బ్రహ్మ మహా పురాణము

229 - వ్యాస ముని సంవాదే విష్ణు భక్తి హేతు కథనమ్‌

విష్ణు భక్తి హేతు కథనము

మునులు:

శ్రుతం ఫలం గీతికాయా అస్మాభిః సుప్రజాగరే

కృష్ణస్య యేన చాండాలో గతోసౌ పరమాం గతిమ్‌

యథా విష్ణౌ భవేద్భక్తి స్తన్నో బ్రూహి మహామతే

తపసా కర్మణా యేన శ్రోతుమిచ్ఛాను సాంప్రతమ్‌

మునులు:

ప్రజాగరము చేసి విష్ణు మహిమ గానము చేసి చాండాలుడును ముక్తిని పొందిన విషయము వింటిమి. మహామతి శాలివగు ఓ వ్యాస మహర్షీ! ఏ తపస్సుచే ఏ కర్మ నాచరించుటచే విష్ణవు నందు భక్తి కలుగునో ఆ ఉపాయమును మాకు తెలుపుము. వినగోరు చున్నాము అని మునులు అడిగిరి.

వ్యాసులు:

శృణుధ్వం మునిశార్దూలాః ప్రవక్ష్యా మ్యను పూర్వశః

యథాకృష్ణే భవేద్భక్తిః పురుషస్య మహాఫలా

సంసారేస్మి న్మహాఘోరే సర్వభూతభయావహే

మహామొహకరే నౄణాం నానాదుఃఖ శతాకులే

తిర్య గ్యోని సహస్రేషు జాయమానః పునః పునః

కథంచిల్ల భతే జన్మ దేహీ మానుష్యకం ద్విజాః

మానుషత్వేపి విప్రత్వం విప్రత్వేపి వివేకితా

వివేకాద్ధర్మబుద్ది స్తు బుద్ద్యా తు శ్రేయసాం గ్రహః

యావ త్పాపక్షయం పుంసాం న భవే జ్జన్మసంచితమ్‌

తావన్న జాయతే భక్తి ర్వాసుదేవే జగన్మయే

తస్మా ద్వక్ష్యామి భో విప్రా భక్తిః కృష్ణే యథా భవేత్‌

అన్యదేవేషు యా భక్తిః పురుషస్యేహ జాయతే

కర్మణా మనసా వాచా తద్గతే నాంతరాత్మనా

తేన తస్య భవే ధ్భక్తి ర్యజనే మునిసత్తమాః

సకరోతి తతో విప్రా భక్తిం చాగ్నేః సమాహితః

తుష్టే హుతాశనే తస్య భక్తి ర్భవతి భాస్కరే

పూజాం కరోతి సతత మాదిత్యస్య తతో ద్విజాః

ప్రసన్నే భాస్కరే తస్య భక్తిర్భవతి శంకరే

పూజాం కరోతి విధవ త్ప తు శంభో ప్రయత్నతః

తుష్టే త్రిలోచనే తస్య భక్తిర్భవతి కేశవే

సంపూజ్య తం జగన్నాథం వాసుదే వాఖ్య మవ్యయమ్‌

తతో భుక్తిం చ ముక్తించ స ప్రాప్నోతి ద్వి జోత్తమాః

వ్యాసులు:

ఓ ముని శ్రేష్టులారా! మానవునకు మహా ఫలప్రద మగు విష్ణుభక్తి కలుగు ఉపాయము క్రమముగా చెప్పెదను. వినుడు. మహా ఘోరమును సర్వ ప్రాణులకు భయమును కలిగించునదియు మహా మోహమును కలిగించు నదియు నానా విధములగు నూర్ల కొలది దుఃఖములతో నిండి నదియు అగు ఈ సంసారమున జీవుడు వేల కొలదిగా తిర్యగ్యోనుల వృక్ష పశు పక్ష్యాది జన్మముల యందు మరల మరల జన్మించి ఎంతో కష్టము మీద మనుష్య జన్మమును పొందును. అందును. బ్రహ్మణు డగుట అందును వివేకము కలుగుట అందును ధర్మము నందు ప్రవృత్తి అందును శ్రేయఃప్రద మయిన వానిని గ్రహించుట దుర్లభము. సంచిత పాపము సంపూర్ణముగా నశించ నంత వరకు సర్వ జగద్రూపుడగు వాసుదేవుని యందు భక్తి కలుగదు. కనుక అందులకు ఉపాయము తెలిపెదను. వినుడు. త్రికరణము లతో శుద్ధిగా అన్య దేవతల యందు మనస్సు నిలిపి అనుష్ఠించు భక్తి వలన యజ్ఞములు చేయుట యందు శ్రద్ద కలుగును. అప్పుడు అగ్ని యందు భక్తి కలిగి యజ్ఞములు చేసి అగ్నిని తృప్తి నొందించుటచే సూర్యుని యందు భక్తి కలుగును. భాస్కరుని ఉపాసించి అతనిని ప్రీతునిగా చేయుట వలన శంకరుని యందు భక్తి కలగును. విధి విధానానుసారము శంకరుని ఆరాధించి అతనిని తుష్టి నొందించుట వలన విష్ణుని యందు భక్తి కలుగును. జగద్రక్షకుడును అవ్యయుడును నాశనము లేనివాడు అగు వాసు దేవుని సంపూజించుట వలన నరుడు భుక్తిని ముక్తిని పొందును.

