బ్రహ్మ మహా పురాణము

201 - అనిరుద్ధ వివాహే రుక్మి వధ నిరూపణమ్‌

వ్యాసులు:

చారుదేష్ణం సుదేష్ణం చ చారుదేహం చ శోభనమ్‌

సుషేణం చారుగుప్తం చ భద్రచారుం తథాపరమ్‌

చారువిందం (చంద్రం) సుచారుం చ చారుం చ బలినాం వరమ్‌

రుక్మిణ్యజనయత్పుత్రా న్కన్యాం చారుమతీం తథా

అన్యాశ్చ భార్యాః కృష్ణస్య బభూవుః సప్త శోభనాః

కాళిందీ మిత్రవిందా చ సత్యా నాగ్నజితీ తథా

దేవీ జాంబవతీ చాపి సదా తుష్టా తు రోహిణీ

మద్రరాజసుతా చాన్యా సుశీలా ళీలమండలా

సత్రాజితీ సత్యభామా లక్ష్మణా చారుహాసినీ

షోడశాత్ర సహస్రాణి స్త్రీణామన్యాని చక్రిణః

ప్రద్యుమ్నోపి మహావీర్యో రుక్మిణ స్తనయాం శుభామ్‌

స్వయంవరస్థాం జగ్రాహ సాపి తం తనయంహరేః

తస్యామస్యాభవత్పుత్రో మహాబలపరాక్రమః

అనిరుద్ధో రణేరుద్ధో వీర్యోదధి రరిందమః

తస్యాపి రుక్మిణః పౌత్రీం వరయామాస కేశవః

దౌహిత్రాయ దదౌ రుక్మీ స్పర్ధయన్నపి శౌరిణా

తస్యా వివాహే రామాద్యా యాదవా హరిణా సహ

రుక్మిణః నగరం జగ్ము ర్నామ్నా భోజకటం ద్విజాః

వివాహే తత్ర నిర్వృత్తే ప్రాద్యుమ్నేః సుమహాత్మనః

కళింగరాజ ప్రముఖా రుక్మిణం వాక్యమబ్రువన్‌

వ్యాసులు:

చారుదేష్ణుడు సుదేష్ణుడు చారు దేహుడు సుషేణుడు చారు గుప్తుడు భద్ర చారుడు, చారు బిందుడు (చంద్రుడు), సుచారుడు. అనువారు రుక్మిణి కుమారులు. చారుమతి యనునామె కుమార్తె. కృష్ణునకు మఱి యేడ్వురు భార్యలు కాళింది, మిత్రవింద, సత్య, నాగ్నజితి, జాంబవతి, నిత్యసంతుష్ట యగు రోహిణి, మద్రరాజ కుమార్తె యుత్తమ శీలము గలది యగు శీలమండల. వీరుకాక పదహారు వేల మంది భార్యలు హరికి గలరు. ప్రద్యుమ్నుడు రుక్మి కూతురుని స్వయం వరమున గ్రహించెను. ఆమె అతనిని స్వయంవర మందే స్వీకరించెను. అతనికి నామె యందు “అనిరుద్ధుడ”ను గుమారుడు గల్గెడు. యుద్ధము లందు నిరోధించుటకు శక్యము గాని బల సమృద్ధు డగుట వలన నతనికా పేరు వచ్చెను. వానికి రుక్మి పౌత్రి నిమ్మని కోరెను. అతడును గృష్ణునితో స్పర్థ బెట్టు కొన్నను దౌహిత్రున కిచ్చెను. ఆ వివాహ మందు బలరామాది యాదవులు రుక్మి రాజధాని యగు “భోజకటము”నకు కృష్ణునితో దరలి వెళ్ళిరి.

కళింగాదయుడు:

అనక్షజ్ఞో హలీ ద్యూతే తథాస్య వ్యసనం మహాత్‌

తజ్జయామో బలం తస్మా ద్ద్యూతేనైవ మహాద్యుతే

తధేతి తానాహ నృపాన్‌ రుక్మీ బలసమన్వితః

సభాయాం సహ రామేణ చక్రే ద్యూతం చ వైతదా

సహస్రమేకం నిష్కాణాం రుక్మిణా విజితో బలః

ద్వితీయే దివసే చాన్య త్సహస్రం రుక్మిణాజితః

తతో దశ సహస్రాణి నిష్కాణాం పణమాదదే

బలభద్ర ప్రపన్నాని రుక్మీ ద్యూతవిదాం వరః

తతో జహాసాధ బలం కళింగాధివతి ర్ద్విజాః

దంతాన్విదర్శయన్మూఢో రుక్మీ చాహ మదోద్ధతః

ప్రద్యుమ్న కుమారుని వివాహ మచటనైన తరువాత కళింగ రాజు మొదలైన వారు రుక్మింగని బలరాముడు పాచిక లాట నెరుగడు. కావున నతనిని జూదము లోనే యోడింతమన రుక్మి యా రాజులం బిలిచి బలగము గూర్చు కొని సభ యందు బలరామునితో జూద మాడెను. ఆ యాటలో రుక్మి వెయ్యి నిష్కముల పందెము గెలిచెను. రెండవ రోజున మఱి వేయి నిష్కములను గెలుచు కొనెను. ఆ మీద పదివేల నిష్కములను బందెము గాసెను.

