బ్రహ్మ మహా పురాణము

230 - వ్యాస ముని సంవాదే మహాప్రళయ వర్ణనమ్‌

మునులు:

అస్మాభి స్తు శ్రుతం వ్యాస యత్త్వయా సముదాహృతమ్‌

ప్రాదుర్భా వాశ్రితం పుణ్యం మాయా విష్ణోశ్చ దుర్విదా

శ్రోతుమిచ్ఛామహే త్వత్తో యథావ దుపసంహృతిమ్‌

మహాప్రళయ సంజ్ఞాం చ కల్పాంతే చ మహామునే

మునులు:

ఓ వ్యాసమునీ! ఎఱుగ శక్యము కాని విష్ణు మాయా తత్త్వము నీ వలన వింటిమి. కల్పాంతమున జరుగు మహా ప్రళయమున సృష్ట్యుప సంహారమును విన గోరు చున్నాము. అని మునులు వ్యాసుల నడిగిరి.

వ్యాసులు:

శ్రూయతాం బో మునిశ్రేష్ఠా యథావ దనుసంహృతి

కల్పాంతే ప్రాకృతే చైవ ప్రళయే జాయతే యథా

అహోరాత్రం పితౄణాం తు మాసోబ్దం త్రిదివౌకసామ్‌

చతుర్యుగ సహస్రంతు బ్రహ్మణోహర్ద్విజోత్తమాః

కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగమ్‌

దేవైర్వర్షసహస్రై స్తు త ద్ద్వాదశభి రుచ్యతేః

చతుర్యుగ ణ్యశేషాణి సదృశాని స్వరూపతః

ఆద్యం కృతయుగం ప్రోక్తం మునయోంత్యంతథా కలిమ్‌

ఆద్యే కృతయుగే సర్గో బ్రహ్మణా క్రియతే యతః

క్రియతే చోపసంహార స్తథాంతేపి కలౌ యుగే

వ్యాసులు:

ప్రాకృత ప్రళయమున సృష్ట్యుప సంహారము జరుగు విధము వినుడు. మానవుల మాసము పితరులకునను సంవత్సరము దేవతల కును ఒక ఆహోరాత్ర మగును. కృతము త్రేతా ద్వాపరము కలి అను చతుర్యుగము బ్రహ్మకు ఒక పగలు. ఇది దేవతల పండ్రెండు వేల సంవత్సరములకు సమానము, కల్పాది యందలి కృత యుగమున సృష్టియు కల్పాంతము నందలి కలి యుగమున ఉప సంహారము ప్రళయమును జరగును.

మునులు:

కలేః స్వరూపం భగ న్విన్తరా ద్వక్తు మర్హసి

ధర్మశ్చతుష్పాద్బగవా న్యస్మి న్వైకల్యమృచ్ఛతి

మునులు:

ధర్మము నాలుగు పాదములతో నడువక వైకల్యము నొందు కలియుగ స్వరూపము వి నగోరెద మని మునులనిరి.

వ్యాసులు:

