బ్రహ్మ మహా పురాణము

213 - వరాహావతార వర్ణనమ్‌

మునులు:

అహోకృష్ణస్య మాహాత్మ్యు మద్భుతం చాతిమానుషమ్‌

రామస్య చ మునిశ్రేష్ఠ త్వయోక్తం భువి దుర్లభమ్‌

న తృప్తిమధిగచ్ఛామః శృణ్వంతో భగవత్కథామ్‌

 తస్మాద్బ్రూహి మహాభాగ భూయో దేవస్యచేష్టితమ్‌

ప్రాదుర్భావః పురాణేషు విష్ణో రమితతేజసః

సతాం కథయతామేష వరాహ ఇతి నః శ్రుతమ్‌

న జానీమోస్య చరితం విధిం న చ విస్తరమ్‌

న కర్మగుణసద్భావం న హేతుత్వమనీషితమ్‌

కిమాత్మకో పరాహోసౌ కామూర్తిః కా చ దేవతా

కిమాచారః ప్రభావోవా కిం వా తేన తదాకృతమ్‌

యజ్ఞార్థే సమవేతానాం మిషతాం చ ద్విజన్మనామ్‌

మహావరాహచరితం సర్వలోకసుఖావహమ్‌

యథా నారాయణో బ్రహ్మన్వారాహం రూపమాస్థితః

దంష్ట్ర్యా స గాం సముద్రస్థా ముజ్జహారారిమర్దనః

విస్తరేణైవ కర్మాణి సర్వాణి రిపుఘాతినః

శ్రోతుం నోవర్తతేబుద్ధిర్హరేః కృష్ణస్య ధీమతః

కర్మణామానుపూర్వ్యాచ ప్రాదుర్భావాశ్చయే విభోః

యావాస్య ప్రకృతిర్బ్రహ్మం స్తాశ్చాఖ్యాతుం త్వమర్హసి

మునులు:

ఓ మునీంద్ర! కృష్ణుని మహిమ అద్భుతము. బలరాముని యొక్కయు ప్రభావ మట్టిదే. నీ వలన నెంత విన్నను దృప్తి కలుగుట లేదు. పురాణము లందు విష్ణువు వరాహావతార మెత్తినట్లు విన్నాము. అది విస్తరముగా నానతిమ్ము. వరాహమన స్వరూప మేమి? దేవత యెవరు? ఏ విధమైన యాచారము ప్రభావము కృత్యము జరిపెనో తెలుపుము. యజ్ఞ కర్తలకు పరలోక మేగు వారికి బ్రాహ్మణులకు నీ చరిత్ర పుణ్య లోకప్రదము. ఆయన కోర తుదతో భూమి నైత్తిన కథ విన గోరెదము. అదిగాక పరమాత్మ యొక్క యవతార విశేషంబులు గూడ దెల్పుమన వ్యాసుండిట్లనియె.

వ్యాసులు:

ప్రశ్నభారో మహానేషభవద్భిః సముదాహృతః

యథాశక్త్యా తు వక్ష్యామి శ్రూయతాం వైష్ణవం యశః

విష్ణోః ప్రభావశ్రవణే దిష్ట్యా వో మతిరుత్థితా

తస్మాద్విష్ణోః సమస్తావై శృణుధ్వం యాః ప్రవృత్తయః

వ్యాసులు:

ఇది గొప్ప ప్రశ్న భారము. యథా శక్తిగ దెల్పెదను. అవ్విష్ణు యశస్సు శ్రవణము చేయవలె నన్న తలపు మీకు కల్గుట యదృష్టము. అందు వలన విష్ణు యశ స్సంకీర్తనము విష్ణు లీలలను వినుడు.

