బ్రహ్మ మహా పురాణము

193 - కుబ్జోద్ధార వర్ణనమ్‌

రాజమార్గే తతః కృష్ణః సానులేపన భాజనమ్‌

దదర్శ కుబ్జా మాయాంతీం నవయౌవన గోచరామ్‌

తా మహ లలితం కృష్ణః కప్యేద మనులేపనమ్‌

భవత్యానీయతే సత్యం వదేందీవరలోచనే

సకామేనైవ సా ప్రోక్తా సానురాగా హరింప్రతి

ప్రాహసలలితం కుబ్జా దదర్శచ బలా త్తతః

అవ్వల కృష్ణుడు రాజ మార్గము వెంట సుగంధ ద్రవ్య పాత్రను జేకొని వచ్చు చున్న నవ యౌవనశాలిని యగు కుబ్జను జూచెను. ఇందీవ రాక్షి! ఈ యనులేపన మెవఱి కొఱకు గొంపోవు చున్నావు. నిజము జెప్పుమని పలుకరించెను. సాభిలాషముగ హరి ముచ్చటింప నదియు ననురక్తి గొని యా సుందరుని జూచి నంత వివశమైన మనస్సును బలిమియై నిలిపి హరితో సొంపుగ నిట్లు పలికెను.

కుబ్జ:

కాంత కస్తాన్న జానాసి కంసేనాపి నియోజితా

నైకవక్రేతి విఖ్యాతా మనులేపసకర్మణి

నాన్యపిష్టం హి కంసస్య ప్రీతయేహ్యనులేపనమ్‌

భవత్యహబతీవాస్య ప్రసాదధవభాజనమ్‌

కుబ్జ:

“కాంత! నీవేల యెరుగవు. నేను సుగంధ ద్రవ్యాను లేపన కార్యక్రమమున కంసునిచే నియోగింప బడిన దానను. లనేక వక్ర యను బ్రసిద్ది గన్న దానను. కంసునికి నాకూర్చిన కలపము దప్ప ఇతరము ప్రియము కాదు. అతని యనుగ్రహ సంపదకు నేను పాత్రమును”

శ్రీకృష్ణుడు:

సుగంధమేతద్రాజార్హం రుచిరం రుచిరాననే

 ఆవయోర్గాత్ర సదృశందీయతామనులేపనమ్‌

కృష్ణుడు:

 “సుందరముఖి; రాజున కర్హమైన యీ మంచి గంధము మేమిద్దరము పూసికొన దగినది. అది మాకిమ్ము”.

వ్యాసులు:

శ్రుత్వా త మాహసా కృష్ణం గృహ్యతామితి సాదరమ్‌

అనులేపంచ ప్రదదౌ గాత్రయోగ్యమథోభయోః

భక్తిచ్ఛేదాను విప్తాంగౌ తతస్తౌ పురుషర్షభౌ

సేంద్రచాపౌ విరాజంతౌ పితకృష్ణా వివాంబుదౌ

తత స్తాం చిబుకే శౌరిరుల్లాపన విధానవిత్‌

ఉల్లాప్యతోలయామాసద్వ్యంగులేనాగ్రపాణినా

చకర్షపద్బ్యాంచతదా ఋజుత్వంకేశవోనయత్‌

తతః సాఋజుతాం ప్రాప్తాయోషితా మభవద్వరా

వాలాసలలితం ప్రాహ ప్రేమ గర్భభరాలసమ్‌

వస్త్రే ప్రగృహ్య గోవిందం వ్రజ గేహం మమేతివై

ఆయాస్యే భవతీగేహమితి తాంప్రాహకేశవః

విససర్జ జహాసోచ్చై రామస్యాలోక్య చాననమ్‌

భక్తిచ్ఛేదాను లిప్తాంగౌ నీలపీతాంబరావుభే

ధను శ్శాలాంతతోయాతౌ చిత్రమాల్యోపశోభితౌ

అధ్యాస్యచధనూరత్నంతాభ్యాం పుష్టైస్తు రక్షిభిః

ఆఖ్యాతం సహసా కృష్ణో గృహీత్వా పూరయద్ధనుః

తతః పూరయతా తేన భజ్యమానం బలాద్ధనుః

చకారాతి మహాశబ్దం మధురాతేన పూరితా

అనుయుక్తా తతస్తౌచ భగ్నేధనుషి రక్షిభిః

రక్షిసై న్యం నికృత్యోభౌ నిష్క్రాంతౌ కార్ముకాలయాత్‌

వ్యాసులు:

