మునులు:
నమ్యక్ర్కియేయం విప్రేంద్రః వర్ణితా శిష్టసంమతా
యోగమార్గో యథాన్యాయం శిష్యాయేహ హితైషిణా
సాంఖ్యే త్విదానీం ధర్మస్య విధిం ప్రబ్రూహి తత్త్వతః
త్రిషు లోకేషుయద్ జ్ఞానం సర్వం తద్విదితం హి తే
మునులు:
ఓ విప్రేంద్రా! శిష్ట సమ్మత మగు యోగమార్గ ప్రక్రియను తాము యుక్తి యుక్తమగు శిష్యులగు మాకు హితముగా ప్రతిపాదించితిరి. లోక త్రయము నందును ప్రసిద్ధి పొంది యున్న సాంఖ్య జ్ఞానమునకు సంబంధించిన శాస్త్ర తత్త్వమును దాని యందు సిద్ధిని పొంద గోరిన వారు పాటించ వలసిన ధర్మమును ఉన్నది ఉన్నట్లుగా మాకు ప్రవచింప గోరు చున్నాము.
వ్యాసులు:
శృణుధ్వం మునయః సర్వ మాఖ్యానం విదితాత్మానమ్
విహితం యతిభిర్వృద్ధైః కపలిలాదిభిరీశ్వరైః
యస్మిస్సు విభ్రమాః కేచి ద్దృశ్యంతే మునిసత్తమాః
గుణాశ్చ యస్మిన్బహవో దోషహానిశ్చ కేవలా
జ్ఞానేన పరిసంఖ్యాయ సదోషాన్విషయాన్ద్విజాః
మానుషాన్దుర్జయాస్కృత్స్నా న్పైశాచాన్విషయాం స్తథా
విషయానౌరగాన్జ్ఞాత్వా గంధర్వ విషయాం స్తథా
పితౄణాం విషయాన్జ్ఞాత్వా తర్యక్త్వం చరతాం ద్విజాః
సువర్ణ విషయాన్జ్ఞాత్వా మరుతాం విషయాం స్తథా
మహర్షి విషయాంశ్చైవ రాజర్షి విషయాం స్తథా
ఆసురాన్విషయాన్జ్ఞాత్వా వైశ్వదేవాం స్తథైవ చ
దేవర్షి విషయాన్జ్ఞాత్వా యోగానామపి వైపరాన్
విషయాంశ్చ ప్రమాణస్య బ్రహ్మణో విషయాం స్తథా
ఆయుషశ్చ పరం కాలం లోకైర్విజ్ఞాయ తత్త్వతః
సుఖస్య చ పరం కాలం విజ్ఞాయ మునిసత్తమాః
ప్రాప్తకాలే చ యద్దుఃఖం పతతాం విషయైషిణామ్
తిర్వక్త్వే పతతాం విప్రా స్తథైవ నరకేషు యత్
స్వర్గస్య చ గుణాన్జ్ఞాత్వా దోషాన్సర్వాంశ్చ భో ద్విజాః
వేదవాదే చ యే దోషా గుణా యే చాపి వైదికాః
జ్ఞానయోగే చ యే దోషా జ్ఞానయోగే చ యే గుణాః
సాంఖ్య జ్ఞానే చ యే దోషాం స్తథైవ చ గుణా ద్విజాః
సత్త్వం దశగుణం జ్ఞాత్వా రజో నవగుణం తథా
తమశ్చాష్ట గుణం జ్ఞాత్వా బుద్ధిం సప్తగుణం తథా
షడ్గుణం చ నభో జ్ఞాత్వా తమశ్చ త్రిగుణం మహత్
ద్విగుణం చ రజో జ్ఞాత్వా సత్త్వం చైకగుణం పునః
మార్గం విజ్ఞాయ తత్వైన ప్రలయ ప్రేక్షణేన తు
జ్ఞాన విజ్ఞాన సంపన్నాః కారణైర్భావితాత్మభిః
ప్రాప్నువంతి శుభం మోక్షం సూక్ష్మా ఇవ నభః పరమ్
రూపేణ దృష్టిం సంయుక్తాం ఘ్రాణం గంధగుణేన చ
శబ్దగ్రహ్యం తథా శ్రోత్రం జిహ్వాం రసగుణేన చ
త్వచం స్పర్శం తథా శక్యం వాయుం చైవ తదాశ్రితమ్
మోహం తమసి సంయుక్తం లోభం మోహేషుసంశ్రితమ్
విష్ణుం క్రాంతే బలే శక్రం కోష్ఠే సక్తం తథానలమ్
అప్సు దేవీం సమాయుక్తా మాపస్తేజసి సంశ్రితాః
తేజో వాయౌ తు సంయుక్తం వాయుం నభసి చాశ్రితమ్
నభో మహతి సంయుక్తం తమో మహసి సంస్థితమ్
రజః సత్త్వం తథా సక్తం సత్త్వం సక్తం తథాత్మని
సక్తమాత్మాసమీశే చ దేవే నారాయణే తథా
దేవం మోక్షే చ సంయుక్తం తతో మోక్షం చ న క్వచిత్
జ్ఞాత్వా సత్త్వగుణం దేహం పృతం షోడశభిర్గుణైః
స్వభావం భావనాం చైవ జ్ఞాత్వా దేహసమాశ్రితామ్
మధ్యస్థమివ చాత్మానం పాపం యస్మిన్నవిద్యతే
ద్వితీయం కర్మ వైజ్ఞాత్వా విప్రేంద్రా విషయైషిణామ్
ఇంద్రియాణీంద్రియార్థాంశ్చ సర్వానాత్మని సంశ్రితాన్
దుర్లభత్వం చ మోక్షస్య విజ్ఞాయ శ్రుతి పూర్వకమ్
ప్రాణాపానౌ సమానం చ వ్యానోదానౌ చ తత్త్వతః
ఆద్యం చై వానిలం జ్ఞాత్వా ప్రభవం చానిలం పునః
సప్తధా తాంస్తథా శేషా న్స ప్తధా విధివత్పునః
ప్రజాపతీనృషీంశ్చైవ నర్గాంశ్చ సుబహూన్వరాన్
సప్తర్షీంశ్చ బహూన్జ్ఞాత్వా రాజర్షీంశ్చ పరంతపాన్
సురర్షీన్మరుతశ్చాన్యా న్ర్బహ్మర్షీన్సూర్యసంనిభాన్