కలిస్వరూపం భో విప్రా య త్పృచ్ఛద్ధం మమానఘాః

నిబోధధ్వం సమాసేన వర్తతే య న్మహత్తరమ్‌

వర్ణాశ్రమాచరవతీ ప్రవృత్తి ర్న కలౌ నృణామ్‌

న సమఋగ్వజుర్వేద వినిష్పాదన హైతుకీ

వివాహా న కలౌ ధర్మా న శిష్యా గురుసంస్థితాః

న పుత్రా ధార్మికాశ్చైవ న చ వహ్నిక్రియాక్రమః

యత్రతత్రకులే జాతో బలీ సర్వేశ్వరః కలౌ

సర్వేభ్య ఏవర్ణేభ్యో నరాః కన్యోపిజీవినః

యేన తేనైవ యోగేన ద్విజాతి ర్దీక్షతః కలౌ

యైవ సైవ చ విప్రేంద్రాః ప్రాయశ్చిత్తక్రియా కలౌ

సర్వమేవ కలౌ శాస్త్రం యస్య య ద్వచనం ద్విజాః

దేవతాశ్చ కలౌ సర్వాః సర్వః సర్వస్య చా శ్రమః

ఉపవాస స్తథాయాసో విత్తోత్సర్గ స్తథా కలౌ

ధర్మో యథాభిరుచితై రనుష్ఠానై రనుష్ఠితః

విత్తేన భవితా పుంసాం స్వల్పే నైవ మదః కలౌ

స్త్రీణాం రూపమదశ్చైవ కేశై రేవ భవిష్యతి

సువర్ణమణిరత్నాదౌ వస్త్రే చాపక్షయం గతే

కలౌ స్త్రియో భవిష్యంతి తదా కేశై రలంకృతాః

పరిత్యక్ష్యంతి భర్తారం విత్తహీనం తథా స్త్రియః

భర్తా భవిష్యతి కలౌ విత్తవా నేవ యోషితామ్‌

యో యో దదాతి బహుళం స స స్మామీ తదా నృణామ్‌

స్మామిత్వహేతు సంబంధో భవితా భిజన స్తదా

గృహాంతా ద్రవ్యసంఘాతా ద్రవ్యాంతా తథా మతిః

అర్థా శ్చా థోపభోగాంతా భవిష్యంతి తదా కలౌ

కలి యుగమున నరులు ఋగ్యజుః సామ వేదములు ప్రమాణముగా వర్ణాశ్ర మాచార ధర్మముల యందు ప్రవర్తించరు. వివాహములు ధర్మములు ఉండవు. శిష్యులు గురువుల నాదరించరు. పుత్రులు తమ ధర్మమును పాటించరు. అగ్ని హోత్రాది క్రియలు ఉండవు. ఏ కులమున పుట్టిన వాడైనను బలమున్నచో సర్వేశ్వరుడై పాలకు డగును. అన్ని వర్ణము లందును జనులు తమ కుమార్తెల మూలమున ధన మార్జింతురు. విప్రులు తమకు తోచిన ఏదో యొక విధానమున యాగ దీక్షను వహింతురు. తమకు తోచిన విధానమున ప్రాయశ్చిత్తములు చేయుదురు. ఎవరు ఏది చెప్పిన అదే శాస్త్రము. అందరును అందరకును దేవతలే. అందరకును అన్నియు బ్రహ్మ చర్యాది ఆశ్రమములే. తమకు ఏది ఇష్టమై అనుష్ఠించినచో వారికి అదియే ఉపవాసము. అదే తపస్సు అదే దానము. కొంచెము ధన మున్నను మదము ఎచ్చును. బంగార మణులు రత్నములు అన్నియు నశించగా స్త్రీలకు కేశములే అలంకారమునకు సౌందర్యమునకు కారణమై యుండును. స్త్రీలు ధనవంతునే భర్తగా గ్రహింతురు. ధనహీనుడగు భర్తను వదలుదురు. సేవకులు తమకు ఎక్కువ ధనము ఇచ్చిన వానినే యజమానునిగా గ్రహింతురు. తనమునకు గృహములే ప్రధానోప యోగము తెలివి యున్నందులకు ధన మూర్జించుటయే ప్రధానో పయోగము అస్తి యున్నందులకు సుఖములే ప్రధానోపయోగము. అని కలి యుగ జనులు భావింతురు.