అన నది వెనువెంటన ‘దీసికొమ్మ’ని యాదరముతో వారి కిచ్చెను. వారు చిత్ర చిత్ర రచనలుగా నా గంధమును బూసికొని యింద్ర ధనస్సుతో శోభించు తెల్లని నల్లని మేఘము లట్ల భాసించిరి. అంతట హరి యుల్లాపన నిపుణుడు గావున (మధుర హాస్య వచన రచనా నిపుణుడు గావున) దాని గడ్డము క్రింద జేయి జేర్చి దాని పాదము లందన యదుగులం ద్రొక్కిపట్టి (భక్రుల నుద్ధరించు నెరజాణ గావున) యామెను మీదికెత్తి లీలగ నిట్టట్టు లూచెను. దాన నయ్యింతి మేని మంద్రముగ మా యింటికి రమ్మని పలికి సవిలాసముగ నతని పై వలువ గొని యాకర్షించెను. స్వామి తప్పక వచ్చెద ననెను. ఆ విలాసిని బలభద్రుని వంక నల్లనం గనుచు బిట్టు నవ్వి కృష్ణుని వదలెను. ఆమె యిచ్చిన యామంచి గంధము నయ్యిద్దరు బూసికొని రంగు రంగుల పూల మాలలం దాల్చి నీలాంబర పీతాంబర ధారులై ధనుశ్శాలకుం జనిరి. ధనుర్యాగమునకు నిర్దిష్టమైన ధనుశ్రేష్ఠ మెక్కడ నున్నదని శాలా రక్షకుల నడిగి తెలిసికొని హరి యపుడ దానం గొని యెక్కు పెట్టెను. ఎక్కిడి నది తడవుగ నది విరుగ నెడలిన చప్పుడు మధుర నలు మూలల నలమెను. అవ్విల్లు విరుగుట జూచి శాలా రక్షకులు మీరెవ్వరని ప్రశ్నింప బదులు వలుకకయే యా యన్న దమ్ములు ధనుశ్శాల నుండి వెడలిరి.

ఆక్రూరా గమ వృత్తాంత ముపలభ్యతథా ధనుః

భగ్నంశ్రుత్వాథ కంసోపి ప్రాహచాణూరముష్టికౌ

కంసు డక్రూరుని రాకను రామ కృష్ణులు ధనస్సును విరచుటను విని చాణూర ముష్ఠికులను జూచి

కంసుడు:

గోపాలదారకౌ ప్రాప్తౌ భవద్భ్యాం తౌ మమాగ్రతః

మల్లయుద్ధేన హంతవ్యౌమమ ప్రాణహరౌహితౌ

నియుద్ధే తద్వినాశేన భవద్భ్యాం తోషితోహ్యహమ్‌

దాస్యామ్యభిమతాన్‌ కామాన్నాన్యథై తౌ మహాబలౌ

న్యాయతోన్యాయతోవాపిభవద్భ్యాంతౌ మమాహితౌ

హంతవ్యౌతద్వధా ద్రాజ్యం సామాన్యం వోభవిష్యతి

ఇత్యాదిశ్య స తౌ మల్లౌ తతశ్చాహూయ హస్తిపమ్‌

ప్రోవాచోచ్చై స్త్వయా మత్తః సమాజద్వారికుంజరః

స్థాప్యః కువలయాపీడస్తేన తౌ గోపదారకౌ

ఘాతనీయౌ నియుద్ధాయ రంగద్వారముపాగతౌ

తమాజ్ఞాప్యాథ దృష్ట్వాచ మంచాన్‌ సర్వా నుపాహృతాన్‌

ఆసన్నమరణః కంసః సూర్యోదయముదైక్షత

కంసుడు:

“గోపాల బాలకు లిద్దరు వచ్చినారు. మల్ల యుద్దమున నా ప్రాణమును హరించు వారిని మీరు సంహరింపుడు. అందు వలన నేను సంతోషిం చెదను. న్యాయాన్యాయ విచక్షణ లేకుండ నెట్లైనను మీరు వాండ్రసు గడతేర్ప వలెను. దాన మీకోరిన దెల్ల దీర్చ గలను. వారి వధ వలన నీ రాజ్యము నాకును మీకును నుమ్మడి సొత్తు కాగలదు” అని యా మల్లుర కాజ్ఞ యిడి మావటి వానిం బిలిచి “నీవు మదపు టేనుగును సమాజ ద్వారమున నిలుపుము. కువలయా పీడమను నమ్మదగజము చేత మల్ల రంగ ద్వారమునకు వచ్చిన యా గొల్ల పిల్లలను ద్రొక్కింపుము”. అని యాన యిచ్చి కంసుడు పోగాలము దాపురించిన యా దుష్ఠుడు సూర్యో దయమున కెదురు చూచు చుంచెను.

