బ్రహ్మ మహా పురాణము
239 - యోగవిధి నిరూపణమ్
మునులు:
సాంఖ్యం యోగస్య నో విప్ర విశేషం వక్తు మర్హసి
తప ధర్మజ్ఞ సర్వం హి విదితం మునిసత్తమ
మునులు:
ఓ ముని సత్తమా! తాము అన్ని విషయములను ఎఱిగిన వారు. సంఖ్య దర్శనము నందు కంటె యోగ దర్శనము నందు కల విశిష్టత ఏమియో మాకు తెలుప ప్రార్ధించు చున్నాము. అని మునులు వ్యాసుని ప్రార్దించిరి.
వ్యాసులు:
సాంఖ్యాః సాంఖ్యం ప్రశంసంతి యోగాన్యోగ విదుత్తమాః
వదంతి కారణైః శ్రేష్ఠైః స్వపక్షోద్భావనాయ వై
అనీశ్వరః కథం ముచ్యేదిత్యేవం మునిసత్తమాః
వదంతి కారణైః శ్రేష్ఠం యోగం సమ్యఙ్మనీషిణః
వదంతి కారణం వేదం సాంఖ్యం సమ్యగ్ద్విజాతయః
విజ్ఞాయేహ గతీః సర్వా విరక్తో విషయేషు యః
ఊర్ధ్వం స దేహా త్సువ్యక్తం విముచ్యేదితి నాన్యధా
ఏత దాహుర్మహాప్రాజ్ఞాః సాంఖ్యం వై మోక్షదర్శనమ్
స్వపక్షే కారణం గ్రాహ్యం సమర్థం వచనం హితమ్
శిష్టానాం హి మతం గ్రాహ్యం భవద్భిః శిష్టసంమతైః
ప్రత్యక్ష హేతవో యోగాః సాంఖ్యాః శాస్త్రవినిశ్చయాః
ఉభే చై తే మతే తత్త్వే సమవేతే ద్విజోత్తమాః
ఉభే చై తే మతే జ్ఞాతే మునీంద్రాః శిష్టసంమతే
అనుష్ఠితే యథాశాస్త్రం సయేతాం పరమాం గతిమ్
తుల్యం శౌచం తయోర్యుక్తం దయా భూతేషు చానఘాః
వ్రతానాం ధారణం తుల్యం దర్శనం త్వసమం తయోః
సాంఖ్యులును యోగులును ఉత్తమములగు యుక్తులతో తమ తమ పక్షములను సమర్థించు కొనుచు ప్రశంసించు కొనుచు ఉందురు. కాని విద్వాంసులగు వారు సాంఖ్య సంప్రదాయము నందు ఈశ్వరుని అంగీకరింపరు కావున ఈశ్వరుని అంగీకరింపని వారికి మోక్షము సిద్ధించుటేమి? అను తలంపుతో సాంఖ్యమును గ్రహింపక యోగ దర్శనమును ప్రశంసింతురు. ఇహము నందలి సర్వ గతులను వాని యందలి దోషము లను ఎఱిగి విషయము లందు విరక్తుడైన వాడు దేహ త్యాగమనకు తరువాత తప్పక ముక్తి నందును. అని సాంఖ్యుల సిద్ధాంతము. సమర్థములగు యుక్తులను హితములగు వచనములను గుర్తించి స్వపక్షమునకు తగిన వానిని గ్రహించుట న్యాయము. ప్రత్యక్షమును తత్త్వ సాక్షాత్కారమును ప్రమాణముగా గ్రహించు వారు యోగ దర్శన పరులు. శాస్త్ర ప్రమాణ బలముచే విషయ నిర్ణయము చేయువారు సాంఖ్యులు. ఓ ద్విజోత్తములారా! ఈ రెండు తత్త్వములును అవినాభావ సంబంధము కలవి. రెండును శిష్టులకు సంమత మైనవి. శాస్త్ర ప్రమాణా నుసారము అనుష్ఠించినచో రెండు దర్శనములును మోక్షమును ఇచ్చునవే. శౌచము భూత దయ అయా వ్రతా నుష్ఠానములు రెండు దర్శనము లందును సమానమే. ఐనను దర్శన సిద్ధాంతములు మాత్రము రెంటికిని భిన్నములు.