ఐశ్వర్యాచ్చ్యా వితాన్దృష్ట్వా కాలేన మహతా ద్విజాః
మహతాం భూత సంఘానాం శ్రుత్వా నాశం చ భో ద్విజాః
గతిం వాచాం శుభా జ్ఞాత్వా అర్చార్హాః పాపకర్మణామ్
వైతరణ్యాం చ యద్దుఃఖం పతితానాం యమక్షయే
యోనీషు చ విచిత్రాసు సంచారానశుభాం స్తథా
జఠరే చాశుభే వాసం శోణితోదక భాజనే
శ్లేష్మమూత్ర పురీషే చ తీవ్రగంధ సమన్వితే
శుక్రశోణితం సంఘాతే మజ్జాస్నాయ పరిగ్రహే
శిరాశత సమాకీర్ణే నవద్వారే పురేథ వై
విజ్ఞాయ హితమాత్మానం యోగాంశ్చ వివిధాన్ద్విజాః
తామసానాం చ జంతూనాం రమణీయానృతాత్మనామ్
సాత్త్వికానాం చ జంతూనాం కుత్సితం ముని సత్తమాః
గర్హితం మహతామర్థే సాంఖ్యానాం విదితాత్మనామ్
ఉపప్లవాం స్తథా ఘోరా న్శశిన స్తేజస స్తథా
తారాణాం పతనం దృష్ట్వా నక్షత్రాణాం చ పర్యయమ్
ద్వంద్వానాం విప్రయోగం చ విజ్ఞాయ కృపణం ద్విజాః
అన్యోన్యభక్షణం దృష్ట్వా భూతానామపి చాశుభమ్
బాల్యే మోహం చ విజ్ఞాయ పక్షదేహస్య చాశుభమ్
రాగం మోహం చ సంప్రాప్తం క్వచిత్స త్త్వం సమాశ్రితమ్
సహస్రేషు నరః కశ్చి న్మోక్ష బుద్ధిం సమాశ్రితః
దుర్లభత్వం చ మోక్షస్య విజ్ఞానం శ్రుతి పూర్వకమ్
బహుమాన మలబ్దేషు లబ్ధే మధ్యస్థతాం పునః
విషయాణాం చ దౌరాత్మ్యం విజ్ఞాయ చ పునర్ద్విజాః
గతాసూనాం చ సత్త్వానాం దేహాన్భిత్త్వా తథా శుభాన్
వాసం కులేషు జంతూనాం మరణాయ ధృతాత్మనామ్
సాత్త్వికానాం చ జంతూనాం దుఃఖం విజ్ఞాయ భో ద్విజాః
బ్రహ్మఘ్నానాం గతిం జ్ఞాత్వా పతితానాం సుదారుణమ్
సురాపానే చ సక్తానాం బ్రాహ్మణానాం దురాత్మనామ్
గురుదార ప్రసక్తానాం గతింవ విజ్ఞాయ చాశుభమ్
జననీషు చ వర్తంతే యేన సమ్యగ్ద్విజో త్తమాః
సదేవకేషు లేకేషు యేన వర్తంతి మానవాః
తేన జ్ఞానేన విజ్ఞాయ గతిం చాశుభకర్మణామ్
తిర్యగ్యోని గతానాం చ విజ్ఞాయ చ గతీః పృథక్
వేదవాదాం స్తథా చిత్రా నృతూనాం పర్యయాం స్తథా
క్షయం సంవత్సరాణాం చ మాసానాం చ క్షయం తథా
పక్షక్షయం తథా దృష్ట్వా దివసానాం చ సంక్షయమ్
క్షయం వృద్ధిం చ చంద్రస్య దృష్ట్వా ప్రత్యక్షత స్తథా
పృద్ధిం దృష్ట్వా సముద్రాణాం క్షయం తేషాం తథా పునః
క్షయం ధనానాం దృష్ట్వా చ పునర్వృద్ధిం తథైవచ
సంయోగానాం తథా దృష్ట్వా యుగానాం చ విశేషతః
దేవవై క్లబ్యతాం చైవ సమ్యగ్విజ్ఞాయ త త్త్వతః
ఆత్మదోషాంశ్చ విజ్ఞాయ సర్వానాత్మని సంస్థితాన్
స్వదేహాదుత్థితాన్గంధాం స్తథా విజ్ఞాయ చాశుభాన్
వ్యాసులు:
ఓ మునులారా! వినుడు. అత్మ తత్త్వము నెఱిగిన వారును సమర్థులును నగు కపిలాది వృద్ధ యతులు తెలిపిన విషయమును తెలిపెదను. వారిలో కొందరు ఉత్తమమగు బుద్ధి వైశారద్యము కల ముని సత్తములును కలరు. వారు చెప్పిన వానిలో సుగుణము లెన్నియో కలవు. దోష మొక్కటియు లేదు. అది యేమనిన వివేకముచే దుర్జయము లగు విషయము లను వాని యందలి దోషములను ఎరుగ వలెను. ఆ విషయములు మనుషులు పిశాచులు ఉరగులు గంధర్వులు పితరులు తిర్యక్ర్పాణులు గరుడులు మరుత్తులు మహర్షుష్యులు రాజర్షులు అసురులు విశ్వేదేవుడు దేవర్షులు యోగులు బ్రహ్మ వీరనుభవించు విషయములు వేరువేరు విధములుగా నుండును. వాని యందలి దోషములును వివిధములు. కాల పరిమాణము ఆయువు సుఖము ననుభవించ వలసిన కాలము విషయాభిలాష వలనను తిర్వగ్జన్మల యందును నరకము నందును గల దుఃఖములును దోషములును స్వర్గ సుఖము నందలి గుణములును దోషములును వేద వాదము జ్ఞానము సాంఖ్య యోగము దశ గుణములు కల సత్త్వము నవ గుణములు కల రజస్సు, అష్ట గుణములు గల తపస్సు, సప్త గుణములు కల బుద్ధి షడ్గుణ యుక్తమగు సభస్సు (ఆకాశము), త్రిగుణ మగు