బ్రహ్మ మహా పురాణము

178 - కండూపాఖ్యానమ్‌

వ్యాసులు:

తస్మిన్‌ క్షత్రేమునిశ్రేష్ఠాః సర్వసత్త్వసుఖావహే

ధర్మార్థకామమోక్షాణాం ఫలదేపురుషోత్తమే

క డుర్నామ మహాతేజా ఋషిఃపరమధార్మికః

సత్యవాదీ శుచి ర్దాంతః సర్వభూతహితే రతః

జితేంద్రియో జితక్రోధో వేదవేదాంగపారగః

అవాపపరమాం సిద్ధి మారాధ్యపురుషోత్తమమ్‌

అన్యేపితత్రసంసిద్దా మునయః సంశితవ్రతాః

సర్వభూతహితా దాంతా జితక్రోధా విమత్సరాః

వ్యాసులు:

ఓ మునీశ్వరులారా! సర్వజీవి సుఖకర మైనది సర్వ పురుషార్థము లిచ్చునదియు నైన యా పురుషోత్తమ క్షేత్రమున “కండువు” అను నొక ఋషి పరమ ధర్మాత్ముడు తేజస్వి సత్యవాది శుచి ఇంద్రియముల నిగ్రహించిన వాడు సర్వభూత హితువు కోరువాడు క్రోధము లేనివాడు వేద వేదాంగ పారంగదుడు నై వసించు చుండెను. అతడు పురుషోత్తము నారాధించి పరమ సిద్ధి నందెను. అట్టి వారే మఱి పెక్కుమంది మునులు నతని వలె ముక్తి నందిరి.

మునులు:

కోసౌ కండుః కథవ తత్ర జగామ పరమాం గతిమ్‌

శ్రోతుమిచ్ఛామహేతస్య చరితంబ్రూహిసత్తమ

అన మునులు ఈ కండువెవరు? అచట పరమ గతి నెట్లందెను? ఆచరిత్ర విన వలతుమన వ్యాసులిట్లనిరి.

వ్యాసులు:

శృణుధ్వం మునిశార్థూలాః కధాం తస్యమనోహరామ్‌

ప్రవక్ష్యామి సమాసేన మునే స్తస్య విచేష్టితమ్‌

పవిత్రే గౌతమీతరే విజనే సుమనోహరే

కందమూలఫలైః పూర్ణే సమిత్పుష్పకుశాన్వితేః

నానాద్రుమలతాకీర్ణే నానాపుష్పోపశోభితే

నానాపక్షిరుతేరమ్యే నానామృగ గణాన్వితే

తత్రాశ్రమపదం కండో ర్బభూవ మునిసత్తమాః

సర్వర్తు ఫల పుష్పాఢ్యం కదళీషండ మండితమ్‌

తపస్తేపేముని స్తత్ర సుమహత్పరమాద్బుతమ్‌

వ్రతోపవాసై ర్నియమైః స్నానమౌనసు సంయమైః

గ్రీష్మే పంచతపా భూత్వా వర్షాసు స్థండిలేశయః

ఆర్థ్రవాసాస్తుహేమంతే సతేపే సుమహత్తపః

దృష్ట్వా తు తపసోవీర్యం మునే స్తస్య సువిస్మితాః

బభూవుర్థేవగంధర్వాః సిద్ధవిద్యాధరా స్తథా

భూమింతథాన్తరిక్షం చ దివం చ మునిసత్తమాః

కండుః సంతాపయామాస త్రైలోక్యంతపసోబలాత్‌

అహోస్య పరమం ధైర్య మహోస్య పరమం తపః

ఇత్యబ్రువంస్తదా దృష్ట్వా దేవా స్తం తపసిస్థితమ్‌

మంత్రయామాసు రవ్యగ్రాః శక్రేణసహితా స్తదా

భయా త్తస్య సముద్విగ్నా స్తపోవిఘ్నమభీప్సవః

జ్ఞాత్వాతేషామభిప్రాయం శక్రస్త్రిభువనేశ్వరః

ప్రమ్లోచాఖ్యాం వరారోహాం రూపయౌవన గర్వితామ్‌

సుమధ్యాం చారుజంఘాం తాం పీనశ్రోణిపయోధరాం

సర్వలక్షణ సంపన్నాం ప్రోవాచబలసూదనః

వ్యాసులు:

మునులారా! ఇదె వినుండు. పవిత్రమైన గొమతీ నదీ తీరమందు కంద మూల ఫల సమృద్ధము సమిత్పుష్ట కుశ సంపూర్ణము నైన పుణ్యాశ్రమము కండుముని నివాస మయ్యెను. అది సర్వర్తు ఫల పుష్ప శోభితము. అందాయన యమ నియమాదులతో మౌనముతో దప మాచరించు చుందెను. గ్రీష్మ ఋతువున పంచాగ్ని మధ్యమున వర్షా కాలమున ఆవరణము లేని యెడ దడి బట్టలతో చలి కాలములో మహాతప మాచరించెను. అది చూచి ఈయన తపస్సు వేడిమికి భూమి అంతరిక్షము స్వర్గము గూడ నుడికేత్తినవి. ఆహా! ఈయున ధైర్యమేమి ఈ తపస్సేమి అని దేవతలు వెరగంది యందరు నాయన తపము భంగము గావింత మని నిశ్చయించిరి.

శక్రుడు:

ప్రమ్లోచే! గచ్ఛశీఘ్రంత్వం యదాసౌతప్యతేమునిః

విఘ్నార్థంతస్యతపసః క్షోభయస్వాశు సుప్రభే

శుక్రుడు:

వారి తల పెఱింగి యింద్రుడు ప్రమ్లోచ యను నప్సరసను పరమ సుందరిని జూచి భామినీ! కండు ముని తప మాచరించు తావున కిప్పుడు చనుము. ఆతని తపమ్ము చెరచి క్షోభింప జేయు మనియె.

ప్రమ్లోచ:

తవవాక్యంసుర శ్రేష్ఠ! కరోమి సతతం ప్రభో

కింతుశంకా మమైవాత్ర జీవితసప్య చ సంశయః

బిభేమి తం మునివరం బ్రహ్మచర్యవ్రతే స్థితమ్‌

ఆత్యుగ్రం దీప్తతపసం జ్వలనార్క సమప్రభమ్‌

జ్ఞాత్వామాం స మునిః క్రోధాద్విఘ్నార్థం సముపాగతామ్‌

కండుః పరమతేజస్వీ శాపందాస్యతి దుఃసహమ్‌

ఊర్వశీమేనకా రంభాఘృతాచీ పుంజికస్థలా

విశ్వాచీ సహజన్యా చ పూర్వచిత్తిస్తిలోత్తమా

అలంబుషా మిశ్రకేశీ శశిలేఖా చ వామనా

అన్యాశ్చాప్సరసః సంతి రూప యౌవన గర్వితాః

సుమధ్యాశ్చారువదనాః బీనోన్నతపయోధరాః

కామప్రధాన కుశలా స్తా స్తత్రైవంని యోజయ

ప్రమ్లోచ:

ఆమె ప్రభూ! నీ యాజ్ఞ తప్పక సేసెదను కాని యిక్కడ నాకు జీవిత సంశయ మేర్పడినది. బ్రహ్మచర్య నిష్ఠుడగు నమ్మునిని మహ్రోగ్ర తపస్విని అగ్ని సూర్యులట్లు వెలుగు వానినిగ నెఱిగిన దానం గావున జడియు చున్నాను. అతడు దుస్సహ మయిన శాపమీయ గలడు. ఏలిన వారి యానలో ఊర్వశ్యాదు లెందరో యప్సరసలు న్నారు. వారు సుందరులు నెఱ జాణలు. ఎవ్వని నేని మోహింప జేయగల నేర్పరులు. వారి నాపనిలో నియోగింపు మనెను.