మునులు:
యది తుల్యం వ్రతం శౌచం దయా చాత్ర మహామునే
తుల్యం తద్దర్శనం కస్మాత్తన్నో బ్రూహి ద్విజోత్తమ
మునులు:
ఐనచో ఓద్విజోత్తమా! ఈ దర్శనములకు రెంటికి భేదమేమో తెలియ గోరెదమని మునులు వ్యాసుల నడిగిరి.
వ్యాసులు:
రాగం మోహం తథా న్నేహం కామం క్రోధం చ కేవలమ్ యోగాస్థిరోదితాన్దోషాన్పంచైతాన్ర్పాప్నువంతి తాన్
యథా వానిమిషాః స్థూలః జాలం ఛిత్త్వా పునర్జలమ్
ప్రాప్నువంతి తథా యోగా త్తత్పదం వీతకల్మషాః
తథైవ వాగురాం ఛిత్వా బలవంతో యథా మృగాః
ప్రాప్ను యుర్విమలం మార్గం విముక్తాః సర్వబంధనైః
లోభజాని తథా విప్రా బంధనాని బలాన్వితః
చిత్త్వా యోగాత్పరం మార్గం గచ్ఛంతి విమలం శుభమ్
అచలాస్త్వావిలా విప్రా వాగురాసు తథాపరే
వినశ్యంతి న సందేహ స్తద్వద్యోగ బలాదృతే
బలహీనాశ్చ విప్రేంద్రా యథా జాలం గతా ద్విజాః
బంధం చ గచ్ఛంత్యనఘా యోగాస్తే తు సుదుర్లభాః
యథా చ శకునాః సూక్ష్మం ప్రాప్య జాలమరిందమాః
తత్రాశక్తా విపద్యంతే ముచ్యంతే తు బలాన్వితాః
కర్మజైర్బంధనైర్బద్ధాస్తద్వద్యోగపరాద్విజాః
అబలా న విముచ్యంతే ముచ్యంతే చ బలాన్వితాః
అల్పకశ్చ యథా విప్రా వహ్నిః శామ్యతి దుర్బలః
ఆక్రాంత ఇంధనైః స్థూలై స్తద్వద్యోగబలః స్మృతః
స ఏవ చ తదా విప్రా వహ్నిర్జాతబలః పునః
సమీరణగతః కృత్స్నాం దహేత్షిప్రం మహీమిమామ్
తత్త్వజ్ఞానబలో యోగీ దీప్తతేజా మహాబలః
అంతకాల ఇవాదిత్యః కృత్స్నం సంశోషయేజ్జగత్
దుర్బలశ్చ యథా విప్రాః స్రోతసా హ్రియతే నరః
బలహీన స్తథా యోగీ విషయైర్హ్రియతే చ సః
తదేవ తు యథా స్రోతో విష్కంభయతి వారణః
తద్వద్యోగబలం లబ్ధ్వా న భవేద్విసయైర్హృతః
విశంతి వా వశాద్వాథ యోగాద్యోగబలాన్వితాః
ప్రజాపతీన్మనూన్పర్వాన్మహాభూతాని చేశ్వరాః
న యయో నాంతకః క్రుద్ధో న మృత్యుర్భీమ విక్రమః
విశంతి తద్దిజాః సర్వే యోగస్యామిత తేజసః
ఆత్మనాం చ సహస్రాణి బహూని ద్విజ స్తతమాః
యోగం కుర్యాద్బలం ప్రాప్య తైశ్చసర్వైర్మహీం చరేత్
ప్రాప్నుయా ద్విషయాస్కశ్చిత్పునశ్చోగ్రం తపశ్చరేత్
సంక్షిప్యేచ్చ పునర్విప్రాః సూర్యస్తేజోగుణానివ
బలస్థస్య హి యోగస్య బలార్థం మునిసత్తమాః
విమోక్షప్రభవం విష్ణుముపపన్న మసంశయమ్
బలాని యోగప్రోక్తాని మయైతాని ద్విజో త్తమాః
నిదర్శనార్థం సూక్ష్మాణి వక్ష్యామి చ పునర్ద్విజాః
ఆత్మనశ్చ సమాధానే ధారణం ప్రతి వా ద్విజాః
నిదర్శనాని సూక్ష్మాణి శృణుధ్వం మునిసత్తమాః
అప్రమత్తో యథా ధన్వీ లక్ష్యం హంతి సమాహితః
