినః

ఇత్థం విచింత్య బద్ధ్వా చ గాఢం పరికరం తతః

నిపపాత హ్రదే తత్ర సర్పరాజస్య వేగతః

వ్యాసులు:

కృష్ణుడు గోపకులతో నడవి పూల మాలలు దాల్చి బలరాముడు రాకుండ నొకతరి బృందావనము నకు వెళ్ళెను. అచట తరగలు లేచి నురుగు లోడ్డులం దొరయ నవ్వు చున్నదా యన్నట్లున్న కాళిందీ నదికి జని యందొక భయంకరమైన విషాగ్నిని జిమ్ము కాళీయ సర్పమునకు నివాసమైన మడుగును జూచెను. విషాగ్ని వ్యాపించి మాడిపోయి యా తీర మందలి తరువులతో గాలి తాకిడికి లేచిన విష జల స్పర్శచే మాడి పోయిన పక్షులతో మరొక మృత్యు ముఖమో యన్నట్లు మహా రౌద్రమై యున్న యమ్మడుగు జూచి మధుసూదనుడు ఈ మడుగులో విషాయుధుడు. కాళీయుడు అను దుష్ట సర్ప రాజున్నాడు. ఇంత మున్ను వీనిని సముంద్ర మందు నిర్జించి వదలి పెట్టితిని. వానిచేత సాగరమున గలియు యమునా నది విష దూషిత యైనది. దాన నరులు గోవులు దప్పిక గొనియు దీని దరి జేరరు. కావున వీనినశ్యము నిగ్రహింప వలెను. వ్రేపల్లె లోని జనము నిత్యము వీనికి జడియు చుందురు. వారెల్లరు నిక నిట సుఖముగ సంచరింతురు గాక. ఇందు కొఱకే నీలోకము నంద వతరించితిని. ఇది సత్పురుషులకి రాకపోకల కనువైన చోటు. దురాత్ములకు శాస్తి చేయ వలెను. కావున ననతి దూరములో నున్న కదంబ వృక్షమును(కడిమి చెట్టును) యొక్కి జీవ నాశకమైన యీ విషపు మడుగులో దూకెదను. అని తలచి నడుమున వలువ బిగించికొని యా కాళీయుని మడుగు నందు కృష్ణుడు దూకి పడెను.

