189 - రాసక్రీడా విలాసము. అరిష్టవధ.

వ్యాసులు:

గతే శక్రే గోపాలాః కృష్ణ మక్లిష్టకారిణమ్‌

ఊచుః ప్రీత్యా ధృతం దృష్ట్వా తేన గోవర్ధనాచలమ్‌

వ్యాసులు:

గోపాలు రింద్రు డేగిన తరువాత గోవర్ధన గిరి నవలీలగ నెత్తిన కృష్ణుం గని ప్రీతితో నిట్లనిరి.

గోపాలురు:

వయ మస్మా న్మహాభాగ భవతా మహతో భయాత్‌

గావ శ్చ భవతా త్రాతా గారి ధారణ కర్మణా

బాలక్రీడేయ మతులా గోపాలత్వం జుగుప్సితమ్‌

దివ్యం చ కర్మ భవతః కి మేత త్తాత కథ్యతామ్‌

కాలియో దమిత స్తోయే ప్రలంబో వినిపాతితః

ధృతో గోవర్ధన శ్చాయం శంకితాని మనాంసి నః

సత్యం సత్యం హరేః పాదౌ శ్రయామోమితనిక్రమ

యథా త్వ ద్వీర్య మాలోక్య నత్వాం మన్యామహేనరమ్‌

దేవో వా దానవో వా త్వం యక్షో గంధర్వ ఏవ వా

కిం చాస్మాకం విచారేణ బాంధవోసి నమోస్తుతే

ప్రీతిః సస్త్రీకుమారస్య వ్రజస్య త్వయికేశవ

కర్మ చేద మశక్యం య త్సమస్తై స్త్రీదశై రపి

బాలత్వం చాతివీర్యం చ జన్మ చాస్మాన్‌ సుశోభనమ్‌

చింత్యమాన మమేయాత్మన్‌ శంకాం కృష్ణ ప్రయచ్ఛతి

గోపాలురు:

“కృష్ణా! కొండ నెత్తిన యద్భుత లీలచే నీవు గోవులను మమ్ములను మహా భయము నుండి కాచితివి. ఈ బాల లీల యనుపమము. ఆల కాపరి యగుట నింద్యము. నీ చేసిన పనియో దివ్యము. ఇదెట్లు జరిగినో తెలుపుము. మడువులో గాళియు డణగద్రొక్క బడెను. ప్రలంబుడు గూల్ప బడెను. ఈ గోవర్ధన మెత్త బడెను. ఇవి చూడ మానసములు సంశయ గ్రస్తము లగుచున్నవి. శ్రీహరి నీ పాదములే మాశ్రయించెదము. నీ బలిమి చూచి నిన్ను నర మాత్రునిగ భావింప లేకున్నాము. సత్యము! సత్యము. నీవు దేవుడవో దానవుడవో యక్షుడవో గంధర్వుడవో. ఆ విమర్శ మాకేల? మాకు బంధువుడవు. నీకు నమస్కారము. ఆ బాల గోపాలమునకు నీ యెడల బ్రీతి గల్గినది. నీ చేసిన పని నెల్ల దేవత లొక్క టైనను జేయ జాలరు. ఒక వంక బాల్యము వేఱొక వంక నద్భుత వీర్యము నివి యన్నియు నిట్లుండ గొల్లల మగు మాలో సామాన్యులలో నీవు జన్మించుట విమర్శింప మాకు సంశయము గల్గించు చున్నది అన విని కృష్ణుడు క్షణ మాత్రము పలుకకుండ నిలిచి ప్రణయ కోపమున నటించి యిట్లు వారికి బదులు పలికెను.