యజ్ఞ వరాహ స్తుతి

సహస్రాస్యం సహస్రాక్షం సహస్రచరణం చ యమ్‌

 సహస్రశిరసం దేవం సహస్రకరమవ్యయమ్‌

సహస్రజిహ్వం భాస్వంతం సహస్రముకుటం ప్రభుమ్‌

సహస్రదం సహస్రాదిం సహస్రభుజమవ్యయమ్‌

హవనం సవనం చైవహోతారం హవ్యమేవ చ

పాత్రాణి చ పవిత్రాణి వేదిం దీక్షాం సమిత్స్రువమ్‌

స్రుక్సోమసూర్యముసలం ప్రోక్షణీం దక్షిణాయనమ్‌

ఆధ్వర్యుం సామగం విప్రం సదస్యం సదనం సదః

యూపం చక్రం ధ్రువాం దర్వీం చరూపంశ్చోలూఖలాని చ

ప్రాగ్వంశం యజ్ఞభూమిశ్చ హోతారం చ పరంచయత్‌

హ్రస్వాణ్యతి ప్రమాణాని స్థావరాణి చరాణి చ

ప్రాయశ్చిత్తాని వార్ఘ్యం స్థండిలాని కుశాస్తథా

మంత్రయజ్ఞవహం వహ్నిం భాగం భాగవహం చయత్‌

అగ్రాసినం సోమభుజం హుతార్చిషముదాయుధమ్‌

ఆహుర్వేదవిదో విప్రా యంయజ్ఞే శాశ్వతం ప్రభుమ్‌

తస్యవిష్ణోః సురేశస్య శ్రీవత్సాంకస్య ధీమతః

ప్రాదుర్భావసహస్రాణి సమతీతా న్యనేకశః

భూయశ్చైవ భవిష్యంతి హ్యేవమాహ పితామహః

యత్పృచ్ఛధ్వం మహాభాగాదివ్యాం పుణ్యామిమాం కథామ్‌

ప్రాదుర్భావాశ్రితాం విష్ణోః సర్వపాపహరాం శివామ్‌

శృణుధ్వం తాం మహాభాగాస్తద్గతే నాంతరాత్మనా

 ప్రవక్ష్యామ్యానుపూర్వేణ యత్పృచ్ఛధ్వం మమానఘాః

వాసుదేవస్య మాహాత్మ్యం చరితం చ మహామతే

 హితార్థం సురమర్త్యానాం లోకానాం ప్రభవాయ చ

బహుశః సర్వభూతాత్మా ప్రాదుర్భవతి వీర్యవాన్‌

ప్రాదుర్భావాంశ్చ వక్ష్యామి పుణ్యాన్దివ్యాన్గుణాన్వితాన్‌

సుప్తో యుగసహస్రం యః ప్రాదుర్భవతి కార్యతః

పూర్ణే యుగసహస్రేథ దేవదేవో జగత్పతిః

బ్రహ్మాచ కపిలశ్చైవ త్ర్యంబకస్త్రిదశాస్తధా

 దేవాః సప్తర్షయశ్చైవ నాగాశ్చాప్సరసస్తథా

సనత్కుమారశ్చ మహానుభావో మనుర్మహాత్మా భగవాన్ప్రజాకరః

పురాణదేవోథ పురాణి చక్రే ప్రదీప్తవైశ్వానర తుల్యతేజాః

విష్ణువు సహస్ర శీర్షుడు. సహస్రాక్షుడు. సహస్ర ముఖుడు సహస్ర కరుడు సహస్ర జిహ్వుడు. సహస్ర కిరీటుడు. సహస్ర భుజుడని యా యజ్ఞ పురుషుని విష్ణుని పురుష సూక్త విధానమున బ్రహ్మజ్ఞులు స్తుతింతురు. హవనము హోమము సవనము (ప్రాతర్మధ్యాహ్న సాయం సవనములు మూడు) హోత హవ్యము (హోమ ద్రవ్యము) పాత్రలు పవిత్రములు వేది దీక్ష సమిధ స్రువము స్రుక్కు సోమము సూర్యుడు ముసలము ప్రోక్షణి దక్షిణాయనము అధ్వర్యుడు సామగుడు (ఉద్గాత) సదస్యుడు సదనము (యజ్ఞశాల) సదస్సు యూపము చక్రము ధ్రువ దర్వి చరువు ఉలూఖలము ప్రాగ్వంశము త్రేతాగ్నులుండు శాల (ఉప సదేష్టులు ప్రవర్గ్యమిందే జరుగును) హ్రస్వములు అణువులు స్థావరములు జంగమములు ప్రాయశ్చిత్తములు అర్ఘ్యము స్థండిలములు (అగ్ని ప్రతిష్ఠ చేయుటకు కల్పింప బడిన ప్రదేశ విశేషములు) కుశలు మంత్రములు యజ్ఞముల వహించు వహ్ని హవిర్భాగము భాగవహము (హవి ర్భాగములను) వహించు పాత్ర విశేషము) అగ్రాసి సోమ భుజుడు హోమము చేయ బడిన శ్రుత్యుక్త ఆయుధములను ధరించిన అగ్నిగ వేదవేత్తలు పిలుతురో యట్టి శాశ్వతుని యజ్ఞేశ్వరుని శ్రీవత్సాంకిత వక్షుడగు విష్ణువు యొక్క యవతార సహస్రము లెన్నో జరిగినవి. జరుగ నున్నవి. చతుర్ముఖ బ్రహ్మ యిట్లు చెప్పెను. విష్ణువు యొక్క యవతారమునకు సంబంధించిన కథలను శ్రద్ధతో వినుడు. ఈ వాసుదేవ మాహాత్మ్యము చరిత్ర దేవ మర్త్య లోకములకు హితకరము. శుభ ప్రదము. సర్వ భూతాంతరాత్మ యవతారములు పెక్కు గలవు. వేయి దివ్య యుగములు నిదురించి యొకానొక పనికై మరల మేల్కొనును. బ్రహ్మ కపిలుడు, త్ర్యంబకుడు, దేవతలు, సప్తర్షులు, నారదుడు, అప్సరసలు, సనత్కుమారుడు మనువు మొదలగు వారిని ఆయన యావిర్భవింప జేసెను. అతడు అగ్ని వంటి తేజస్వి.

యోసౌ చార్ణ వమధ్యస్థో నష్టేస్థావరజంగమే

నష్టే దేవాసురనరే ప్రసష్టోరగరాక్షసే

యోద్ధుకామౌ దురాధర్షౌ తావుభౌ మధుకైటభౌ

హతౌ భగవతా తేన తయోర్దత్త్వామితం వరమ్‌

పురా కమలనాభస్య స్వపతః సాగరాంభసి

పుష్కరే తత్రసంభూతా దేవాః సర్షి గణాస్తథా

ఏష పౌష్కరకో నామ ప్రాదుర్భావో మహాత్మనః

పురాణం కథ్యతే యత్ర దేవశ్రుతిసమాహితమ్‌

వారాహస్తు శ్రుతిముఖః ప్రాదుర్భావో మహాత్మనః

సముద్ర మధ్యమందా సనాతన మూర్తి యుండగా ప్రళయ మైన తఱి మధు కైటభు లిద్దరు భగవంతుని చేత వరము లంది యుద్ధము సేయ బూనిరి. కమల నాభుడు నిదురించిన తఱి పుష్కరము నుండి దేవతలు ఋషులు పుట్టిరి. ఆ ప్రాదుర్భావమే పౌష్కర మను పేర పురాణము నందు శ్రుతి సమ్మతమై వర్ణింప బడినది. హరి వరాహ రూపమున నెత్తిన యవతారము శ్రుతి ముఖము. అనగా వేదములే యా మూర్తి యొక్క ముఖాద్యవయవ స్వరూపము లందె నన్నమాట.

యజ్ఞ వరాహమూర్తి స్వరూప వర్ణనము

 యత్ర విష్ణుః సురశ్రేష్ఠో వారాహం రూపమాస్థితః

వేదపాదో యూపద్రంష్ట్రః క్రతుహస్తోశ్వినీముఖః

అగ్నిజిహ్వోదర్భరోమా బ్రహ్మశీర్షో మహాతపాః

అహోరాత్రేక్షణో దివ్యో వేదాంగః శ్రుతిభూషణః

ఆజ్యనాసః స్రువతుండః సామఘోషస్వరోమహాన్‌

సత్యధర్మమయః శ్రీమాన్క్రమవిక్రమనత్కృతః

ప్రాయశ్చిత్తనఖో ఘోరః పశుజాను ర్మఖాకృతిః

ఉద్గీథాంత్రో హోమలింగః ఫలజీవమహౌషధిః

వాద్యాంతరాత్మా మంత్రస్ఫిగ్వికృతః సోమశోణితః

వేదిస్కంధో హవిర్గంధో హవ్యకవ్యాతి వేగవాన్‌

ప్రాగ్వంశకాయో ద్యుతిమా న్నానాదీక్షాభిరన్వితః

దక్షిణాహృదయో యోగీ మహాసత్రమయో మహాన్‌

ఉపాకర్మాష్టరుచకః ప్రవర్గ్యావర్త భూషణః

నానాఛందోగతిపథో గుహ్యోపనిషదాసనః

ఛాయాపత్నీ సహాయోసౌ మణిశృంగ ఇవోత్థితః

మహీం సాగరపర్యంతాం సశైలవనకాననామ్‌

ఏకార్ణవ జలభ్రష్టా మేకార్ణవ గతఃప్రభుః

దంష్ట్రయా యః సముద్ధృత్య లోకానాం హితకామ్యయా

సహస్రశీర్షో లోకాది శ్చకారజగతీం పునః

ఏవం యజ్ఞవరాహేణ భూత్వా భూతహితార్థినా

ఉద్ధృతా పృథివీదేవీ సాగరాంబుధరా పురా

అయ్యజ్ఞ వరాహ మూర్తి పాదములు నాల్గు వేదములు. ఆయన కోర యూప స్తంభము. క్రతువు చేతులు. అశ్వినులు ముఖము. అగ్ని జిహ్వ. దర్భలు రోమములు. బ్రహ్మ శిరస్సు. అహో రాత్రములు కన్నలు. వేదాంగములు కర్ణ భూషణములు. ఆజ్యము నాసిక. స్రువము ముట్టి సామ ధ్వనిఘర్ఘర స్వరము. సత్య ధర్మములా శ్రీమంతుని స్వరూపము. ప్రాయశ్చిత్త మాయన ఘోరమైన ముఖము. పశువు మోకాళ్ళు ఉద్గాతి ఆయన పేగు మంత్రము మూపు వేదిక హవిస్సు వాసన (హవ్య కవ్యములు) ప్రాగ్వంశము నానా దక్షతలతో కూడినది శరీరము. ఆసనము శరీర కాంతిపత్ని మణి మయమైన శృంగము వలె లేచి దక్షిణ హృదయము అనేక సత్రమయము యోగ వరహ మూర్తి యొక్క స్వరూపము. ఉపాకర్మాష్టకము దంతములు ప్రవర్గలా శరీర మందలి సుడులు. ఛందస్సు లన్నియు నాయన నడచు దారులు. గాహ్యోపనిషత్తు సశైల వనము సాగరపర్యంతము ఏకార్ణవ మందు మునిగిన భూమిని తన కొమ్ము చివర లోకహితము కొరకు పెల్లగించి ధరించెను. ఈ విధముగ యజ్ఞ వరాహమూర్తి చేత వసుంధరా దేవి భూత హితార్ధ ముద్ధరింప బడినది.