తతః సమస్త మంచేషు నాగరః స తదా జనః

రాజమంచేషురూఢాః సహభృత్యైర్మహీభృతః

మల్లప్రాశ్నికవర్గశ్చరంగమధ్యే సమీపగః

కృతః కంసేన కంసోపి తుంగమంచే వ్యవస్థితః

అంతఃపురాణాం మంచాశ్చయథాన్యే పరికల్పితాః

అన్యేచ వారముఖ్యానా మన్యే నగరయోషితామ్‌

నందగోపాదయోగోపామంచేష్వన్యేష్వవస్థితాః

అక్రూరవాసుదేవౌచ మంచప్రాంతేవ్యవస్థితౌ

నగరీ యోషితాం మధ్యే దేవకీ పుత్రగర్థినీ

అంతకాలేపి పుత్రస్య ద్రక్ష్యామీతి ముఖం స్థితా

పౌరులు మంచెము లందును రాజులు భృత్యులతో నేగి రాజుల కుచితము లగు మంచెము లందధిష్ఠించిరి. మల్లురు ప్రాశ్నికులు (మధ్య వర్తులు) అ సభా రంగమున నడిమి భాగమున వసించిరి. కంసుడు అందరి కంటె నెత్తైన మంచెము నందు (సోఫా) ఆసీను డయ్యెను. అంతఃపుర జనము వసింప వేర్వేర మంచెము లమర్ప బడెను. వార స్త్రీలకు నొకచో నగరాంగనల కొకచో నందాది గోపకు లొకచో నాసీను లయ్యిరి. అక్రూర వాసుదేవులు ఆ మంచె ప్రాంతమున నుండిరి. పౌరాంగనల నడుమ పుత్ర వాత్సల్య భరిత యగు దేవకి నా బిడ్డ నెమ్మోము తుది గడియలో నైన జూతును గాకయని కూర్చుండెను.