వ్యాసులు:

క్షణం భూత్వా త్వసౌ తూష్ణీం కించి త్ప్రణయ కోపవాన్‌

ఇ త్యేవ ముక్త స్తైర్గోపై రాహ కృష్ణో ద్విజోత్తమాః

మత్సంబంధేన వో గోపా యది లజ్జా న జాయతే

శ్లాఘ్యో వాహం తతః కిం వో విచారేణ ప్రయోజనాత్‌

యది వోస్తి మయి ప్రీతిః శ్లాఘ్యోహం భవతాం యది

త దర్హాం బంధుసదృశీం బాంధవాః క్రియతాం మయి

నాహం దేవో న గంధర్వో న యక్షో న చ దానవః

అహం వో బాంధవో జాతో నాత శ్చింత్య మతోన్యథా

ఇతి శ్రుత్వా హరే ర్వాక్యం బద్ధమౌనా స్తతో బలమ్‌

యయు ర్గోపా మహాభాగా స్తస్మి న్ప్రణయకోపిని

నా సంబంధముచే మీకు సిగ్గు గలుగ దేని నేను శ్లాఘ్యడనే గద! అందు వలన కార్యాకార్య విమర్శ యెందులకు? మీకు నా యందు బ్రీతి యున్న యెడల మీ మెప్పునే బొంద దగిన వాడనయిన యెడల బంధు సమానమైన గౌరవము మీరు చూపుడు. నేను దేవుడను గాను గంధర్వుడను యక్షుడను దానవుడను గాను నేను మీకు జుట్టుమునై పుట్టితిని. ఇందు వలన వేఱొక విధముగ మీ రాలోచింప బనిలేదు అన శ్రీహరి వాక్యము విని గోపకులు మహానుభావులు మౌనము వట్టి పొల యలుక గన్న యాతని నుండి బలరాము దరి కేగిరి.