నరసింహ మూర్తి వర్ణనము

వారాహ ఏషకథితో నారసింహ స్తతోద్విజాః

యత్ర భూత్వా మృగేంద్రేణ హిరణ్యకశిపుర్హతః

పురా కృతయుగే నామ సురారిర్బలదర్పితః

దైత్యానామాదిపురుషశ్చకార సుమహత్తపః

దశవర్ష సహస్రాణి శతాని దశపంచ చ

జపోపవాసనిరత స్తస్థౌ మౌనవ్రతస్థితః

తతః శమదమాభ్యాం చ బ్రహ్మచర్యేణ చైవ హి

ప్రీతోభవ త్తత స్తస్య తపసా నియమేన చ

తం వై స్వయంభూర్భగవా న్స్వయమాగత్య భో ద్విజాః

విమానేనార్కవర్ణేన హంసయు క్తేన భాస్వతా

ఆదిత్యై ర్వసుభిః సార్ధం మరుద్భిర్దైవతై స్తథా

రుద్రైర్విశ్వ సహాయైశ్చ యక్షరాక్షస కింనరైః

దిశాభిః ప్రదిశాభిశ్చ నదీభిః సాగరై స్తథా

నక్షత్రైశ్చ ముహూర్త్చైశ ఖేచరైశ్చ మహాగ్రహైః

దేవర్షిభి స్తపోవృద్ధైః సిద్ధైర్విద్వద్భిరేవచ

రాజర్షిభిః పుణ్యతమైర్గంధర్వైరప్సరోగణైః

చరాచరగురు శ్రీమాన్‌ వృతస్సర్వైస్సురైస్తథా

బ్రహ్మా బ్రహ్మవిదాం శ్రేష్ఠోదైత్యం వచన మబ్రవీత్‌

నరసింహ రూప మెత్తి హరి హిరణ్యకశిపుని సంహరించిన కథ వినుండు. కృత యుగ మందు దైత్యులకు మొదటి పురుషుడు. హిరణ్య కశిపుడు పదివేల పదునేను వందల సంవత్సరము లుపవాసము సేసి మౌనము బూని తీవ్ర తపస్సు చేసెను. వాని శమ దమములకు బ్రహ్మ చర్యమునకు తపో నియమములకు బ్రీతినొంది భగవంతుడు స్వయంభువు స్వయముగా హంసలను బూన్చిన సూర్య ప్రభమైన విమానమున ఆదిత్యులు వసువులు మరుత్తులు దేవతలు రుద్రులు వెన్నంటి రాగా యక్ష రాక్షసులు కిన్నరులు దిక్కులు విదిక్కులు నదులు సముద్రములు నక్షత్రములు ముహూర్తములు మహా గ్రహములు తపో వృద్ధులైన సిద్ధులు విద్వాంసులు పుణ్య ఋషులు మొదలగు పరివారముతో వచ్చి

బ్రహ్మ:

ప్రీతోస్మి తవ భక్తస్య తపసానేన సువ్రత

వరం వరయ భద్రంతే యథేష్టం కామమాప్నుహి

బ్రహ్మ:

నీ తపస్సునకు సంతసించితిని. నీకు భద్రమగుగాక. ఇష్టమైన వరము కొరుము సిద్ధినందుమనెను.

హిరణ్యకశిపుడు:

న దేవాసురగంధర్వా న యక్షోరగరాక్షసాః

ఋషయో వాథ మాం శాపైః క్రుద్ధాలోకపితామహః

శపేయు స్తపసాయుక్తా వర ఏష వృతో మయా

న శస్త్రేణ నచాస్త్రేణ గిరి ణాపాదపేన వా

న శుష్కేన న చార్ద్రేణ వ చై వోర్ధ్వం న చాప్యధః

పాణిప్రహారేణై కేన పభృత్యబలవాహనమ్‌

యోమాం నాశయితుం శక్తః సమే మృత్యుర్భవిష్యతి

భవేయమహమేవార్కః సోమో వాయుర్హు తాశనః

సలిలం చాంతరిక్షం చ ఆకాశశ్చైవ సర్వశః

అహం క్రోధశ్చ కామశ్చ వరుణో వాసవో యమః

ధనదశ్చ ధనాధ్యక్షో యక్షః కింపురుషాధిపః

హిరణ్యకశిపుడు:

పితామహ! దేవాసుర గంధర్వాదు లెవ్వరును గోపించి నన్ను శపింప రాదు. ఇదియే వరము. శస్త్రాస్త్రములచే చెట్లచే గిరులచే నెండిన తడసిన దేనిచే గాని క్రింద గాని పైన గాని కాకుండ ఒక్క చేతితో మాత్రమే సైన్య సపరి వారముగ నన్ను చంప గల వాడే నాకు మృత్యువు గావలెను. నేనే సూర్య చంద్రులు వాయువు అగ్ని నీరు అంతరిక్షము ఆకాశమునై యుండ వలెను. కామ క్రోధములు నేనే. ఇంద్ర యమ వరుణ కుబేరులు నంతయు నేనే కావలె నన

బ్రహ్మ:

ఏతే దివ్యాః శరా స్తాత మయాదత్తాస్తవాద్భుతాః

సర్వాన్కామానిమాంస్తాత ప్రాప్స్యసి త్వం న సంశయః

బ్రహ్మ:

యివిగో దివ్యబాణములు నీకిచ్చుచున్నాను. ఇవి యద్భుతములు. నీవు కోరిన కోరికలు వానిచే బొందెదవు. సందియము లేదు.

వ్యాసులు:

ఏవముక్త్వా తు భగవాన్‌జగామాశు పితామహః

వైరాజం బ్రహ్మసదనం బహ్మర్షిగణసేవితమ్‌

వ్యాసులు:

అని వైరాజమని శ్రుతి పిలిచెడి బ్రహ్మ సదనమునకు బ్రహర్షిగణ సేవితుడై వేంచేసెను.

అతో దేవాశ్చ నాగాశ్చ గంధర్వా మునయ స్తథా

వరప్రదానం శ్రుత్వేదం పితామహ ముపస్థితాః

అటుపై దేవ నాగ గంధర్వ మునులు బ్రహ్మ వలన జరిగిన ఈ వర ప్రదాన విషయము విని బ్రహ్మకిట్లనిరి.

దేవతలు:

వరేణానేన భగవ న్భాధిష్యతి స నోసురః

తత్ప్రసీదాశు భగవ న్వధోప్యస్య విచింత్యతామ్‌

భగవన్సర్వభూతానిం స్వయంభూరాది కృత్ప్రభుః

స్రష్టా చ హవ్యకవ్యానా మవ్యక్తం ప్రకృతిద్ద్రువమ్‌

దేవతలు:

స్వామి! ఈ నీ విచ్చిన వరము వలన నా యసురుడు మమ్ము బాదింప గలడు. దయజేసి వాని వధ విషయ మాలోచింపుము.