వాద్యమానేషుతూర్యేషు చాణూరే చాతివల్గతి

హాహాకారపలే లోక అస్ఫోటయతి ముష్టికే

హత్వాకువలయాపీడం హస్త్యారోహప్రచోదితమ్‌

మదాసృగనులిప్తాంగౌ గజదంతవరాయుధౌ

మృగమధ్యేయథాసింహౌగర్వలీలావలోకనౌ

ప్రవిష్టౌ సుమహారంగం బలదేవజనార్దనౌ

హాహాకారోమహాన్‌ జజ్ఞే సర్వరంగేష్వనంతరమ్‌ కృష్ణోయంబలభద్రోయమితిలోకస్యవిస్మయాత్‌

సోయం యేన హతా ఘోరా పూతనాసానిశాచరీ

ప్రక్షిప్తం శకటంయేన భగ్నౌచ యమలార్జునౌ

సోయం యఃకాలియం నాగం ననర్తారుహ్య బాలకః

ధృతో గోవర్ధనోయేన సప్తరాత్రం మహాగిరిః

అరిష్ఠోధేనుకః కేశీలీలయైన మహాత్మనా

హతోయేనచదుర్వృత్తో దృశ్యతేసోయమచ్యుతః

ఆయంచాస్యమహాబాహుర్బలదేవోగ్రజ్యోగ్రతః ప్రయాతిలీలయాయోషిన్మనోనయననందనః

ఆయం సకథ్యతే ప్రాజ్ఞైః పురాణార్థావలోకిభిః

గోపాలోయాదవం వంశం మగ్నమభ్యుద్ధరిష్యతి

అయం స సర్వభూతస్య విష్ణోరఖిల జన్మనః

అవతీర్ణో మహీమంశోనూనంభారహరోభువః

ఇత్యేవం వర్ణితే పౌరైరామేకృష్ణేచతత్‌ క్షణాత్‌

ఉర స్తతాపదేవక్యాః స్నేహస్నుతపయోధరమ్‌

మహోత్సవమివాలోక్య పుత్రావేవవిలోకయన్‌

యువేవవాసుదేవో భూద్విహాయాభ్యాగతాం జరామ్‌

విస్తారితాక్షియుగలా రాజాంతఃపురయోషితః

నాగర స్త్రీసమూహశ్చ ద్రష్టుం న విరరామతౌ

ఉత్సవ వాద్యములు మ్రోయ చాణూరు డెగిరెగిరి గంతు లిడుచుండ ముష్ఠికుడు బాహువులు చరచ లోకము హాహాకార మొనరింప మావటీడు తమ మీదికి దోలిన కువలయా పీడమును జంపి దాని మదముచే రక్తముచే శరీరములు పూతవడ దాని దంతములు పెరికి ఆయుధము లుగ ధరించి సగర్వ విలాసమున జూచుచు మృగముల నడుమ మృగరాజు లట్లు బలరామ కృష్ణులు మల్ల రంగమును బ్రవేశించిరి. అంతట నన్ని రంగము లందు నితడే కృష్ణుడు ఇడుగో బలభద్రుడని వింతగొని జనము చేయు ఆహాకారము మిన్నంటెను. “ఘోర రాక్షసిని పూతనను జంపిన యతడే యితడు. శకటాసుర భంజనము యమలార్జు నోన్మూలనము జేసిన యతడు కాళియ ఫణి ఫణాగ్రమున నర్తనము జేసిన యా బాలు డితడే. గోవర్థన మహా గిరిని యేడు రోజులు ఎత్తి పట్టిన బలుదిట్ట యాతడు. అరిష్ట, ధేనుకులను గేశి యను హయమును విలాసముగ జంపిన మహాత్ము డచ్యుతు డీతడే. ఇతని ముందు సవిలాసముగ నీ మల్ల రంగమున పచారు చేయుచున్న సుందరీ నయనా నందనుడు యదు నందనుం డిడుగో! బలరాముడు. ఈ స్వామి హరి పురాణార్ధములను లెస్సగ చూచిన ప్రాజ్ఞులు. గోపాల మూర్తియై కంసునిచే దిగబడి యున్న యదు వంశము నుద్ధరింపగలడని పొగడొందిన బాలు డిడుగొ. ఇతడు సర్వసృష్టి హేతువు సర్వము దానైన విష్ణువు నంశమున నవతరించి భూ భారము హరింప నున్నాడు.” అని యిట్లు బలరామ కృష్ణులను బౌరులు కొనియాడు చుండ దేవకి పాలుచేపుకొన నా బిడ్డలం గని మనసు నందాపము వొందెను. మహోత్సవము చూచు చున్న నెపమున తన పుత్రులనే చూచుచు పై గదిసిన ముదిమిని (వార్ధక్యము) బాసి యువకు డట్లై వసుదేవుడు తనిసెను. శుద్ధాంతః స్త్రీలు నాగర స్త్రీ సమాజము కనుగవ లల్లార్చి యవిరామముగ నా రామ కృష్ణులను దిలకించిరి. మఱియు నిట్లొండొరులతో మురిసి ముచ్చటింప జొచ్చిరి.

స్త్రీలు:

సఖ్యః పశ్యత కృష్ణస్య ముఖమప్యంబుజేక్షణమ్‌

గజయుద్ధకృతాయాసస్వేదాంబు కణికాంచితమ్‌

వికాసీవసరోంభోజ మవశ్యాయ జలోక్షితమ్‌

పరిభూతాక్షరం జన్మసఫలం క్రియతాం దృశః

శ్రీవత్సాంకం జగద్ధామ బాలస్యైత ద్విలోక్యతామ్‌

విపక్షక్షపణం వక్షో భుజయుగ్మంచ భామిని

వల్లతా ముష్టికేనైవ చాణూరేణ తథా పరైః

క్రియతే బలభద్రస్య హాస్యమీష ద్విలోక్యతామ్‌

సఖ్యః పశ్యత చాణూరం ని యుద్ధార్థ మయంహరిః

సముపైతి నసంత్యత్ర కింవృద్ధా యుక్తకారిణః

క్వ యౌవనోన్ముఖీభూతః సుకుమార తనుర్హరిః

క్వ వజ్రకఠినాభోగశరీరోయం మహాసురః

ఇమౌసుఉలలితౌరంగే వర్తేతే నవయౌవనౌ

దైతేయమల్లాశ్చాణూర ప్రముఖాస్త్వతి దారుణాః

నియుద్ధప్రాశ్నికానాంతు మహానేష వ్యతిక్రమః

యద్బాల బలినోర్యుద్ధం మధ్యస్థైః సముపేక్ష్యతే

వ్యాసులు:

ఇత్థం పురస్త్రీలోకస్య వదతశ్చాలయన్‌ భువమ్‌

వవర్ష హర్షోత్కర్షంచ జనస్య భగవాన్‌ హరిః

బలభద్రోపిదాస్ఫోట్యవవల్గ లలితం యదా

పదేపదే తదాభూమిర్న శీర్ణా యత్తదద్భుతమ్ః

సఖులార! కమలము లట్లింపు గొలుపు కృష్ణుని నెమ్మోము గనుడు. ఏనుగు తోడి పెనుగు లాట నొడవిన శ్రమచే గ్రమ్మిన చెమట బిందువులతో హరి వదనము మంచు బిందువులు పైబడిన వికసిత నవాంబుజ మట్లు సొంపు గులుకు చున్నది. అల్లదే చూడుడు. అక్షరము (ఆవినాశి) అయిన పరబ్రహ్మమును మరచి వినశ్వర మగు నీ జగ ద్దృశ్యమును మరిగిన మన యీ జన్మమును మన కన్నులను సఫలములను జేసు కొందము. శ్రీవత్సలాంచితమై సర్వ జగదావాస మై వివక్ష క్షపణమైన (శత్రువులను మట్టువెట్టు) ఈ వీరుని పెడద యురంబును విశాల భుజ యుగమును సఖీ! కన్గొనవె. గంతులిడు ముష్ఠికునితో రంతులు చేయు చాణూరునితో తక్కుంగల మల్లురతో వీరా లాపముల మేలమాడు బలరాముని నెమ్మోము గనరె! సఖులారా. బలు దిట్టయగు చాణూరునితో బసి బాలుడు గోపాలుడు తలపడు చున్నాడు. అన్యాయ మిది యని చెప్ప గల పెద్ద లెవ్వర నిక్కడ లేరా? ఇపు డిప్పుడ యంకురించు యీ వనమున కున్ముఖుడై సుకుమార శరీరుడై యున్న యీ హరి యెక్కడ వజ్ర కఠినమై నిండు మదమెక్కి యుక్కు మిగులు నెమ్మేన యున్న యీమహా రాక్షసు డెక్కడ? పరమ సుకుమారులు చిరుత ప్రాయము వారు గోపాలు రీకంగ మందున్న వారు. వీరితో నుజ్జీగ పరమ రాక్షసులు నతి దారుణులు చాణూరాదులు మల్లు లెదుర నున్నారు. ఈ విపర్యయము నీమర్యాదను ఇటనున్న మధ్యవర్తు లుల్లంగించుట కడు విపరీతము. మధ్యస్థులిది చూచి యుపేక్షించు చున్నారు. అని యిట్లూరక పౌర సుందరులు పరితపించుట గని పుడమి గంపింప హరి చూపరు లకానందో త్కర్షమును వర్షించుచు సమర సన్నద్దు డయ్యెను. బలరాముడును బాహువులు చరచి చక్కగ నిటునిటు దూకి నంతట నడుగడుగున నవని పగులు పడ వలసిన దట్లుగా కుండుట యదియు నొక యద్భుత మయ్యెను.

చాణూరేణ తతః కృష్ణో యుయుధ్యేమితవిక్రమః

నియుద్ధ కుశలో దైత్యో బలదేవేన ముష్టికః

సంనిపాతావధూతైశ్చచాణూరేణ సమంహరిః

క్షేపణైర్ముష్టిశ్చైవ కీలీ వజ్రనిపాతనైః

పాదోద్ధూతైః ప్రమృష్టాభి స్తయోర్యుద్ధమభూన్మహత్‌

అశస్త్రమతియోరం తత్తయోర్యుద్ధం సుదారుణమ్‌

స్వబలప్రాణనిష్పాద్యం సమాజోత్సవసంవిధౌ

యావద్యావచ్చచాణూరో యుయుధేహరిణాసహ

ప్రాణహానిమవాపాగ్ర్యాం తావత్తావన్న బాంధవమ్‌

కృష్ణోపియుయుధేతేన లీలయైవ జగన్మయః

అంతట చాణూరునితో కృష్ణుడును మల్లయుద్ధ విశారదుడైన ముష్టికుడు బలదేవుని తోను దలవడిరి. ఒండొరులం దూరముగ విసరుట గ్రుద్దుట పట్టుగ దచినంత చేబట్టి దిగ నడచుట బాదము లందన్నుట మర్దించుట మొదలగు మల్లయుద్ద భంగిములచే వారి కస్త్రములు లేని యతి ధారుణమైన సమర మయ్యెను ధనుర్యాగోత్సవ మందు దన బల ప్రాణములచే నెంతెంత సేయ గలదో అంతకు చుట్టరిక మని లేకుండ బోరెను. జగదంత ర్యామియైన కృష్ణుడును వానితో విలాస మాత్రము గనే పోరెను.