మునులు:

అవైష్ణవా నరా యేత తు దృశ్యంతే చ మహామునే

కిం తే విష్ణుం నార్చయంతి బ్రూహి త త్కారణం ద్విజ

మునులు:

ఓ మహామునీ! లోకమున వైష్ణవులు కాని వారు కొందఱు కనబడుటకును వారా విష్ణును నర్చింప కుండుటకును హేతు వేమని మునులు వ్యాసు నడిగిరి.

వ్యాసులు:

ద్వౌ భూతసర్గౌ విఖ్యాతౌ లోకేస్మిన్మునిపత్తమాః

అసురశ్చ తథా దైవః పురా సృష్టః స్వయంభువా

దైవీం ప్రకృతి మాసాద్య పూజయంతి తతోచ్యుతమ్‌

అసురీం యోని మాపన్నా ధూషయంతి నరా హరిమ్‌

మాయయా హత విజ్ఞానా విష్ణో స్తేతు నరాధహాః

ఆప్రాప్య తం హరిం విప్రా స్తతో యాం త్యధమాం గతిమ్‌

తస్య యా గహ్వరీ మాయా దు ర్విజ్ఞేయా సురాసురైః

మహామోహకరీ నౄణాం దుస్తరా చాకృతాత్మభిః

ఓ ముని శ్రేష్టులారా! స్వయంభూ బ్రహ్మ చేయు ఈ భూత సృష్టి దైవీ సృష్టి అసుర సృష్టి అని రెండు విధములు దైవీ ప్రకృతి = స్వభావము కలవారు విష్ణుని భక్తితో అర్చింతురు. ఆసురీ ప్రకృతి కలవారు హరిని ధూషింతురు. ఆసురీ ప్రకృతి గల నరాధములు మాయచే విజ్ఞానము నశించి నందున విష్ణుని చేరలేక అధమ గతిని పొందుదురు. విష్ణుని మాయ గంభీర మైనది. సురాసురు లకును తెలిసికొన శక్యము కానిది. మహా మోహము కలిగించునది సంస్కారము నొందిన మనస్సులు లేని వారికి దాట శక్యము కానిది.

మునులు:

ఇచ్చానుస్తాం మహామాయాం జ్ఞాతుంవిష్ణోః

సుదుస్తరామ్‌ వక్తుమర్హసి ధర్మజ్ఞ పరం కౌతూహలం హినః

మునులు:

ఓ ధర్మజ్ఞా! సుదుస్తర మగు విష్ణుని మహా మాయను గూర్చి తెలిసికొన కుతూహల మగుచున్నది, తెలుపుము.

వ్యాసులు:

స్వప్నేంద్రజాలసంకాశా మాయా సా లోకకర్షణీ

కః శక్నోతి హరే ర్మాయాం జ్ఞాతుం తాం కేశవా దృతే

యా వృత్తా బ్రాహ్మణస్యాసీ న్మాయార్థే నారదస్య చ

విడంబనాం తు తాం విప్రాః శృణుధ్వం గదతో మమ

ప్రాగాసీ న్నృపతి శ్రీమా నాగ్నీధ్ర ఇతి విశ్రుతః

నగరే కామదమన స్తస్యాథ తనయః శుచిః

ధర్మారామః క్షమాశీలః పితృశుశ్రూషణే రతః

ప్రజానురంజకో దక్షః శ్రుతిశాస్త్రకృతశ్రమః

పితాస్య త్వకరో ద్యత్నం వివాహాయ న చైచ్ఛత

తం పితా ప్రాహ కిమితి నేచ్ఛ సే దారసంగ్రహమ్‌

సర్వమేత త్సుఖార్థం హి వాంఛంతి మనుజాః కిల

సుఖమూలా హి దారాశ్చ తస్మా త్తం త్వం సమాచర

స పితుర్వచనం శ్రుత్వా తూష్ణీ మాస్తే చ గౌరవాత్‌

ముహుర్ముహు స్తం చ పితా చోదయామాస భోద్విజాః

అథాసౌ పితరం ప్రాహ తాత నామా నురూపతా

మయా సమాశ్రితా వ్యక్తా వైష్ణవీ పరిపాలినీ

తం పితా ప్రాహ సంగమ్య నైష్య ధర్మోస్తిపుత్రక

నవిధారయితవ్యా స్యా త్పురుషేణ విపశ్చితా

కురు మద్వచనం పుత్ర ప్రభురస్మి పితా తవ

మా నిమజ్జ కులం మహ్యం నరకే సంతతి క్షయాత్‌

స హి తం పితు రాదేశం శ్రుత్వా ప్రాహ సుతో వశీ

ప్రీతః సంస్మృత్య పౌరాణీం సంసారస్య విచిత్రతామ్‌

లోకములను ఆకర్షించు ఆ విష్ణు మాయ స్వప్నముతో ఇంద్ర జాలముతో సమాన మైనది. దానిని విష్ణువు తప్ప మఱవ్వరును తెలిసికొన జాలరు. మాయ విషయములో ఒక బ్రహ్మణునకును నారద మహర్షికిని కూడ జరిగిన మోసము తెలిపెదను వినుడు. ఒక నగరమును పూర్వము అగ్నీధ్రు డగు కామదమనుడు అను రాజుండెడి వాడు. అతని కుమారుడు పవిత్రుడు, ధర్మము నందే ఉండి ఆనందము పొందు వాడు, క్షమా శీలము పితృ సేవాసక్తి ప్రజలను రంజించు సమర్థత కలవాడు, వేదముల యందు శాస్త్రముల యందు పరిశ్రమ చేసిన వాడు. తండ్రి అతనికి పెండ్లి చేయ యత్నించెను. అతడు ఇష్ట పడలేదు. నాయనా! నీవు పెండ్లాడ ఇష్ట పడని కారణమేమి? మనుజులు భార్య వలన సుఖములు లభించునను తలపు తోనే కదా పెండ్లాడుదురు. కనుక నీవును వివాహము చేసికొనుము. అని తండ్రి పలుకగా అయన యందలి గౌరవముచే కుమారుడు ఏమియు సమాధాన మీయక ఊరకుండెను. ఐనను మరల అడుగగా అతడు తండ్రితో ఇట్లు పలికెను, నేను అభివ్యక్తము పరిపాలింప దగినదియు విష్ణునికి సంబంధించి నదియును అగు ‘నామానురూపతా’ నామమునకు తగినట్లు నడచుట అను నియమమును ఆశ్రయించితిని అనెను. తండ్రి ఇట్లు పలికెను. కుమారా? ఇది ధర్మము కాదు. వివేకి యగు పురుషుడు తండ్రి అజ్ఞకు విరుద్ధముగా ఆలోచింప దగదు. నాకు నీపై అధికారము కలదు. నా మాట పాలింపుము. సంతతి ముందునకు సాగక పోవుటచే నా వంశము నరకములో మునుగు నట్లు చేయకుము. అనెను. తండ్రి ఇచ్చిన ఈ అజ్ఞను విని ఇంద్రియ నిగ్రహము కల ఆ కుమారుడు అనాది సిద్ధముగా నున్న ఈ సంసారవు విచిత్ర స్థితిని జ్ఞాపకము చేసికొని ఇట్లు పలికెను.

పుత్రుడు:

శృణు తాత వచో మహ్యం తత్త్వవాక్యం సహేతుకమ్‌

నామానురూపం కర్తవ్యం సత్యం భవతి పార్తివ

మయా జన్మ సహస్రాణి జరామృత్యుశతానిచ

ప్రాప్తాని దారసంయోగ వియోగాని చ సర్వశః

తృణగల్మలతావల్లీ సరీసృపమృగద్విజాః

పశుస్త్రీ పురుషాద్యాని ప్రాప్తాని శతశో మయా

గణకింనరగంధర్వ విద్యా ధరమహోరగాః

యక్షగుహ్యకరక్షాంసి దానవాప్సరసః సురాః

నదీశ్వరసహస్రం చ ప్రాప్తం తాత పునః పునః

సృష్టస్తు బహుశః సృష్టౌ సంహారే చాపి సంహృతః

దార సంయోగయు క్తస్య తా తేదృజ్మే విడంబనా

ఇత స్తృతీయే య ద్వృత్తం మమ జన్మని త చ్చ్రణు

కథయామి సమాసేవ తీర్థమాహత్మ్యసంభవమ్‌

అతీత్య జన్మాని బహూని తాత! నృదేవగంధర్వ మహోరగణామ్‌

విద్యాధరాణాం ఖగకింనరాణాం జాతో హి వంశే సుతపా మహర్షిః

తతో మమాభూదచలా హి భక్తి ర్జనార్దనే లోకపతౌ మధుఘ్నే

వ్రతోపవాసై ర్వివిధైశ్చ భక్త్యా సంతోషత శ్చక్రగదాస్త్రధారీ

తుష్టోభ్యగా త్పక్షిపతిం మహత్మా విష్ణుః సమారుహ్య వరప్రదో మే

ప్రాహోచ్చశబ్దం వ్రియతాం ద్విజాతే వరో హి యం వాంఛసి తం ప్రదాస్యే

తతోహ మూచే హరిమీశితారం తుష్టోసి చే త్కేశవ త ద్వృణోమి

యా సా త్వదీయా పరమా హి మాయా తాం వేత్తు మిఛ్ఛామి జనార్దనాహమ్‌

అథాబ్రవీ న్మే మధుకైటభారిః కిం తే తయా బ్రహ్మన్మాయయా వై

ధర్మార్థకామాని దదాని తుభ్యంపుత్రాణి ముఖ్యాని నిరామయత్వమ్‌

తతో మురారిం పునరుక్తవా నహం భూయో ర్థధర్మార్థ జిగీషు తైవ యత్‌

మాయా త వేమా మిహవేత్తుమిచ్చే మ మాద్య తాం దర్శయ పుష్కరాక్ష

పుత్రుడు:

నాయనా! సహేతుక మగు తాత్త్విక విషయమును చెప్పెద వినుము. ఓ రాజా! నామమునకు అనుగుణముగా ఆచరించుట కర్తవ్యము, అనునది సత్యము. నేను ఎన్నియో జన్మములు జరా మరణములు భార్యలతో సంయోగ వియోగములు గడ్డి, పొదులు, తీగలు సరీసృపములు, ప్రాకెడి పాము వంటి ప్రాణులు, మృగములు, పక్షులు, పశువులు మానవులలో స్త్రీ పురుషులు మొదలగు రూపములు ఎన్నియో పొందితిని. గణ దేవతలగు వసు రుద్రా దిత్యులు కింనర గంధర్వ విద్యాధర నాగులు యక్ష గుహ్యక రాక్షసులు దానవులు అప్సరసలు దేవతలు సముద్రములు మొదలగు అనేక రూపములలో సృష్టింప బడితిని. సంహరింప బడితిని. దారలతో సంయోగము వలన నాకు కలిగిన మోసము ఇటు వంటిది. ఈ జన్మ నుండి పూర్వము మూడవ జన్మమున జరిగి నదియు తీర్థ మాహాత్మ్యముతో సంబంధించి నదియు అగు వృత్తాంతమును సంగ్రహముగా చెప్పెదను వినుము. నేను నర దేవ గంధర్వ నాగ విద్యాధర గరుడ కింనరాది జన్మములు అనేకములు పొందిన తరువాత సుతపంకుడను మహా ఋషిగా జన్మిచింతిని. అట్టి నాకు లోకములకు ప్రభువు, మధువను రాక్షసుని వధించిన వాడునగు జనార్దనుని యందు స్థిరమగు భక్తి కలిగెను. చక్ర గదా ఖడ్గ దారియగు విష్ణుని వివిధము లగు వ్రతములచే ఉపవాసము లచే మెప్పింపగా ఈ మహాత్ముడు నాకు వరమీయ గోరి గరుడుని ఎక్కి వచ్చి ఓ బ్రాహ్మణా! నీకు కావలసిన వరము ఏదో కోరుము. ఇచ్చెదను. అని బిగ్గరగా పలికెను. నీకు నాపై ప్రీతి కలిగి నచో నీ మాయా తత్త్వమును నాకు తెలుపు మని కోరితిని. ధర్మార్థ కామములను శ్రేష్టులగు పుత్రులను బాధా రాహిత్యమును ఇత్తును. తీసి కొనుము. నా మాయను తెలిసికొని ఏమి చేయుదువు? అని విష్ణు వనెను. ధర్మార్థ కామాది పురుషార్థములు చేత నైనను జయింప వలసినది నీ మాయనే కావున నేను దాని తత్త్వమును తెలిసికొన గోరు చున్నాను. కనుక ఓ పుండరీకాక్షా! నీకు నీ మాయా తత్త్వమును చూపుము. అని నేనంటిని.

విష్ణువు:

మాయాం మదీయాం న హి వేత్తి కశ్చిన్న చాపి వా వేత్స్యతి కశ్చి దేవ

పూర్వం సురర్షిర్ద్విజ నారదాఖ్యో బ్రహ్మాత్మజో భూ న్మమ భక్తి యుక్తః

తేనాపి పూర్వం భవతా యథైవ సంతోషితో భక్తిమతా హి త ద్వత్‌

వరం చ దాతుం గతవా సహంచ న చాపి వప్రే పర మేతదేవ

నివారితో మా మతిముఢభావా ద్బవాన్య థైవం వృతవా స్వరం చ

తతో మయోక్తోంభసి నారద త్వంమాయం హి మే వేత్స్యసి సంనిమగ్నః

తతో నిమిగ్నోంభసి నారదోసౌ కన్యా బభౌ కాశిపతేః సుశీలా

తాం యౌవనాఢ్యా మథ చారుధర్మిణే విదర్భరాజ్ఞ స్తనయాయ వై దదౌ

సు ధర్మణే సోపి తయా సమేతః సిషేవ కామా నతులా న్మహర్షిః

స్వర్గే గతే సౌ పితరీ ప్రతాపవా న్రాజ్యం క్రమాయత మవాప్య హృష్టః

విదర్భ రాష్ట్రం పరిపాలయానః పుత్రైః సపౌత్రై ర్భహుభి ర్ర్వతోభవత్‌

అథాభవద్భమిపతేః సుధర్మణః కాశీశ్వరే ణాథ సమం సుయుద్దమ్‌

తత్ర క్షయం ప్రాప సపుత్రపౌత్రం విదర్భరా ట్కాశిపతిశ్చ యుద్దే

తతః సుశీలా పితరం సపుత్రం జ్ఞాత్వా పతిం చాపి సపుత్ర పౌత్రమ్‌

పురా ద్వినిఃసృత్య రణావనిం గతా దృష్ట్వా సుశీలా కదనం మహాంతమ్‌

భర్తు ర్బలే తత్ర పితు ర్బలే చ దుఃఖాన్వితా సా సుచిరం విలప్య

జగామ సా మాతర మార్తరూపా భ్రాతౄన్సుతా న్ర్భాతాసుతా న్సపౌత్రాన్‌

భర్తార మేషా పితరం చ గృహ్య మహాశ్మశానే చ మహాచితిం సా

కృత్వా హుతాశం ప్రదదౌ స్వయం చ యదా సమిద్దో హుతభు గ్బభూవ

తదా సుశీలా ప్రవివేశ వేగా ద్దా పుత్ర హా పుత్ర ఇతి బ్రువాణా

తదా పునః సా ముని ర్నారదోభూత్‌ స చాపి వహ్నిః స్పటికామాలాంభః

పూర్ణం సరో భూదథ చోత్తతార తస్యాగ్రతో దేవవర స్తు కేశవః

ప్రహస్య దేవర్షి మువాచ నారదమ్‌

కస్తే తు పుత్రో వద మే మహర్షే మృతం చకం శోచసి నష్టబుద్దిః

వ్రీడాన్వితో భూ దథ నారదో సౌ తతోహ మేనం పున రేవ చాహ

ఇతిదృశా నారద కష్టరూపా మాయా మదీయా కమలాసనాద్యైః

శక్యా న వేత్తుం సమహేంద్రరుద్రైః కథం భవా న్వేత్స్యతి దుర్విభావ్యమ్‌

విష్ణువు:

నామాయ ఇంత వరకు ఎవరును ఎఱుగరు. ఇక ముందును తెలిసికొన జాలరు. పూర్వము బ్రహ్మకు కుమారుడును దేవర్షియు అగు నారదుడు భక్తి యుక్తుడై నీవు వలెనే నన్ను ఆరాధించి మెప్పించెను. నేనతనికి వరమీయ బోవ అతడును ఇదే కోరెను. నే నెంతగా వలదు అని చెప్పి నను అతడు మూఢుడై ఈ వరము నకై పట్టు పట్టెను. అంతట నేనతనితో నారదా! నీవు నీటిలో మునిగినచో నా మాయ తెలియు నంటిని. నారదుడు నామాట ననుసరించి నీట మునిగి లేచి సుశీలయను కాశిరాజ పుత్రిగా అయ్యెను. ఆమె యౌవన వతి ఐన తరువాత ఆ రాజామెను విదర్భ రాజ కుమారుడగు సుధర్మున కిచ్చి వివాహము చేసెను. ఆ సుధర్ముడు ఈమెతో కామ సుఖమును అనుభవించెను. తన తండ్రి స్వర్గమునకు ఏగిన తరువాత ప్రతాపవంతుడగు ఆ సుధర్ముడు అతని విదర్భ రాజ్యమునకు పాలకుడై పుత్త్ర పౌత్త్రులతో కూడి సంతోషముతో నుండెను. ఇట్లుండ కాశీ రాజును సుధర్మున కును యుద్ధము జరిగెను. తమ పుత్త్ర పౌత్త్రులతో కూడ ఇరువురును నాశము నొందిరి. ఈ విషయము తెలిసి యుద్ధ రంగము నకు పోయి సుశీల చాల తడపు శోకించి ఆర్తురాలై తల్లి కడకు పోమెను. మఱియు మరణించిన తన తండ్రిని భర్తను వారి వారి పుత్త్ర పౌత్త్రాదులను తీసికొని గొప్ప చితిని పేర్చి అగ్నిని ప్రజ్వలింప జేసి హా పుత్త్రా! హా పుత్త్రా! అని శోకించుచు అగ్నిలో ప్రవేశించెను. వెంటనే ఆమె నారదు డయ్యెను. ఆ అగ్ని స్ఫటిక మువలె నిర్మలమును చల్లనిదియు నై నిండు సరస్స య్యెను. అతని ఎదుట నిలిచి దేవ శ్రేష్టుడగు విష్ణువు బిగ్గరగా నవ్వి దేవర్షి యగు నారదునితో ఇట్లు పలికెను! మహర్షీ! నీ కుమారుడు ఎవ్వరు? బుద్ది పొగొట్టు కొని ఎవరిని గూర్చి శోకించు చున్నావు? అది విని నారదుడు సిగ్గు పడెను. నేను (శ్రీ మహా విష్ణువు) అతనితో మరల ఇట్లంటిని, ఓ నారదా! నామాయ ఇటు వంటిది. చాల కష్ట రూప మయినది. బ్రహ్మ రుద్రుడు మహేంద్రుడు కూడ దీని నెఱుగ లేరనిన నీవేమి తెలిసి కొనగలవు? ఈ నామాయ ఇట్టిదని ఊహించు టకును అలవి కానది.