తమస్సు ఏక గుణ మగు సత్త్వము మోక్షము నకు కొనిపోవు మార్గము. ప్రళయ తత్త్వ స్వరూపములు ఎరిగి ఈ చెప్పిన వాని యందలి గుణ దోషము లను గుర్తెరిగి ఆత్మ తత్త్వాభ్యాసము చేసిన వారు చెప్పిన యుక్తులతో జ్ఞానమును, విజ్ఞానమును. జ్ఞాన మనగా విషయమును ఎరుగుట, విజ్ఞాన మనగా తెలిసిన దానిని అనుభవము లోనికి తెచ్చు కొనుట, సంపాదించి నిఃశ్రేయసమను సర్వ శుభతమ మగు మోక్షమును పొందుదురు. చక్షుస్పు రూపముతో అగ్నితో ఘ్రాణము గంధముతో పృథివితో శ్రోత్రము శబ్దముతో ఆకాశముతో జిహ్వ రసముతో జలముతో త్వగింద్రియము స్పర్శముతో వాయువుతో నిత్య సంబంధము కలవి. తమస్సు నందు మోహము మొహము నందు లోభము నిలిచి యున్నవి. నడక యందు విష్ణువు బలము నందు ఇంద్రుడు ఉదరము నందు అగ్ని జలము నందు భూదేవి తేజస్సు నందు జలము వాయువు నందు తేజస్సు ఆకాశము నందు వాయువు మహ త్తత్త్వము నందు ఆకాశము మహస్సు నందు సత్త్వ రజ స్తమస్సులు నిలిచి యుండును. సత్త్వము ఆత్మ యందు ఆత్మ నారాయణు నందు ఆశ్రయించి యుండును. నారాయణుడు మోక్షము నందు నిలిచి యుండును. మోక్షమున కాశ్రయ మేదియు లేదు. స్థూల దేహము పదునారు గుణములతో ఏర్పడినది. స్వభావము భావన అనునవి దేహము నాశ్రయించి యుండును. ఆత్మ మాత్రము ఏ పాపములు అంటక తటస్థమయి యుండును. విషయ సుభాభిలాష కలవాడు చేయు కర్మలను ఇంద్రియములను ఆత్మ యందలి ఇంద్రి యార్థములను మోక్షము దుర్లభమను విషయమును శాస్త్ర ప్రమాణమున తెలిసికొన వలెను. ప్రాణా పాన వ్యానోదాన సమాన వాయువులను ప్రాణ తత్త్వోత్పత్తిని ఏడు విధములుగా నున్న శీర్షణ్యము లగు ప్రాణములను ప్రజాపతులను ఋషులను సృష్టులను సప్తర్షులను రాజర్షులను దేవర్షులను మరుత్తులను సూర్య సమాను లగు బ్రహ్మర్షులను ఉత్తమ లోక సుఖా నుభవము తరువాత అచటి నుండి జారి అధోలోక గతి పొందు వారిని మహాభూత సంఘ నాశమును శుభమగు వాక్కుల గతులను దశలను పూజార్చనోపాస నాదులను పాప కర్మలు పొందెడి వైతరణి యమ లోకము లందలి దుఃఖమును వివిధ జన్మల యందు జీవుని అశుభ సంచారమును శోణితము ఉదకము శ్లేష్మ మూత్ర పురీషములు తీవ్ర దుర్గంధము, వీటితో నిండిన మాతృ గర్భమున నివాసము శుక్రము శోణితము మజ్జ స్నాయువు వందల కొలది సిరలు, వీటితో ఏర్పడిన ద్వారములు గల పురమగు దేహమున జీవుని నివాసమును తనకు హితమైన దానిని తామస రాజస సాత్త్వాక ప్రాణులు సాధించ గల యోగముల వైవిధ్యమును తమః ప్రధాన యోగ సాధకుల కుత్సిత గతి విశేషములను ఆత్మ తత్త్వము నెరిగిన సాంఖ్యులు ఉత్తమ విషయములు సాధించుటలో పొందు ఉపద్రవములను గ్రహముల తారల చంద్రుని యొక్క నక్షత్రముల యొక్క పతనములను నక్షత్రముల తారు మారును జంటలు దీనముగా ఎడ బాయుటను ఆయా ప్రాణులు పరస్పరము భక్షించు కొను అశుభ కృత్యకమును బాల్యము నందలి అజ్ఞానమును స్థూల దేహపు అశుభ స్థితిని సత్త్వ గుణమును ఆశ్రయించి కూడ ఉండెడి రాగ మోహములను వేల మందిలో ఏ ఒక్కడో మాత్రమే ముముక్షువు అగుటను వేద ప్రమాణ విజ్ఞానముతో సాధించు మోక్షము దుర్లభము అగుటను లభించని కోరికలపై ఆదరమును అది తీరగానే ఉపేక్షా భావమును విషయ సుఖముల లోని దోషములను ప్రాణము పోయిన వారి అశుభ స్థితులను ప్రాణ త్యాగము తానే చేయ నిశ్చయించు కొనిన మహానుభావులు తమ శుభమైన దేహములను కూడ భేదించుకొని పోవుటను శుభమైన వంశముల యందు తమ సంకల్పముతో జన్మింప గలుగుటను సాత్త్వికు లైన ప్రాణులు కూడ దుఃఖ మనుభవించుటను బ్రహ్మఘ్నలు పతితులు పొందెడి దారుణ గతిని బ్రాహ్మణులై ఉండియు దురాత్ములై సురాపానము గురుదార