ఖేదాచ్చాలయతాకోపాన్నిజశేఫకరే కరమ్‌

బలక్షయం వివృద్ధించ దృష్ట్వా చాణూర కృష్ణయోః

వారయమాస తూర్యాణి కంసః కోపపరాయణః

మృదంగాదిషువాద్యేషు ప్రతిషిద్ధేషు తత్‌ క్షణాత్‌

అంతట కంసుడు ఖేదాత్‌ = ఖేదము వలన నిజ = తన యొక్క శేష= వధను కరం= చేయ నున్న కరం= చేతిని చాలయతా= చలింప జేయుచున్న కృష్ణుచే గల్గిన కోపాత్‌ = కోపము వలనను (అనగా కృష్ణుడు విజృంభించి చేయు భీషణ మైన యుద్ధము చూచి నందు వలన గల్గిన బాధ వలనను తనను జంపనున్న హస్తమును పాము పడగ నట్లోడించు చున్న కృష్ణుని యెడల నుడుకు మోతు తనము వలన గల్గిన క్రోథము వలనను) చాణూరుని యందు బలక్షయమును కృష్ణుని యందు బలవృద్దినిం జూచి యుద్ధ వాద్యముల నాపు చేసెను. మృదంగాది వద్యము లట్లాప బడినంత నాక్షణము నాకస మందలి దేవ వాద్యములు (దుందుభులు మొద లయినవి) భోరన మ్రోసినవి.

ఖసంగతాన్య వాద్యంత దైవతూర్యాణ్యనేకశః

జయగోవింద చాణూరం జహి కేశం దానవమ్‌

ఇత్యంతర్ధిగతాదేవాస్తుష్టువుస్తే ప్రహర్షితాః

చాణూరేణచిరంకాలం క్రీడిత్వా మధుసూదనః

ఉత్పాట్య భ్రామయామాస తద్వధాయ కృతోద్యమః

భ్రామయిత్వా శతగుణం దైత్యమల్లమమిత్రజిత్‌

భూమా వాస్ఫోటయామాస గగనే గతజీవితమ్‌!

భూమావాస్ఫోటిత ప్తేన చాణూరః శతధా భవన్‌

రక్తస్రావ మహాపంకాం చకార సతదా భువమ్‌

జయింపుము గోవింద! చాణూరుని సంహరింపుము కేశవ యీ దానవుని అని అంతర్థాన గతులై వేల్పు లానంద మంది హరిని స్తుతించిరి. మధుసూదనుడు చాలసేపు చాణూరునితో నాడికొని తుదముట్టింప దలచి వాని లేవనెత్తి యంతకు నూఱుఱెట్లు యూపున గిరగిరం ద్రిప్పి గగన మంద ప్రాణములు వాసిన వానిం బుడమిపై విసరి వేసెను. ఆ వ్రేటున వాడు నూరు వ్రక్కలై రక్త స్రావము సేసికొని యా నేలనెల్లం బెను బెందడి గావించెను.

బలదేవస్తు తత్కాలం ముష్టికేన మహాబలః

యయుధే దైత్యమల్లేన చాణూరేణ యథాహరిః

సోప్యేనం ముష్టినా మూర్థ్ని వక్షస్యాహత్య జానునా

పాతయిత్వా ధరాపృష్ఠే నిష్పిపేష గతాయుషమ్‌

కృష్ణస్తోశలకం భూమౌ మల్లరాజం మహాబలమ్‌

వామముష్టి ప్రహారేణ పాతయామాస భూతలే

చాణూరే నిహతే మల్లేముష్ఠికేచ నిపాతితే

నీతే క్షయం తోశలకే సర్వే మల్లాః ప్రదుద్రువుః

వవల్గతు స్తదా రంగే కృష్ణ సంకర్షణావుభౌ

సమానవయసో గోపాన్‌ బలాదాకృష్య హర్షితౌ

కంసోపి కోపరక్తాక్షః ప్రాహోచ్చైర్వ్యాయతాన్నరాన్‌

గోపావేతౌ సమాజౌఘాన్నిప్ర్కమ్యేతాం బలా దితః

నందోపిగృహ్యతాం పాపో నిగడై రాశుబధ్యతామ్‌

అవృద్ధార్హేణ దండేన వసుదేవోపి వధ్యతామ్‌

వల్గంతిగోపాః కృష్ణేన యే చేమే సహితాః పునః

గావో హ్రియంతామేషాంచ యచ్చాస్తివసుకించన

బలదేవుండును చాణూరునితో హరి యట్ల ముష్టికునితో బోరెను. అతడును వీని ముష్టిచే నడి తల నడచి మోకాలను ఱొమ్మునం బొడిచి పుడమిపై బడవేసి ప్రాణములు వోవగా అఱచెను. కృష్ణు డెడమ పిడికిలిం గ్రుద్ది మల్లవీరుని మహాబలుని నవ్విధమున భూతల మునం బడనేసెను. చాణూరుడు నిహతుడు కాగా ముష్టికుడు గూల్ప బడగా నెల్ల మల్లురుం బారి పోయిరి. అపుడు కృష్ణ సంకర్షణు లిద్దరు నవ్వీర విహారమున తమ యీడు వారలం బలాత్కార ముగ నాకర్షించి యారంగ భూమిపై గుప్పించి గంతులు వెట్టిరి. అంతట గంసుడు గినుకచే గను లెఱ్ఱవడ యట చెదఱి యున్న తన మనుజులతో ఈ గోపకుల నిద్దరినీ సమాజము గుంపు నుండి బలత్కారమున గెంటి వేయుడు. పాపాత్ము నందుని నిప్పుడ సంకెళ్ళం బంధింపుడు వృద్ధుల కుచితము గాని దండనమున వసుదేవుం గూడ గట్టి వేయుడు? కృష్ణునితో నెగి రెగిరి గంతులు నెట్టు నీ గొల్లల గో ధనములను గొల్లగొట్టు డనియె.