బ్రహ్మ:

తస్యాస్తద్వచనం శ్రుత్వా పునఃప్రాహ శచీపతిః

తిష్ఠంతునామ చాన్యాస్తా స్త్వంచాత్రకుశలాశుభే!

కామం వసంతం వాయుంచ సహాయార్థే దదామితే

తై స్సార్థం గచ్ఛసుశ్రోణి! యత్రాస్తే సమహామునిః

శక్రస్య వచనం శ్రుత్వా తదా సా చారులోచనా

జగామాకాశ మార్గేణ త్సై సార్థం చాశ్రమం మునేః

గత్వాసాతత్ర రుచిరం దదర్శ వనము త్తమమ్‌

మునించ దీప్తతపస మాశ్రమస్థ మకల్మషమ్‌

అపశ్యత్సా వనం రమ్యం తై స్సార్థం నందనోపమ్‌

సర్వర్తువరపుష్పాఢ్యం శాఖామృగ గణాకులమ్‌

పుణ్యం పద్మబలోపేతం సపల్లవ మహాబలమ్‌

శ్రోత్ర రమ్యా న్సుమధురాన్‌ శబ్దా న్ఖగముఖేరితాన్‌

సర్వర్తు ఫల భారాఢ్యా స్సర్వర్తు కుసుమోజ్జ్వలాన్‌

అపశ్యత్పాదపాంశ్చైవ విహంగై రనునాదితాన్‌

ఆమ్రా నామ్రాతకా న్భవ్యాన్నారికేళాన్సతిందుకాన్‌

అథ బిల్వాం స్తతా జీవా న్దాడిమాన్బీజపూరకాన్‌

పనసాన్‌ లకుచాన్నీపాన్ శిరీషా న్సుమనోహరాన్‌

పారావతాం స్తథా కోలా నరిమేదామ్లేవేతసాన్‌

భల్లాతకానామలకాన్‌ శతపర్ణాంశ్చ కింశుకాన్‌

ఇంగుదాన్కరవీరాంశ్చ హరీతక విభీతకాన్‌

ఏతానన్యాంశ్చ సా వృక్షాన్‌ దదర్శ పృథులోచనా

తథై వాశోక పున్నాగ కేతకీవకులానథ

పారిజాతాన్కో విదారాన్మందారేందీవరాం స్తథా

పాటలాః పుష్పితా రమ్యా దేవదారుద్రుమాం స్తథా

సాలాంస్తాలాం స్తమాలాంశ్చ నిచులాన్‌ లోమకాంస్తథా

అన్యాంశ్చ పాదపశ్రేష్ఠానపశ్యత్ఫల పుష్పితాన్‌

చకోరైః శతపత్రైశ్చ భృంగరాజైస్తథా శుకైః

కోకిలైః కలవింగైశ్చ హాకతైర్జీవజీవకైః

ప్రియపుత్రై శ్చాతకైశ్చ తథాన్యై ర్వివిధైఃఖగైః

శ్రోత్రరమ్యం సుమధురం కూజద్భిశ్చాప్యధిష్ఠితాన్‌

సరాంసి చ మనోజ్ఞాని ప్రసన్నసలిలారనిచ కుముదైః

పుండరీకైశ్చ తథానీలోత్పలైశ్శుభైః

కల్హారైః కమలైశ్చైవ ఆచితాని సమంతతః

కాదంభైశ్చక్రవాకైశ్చ తథైవ జలకుక్కుటైః

కారండవై ర్భకైర్హంసైః కూర్శైర్మద్గుభిరేవచ

ఏతైశ్చాన్యైశ్చకీర్ణాని సమంతాజ్జలచారిభిః

క్రమేణైవ తథాసాతు వనం బభ్రామ తైః సహ

ఏవం దృష్ట్వా వనం రమ్యంతైః సార్థం పరమాద్బుతమ్‌

విస్మయోత్ఫుల్లనయనా సా బభూవ వరాంగనా

ప్రోవాచ వాయుం కామం చ వసంతం చ ద్విజోత్తమాః

ప్రమ్లోచ:

కురుధ్వం మమ సాహాయ్యం యూయం సర్వే పృథక్పృథక్‌

బ్రహ్మ:

ఆమె మాట విని యింద్రుడు, ఎందరో ఉందురు గాక! ఇక్కడ నీవే నేర్పరివి. నీకు మన్మథుని వాయువును గూడ తోడొసంగెద నీవేగుమను నా ప్రమ్లోచ యాకసమున నమ్మున్యాశ్రయమునకుం జనియె. అచ్చట నొక సుందర వన మీక్షించెను. అందాశ్రమ మందున్న యమ్మునిం జూచెను. అయ్యాశ్రమో ప్రాంత మందలి యా వనము శోభ నిరుపమానము, సర్వ పుష్ప ఫల భరితము సర్వర్తు శోభనము. అందలి పావురములు కోవెలల యొక్క కల కూజితములు శ్రవణ మనోహరములు ఆ విశాల నయన యాయందమును చేరి పాఱజూచి యమ్మధుర నాదములు విని ప్రసన్న సలిలము లైన కొలనులం జూచి వనంతాదులతో మీరందఱు నాకు దోడ్పడుడని హెచ్చరించెను.

బ్రహ్మ:

ఏవముక్త్వా తదా సాతు తథేత్యుక్తా సురైర్ద్విజాః

ప్రత్యువాచాద్య యాస్యామి యత్రాసౌ సంస్థితో మునిః

అద్య తం దేహయంతారం ప్రయుక్తేంద్రియ వాజినమ్‌

స్మర శస్త్రగళద్రశ్మిం కరిష్యామి కుసారథిమ్‌

బ్రహ్మోజనార్దనో వాపియది వా నీలలోహితః

తథాప్యద్య కరిష్యామి కామబాణక్షతాంతరమ్‌

ఇత్యుక్త్వా ప్రయయౌ సాథ యత్రాసౌ తిష్ఠతే మునిః

మునేస్తపః ప్రభావేణ ప్రశాంత శ్వాపదాశ్రమమ్‌

సా వుంస్కోకిల మాధుర్యే నదీతీరే వ్యవస్థితా

స్తోకమాత్రం స్థితా తస్మా దగాయత వరాప్సరాః

తతో వసంతః సహసా బలం సమకరోత్తదా

కోకిలారావ మధుర మకాలిక మనోహరమ్‌

వవౌ గంధవహశ్చైవ మలాయాద్రి నికేతనః

పుష్పానుచ్చావచాన్మేధ్యా న్పాతయంశ్చ శనై శ్శనైః

పుష్పబాణధరశ్చైవ గత్వా తస్య సమీపతః

మునేశ్చ క్షోభయామాస కామ స్తస్యాపి మానసమ్‌

తతో గీతధ్వనిం శ్రుత్వా మునిర్వస్మిత మానపః

జగామ యత్ర సా సుభ్రూః కామబాణప్రపీడితః

దృష్ట్వా తామాహ సందృష్టో విస్మయోత్పుల్లలోచనః

భ్రష్టోత్తరీయో వికలః పులకాంచిత విగ్రహః

బ్రహ్మ:

ఇట్లని వారిచే నౌనని పించుకొని యిప్పుడ యమ్ముని చెంత కేగెదను. శరీర రథమును నింద్రియములను గుఱ్ఱముచే నిగ్రహించిన యాతని పూవిలుతు నమ్ములచే పగ్గముల బిగువు సడలింజేసి జ్జేతగాని సారథిం గలవాని బోలె జేసెదను. బ్రహ్మ జనార్దనుడు శివు డయినను నగు గాక నీ క్షణములో కామ బాణక్షతుని గావించెద నని యమ్ముని ప్రశాంతాశ్ర మందు నిలిచి యల్లల్లన సంగీతము పాడ నారంభించెను. అంతట వసంతుడు తన బలగముల గూర్చికొని యకాలిక మధుర కోకిలా రావము మేళవింప జేసెను. గంధ వహుడు (వాయువు) మలయాద్రి నుండి యల్లల్లన వీవందొడంగె. అంతియ కాదవ్వన సీమ నల్గడల నా చెట్లునుం పూవులం జలజల రాల్చెను. మదనుడు పూవు టమ్ముల నమ్ముని మనస్సును గలగుండు పరచెను. అంత కండువా సంగీత ధ్వని నాలకించి వింతగొని యావిడ యున్న తావున కేగి యా సొగసులాడి సోయగమున కచ్చెరు వడి తేఱిపాఱ జూచి పైవలువ జార మేను గగుర్బోడవ మది చెదరి యల్లన నిట్లు పలుకరించె.