వ్యాసులు:

తతో లోకహితం వాక్యం శ్రుత్వా దేవః ప్రజాపతిః

ప్రోవాచ భగవాన్వాక్యం సర్వదేవగణాంస్తథా

వ్యాసులు:

నీవు ఆదికర్తవు హవ్య కవ్యములను సృష్టించిన వాడవే నీవు. అన బ్రహ్మ

బ్రహ్మ:

ఆవశ్యం త్రిదశా స్తేన ప్రాప్తవ్యం తపసఃఫలమ్‌

తపసోంతే చ భగవా న్వధం విష్ణుఃకరిష్యతిః

బ్రహ్మ:

త్రిదశులార! చేసిన తపస్సు యొక్క ఫలమవశ్య మనుభవింప వలసినదే. తపస్సునకు చివర విష్ణు భగవానుడు వానిని వధించును.

వ్యాసులు:

ఏతచ్ఛ్రుత్వా సురాః సర్వే వాక్యం పంకజజన్మనః

స్వాని స్థానాని దివ్యాని జగ్ముస్తేవై ముదాన్వితాః

వ్యాసులు:

అన విని దేవతలు సంతసించి స్వస్థానముల కేగిరి.

లబ్ధమాత్రేవరే చాపి సర్వాః సోభాధత ప్రజాః

హిరణ్యకశిపుర్ధైత్యో వరదాననేన దర్పితః

ఆశ్రమేఘ మహాభాగా న్మునీన్వై పంశితవ్రతాన్‌

సత్యధర్మరతాన్దాంతాం స్తదా థర్త్పితవాంస్తథా

త్రిదివస్థాం స్తథా దేవా న్పరాజిత్య మహాబలః

త్రైలోక్యం వశమానీయ స్వర్గే వసతి సోసురః

యదా వరమదోన్మత్తో విచర న్దావవో భువి

యజ్ఞీ యానకరోద్దైత్యా నయజ్ఞీయాంశ్చ దేవతాః

ఆదిత్యా వసవః సాధ్యా విశ్వే చ మరుత స్తథా

శరణ్యం శరణం విష్ణు ముపతస్థుర్మహాబలమ్‌

దేవబ్రహ్మమయం యజ్ఞం బ్రహ్మదేవం సనాతనమ్‌

భూతం భవ్యం భవిష్యంచ ప్రభుం లోకనమస్కృతమ్‌

నారాయణం విభుం దేవం శరణ్యం శరణం గతాః

వాడు వరము లభించిన క్షణములో పొగరెక్కి మున్యా శ్రమము లందు వ్రత నిష్టులై సత్మ ధర్మరతు లైన దాంతులను శాంతులను హడల గొట్టెను. అట్లే స్వర్గమున కేగి దేవతల నోడించెను. ముర్లోకముల వశము జేసుకొని స్వేచ్ఛా సంచారియై దైత్యులను యజ్ఞీయులను (యజ్ఞ భాగార్హులను) దేవతలను ఆయజ్ఞీయు లను గావించెను. ఆదిత్యులు మొదలుగా దేవ వర్గము విష్టుని శరణొందిరి.

దేవతలు:

త్రాయస్వ నోద్య దేవేశ హిరణ్యకశిపోర్భయాత్‌

త్వం హినః పరమోదేవ స్త్వం హినః పరమోగురుః

త్వం హి నః పరమో ధాతా బ్రహ్మదీనాం సురోత్తమః

ఉత్ఫుల్లామలపత్రాక్ష శత్రుపక్షక్షయంకర

జయాయాదితివంశస్య శరణంత్వం భవస్వ నః

దేవతలు:

దేవేశ్వరా! రక్షింపుము. హిరణ్యకశిపుని వలన మాకిప్పుడు భయము వచ్చి పడినది. నీవు గదా మాకు పరమ దైవము. పరమ గురుడవు. పరమ ధాతవు. కమల లోచన! అదితి వంశజయము నకు శరణమగు మనిరి.

వాసుదేవుడు:

భయం త్యజధ్వ మమరా ఆభయం వో దదామ్యహమ్‌

తథైవ త్రిదివం దేవాః ప్రతిలప్స్యథ మా చిరమ్‌

ఏషోహం సగణం దైత్యం వరదానేన దర్పతమ్‌

అవధ్యమమరేంద్రాణాం దానవేంద్రంనిహన్మితమ్‌

ఏవమక్త్వాతు భగవా న్విసృజ్య త్రిదివేశ్వరాన్‌

హిరణ్యకశిపోః స్థాన మాజగామ మహాబలః

సరస్యార్థం తనుం కృత్వా సింహస్యార్ధతనుం హరిః

నారసింహేన వపుషా పాణిం సంస్పృశ్య పాణినా

ఘనజీమూతసంకాళో ఘనజీమూత నిస్వనః

ఘనజీమూతదీప్తౌజౌ జీమూత ఇవ వేగవాన్‌

దైత్యం సోతిబలం దృష్ట్వా దృప్తశార్దూలవిక్రమః

దృప్తైర్దైత్య గణైర్గుప్తం హతవా నేకపాణినా

వాసుదేవుడు:

జడియకుడు. అభయ మిచ్చు చున్నాను. మనువటి వలె స్వర్గము త్వరలో పొంద గలరు. ఇపుడే నేను వరదాన దర్పితు డైన వానిని సపరివారముగ సంహరించు చున్నాను. అని యిట్లు పలికి దేవతలను బంపి భగవంతుడు హిరణ్య కశివుని తావునకు వచ్చెను. సగము నర శరీరము సగము సింహ శరీరము సేసి చేతితో చేయిని తాకుచు దట్టపు మేఘము వంటి శరీరము మేఘ గర్జనము వంటి గర్జనము గొని మెరయుచు మేఘమంత వేగముగ వచ్చి యాకలి కొనిన పెద్ద పులి వలె నున్న యా రక్కసుని పొగరెక్కి యున్న రక్కసులచే రక్షణ యివ్వ బడుచున్న వారిని సంహరించెను.