 స్త్రియః కలౌ భవిష్యంతి న్వైరిణ్యో లలితస్వృహాః

అన్యాయా వాప్తవిత్తేషు పురుషేషు స్పృహాళవః

అభ్యర్థితోపి సుహృదా స్వార్థహానిం తు మానవః

పణస్యార్ధార్ధమాత్రేపి కరిష్యంతి తదా ద్విజాః

సదాసపౌరుషం చేతో భావి విప్ర తదా కలౌ

క్షీరప్రదాన సంబంధి భాతి గోషు చ గౌరవమ్‌

అనావృష్టిభయా త్ర్పాయః ప్రజాః క్షుద్బయకాతరాః

భవిష్యంతి తదా సర్వా గగనాస క్తదృష్టయః

మూలవర్ణ ఫలాహారా స్తాపసా ఇవ మానవాః

ఆత్మానాం ఘాతయిష్యంతి తదా వృష్ట్యాభిదుఃఖితాః

దుర్భిక్ష మేవ సతతం సదా క్లేశ మనీశ్వరాః

ప్రాప్స్యంతి వ్యాహతముఖం ప్రమదాన్మానవా కలౌ

అస్నాత భోజినో నాగ్ని దేవతాతిథి పూజనమ్‌

కరిష్యంతి కలౌ ప్రాప్తే న చ పిండోదక క్రియామ్‌

లోలుపా హ్రస్వ దేహాశ్చ బహ్వన్నాదనతత్పరాః

బహుప్రజాల్పభాగ్యాశ్చ భవిష్యంతి కలౌ స్త్రియః

ఉభాభ్యా మథ పాణిభ్యాం శిరఃకుండూయనం స్త్రియః

కుర్వత్యో గురు భర్తౄనా మాజ్ఞాం భేత్స్యం త్యనావృతాః

స్వపోషణపరాః క్రుద్ధా దేహసంస్కార వర్జితాః

పరుషానృత భాషిణ్యో భవిష్యంతి కలౌ స్త్రియః

దుఃశీలా దుష్టశీలేషు కుర్వంత్యః సతతం స్పృహామ్‌

ఆసద్వృత్తా భవిష్యంతి పురుషేషు కులాంగనాః

కలియుగమున స్త్రీలు స్వేచ్ఛా ప్రవృత్తి విలాసముల యందు వాంఛ కలిగి యుందురు. అన్యాయముగా ధన మార్జించిన పురుషులను వాంఛింతురు. మిత్రులు కూడ ఎంత వేడినను మానవులు అల్పముగా కూడ తమ ధనమును వదలుకు ఇష్ట పడరు. మనస్సు ఎప్పుడును లౌకిక మైన పురుషార్దములను సాధించుట యందే యుండును. పాలెక్కువగా ఇచ్చుటను బట్టియే గోవులపై గౌరవము. జనులు తరచుగా అనావృష్టికి గుఱియై ఆకలిచే బాధ నొందురు ఆకాశము వైపు వానకై చూచు చుందురు. వేళ్ళు పండ్లు ఆకులు తినుచు తమ్ము తాము చంపుకొని చుందురు. కఱువులతో పడరాని బాధలు పడుచు తట్టు కొనలేక సుఖములు లేక ఉందురు. స్నానము చేయకయే ఆహారము తిందురు. అగ్నిని దేవతలను అంధులను పూజింతురు. పిండోద కాది పితృ క్రియలు చేయరు. స్త్రీలు విషయ సుఖ వాంఛ, చిన్న దేహము, అధికాహారము తినుట, ఎక్కువ సంతానము, తక్కువ భాగ్యము కల వారగుదురు. వారు రెండు చేతులతో తలగోకి కొందురు. దేహమును నిండుగా కప్పుకొనక యుందురు. పెద్దల యొక్క భర్త యొక్క అజ్ఞ మీరుదురు. తమ పొట్ట నింపు కొనుచు కోపనలై దేహ సంస్కారము లేక అసత్యములు పరుషములు మాటాడు చుందురు. దుఃశీలము కలిగి దుఃశీలురగు పురుషుల యందు ఆసక్తి దుష్ర్ప వర్తనము కలిగి యుందురు.