ఋషి:

కాసి కస్యాసి సుశ్రోణి! సుభగే! చారుహాసిని!

మనోహరసి మే సుభ్రు బ్రూహి సత్యం సుమధ్యమే

ఋషి:

ఓ సుందరి! నీవెట నుండు దానవు ఎవరి దానవు నా మనను జూరగొను చున్నావు. నిజము తెల్పుమన నామె నీదాన్యము సేసెదను.

ప్రమ్లోచ:

తవ కర్మకారా చాహం పుష్పార్థమహమాగతా

ఆదేశం దేహి మేక్షిప్రం కిం కరోమి తవాజ్ఞయా

ప్రమ్లోచ:

పువుల కోఱకు వచ్చితిని. నావలనం బనిగొనుము నీ యాజ్ఞ నిప్పుడు నిర్వ హింతును.

వ్యాసులు:

శ్రుత్వైవం వచనం తస్యాస్త్యక్త్వా ధైర్యం విమోహితః

ఆదాయ హస్తే తాం బాలాం ప్రవివేశ స్వమాశ్రమమ్‌

తతః కామశ్చ వాయుశ్చ వసంతశ్చ ద్విజోత్తమాః

జగ్ముర్యథాగతం సర్వే కృతకృత్యా స్త్రివిష్టపమ్‌

శశంసుశ్చ హరిం గత్వా తస్యాస్తస్య చ చేష్టితమ్‌

శ్రుత్వా శక్రస్తదా దేవాః ప్రీతాః సుమససోభవన్‌

వ్యాసులు:

అన విని ముని మోహము గొని ధైర్యమెడలి యామెం జేత బట్టుకొని తన యాశ్రమముం జొచ్చెను. అవ్వల బువ్విలు కాడు వాయువు వనంతుడు నిట్లు తమ పని చక్క వెట్టికొని వచ్చిన దారి నమరపురి కరిగిరి. అతని యొక్కయు నామె యొక్కయు సమావేశ వృత్తాంతము నింద్రున కేరింగించిరి. సురపతియు సురలు నది విని ప్రీతిసెందిరి.