స వాక్య మాకర్ణ్య మహా మహర్షి రువాచ భక్తిం మమ దేహి విష్ణో

ప్రాప్తేథ కాలే స్మరణం తథైవ సదా చ సందర్శన మీశ తేస్తు

య త్రాహ మార్త శ్చితి మద్య రూఢ స్త త్తీర్థ మ స్త్వచ్యుత పాప హంత్రా

అధిష్ఠితం కేశవ నిత్య మేవ త్వయా న హేదం కమలోద్భవేన

తతో మయోక్తో ద్విజ నారదోసౌ తీర్థం సితో దం హి చితి స్తవాస్తు

స్థాస్యా మ్యహం చాత్ర సదైవ విష్ణు ర్మహేశ్వరః స్థాప్యతి చోత్తరేణ

సదా విరించే ర్వదనం త్రినేత్రః స చ్ఛేత్స్వ తేయం త్వథచో గ్రవాచమ్‌

తదా కపాలస్య తు మోచనాయ స మేష్యతే తీర్థ మిదం త్వదీయమ్‌

స్నాతస్య తీర్థే త్రిపురాంతకస్య పతిష్యతే భూమితలే కపాలమ్‌

తతస్తు తీర్థేతి కపాలమోచనం ఖ్యాతం పృథివ్యాం చ భవిష్యతే తత్‌

తదా ప్రభృత్యంబుదవాహనోసౌ న మోక్ష్యతే తీర్థవరం సుపుణ్యమ్‌

న చైవ తస్మి న్ద్విజ సంప్రచక్షతే త త్క్షేత్ర ముగ్రం త్వథ బ్రహ్మవధ్యా

యదా స మోక్ష త్యమరారి హంతా త త్క్షేత్ర ముఖ్యం మహదా ప్తపుణ్యమ్‌

తదా విముక్తేతి మరై రహస్యం తీర్థం స్తుతం పుణ్యద మవ్యయాఖ్యమ్‌

కృత్వా తు పాపాని నరో మహాంతి తస్మి స్ర్పవిష్టః శుచి రప్రమాదీ

యదా తు మాం చింతయతే సశుద్ధః ప్రయాతి మోక్షం భగవ త్ర్పసాదాత్‌

భూత్వా తస్మి న్రుద్ర పిశాచసంజ్ఞో యోన్యంతరే దుఃఖ ముపాశ్నుతేసౌ

విముక్త పాపో బహువర్ష పూగై రుత్పత్తి మాయాస్యతి విప్రగేహే

శుచిర్యతాత్మాస్య తతోంతకాలే రుద్రో హితం తారక మస్య కీర్తయేత్‌

ఇత్యేవ ముక్త్వా ద్విజపర్య నారదం గతోస్మి దుగ్ధార్ణవ మాత్మగేహమ్‌

స చాపి విప్ర స్త్రిదివం చచార గంధర్వరాజేన సమర్చ్యమానః

ఏతత్తవోక్తం నను బోధనాయ మాయా మదీయా న హి శక్యతే సా

జ్ఞాతుం భవా నిచ్ఛతి చేత్తతోద్య ఏవం విశ స్వాప్సు చ మేత్పి యేన

ఏవం ద్విజాతి ర్హరిణా ప్రబోధితో భావ్యర్థయోగా న్నిమమజ్జ తోయే

కోకాముఖే తాత తతో హి కన్యా చాండాల వేశ్మ న్యభవ ద్ద్విజః సః

రూపాన్వితా శీలగుణోపపన్నా అవాప సా యౌవన మాససాద

చాండాలపుత్రేణ సుబాహునాపి వివాహితా రూపవివర్జితేన

పతి ర్నతస్యా హి మతో బభూవ సా తస్య చైవాభిమతా బభూవ

పుత్రద్వయం నేత్రహీనంబభూవ కన్యా చ పశ్చా ద్బధిరా తథాన్యా

పతి ర్దరిద్ర స్త్వథ సాపి ముగ్ధా నదీగతా రోదితి తత్ర నిత్యమ్‌

గతా కదాచి త్కలశం గృహీత్వా సాంతర్జలం స్నాతు మథ ప్రవిష్టా

యావ ద్ద్విజోసౌ పున రేవ తావ జ్జాతః క్రియాయోగరతః సుశీలః

తస్యాః న భర్తాథ చిరం గతేతి ద్రష్టుం జగా మాథ నదీం సుపుణ్యామ్‌

దదర్శ కుంభం స చ తాం తటస్థాం తతోతిదుఃఖా త్ర్పరురోద నాదయన్‌

తతోంధయుగ్మం బధిరా చ కన్యా దుఃఖాన్వితాసౌ సముపాజగామ

తే వై రుదంతం పితరం చ దృష్ట్వా దుఃఖాన్వితా వై రురుదు ర్భృశార్తాః

తతః స పప్రచ్చ నదీతటస్థా న్ద్విజా న్భవద్భి ర్యదియో దేకా

దృష్టా తు తో యార్థముపాద్రవంతీ అఖ్యాత తే ప్రోచు రిమాం ప్రవిష్టా

నదీం న భూయ స్తు సముత్తతార ఏతావ దే వేహ సమీహితం నః

స త ద్వచో ఘోరతరం నిశమ్య రురోద శోకాశ్రు పరిప్లుతాక్షః

తం వై రుదంతం ససుతం సకన్యం దృష్ట్వాహమార్తః సుతరాం బభూవ

ఆర్తిశ్చ మేభూ దథ సంసృతిశ్చ చాండాలయోషాహ మితి క్షితీశ

తతోబ్రవం తం నృపతే మతంగం కి మర్థ మార్తేన హి రుద్యతే త్వయా

తస్యా న లాభో భవితాతిమౌర్ఖ్యా దాక్రందితే నేహ పృథా హి కిం తే

సమా మువాచాత్మజయుగ్మమంధం కన్యా చైకా బధి రేయం తథైవ

కథం ద్విజాతే అధునార్తమేత మశ్వాసయిష్యేప్యథ పోషయిష్యే

ఇత్యేవ ముక్త్వా స సుతైశ్చ సార్థం పూత్కృత్య చ రోదితిస్మ

యథా యథా రోదితి స శ్వపాక స్తథా తథా మే హ్యభవత్కృపాపి

తతోహమార్తం తు నివార్య తంవై స్వవంశ వృత్తాంత మథాచచక్షే

తతః స దుఃఖా త్సహ పుత్రకైః సంవివేశ కోకాముఖ మార్తరూపః

ప్రవిష్టమాత్రే సలిలే మతంగ స్తీర్థప్రభావాచ్చ విముక్త పాపః

విమాన మారుహ్య శశిప్రకాశం యయౌ దివం తాత మమోపపశ్యతః

తస్మి న్ర్పవిష్టే సలిలే మృతే చ మ మార్తి రాసీ దతిమోహక ర్త్రీ

తతోతిపుణ్యే నృపవర్య కోకాజలే ప్రవిష్ట స్త్రిదివం గత శ్చ