వేదాదానం కరిష్యంతి బాడవా శ్చ తథావ్రతాః

గృహస్థా శ్చ స హోష్యంతి న దాన్యం త్యుచితా న్యపి

భవేయు ర్వన వాసా వై గ్రామ్యాహార పరిగ్రహాః

భిక్షవ శ్చాపి పుత్రా హి స్నేహ సంబంధయంత్రాకాః

అరక్షితారొ హర్తారః శుల్కవ్యాజేన పార్థివాః

హారిణో జనవిత్తానాం సంప్రాప్తే చ కలౌయుగే

యో యోశ్వరథనాగాఢ్యః స స రాజా భవిష్యతి

య శ్చ య శ్చాబలః సర్వః స స భృత్యః కలౌ యుగే

వైశ్యాః కృషివణిజ్యాది సంత్యజ్య నిజకర్మ యత్‌

శూద్రవృత్యా భవిష్యంతి కారుకర్మోప జీవినః

భైక్ష్యవ్రతా స్తథా శూద్రాః ప్రప్రజ్యాలింగినోధమాః

పాఖండసంశ్రయాం వృత్తి మాశ్రయిష్యం త్యసంస్కృతాః

దుర్భిక్షకరపీడాభి రతీవోపద్రుతా జనాః

గోధూమా న్నయవా న్నాద్యా న్దేశా న్యాన్యంతి దుఃఖితాః

వేదమార్గే ప్రలీనే చ పాఖండాఢ్యే తతో జనే

అధర్మవృధ్యా లోకానా మల్పమాయు ర్బశిష్యతి

అశాస్త్రవిహితం ఘోరం తప్యమానేషు వై తపః

నరేషు నృపదోషేణ బాలమృత్యు ర్భవిష్యతి

భవిత్రీ యోషితాం సూతిః పంచషట్పప్తవార్షికీ

నవాష్టదశ వర్షాణాం మనుష్యాణాం తథా కలౌ

పలితోద్గమ శ్చ భవితా తదా ద్వాదశ వార్షికః

న జీవిష్యతి వై కశ్చ త్కలౌ వర్షాణి వింశతిమ్‌

అల్ప ప్రజ్ఞా వృథాలింగా దుష్టాంతః కరణాఃకలౌ

యత స్తతో వినశ్యంతి కాలే నాల్పేన మానవాః

యదా యదా హి పాఖండ వృత్తి రత్రోపలక్ష్యతే

తదా తదా కలే ర్వృద్ధి రనుమేయా విచక్షణైః

బ్రాహ్మణులు ఉపనయనము లేక యే వేదా ధ్యయనము చేయుదురు. గృహస్థులు హోమములు తగినట్లు దానములు చేయరు. యతులు అడవులలో నివసించుచు మొఱటైన ఆహారము తినుచు పుత్రాది స్వజనము పై ప్రీతి కలిగి యుందురు. ప్రభువులు ప్రజలను కాపాడక పోగా పన్నులను పేరుతో ప్రజల ధనమును హరించు చుందురు. అశ్వరథ గజములు ఉన్న వాడే రాజు, బలహీనుడే సేవకుడు. వైశ్యులు కృషి వాణిజ్యము వంటి తమ వృత్తలు విడిచి వడ్రంగము మొదలగు పనులతో శూద్ర వృత్తితో జీవింతురు. శూద్రులు అధములై సన్యాసి వేషముతో నుండి ధర్మములు సంస్కారములు లేక భిక్షా వృత్తితో యతివలె జీవింతురు. జనులు కఱవు వలన పన్నుల వలన బాధలు పడలేక గోధుమలు యవలు ఆహారముగా తిను దేశములకు పాఱి పోదురు. లోకమున వేద మార్గము నశించి అవైదిక ప్రవర్తన పెరిగి అధర్మ మెక్కువై నందున జనులు అల్పాయువు లగుదురు. శాస్త్ర విహితములు కాని ఘోర తపస్సుల చేయు జనులను రాజు దండించక పోవుటచే రాజ దోషము వలన పసివారు మరణింతురు. ఎనిమిది తొమ్మిది పది ఏండ్ల మగవారి వలన ఐదాఱేడేండ్ల స్త్రీలకు కాన్పులు అగును. పండ్రెండేండ్ల కంటె పైబడి చాల తక్కువ మంది జీవింతురు. తక్కువ తెలివి వ్యర్థముగా వేషము ధరించుట దుష్ట మగు అంతః కరణము కలిగి జనులు అల్ప వయస్సుననే మరణింతురు.

