6 - ఆదిత్యోత్పత్తి వర్ణనమ్‌

లోమహర్షణుడు:

వివస్వా న్కశ్యపా జ్జజ్ఞే దాక్షాయణ్యాం ద్విజోత్తమాః

తస్య భార్యాభవత్సంజ్ఞా త్వాష్ట్రీ దేవీ వివస్వతః

సురేశ్వరీతి విఖ్యాతా త్రిషు లోకేషు భామినీ

సావై భార్యా భగవతో మార్తండస్య మహాత్మనః

భర్తృ రూపేణ నాతుష్య ద్రూపయౌవనశాలినీ

సంజ్ఞానామ సుతపసా సుదీప్తేన సమన్వితా

ఆదిత్యస్య హి తద్రూపం మండలస్య సుతేజసా

 గాత్రేషు పరిదగ్ధంవై నాతికాంత మి వాభవత్‌

న ఖల్వయం మృతో(తాం)డస్థ ఇతి స్నేహా దభాషత

అజాన న్కాశ్యప స్తస్మాన్మార్తండ ఇతి చోచ్యతే

తేజ స్త్వభ్యధికం తస్య నిత్యమేవ వివస్వతః

యేనాతితాపయామాస త్రీన్‌లోకా న్కశ్యపాత్మజః

త్రీణ్యపత్యాని భో విప్రాః సంజ్ఞాయాం తపతాం వరః

ఆదిత్యో జనయామాస కన్యాం ద్వౌ చ ప్రజాపతీ

మనోర్వైవస్వతః పూర్వం శ్రాద్ధదేవః ప్రజాపతిః

 యమశ్చ యమానా చైవ యమజౌ సంబభూవతుః

శ్యామవర్ణం తు తద్రూపం సంజ్ఞా దృష్ట్యా వివస్వతః

అసహంతీ తు స్వాం ఛాయం సవర్ణాం నిర్మమే తతః

మాయామయీ తు సా సంజ్ఞా తస్యాం ఛాయాసముత్థితాం

ప్రాంజలిః ప్రణతా భూత్వా ఛాయా సంజ్ఞాం ద్విజోత్తమాః

ఉవాచ కిం మయా కార్యం కథయస్వ శుచిస్మితే

స్థితాస్మి తవ నిర్దేశే శాధి మాం వరవర్ణిని

లోమహర్షణుడు:

ద్విజోత్తములారా! కశ్యపునికి దక్షసుత యందు వివస్వంతు డుదయించెను. అతని భార్య సంజ్ఞ. ఆమె త్వష్టృ ప్రజాపతి కుమార్తె. నురేశ్వరియను పేర త్రిలోక ప్రఖ్యాతి నందినది. రూప యౌవన శాలిని యైన యా దేవికి భగవంతుడగు వివస్వంతుని యొక్క (మార్తాండుని యొక్క) యంద మంత యానంద మీయ దయ్యొను. ఆమె మంచి తపస్సు చేసి మంచి దీప్తి గడించు కొన్నది. కాని యాదిత్య మండలము వేడిమి కామె తనూలత వాడిపోయి యంతగ రాణింప దయ్యెను. కశ్యపుడు వాత్సల్యాతిశయముచే వీడు ”అండ మందు మృతుడు కాలేదు” గద అని యొఱుంగక పలికిన కతన నాతనికి మార్తండుడను పేరు రుఢ మయ్యెను. ఆతని తేజస్సు దుర్భరమై ముల్లోకములను దహింప జేయున దయ్యెను. ఆదిత్యుడు (వివస్వంతుడు) సంజ్ఞాదేవి యందు మనువును శ్రాద్ధ దేవుడైన యము నింగనెను. యమున యను కన్యను గూడ గాంచెను. యముడును యమునయు కవల పిల్లలు. సంజ్ఞ శ్యామ వర్ణుడైన యా వివస్వంతుని జూచి యోర్వక తనకు సాటియైన ఛాయను (నీడను) మాయా మయియైన దానిని కల్పించెను. ఆమె యెదుట నిల్చి ప్రాంజలియై మ్రొక్కి ఓ సుహాసిని! నా చేయనగు కార్యముం జెప్పుము. నీ యాజ్ఞా వశనై యున్నాను నన్నుంబని గొమ్మనియె.