గమనము మొదలగు మహా పాపముల చేసి పొందు దుర్గతిని మాతృ ద్రోహి పొందు దుర్గతిని ఉత్తములు పొందెడి దేవలోక గతిని అశుభ కర్మల గతులను తిర్యక్ ప్రాణులు పొందెడి మూఢ గతులను వేద వాదముల వైవిధ్యమును ఋతువుల తారు మారును సంవత్సర మాస పక్ష దివసముల క్షయమును చంద్రుని వృద్ధి క్షయములను సముద్ర వృద్ధిని ధన క్షయమును మరల అది పెరుగుటను యుగముల సంయోగములను దేహము శిథిల మగుటను దేహము మూలమున ఆత్మయందు కలుగు దోషములను మలిన దేహము నుండి వెలువడు అశుభ గంధములను ఎరిగి వివేచించి ముముక్షుకై యత్నించి దానిని పొంద వలెను.
మునులు:
కానుత్పాతభవాన్దోషా న్పశ్యతి బ్రహ్మవిత్తమ
ఏతం నః సంశయం కృత్స్నం వక్తు మర్హస్యశేషతః
మునులు:
జీవుడు దేహమును గ్రహించుట వలన కలుగు దోషముల విషయములో మాకు గల సంశయములను బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠుడవగు ఓవ్యాస మహా మునీ! తీర్చ వేడెదము.
వ్యాసులు:
పంచ దోషా న్ద్విజా దేహే ప్రవదంతి మనీషిణః
మార్గజ్ఞాః కాపిలాః సాంఖ్యాః శృణుధ్వం మునిసత్తమాః
కామక్రోధౌ భయం నిద్రా పంచమః శ్వాస ఉచ్యతే
ఏతే దోషాః శరీరేషు దృశ్యంతే సర్వదేహినామ్
ఛిందంతి క్షమయా క్రోధం కామం సంకల్పవర్జనాత్
సత్త్వంసంసేవనా న్నిద్రా మప్రమాదాద్భయం తథా
ఛిందంతి పంచమం శ్వాస మల్పాహారతయా ద్విజాః
గుణాన్గుణశతైర్జ్ఞాత్వా దోషాన్దోషశతై రపి
హేతూ న్హేతుశతై శ్చిత్రై శ్చిత్రాన్విజ్ఞాయ తత్త్వతః
అపాం ఫేనోపమం లోకం విష్ణోర్మాయాశతైః కృతమ్
చిత్రభిత్తి ప్రతీకాశం నలసార మనర్థకమ్
తమః సంభ్రమితం దృష్ట్వా వర్ష బుద్బుద సంనిభమ్
నాశప్రాయం సుఖాదానాం నాశోత్తరమహాభయం
రజస్తమసి సంమగ్నం పంకే ద్విపమివావశమ్
సాంఖ్యా విప్రా మహాప్రాజ్ఞా స్త్యక్త్వా స్నేహం ప్రజాకృతమ్
జ్ఞాన జ్ఞేయేన సాంఖ్యేన వ్యాపినా మహతా ద్విజాః
రాజసానశుభాన్గంధాం స్తామసాంశ్చ తథావిధాన్
పుణ్యాంశ్చ సాత్త్వికాన్గంధా స్స్పర్శజా న్దేహసంశ్రితాన్
ఛిత్త్వాత్మజ్ఞానశ స్త్రేణ తపోదండేన సత్తమాః
తతో దుఃఖాదికం ఘోరం చింతాశోకమహాహ్రదమ్
వ్యాధిమృత్యుమహాఘోరం మహాభయ మహోరగమ్
తమః కూర్మం రజో మీనం ప్రజ్ఞయా సంతరంత్యుత
స్నేహపంకం జరాదుర్గం స్పర్శద్వీపం ద్విజో త్తమాః
కర్మాగాధం సత్యతీరం స్థితం వ్రతమనీషిణః
హర్షసంఘ మహావేగం నానారససమాకులమ్
నానాప్రీతి మహారత్నం దుఃఖజ్వర సమీరితమ్
శోకతృష్ణామహావర్తం తీక్ష్ణవ్యాదిమహారుజమ్
అస్థిసంఘాతసంఘట్టం శ్లేష్మయోగం ద్విజోత్తమాః
దానము క్తాకరం ఘోరం శోణితోద్గారవిద్రుమమ్
హసితోత్కృష్టనిర్గోషం నానాజ్ఞాన సుదుష్కరమ్
రోదనాశ్రుమలక్షారం సంగమోగపరాయణమ్
ప్రలబ్ధ్వా జన్మలోకే యం పుత్రబాంధవసత్తనమ్
అహింసా సత్యమర్యాదం ప్రాణయోగమయోర్మిలమ్
బృందాను గామినం క్షీరం సర్వభూతపయోదధిమ్
మోక్షదుర్లభ విషయం బాడబాసుఖసాగరమ్
తరంతి యతయః సిద్ధా జ్ఞానయోగేన చానఘాః
తీర్త్వా చ దుస్తరం జన్మ విశంతి మిమలం నభః
తతస్తాన్సుకృతీన్జ్ఞాత్వా సూర్యో వహతి రశ్మిభిః
పద్మతంతువ దావిశ్య ప్రవహన్విషయాన్ద్విజాః
తత్ర తాన్ర్పవహో వాయుః ప్రతిగృహ్ణాతి చానఘాః
వీతరాగాన్యతీ న్సిద్ధా వ్వీర్య యుక్తాం స్తపోధనాన్
సూక్ష్మః శీతః సుగంధశ్చ సుఖస్పర్శశ్చ భో ద్విజాః
సప్తానాం మరుతాం శ్రేష్ఠో లోకా న్గచ్ఛతి యః శుభాన్
స తాన్వహతి విప్రేంద్రా సభవః పరమాం గతిమ్
సభో వహతి లోకేశా స్రజసః పరమాం గతిమ్
రజో వహతి విప్రేంద్రాః సత్త్వస్య పరమాం గతిమ్
సత్త్వం వహతి శుద్ధాత్మా పరం నారాయణం ప్రభుమ్
ప్రభుర్వహతి శుద్ధాత్మా పరమాత్మాన మాత్మనా