ప్రారంభా శ్చా పసీదంతి యదా ధర్మకృతాం నృణామ్‌

తదానుమేయం ప్రాధాన్యం కలే ర్విప్రా విచక్షణైః

యదా యదా న యజ్ఞానా మీశ్వరః పురోషోత్తమః

ఇజ్యతే పురుషై ర్యజ్ఞై స్తదా జ్ఞేయం కలే ర్బలమ్‌

న ప్రీతి ర్వేద వాదేషు పాఖండేషు యదా రతిః

కలే ర్వృద్ధి స్తదా ప్రాజ్ఞై రనుమేయా ద్విజోత్తమాః

కలౌ జగత్పతిం విష్ణుం సర్వస్రష్టార మీశ్వరమ్‌

నార్చయిష్యంతి భోవిప్రాః పాఖండోపహతా నరాః

కిం దేవైః కిం ద్విజై ర్వేదైః కిం శౌచే నాంబుజ న్మ నా

ఇత్యేవం ప్రలపి ష్యంతి పాఖండోపహతానరాః

అల్పవృష్టిశ్చ వర్జస్యః స్వల్పం సస్యఫలం తథా

ఫలం తథాల్పసారం చ విప్రాః ప్రాప్తే కలౌయుగే

జానుప్రాయాణి వస్త్రాణి శమీప్రాయా మహీరుహాః

శూద్రప్రాయా స్తథా వర్నా భవిష్యంతి కలౌ యుగే

అణుప్రాయాణి ధాన్యాని అజప్రాయం తథా పయః

భవిష్యతి కలౌ ప్రాప్త ఔశీరం చానులేపనమ్‌

శ్వశ్రూశ్వశురభూయిష్ఠా గురవశ్చ నృణాం కలౌ

శాలాద్యా హారిభార్యా శ్చ సుహృదో మునిసత్తమాః

కస్య మాతా పితా కస్య యదా కర్మాత్మకః పుమాన్‌

ఇతి చోదాహరిష్యంతి శ్వశు రానుగతా నరాః

వాఙ్మనః కాయజై ర్దోషై రభిభూతాః పునః పునః

నరాః పాపా న్యనుదినం కరిష్యం త్యల్పమేధసః

విఃపత్యానా మశైచానాం నిర్‌ హ్రీకాణాం తథా ద్విజాః

యద్య ద్దుఃఖాయ తత్పర్వం కలికాలౌ భవిష్యతి

నిఃస్వాధ్యాయవషట్కారే స్వధాస్వాహా వివర్జితే

తదా ప్రవిరలో విప్రః కశ్చిల్లోకే భవిష్యతి

త త్రాల్పే నైవ కాలేన పుణ్యస్కంధ మనుత్తమమ్‌

కరోతి యః కృతయుగే క్రియతే తపసా హి యః

వైదిక మార్గము ననుసరించి వారికి హాని కలిగి నప్పుడెల్ల అధర్మము పెరుగు నని ఎఱుగ వలెను. అప్పుడే కలి విజృంభించును. ధర్మము నాచరించు వారి ప్రయత్నములు నెఱవేర కుండును. వేద వాదము లందు ఆసక్తి తగ్గును. నరులు ఆవైదికుల ప్రభావమునకు లోబడుటచే సర్వస్రష్ట సర్వేశ్వరుడగు విష్ణుని అర్చింప కుందురు. వేదముల తోను బ్రాహ్మణుల తోను దేవతల తోను నీటితో పవిత్రత సంపాదించుట తోను పనియేమి? అని పలుకు చుందురు. వానలు ఎక్కువగా కురియవు. పంటలు ఎక్కువగా పండవు. పండ్లలో సార మెక్కువగా ఉండదు. అణుప్రాయ మగు ధాన్యము. మేక పాలకు ప్రాముఖ్యము. వట్టివేళ్ళ గంధము పూసి కొనుట అధిక మగును. నరులకు అత్త మామలే గురువులుగా మిత్త్రులే ముని శ్రేష్ఠులుగా అగుదురు. నరులు మామ గారలు చెప్పినది వినుచు మానవుడు తన పని తాను చేసికొను నపుడు ఎవరికి ఎవరు తండ్రి? ఎవరు తల్లి? ఎవరు కుమారుడు? అందురు. అల్ప ప్రజ్ఞ కలవారై వాజ్మనఃకాయిక దోషములకు వశులై అను దినమును పాపముల చేయు చుందురు. సత్యము శౌచము సిగ్గు వీనిని విడిచిన వారికి కలుగ వలసిన దుఃఖము లన్నియు కలిగి జనులు బాధలు పడుదురు. స్వాధ్యాయము స్వధాస్వాహ వషట్కారములు లోపించును. సరి యగు బ్రాహ్మణులు అరుదుగా నుందురు. కృత యుగమున దీర్ఘ కాలము తపస్సు చేసి సాధించిన పుణ్య స్కంధమును కలి యుగములో అల్ప కాలము లోనే సాధించి కొందురు.