సంజ్ఞ:

అహం యాస్యామి భద్రంతే స్వమేవ భవనం పితుః

త్వయైవ భావనే మహ్యం వస్తవ్యం నిర్విశంకయా

ఇమౌ చ బాలకౌ మహ్యం కన్యా చేయం సుమధ్యమా

 సంభావ్యాస్తే నచాఖ్యేయ మిదం భగవతే క్వచిత్‌

సంజ్ఞ:

అబలా ! నేను పుట్టినింటి కేగెదను. నీకు భద్రమగును గాక ! నాయింట నీవు నిశ్శంకముగ నుండ వచ్చును. ఈ పిల్లలిద్దరు నీ బాలిక నా సంతానము. వీరిం గని పెట్టుకొని యుండుము. ఈ మాట భగవంతుడు వివస్వంతుని కెన్నడేని జెప్పకుము.

సవర్ణ:

ఆకచగ్రహణా ద్దేవి ఆశాపా న్నైవ కర్హిచిత్‌

ఆఖ్యాస్యామి మస్తునభ్యం గచ్ఛ దేవి యథాసుఖమ్‌

సవర్ణ:

 జుట్టుపట్టి లాగునందాక. శాప మిచ్చు నందాక ఈ వార్త నేనెన్నడును జెప్పను. నీకు నమస్కారము. దేవీ! సుఖముగ వెళ్ళి రమ్మనెను.

లోమహర్షణుడు:

సమాదిశ్య సవర్ణాంతు తథేత్యుక్తా తయా చ సా

త్వష్టుః సమీప మగమ ద్వ్రీడితేవ తపస్వినీ

పితుః సమీపగా సా తు పిత్రా నిర్భ ర్త్సితా శుభా

భర్తుః సమీపం గచ్ఛేతి నియుక్తా చ పునః పునః

అగచ్ఛత్‌బడబా భూత్వాచ్ఛాద్య రూప మనిందితా

కురూ నథోత్తరా న్గత్వా తృణా న్యథ చచార హ

లోమహర్షణుడు:

తపస్విని యైన సంజ్ఞ సవర్ణకు (ఛాయకు) ఇట్లు తెలిపి బిడ్డల నప్పగించి తండ్రి యగు త్వష్ట ప్రజాపతి సమీపమున కేగి సిగ్గున తలవంచు కొని నిలువ బడెను. ప్రజాపతిచే భర్త సన్నిధికి పోపొమ్మని పలు మారులు అదలించి బెదిరించి యాదేశింప బడియు నయ్యింతి కాంతుని వంక బోక బడబా కృతిందాల్చి (ఆడు గుఱ్ఱమై) తన రూపము మఱుగు పఱచుకొని ఉత్తర కురు భూములందు బచ్చిక బయళ్ళలో తిఱుగ జొచ్చెను

ద్వితీయాయాం తు సంజ్ఞాయాం సంజ్ఞేయమితి చింతయన్‌

ఆదిత్యో జనయామాస పుత్ర మాత్మసమం తదా

పూర్వజస్య మనో ర్విప్రాః సదృశోయమితి ప్రభుః

మను రే వాభవ న్నామ్నా సావర్ణ ఇతి చోచ్యతే

రెండవ సంజ్ఞను ఈమె సంజ్ఞ యేయని భావించి యామె యందా దిత్యుడు తన కీడైన కొడుకుం గాంచెను. ఇంత మున్ను, పుట్టిన మనువును బోలిన వాడై నందున నితడును “సావర్ణ మనువు” అని పిలువబడు చుండెను.