యుక్తః సమ్యక్తథా యోగీ ప్రాప్నోత్యసంశయమ్
వ్యాసులు:
చేపలు వలను చించివెసి మరల నీటిలో ప్రవేశించి నట్లు మృగములు ఉరులను త్రెంచుకొని మరల తమ మార్గమున తాము పోవునట్లు యోగ బలమును సాధించిన వారును లోభ బంధనములను త్రెంచుకొని విమలమును శుభమునగు ముక్తి మార్గము చేరెదరు. యోగ బలమును సాధించ జాలని వారు వలలో చిక్కిన చేపల వలె ఉరులలో చిక్కిన మృగముల వలె ఆ బంధనములలో చిక్కి నశింతురు. మొదటి బంధనములలో చిక్కని యోగులు చాల అరుదు. అగ్ని అల్పముగా నుండగా దానిపై లావైన కట్టెలు అంటించు నపుడు అది చల్లారును. అదే అగ్నికి గాలి బాగుగా తోడై నపుడు ప్రజ్వలించి భూ మండలము నంతటిని కూడ దహించ గలుగును. యోగ శక్తి కూడ ఈ అగ్ని వంటిదే. తత్త్వజ్ఞాన బలము కల యోగి మహా బలమును దీప్త మగు తేజస్సును కలవాడై ప్రళయ కాల సూర్యుని వలె జగత్తు నంతటిని కాల్చ గలుగును. దుర్బలుడగు మానవుడు ప్రవాహములో కొట్టుకొని పోయినట్లు యోగ బలమును తగినంతగ సాధించని యోగియు విషయ ప్రవాహములో కొట్టుకొని పోవును. ఏనుగు ప్రవాహమును ఎదుర్కొన గలిగి నట్లు యోగ బలమును సాధించిన యోగియు విషయ ప్రవాహముతో కొట్టుకొని పోడు. యోగ బలాన్వితులగు యోగులు ఈశ్వరులు, సమర్థులు అయి ప్రజాపతులు మనువులు మహా భూతములు మొదలగు తత్త్వములను అన్నిటిని ప్రవేశింప గలరు. కాని క్రుద్ధుడైన అంతకుడగు యముడు కాని భయంకర విక్రమము కల మృత్యువు కాని వీరెవ్వరును యోగ బలము సాధించిన యోగి యందు ప్రవేశింప జాలరు. యోగ సాధన చేయ వలెను. బలము సంపాదించి ఆ బలములతో మహీ మండల మంతట సంచరింప వచ్చును. యోగియగు వాడొకడు విషయ సుఖము లను యోగ బలముచే సాధింప వచ్చును. అవి కొంత కాల మనుభవించి మరల ఉగ్రమగు తపస్సును చేయ వచ్చును. సూర్యుడు తన కిరణములను వలె తన శక్తులను ముడుచుకొన వచ్చును. ఓసత్తము లారా! బలముగా సాధింప బడిన యోగ శక్తిగల యోగి యొక్క బంధనము నకు ముక్తి ప్రదాత యగు విష్ణువు కూడ లోబడును. యోగ బల ప్రభావమును మీకు తెలుపుటకు మీకు ఇవి కొన్ని నిదర్శనములు తెలిపితిని. ఇంకను సూక్ష్మ తరములైన మరికొన్ని అంశములు మీకు తెలిపెదను. మన స్సమాధానము నకును ధారణకును సంబంధించిన నిదర్శనము లును మరికొన్ని తెలిపెదను. అవి ఎరిగి అనుష్ఠించిన యోగి అప్రమత్తుడైన విలుకాడు శ్రద్ధతో లక్ష్యమును కొట్ట గలిగి నట్లు తానును లెస్సగా మోక్షమును పొంద గలుగును. ఇది నిశ్చయము.