తేనాపి పతతా తత్ర క్షోభితః స మహాహ్రదః

అత్యర్థ దూరజాతాంశ్చ తాం శ్చా సించన్మహీరుహాన్‌

తేహి దుష్ట విష జాజ్జ్వలా తప్తాంబు తపనోక్షితాః

జజ్వలుః పాదపాః సద్యో జ్వాలా వ్యాప్త దిగంతరాః

అ స్ఫోటయామాస తదా కృష్ణో నాగహ్రదం భుజైః

తచ్చబ్ద శ్రవణాచ్చాథ నాగరాజోభ్యు పాగమత్‌

అ తామ్రనయనః కోపా ద్విష జ్వాలాకులైః ఫణైః

వృతో మహావిషైశ్చాన్యైర రుణై రనిలాశనైః

నాగ పత్న్యశ్చ శతశో హారిహారోపశోభితాః

ప్రకంపిత తనూత్క్షేపచల త్కుండలకాంతయః

తతః ప్రవేష్టితః సర్పైః స కృష్ణో భోగబంధనైః

దదంశు శ్చాపి తే కృష్ణం విషజ్వాలా విలై ర్ముఖైః

తం తత్ర పతితం దృష్ట్వా నాగభోగనిపీడితమ్‌

గోపా వ్రజ ముపాగత్య చుక్రుశుః శోకలాలసాః

అట్లు దూకిన హరిచే నా మడుగు కలగ బడి దూర దూరమున నున్న వృక్షములను గూడ దన జలములచే దడపెను. విష జ్వాలలచే గ్రాగిన నాయుడుకు నీటిచే దడుప బడిన చెట్లంటు కొని నలుదెసల జ్వాలలు గ్రమ్ముకొనియె. కృష్ణుడు అ ముడుపును బాహువులచే గలకుండు పరచెను. అ శబ్దము విని నాగరాజు కోపముచే నిండ నెరుపెక్కిన కనులతో విషజ్వాలా కులమైన బుడగలతో మఱి పెక్కు యెఱ్ఱని మహావిష సర్పములతో జుట్టుకొన బడి యుండెను.ఆ నాగుని భార్యలు మనోహర హారముల దాల్చి మేనులు కంపింప కుండలముల జలించి మణికాంతులు మిరుమిట్లు గొలుప నూరునకు మించి యందందగ్రమ్ము కొనిరి. ఆ ఫణిరాజు ఫణాగ్ర మందు జొచ్చి కృష్ణడు పడగల బంధ మందు జిక్కు కొనియె. కాళియుని బరివార మగు పాములు విష జ్వాలలు జిమ్ము ముఖమలం గరచెను. అమ్మడుగున బడి నాగని భోగము నందు నిరుకు గొనియున్న హరిని గాంచి గోపకులు వ్రేపల్లెకు జని శోక వివశులై గోల పెట్టిరి.

గోపాలురు:

ఏష కృష్ణో గతో మోహమగ్నో వైకాలియే హ్రదే

భక్ష్యతే సర్పరాజేన తదాగచ్ఛత మా చిరమ్‌.

గోపాలురు:

ఇడిగో కృష్ణుడు కాళీయుని మడుగున విషముచే మూర్ఛ వోయినాడు. సర్పరాజు వీనిని దినివేయ గలడు. రండు, త్వరగా రండని కేకలు పెట్టిరి.

వ్యాసులు:

ఏతచ్చ్రుత్వా తతోగోపా వజ్రపాతోపమం వచః

గోప్యశ్చ త్వరితా జగ్ము ర్యశోదా ప్రముఖాహ్రదమ్‌

హాహా క్వాసావితి జనో గోపీనా మతి విహ్వలః

యశోదయా సమంభ్రాంతో ద్రుతః ప్రస్ఖలితోయయౌ

నందగోపశ్చ గోపాశ్చ రామాశ్చాద్భుగత విక్రమాః

త్వరితం యమునాం జగ్ముః కృష్ణ దర్శన లాలసాః

దదృశుశ్చాపి తే తత్ర సర్పరాజ వశంగతమ్‌

నిష్ర్పయత్నం కృతం కృష్ణం సర్పభోగేన వేస్టితమ్‌

నందగోపశ్చ నిశ్చేష్టః పశ్యన్‌ పుత్రముఖం భృశమ్‌

యశోదాచ మహాభాగా బభూప ముని సత్తమాః

గోప్యస్త్వ న్యా రుదత్యశ్చ దదృశుః శోకకాతరాః

ప్రోచుశ్చ కేశవం ప్రీత్యా భయకాతర గద్గదమ్‌

సర్వా యశోదయా సార్థం విశామోత్ర మహాహ్రదే

నాగరాజస్య నో గంతు మస్మాకం యుజ్యతే వ్రజే

దివసః కోవినా సూర్యం వినా చంద్రేణ కా నిశా

వినా దుగ్దేన గావో వినా కృష్ణేన కోవ్రజః

వినాకృతా న యాస్యామః కృష్ణే నానేన గోకులమ్‌

ఇతి గోపివచః శ్రుత్వా రౌహిణేయో మహాబలః

ఉవాచ గోపాన్విధురా న్విలోక్య స్తిమితేక్షణః

నందం చ దీన మత్యర్థం న్యస్తదృష్టిం సుతాననే

మూర్చాకులాం యశోదాంచ కృష్ణమాహాత్మ్యసంజ్ఞయా

అది విని గోపకులు గోపికలు పిడుగు పడినట్లై యశోద మున్నుగా నందరు మడువు దరికేగిరి. “కృష్ణు డెక్కడ” యనుచు వ్రేపల్లెలో యశోదతో దెదరి బెదరి తడబడుచు నటకు వచ్చిరి. నందుడు గోపకులు బలరాముడు మొదలగు నద్భుత పరాక్రమ సంపన్నులు కూడ హడలెత్తి కృష్ణుని జూడ యమున కేగిరి. సర్పరాజు వశము నుండి యన్ని పడగలచే జుట్టబడి యేమి జేయక మిన్నకున్న కృష్ణుని జూచిరి. నంద గోవుడు నిశ్చేష్టుడై కొడుకు నెమ్మోము చూచుచు నిలువ బడెను. యశోదయు నిశ్చేష్టు రాలయ్యెను. మఱియుం గల గోపికలు ఏడ్చుచు కేశవుని గూర్చి శోకాక్రాంతులై భయ భ్రాంతలై యశోదతో గూడ నీ పెను మడువున జొత్తుము చత్తుము గాక తిరిగి పల్లెకుం బోరాదు. సూర్యుడు లేని పగలేమి చంద్రుడు లేని రాత్రి యేమి రాత్రి పాలులేని యావులు ఏమి యావులు. కృష్ణుడు లేని వ్రేపల్లె యేమి పల్లె. ఈ కృష్ణుడు లేకుండ గోకులము నకు బోనేపోము. అను నీ గోపికల మాటి విని రోహిణి కొడుకు బలరాముడు కృష్ణ దూరులైన గోపకులను జూచి చూపు నిలిపి బిడ్డ ముఖమున జూవు వెట్టి దిగులు పడియున్న నందుని మూర్చాకుల యైన యశోదను నుద్దేశించి కృష్ణు ప్రభావ మెఱిగి యిట్లనియె.

బలరాముడు:

కిమయం దేవదేవేశ! భావోయం మానుషస్త్వయా

వ్యజ్యతే స్వం తమాత్మానం కిమన్యం త్వం నవేత్సియత్‌

త్వమస్య జగతోనాభిః సురాణామేన ఛాశ్రయః

కర్తాపహర్తా పాతాచ త్రైలోక్యం త్వం త్రయీమయః

అత్రావతీర్ణయోః కృష్ణ గోపా ఏవ హి బాంధవాః

గోప్యశ్చ సీదతః కస్మాత్త్వం బంధూన్‌ సముపేక్షసే

దర్శితో మానుషో భావో దర్శితం బాల చేష్టితమ్‌

తదయం దమ్యతాం కృష్ణ దురాత్మా దశనాయుధః

ఇతి సంస్మారితః కృష్ణః స్మిత భిన్నౌష్ఠ సంపుటః

అస్ఫాల్య మోచయామాస స్వందేహం భోగబంధనాత్‌

బలరాముడు:

“దేవ దేవ! నీ మానుష భావము వెల్లడించు చుంటివా? ఆత్మ స్వరూపమును నీ వెరుగవా? వేరొక రూపే చూపనేల? నీవే జగత్తునకు నాభి భూతుడవు. దేవతల కాశ్రయు డవు. త్రైలోక్య మునకు కర్తవు. భర్తవు హర్తవును. వేదత్రయీ రూపుడవు. ఇట నవతరించిన మన కిద్దరకు కృష్ణా గొల్లలే చుట్టాలు కదా! గోపికలునంతే కదా! ఇట్లు పరితపించు నీ బంధువులను చూచి యెందు వలన నుపేక్షించు చున్నావు. మానుష భావము చూపితివి. బాల చేష్టలు ప్రదర్శించితివి. కోర లాయుధ ముగ గొనిన ఈ దురాత్ముని దమింపుము.” అని హలిచే జ్ఞప్తి చేయబడి కృష్ణుడు చిరు నవ్వున నధర బింబము దెరచుకొన భూజాస్పాదన ముజేసి పాము పడగల బంధముల నుండి తన మేనిని వదలంచు కొనెను.