ద్వితీయో యః సుత స్తస్యాః స విజ్ఞేయః శనైశ్చరః

 సంజ్ఞాతు పార్థివీ విప్రాః స్వస్య పుత్రస్యవై యథా

చకా రాభ్యధికం స్నేహం న తథా పూర్వజేషు వై

మను స్తస్యాః క్షమత్తత్తు యమ స్తస్యా న చక్షమే

సవై రోషాచ్చ బాల్యాచ్చ భావినోర్థస్య వానఘ

పదా సంతర్జయామాస సంజ్ఞాం వైవస్వతోయమః

తం శశాప తతః క్రోధాత్సవర్ణ జననీ తదా

చరణః పతతా మేష తవేతి భృశదుఃఖితా

యమస్తు తత్పితుః సర్వం ప్రాంజలిః ప్రత్యవేదయత్‌

భృశం శాపభయోద్విగ్నః సంజ్ఞావాక్వై ర్విశంకితః

శాపోయం వినివర్తేత ప్రోవాచ పితరం ద్విజాః

మాత్రాస్నే హేన సర్వేషు వర్తితవ్యం సుతేషు వై

సేయ మస్మా నపాస్యేహ వివస్వ న్సంబుభూషతి

తస్యాం మయోద్యతః పాదో నతుదేహే నిపాతితః

బాల్యాద్వా యది వా లౌల్యా న్మోహా త్తత్‌ క్షంతుమర్హసి

శప్తోహమస్మి లోకేశ జనన్యా తపతాం వర

తవప్రసాదా చ్చరణో న పతే న్మమ గోపతే

అమెకు కల్గిన రెండవ కుమారుడు శనైశ్చరుడు. అతడు పుట్టిన తరువాత నామె తన కప్పగించిన సవతి బిడ్డల నాదరింప దయ్యెను. మనువు దానికి సైచి యూర కుండెను. యముడది యోర్వక యా సవతి తల్లిని పాదమెత్తి బెదరించెను. అందులకు ఛాయ కోపించి మిగుల దుఃఖించి నీకాలు పడిపోవు గాక యని శపించెను. యముడా వృత్తాంమును దండ్రికి ప్రాంజలియై విన్న వించెను. నా కామె యిచ్చిన శాపమును మరలింపుమని తండ్రిని వేడు కొనెను. తల్లి తనయు లందరి యెడ వాత్సల్యముతో వర్తింప వలయును గదా. ఈ యమ్మ మమ్ములను నిరసించి బ్రతుక నెంచినది. అందు వలన నే నామెపై పాద మెత్తితిని, ఎత్తితినే కాని యామె శరీరము తాకింప లేదు. బాల్యముచే లౌల్యముచే నెఱుంగక యేనొనరించిన తప్పును క్షమింప దగుదువు. తల్లి శాపమునకు గురి యైతిని గ్రహరాజ! నీయను గ్రహముచే నా పాదము పడిపోకుండు గాక ! అని కొడుకు వాపోవ గరుణించి

వివస్వానుడు:

అసంశయం పుత్ర మహ ద్భవిష్య త్యత్ర కారణమ్‌

 యేన త్వా మావిశత్‌ క్రోధో ధర్మజ్ఞం సత్యవాదినమ్‌

నవాక్య మేత న్మిథ్యా తు కర్తుం మాతృవచ స్తవ

కృమయో మాంసమాదాయ యాస్య స్త్యవనిమేవ చ

కృత మేవం మచ స్తథ్యం మాతు స్తవ భవిష్యతి

శాపస్య పరిహారేణ త్వం చ త్రాతో భవిష్యసి

వివస్వానుడు:

పుత్ర! ఇందేదో గొప్ప కారణ ముండి తీరును, ధర్మజ్ఞుడవు, సత్య వచనుడ వైన నిన్ను క్రోధ మావేశించినది. నీ తల్లి మాట మిధ్య గాకుండుటకు కృములు నీ కాలి మాంసము దిని యవని కేగును. ఈ రీతి మీయమ్మ మాట సత్యము కాగలదు. ఈ విధమైన శాప పరిహారముచే నీవును సురక్షితు డయ్యెద వనెను.