స్సేహపాత్రే యథాపూర్ణే మన ఆధాయ నిశ్చలమ్
పురుషో యుక్త ఆరోహేత్సోపానం యు క్తమానసః
ముక్తస్తథాయమాత్మానం యోగం తద్వత్సునిశ్చలమ్
కరోత్యమలమాత్మానం భాస్కరోపమదర్శనే
యథా చ నావం విప్రేంద్రాః కర్ణధారః సమాహితః
మహార్ణవగతాం శీఘ్రం నయేద్విప్రాంస్తు ప త్తనమ్
తద్వదాత్మ సమాధానం యుక్తో యోగేన యోగవిత్
దుర్గమం స్థానమాప్నోతి హిత్వా దేహమిమం ద్విజాః
సారథిశ్చ యథా యుక్తః సదశ్వాన్సుసమాహితః
దేశమిష్టం నయత్యాశు ధన్వినం పురుషర్షభమ్
తథైవ చ ద్విజా యోగీ ధారణాసు సమాహితః
ప్రాప్నోత్యాశు పరం స్థానం లక్ష్యముక్త ఇవాశుగః
అవేశ్యాత్మని చాత్మానం యో వతిష్ఠతి సోచలః
ప్రాశం హత్వేన మీనానాం పదమాప్నోతి సోజరమ్
నాభ్యాం శీర్షేచ కుక్షౌ చ హృది వక్షసి పార్శ్వయోః
దర్శనే శ్రవణే వాపి ఘ్రాణే చామితవిక్రమః
స్థానేష్వేతేషు యో యోగీ మహావ్రత సమాహితః
ఆత్మనా సూక్ష్మమాత్మానం యుంక్తే సమ్యగ్ద్విజోత్తమాః
సుశీఘ్రమచలప్రఖ్యం కర్మ దగ్ధ్వా శుభాశుభమ్
ఉత్తమం యోగమాస్థాయ యదీచ్ఛతి విముచ్యతే
సూర్యుని వలె ప్రకాశించుచు కన బడెడి పూర్ణమైన నూనె పాత్ర యందు నిశ్చల మగు మనస్సును నిలిపి తన్ను తాను అమలునిగా చేసికొనునో అట్లే ముముక్షువు అగు వాడు మనస్సును నిశ్చల మొనర్చు కొని యోగ సోపానమును ఆరోహించ వలెను. మహా సముద్రములో నున్న బ్రాహ్మణ శ్రేష్ఠులు నావపై నెక్కి శ్రద్ధా వంతుడగు నావికుని సాయమున ఒడ్డునకు చేరి నట్లే యోగ సాధకుడును యోగ సహాయమున మనస్సును సమాహితము చేసి తత్త్వము నందు నిలిపి దేహ త్యాగా నంతరము మోక్షమును పొంద గలుగును. గుఱి తప్పని బాణము వలెను మంచి గుఱ్ఱమును పూన్చిన రథము నెక్కి సమర్థు డగు సారథిని సహాయముగా తీసికొన్న రథికుని వలెను సాధకుడు తన గమ్య మగు సిద్దిని పొంద గలడు. తన మనస్సును ఆత్మ తత్త్వము నందు దృఢముగా నిలిపి నిశ్చలుడై యున్న యోగి నిశ్చలముగా నున్న జాలరి వల వేసి చేపలను చిక్కించు కొన్నట్లు తత్త్వమును స్వాధీనము చేసి కొనును మహా శక్తిశాలియు మహా నియమముల యందు శ్రద్ధ వహించిన వాడును అగుచు నాభి, శిరస్సు, కుక్షి, హృదయము,వక్షస్సు, రెండు పార్శ్వములు నేత్రములు శ్రవణములు ఘ్రాణము, ఈ స్థానముల యందు చిత్తమును దృఢముగా నిలిపి సాధన చేసినచో పర్వతములు నేత్రములు శ్రవణములు ఘ్రాణము ఈ స్థానముల యందు చిత్తమును దృఢముగా నిలిపి సాధన చేసినచో పర్వతము లంత రాసులుగా నున్న శుభాశుభా కర్మ రాసులను దగ్ధము చేసి ఉత్తమ యోగసిద్ధిని సాధించి తన సంకల్పా నుసారము ముక్తు డగును.
మునులు:
ఆహారాన్కీదృశాన్కృత్వా కాని జిత్వా చ సత్తమ
యోగీ బలమవాప్నోతి తద్భవాన్వక్తుమర్హసి
మునులు:
యోగ సాధకుడు ఏ ఆహారములను తినుట వలనను వేటిని జయించుట వలనను యోగ బలమును సాధించునో మాకు తెలుపుడు అని మునులు వ్యాసుల నడిగిరి.