రాస క్రీడారంభము

కృష్ణస్తు విమలవ్యోమ శరచ్చయంద్రస్య చంద్రికామ్‌

తథా కుముదినీం పుల్లా మామోదితదిగంతరామ్‌

వనరాజీం తథా కూజద్భృంగమాలా మనోరహమ్‌

 విలోక్య సహ గోపీభి ర్మన శ్చక్రే రతిం ప్రతి

సహరామేణ మధుర మతీవ వనితాప్రియమ్‌

జగౌ కలపదంశౌరిః నామ తత్ర కృతవ్రతః

రమ్యం గీతధ్వనిం శ్రుత్వా సంత్య జ్వావసథాం స్తదా

అజగ్ము స్త్వరితా గోప్యో యత్రాస్తే మధుసూధనః

శనైః శనై ర్జగౌ గోపీ కాచి త్తస్య పదానుగా

దత్తావధానా కాచి చ్చ త మేవ మనసాస్మరత్‌

కాచి త్కృష్ణేతి కృష్ణేతి చోక్త్వా లజ్జా ముపాయయౌ

యయౌ చ కాచి త్ప్రేమాంధా తత్పార్మ్వ మవిలజ్జితా

కాచి దావసథ స్యాంతః స్థిత్వా దృష్ట్వా బహిర్గురుమ్‌

తన్మయత్వేన గోవిందం దధ్యౌ మీలితలోచనా

గోపీపరివృతో రాత్రిం శరచ్చంద్రమనోరమామ్‌

మాసయామాస గోవిందో రాసారంభరసోత్సుకః

గోప్యశ్చ బృందశః కృష్ణచేష్టాభ్యాయ త్త మూర్తయః

అన్యదేశగతే కృష్ణే చేరు ర్వృందావనాంతరమ్‌

బభ్రము స్తా స్తతో గోప్యః కృష్ణదర్శనలాలసాః

కృష్ణస్య చరణం రాత్రౌ దృష్ట్వా వృందావనే ద్విజాః

ఏవం నానాప్రకారాసు కృష్ణచేష్టాసు తాసు చ

గోప్యో వ్యగ్రాః సమం చేరూ రమ్యం వృందావనం వనమ్‌

నివృత్తా స్తా స్తతో గోప్యో నిరాశాః కృష్ణదర్శనే

యమునా తీర మాగమ్య జగు స్త చ్చరితం ద్విజాః

తతో దదృశు రాయాంతం వికాశిముఖపంకజమ్‌

గోప్యస్రైలోక్యగోప్తార కృష్ణమక్లిష్ణకారిణమ్‌

కాచిదాలోక్య గోవింద మాయాంత మతిహర్షితా

తృష్ణకృష్ణేతికృష్ణేతి ప్రాహోత్ఫుల్ల విలోచనా

కాచిద్‌ భ్రూభంగురంకృత్వా లలాట ఫలకం హరిమ్‌

విలోక్య నేత్రభృంగాభ్యాం పపౌతన్ముఖపంకజమ్‌

కాచిదాలోక్య గోవిందం నిమీలిత విలోచనా

తస్యైవ రూపం ధ్యాయంతో యోగారూఢేవ సా బభౌ

తతః కాంచిత్రియాలాపైః కాంచిద్‌ భూభంగవీక్షితైః

నిన్యేనునయమన్యాశ్చ కరస్పర్శేన మాధవః

తాభిః ప్రసన్న చిత్తాభిర్గోపీభి సహ్ససాదరమ్‌

రరామ రాసగోషీభి రుదారచరితో హరిః

ఆకాశము స్వచ్ఛమై శారద చంద్ర చంద్రికా మనోహరమై కలువ తీగలు వికసింప దిగంతములు సువాసనల ఘుమ ఘుమలాడ దుమ్మెదల ఝం కారములచే నింపు గొలుపు వనపాళిం జూచి కృష్ణుడు గోపికలతో గ్రీడింప మనసు పడెను. బలరామునితో గృష్ణుడు పద్మము వంటి పాదములతో నవ్వనమున విహరించుచు గోపాం గనలకు మిగుల నింపు గూర్చును. వేణు గాన మొనరించెను. రమ్యమైన యా గీత ధ్వనిని విని గోపిక లిండ్లు వెడలి సత్వరము కృష్ణుని దరి కేతెంచిరి. ఒక గోపి యతని యడుగుల మెల్లమెల్లన నను గమించెను. వేణు గానము విన గుతూహలము గొని వేఱొకతె యతనినే స్మరించెను. మఱొకతె కృష్ణా! కృష్ణాయని పలికి యంతలో సిగ్గు పడెను. వేఱొకతె ప్రేమ కనులు గప్ప సిగ్గు విడిచి యాతని పజ్జ నిలిచెను. మఱియొక గోపిక యింటనే నిలిచి వెలినున్న బెద్దల (మామగారిని) గని బృందావనమునకు వెళ్ళుటకు సాహసము జేయలేక తన్మయతను జెంది గనులు మూసికొని గోవిందునే ధ్యానించెను. శరచ్ఛంద్ర మనోహరమైన యొక రాత్రివేళ గోపికలు వెంబడింప గోవిందుడు రాస క్రీడారంభ రసోల్లాసియై వారల నాదరించెను. గోపికలు గుంపులుగ కృష్ణ విలాస వివశలై యతుడు చాటువడ విరహాతరలై కృష్ణ దర్శనాపేక్షతో బృందావన మెల్లను వెదకుచు దిరిగిరి. రాత్రి కృష్ణుని యడుగు జాడలను జూచి యతని వివిధ శృంగారానుభవములకు మురిసి మైమరిచి పరిపరి విధముల నా వనమున బరిభ్రమించిరి. కృష్ణుడు కనిపింపమి నిరాశ జెంది మరలి యమునా తీరమునకు వచ్చి కృష్ణ చరిత్రమును మధురముగ స్వర సమ్మేళన మొనరించి పాడిరి. అంతలో హరి ముఖ పంకజము వికసింప దటాలున నెదురు వడగ గోపికలు ముల్లోకములను రక్షింప గల పుణ్య శీలురు గావున యమ్మూర్తిని దర్శించిరి. ఏతెంచు చున్న గోవిందుని యొక సుందరి చూచి కను దుమ్ములు విప్పార నానంద భరితయై కృష్ణా! కృష్ణా! యని యాలాపనము సేసెను. ఒకతె కనుబొమలు ముడిపడ హరిం జూచి యా ముఖ పంకజమును దన నయనములను దుమ్మెదలచే నాస్వాదించెను. మఱి యొకతె కను లల్లన మూసికొని యతని రూపమును ధ్యానించుచు యోగారూఢ యైనట్లు భాసించెను. అవ్వల ప్రియ భాషణము లచే నొక్కతెను. భ్రూభంగ విలాసములచే నొక్కతెను గర స్పర్శముచే నింకొకతెను ననునయించి మాధవుడు వారి నందరిని నన్నిలీలలంగలక దేర్చి వారితో రాసక్రీడా విలాసవై భవమున రమించెను.