పరమాత్మాన మాసాద్య తద్భూతా యతయోమలాః
అమృతత్వాయ కల్పంతే న నివ ర్తంతి చ ద్విజాః
పరమా సా గతిర్విప్రా నిర్ద్వంద్వానాం మహాత్మనామ్
సత్యార్జపరతానాం వై సర్వభూతదయాపతామ్
వ్యాసులు:
ఓ ముని సత్తములారా! కపిలుడు ప్రవచించిన సాంఖ్య మార్గము నెరిగిన విద్వాంసులు దైహిక దోషములు కామ క్రోధ భయ నిద్రా శ్వాసములు ఐదనియు అని అన్ని ప్రాణులకు కల వనియు చెప్పుదురు. క్షమచే క్రోధమును సంకల్పములు విడుచుటచే కామమును సత్త్వ గుణము నాశ్రయించి నిద్రను ఎచ్చరికచే భయమును అల్పాహారముచే శ్వాస అయాసమును జయింప వలెను. అనేక గుణముల నుండి ఉత్తమ గుణమును అనేక దోషముల నుండి ప్రధాన దోషములను అనేక యుక్తుల నుండి మోక్ష సాధక మగు యుక్తులను అనేక వైచిత్ర్యముల నుండి ప్రధానమైన వైచిత్ర్యములను గుర్తించి విష్ణుని అనేక మాయలతో ఏర్పడిన ఈ లోకము నీటి మీద నురుగుతో సమానమని తెలిసికొని అజ్ఞానముచే నీటి బుడగ వలె తిరుగుచు సుఖము వలె కన బడుచు నాశముతో నిండి నాశము తరువాత మహా భయము కలిగించుచు బురదలో దిగిన ఏనుగు వలె రజ స్తమో గుణము లందు దిగబడి ఉన్నదని గుర్తించి వైరాగ్యము పొంద వలెను. మహా ప్రాజ్ఞులగు సాంఖ్య తత్త్వము ఎరిగిన వారు దార పుత్రాదులపై ప్రీతి లేక పూజ్యమై సర్వ వ్యాపియైన సాంఖ్య జ్ఞానముచే రాజస తామస అశుభ సంస్కార ములను సత్త్వ గుణ ప్రధాన మైన పుణ్య సంస్కారము లను విషయాభిలాషలను తపస్సు అనెడి కఱ్ఱతోను ఆత్మ జ్ఞానమును ఖడ్గము తోను ఛేదించి దుఃఖ చింతా శోకము లనెడి పెద్ద గోతిని దాట గలుగుదురు. ఆ గోతిలో వ్యాధులు మృత్యువు వలన మహా ఘోర భయమనెడి సర్పములు అజ్ఞాన మనెడి తాబేళ్ళు రజోగుణ మనెడి చేపలు కలవు. దానిని దాటుటకు ప్రజ్ఞయే నావ. అది యొక సముద్రము. ప్రపంచ విషయముల పై ప్రీతి అనెడి బురద ముసలి తనము అనెడి దుర్గములు విషయ సుఖము లనెడి ద్వీపములు కథలు అనెడి అగాధములు సత్త్వము అనెడి తీరము హర్షములు అనెడి మహా వేగములు అనేక అభిరుచులు అనెడి కల్లోలములు నానా విషయములపై ప్రీతి అనెడి మహా రత్నములు దుఃఖ సంతాపములు అనెడి వాయువు శోకము అనెడి పెద్ద సుడులు. తీక్ష్ణవ్యాధి మహాబాధలు ఎముకల రాశులు అనెడి ఎదురు దెబ్బలు దానము అనెడి ముత్యముల రాసులు రక్తము అనెడి పగడములు నవ్వులు అనెడి అలల ధ్వనులు నానా విధములైన అజ్ఞానములు దుఃఖా శ్రువులు అనెడి ఉప్పు ఈ సముద్రము నందు కలవు. దీనిని సిద్ధులై పూజ్యులైన యతులు జ్ఞాన యోగమును నావతో తరింతురు. వారు దేహ త్యాగము తరువాత నిర్మల మగు ఆకాశములో ప్రవేశించ గానే అది ఎరిగి సూర్యుడు తన కిరణములతో విరిని పైకి కొని పోవును. తపో ధనులును యోగ వీర్య వంతులును వైరాగ్య వంతులును సిద్ధులును అగు ఆ యతులను సప్త వాయువులలో శ్రేష్ఠుడును చల్లనై సుఖ స్పర్శ గలిగి సుగంధముతో కూడి సూక్ష్మమైన ప్రవహము అను వాయువు ఆకాశములో అత్యున్నత స్థానమునకు కొనిపోవును. ఆ అకాశోన్నత స్థానము వారిని రజో గుణము యొక్క సత్త్వ గుణము యొక్క ఉన్నత స్థితికిని సత్త్వోన్నత స్థితి శుద్ధత్ముడగు పరమ ప్రభువగు నారాయణుని లోనికిని కొనిపోగా ఆ నారాయణుడు ఈ యతులను తనలో చేర్చుకొని తన రూపమునకు తీసికొని పోవును. ఇట్లు అమలులగు ఈ యతులు నారాయణుడు అను పరమాత్మ తత్త్వమును చేరి ఆ తత్త్వముగానే ఆ అమృతులు అగుదురు. వారు మరల జన్మ పరంపర లోకిని రానక్కర లేదు. సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతులై సత్యము అర్జవము సర్వభూత దయ కలిగి వర్తించిన ఆ మహాత్యములకు అసాయుజ్య స్థితి పరమోత్తమ గతి.