వ్యాసులు:
కణానాం భక్షణే యుక్తఃపిణ్యాకస్య చ భోద్విజాః
స్నేహానాం వర్జనే యుక్తో యోగీబలమవాప్నుయాత్
భుంజానో యావకం రూక్షం దీర్ఘకాలం ద్విజోత్తమాః
ఏకాహారీ విశుద్దాత్మా యోగీ బలమవాప్నుయాత్
పక్షాన్మాసానృతూంశ్చిత్రా న్సంచరంశ్చ గుహా స్తథా
అపః పీత్వా పయోమిశ్రా మోగీ బలమవాప్నుయాత్
అఖండమపి వా మాంసం సతతం మునిసత్తమాః
ఉపోష్య సమ్యక్శుద్ధాత్మా యోగీ బలమవాప్నుయాత్
కామం జిత్వా తథా క్రోధం శీతోష్ణం వర్షమేవ చ
భయం శోకం తథా స్వాపం పౌరుషాన్విషయాం స్తథా
అరతిం దుర్జయాం చైవ ఘోరాం దృష్ట్వా చ భోద్విజాః
స్పర్శం నిద్రాం తథా తంద్రాం దుర్జయాం మునిసత్తమాః
దీపయంతి మహాత్మానం సూక్ష్మమాత్మానమాత్మనా
వీతరాగా మహాప్రాజ్ఞా ధ్యానాధ్యయన సంపదా
దుర్గస్త్వేష మతః పంథా బ్రాహ్మణానాం విపశ్చితామ్
యః కశ్చిద్ర్వజతి క్షిప్రం క్షేమేణ మునిపుంగవాః
యథా కశ్చిద్వనం ఘోరం బహుసర్పసరీసృపమ్
శ్వభ్రవత్తోయహీనం చ దుర్గమం బహుకంటకమ్
అభక్తమటవీప్రాయం దావదగ్ధమహీరుహమ్
పంథానం తస్కరాకీర్ణం క్షేమేణాభిపతే త్తథా
యోగమార్గం సమాసాద్య యః కశ్చిద్ర్వజతే ద్విజః
క్షేమేణోపరమేన్మార్గా ద్బహుదోషోపి సంమతః
అస్థేయం క్షురధారాసు నిశితామ ద్విజోత్తమాః
ధారణా సాతు యోగస్య దుర్గేయమకృతాత్మభిః
విషమా ధారణా విప్రా యాంతి పై న శుభాం గతిమ్
నేతృహీనా యథా నావః పురుషాణాం తు వై ద్విజాః
యస్తు తిష్ఠతి యోగాధౌ ధారణాసు యథావిధి
మరణం జన్మదుఃఖిత్వం సుఖిత్వం స విశిష్యతే
నానాశా స్త్రేషు నియతం నానాముని నిషేవితమ్
పరం యోగస్య పంథానం నిశ్చితం తం ద్విజాతిషు
పరం హి తద్ర్బహ్మమయం మునీంద్రా బ్రహ్మాణమీశం వరదం చ విష్ణుమ్
భవం చ ధర్మం చ మహానుభావం యద్ర్బహ్మ పుత్రా స్సుమహానుభావాన్
తమశ్చ కష్టం సుమహద్రజశ్చ సత్త్వం చ శుద్ధం ప్రకృతిం పరాంచ
సిద్దిం చ దేవీం వరుణస్య పత్నీం తేజశ్చ కృత్స్నం సుమహచ్చ ధైర్యమ్
తారాధిపం భే విమలం సుతారం విశ్వాంశ్చ దేవాసురగాన్పితౄంశ్చ
శైలాంశ్చ కృత్సానుదధీంశ్చ వాచలా న్నదీశ్చ సర్వాః సనగాంశ్చ నాగాన్
సాధ్యాంస్తథా యక్షగణాన్దిశశ్చ గందర్వ సిద్ధాన్పురుషాంస్త్రి యశ్చ
పరస్పరం ప్రాప్య మహాన్మహాత్మా విశేతయోగీ సచిరాద్విముక్తః
కథా చ యా విప్రవరాః ప్రసక్తా దై వే మహావీర్యమతౌ శుభేయమ్
యోగాన్స సర్వా ననుభూయ మర్త్యా నారాయణం తం ద్రుత మాప్నువంతి
వ్యాసులు:
రవ్వతోను తెలిక పిండితోను చేసిన వంటక మును తినుచుండ వలెను. నూనెను వదల వలెను. నూనె లేని యవపిండి వంటకములను అది కూడ ఒక పూట మాత్రమే తినినచో యోగ బలము కలుగును. పక్షముల మాసముల ఋతువుల కొలదిగా చిత్ర ప్రదేశము లందును గుహల యందును సంచరించ వలెను. నీటితో కలిపిన పాలు త్రాగ వలెను. ఒక మాస మైనను నరతోపవాసము చేసి మనశ్శుద్ది సాధించ వలెను. కామ క్రోధ శీతోష్ణ వర్ష భయ శోక నిద్రలను విషయ సుఖములను వేటి యందును అభిరుచి లేక పోవుట సోమరి తనము వీటిని జయించ వలెను. వైరాగ్యము పొందిన మహా ప్రాజ్ఞుడు ధ్యానాధ్యయన సంపత్తి సాయమున ఆత్మను ఉన్నతముగా చేసికొని సూక్ష్మముగా