రాసమండలబద్ధోపి కృష్ణపార్శ్వమనుద్‌ గతః

గోపీజనో స చై వాభూ దేకస్థానస్థిరాత్మనా

హస్తే ప్రగృహ్య చైకాం స గోపికాం రాసమండలే

చకార చ కరస్పర్శనిమీలితదృశం హరిః

తతః ప్రవవృతే రమ్యా చలద్వలయనిస్వనైః

అనుయాతశరత్కావ్యగేయగీతి రనుక్రమాత్‌

కృష్ణః శరచ్చంద్రమసం కౌముదీకుముదాకరమ్‌

జగౌ గోపీజనస్త్వేకం కృష్ణనామ పునఃపునః

పరివృత్తా శ్రమేణైకా చలద్వలయతాపినీ దదౌ

బాహులతాం స్కంధే గోపీ మధువిషూతినః

కాచిత్ర్పవిలసద్‌ బాహుః పరిరభ్య చుచుంబతమ్‌

గోపీగీత స్తుతివ్యాజనిపుణా మధుసూదనమ్‌

గోపీకపోలసంశ్లేష మభిపద్య హరౌర్భుజా

పులకోద్గమ శస్యాయ స్వేదాంబుధరతాం గతౌ

రాసగేయం జగౌ కృష్ణో యావత్తారతరధ్వని

సాధు కృష్ణేతి కృష్ణేతి తావత్తా ద్విగుణం జగుః

గతేనుగమనం చక్రు ర్వలనేసమ్ముఖంయయుః

ప్రతిలోమానులోమేన భేజు ర్గోపాంగనా హరిమ్‌

స తదా సహగోపీభీ రరామ మధుసూదనః

స వర్షకోటి ప్రతిమః క్షణస్తేన వినాభవత్‌

గోపికా జనము వర్తు లాకారముగ దీరి రాసక్రీడ యందిమిడి యున్నను నొకే లక్ష్యమందు స్థిర పడిన మనస్సుతో కృష్ణుని యందేకాగ్రత చెందిన మనస్సుతో సుస్థిరమైన సమాధి యోగము చేత గృష్ణుని పార్శ్వ భాగమును విడవ కుండ నిరంతర సాన్ని ధ్యానందము ననుభవించెను. శ్రీహరి యొక గోపిక చేయి పట్టుకొని తనకర స్పర్శచే గల్గిన యానంద పారవశ్యము చేత నరమోడ్పు వెట్టిన కన్నులు కల దానినిగా నొనరించెను. అవ్వల చలించు నొడ్డాణముల చిరు గంటల స్వనములచే గ్రమ గ్రమముగ శరద్దృతు సమయ కావ్య గీతము ననుసరించి లయాను గుణముగ గోపికా కృష్ణుల నృత్య మారంభ మయ్యెను. ఒక గోపిక బాహు లతలు సాచి కృష్ణుని గౌగింలించు కొని గోపికల సంగీత మాధుర్యమును స్తుతించు నెపమున దోచు నైపుణ్యమున స్వామిని ముద్దు పెట్టు కొనెను. ఆగోపి చెక్కిళ్ల కలయిక (నంశయమును) నొంది కృష్ణుని భుజములు ఒడలు పులకరించుట యను బంట నుజ్జీవక మగు స్వేద మనెడి జలమును వర్షించుటలో జలధర భావమును బొందినది. (అనగా నొక సస్యమునకు వర్షము గురియు మేఘము జ్జీవకమై నట్లు కపోల స్పర్శము వలన కల్గిన శృంగారా నుభవముచే గోపికలు మైమరపు జెంద వారి తనువల్లరి పులకరించిన దని భావము) కృష్ణుడు తార స్థాయిలో రాస క్రీడా గేయ మాలపించి నంతట భేష్‌ భేష్‌ కృష్ణా! యని రెట్టించి వంత పాడిరి. హరి ముందడుగు వేయ నా వెంబడిని వారడుగు వేసిరి. అతడు వెను తిరిగిన వారతనికి సమ్ముఖ మైరి (ఎదరైరి) ఇట్లు లయాను గుణమైన బాద విన్యాసమున గోపాంగనలు ప్రతిలోమా నులోమముగ హరిని దారిసిల్లిరి. ఇట్లా గోప సుందరులతో గృష్ణుడు రమింప నతనితో నగు క్షణ మెడబాటు వారికి గోటి సంవత్సరముల వియోగముతో సమానమై తోచెను.