అనామ్యచాపి హస్తాభ్యా ముభాభ్యా మధ్యమం ఫణమ్‌

ఆరుహ్య భుగ్నశిరసః ప్రననర్తోరువిక్రమః

వ్రణాః ఫణేభవం స్తస్య కృష్ణ స్యాంఘ్రి వికుట్టనైః

యత్రోన్నతిం చకురుతే ననా మాస్య తతః శిరః

మూర్చాముపాయయౌ భ్రాంత్వా నాగః కృష్ణస్యకుట్టనై

దండపాతనిపాతేన పవామ రుధిరంభహు

తం నిర్భుగ్న శిరోగ్రీవ మాస్యప్ర నృతశోణితమ్‌

విలోక్యశ రణం జగ్మున్తత్పత్య్నో మధుసూదనమ్‌

రెండు చేతుల నా పాము మధ్యమ ఫణమును వంచి వ్రాలిన వాని తలపై నెక్కి యవక్ర విక్రమమున నర్తనము జేసెను. హరి పాదకుట్టనము లచే (రాపిడిచే) వాని పడగలు పుళ్ళు పడెను. త్రోక్కిన తల వొంగి పోయెను కాళీయుడు కృష్ణపాద ఘట్టమున మూర్చ నొందెను. దండపాతమట్లు పడిపోయి నెత్తురు గ్రక్కెను. శిథలములైన శిరస్సుల ముఖముల నుండి రక్తము స్రవించ జూచి వాని భార్యలు మధుసూదడమని శరణోందిరి.

నాగ పత్నులు:

జ్ఞాతోసి దేవదేవః సర్వేశస్త్వమనుత్తమ

పరం జ్యోతిరచింత్యం యత్తదంశః పరమేశ్వరః

న సమర్థాః సురాస్తోతుం యమనన్యభవం ప్రభుమ్‌

స్వరూప వర్ణనం తస్యకథం యోషిత్కరిష్యతి

యస్యాఖిల మహీవ్యోమ జలాగ్ని పవనాత్మకమ్‌

బ్రహ్మండ మల్పకాంశాంశః స్తోష్యామస్తంకథం వయమ్‌

తతః కురుజగత్య్వామిన్‌ ప్రసాద మవసీదతః

ప్రాణాంస్త్యజతి నాగోయం భర్తృ భిక్షాప్రదీయతామ్‌

నాగ పత్నులు:

దేవదేవ! సర్వేశ్వర! పురుషోత్తమ! నీవు పరంజ్యోతి స్వరూపుడవు. అత్మ యొక్క భాగమే నీవు. నిన్ను స్తుతింప దేవతలును జాలరు. అట్టి నీ స్వరూప వర్ణన మండుది యెట్లు చేయ కలదు. పృథి వ్యప్తేజో వాయ్వా కాశములను జాలవు. అట్టి నీస్వరూప వర్ణన మడుది యెట్లు చేయ కలదు. పృథివ్వప్తేజో వాయ్వాకాశ రూప మయిన బ్రహ్మండ మనీలో యల్పాల్ప మైన యంశము. అట్టి నిన్నేమి స్తుతింప గలను. కావున నోజగత్ప్రభో! ఈ నాగుని యెడ దయ జూపుము. అణగి మణగి ప్రాణములు వదలు చున్నాడు. భర్తృ భిక్ష పెట్టుము. అని నాగ పత్నులు పలుక

వ్యాసులు:

ఇత్యుక్తే తాభిరాశ్వాస్యక్లాంత దేహోపి పన్నగః

ప్రసీద దేవదేవేతి ప్రాహవాక్యం శనైః శనైః

వ్యాసులు:

కాళీయుడు వొడ లెల్ల నలుగుడు వడి కూడ దేవదేవ! యనుగ్రహింపు మని మరిమరి ఇట్లు పలికెను.

కాళీయుడు:

తవాష్ట గుణ మైశ్వర్యం నాథ స్వాభావికమ్‌ పరమ్‌

నిరస్తాతిశయం యస్య తస్య స్తోష్యామి కిన్వహమ్‌

త్వం పరస్త్వం పరస్యాద్యః పరమ్త్వం తత్పరాత్మకమ్‌

పరాస్మాత్‌ వరమో యస్త్వం తస్యస్తోష్యామి కిన్వహమ్‌

యథాహం భవతా సృష్టో జాత్యారూపేణ చేశ్వరః

స్వభావేన చ సంయుక్త స్తథేదమ్‌ చేష్టితం మయా

యద్యన్యథా ప్రవర్తేయ దేవదేవ తతోమయి

న్యాయ్యో దండనిపాత స్తే తవైవ వచనం యథా

తథాపి యం జగత్స్వామీ దండం పాతితవాన్మయి

స సోడోయం వరో దండ స్త్వత్తో నాన్యోస్తు మేవరః

హతవీర్యో హతవిషో దమితోహం త్వయాచ్యుత

జీవితం దీయతామేక మాజ్ఞాపయ కరోమికిమ్‌

కాళీయుడు:

నీ ఐశ్వర్య మెనిమిది విధములు. అది స్వభావ సిద్ధము. దానిని యతి శయించునది మఱి లేదు. అట్టి యణిమిది విభూతి సంపన్ను డగు నిన్నేమి స్తుతింప గలడు. నీవు పరుడవు పరున కును మూలము నీవు. నీకంటె పరమైన తత్వము నీవె. పరతత్వమునకు వరము నీవు. అట్టి నిన్నేమి స్తుతింప గలను. జాతిచే రూపముచే దామిట్లు నన్ను సృజించితిరి. దాని కణుగుణ మైన స్వభావము కూడిన వాడను. తదనుగుణ మైన చేష్టను చేసితిని. సర్ప స్వభావమైన కాటు వేయుటను గరచుటను మాని వేఱొక తీరున ప్రవర్తింతు నేని స్వామి! నన్ను దండించుట న్యాయము. అట్లయ్యు నో జగత్ప్రభు నాపై దండనము వైచితివి. ఈ దండనము నీవు విధించినది కావున యిది వరముగ నేను స్మరింప వలసి నదే. ఇంతకంటె నీవలన మఱొక వరము వలదు. అచ్యుత! వీర్యము హత మైనది, విషము హత మైనది. నీచే నేను దమితుడ నైతిని. బ్రాణ మొక్కటి మాత్ర మిమ్ము. మఱియేమి నేను సేయ వలేనో ఆజ్ఞాపింపుము అన విని

శ్రీకృష్ణ:

నాత్ర స్థేయం త్వయా సర్ప! కదాచిద్యమునాజలే

సభృత్య పరివారస్త్వం సముద్ర సలిలం వ్రజ

మత్పదాని చ తే సర్ప దృష్ట్వా మూర్థని సాగరే

గరుడః పన్నగరిపుస్త్వయి నప్రహరిష్యతి

శ్రీకృష్ణ:

ఓ పాము! ఈ యమున జలమున నిక్కడ నీవెపుడు నుండ వలదు. భృత్య పరివారముతో నీవు సముద్ర జలములం జనుము నీ తలపై నా పాదములను జూచి సముద్రమున పన్నగారి యైన గరుడుడు నిన్ను జంపడు అని హరి సర్పరాజును వదలెను

వ్యాసులు:

ఇత్త్యుక్త్వా సర్పరాజానం ముమోచ భగవాన్‌ హరిః

ప్రణమ్యసోపి కృష్ణాయ జగామ పయసాంనిధిమ్‌

పశ్యతాం సర్వ భూతానాం సభృత్యాపత్య భాందవః

సమస్త భార్యసహితః పరిత్యజ్య స్వకంహ్రదమ్‌

గతే సర్పే వరిష్వజ్య మృతం పురివాగతమ్‌

గోపా మూర్థని గోవిందం సిషి చుర్నేత్రజైర్జలైః

కృష్ణమక్లిష్ట కర్మాణమన్యే విస్మిత చేతసః

తుష్టుపుర్ముదితా గోపా దృష్ట్వా శివజలాం నదీమ్‌

గీయమనోథ గోపీభిశ్చరి తైళ్చారుచేష్టితైః

సంస్తూయమానో గోపాలైః కృష్ణో వ్రజముపాగమత్‌

వ్యాసులు:

వాడును కృష్ణునకు మ్రొక్కి సముద్రమున కేగెను. సర్వ భూతములు చూచుచుండ భృత్యులతో సంతతితో బంధువులతో భార్య లందరితో నమ్మడుగు విడిచి సర్పము వోయినంత గోపకులు చనిపోయి మఱి వచ్చిన వాని నట్లు గోవిందుని కౌగిలించు కొని భాష్పములచే నాతని శిరస్సు దడిపిరి. ఎల్లరు మనసు లచ్చరువు బడ నానంద భరితులై యానది మధుర మంగళ రసపూరితముగా జూచి స్వామిని స్తుతించిరి. గోపికలచే గీర్తింప బడి గోవకులతో గృష్ణుడు వ్రేపల్లె కరుదెంచెను.