మునులు:

కస్మి న్కాలేల్పకో ధర్మో దదాతి సుమహాఫలమ్‌

పక్తు మర్హ న్యశేషేణ శ్రోతుం వాంఛా ప్రవర్తతేః

మునులు:

ఏ కాలములో అల్ప ధర్మము నాచరించినను అధిక పుణ్య ఫలము కలుగునో తెలుపు మని వ్యాసులను మును లడిగిరి.

వ్యాసులు:

ధన్యే కలౌ భవే ద్విప్రా స్త్వల్పక్లేశై ర్మహాఫలమ్‌

తథా భవేతాం స్త్రీ శూద్రౌ ధన్యౌ చాన్య న్నిబోధతః

యత్కృతే దశభి ర్వర్షై స్త్రేతాయాం హాయనేన తత్‌

ద్వాపరే తచ్చ మానేన ఆహోరాత్రేణ తత్కలౌ

తపసో బ్రహ్మచర్యస్య జపాదేశ్చ ఫలం ద్విజాః

ప్రాప్నోతి పురుష స్తేన కలౌ సాధ్వితి భాషితుమ్‌

ధ్యాయ స్కృతే యజ స్యజ్ఞై స్త్రేతాయాం ద్వాపరేర్చయన్‌

యదాప్నోతి క తదాప్నోతిలౌ సంకీర్త్య కేశవమ్‌

ధర్మోత్కర్ష మతీ వాత్ర ప్రాప్నోతి పురుషః కలౌ

స్వల్పాయాసేన ధర్మజ్ఞా స్తేన తుష్టోన్మ్యహం కలౌ

వ్రతచర్యాపరై ర్గ్రాహ్యా వేదాః పూర్వం ద్విజాతిభిః

తతస్తు ధర్మసంప్రాప్తై ర్యష్టవ్యం విధివ ద్ధనైః

వృథా కథా వృథా భోజ్యం వృథా స్వం చ ద్విజన్మనామ్‌

పతనాయ తథా భావ్యం తైస్తు సంయతిభిః సహ

అసమ్య క్కారణే దోషా న్తేషాం సర్వేషు వస్తుషు

భోజ్యపేయాదికం చైషాం నేచ్ఛాప్రాప్తికరం ద్విజాః

సారతంత్ర్యా త్సమన్తేషు తేషాం కార్యేషు వైతతః

లోకా న్ల్కే శేన మహతా యజంతి వినయాన్వితాః

ద్విజశుశ్రూషణే నైవ పాక యజ్ఞాధికారవాన్‌

నిజం జయతి వైలోకం శూద్రో ధన్యతర స్తతః

భక్ష్యాభక్ష్యేషు నాత్రా స్తి యేషాం పాపేషు వాయతః

నియయో మునిశార్దూలా స్తేనాసౌ సాధ్వి తీరితమ్‌

స్వధర్మ స్యావిరోధేన సరై ర్లభ్యం ధనం సదా

ప్రతిపాదనీయం పాత్రేషు యష్టవ్యం చ యథావిధి

తస్యార్జనే మహా న్ల్కేశః పాలనేచ ద్విజో త్తమాః

తథా స ద్వినియోగాయ విజ్ఞేయం గహనం నృణామ్‌

ఏభి రన్యై స్తథా క్లేశైః పురుషా ద్విజసత్తమాః

నిజాంజయంతి వై లోకా న్ర్పాజాపత్యాదికా న్క్రమాత్‌

యోషి చ్ఛుశ్రూషణా ద్భర్తుః కర్మణా మనసా గిరా

ఏత ద్విషయ మాప్నోతి త త్సాలోక్యంయతోద్విజాః

నాతిక్లేశేన మహతా తా నేవ పురుషో యథా

తృతీయం వ్యాహృతం తేన మయా సాధ్వితి యోషితః

ఏత ద్వః కథితం విప్రా య న్నిమిత్త మిహాగతాః

త త్పృచ్ఛధ్వం యథాకామ మహం వక్ష్యామి వః స్ఫుటమ్‌

అల్పే నైవ ప్రయత్నేన ధర్మః సిధ్యతి వై కలౌ