సచ కండుస్తయా సార్ధం ప్రవిశన్నేవ చాశ్రమమ్‌

ఆత్మనః పరమం రూపం చకార మదనాకృతి

రూప యౌవన నంపన్న మతీవసుమనోహరమ్‌

దివ్వాలంకార సంయుక్తం షోడశాబ్దవయోమితం

దివ్య వస్త్రధరం కాంతం దివ్యస్రగ్గంధభూషితమ్‌

సర్వోప భోగసంపన్నం సహసా తపసో బలాత్‌

దృష్ట్వా సా తస్య తద్వీర్యంపరం విస్మయమాగతా

ఆహోస్య తపసో వీర్య మిత్యుక్త్వా ముదితాభవత్‌

స్నానం సంధ్యాం జపం హోమం స్వాధ్యాయం దేవతార్చనమ్‌

వ్రతోప వాసనియమం ధ్యానం చ మునిసత్తమాః

త్యక్త్వా స రేమే ముదితస్తయా సార్ధమహర్నిశమ్‌

మన్మథా విష్టహృదయో న బుబోధ తపః క్షయమ్‌

సంధ్యారాత్రి దివాపక్ష మాసర్త్వయన హాయనమ్‌

న బుబోధ గతం కాలం విషయాసక్త మానసః

సా చ తాం కామజైర్భావై ర్విదగ్ధా రహసి ద్విజాః

వరయామాస సుశ్రోణిః వ్రలాపకుశలా తదా

ఏవం కండుస్తయా సార్ధం వర్షాణామధికం శతమ్‌

అతిష్ఠన్మందరద్రోణ్యాం గ్రామ్యధర్మరతో మునిః

సా తం ప్రాహ మహాభాగం గంతుమిచ్చామ్యహం దివమ్‌

ప్రసాద సుముఖో బ్రహ్మన్ననుజ్ఞాతుం త్వమర్హసి

తయైవ ముక్తః సముని స్తస్యా మాసక్త మానసః

దినావి కతిచిద్భద్రే స్థీయతామిత్య భాషత

ఏవముక్తా తతస్తేన సాగ్రం వర్షశతం పునః

బుభుజే విషయాం స్తన్వీ తేన సార్ధం మహాత్మనా

అనుజ్ఞాం దేహి భగవన్ర్వజామి త్రిదశాలయమ్‌

ఉక్తస్తయేతి సపునః స్థీయతామిత్యభాషత

వునర్గతే వర్షశతే సాధికే సా శుభాననా

యామ్యహం త్రిదివం బ్రహ్మన్ర్పణయస్మిత శోభనమ్‌

ఉక్తస్తయైవం సమునిః వునరాహాయతేక్షణామ్‌

ఇహాస్యతాం మయా సుభ్రు! చిరం కాలం గమిష్యసి

తచ్ఛాస భీతా సుశ్రోణీ సహ తేనర్షిణా పునః

శతద్వయం కించిదూనం వర్షాణాం సమతిష్ఠత

గమనాయ మహాభాగో దేవరాజనివేశనమ్‌

ప్రోక్తః ప్రోక్తస్తయా తన్వ్యా స్థీయతామిత్యభాషత

తస్య శాప భయాద్బీరుర్ణాక్షిణ్యేన చ దక్షిణా

ప్రోక్తా ప్రణయభంగార్తి వేదినీ న జహౌ మునిమ్‌

తయా చ రమత స్తస్య పరమర్షేరహర్నిశమ్‌

నవం నవమభూత్ర్పేమ మన్మథాసక్త చేతసః

ఏక దాతు త్వరాయుక్తో నిశ్చశ్రామోటజాన్మునిః

నిష్క్రామంతం చ కుత్రేతి గమ్యతే ప్రాహసాశుభా

ఇత్యుక్తః సతయా ప్రాహ పరివృత్త మహాః శుభే

సంధ్యోపాస్తిం కరిష్యామి క్రియాలోపోస్యథా భవేత్‌

తతః స్రహస్య ముదితా సాతం ప్రాహమహామునిమ్‌

కిమద్య సర్వధర్మజ్ఞ! పరివృత్త మహస్తవ

గత మేతన్న కురుతే విస్మయం కస్యకథ్యతే

కండుముని యవ్వనితతో నాశ్రమముం జొచ్చి మనోహర రూపము నిండు జవ్వనముం దనకు సంతరించు కొనియె. దివ్య వస్త్రములు దివ్యా భరణములుం దాల్చి పదు నాఱేండ్ల యీడున నున్న యా యందగానిం గాంచి కేవల తపశ్శక్తిచే దివ్య కుసుమాలలు దాల్చి సుగంధము బూసికొని సర్వభోగ సంపన్నుడై యప్పటి కప్పుడ తోచిన యా తపస్వి ప్రభావ ముంగని యచ్చెరువు పడి యవ్వేల్పు పడతి, ఓహో! ఈయన తపస్సు ఈయన వీర్య మద్భుత మని కడుంగడు సంబర పడెను. స్నాన సంధ్యలు జపము హోమము బ్రహ్మ యజ్ఞము దేవ తార్చనము ధ్యానము వ్రతోపవాస నియమములను వదలి యమ్ముదితతో రేయిం బవళ్ళు మదన వశుడై క్రీడించెను. తపస్సు క్షయమైన దని కూడ గుర్తింప డయ్యె. విషయ లంపటుడై పగలు రాత్రి సంధ్య పక్షమాసర్తు సంవత్సరము లేవో కూడ తేలియక యామె వలంపునం బడియె. అక్కాంతయు పంచబాణ బాణనిహతయై యోకాంతముని నింపు నింపుపలుకుల నుపలాలించుచు నతనిం గోరి రమించెను. ఇట్లామేని గ్రామ్య సుఖము మఱగి వందయేండ్లా సుందరితో మందర గిరి కందరము నందుండెను. అంత నది యమ్మా హానుభావుం గని నేను స్వర్గమున కేగెద. ప్రసన్న ముఖుడవై యో బ్రహ్మణ్యమూర్తీ యనుజ్ఞ దయసేయు మనియె. అతడామె యెడ నెడలని వలపుగొని కల్యాణి! కొన్ని దినము లుండు మనియె. అట్లయని యా వేల్పు పడతి నూరేండ్లకు మించి యాతని తోడి పొందు గొని యింపోందె. ఆ మీద మఱల యనుమతింపు మనియె. కాదు కాదు నిలు నిలుమన మఱి వంద సంవత్సరము లేగె. ఎడనెడ నిట్లావిడ యడుగుటయు నమ్ముని వలపు గొని వలదనుట యుంగా జరుగుచుండ నాతని శాపమున కడలి యాదేవ కామిని యించుక తక్కువగా రెండు వందలేండ్లు ప్రణయ భంగము వలన గలుగు బాధ నెఱింగినద కావున యాతని వదలి పోదయ్యెను. అప్పరమర్షి దానితో రేయిం బవళ్లు రమించు చున్న కొలది ప్రేమ యెప్పటి కప్పుడు గ్రొత్తది కాజొచ్చెను.

ముని:

ప్రాత స్త్వమాగతా భద్రే నదీ తీరమిదం శుభమ్‌

మయా దృష్ట్వాసి సుశోణి ప్రవిష్టా చ మమాశ్రమమ్‌

ముని:

ఒక్కతఱి నాతడు తత్తరము గొని యిల్లు విడిచి చనుచుండ నాసుర కాంత ఎచటికేగు చున్నారన కల్యాణి! తెల్లవారినది. సంధ్య వార్చెదను. కాదేని అనుష్ఠాన లోప మగునన

ప్రమ్లోచ:

ప్రత్యూషస్యాగతా బ్రహ్మన్సత్యమేతన్న మే మృషా

కిం త్వద్య తస్య కాలస్య గతాన్యబ్దశతాని తే

తతః ససాధ్వసో విప్రస్తాం పప్రచ్ఛాయతేక్షణామ్‌

కధ్యతాం భీరు కః కాలస్త్వయా మేరమతః సదా

సప్తోత్తరాణ్యతీతాని నవవర్ష శతానిచ

మాసాశ్చ షట్తథై వాన్యత్సమతీతం దినత్రయమ్‌

నల్లన నవ్వి యమ్మహా మునింగని ఓ ధర్మజ్ఞ! ఇప్పుడా నీకు తెల్లవారుట అనుష్ఠాన మెప్పుడో గతించినది. ఇమ్మాట యెవనికి వింత గొలువదు?

ఋషి:

సత్యం భీరు వదస్యేత త్పరిహాసోథవా శుభే

దిన మేక మహం మన్యే త్వయా సార్థ మిహోషితమ్‌

ఋషి:

అన నమ్ముని ఈ యుదయమే నీవీ నదీ తీరమునకు వచ్చితివి నాకు గనబడితివి. నా యాశ్రమమును జొచ్చితిని. సంధ్యా సమయమయినది ప్రోద్దెక్కినది ఎందుకు పరియాచకము లాడెదవు? ఉన్నదున్నట్లు పలుకుము.

ప్రమ్లోచ:

వదిష్యా మ్యనృతం బ్రహ్మన్‌! కథమత్రతవాంతికే

విశేషాదద్య భవతా పృష్టా మార్గానుగామినా

ప్రమ్లోచ:

అనవిని ప్రమ్లోచ నేను వేకువ వేళ వచ్చిన మాట ఓ బ్రహ్మణ్యా నిజమే నేనబద్ద మాడుట లేదు. కాని ఇప్పుడా కాలము కొన్ని వందలేండ్లు గడిచి పోయిన దనియె.

వ్యాసులు:

నిశమ్య తద్వచస్తస్యాః పముని ర్ద్విజసత్తమాః

ధిగ్ధిజ్మా మిత్యనాచారం వినింద్యాత్మాన మాత్మనా

బ్రహ్మ:

యా ముని ఛీఛీ ఎంత అనాచార మెంత యపచారము గావించితిని అని తనను దానిందించుకొని నా తపస్సు నెల్ల నీట గలిసినవి.

ముని:

తపాంసి మమ నష్టాని హతం బ్రహ్మవిదాం ధనమ్‌

హృతో వివేకః కేనాపి యోషిన్మోహాయ నిర్మితా

ఊర్మిషట్కాతిగం బ్రహ్మజ్ఞేయ మాత్మజయేన మే

గతిరేషా కృతా యేన ధిక్తం కామమహాగ్రహమ్‌

వ్రతాని సర్వవేదాశ్చ కారణాన్యఖిలాని చ

సరకగ్రామ మార్గేణ కామేనాద్య హతానిమే

వినింద్యేత్థం స ధర్మజ్ఞః స్వయమాత్మాన మాత్మనా

తామప్సరస మాసీనాంమిదం వచన మబ్రవీత్‌

ముని:

బ్రహ్మవేత్తల ధనమెల్ల చెఱచి నట్లయినది నావివేక మెవ్వడో కాజేసి నట్లయినది ఈ యాడుది నన్ను మోహ పెట్టుటకు పుట్టింప బడినది. షడూర్ముల (కవ్వలిదా బ్రహ్మవస్తువు 1. బుభుక్ష 2. తృష్ణ 3. శోకము 4. మోహము 5.జర 6. మరణము) ఆత్మ నిగ్రహముచే నెఱుగ వలసి నది. ఛీఛీ ఆ కామ మహాగ్రహము నన్ను పట్టుకొని నాకీ గతి తెచ్చి పెట్టినది నా వ్రతములు సర్వ వేదములు మఱియెల్ల ఉత్తమ కారణములు నరక గ్రామమునకు మార్గమైన కామముచే నిహతము లయినవి. అని యిట్లు తన్ను దానిందించు కొని యా ధర్మజ్ఞుడు తన యందు గూర్చున్న యా యప్సరసం జూచి యిట్లనియె.