ఏవమాజ్ఞాపయంతం తంప్రహస్యమధుసూదనః

ఉత్సత్యారుహ్య తన్మంచం కంసం జగ్రాహవేగతః

కేశేష్వాకృష్యతవిగలత్కిరీట మవనీతలే

స కంసం పాతయామాస తస్యోపరి పపాతచ

నిశ్శేష జగదాధారగురుణా పతతోపరి

కృష్ణేన త్యాజితః ప్రాణా న్నుగ్రసేనాత్మజో నృపః

మృతస్య కేశేషు తదాగృహీత్వా మధుసూదనః

చకర్ష దేహం కంసస్య రంగమధ్యే మహాబలః

గౌరవేణాతిమహతా పరిపాతేన కృష్యతా

కృతా కంసస్యదేహేన వేగితేన మహాత్మనా

కంసే గృహీతే కృష్ణేన తద్ర్భతాభ్యాగతోరుషా

సునామా బలభద్రేణ లీలయేవ నిపాతితః

తతోహాహాకృతం సర్వమాసీత్త ద్రంగ మండలమ్‌

అవజ్ఞయా హతం దృష్ట్వా కృష్ణేన మధురేశ్వరమ్‌

కృష్ణొపి వసుదేవస్య పాదౌ జగ్రాహ సత్వరమ్‌

దేవక్యాశ్చ మహాబాహుర్బలదేవసహాయవాన్‌

ఉత్థాప్యవసుదేవస్తు దేవకీచ జనార్దనమ్‌

స్మ్పతజన్యోక్తవచనౌ తా వేవ ప్రణతౌ స్థితౌ

ఇట్లాజ్ఞయిచ్చు నా కంసుని గని యల్లన నవ్వి మధుసూదనుడు మీదికిం దూకి యమ్మంచ మెక్కి కంసునిం బట్టి జుట్టు వట్టిలాగి కిరీటము దొలగి యిలపై బడ వానిం బడవైచి వానిపై బడెను. ఎల్ల జగముల కాధార మైన బరువుచే మీద బడిన కృష్ణునిచే నయ్యుగ్ర సేని (ఉగ్రసేనుని కొడుకు) కంసరాజు ప్రాణములం బాసెను. చచ్చిన వాని కేశములం బట్టి కేశవుడు వాని దేహము నారంగ మధ్య మందు బరబర యీడ్చి వైచెను. సహజముగ నది పెద్దది బరువైనది క్రోధముచే మఱియు బరు వెక్కినది అగు కంసుని శరీరము మహాత్మడగు కృష్ణునిచే గూల్పబడి కడు వేగమున నీడ్వ బడినది కూడ. అది చూచి వాని తమ్ముడు సునిము డెత్తి రాగ బలభద్రుడు లీలగ వాని బడగొట్టెను. హరిచే నవమానము నకు గురియై మధురా ధీశ్వరుడు కంసుడు హతుడౌట గని యారంగ మండప మెల్ల హాహాకారముల నిండి పోయెను. కృష్ణుడును వెను వెంటనే బలరామునిలో చని దేవకీ వసుదేవుల పాదములం బట్టు కొనెను. వసుదేవుడు దేవకియుం జనార్దను నెత్తి జన్మ సమయ మున (పురిటింట) స్వామి పల్కిన పల్కులం దలచి కొని వారే వారికి ప్రణతులై నిలిచిరి. అయ్యెడ వసుదేవుడా ప్రభువు నిట్లు వినుతించెను.