నరై రాత్మగుణాంభోభిః క్షాళి తాఖిల కిల్చిషైః

శూద్రై శ్చ ద్విజశుశ్రూషా తత్పరై ర్ముని సత్తమాః

తథా స్త్రీభి రనాయాసా త్పతిశుశ్రూష యైవ హి

తత స్త్రితయ మప్యేత న్మమ ధన్యతమం మతమ్‌

ధర్మ సంరాధనే క్లేశో ద్విజాతీనాం కృతాదిషు

తథా స్వల్పేన తపసా సిద్ధిం యాస్యంతి మానవాః

ధన్యా ధర్మం చరిష్యంతి యుగాంతే మునిసత్తమాః

భవద్భి ర్య దభిప్రేతం త దేత త్కథితం మయా

ఆవృష్టే నాపి ధర్మజ్ఞాః కిమస్య త్ర్కియతాం ద్విజాః

వ్యాసులు:

ఓ విప్రులారా! ధన్యమగు అల్ప క్లేశముతో తపస్సు చేసినను మహా ఫలము లభించును. ఈ విషయములో స్త్రీలును శూద్రులును మఱియు ధన్యులు. కృత యుగమున పండ్రెండేండ్లు తపస్సు చేయుటచే కలుగు ఫలితము త్రేతా యుగమున ఒక సంవత్సరము ద్వాపరమున ఒక మాసము కలిలో ఒక అహోరాత్రము తోనే కలుగును. తపస్సు బ్రహ్మ చర్యము జపము మొదలగు వాని ఫలము కలి యుగములో ఇట్లు నరుడు అల్ప శ్రమముతోనే పొంద గలడు. అంతేకాక కృత యుగమున ధ్యానము చేత, త్రేతలో యజ్ఞముల చేత, ద్వాపరములో అర్చనము చేత, కలుగు ఫలము కలి యుగమున కేశవ సంకీర్తనము తోనే కలుగును. బ్రాహ్మణులు కలి యుగమున ఉపనయనము చేసికొని వేద వ్రతము లనుష్ఠించుచు వేదా ధ్యయనము చేయ వలెను. తరువాత ధర్మానుసారముగ సంపాదించిన ధనముతో విధానము ననుసరించి యజ్ఞములు చేయ వలెను. వ్యర్థముగా భాషించుట భుజించుట ధన మార్జించుట బ్రాహ్మణులు పతితులు అగుటకు హేతు వగును. కనుక విప్రులు ఆయా విషయములలో నిగ్రహము కలిగి ఉండ వలెను. వారు ఏ విషయముల నైనను సరిగా చేయక పోవుట దోష కరము. భోజ్యములను తినుట పానీయములను త్రావుట వలన ద్విజులకు కోరికలు నెర వేరవు. జనులును అట్టి బ్రాహ్మణులకు అధీనులై అన్ని కార్యముల యందును ప్రవర్తించి నచో వారు ఎంతో శ్రమకు ఓర్చి వినయ వంతులై జనులచే ఆయా యజ్ఞాదులను చేయింతురు. శూద్రుడు బ్రాహ్మణులను సేవించు చున్నచో పాక యజ్ఞమునకు అధికరాము కలిగి తాను సాధింప దగిన ఉత్తమ లోకములను సాధించు కొనును. త్రికరణములతో పతిసేవ చేయుట వలన స్త్రీలు తన భర్తతో పాటు అతడు పుణ్యములు చేసి సాధించిన లోకముల కేగి సుఖింతురు. ఓ బ్రాహ్మణు లారా! మీరు ఏ విషయము తెలియ గోరి ఇక్కడకు వచ్చితిరో అది తెలిపితిని. ఇంకను ఏమి కావలయునో అడుగుడు.