నారద మహర్షి నా మాట విని ఇట్లు పలికెను. ఓ విష్ణూ! నాకు నీ యందు భక్తి ఇమ్ము. సమయము వచ్చినప్పుడు నీ సంస్మరణ మును సందర్శనమును నాకు లభించు గాక! నేను ఇప్పుడు అర్తుడనై చితిని ఆరోహించిన స్థలము తీర్థముగా నయి ఓ అచ్యుతా! కేశవా! పాప నాశకుడ వగు నీ చేతను బ్రహ్మ దేవుని చేతను అధిష్ఠింప బడినది అగుగాక! నారదుని కోరిక విని ఓ బ్రాహ్మణా! సుతపో మహర్షీ! నేను (శ్రీమహా విష్ణువు) ఇట్లంటిని. ఓ నారదా! కాశిరాజ కన్యగా నీవు చితి చేసిన తావు సితోద మను తీర్ధ మగును. నేనును మహేశ్వరుడును దీని యందు నిలిచెదము. ఉగ్రముగా మాట లాడిన బ్రహ్మ యొక్క ముఖమును శివుడు త్రుంచిన తరువాత ఆతడీ నీ తీర్థమున స్నానము చేయగనే ఆ బ్రహ్మ కపాలము ఈ తీర్థ స్థానమున భూమిపై పడును. అంతట నుండి దీనికి కపాల మోచన తీర్థమను ప్రఖ్యాతి ఏర్పడును. అప్పటి నుండి ఈ పుణ్య తీర్థము నందు ఇంద్రడు నిరంతరము నిలిచి యుండును. ఇంద్రునికి విడువని బ్రహ్మవధ దోషము అంటగా అతడు దాని నిచ్చట విడిపించు కొనును. కాన దేవతలును ఈ రహస్య మగు మహా తీర్థమును విముక్త తీర్థమని ప్రసిద్ధము చేయుదురు. నరుడు ఎన్ని మహా పాపములు చేసిన వాడైనను ఈ తీర్థమున ప్రవేశించి ఏమరుపాటు లేక స్నానమాడి శుచియై నన్ను స్మరించి నచో శుద్ధుడై భగవదను గ్రహము పొంది ముక్తు డగును. రుద్రపిశాచ మను మహా పాపుడు అనేక జన్మము లంది దుఃఖము లనుభవించును. అతడట్లు జన్మ పరంపరలతో పాపము నశించి అనేక సహస్ర సంవత్సరముల తరువాత విప్ర గృహమున జన్మించును. అతడా జన్మములో మహా నిగ్రహము కలవాడగును. అతని అంత కాలమున రుద్రుడు హితకర మగు తారక మంత్రము నతని కుపదేశించును. ఓ విప్రా? నేనిట్లు నారదునకు చెప్పి నా నివాస మగు క్షీర సాగరము నకు వెళ్ళితిని. విప్రుడు నారద మహర్షి యును గంధర్వ రాజుచే సమర్పించ బడుచు స్వర్గమున సంచరించెను. ఓ సుతపో మహామునీ! నిన్ను ప్రబోధించు టకై నీకు ఈ నారద వృత్తాంతము తెలిపితిని. నా మాయను నీవు ఎఱుగ జాలవు. నీవది తెలిసికొన గోరినచో ఈ కోకాముఖ తీర్థ మందు మునుగుము. అని విష్ణువు పలికెను. విష్ణుని వచనము ననుసరించి విప్రుడగు సుతపో మహాముని తన భవిష్యత్‌ ఫలమునకు వశుడై ఆ నీట మునిగెను. నాయనా! ఆ బ్రాహ్మణుడు వెంటనే చండాల గృహమున కన్యగా నయ్యెను. ఆమె మంచి రూపము శీలము గుణములు కలది. క్రమముగా యౌవన వంతురాలు కాగా ఆమెకు రూప హీనుడగు సుబాహుడను చండాల కుమారునితో వివాహ మయ్యెను. భర్త ఆమెకు ఇష్టుడు కాలేదు. కాని భర్తకు ఆమె ఇష్టు రాలయ్యెను. ఆమెకు ఇద్దఱు అంధులగు కుమారులును ఒక చెవిటి కుమార్తెయు కలిగిరి. భర్త దరిద్రుడు. అందుచే ఆ అమాయికురాలు అను దినము నదికి పోయి ఏడ్చు చుండెడిది. ఒకా నొకప్పుడా చండాల కన్యక బిందె తీసికొని నదికి పోయి స్నానమునకై నీటిలో ప్రవేశించి లేవగనే కర్మ యోగము నందు అసక్తు డగు సుతపో మహాముని యను బ్రాహ్మణుడుగా మొదటి రూపమునకు మారెను. భర్త యగు సుబాహుడును భార్య నదికి పోయి చాలా సేపయినదే యని నదికి వెడలి అచట కడవ మాత్రముండి ఒడ్డున ఆమె కనబడక పోవుటచే మహా దుఃఖమున ఆ ప్రదేశము మారు మ్రోగునట్లు ఏడువ సాగెను. అంతలో గ్రుడ్డి కుమారులును చెవిటి కూతురును అచటికి వచ్చి తమ తండ్రి ఏడ్చు చుండుట చూచి తామును ఏడువ సాగిరి. తరువాత సుబాహుడు అచ్చట నున్న బ్రాహ్మణులను మీరెవరైన నీటికి నదిలో దిగిన యువతిని చూచితిరా! చెప్పుడు అని అడిగెను. ఆమె నదిలో దిగుట చూచితిమి. కాని పైకి వచ్చినట్లు చూడలేదు. అని వారు చెప్పిరి. భయంకర మగు ఆమాట విని సుబాహుడు కన్నీళ్ళు కారుచుండ గట్టిగా ఏడువ నారంభించెను. ఓ రాజా! అట్లు అతడును కొడుకులును కూతురును ఏడ్చుట చూచి నాకు చాల బాధ కలుగుటతో బాటు నేనే అంత వరకు చండాల కన్యకగా ఉంటినను విషయము స్మరణమునకు వచ్చెను. అందుచే నేనా సుబాహునితో నీవిట్లు ఎందులకు అర్తుడవై ఏడిచెదవు? మూర్ఖుడవై ఎంత ఏడ్చినను ఆమె నీకు లభింపదు. అంటిని. అతడు నాతో ఇట్లనెను. ఓ బ్రాహ్మణా! ఈ కుమారులు ఇద్దరును గ్రుడ్డి వారు. కుమార్తె చెవిటిది. దుఃఖించు చున్న వీరిని నేను ఎట్లు ఓదార్చ గలను? ఎట్లు పెంచి పెద్ద చేయ గలను? ఇట్లు పలికి అతడు కుమారులతో కుమార్తెతో కూడ వెక్కివెక్కి ఏడువ సాగెను. అతడు ఏడ్చిన కొలది నాకు వారిపై దయ కలిగెను. అందుచే నతని ఏడ్పు మాన్పించి నా వృత్తాంతము నాతనికి తెలిపితిని. అతడును మిగుల ఆర్తుడై ఆ కోకాముఖ తీర్థమున మునిగెను. నీటిలో ప్రవేశించ గనే ఆ తీర్థ ప్రభావమున వాడు పాపముల నుండి ముక్తుడై నేను చూచు చుండగనే చంద్రుని వలె ప్రకాశించెడి విమాన మెక్కి స్వర్గమునకు పోయెను. అతడట్లు మరణించ గనే కును మోహకర మగు మనోవ్యథ కలిగెను. ఓ రాజశ్రేష్ఠా! నేనును మహాపవిత్ర మగు కోకా జలమున మునిగి స్వర్గమునకు వెళ్ళితిని.