వసు దేవుడు:

ప్రసీద దేవదేవేశదేవానింప్రవర ప్రభో

తథావయోః ప్రసాదేప కృతాభ్యుద్ధార కేశవ

ఆదాధితోయద్‌ భగవా నవతీర్ణో గృహేమమ

దుర్వృత్తనిధనార్ధాయ తేన నః పావితం కులమ్‌

త్వమంతః సర్వభూతానాం సర్వభూతే ష్వవస్థితః

వర్తతేచ సమస్తాత్మం స్త్వత్తో భూతభవిష్యతీ

యజ్ఞే త్వమిజ్యసేచింత్య సర్వదేవమయా చ్యుత

త్వమేవ యజ్ఞా యజ్వాచ యజ్ఞానాం పరమేశ్వర

సాపహ్నవం మమ మనో యదేతత్త్వ యి జాయితే

దేవక్యాశ్చాత్మజప్రీత్యా తదత్యంత విడంబనా

త్వంకర్తాసర్వభూతానా మనాదినిధనో భవాన్‌

క్వచమే మానుష స్యైషా జిహ్వా పుత్రేతి వక్ష్యతి

జగదేత జ్జగన్నాధసంభూత మఖిలం యతః

కయా యుక్త్యా వినామాయాంసోస్మత్తః సంభవిష్యతి

యస్మిన్‌ ప్రతిష్ఠితం సర్వం జగత్‌ స్థావర జంగమం

సకోష్ఠోత్సంగ శయనోమనుష్యాజ్జాయతే కథమ్‌

సత్యం ప్రపీద పరమేశ్వరపాహి విశ్వమంశావతారకరణైర్న మమాసిపుత్రః

ఆబ్రహ్మపాదపమయం జగదీశ సర్వం చి త్తేవిమోహయసి కిం పరమేశ్వరాత్మన్‌

మయావిమోహితదృశా తన యోమమేతి కంసాద్‌ భయం కృతవతా తుమయాతి తీవ్రమ్‌

నీతోసి గోకుల మరాతి భయాకులస్య వృద్ధింగతోసి మమచైవ గవామధీశ

కర్మాణి రుద్రమరుదశ్వితక్రతూనాం సాధ్యాని యాని నభవంతి నిరీక్షితాని

త్వం విష్ణురీశజగతా ముపకారహేతోః ప్రాప్తోసి నః పరిగతః పరమో విమోహః

వసుదేవ కృత కృష్ణ స్తుతి

స్వామి! ప్రసన్నుడౌము సురవంద్య సురేశ్వర! మాకునై కదా

యీమహి నుద్ధరింప భజియింపగ నేము ననుగ్రహింపcగా

దామఱి నిగ్రహింప ఖలులందఱ మా గృహమందుc బుట్టినా

వో మహనీయ! మాకుల మహో! యిది పావన మయ్యెరా హరీ!

భూతము లన్నిటం గలవు భూతము లన్నిట నంతరాత్మవున్‌

భూత భవిష్య మిప్పుడు ప్రభూ! జఱుగుంగద నీదు చేతనే

నేతవు నీవు యజ్ఞమును నీవ యజించుట నీవ యజ్ఞమం

దాతతమైన ద్రవ్యనుది యైనను నీవ పరాత్పరా! హరీ!

నామనసేని దేవకి మనన్ముదియున్‌ నిను బిడ్డ వంచు న

జ్ఞానమునం బడెన్‌ నిజము చాటెద! కర్తవు నీద భర్తవున్‌

దేనికి మొదల్తుదయు దేవరకుం గనరావు మానుష

మ్మౌనొక నాల్క పుత్రియని యర్భక యంచిది పిల్చు నంతియే

జగముల కెల్లనుం బ్రభువ! సర్వ జగమ్మిది మాయగాక వే

రగు మఱి యేమియు క్తినిది యైనది అయ్యెడ నీవు మాకుcగ

ల్గగ సబబేమి! సృష్టిసక లమ్మిట చుట్టిన దున్న చట్టిసౌ

భగము మనుష్య కోష్ఠమున బావురె యయ్యొడి నుంట యెట్లనే

ఇట్టడ వీవు పాహి పరమేశ్వర విశ్వము; విష్ణునంశమై

పట్టివి గావునాకు విను బ్రహ్మ మొదల్మఱి చెట్టు పుట్టదా

కట్టిమమున్‌ విమోహమున నర్భకుడం చనిపించు మాయ యా

కట్టిడి చేcత చిట్టులికి గాసిలితిం డయcజూడవే హరీ!

కన్నులcగ్రమ్ము మాయ నను గన్నయ వీవని కంసభీతి నా

వన్నత చెంది వారి పరివారముచే నట జేరినాడ నో

యన్న యట్లైన నాతలపునం దొకయించుక యేని దొలంగ కీ

వున్నది నిక్క మీశ్వర! ఆహో! జగదీశ్వర! గోకులేశ్వరా!

రుద్రమరుత్తు లశ్వినులు రూఢిశతక్రతుముఖ్యులేని ని

ర్నిద్రులు సేయలేని కననేరని వింతలు సేసినావు సా

ముద్రికమేటికిం దడవ భూమిపయిం దిగినావు విశ్వమున్‌

భద్రమొనర్ప విష్ణువవు పాహి హరీ! తలcగెన్‌ విమోహమున్‌