మునులు:
స్థానముత్తమమాసాద్య భగవంతం స్థిరవ్రాతాః
ఆజన్మమరణం వా తే రమంతే తత్ర వా నవా
యదత్ర తథ్యం తత్త్వం నో యథావ ద్వక్తుమర్హసి
త్వదృతే మానవం నాన్యం ప్రష్టు మర్హామ సత్తమ
మోక్షదోషో మహానేష ప్రాప్య సిద్ధిం గతానృషీన్
యది తత్రైవ విజ్ఞానే వర్తంతే యతయః పరే
ప్రవృత్తిలక్షణం ధర్మం పశ్యామ పరమం ద్విజ
మగ్నస్య హి పరే జ్ఞానే కిం తు దుఃఖాంతరం భవేత్
మునులు :
ఉత్తమ మగు ఆ భగవత్తత్త్వ రూపమైన ఉత్తమ స్థానమును చేరిన ఆ స్థిర వ్రతులు జన్మ మరణ రూపమైన సంసార ప్రవృత్తిని నారాయణుడు మరల ఆరంభించు వరకు ఆ మోక్ష స్థితిలో అనందించు చుందురా లేదా? ఈ విషయము లలో వాస్తవమేమో చెప్ప వేడెదము. ఓ ఋషి సత్తమా! ఈ సంశయము నిన్ను తప్ప ఎవరిని అడుగ జాలము. ఏలయన ఈ స్థితి పొందిన ఋషులు అచ్ఛటనే అనుభూతి యందు ఉండి పోయినచో మరల ఈ లోకమున ప్రవృత్తి లక్షణమైన ధర్మమును దేనిని చూచు చున్నామో దానిని సాధించు వారెవరు? లేక వారు మరల జీవులై లోక ప్రవృత్తి లోనికి వచ్చినచో మరల దుఃఖము లోనికి వచ్చుటయే గదా? ఈ విధముగా మీరు వివరించిన మోక్ష స్వరూపములో దోష మొకటి కనబడు చున్నది. ఈ సంశయమును తీర్చ ప్రార్థించు చున్నాము.
వ్యాసులు:
యథా న్యాయం మునిశ్రేష్ఠాః ప్రశ్నః ప్రృష్టశ్చ సంకటః
బుధానామపి సంయోహః ప్రశ్నేస్మిన్ముని సత్తమాః
అత్రాపి తత్త్వం పరమం శృణుధ్వం వచనం మమ
వృద్ధిశ్చ పరమా యత్ర కపిలానాం మహాత్మనామ్
ఇంద్రియాణ్యపి బుధ్యంతేస్వదేహం దేహినాం ద్విజాః
కరణాన్యాత్మన స్తాని సూక్ష్మం పశ్యంతి తై స్తు సః
ఆత్మనా విప్రహీణాని కాష్ఠ కుడ్యనమాని తు
వినశ్యంతి న సందేహో వేలా ఇవ మహార్ణవే
ఇంద్రియైః సహ సుప్తస్య దేహినో ద్విజసత్తమాః
సూక్ష్మశ్చరతి సర్వత్ర సభసీవ సమీరణః
స పశ్యతి యథాన్యాయం స్మృత్వా స్పృశతి చానఘాః
బుధ్యమానో యథాపూర్వ మభిలేనేహ భో ద్విజాః
ఇంద్రియాణి చ సర్వాణి స్వే న్వే స్థానే యథావిధి
అనీశత్వాత్ర్పలీయంతే సర్పా విషహతా ఇవ
ఇంద్రియాణాం తు సర్వేషాం స్వస్థానేష్వేవ సర్వశః
ఆక్రమ్య గతయః సూక్ష్మాశ్చరత్యాత్మా న సంశయః
సత్త్వస్య చ గుణాన్కృత్స్నా న్రజసశ్చ గుణాన్పునః
గుణాంశ్చ తమసః సర్వా న్గుణా న్బుద్ధేశ్చ సత్తమాః
గుణాంశ్చ మనసశ్చాపి సభసశ్చ గుణాంస్తథా
గుణాన్వాయోశ్చ సర్వజ్ఞాః స్నేహజాంశ్చ గుణాన్పునః
అపాం గుణాస్తథా విప్రాః పార్థివాంశ్చ గుణావపి
సర్వానేప గణైర్వ్యాప్య క్షేత్రజ్ఞేషు ద్యిజోత్తమాః
ఆత్మా చరతి క్షేత్రజ్ఞం కర్మణా చ శుభా శుభే
శిష్యా ఇవ మహాత్మాన మింద్రియాణి చ తం ద్విజాః
ప్రకృతిం చాప్యతిక్రమ్య శుద్ధం సూక్ష్మం పరాత్పరమ్
నారాయణం మహాత్మానం నిర్వికారం పరాత్పరమ్
విముక్తం సర్వపాపేభ్యః ప్రవిష్టం చ హ్యనామయమ్
పరమాత్మాన మగుణం నిర్వృతం తం చ సత్తమాః
శ్రేష్ఠం తత్ర మనో విప్రా ఇంద్రియాణి చ భో ద్విజాః
అగచ్ఛంతి యథాకాలం గురోః సందేశకారిణః
శక్యం వాల్పేన కాలేన శాంతిం ప్రాప్తుం గుణాంస్తథా
ఏవముక్తేన విప్రేంద్రాః సాంఖ్యయోగేన మోక్షిణీమ్
సాంఖ్యా విప్రా మహాప్రాజ్ఞా గచ్ఛంతి పరమాం గతిమ్