తావార్యమాణాః పితృభిః పతి భిర్భాతృభిస్తథా

కృష్ణం గోపాంగనా రాత్రౌ రమయంతి రతిప్రియాః

సోపి కైశోరకవయా మానయ న్మధుసూదనః

రేమే తాభిరమేయాత్మా క్షపాసు క్షపితాహితః

తత్‌ భర్తృషు తథా తాసు సర్వభూతేషు చేశ్వరః

ఆత్మస్వరూప రూపోసౌ వ్యాప్య సర్వ మవస్థితః

యథా సమస్తభూతేషు నభోగ్నిః పృథివీజలమ్‌

వాయుశ్చాత్మా తథైవాసౌ వ్యాప్య సర్వమవస్థితః

తండ్రులు భర్తలు అన్న దమ్ములు నెంత వారించినను నత్యు ల్లాసమున వ్రజ సుందరులు రాత్రు లందు గృష్ణునితో గ్రీడించిరి. అతడును గైశోరక వయస్సున వారి నాదరించుచు ననేక రాత్రులు రమించెను. వారి పతులందు గోపిక లందు సర్వ భూతము లందు సర్వేశ్వరుడు గావున నాత్మ స్వరూపమై సర్వమున వ్యాపించి హరి యుండెను. సమస్త భూతము లందు బృథి వ్యాపస్తేజో వాయు రాకాశములను పంచ భూతములు నెట్లు వ్యాపించి యున్నవో యట్లే కృష్ణ పరబ్రహ్మ మయ్యెడ సర్వ వ్యాపకమై యుండెను.

“అరిష్టవధ”

వ్యాసులు:

ప్రదోషార్ధే కదాచిత్తు రాసాసక్తే జనార్దనే

త్రాసయస్‌ సమదో గోష్టా నరిష్టః సముపాగతః

సతోయతో యదాకారస్తీ క్ష్ణశృంగోర్కలోచనః

ఖురాగ్రపాతై రత్యర్థం దారయన్‌ ధరణీతలమ్‌

లేలిహానః సనిష్పేషం జిహ్వయోష్ఠౌ పునః పునః

సంరంభాక్షి ప్తలాంగూలః కఠినస్కంధబంధనః

ఉదగ్రకకుదాభోగః ప్రమాణాద్‌ దురతిక్రమః

విణ్మూత్రాలి ప్తపృష్టాంగో గవాం ముద్వేగకారకః

ప్రలంబకంఠోభిముఖస్తరు ఘాతాకింతాననః

పాతయంస గవాం గర్భాం దైత్యో వృషభరూపధృక్‌

సూద యం స్తరసా సర్వాన్వనాన్యటతి యః సదా

తతస్త మతిఘోరాక్ష మవేక్ష్యాతిభయాతురాః

గోపా గోపస్త్రియశ్చైవ కృష్ణకృష్ణేతి చుక్రుశుః

సింహనాదం తతశ్చక్రే తలశబ్దం చ కేశవః

తచ్ఛబ్దశ్రవణాచ్ఛాసౌ దామోదర ముఖం యయౌ

అగ్రన్యస్త విషాణాగ్రః కృష్ణకుక్షికృతేక్షణః

అభ్యధావత దుష్టాత్మా దైత్యో వృషభరూపధృక్‌

అయాంతం దైత్యవృషభం దృష్ట్వా మహాబలమ్‌

నచచాల తతః స్థానాద వజ్ఞా న్మితలీలయా

ఆసన్నం చై వ జగ్రాహ గ్రాహవన్మధుసూదనః

జఘాన జానునా కుక్షౌ విషాణ గ్రహణాచలమ్‌

తస్య దర్పబలం హత్వా గృహీతస్య విషాణయోః

అపీడయ దరిష్టస్య కంఠం క్లిన్నమివాంబరమ్‌

ఉత్పాట్య శృంగమేకం చ తేనై వాతాడ యత్తతః

మమార స మహాదైత్యో ముఖా చ్ఛోణి తముద్వమన్‌

తుష్టుపుర్నిహతే తస్మిన్‌ గోపా దైత్యే జనార్ధనమ్‌

జంభే హతే సహస్త్రాక్షంపురా దేవగణా యథా

వ్యాసులు:

ఒకతరి నర్థాన్తమయ సమయమున (ప్రదోష కాలము సగము గడచిన తరువాత) జనార్ధనుడు రాసక్రీడా వినోదము నందాసక్తుడై యుండ నరిష్టుడను రక్కసుడు మద మెక్కి హడల గొట్టుచు గోశాల కరు దెంచెను. కారు మబ్బువలె నల్లగ నుండి పదునైన కొమ్ములు గల్గి సూర్యునట్లు జ్వలించు చూపులతో డెక్కల తాకున భూతలము జీల్చుచు నాలికచే బెదవులను నొరయించి నాకుచు దోక లువ్వెత్తున బైకెత్తి మిగుల కఠిన మగు స్కంధ బంధమున మిగుల వెడదయగు మూపుతో నొడ్డు పొడువులను మిగుల గడువరాని వాడై మూత్ర పురీషము లంబూత పడిన పిరుదులతో నొడలితో గోవులకు వెరపు గొల్పుచు మెడవ్రేల నెదురై చెట్ల తాకిడి వడిన ముఖముతో వృషభ రూపము గొని గోవులకు గర్భపాతము చేయుచు నెల్ల యడవులం గూల్చుచు నొకదైత్యు డచట నెల్లపుడు సంచరించు వాడెదుట బడెను. భయంకర మగు కన్నులతో నున్న వానిని గని గోపకులు గోపికలు కృష్ణా! కృష్ణా! యని యాక్రందించిరి. అంతట కేశవుడు సింహ గర్జనము చేసి చప్పట్లు జరచెను. వీడా సడివిని దామోదరున కెదురుగ జని కొమ్ములు ముందునకు నిగిడించి కృష్ణుని కడుపు నెడ చూపు నిలిపి యా దుష్టుడు పరువులు వెట్టెను. అట్లు వచ్చుచు న్న వృష భాసురుని గని కృష్ణుడు వాని నీసడించు సూచనగ నొదవిన చిరునవ్వు సొగసు జూపి తా నిలిచిన చోట నుండి కదలక నిలు చుండెను. మఱియు దాపునకు వచ్చిన వానిని హరి మొసలి పట్టినట్లు పట్టి కొమ్ములు చేకొని కడుపు నందు మోకాళ్లం బొడిచెను. వాని గొమ్ముపట్టి వాని దర్పమును బలమునుం గోట్టి తడి బట్టను బిండినట్లు వాని కంఠమును మెలి పెట్టెను. మరియు వాని కొమ్మొకటి పెరకి దాని చేతనే వానిం గొట్టెను. అమ్మ హాదైత్యుడు నోట నెత్తురు గ్రక్కుచు మరణించెను. వాడట్లు హతు డైనంత గోపకులవుడు జంభాసురు డీల్గినపుడు దేవత లింద్రునట్లు జనార్దనుని స్తుతించిరి.