ఋషి:

గచ్చపాపే! యథకామం యత్కార్యం తత్త్వయా కృతమ్‌

దేవరాజస్య యత్క్షోభం కుర్వంత్యా భావచేష్టితైః

నత్వాం కరోమ్యహం భస్మ క్రోధతీవ్రేణ వహ్నినా

సతాం సాప్తపదం మైత్ర్యముషితోహం త్వయాసహ

అథవా తవదోషః కః! కింవా కుర్యామహం తవ

మమైవ దోషో నితరాం యేనాహమజితేంద్రియః

యథా శక్రప్రియార్ధిన్యా కృతో మత్తపసో వ్యయః

త్వయా దృష్ఠి మహామోహ మనునాహం జుగుప్సితః

ఋషి:

పొమ్మో పాపాత్మురాల! నీ హావ భావములచే నా మదిం గలచి యింద్రునికై చేయ వలసిన దంతయం జేసితివి. సత్పురుషుల దోడి మైత్రి సాప్త పదము (అనగా ఏడడడుగులు కలిసి వేయుట లేక యేడు మాటలు మాట లాడుకొనుట వలన నేర్పడు నది) కావున నీతో గలిసి కొన్నాళ్లుంటిని గావున నిన్ను భస్మము చేయును. అదిగాక యిందు నీ తప్పిద మేమున్నది! నీకేదైన శాస్తి చేయుటకు, ఇంద్రియ నిగ్రహము లేని వాడనగట నీ తప్పు నాదియె. సురపతి ప్రీతి కొరకైన నీ వాల్చూపను సమ్మోహన మంత్రముచే నేనీ యవకర మునకు గుఱి యైతిని.

వ్యాసులు:

యాసదిత్థం సవిప్రర్షిస్తాం బ్రవీతి సుమధ్యమామ్‌

తావత్‌ స్ఖల త్స్వేదజలా సాబభూవాతివేపథుః

ప్రవేప మానాం స చ తాం ప్విన్నగాత్రలతాం సతీమ్‌

గచ్ఛగచ్చేతి సక్రోధ మువాచ ముని సత్తమః

సాతు విర్భర్త్సితా తేన వినిష్ర్కమ్య తదాశ్రమాత్‌

ఆకాశగామినీ స్వేదం మమార్జ తరుపల్లవైః

వృక్షా ద్వృక్షం యయౌ బాలా ఉదగ్రారుణ పల్లవైః

నిర్మమార్జ చ గాత్రాణి గళత్స్యేద జలానివై

ఋషిణా యస్తదా గర్భస్తస్యా దేహే సమాహితః

నిర్జగామ సరోమాంచ స్వేదరూపీ తదంగతః

తం వృక్షా జగృహుర్గర్భమేకం చక్రేచ మారుతః

సోమేనాప్యాయితో గోభిః స తదా వవృధే శనైః

మారిషా నామ కన్యాభూద్వృ క్షాణాం చారులోచనా

ప్రాచేతసానాం సాభార్య దక్షస్య జననీ ద్విజాః

వ్యాసులు:

అని యిట్లా బ్రహ్మర్షి యా రమణితో నని నంతట నది ముచ్చెటములు పోసి యొడలెల్ల దడియ నెడనెడ వడంకు చున్న యావేల్పు పడతిం గని పో పొమ్మని యమ్ముని యలుకగొని జడిపింప నది యయ్యాశ్రమము వెడలి యాకసము వెంట నేగుచు నా చెట్ల చిగుళ్లం జెమట దుడిచి కొనియె. అట్లు చెట్టు నుండి చెట్టున కడుగు వెట్టుచు నా చిన్నది యెర యెఱ్ఱని క్రొంద లిరుటాకులం జెమట తడు లోత్తుకొను చున్నంత నయ్యింతికి పులక లయ్యె అప్పుడ పులకలతో బాటామె మేను వెడలి స్వేద రూపమున గర్భము కలిల మయి జాల్వారెను. దానిని వృక్షములు సేకొనియె. వాయు వద్దానినేకము సేసెను. అమృతాంశుడు తన కిరణముల నద్దాని కాప్యాయ మొనరింప నల్లల్లన నది దిన దినా భివృద్ది నొందెను. అ గర్భమే మారిష యనుపేర వృక్షములకు గన్య యయ్యె ఆమె ప్రాచేతసుల భార్య దక్షునికి తల్లి.

స చాపి భగవాన్కండు, క్షీణే తపసి సత్తమః

పురుషోత్తమాఖ్యం భో విప్రా! విష్ణోరాయతనం యయౌ

దదర్శ పరమం క్షేత్రం ముక్తిదం భువి దుర్లభమ్‌

దక్షిణస్యోదధే స్తీడే సర్వ కామ ఫలప్రదమ్‌

సురమ్యం నాలుకాకీర్ణం కేతకీవన శోభితమ్‌

నానాద్రుమలతాకీర్ణం నానాపక్షిరుతం శివమ్‌

సర్వత్ర సుఖసంచారం సర్వర్తు కుసుమాన్వితమ్‌

సర్వసౌఖ్యప్రదం నౄణాం ధస్యం సర్వ గుణాకరమ్‌

భృగ్వాద్యైః సేవితం పూర్వం ముని సిద్దవరై స్తథా

గంధర్వైః కిన్నరై ర్యక్షై స్తథాన్యై ర్మోక్షకాంక్షిభిః

దదర్శవ చ హరిం తత్ర దేవైః సర్వై రలంకృతమ్‌

బ్రాహ్మణాద్యైస్తథా వర్ణై రాశ్రమస్థై ర్నిషేవితమ్‌

దృష్ట్వైవ స తదా క్షేత్రం దేవం చ పురుషోత్తమమ్‌

కృతకృత్య మివాత్మానం మేనే స మునిత్తమః

తత్రైకాగ్ర మనా భూత్వా చకారారాధనం హరేః

బ్రహ్మసార మయం కుర్వన్‌ జప మేకాగ్రమానసః

ఊర్ద్వబాహు ర్మహాయోగీ స్థిత్వాసౌ మునినత్తమః

ఆ కండుముని సత్తముండును తనను క్షమింప పురుషోత్తమ మను నావిష్ణు క్షేత్రమున కరిగెను. ముక్తిదము దుర్లభమునై దక్షిన సముద్ర తీర మందున్న సర్వ కామద మయిన యా దివ్య క్షేత్రమును దర్శించెను. భృగ్వాది మునులు నిరంతరము సేవించు నవ్వైకుంఠా యతనముం గని సర్వ దేవతలు గొలువ నింపుగులుకు హరిని పురుషోత్తము వైకుంఠుం దర్శించి కృతార్థుడ నైతి ననుకొనియె. మఱియు నేకాగ్రచిత్తుడై యాస్వామి నారాధించెను. అయ్యోగి ఊర్ద్వ బాహువై యచట నిలువ బడి “బ్రహ్మపారము” అను మహా మంత్రమును జపించెను. అన విని మునులు వ్యాసుంగని

మునులు:

బ్రహ్మపారం మునే! శ్రోతు మిచ్ఛామః పరమం శుభమ్‌

జపతా కండునా దేవో యేనారాధ్యత కేశవః

మునులు:

యో మునీ ఆ బ్రహ్మపారము పరమ శుభ మంత్రము కండుముని జపించి విష్ణు నారాధించిన యది మేము విన వలతుమన వ్యాసభగవానుల డిట్లానతిచ్చెను.