జ్ఞానేనానేన విప్రేంద్రా స్తుల్యం జ్ఞానం న విద్యతే
అత్ర వః సంశయో మా భూ జ్జ్ఞానం సాంఖ్యం పరం మతమ్
అక్షరం ధ్రువమేవోక్తం పూర్వం బ్రహ్మ సనాతనమ్
అనాదిమధ్యనిధనం నిర్ద్వంద్వం కర్తృ శాశ్వతమ్
కూటస్థం చైవ నిత్యం చ యద్వదంతి శమాత్మకాః
యతః సర్వాః ప్రవర్తంతే సర్గప్రళయ విక్రియాః
ఏవం శంసంతి శాప్త్రేషు ప్రవక్తారో మహర్షయః
సర్వే విప్రాశ్చ వేదాశ్చ తథా సామవిదో జనాః
బ్రహ్మణ్యం పరమం దేవ మనంతం పరమాచ్యుతమ్
ప్రార్థయంతశ్చ తం విప్రా వదంతి గుణబుద్ధయః
సమ్య గుక్తాస్తథా యోగాః సాంఖ్యాశ్చామితదర్శనాః
అమూర్తిస్తస్య విప్రేంద్రాః సాంఖ్యం మూర్తిరితి శ్రుతిః
అభిజ్ఞానాని తస్యాహు ర్మహాంతి మునిసత్తమాః
ద్వివిధాని హి భూతాని పృథివ్యాం ద్విజసత్తమాః
అగమ్యగమ్యసంజ్ఞాని గమ్యం తత్ర విశిష్యతే
జ్ఞానం మహద్వై మహతశ్చ విప్రా వేదేషు సాంఖ్యేషు తథైవ యోగే
యచ్చాపి దృష్టం విధివత్పురాణే సాంఖ్యాగతం తన్నిఖిలం మునీంద్రాః
యచ్చేతిహానేసు మహత్సు దృష్టం యథార్థశాస్త్రేషు విశిష్ట దృష్టమ్
జ్ఞానం చ లోకే యదిహాస్తి కించి త్సాంఖ్యాగతం తచ్చ మహామునీంద్రాః
సమ స్తదృష్టం పరమం బలం చ జ్ఞానం చ మోక్షశ్చ యథావదుక్తమ్
తపాంసి సూక్ష్మాణి చ యాని చైవ సాంఖ్యే యథావ ద్విహితాని విప్రాః
విపర్యయం తస్య హితం పదైవ గచ్ఛంతి సాంఖ్యాః సతతం సుఖేన
తాంశ్చాపి సంధార్య తతః కృత్యార్థాః పతంతి విప్రాయతనేషు భూయః
హిత్వా చ దేహం ప్రవిశంతి మోక్షం దివౌకసశ్చాపి చ యోగసాంఖ్యాః
అతోధికం తేభిరతా మహర్హే సాంఖ్యే ద్విజా భో ఇహ శిష్టజుష్టే
తేషాం తు తిర్యగ్గమనం హి దృష్టం నాధో గతిః పాపకృతాం నివాసః
న వా ప్రధానా అపి తే ద్విజాతయో యే జ్ఞాన మేతన్మునయో న సక్తాః
సాంఖ్యం విశాలం పరమం పురాణం మహార్ణవం విమలముదారకాంతమ్
కృత్స్నం హి సాంఖ్యా మునయా మహాత్మనారాయణే ధారయతాప్రమేయమ్
ఏతన్మయోక్తం పరమం హి తత్త్వం నారాయణాద్విశ్వమిదం పురాణమ్
స సర్గకాలే చ కరోతి సర్గం సంహారకాలే చ హరేత భూయః
వ్యాసులు:
ఓ ముని శ్రేష్ఠులారా! ఈ ప్రశ్నము యుక్తి యుక్తమే గాని మిగుల క్లిష్ట మైనది. ఈ విషయములో మహాత్ములగు కపిలా చార్యుల జ్ఞానమే శ్రేష్ఠ మైనది. ఇంద్రియములు దేహ మందుండి దానిని ఎరుగును. అవి ఆత్మకు ఉపకరణములు కాని ఆత్మ లేనిచో కఱ్ఱల వలె గోడల వలె జడము లై నశించును. ఇంద్రియము లతో కూడ జీవుడు నిద్రించి ఆకాశములో వాయువు వలె సూక్ష్మ రూపమున సంచరించుచు ఎన్నియో చూచుచు మరల మేల్కాంచిన తరువాత నిద్రకు పూర్వము తన అనుభవములో ఉండిన భవములో ఉండిన వాటిని మరల జ్ఞాపకము చేసికొని ఆయా పనులలో మొదటి వలె ప్రవృత్తు లగును. ఆత్మ నిద్రావస్థలలో నున్నప్పుడు మాత్రము ఆ ఇంద్రియములు తామేమియు చేయలేక లయము నొంది పడి ఉండును. కాని ఆత్మ ఆ ఇంద్రియముల సూక్ష్మ తత్త్వమును తీసికొని సత్త్వ రజస్తమో గుణముల మనో బుద్థుల పంచ భూతముల లక్షణములను వెంట బెట్టుకొని స్వప్న లోకమున సంచరించును. అట్లే ఓ బ్రహ్మణులారా! ఇచ్చటను పరమాత్ముడగు నారాయణుడు లోక వ్యవహారము నందలి ఆత్మ వంటివాడు ఆయనలో సాయుజ్యము పొందిన