వామనావతారము

నృసింహఏష కథితో భూయోసౌ వామన స్తతః

యత్ర వామనమాస్థాయ రూపం దైత్యవినాశనమ్‌

బలేర్బలవతో యజ్ఞే బలినా విష్ణునా పురా

విక్రమైస్త్రిభిరక్షోభ్యాః క్షోభితాస్తే మహాసురాః

విప్రచిత్తిః శివః శంకు రయఃశంకు స్తథైవచ

అయఃశిరా హయగ్రీవశ్చ వీర్యవాన్‌

వేగవాన్కేతుమానుగ్రః సోగ్రవ్యగ్రో మహాసురః

పుష్కర పుష్కలశ్చైవ శ్వాశ్వోశ్వపతిరేవచ

ప్రహ్లాదోశ్వపతిఃకుంభః సంహ్లాదో గమనప్రియః

అనుహ్లాదో హరిహయో వారాహః సంహారోనుజః

శరభః శలభశ్చైవ కుపథః క్రోధనః క్రథః

బృహత్కీ ర్తిర్మహాజిహ్వః శంకుకర్ణో మహాన్వనః

దీప్తజిహ్వోర్కనయనో మృగపాదో మృగప్రియః

వాయుర్గరిష్ఠో సముచిః సంబరో విస్కరో మహాన్‌

చంద్రహంతా క్రోధహంతా క్రోధవర్ధన ఏవచ

కాలకః కాలకోపశ్చ వృత్రః క్రోధో విరోచనః

గరిష్ఠశ్చ వరిష్ఠశ్చ ప్రలంబనరకావుభౌ

ఇంద్రతాపనవాతాపీ కేతుమాన్బలదర్పితః

అసిలోమా పులోమాచ బాష్కలః ప్రమదోమదః

శ్వమిశ్రః కాలవదనః కరాళః కేశిరేవచ

ఏకాక్షశ్చంద్రమా రాహుః సంహ్లాదః సంబరః స్వనః

శతఘ్నీచక్రహస్తాచ తథా ముసలపాణయః

అశ్వయంత్రాయుధోపేతా భిందిపాలాయుధా స్తథా

శూలో ఖలహస్తాశ్చ పరశ్వధధరాన్తథా

పాశముద్గర హస్తాశ్చ తథా పరిఘపాణయః

మహాశిలా ప్రహరణాః శూలహస్తాశ్చ దానవాః

నానాప్రహరణాఘోరా నానావేశా మహాబలాః

కూర్మకుక్కుట వక్త్రాశ్చ శశోలూకముఖా స్తథా

ఖరోష్ట్రవదనాశ్చైవ పరాహవదనా స్తథా

మార్జారశిఖివక్త్రాశ్చ మహావక్త్రా స్థథా పరే

నక్రమేషాననాః శూరా గోజావిమహిషాననాః

గోధాశల్లకివక్త్రాశ్చ క్రోష్టువక్త్రాశ్చ దానవాః

ఆఖుదర్ధుర వక్త్రాశ్చఘోరావృకముభా స్తథా

భీమామకరవక్త్రాశ్చ క్రౌంచవక్త్రాశ్చ దానవాః

అశ్వాననాః ఖరముఖా మయూర వదభా స్తథా

గజేంద్రచర్మవసనా స్తథా కృష్ణాజినాంబరా

చీరసంవృతగాత్రాశ్చ తథా నీలకవాససః

ఉష్ణీషిణో ముకుటిన స్తథా కుండలినోసురాః

కిరీటినో లంబశిఖాః కంబుగ్రీవాః సువర్చసః

నానావేషధరా దైత్యా నానామాల్యానులేపనాః

స్వాన్యాయుధాని సంగృహ్య ప్రదీప్తాని చ తేజసా

 క్రమమాణం హృషీకేశ ముపావర్తంత సర్వశః

నృసింహు జెప్పితిమి. ఇక వామనుని వినుండు. బలి యజ్ఞ మందు బల శాలియైన విష్ణువుచే మూడడుగులచే మహాసురులు సంక్షోభింప జేయ బడిరి. విప్రచిత్తి బృహత్‌ కీర్తి మొదలు శంబరుడు దాక గల రాక్షసులు శతఘ్ని చక్ర ముసలము లూని అశ్వ యంత్రములు బూని బింది పాల శూల ఉలూఖలములు జేబూని పరశ్వధము లూని పాశ ముద్గర పరిఘా యుధములు గొని పెద్ద బండలు గొని యుద్ధమునకు నడిచిరి. వారి ముఖములు తాబేలు వలె కోడివలె గుడ్ల గూబల వలె నుండెను. కొందరు గాడిదలు ఒంటెలు పందులు పిల్లులు నెమళ్ళ వంటి ముఖములు గలవారు. మొసళ్ళు మేకలు ఎడ్లు గొర్రెలు గేదెలు దున్న పోతుల అట్టి మొగములతో నుండిరి. ఉడుము ముఖము కొందరిది. చుంచులు కప్పలం తోడేళ్ళం బోలిన వారు కొందరు. అశ్వ ముఖులు క్రౌంచ ముఖులు (బెగ్గురు పక్షులు) మయూర ముఖులు కొందరు. కొందరు గజ చర్మము కృష్ణాజినము ధరించిరి. నల్లని బట్టలు కట్టు కొనిరి. కొందరు తల పాగలు కొందరు కిరీటములు ధరించిరి. కొందరికి కుండలము లున్నవి. జుట్టు విరబోసి కొనిరి కొందరు. శంఖము వంటి మెడలు గల్గి నానా మాల్యాములు గంధములు పూసికొని నానా వేషధారులై అందరు తమ ఆయుధములం పచారు సేయుచున్న హరిని సమీపించిరి.

ప్రమథ్య సర్వాన్దైతేయా న్పాదహస్తతలై ర్విభుః

రూపం కృత్వా మహాద్భీమం జహారాశు స మేదినీమ్‌

తస్యవిక్రమతో భూమిం చంద్రాదిత్యౌ స్తనాంతరే

నభః ప్రక్రమమాణస్య నాభ్యాం కిలతథా స్థితౌ

పరమం క్రమమాణస్యజానుదేశే వ్యవస్థితౌ

విష్ణోరమితవీర్యస్య వదంత్యేవం ద్విజాతయః

హృత్వాసమేదినీం కృత్స్నాం హత్వా చాసురపుంగవాన్‌

దదౌ శక్రాయవసుధాం విష్ణుర్బలవతాం వరః

ఏషవో వామనో నామ ప్రాదుర్భావో మహాత్మనః

వేదవిద్భిర్ధ్విజై రేత త్కధ్యతే వైష్ణవం యశః

విష్ణువు పాదములతో కరతలముతో రక్కసులం గొట్టి భూమిని లాగు కొనెను. అతడడుగ డుగున నాక్రమించి చంద్ర సూర్యులు రొమ్ము దానందాక బెరిగి నాభిదాక నంతై యింతంతగుచు సర్వ మాక్రమించి సర్వంసహ నింద్రున కొసంగెను. ఈ త్రివిక్ర మావతార వైభవమును వేద విదులు వర్ణింతురు. ఇది విష్ణుయశస్సం కీర్తనము.

దత్తాత్రేయావతారము

భూయో భూతాత్మనోవిష్ణోః ప్రాదుర్భావో మహాత్మనః

యోదత్తత్రేయఇతిఖ్యాతః క్షమయా పరయా యుతః

పూర్వనష్టేషు వేదేషు ప్రక్రియాసు మఖేషుచ

చాతుర్వర్ణ్యే చ సంకీర్ణే ధర్మే శిథిలతాం గతే

అతివర్ధతిచాధర్మే సత్యేనష్టేనృతే స్థితే

 ప్రజాస్శు శీర్యమాణాసు ధర్మే చాకులతాం గతే

నయజ్ఞాః సక్రియా వేదాః ప్రత్యానీతా హి తేనవై

చాతుర్వర్ణ్యమసంకీర్ణం కృతం కేన మహాత్మనా

తేనహైహయ రాజస్య కార్తవీర్యస్య ధీమతః

వరదేన వరో దత్తో దత్తాత్రేయేణ ధీమతా

ఏతద్బాహుద్వయం య త్తేతత్తే మమకృతే నృప

శతానిదశ బాహూనాం భవిష్యంతి నసంశయః

పాలయిష్యసి కృత్స్నంచ వసుదాం వసుధేశ్వర

దుర్నిరీక్ష్యోరిబృందానాం యుద్ధస్థశ్చ భవిష్యసి

ఏష వో వైష్ణవః శ్రీమాన్ప్రాదుర్భావోద్భుతః శుభః

భూతాత్మ యగు విష్ణువు యొక్క కేవలక్షమాల క్షణమైన యవతారము దత్తాత్రేయుడను పేర వచ్చి ప్రఖ్యాతి జెందినది. వేదములు నశింప ప్రక్రియ యజ్ఞలు నశింప చాతుర్వర్ణ్యము సంకరమై ధర్మము శిథిలమై అధర్మము బెరుగ సత్యము చెడి అసత్యము పెరుగ ధర్మము వ్యాకులము గాగ యజ్ఞముతో క్రియలతో నతడు వేదములను పునరుద్ధరించెను. చాతర్వర్ణ వ్యవస్థ నా మహాత్ముడు కాపాడెను. మరియు హైహయ రాజ వంశము వాడైన బుద్ధిమంతు డగు కార్తవీర్యున కాయన వరమిచ్చెను. ఈ నీ బాహువులు రెండును నా నిమిత్తముగ వేయి బాహువు లగును. సర్వ వసుధను పాలింతువు. యుద్ధము నందు శత్రువులకు జూడ నశక్యుడ వగుదువు. ఈ నీ యవతారము విష్ణువు యొక్క యవతారము.