రుక్మీ:

అవిద్యోయం మహాద్యూతే బలభద్రః పరాజితః

మృషై వాక్షావలేపత్వా ద్యోయం మేనేక్షకోవిదమ్‌

దృష్ట్వా కళింగరాజంతు ప్రకాశదశనాననమ్‌

రుక్మిణం చాపి దుర్వాక్యం కోపం చక్రే హలాయుధః

అత్తఱి కళింగ రాజు బలరాముని జూచి పండ్లు బయలు పడ పరిహాస పూర్వముగ నవ్వెను. అయ్యెడ రుక్మి చెలరేగి బలభద్రుడు జూద మాడుట నెరుగడు. కావున లేని యహంభావముతో నేను యాట గాడనని జూదమునకు సిద్ధపడి నాడని గేలి చేసెను.

వ్యాసులు:

తతః కోపపరీతాత్మా నిష్కకోటిం హలాయుధః

గ్లహం జగ్రాహ రుక్మీచ తత స్త్వక్షా నపాతయత్‌

అజయద్బల ద్రేవోథ ప్రాహోచ్చైస్తం జితం మయా

మమేతి రుక్మీ ప్రాహోచ్చై రలీకోక్తైరలం బలమ్‌

త్వయేక్తోయం గ్ల హః సత్యం సమమైషోనుమోదితః

ఏవం త్వయా చేద్విజితం స మయా విజితం కథమ్‌

తతోంతరిక్షే వాగుచ్చైః ప్రాహ గంభీరనాదినీ

బలదేవస్య తం కోపం వర్థయంతీ మహాత్మనః

హలాయుధుడు పండ్లుపై బడ నిగిలించిన కళింగరాజును బరి హసించుచు పేలిన రుక్మింజూచి కుపితుడై కోటి నిష్కములను బందె మొడ్డి గెలిచెను. రుక్మి పాచికలను విసరిపార వేసెను. బలరాము డట్లు గెలిచి “గెలుపు నాదియని” బిగ్గరగ బలికెను. “గెలుపు నాదని యబద్ధ మాడకు మని” యరచెను. నీవొడ్డిన పందెమునకు నేనా మోదింప లేదు. “ఇట్లు గెలుపు నీదగు నేని నాదెందులకు గాదు” అని రగడ సేయుచుండ

ఆకాశవాణి:

జితంతు బలదేవేన రుక్మిణా భాషితం మృషా

అనుక్త్వా వచనం కించి త్కృతం భవతి కర్మణా

నాకాశవాణి గంభీరముగ బెద్ద పెట్టున మహాత్ముడగు బలరాముని కోపముం బెంచుచు “బలరాముడే గెలిచి నాడు రుక్మి మాట యబద్ధము. ఏమియు బలుకక చేసి నదియే చేసి నట్లగును” అనెను.

వ్యాసులు:

తతో బలః సముత్థాయ క్రోధ సంరక్త లోచనః

జఘానాష్టాపదేనైవ రుక్మిణం స మహాబలంః

కళింగరాజం చాదాయ విస్ఫురంతం బలాద్బలః

బభంజ దంతాన్కుపితో యైః ప్రకాశం జహాససః

అకృష్య చ మహాస్తంభం జాతరూపమయం బలః

జఘానయే తత్పక్షాస్తా న్భూభృతః కుపితో బలః

తతో హాహా కృతం సర్వం పలాయనపరం ద్విజాః

తద్రాజమండలం సర్వం బభూవ కుపితో బలీ

బలేన నిహతం శ్రుత్వా రుక్మిణం మధుసూదనః

నోవాచ వచనం కించి ద్రుక్మిణీ బలయోర్భయాత్‌

తతోనిరుద్ధమాదాయ కృతోద్వాహం ద్విజోత్తమాః

ద్వారకామాజగామాథ యదుచక్రం సకేశవమ్‌

అంత బలరాముడు కోపముచే కన్నులెర్ర బడ రుక్మిని కొట్టెను. ఎగిరెగిరి పడుచున్న కళింగ రాజును కూడ బలుడు బలముచే బట్టి, వేనిం దెరచి నవ్వెనో యాపండ్ల నూడ గొట్టెను. మఱియు నా జూద మందిర మందున్న బంగారు స్తంభమును లాగి వాని పక్షమున నున్న రాజులను వైచెను. అంతట సభయంతటను హాహా కారము పుట్టి యా రాజమండల మెల్ల బలాయన మయ్యెను. బలరాముడు కోపోద్రిక్తు డయ్యెను. రుక్మి బలునిచే హతు డగుట విని రుక్మిణికి బలరామునకు జడిసి మధువైరి యేమియు బలుక కుండెను. అవ్వల యదు సంఘము పెండ్లి కుమారుని యనిరుద్ధునిం గొని కేశవుని తోగూడ ద్వారకకు వచ్చెను.