నొనర్చు కొని ప్రకాశవంతముగా చేసి కొనును. ఎంత విద్వాంసులకును బ్రహ్మతత్త్వ సిద్దిని కోరిన ముముక్షువు లకును ఈ మార్గము దుర్గమ మైనది. ఏ యొక్కరైన ఈ మార్గమున నడువ గలిగిన వారు క్షేమమును తప్పక పొందుదురు. ఘోరమును సర్పములతో సరీ సృపములతో గుంతలతో నిండినదియు నీరు లేనిదియు నడువ సాధ్యము కానిదియు ఎన్నో ముండ్లతో నిండినదియు ఎవరును ఉండనిదియు అడవులతో నిండినదియు దావాగ్నితో కాలుచున్న చెట్లు కలదియు దొంగలతో నిండినదియు అగు మార్గమున నడచు చుండియు ఒకా నొకడు క్షేమము గానే తన గమ్యమును చేర గలుగును. ఈ యోగ సాధన మార్గము నను అరుదుగా ఎవరో యొక్కరు సిద్ధి పొంద గలుగుదురు. వాడి యైన క్షుర ధారల, మంగలి కత్తుల పదునుల, మీదనైన క్షేమముగా నడువ వచ్చును కాని మనో నిగ్రహము లేని వారికి మాత్రము ఈ యోగ మార్గము మిగుల దుర్గమ మైనది. అట్టి వారికి ధారణ సాధ్యము కాదు. వారు సిద్ధిని పొంద జాలరు. కర్ణధారుడు లేని నావ పైనెక్కిన వారు సరిగా ఒడ్డునకు చేరజాలరు కదా! సాధకుడు యథా విధిగ యోగ మార్గానుసారము ధారణ యందు నిలిచి యుండి జన్మ మరణ దుఃఖములను లౌకిక సుఖములను అతిక్రమించి మోక్ష సుఖమును పొందును. నానా శాస్త్రముల చేతను విధింప బడినదియు అనేక మునులు అనుష్ఞించి నదియు నిశ్చతమును నగు యోగ మార్గము ద్విజాతులకు ప్రశస్త మైనది. దీనిని అనుష్ఠించిన సాధకుడు పరబ్రహ్మ తత్త్వ రూపుడగు బ్రహ్మను ఈశ్వరుని విష్ణుని మహానుభావ తత్త్వ మగు ధర్మమును మహానుభావులును బ్రహ్మ పుత్రులును నగు సనత్కుమా రాదులను నీచ మగు మనస్సును అంత కంటె గొప్పది యగు రజస్సును శుద్ధమగు సత్త్వమును పరాప్రకృతిని వరుణుని పత్నియగు సిద్ధిదేవి సమగ్ర మగు తేజస్సును మహా ధైర్యమును ఆకాశమున అనేక తారలతో కూడి ప్రకాశించు చంద్రుని విశ్వే దేవులను నాగులను పితరులను సమస్త శైలములను సర్వ సముద్రములను సమస్త నదులను వృక్షములను సాధ్యులను యక్షులను దిక్కులను గంధర్వులను సిద్ధులను సమస్త పురుషులను స్త్రీలను పరస్పరము ప్రవేశించి మహా మహాత్ముడై శీఘ్రము గానే విముక్తు డగును. ఓ విప్ర వరులారా! మహా వీర్యుడును మహా మతియు నగు భగవంతుని విషయమున ప్రసక్తమగు కథ లన్నిటిలో ఇది శుభమైనది. ఈ యోగము ననుష్ఠించిన యోగులు ఈ చెప్పిన యోగ సిద్ధుల నన్నిటిని పొంది అనుభవించి శీఘ్రముగా నారాయణుని చేరుదురు.
Summary of chapter 132 of the Brahma Mahā Purana is as follows:
The twenty-five principles (tattvas) of Sāṃkhya are reviewed comprehensively: Puruṣa (the witnessing self), Prakṛti (primal matter), Mahat/Buddhi (cosmic intelligence), Ahaṃkāra (ego-sense), the five tanmātras (subtle elements), the five mahābhūtas (gross elements), the five jñānendriyas (sense organs), the five karmendriyas (action organs), and Manas (mind). The Puruṣa's essential freedom from all these evolutes is established as the liberating insight of Sāṃkhya.