పరశురామావతారము

భూయశ్చ జామదగ్న్యోయం ప్రాదుర్భావో మహాత్మనః

యత్రబాహుసహస్రేణ ద్విషతాం దుర్జయం రణే

రామోర్జున మనీకస్థం జఘాన నృపతిం ప్రభుః

రథస్థం పార్థివం రామః పాతయిత్వార్జునం భువి

ధర్షయిత్వార్జునం రామః క్రోశమానం చ మేఘవత్‌

కృత్స్నం బాహుసహస్రంచ చిచ్ఛేద భృగునందనః

పరశ్వధేన దీప్తేన జ్ఞాతిభిః సహితస్య వై

కీర్ణా క్షత్రియకోటీభి ర్మేరుమందరభూషణాత్రిః

సప్తకృత్యః పృథివీ తేన నిఃక్షత్రియా కృతా

కృత్వా నిఃక్షత్రియాం చైనాం భార్గవః సుమహాయశాః

సర్వపాపవినాశాయ వాజిమేధేవ చేష్టవాన్‌

యస్మిన్యజ్ఞే మహాదానే దక్షిణాం భృగునందనః

మారీచాయ దదౌ ప్రీతః కశ్యపాయ వసుంధరామ్‌

వారణాంస్తురగాంశుభ్రా న్రథాంశ్చ రథినాం వరః

హిరణ్యమక్షయం ధేనూ ర్గజేంద్రాంశ్చ మహీపతిః

దదౌ తస్మిన్మహాయజ్ఞే వాజిమేధే మహాయశాః

అద్యాపి చ హితార్థాయ లోకానాం భృగునందనః

చరమాణ స్తసోఘోరం జామదగ్నః పునః ప్రభుః

అస్తే వై దేవవచ్ఛ్రీమా న్మహేంద్రే పర్వతోత్తమే

ఏషవిష్ణోః సురేశస్య శాశ్వతస్యావ్యయస్యచ

జామదగ్న్యః ఇతిఖ్యాతః ప్రాదుర్భావో మహాత్మనః

ఇటుపై మహానుభావుడగు పరశురాముని యవతార మయ్యెను. అందు వేయి బాహువుల చేత దుర్జయుడైన కార్తవీర్యార్జునుని యాయన సంహరించును. రథము నందున్న కార్తవీర్యుని పరుశురాముడు పుడమిపై పడగొట్టి యప్పటికిని మేఘము వలె గర్జించు చున్న వానిని హడ లగొట్టి వేయి బాహువులను గొడ్డలిచే నఱికెను. వాని జ్ఞాతులను గూడ గొట్టెను. కోట్లకొలది క్షత్రియులతో నిండి మేరు మంథర పర్వత భూషణమైన పృథివి ఇరువది యొక్క మార్లు దండెత్తి నిక్షత్రియ మొనర్చెను. ఈ పాపము పోవుట కాయన అశ్వమేధము గూడ సేసెను. మహాదాన పవిత్రమైన నయ్యజ్ఞ మందాతుడు మరీచి వంశము వాడైన కశ్యపునకు తాను గెల్చిన వసుమతిని దక్షిణగా నిచ్చెను. మరియు నా యశ్వమేధమున గుఱ్ఱములను రథములను ఏనుగులను అక్షయమైన బంగారమును గోవులను దానము సేసెను. ఇప్పుడును భృగు నందనుడగు (భార్గవుడు) పరశురాముడు లోకహితము కొరకు మహా తపస్సు సేయుచు శ్రీమంతుడై దేవుని వలె నున్నాడు. ఇది, దేవపతి యవ్యయుడు శాశ్వతుడు నైన విష్ణువు యొక్క పరశురాముడను పేరి యవతారము.