అదిత్య శ్చాబ్రవీ త్సంజ్ఞాం కిమర్ధంతనయేషువై

తుల్యే ష్వభ్యధికః స్నేహ ఏకస్మి న్ర్కియతే త్వయా

సా తత్పరిహరంతీ తు నా చచక్షే వివస్వతే

స చాత్మానం సమాధాయ యోగా త్తథ్య మపశ్యత

తాం శప్తుకామో భగవా నాశక న్మునిసత్తమాః

మూర్థజేషు నిజగ్రాహ సతు తాం మునిసత్తమాః

తత స్సర్వం యథావృత్త మాచచక్షే వివస్వతే

వివస్వా నథ తచ్ఛ్రత్వా కృద్ధః త్వష్టార మభ్యగాత్‌

దృష్ట్వాతు తం యథాన్యా య మర్చయిత్వా విభావసుమ్‌

నిర్దగ్ధుకామం రోషేణ సాన్త్వయామాస వైతదా

ఆదిత్యుడు సంజ్ఞం జూచి (ఛాయా మూర్తిని) బిడ్డల నందర నొక్కరీతిగా గాక యొక్కని యందెక్కువ ప్రేమ నీకెందుల కని యడిగిన నామె యా మాట దప్పించెనే గాని నిజము సెప్పదయ్యె. అతడు తనకుదా సమాధాన పడి యోగ దృష్టిచే నిజ మెఱింగెను. ఆమె నప్పుడు శపింప బూనియు శాప మీయక జుట్టు పట్టుకొని యూచెను. అంతనామె జరిగిన దెల్ల పతికి విన్న వించెను. వివన్వంతుడు విని కవలి మామ గారగు త్వష్ట చెంత కరిగెను. మామయు నటువచ్చిన యల్లు నాదరించెను. రోషముగొని తనను దహింప నేతెంచినాడని గ్రహించి యపుడాతని ననునయించుచు నిట్లనియె.

త్వష్ట:

తవాతితేజసావిష్ట మిదం రూపం నశోభతే

 అసహంతీ చ సంజ్ఞా సా వనే చరతి శాద్వలే

ద్రష్టా హి తాం భవా నద్య స్వాం భార్యాం శుభచారిణీం

శ్ల్యాఘ్యాం యోగబలోపేతాం యోగమాస్థాయ గోపతే

అనుకూలంతు తే దేవ యది స్యా న్మమ సమ్మతమ్‌

 రూపం నిర్వర్తయా మ్యద్య తవ కాంత మరిందమ

తదుభ్యుపగమా త్త్వష్టా మార్తండస్య వివస్వతః

భ్రమి మారోప్య తత్తేజః శాతయామాస భోధ్విజాః

తతోనిర్భాసితం రూపం తేజసా సంహతేన వై

 కాంతా త్కాంతతరం ద్రష్టు మధికం శుశుభే తదా

ధదర్శ యోగమాస్థాయ స్వాంభార్యాం బడబాం తతః

అధృష్యాం సర్వభూతానాం తేజసా నియమేనచ

బడబావపుషా విప్రాశ్చరంతీ మకుతోభయామ్‌

 సోశ్వరూపేణ భగవాం స్తాం ముఖే సమభావయత్‌

మైథునాయ విచేష్టంతీం పరపుంసోవశంకయా

సా తన్నిరవ మచ్చుక్రం నాసికాభ్యాం వివస్వతః

దేవౌ తస్యా మజాయేతా వశ్వినౌ భిషజాం వరౌ

నాసత్యశ్చైవ దస్రశ్చ స్మృతౌ ద్వా వశ్వినావితి

మార్తండస్యాత్మజావేతా వష్టమస్య ప్రజాపతేః

తాం తు రూపేణ కాంతేన దర్శయామాస భాస్కరః

సాతు దృష్ట్వైవ భర్తారం తుతోష ముని సత్తమాః.

త్వష్ట:

ఓ అదిత్యమూర్తి! నీ రూపమిది భరింప రాని తేజముచే జూడ రాదయ్యె. సంజ్ఞ యిదిసైప నేరక పచ్చిక బయళ్ళ తిరుగాడు చున్నది. శుభ చారిణయైన నీ సహ ధర్మచారిణి నిప్పుడు చూడ వలయును. అమె శ్లాఘనీయ యోగ బల సంపన్నురాలు. గ్రహ రాజగు నీకు నా మాట యనుకూలము సమ్మత మగు నేని యోగ మూని యామె చెంత కరుగును. నీ రూపమును జూడ ముచ్చటగ నొనరింతునని తెలిపి యా తరణిని (సూర్యుని) యంత్రము నెక్కించి చెక్కి వైచెను. తరణిని యంత్రమున బట్టిన నాటి నుండీ తరణి బట్టుటన నీ పేరు లోకమున రూఢి కెక్కెను. దాన నాతని తేజస్సు కొంత డిందువడి రూపము చూడ నందమయి యింపొందెను. ఆ మీద నతడు యోగ శక్తిచే నేగి తన భార్యను బడ రూపమున జరించు దానినిం జూచెను. తేజస్సుచే పాతివ్రత్య నియమముచే భూతముల కదృశ్యయై యున్న యయ్యంగనను ఎందును జడియక సంచరించు చున్నంగని తాను నశ్వ రూపము దాల్చి ముఖ మునం గవయం బోయెను. పర పురుష శంకగొని యామె పెడ మెగయయి మున్నతఱి నామె యందు నిక్షిప్తమైన శుక్రమామె నాసికా రంద్రముల వెంట చీది వైచెను. అందుండి అశ్వినులు అను దేవ వైద్యులు నా సత్యుడు(దన్రులు) అని పేర్కొన బడెడు వారిద్ద రుదయించిరి. అష్టమ ప్రజాపతి యగు మార్తండుని యౌరసు లీయిర్వురు మిక్కిలి యంద గాండ్రు. భాస్కరుడు నవ్వల నాకాంతకు మిగుల కాంతుడై కానవచ్చె. అమె కూడ తన మనోహరునిం గని మిగుల సంతోషించెను

యమస్తు కర్మణా తేన భృశం పీడిత మానసః

ధర్మేణ రంజయామాస ధర్మరాజ ఇమాః ప్రజా

 స లేభే కర్మణా తేన శుభేన పరమద్యుతిః

పితౄణా మాధిపత్యం చ లోకపాల త్వమేవ చ

మనుః ప్రజాపతి స్త్వాసీ త్సావర్ణిః స తపోధనాః

భావ్యః సమాగతే తస్మి న్మనుః సావర్ణికేం తరే

మేరుపృష్ఠే తపో నిత్య మద్యాపి స చరత్యుత

భ్రాతా శనైశ్చరస్తస్య గ్రహత్వం సతు లబ్ధవాన్‌

త్వష్టా తు తేజసా తేన విష్ణో శ్చక్ర మకల్పయత్‌

తదప్రతిహతం యుద్దే దానవాంతచికీర్షయా

 యవీయసీ తు సాప్యాసీ ద్యామీ కన్యా యశస్వినీ

అభవచ్చ సరిచ్చ్రేష్ఠ్రా యమునా లోకపావనీ

మనురిత్యు చ్యతే లోకే సావర్ణ ఇతి చోచ్యతే

ద్వితీయో యః సుతస్తస్య మనోర్ర్భాతా శనైశ్చరః

గ్రహత్వం స చ లేభే వై సర్వలోకాభిపూజితః

య ఇదం జన్మ దేవానం శృణుయా న్నరసత్తమః

ఆపదం ప్రాప్య ముచ్యేత ప్రాప్ను యాచ్చ మహద్యశః

యముడు మాత్రము తా మున్నొనరించిన పనికి మిక్కిలి పగ చెంది ప్రజలను ధర్మముచే రంజింప జేసి ధర్మరాజను సార్ధక నామముం బితృ దేవతల కాధిపత్యమును లోకపాల కత్వముం బడసెను. సావర్ణి ప్రజాపతి సావర్ణి మన్వంతరమున మనువు కాగలడు. అతడు మేరు గిరిపై నిప్పుడును తపము చేయు చున్నాడు. వాని తమ్ముడు శని గ్రహ పదవి నందెను. త్వష్ట (సూర్య బింబమును) తరణి బట్టగా రాలిన రజమును బ్రోవు చేసి విష్ణు చక్రమును గావించె. అది దాన వాంతకము అప్రతిహతము. యముని తరువాత బుట్టిన యా బాలిక యమున యనుపేర లోక పావనియైన నది యయ్యెను. మనువు సావర్ణు డునను పేర నా రెండవ కుమారుడు పిలువ బడెను. ఆయన తమ్ముడు శని గ్రహపదవి నంది సర్వలోక పూజితు డయ్యెను. దేవతల యీ జన్మ వృత్తాంతమును విన్న యాతడు ఆపదలను బాసి మహా యశస్సు నందును.