కండుకృత బ్రహ్మ పారస్తవము

వ్యాసులు:

పారంపరం విష్ణురపారపారః పరః పరేభ్యః పరమార్ధరూపః

సబ్రహ్మపారః పరపారభూతః పరఃపరణామపి పారపారః

నకారణం కారణసంశ్రితోపి తస్యాపి హేతుః పరహేతుహేతుః

కార్యోపి చైష సహకర్మకర్తృ...రూపైరనేకైరవ తీహసర్వమ్‌

బ్రహ్మప్రభుర్భ్రహ్మ స సర్వభూతో బ్రహ్మ ప్రజానాం పతిరచ్యుతోసౌ

బ్రహ్మావ్యయం నిత్యమజం స విష్ణు రపక్షయాద్యైరఖిలై రసంగః

బ్రహ్మాక్షరమజం నిత్యం. యదాసౌ పురుషోత్తమః

తదా రాగాదయో దోషాః ప్రయాంతు ప్రశమం మమ

పారం పరం విష్ణుః = శ్రీహరి సంసార మార్గమునకు సరవోత్కృష్టము పునరావృత్తి రహితము నగు అవధి లేక గురు పరంపరచే తెలియ దగిన రహస్య వస్తువు. అపారపారః = తెలియ లేని అంతము గలవాడు లేక అపరిమిత శక్తి గలవాడు. పరేభ్యః పరః = ఉత్కృష్టముగా నెంచబడు ఆకాశాదుల కంటె గొప్పవాడు. (మహతో మహీయాన్‌ ) పరమాత్మ రూపః = పరబ్రహ్మ రూపుడు. బ్రహ్మపారః = బృహద్రూప మగు ప్రధానము నకు అవసాన మైనవాడు లేక సబ్రహ్మపారః = వేదములు తపస్సులతో కూడికొనిన వారు సబ్రహ్మలు అట్టి వారికి గంతవ్యుడు, పరపారభూతః = ఆత్మేతరమగు ఆనాత్మ ప్రపంచమునకు అవధియైన వాడు పరాణామపి పరః = ఆత్మగా ప్రతీయమానములగు చున్న ఇంద్రియాదులకు అతీతుడు. పారపారః = వూరకములు పోషకములు నైన ఆకాశాదులకు లేక ఇంద్రాదులకు కూడ వూరకుడు పోషకుడు నైనవాడు.

ఆ విష్ణువు అన్నిటికి కారణము. సమస్త కార్యములకు కారణమైన విపంచ మహా భూతములు తన్మాత్రలు వానికి కూడ కారణ మైనవాడు. ఆహంకారమునకు మహత్తత్వము హేతువు. దానికి కూడ హేతువైన వాడు అనగా ఉపాదాన కారణ భూతుడు. ఆతడే క్రియాకారక రూపముతో సమస్తమునకు రక్షకుడునై యున్నాడు. అతడు వేద నిర్వాహకుడు. అతడే వేదము. వేదాంగాదులు కూడ నాతడే. వేదార్థ స్మర్తలగు మన్వాదులకు కూడ ప్రభువైన వాడు. అవ్యయుడు నిత్యుడు పుట్టుక లేనివాడు. షడ్భావ వికారములతో సంబంధము లేని వాడు. బ్రహ్మ పుట్టుక లేని వాడు నాశన రహితుడు నిత్యుడు నైనట్లు ఈ పురుషోత్త ముడును అట్లే అని స్తుతించు చున్న నాయొక్క రాగ ద్వేషాదులు శమించు గాక!

వ్యాసులు:

శ్రుత్వా తస్య మునేర్జాప్యం బ్రహ్మపారం ద్విజోత్తమాః

భక్తిం చ పరమాం జ్ఞాత్వా నుదృఢాం పురుషోత్తమః

ప్రీత్యా స పరయాదేవ స్తదాసౌభక్తవత్సలః

గత్వా తస్యసమీపం తు ప్రోవాచమధుసూదనః

మేఘగంభీరయావాచా దిశః సంనాదయన్నివ

అరుహ్య గరుడం విప్రా! వినతాకుల నందనమ్‌

వ్యాసులు:

అని యిట్లమ్ముని జపించు బ్రహ్మ పారమును విని యాతని యచంచల భక్తి పారమ్య మెఱింగి పురుషోత్త స్వామి పరమ ప్రీతితో భక్త వత్సలుండు గావున నతని దగ్గర కేగి మేఘ గంభీర మగు వచనము దిక్కుల బ్రతిధ్వనింప జేయుచు వినతాకుల నందనుడైన గరుడునిపై గూర్చుండి యిట్లనియె.

శ్రీ భగవానుడు:

మునే బ్రూహి పరంకార్యం యత్తేమనసివర్తతే

వరదోహ మనుప్రాప్తో వరంవరయ సువ్రత

శ్రుత్వైవం వచనం తస్య దేవదేవస్య చక్రిణః

చక్షురున్మీల్య సహసా దదర్శ పురతో హరిమ్‌

అతసీపుష్పసంకాశం పద్మపత్రాయతేక్షణమ్‌

శంఖచక్రగదాపాణిం ముకుటాంగద ధారిణమ్‌

చతుర్భాహు ముదారాంగం పీత వస్త్రధరం శుభమ్‌

శ్రీవత్సలక్ష్మ సంయుక్తం వనమాలా విభూషితమ్‌

సర్వ లక్షణ సంయుక్తం సర్వరత్న విభూషితమ్‌

దివ్యచందన లిప్తాంగం దివ్యమాల్య విభూషితమ్‌

తతః ప విస్మయావిష్టో రోమాంచిత తనూరుహః

దండవత్ర్పణి పత్యోర్వ్యాం ప్రణామ మకరోత్తదా

అద్య మే సఫలం జన్మ అద్య మే సఫలం తపః

ఇత్యుక్త్వా మునిశార్దూలా స్తం స్తోతు ముపచక్రమే

శ్రీ భగవానుడు:

ఓ మునీ! నీ మదినున్న పని తెలుపుము. వరమీయ వచ్చితిని. అడుగుమన కండుముని కనులు దెఱిచి యెదుట నున్న కమలాక్షుని అతనీ కుసుమ సంకాశుని శంఖ చక్ర గదాహస్తుని కిరీటాంగద ధారిని పీతాంబరుని శ్రీవత్స వక్షుని వనమాలా భూషితుని చతుర్భాహువును దివ్యగంధాను లిప్తుని దివ్యమాలా భూషితుని సమున్నత మూర్తిని జూచి వెఱగంది తనువు పులకరింప సాష్టాంగ దండ ప్రణామ మొనరించెను. మఱియు నిపుడు నా జన్మ సఫల మైనది. నా తపస్సు ఫలించిన దని నమ్ముని వరుడిట్లు వినుతింప నారంభించెను.

స్తుతిః

కండురుడు:

నారాయణ! హరే! కృష్ణ! శ్రీవత్సాంక జగత్పతే!

జగద్బీజ! జగద్ధామ! జగత్సాక్షిన్న మోస్తుతే

అవ్యక్త! జిష్ణో! ప్రభవ! ప్రధానః పురుషోత్తమ!

పుండరీకాక్ష! గోవింద! హృషీకేశః నమోస్తుతే!

హిరణ్యగర్భ! శ్రీనాథ పద్మనాభ! సనాతన!

భూగర్భ! ధ్రువ! ఈశాన! హృషీకేశ! నమోస్తుతే

అన్యాద్యంతామృతాజేయ! జయత్వం జయతాం వర!

అజితాఖండ! శ్రీ కృష్ణ! శ్రీనివాస! నమోస్తుతే

వర్జన్య ధర్మకర్తా చ దుష్పార దురధిష్టిత!

దుఃఖార్తినాశన! హరే! జలశాయిన్నమోస్తుతే

భూతపావ్యక్త భూతేశ భూతతత్వైరనాకుల!

భూతాధివాస! భూతాత్మన్భూతగర్భ! నమోస్తుతే

యజ్ఞ! యజ్వన్యజ్ఞధర! యజ్ఞధాతాభయప్రద!

యజ్ఞగర్భ! హిర్యణ్యాంగ! పృశ్నిగర్భ! నమోస్తుతే

క్షేత్రజ్ఞః క్షేత్రభృత్క్షేత్రీ క్షేత్రహా క్షేత్రకృద్వశీ

క్షేత్రాత్మన్క్షేత్ర రహిత! క్షేత్రస్రష్ట్రే నమోస్తుతే

గుణాలయ! గుణావాస! గుణాశ్రయ! గుణావహ!