దశరథ రామావతారము

చతుర్వింశే యుగే వాపి విశ్వామిత్రపురఃసరః

జజ్ఞే దశరథస్యాథ పుత్రః పద్మాయతేక్షణః

కృత్వాత్మానం మహాబాహు శ్చతుర్థా ప్రభురీశ్వరః

లోకేరామ ఇతి భ్యాత స్తేజసా భాస్కరోపమః

ప్రసాదనార్థం లోకస్య రక్షసాం నిగ్రహాయ చ

ధర్మస్య చ వివృద్ధ్యర్థం జజ్ఞే తత్ర మహాయశాః

తమప్యాహుర్మనుష్యేంద్రం సర్వభూతహితేరతమ్‌

యః సమాః సర్వధర్మజ్ఞ శ్చతుర్దశ వనేవసత్‌

లక్ష్మణానుచరో రామః సర్వభూత హితేరతః

చతుర్దశ వనే తప్త్వా తపోవర్షాణి రాఘవః

గృహిణీ తస్య రామస్య సీతేతి ప్రథితా జనైః

పూర్వోదితా తు యా లక్ష్మీర్భర్తారమనుగచ్చతి

జనస్థానే వసన్కార్యం త్రిదశానాం చకార సః

తస్యాపకారిణం క్రూరం పౌల స్త్యం మనుజర్షభః

సీతాయాః వదమన్విచ్ఛ న్నిజఘాన మహాయశాః

దేవాసురగణానాంచ యక్షరాక్షసభోగినామ్‌

యత్రావధ్యం రాక్షసేంద్రం రావణం యుధి దుర్జయమ్‌

యుక్తం రాక్షసకోటీభి ర్నీలాంజనచయోపమమ్‌

త్రైలోక్యరావణం క్రూరం రావణం రాక్షసేశ్వరమ్‌

దుర్జయం దుర్మదం దృప్తం శార్దూల సమవిక్రమమ్‌

దుర్నిరీక్ష్యం సుఠగణై ర్వరదానేన దర్పితమ్‌

జఘాన సచివైః సార్ధం ససైన్యం రావణం యుధి

మహాభ్రగణసంకాశం మహాకాయం మహాబలమ్‌

రావణం నిజఘానాశు రామో భూతపతిః పురా

సుగ్రీవస్య కృతే యేన వానరేంద్రో మహాబలః

వాలీవినిహతః సంఖ్యే సుగ్రీవశ్చాభిషేచితః

ఇరువది నాల్గవ త్రేతాయుగ మందు విశ్వామిత్రుని పురస్కరించు కొని దశరథునకు కమలాక్షు డవతరించెను. ఆయన తనను నాల్గు విధములుగ నొనరించు కొని సాక్షాత్‌ సూర్యుని వలె వెలుంగుచు రాముడను ప్రసిద్ధి నొందెను. లోకా నుగ్రహమునకు రాక్షస నిగ్రహమునకు ధర్మ సమగ్ర వృద్ధి కొరకు మహా కీర్తిశాలి దయ చేసినారు. సర్వభూత హితుడు నరేంద్రుడని యాయన నందురు. సర్వ ధర్మజ్ఞు డాతడు. లక్ష్మణు డనుసరింప పదునాల్గేండ్ల రణ్యమున వసింసి. తపస్సు చేసెను. ఆయన గృహిణి సీత. జగత్ర్పసిద్ధురాలు మున్నేను చెప్పిన మహాలక్ష్మియే సీతగా భర్త ననుగమించినది. జన స్థానమున వసించుచు నాయన వేల్పుల కార్యమును జక్క పెట్టినాడు. ఆయన కపకారి యైన పరమ క్రూరుని రావణుని సీతజాడ నెరిగి బోయి సంహరించి నాడు. ఆ రావణుడు దేవాసుర యక్ష రాక్షస నాగాది గణముల కవధ్యుడు. కారు మేఘ మట్లున్న వానిని రాక్షస కోట్లు వెంబడించినవి. ముల్లోకములు నా రావమెత్త జేసినందున (ఏడ్పించి నందున) రావణుడను పేరు గన్న యా రాక్షస రాజును దుర్జయుని దుర్మదుని దృక్తుని శార్దూల విక్రముని దుర్నిరీక్ష్యుని వరదాన గర్వితుని మంత్రులతో సేనలతో గూడ సమూలముగ రామచంద్ర ప్రభువు సంహరించెను. అచేసిన రావణ సంహారము సర్వ జగత్సంహారము చేసిన భూతపతి (శివుని యొక్క) చేతవలె దీవించెను. సుగ్రీవుని కొరకు మహా బలుడైన వానరేంద్రుడు వాలి నిహతు డయ్యెను. సుగ్రీవు డభిషిక్తు డయ్యెను.

మధోశ్చ తనయో దృప్తో లవణో నామ దానవః

హతో మధువనే వీరో వరమత్తో మహాసురః

యజ్ఞవిఘ్నకరౌ యేన మునీనాం భావితాత్మనామ్‌

మారీచశ్చ సుబాహుశ్చ బలేన బలినాం వరౌ

నిహతౌ చ నిరాశౌచ కృతౌతేన మహాత్మనా

సమరే యుద్ధశౌండేన తథాన్యే చాపి రాక్షసాః

విరాధంద కబంధంచ రాక్షసౌ భీమవిక్రమౌ

జఘాన పురుషవ్యాఘ్రో గంధర్వౌ శాపమోహితౌ

హుతాశనార్కాంశుతడిద్గణాభైః ప్రతప్తజాంబూనదచిత్ర పుంఖైః

మహేంద్రవ్రాశనితుల్యసారై రిపూన్స రామః సమరే నిజఘ్నే

తస్మై దత్తాని శస్త్రాణి విశ్వామిత్రేణ ధీమతా

వధార్థం దేవశత్రూణాం దుర్థర్షాణాం సురైరపి

మధువను రాక్షసుని కుమారుడు లవణుడు. వాడు మధువన మందు సంహరింప బడెను. మునుల యజ్ఞములను జెరచిన మారీచ సుబాహులు శ్రీరామునిచే నిహతులైరి. మరి యెందరో రాక్షసులు సంహరింప బడిరి. శాప వశులైన గంధ్వరులు విరాధ కంబధు లాయనచే గూలిరి. ఆయన బాణము లగ్ని రవితేజ స్స్వరూపములు. బంగారపు విచిత్రమైన పుంఖములు కలవి. ఆ మహానుభావునకు విశ్వామిత్రుడు అమోఘము లైన శస్త్రాస్త్రములు నొసంగెను.

వర్తమానే మఖే యేన జనకస్య మహాత్మనః

భగ్నం మాహేశ్వరం చాపం క్రీడతా లీలయా పురా

ఏతానికృత్వా కర్మాణి రామో ధర్మభృతాం వరః

దశాశ్వమేధాన్జారూథ్యా నాజహార నిరర్గళాన్‌

మహానుభావుడైన జనక చక్రవర్తి యొక్క యజ్ఞ మందు రాముడు శివ చాపమును విలాసము గనెత్తి విరచెను. ఈ పనులు సేసి ధర్మమూర్తి రామమూర్తి యవిఘ్నముగ పది అశ్వమేధ యాగములు సేసెను.

నాశ్రూయంతాశుభావాచో నాకులం మారుతో వవౌ

 న విత్తహరణం చాసీ ద్రామే రాజ్యం ప్రశాసతి

పరిదేవంతి విధవా నానర్థాశ్చ కదాచన

గర్వమాసీచ్ఛుభం తత్ర రామేరాజ్యం ప్రశాసతి

న ప్రాణినాం భయం చాసీ జ్జలాగ్న్యనిలఘాతకామ్‌

న చాపి వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి చక్రిరే

బ్రహ్మచర్యపరం క్షత్రం విశస్తు క్షత్రియే రతాః

శూద్రాశ్చైవహి వర్ణాంస్త్రీం శుశ్రూషంత్యనహంకృతాః

నార్యో నాత్యచరన్భర్త్రూ న్భార్యాం నాత్యచరత్పతిః

సర్వమాసీజ్జగద్దాంతం నిర్దస్యు రభవన్మహీ

రామఏకోభవద్భర్తా ద్రామః పాలయితాభవత్‌

ఆసన్వర్ష సహస్రాణి తథా పుత్రసహప్రిణః

అరోగాః ప్రాణినశ్చాస న్రామే రాజ్యం ప్రశాసతి

దేవతానామృషీణాంచ మనుష్యాణాంచ సర్వశః

పృథివ్యాం సమవాయోభూ ద్రామే రాజ్యం ప్రశాసతి

గాథామప్యత్ర గాయంతి యే పురాణవిదోజనాః

రామే నిబద్ధత త్త్వార్థాః మాహాత్మ్యం తస్య ధీమతః

శ్యామోయువా లోహితాక్షో దీప్తాస్యో మితభాషితః

రాముడు రాజ్యము ప్రశాసించు చుండ దొంగ తనములు లేవు. వైధవ్య దుఃఖము లేదు. సర్వము శుభ మయ్యెను. వాయు జలాగ్న్యాది భూత ప్రకోపము వలని భయము లేదు. పెద్దవాండ్రు బాలురకు ప్రేత కార్యములు చేయుట లేదు. క్షత్రియ జాతి బ్రహ్మ చర్య పరమై యుండెను. అనగా బ్రాహ్మణుల కధీనులై ప్రవర్తించిరి. వైశ్యులు క్షత్ర పరులైరి. శూద్రులు మూడు వర్ణముల వారు చెప్పినట్లు వినిరి. అహంభావము లేని వారైరి. స్త్రీలు భర్తలను భర్త భార్యను అతిక్రమించి నడువ లేదు. సర్వ జగత్తు ప్రశాంత మయ్యెను. భూమి చోర రహిత మయ్యెను. రాము డొక్కడే భరించు వాడు (భర్త) రాము డొక్కడే పాలించు వాడు. పుత్ర సహస్రములతో ననే కవర్ష సహస్రములు ప్రజలు జీవించిరి. ప్రాణులు రోగము లేకుండా యుండెను. దేవతలకు ఋషులకు మనుష్యులకు నన్యోన్య సామరస్యము పృథివి యందు నెలకొల్పెను. ఇచ్చట పురాణజ్ఞులు రాముని యెడల చంచలమైన తత్వ జ్ఞానము గలవారు. ఆ బుద్ధి మంతుని మాహాత్మ్యమును గురించి యీకింద్రి విధమైన గాథను గానము సేయుదురు.