భూయోభవం వైశ్యకులే వ్యథార్తో జాతిస్మర స్తీర్థ వరప్రసాదాత్‌

తతోతినిర్విణ్ణమనా గతోహం కోకాముఖం సంయత వాక్యచిత్తః

వ్రతం సమాస్థాయ కళేబరం స్వం సంశోయిత్వా దివ మారురోహ

తస్మా చ్చ్యత ప్త్వ ద్భవనే చ జాతో జాతిస్మర స్తాత హరిప్రసాదాత్‌

సోహం సమారాధ్య మురారిదేవం కోకాముఖే త్యక్త శుభా శుభేచ్ఛః

ఇత్యేవ ముక్త్వా పితరం ప్రణమ్య గత్వా చ కోకాముఖ మగ్రతీర్థమ్‌

విష్ణుం సమారాధ్య వరాహరూప మవాప సిద్ధిం మనుజర్షభోసౌ

ఇత్థంస కామదమనః నహపుత్రపౌత్రః కోకాముఖే తీర్థవరే సుపుణ్యే

త్యక్త్వా తనుం దోషమాయీం తతస్తుగతో దివం సూర్యసమై ర్విమానైః

ఏవం మయోక్తా పరమేశ్వరస్య మాయా సురాణా మపి దుర్విచింత్యా

స్వప్నేంద్రజాల పత్రిమా మురారే ర్యయా జగన్యోహ ముపైతి విప్రాః

తరువాత జన్మమున వైశ్య కులము నందు వ్యథతో బాధపడు వాడనుగా కోకాముఖ తీర్థ ప్రభావమున పూర్వజన్మ స్మృతి కలవాడనుగా జన్మించితిని. అంతట నేను చాల వైరాగ్యము చెంది వాక్కును మనస్సును నిగ్రహములో ఉంచుకొని కోకాముఖ తీర్థమునకు వెళ్ళితిని. అచ్చటనే వ్రతము పూని శరీరము కృశింప జేసికొని దేహ త్యాగము చేసి స్వర్గమును పొందితిని. స్వర్గము నుండి దిగి భూలోకము నందు కూడ విష్ణుని అనుగ్రహము వలన పూర్వజన్మ స్మృతి కలవాడను గా నీయింట పుట్టితిని. ఇట్లు నేను శ్రీమహా విష్ణుని ఆరాధించి కోకాముఖ తీర్థమున శుభాశుభము లగు కోరికలు ఏవియు లేకుండ వదలు కొనిన వాడ నైతిని. అని పలికి ఆ రాజ కుమారుడు తండ్రిని నమస్కరించి శ్రేష్ఠమగు కోకాముఖ తీర్థమునకు పోయి ఆ మనుజ శ్రేస్ఠుడు వరాహ రూపుడగు శ్రీమహావిష్ణు నారాధించి సిద్ధిని పొందెను. ఇట్లు ఆ కామ దమనుడను నతడు తన పుత్ర పౌత్త్రులతో కూడ మహాపవిత్ర మగు కోకాముఖ తీర్థమున అపవిత్ర మగు మానవ శరీరమును విడిచి సూర్య సమములై ప్రకాశించెడి విమానములలో స్వర్గమున కేగెను. ఓ బ్రహ్మణులారా! దేవతలకు ఊహింప అలవి కానిదియు స్వప్నము లోను ఇంద్రజాలము తోను సమానమును లోకమును మోహ పరచు నదియునగు పరమేశ్వరుడగు విష్ణుని మాయను మీకు తెలిపితి నని వ్యాస మహా ముని పలికెను.