గుణభోక్తు! గుణారామ! గుణత్యాగిన్నమోస్తుతే

త్వంవిష్ణుస్త్వంహరిశ్చక్రీత్వం జిష్ణుస్త్వం జనార్దనః

త్వంభూత స్త్వంవషట్కార స్త్వంభవ్య స్త్వంభవత్రభుః

త్వంభూత కృత్త్వమవ్యక్తస్త్వం భవోభూతభృద్భద్దవాన్‌

త్వం భూతభావనో దేవస్త్వామాహురజమీశ్వరమ్‌

త్వమనంతః కృతజ్ఞస్త్వం ప్రకృతిస్త్వం వృషాకపిః

త్వం రుద్రస్త్వం దురాధర్క్ష స్త్వమమోఘ స్త్వమీశ్వరః

త్వంవిశ్వకర్మాజిష్ణు స్తంత్వంశంభుస్త్వం వృషాకృతిః

త్వం శంకర స్త్వముశనాత్వంసత్యంత్వంతపో జనః

త్వం విశ్వజేతాత్వం శర్మత్వంశరణ్య స్త్వమక్షరమ్‌

త్వంశంభు స్త్వంస్వయంభూశ్చత్వం జేష్ట స్త్వంపరాయణః

త్వమాదిత్య స్త్వ మోంకార స్త్వంప్రాణ స్త్వంతమిస్రహా

తమ పర్జన్య స్త్వంప్రథితవేధా స్త్వంసురేశ్వరః

త్వమృగ్యజుః సామ చైవత్వ మాత్మాసంచతోభవాన్‌

త్వ మగ్ని స్త్వం చపవన స్త్వ మాపోవసుధా భవాన్‌

త్వం స్రష్టా త్వం తథా భోక్తా హోతాత్వం చ హవిః క్రతుః

త్వం ప్రభుస్త్వం విభుః శ్రేష్ఠస్తమ లోకపతిరచ్యుతః

త్వంసర్వదర్శనః శ్రీమాంస్త్వం సర్వదమనో రిహా

త్వ మహస్త్వం తథారాత్రి స్త్వా మాహు ర్వత్సరంబుధాః

త్వంకాల స్త్వంకాలా కాష్ఠా త్వం ముహూర్తః క్షణా లవాః

త్వంబాల స్త్వంతథా వృధ్ద స్త్వం పుమా స్స్త్రీ నపుంసకః

త్వంవిశ్వయోని స్త్వం చక్షు స్త్వం వేదాంగస్త్వ మవ్యయః

త్వంశాశ్వత స్త్వమజిత స్త్వముపేంద్ర స్త్వముత్తమః

త్వం వేదవేద స్త్వం ధాతా విధాతాత్వం సమాహితః

త్వం సర్వ విశ్వసుఖదస్త్వం వేదాంగం త్వమవ్యయః

త్వంవేదవేద స్త్వంధాతా విధాతా త్వం సమాహితః

త్వం జలనిధి రామూలం త్వం ధాతా త్వం పునర్వసుః

త్వం వైద్య స్త్వంధృతాత్మా చ త్వ మతీంద్రియ గోచరః

త్వ మగ్రణీ ర్గ్రామణీ స్త్వం త్వం సుపర్ణ స్త్వ మాదిమాన్‌

త్వం సంగ్రహ స్త్వం సుమహ త్త్వం ధృతాత్మా త్వ మచ్యుతః

త్వం యమస్త్వం చ నియమ స్త్వం ప్రాంశు స్త్వం చతుర్భుజః

త్వ మే వాన్నాంరాత్మా త్వం పరమాత్మా త్వ ముచ్యతే

త్వం గురు స్త్వం గురుతమ స్త్వంవామ స్త్వం ప్రదక్షిణః

త్వం పిప్పల స్త్వ మగమ స్త్వం వ్యక్త స్త్వం ప్రజాపతిః

హితణ్యనాభ స్త్వం దేవ స్త్వం శశీ త్వం ప్రజాపతిః

అనిర్దేశ్యవపు స్త్వం వై త్వం యమ స్త్వం సురారిహా

త్వం చ సంకర్షణో దేవ స్త్వం కర్తా త్వం సనాతనః

త్వం వాసుదేవోమేయాత్మా త్వ మేవ గుణవర్జితః

త్వం జ్యేష్ఠస్త్వం వరిష్ఠస్త్వం త్వం సహిష్ణుశ్చ మాధవః

సహస్రశీర్షా త్వం దేవస్త్వ మవ్యక్తః సహస్రదృక్‌

సహస్రపాద స్త్వం దేవ స్త్వం విరాట్త్వం సురప్రభుః

త్వమేవ తిష్ఠనే భూయో దేవదేవ దశాంగులః

యద్భూతం త త్త్వమే వోక్తః పురుషః శక్ర ఉత్తమః

యద్భావ్యం త త్త్వ మీశావస్త్వ మృత స్త్వం తథామృతః

త్వత్తోరోహత్యయంలోకోమహీయాం స్త్వ మనుత్తమః

త్వం జ్యాయా న్పురుషస్త్వంచ త్వందేవ దశథాస్థితః

విశ్వభూత శ్చతుర్భాగోనవభాగోమృతో దివి

నవభాగోన్తరిక్షస్థః పౌరుషేయః సనాతనః

భాగద్వయం చ భూసంస్థం చతుర్ధాగోప్యభూదిహ

త్వత్తో యజ్ఞాః సంభవంతి జగతో సృష్ఠికారణమ్‌

త్వత్తో విరాట్సముత్పన్నోజగతో హృది యః పుమాన్‌

సోతిరిచ్యత భూతేభ్య స్తే జసాయళసాశ్రియా

త్వత్తః సురాణా మాహారః పృషదాజ్య మజాయత

గ్రామ్యారణ్యా శ్చౌషధయ స్త్వత్తః పశుమృగాదయః

ధ్యేయధ్యాన పర స్త్వం చ కృతవా నసి చౌషధీః

త్వం దేవదేవ సప్తాస్యకాలాఖ్యో దీప్తవిగ్రహః

జంగమాజంగమం సర్వం జగదేత చ్చరాచరమ్‌

త్వత్తః సర్వ మిదం జాతం త్వయి సర్వం ప్రతిష్టితమ్‌

అనిరుద్ధ స్త్వం మాధవ స్త్వం ప్రద్యుమ్నః సురారిహా

దేవ! సర్వసురశ్రేష్ఠ! సర్వలోక పరాయణ!

త్రాహి మా మరవిందాక్ష నారాయణ నమోస్తుతే

నమస్తే భగవన్విష్ణో నమస్తే పురుషోత్తమ

నమస్తే సర్వలోకేశ! నమస్తే కమలాలయ!

గుణాలయ! నమస్తేస్తు గుణాకర

వాసుదేవ! నమస్తేస్తు నమస్తేస్తు సురోత్తమ

జనార్దన నమస్తేస్తు సనాతన

నమస్తే యోగినాం గమ్య! యోగావాస నమోస్తుతే

గోపతే! శ్రీపతే! విష్ణో నమస్తేస్తు మరుత్పతే

జగత్పతే జగత్సూతే నమస్తే జ్ఞానినాం పతే

దివస్పతే నమస్తేస్తు మహీపతే

నమస్తే మధుహంత్రే చ నమస్తే పుష్కరరేక్షణ

కైటభఘ్న నమస్తేస్తు సుబ్రహ్మణ్య నమోస్తుతే

నమోస్తు తే మహామీన శ్రుతి పృష్ఠధరాచ్యుత

సముద్రసలిలక్షోభ పద్మజాహ్లాద కారిణే

అశ్వశీర్ష మహాఘోణ మహాపురుష విగ్రహ

మధుకైటభ హంత్రే చ నమస్తే తురగానన

మహాకమఠభోగాయ పృథివ్యుద్ధరణాయ చ

విధృతాద్రి స్వరూపాయ మహాకూర్మాయ తే నమః

నమో మహావరాహాయ పృథివ్యుద్ధార కారిణే

నమశ్చాది వరాహాయ విశ్వరూపాయ వేధసే

నమోసంతాయ సూక్ష్మాయ ముఖ్యాయ చ వరాయ చ

పరమాణు స్వరూపాయ యోగిగమ్యాయ తేనమః

తస్మై నమో కారణకారణాయ

యోగీంద్ర వృత్తి నిలయాయ సుదుర్విదాయ

క్షీరార్ణవాశ్రిత మహాహిసుతల్పగాయ

తుభ్యం నమః కనకరత్నసుకుండలాయ

నారాయణాది నామములతో నారంభించి శ్రీహరి కళ్యాణ నామ సంకీర్తనము జేసి పాల సముద్ర మందున్న మహా సర్పమందు నిద్రించు కనక రత్న కుండలా లంకృతు డగు పరమాత్మకు నమస్కారము అని చేసిన ఈ స్తుతి పారాయణ ప్రధానము సుల భార్ధము గావున అనువాదము చేయ బడలేదు.