ఆజానుబాహుః సుముఖః సింహస్కంధో మహాభుజః

దశవర్షసహస్రాణి రామో రాజ్యమకారయత్‌

ఋక్సామయుజుషాంఘోషో జ్యాఘోషశ్చ మహాత్మనః

ఆవ్యుచ్ఛిన్నోభవద్రాష్ట్రేదీయతాం భుజ్యతామితి

సత్త్వవాన్గుణసంపన్నో దీప్యమానః స్వతేజసా

ఆతిచంద్రంచ సూర్యంచ రామో దాశరథిర్బఖౌ

ఈజేక్రతుశతైః పుణ్యైః సమాప్తవర దక్షిణైః

హిత్వాయోధ్యాం దివం యాతో రాఘవో హి మహాబలః

ఏవమేవ మహాబాహు రిక్ష్వాకుకులనందనః

రావణం సగణం హత్వా దివ మాచక్రమే విభుః

రాముడు చామన చాయ మేనివాడు. రక్తాంత లోచనుడు. కళకళ లాడు నెమ్మోము వాడు. అజాను బాహువు. ప్రసన్న ముఖుడు. సింహము నూపురము వంటి నూపురము గలవాడు. మహా వీరుడు. ఆ రాముడు పది వేలేండ్లు రాజ్యము సేసెను. ఆయన రాష్ట్రమున ఋగ్యుస్సామ వేదముల యొక్క ఘోషము జ్యాఘోషము (ధనుష్టంకారము) యెడతెరగ కుండెను, ఇవ్వండి తినండి యన్న ధ్వని నిర్విరామముగ వినిపించెను. సత్వ సంపన్నుడు గుణ సంపన్ను డైన రాముడు కేవలము తన తేజస్సుచే దేదీప్యమాను డయ్యెను. రామ చంద్రుడు చంద్రుని సూర్యులను మించి తేజరిల్లెను. పవిత్ర క్రతు శతము సంపూర్ణ శ్రేష్ఠి దక్షిణమైన దాని నతడు యజించెను. అయోధ్యను విడచి మహాబలుడు రాఘవుడు దివమ్మున కేగెను. ఇక్ష్వాకు కుల నందనుడైన దశరథ నందనుడు సగణముగ రావణుని జంపి స్వర్గ మాక్రమించెను.

అపరః కేశవస్యాయం ప్రాదుర్భావో మహాత్మనః

విఖ్యాతో మాథురేకల్పే సర్వలోకహితాయవై

యత్రసాల్వం చ చైద్యం చ కంసం ద్వివిదమేవచ

ఆరిష్టం వృషభం కేశిం పూతనాం దైత్యదారికామ్‌

నాగం కువలయాపీడం చాణూరం ముష్టికం తథా

దై త్యాన్మానుషదేహేన సూదయామాస వీర్యవాన్‌

ఛిన్నంబాహుసహస్రంచ బాణస్యాద్భుతకర్మణః

నరకశ్చ హతః సంఖ్యే యవనాశ్చ మహాబలః

హృతాని చ మహీపానాం సర్వరత్నాని తేజసా

దురాదర్షాశ్చ నిహితాః పార్థివా యే మహీతలే

మహాత్ముడైన విష్ణువు యొక్క మరొక యవతార వర్ణనము ఈ తరువాతి యవతారము. ఇది సర్వలోక హితమునకై మాధుర కల్పము నందు వచ్చినట్లు విఖ్యాతి గన్నది. ఇందు సాల్వ చైద్య కంస ద్వివిద వృషభ కేశి పూతనా రిష్టాదులను కువలయా పీడ చాణూర ముష్టి కాదులను మానుషా కారముతో వచ్చి సంహరించెను. ఇందే బాణుని వేయి బాహువులు తెగినవి. నరకుడు కూలెను. కాలయవనుడు గడతేరెను. అనేక మంది రాజుల యొక్క సర్వ రత్నములు (సర్వ ద్రవ్యము లందు సర్వశ్రేష్ఠ వస్తువులు) ద్వారక కుంగొని రాబడినవి. ధుర్ధర్షులైన రాజులు భూతలమున కొరిగిరి. ఇది లోక హితమునకు వచ్చిన పరమాత్మ యొక్క యవతారము.

కల్కి యవతారము

ఏష లోకహితార్ధాయ ప్రాదుర్భావోమహాత్మనః

కల్కీవిష్ణుయశానామ శంభలగ్రామసంభవః

సర్వలోకహితార్థాయ భూయో దేవో మహాయశాః

ఏతేచాన్యే చ బహవో దిత్యా దేవగణై ర్యుతః

ప్రాదుర్భావః పురాణేషు గీయతే బ్రహ్మవాదిభిః

యత్రదేవా విముహ్యంతి ప్రాదుర్భావానుకీర్తనే

పురాణం వర్తతే యత్ర వేదశ్రుతి సమాహితమ్‌

ఏతరుద్దేశ మాత్రేణ ప్రాదుర్భావానుకీర్తనమ్‌

కీర్తితం కీర్తనీయస్య సర్వలోకగురోర్విభోః

ప్రీయంతే పితరస్తస్య ప్రాదుర్భావాను కీర్తనాత్‌

విష్ణోరమితవీర్యస్య యః శృణోతి కృతాంజలిః

ఏతాశ్చ యోగేశ్వరయోగమాయాః శ్రుత్వానరో ముచ్యతే సర్వపాపైః

ఋద్ధిం సమృద్ధిం విపులాంశ్చభోగా న్ప్రాప్నోతి శీఘ్రం భగవత్ప్రసాదాత్‌

ఏవంమయా మునిశ్రేష్ఠా విష్ణోరమితతేజసః

సర్వపాపహరాః పుణ్యాః ప్రాదుర్భావాః ప్రకీర్తితాః

కల్కిమూర్తి శంభల గ్రామమున విష్ణు యశస్సను పేరున సర్వలోక హితమునకు నవతరించును. ఇవే గాక దితితో దేవ గణములతో వచ్చిన యవతారములను బ్రహ్మవాదులు పురాణము లందు గీర్తించి యున్నారు. ఈ యవతార కీర్తన మందు దేవతలు గూడ తబ్బిబ్బు వడుదురు. వేద ధ్వనితో బాటు పురాణ కీర్తన ప్రవచనము జరుగ వలెనను నుద్దేశ్యముతో నా యవతార చరిత్ర వర్ణింప బడినది. కీర్తనీయుడైన సర్వ జగద్గురులైన విష్ణువు యొక్క యీ చరిత్ర కీర్తించుట వలన పితృ దేవతలు సంప్రీతు లగుదురు. మరియు విష్ణువు యొక్క ఈ కథ కృతాంజలియై విన్నవాడు యోగీశ్వరేశ్వరుడు ఐన యా స్వామియొక్క యోగ మాయ విలాసములను విన్న నరుడు సర్వ పాపముల నుండి విమోచన నుండి సమృద్ధి యైన బుద్ధిని (జ్ఞానమును) విస్తారము లైన భోగములను భగవత్‌ ప్రహదము వలన శీఘ్రముగ బొందును. మునీంద్రులార ఇట్లు నాచే నమిత తేజస్వియైన విష్ణువు యొక్క పుణ్యా వతారములు సర్వపాప హరములు. సమగ్రముగా కీర్తింప బడినవి.