ఈ ముక్త యతులు ఈ ఆత్మకు ఉపకరణము లైన ఇంద్రియముల సత్త్వ రజస్తమో గుణముల, మనో బుద్దుల, వంటి వారు. ఆ పరమాత్మునిలో లయము నొందిన ఈ మహా యతులు మరల నారాయణుని సృష్టి కాలమున నిద్ర మేల్కాంచిన జీవుని ఆధీనములో ఈతని ఇంద్రియాదులు మొదటి వలె పనిచేసి నట్లే వీరును సృష్టి ధర్మములో ప్రవృత్తి పొంది లోక వ్యవహారములో ప్రవర్తిల్ల జేయుదురు. ఇదియే వాస్తవ మైన సాంఖ్య తత్త్వము. దీనిలో సమానమైన జ్ఞాన తత్త్వము మరి యొకటి లేదు. ఈ చెప్పిన నారాయణ పరమాత్మ తత్త్వము అక్షరము ధ్రువము సర్వ పూర్వము సనాతన బ్రహ్మ తత్త్వము ఆనాది మధ్య నిధనము ద్వంద్వ రహితము సర్వకర్త శాశ్వతము కూటస్థము (ఎట్టి స్థితులలో ఏ మార్పులను పొందని అఖండ తత్త్వము) ఆ తత్త్వము నుండియే సృష్టి స్థితి లయములు విప్రులు వేదములు ప్రవర్తిల్లును అని శాస్త్ర ప్రవక్తలగు మహర్షులు సర్వ విప్రులు ప్రణవ తత్త్వము ఎరిగిన మహానీయులు చెప్పు చున్నారు. సాంఖ్య, యోగ, పరు లిద్దరును ఆయన తోడి సాయుజ్యమే కోరి సాధన చేయుదురు. ఏమైనను ఈ ప్రపంచము నందలి భూతములు అగమ్యములు గమ్యములు అని రెండు విధములు. ఈ రెంటిలో గమ్య భూతములు మేలైనవి. (అగమ్యము అనగా తాము పొందు సుఖ దుఃఖాది అనుభవము లను స్పష్ట వాక్కుతో చెప్ప జాలనివి) వేద పురాణ యోగములు ఇతిహాస శాస్త్రము లోక వ్యవహారము వీటి యందు కనబడు జ్ఞాన మంతయు సాంఖ్య తత్త్వము నుండి వచ్చినదే. పరమాత్ముని ఉత్తమోత్తమ బలము జ్ఞానము మోక్షము తపస్సులు వేద శాస్త్ర విహితములైన ఇతర సూక్ష్మ విషయములు ధర్మము అన్నియు సాంఖ్యము నుండి వచ్చినవే. కనుక ఈ పై చెప్పిన ముక్త జీవాత్మలు ఈ ఉత్తమ తత్త్వములను తమలో నిలుపుకొని సాయుజ్య మోక్షముతో కృతార్థులై యుండి మరల సృష్టి కాలమున పవిత్రు లైనవారి గృహముల యందు జన్మింతురు. మరల ఈ దేహమును విడిచిన తరువాత మొదటి వలె మోక్షమును పొందుదురు. ఇట్టి వారికి ఉత్తరోత్తర ముగ ఉన్నత గతులే కాని తిర్యక్ జన్మలు నరక నివాసము కలుగవు. ఈ చెప్పిన సాంఖ్య తత్త్వము విశాలము శ్రేష్టము విమలము ఉదార మైనది. అనాది మహా సముద్రము వంటిది. కనుక మీరును ఓ మునులారా! సాంఖ్య తత్త్వ పరాయణులై అప్రమేయుడును మహాత్ముడును అగు నారాయణని యందు చిత్తము నిలుపుడు. నేను చెప్పిన ఈ పరమతత్త్వ సారాంశ మేమనగా అనాది యగు ఈ ప్రపంచము నారాయణుని నుండియే ప్రభవించినది. అతడే దీనిని సృష్టి కాలములో సృజించును. ప్రళయ కాలము వచ్చి నప్పుడు సంహరించును.
Summary of chapter 133 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The distinction between kṣara (the perishable — all that undergoes change) and akṣara (the imperishable — the unmanifest Prakṛti) is drawn. Beyond both stands the supreme Puruṣottama, the eternal witness who transcends both the perishable manifest world and the imperishable unmanifest. This teaching on the threefold reality is presented as the culmination of the Sāṃkhya-Yoga discourse.