వ్యాసులు:

ఇత్థం స్తుత స్తదా తేన ప్రీతః ప్రోవాచ మాధవః

క్షిప్రం బ్రూహి మునిశ్రేష్ఠ మత్తో య దభివాంఛసి

వ్యాసులు:

ఇట్లు స్తుతింపబడి సంప్రీతుడై మాధవుడు మునివర! నావలన నీ కోరున దేమో త్వరగ చెప్పుమన

కండురుడు:

సంసారేస్మిన్‌ జగన్నాథ దుస్తరే లోమహర్షణే

అనిత్యే దుఃఖబహుళే కదళీదళసన్నిభే

నిరాశ్రయే నిరాలంబే జల బుద్బుద చంచలే

సర్వోప్రదవ సంయుక్తే దుస్తరే చాతిభై రవే

భ్రమామి సుచిరం కాలం మాయయా మోహిత స్తవ

న చాంతమభిగచ్ఛామి విషయాసక్తమానసః

త్వా మహంచాద్యదేవేశ సంసార భయపీడితః

గతోస్మి శరణం కృష్ణ మాముద్ధర భవార్ణవాత్‌

గంతు మిఛ్ఛామి పరమం పదం య త్తే సనాతనమ్‌

ప్రసాదాత్తవదేవేశ పునరావృత్తి దుర్లభమ్‌

కండురుడు:

జగన్నాథా! తలచు కొన్నంత మేను గగుర్పొడుచు నీ దాటరాని యనిత్య సంసార మందు బహు దుఃఖ కరమై యరటాకు వలె పేలవమై నశించు స్వభావము గల నీటి బుడగ వంటి నిరాశ్రయము నిరాలంబము నగు భయంకర సంసారమున మాయామో హితుడనై తిరుగు చున్నాను. విషయ వాసనల చేత జెడిన మనసుతో దీని యంతు దరికాన లేకున్నాను. దీనికి దడిసి యిపుడు నిన్ను దిక్కంటిని కృష్ణా నన్ను ద్దరింపుము. నీ ప్రసాదమున పునరావృత్తి లేని దుర్లభమైన సనాతన ముక్తి పదము నంద గోరు చున్నాను. అన భగవంతు డిట్లనియె.

శ్రీభగవానుడు:

భక్తోసి మే మునిశ్రేష్ఠ మా మారాధయ నిత్యశః

మ త్ర్పసాదాద్ద్రువంమోక్షం ప్రాప్య్ససి త్వంసమీహితమ్‌

మద్భక్త్యా క్షత్రియా వైశ్యాః స్త్రియః శూద్రాన్త్యజాతిజాః

ప్రాప్నువన్తివరాం సిద్ధిం కిం పున స్త్వం ద్విజోత్తమ

శ్వపాకోపి చ మధ్భక్తః సమ్య క్శ్రద్ధా సమన్వితః

ప్రాప్నో త్యభిమతాం సిద్ధి మన్యేషాం తత్రకా కథా

శ్రీభగవానుడు:

ఓ ముని శిరోమణి! నీవు నా భక్తుడవు. నిచ్చలు నన్నా రాధింపుము. నా యనుగ్రహమున నిశ్చల మైన మోక్షమును బొంద గలవు. నా భక్తులు ఏ కులము వారైన స్త్రీ లైన పరమ సిద్ధి నందుదురు. నీవందుటలో నాశ్చర్య మేమి. కుక్క మాంసము దిను వాడైన మిక్కిలి శ్రద్ధ గొని నా యెడ భక్తి కలవాడు అభీష్ట సిద్ది బొందును. మఱియితరుల మాట జెప్పనేల?

వ్యాసులు:

ఏవముక్త్వా తు తం విప్రాః స దేవే భక్త వత్సలః

దుర్విజ్ఞేయ గతి ర్విష్ణు స్తత్రైవాన్త రధీయత

వ్యాసులు:

అని పలికి భక్త వత్సలుడగు హరి యంతర్థాన మయ్యెను.

గతే తస్మి న్ముని శ్రేష్ఠాః కండుః సంహృష్ట మానసః

సర్వా న్కామా న్పరిత్యజ్య స్వస్థచిత్తోభవ త్పునః

సర్వేన్ద్రియాణి సంయమ్య నిర్మమో నిరహంకృతిః

ఏకాగ్రమానసః సమ్య గ్థ్యాత్వాతం పురుషోత్తమమ్‌

నిర్లేపం నిర్గుణం శాంతం వత్తామాత్ర వ్యవస్థితమ్‌

అవాప పరమం మోక్షం సురాణా మపి దుర్లభమ్‌

యః పఠేచ్ఛృణుయా ద్వాపి కథాం కండో ర్మహాత్మనః

విముక్తః సర్వపాపేభ్యః స్వర్గలోకం స గచ్ఛతి

ఏవం మయా మునిశ్రేష్ఠాః కర్మ భూమిరు దాహృతా

మోక్షక్షేత్రం చ పరమం దేవం చ పురుషోత్తమమ్‌

యేపశ్యన్తి విభుం స్తువన్తి వరదం ధ్యాయన్తి ముక్తి ప్రదమ్‌

భక్త్యా శ్రీపురుషోత్తమాఖ్య మజరం సంసార దుఃఖాపహమ్‌

తేభుక్త్వా మనుజేన్ద్రభోగ మమలాః స్వర్గే చ దివ్యం సుఖమ్‌

పశ్చా ద్యాన్తి సమస్త దోష రహితాః స్థానం హరే రవ్యయమ్‌

విష్ణువట్లు జని నంతట కండువు ముదమంది నిష్కాముడై స్వస్థ చిత్తుడై యింద్రియముల నియమించుకొని యహంకారము వాసి మది నిలకడగొన నిర్లేపుడు నిర్గునుడు శాంతుడు సత్తామాత్రుడు నైన పురుషోత్తమ దేవుని ధ్యానించి యపర దుర్లభ మైన పరమపద మందెను. మహాత్ముడగు కండువు యొక్క కథ నెవ్వరు చదువునో వినునో యతడ ఘములం బాసి స్వర్గలోక మందును. ఓ ముని తల్లజులార! కర్మ భూమియగు భారత వర్షమును గుఱించి మోక్ష క్షేత్రముల గురించి పరమాత్మ పురుషోత్తముని గుఱించి చెప్పితిని. అవ్వరదుని ప్రభుని భక్తితో నెవ్వరు ధ్యానింతురు దర్శింతురు స్తుతింతురు వారు పవిత్రులై రాజ్య భోగముల ననుభవించి స్వర్గ సుఖము జూరలాడి అవ్యయ మగు ముక్తి నందుదురు.