బ్రహ్మ మహా పురాణము

203 - అదితి కృతా భగవత్త్సుతిః

వ్యాసులు:

గరుడో వారుణం ఛత్రం తథైవ మణిపర్వతమ్‌

సభార్యం చ హృషీకేశం లీలయైవ వహ న్యయౌ

తతః శంఖ ముపాధ్మాయ స్వర్గద్వారం గతో హరిః

ఉపతస్థు స్తతో దేవాః సార్ఘపాత్రా జనార్దనమ్‌

స దేవైరర్చితః కృష్ణొ దేవమాతుర్నివేశనమ్‌

సితాభ్రశిఖరాకారం ప్రవిశ్య దధీశేదితిమ్‌

స తాం ప్రణమ్య శక్రేణ సహితః కుండలో త్తమే

దదౌనరకనాశం చ శశంసాస్యై జనార్దనః

తతః ప్రీతా జగన్మాతా ధాతారం జగతాం హరిమ్‌

తుష్టావాదితారవ్యగ్రం కృత్వా తత్ప్రవణం మనః

వ్యాసులు:

గరుత్మంతుడు వరుణు డిచ్చిన ఛత్రమును, మణి పర్వతమును పత్నీ సమేతుడైన హరిని విలాసముగ వహించుచు బయనించెను. స్వర్గ ద్వారమునకు జేరి హరి శంఖము నొత్తెను. దేవతలు అర్ఘ్య పాత్రముం గొని యెదురు వచ్చిరి. వేల్పులచే బూజింప బడి తెల్లని మేఘ మట్లున్న శిఖరములతో నున్న దేవమాత యగు నతిది గృహముం బ్రవేశించి ఇంద్రునితో గూడ తానామెకు నమస్కరించి మణి కుండలము లొసంగి నరకుడు నశించె నని తెల్పెను. జగ జ్జనని యదితి సంప్రీతయై జగత్కర్త యగు హరిని మనస్సతని యందు నిలిపి తొట్రు వడక ఇట్లు స్తుతించెను.

అదితి:

నమ స్తే పుండరీకాక్ష భక్తానా మభయంకర

సనాతనాత్మ న్భూతాత్మ న్సర్వాత్మన్భూతభావన

పణేత ర్మనసో బుద్ధే రింద్రియాణాం గుణాత్మక

సితదీర్ఘాదినిః శేష కల్పనా పరివర్జిత

జన్మాదిభి రసంస్పృష్ట స్వప్నాదిపరివర్జిత

సంధ్యా రాత్రి రహర్భూమి ర్గగనం వాయురంబు చ

హుతాశనో మనో బుద్ధిర్భూతాదిస్త్వం తథాచ్యుత

సృష్టి స్థితి వినాశానాం కర్తా కర్తృపతిర్భవాన్‌

బ్రహ్మవిష్ణు శివాఖ్యాభి రాత్మమూర్తిభిరీశ్వరః

మాయాభిరేత ద్వ్యాప్తం తే జగత్థ్సావరజంగమమ్‌

అనాత్మ న్యాత్మవిజ్ఞానం సా తే మాయా జనార్థన

అహం మమేతి భావోత్ర యయా సముపజాయతే

సంసారమధ్యే మాయాయా స్తవై తన్నాథ చేష్టతమ్‌

యైః స్వధర్మపరై ర్నాథ నరై రారాధితో భవాన్‌

తే తరంత్యభిలామేతాం మాయా మాత్మవిముక్తయే

బ్రహ్మాద్యాః సకలా దేవా మనుష్యాః పశవ స్తథా

విష్ణుమాయామహావర్తే మోహాంధతమసావృతాః

ఆరాధ్య త్వామభీప్సంతే కామానాత్మభవక్షయే

పదే తే పురుషా బద్ధా మాయయా భగవంస్తవ

మయాత్వం పుత్రకామిన్యా వైరిపక్ష క్షయాయ చ

ఆరాధితో న మోక్షాయ మాయావిలసితం హితత్‌

కౌపీనాచ్ఛాదనప్రాయా వాంఛా కల్పద్రుమాదపి

జాయతే యదపుణ్యానాం సోపరాధః స్వదోషజః

తత్ప్రసీదాఖిలజగ న్మాయామోహకరావ్యయ

అజ్ఞానం జ్ఞానసద్భావ భూతభూతేశ నాశయ

నమస్తే చక్రహస్తాయ శార్ఙ్గస్తాయతే నమః

ఏతత్పశ్యామితే రూపం స్థూలచిహ్నోపశోభితమ్‌

నజానామి పరం యత్తే ప్రసీద పరమేశ్వర

అదితి:

పుండరీకాక్ష! భక్తాభయ ప్రద! సనాతన స్వరూపా! సర్వభూత భావన! మనో బుద్ధేంద్రియములకు ప్రేరకుడా! హ్రస్వ దీర్ఘాది వికల్ప రహిత! జన్మాది రహిత! స్వప్నాద్యవ స్థాత్రయ పర్జిత! నీవు సంధ్యాది కాల స్వరూపుడవు. భూమ్యాది పంచభూత స్వరూపుడవు. మనోబుద్ధి చిత్తాహంకారములు నీవే. సృష్ట్యాది కర్తవు కర్తలకు పతివి నీవే. మాయా కృతములగు బ్రహ్మాది మూర్తులతో నంతట చరాచరాత్మక జగమెల్ల వ్యాపించి యున్నాడవు. అత్మ గాని దాని యందు ఆత్మ బుద్ధి నీ మాయ. దాని వలననే యహంకార మమకారములు గల్గును. సంసార మందు ఇదెల్ల నీమాయ యొక్క చేష్టయే. స్వధర్మ పరులచే నీవారాధింప బడుదువు. వారే ఈ మాయను తరింతురు. బ్రహ్మాదులు మనుష్యులు పశువులు సకలము విష్ణు మాయ యను నుడిలో పడి మోహమను గాఢాంధ కారమున గ్రమ్ముకొన బడుదురు. నిన్నా రాధించి యభీష్టము లంది భవము తరింతురు. నీ పదము నందుకొందురు. పుత్ర కామనచే శతృక్షయము కొరకు నిన్ను నేనారాధించితిని. మోక్షమునకు గాదు. మాయ యొక్క విలాస మిది. ఈ కోరిన కల్ప వృక్షము నుండి కూడ గోచి గుడ్డ నడుగుట వంటిది. పుణ్యకర్మలు చేయని వారు ఇట్టి ఫల వాంఛ చేయుట యను నీ యపరాధము తమకు తాము చేసు కున్నదే. సకల జగన్మాయా మోహపరుడ వగునో పరాత్పర! నాయెడ ప్రసన్నుడ వగుము. కేవల జ్ఞానసత్తా స్వరూపుడవు. నా అజ్ఞానమును నశింప జేయుము. శార్ఙ్గ చక్ర గదా హస్త! నీకు నమహ్కరము. స్థూల చిహ్నములచే శోభిల్లు నీరూప మిదే చూచు చున్నాను. నీ కేవల తత్త్వము నెరుగను. ప్రసన్నుడ వగుము.

వ్యాసులు:

అదిత్యైవం స్తుతో విష్ణుః ప్రహస్యాహ సురారణిమ్‌

వ్యాసులు:

ఇట్లు విష్ణువు స్తుతింప బడి సురారణిని (దేవ మాత) గూర్చి యల్లన నవ్వి యిట్లనియె. (అగ్ని పుట్టుట కాధారము అరణి. అట్లే దేవతల ప్రాదుర్భావమున కాధార మదితి గావున యామెను సురారణి యను వైదికభాషతో చక్కగా వ్యాసులిచ్చట పేర్కొన్నారు.)

శ్రీకృష్ణుడు:

మాతా దేవి త్వ మస్మాకం ప్రసీద వరదా భవ

శ్రీకృష్ణుడు:

దేవీ! మాకు నీవు మాతవు. దయ చూపుము. వర ప్రదాత్రివి గమ్ము. అని కృష్ణుడు స్తుతింప

అదితి:

ఏవమస్తు యథేచ్ఛా తే త్వమశేషసురాసురైః

 అజయ్యః పురుషవ్యాఘ్ర మర్త్యలోకే భవిష్యసి

అదితి:

నీయిష్ట మట్లే యగుగాక! సురాసురలకు నీవ జయ్యుడవై మనుష్య లోకమున నుందు వని యదితి యనెను.

వ్యాసులు:

తతోనంతరమేవాస్య శక్రాణీ సహితాందితిమ్‌

సత్యభామా ప్రణమ్యాహ ప్రసీదేతి పునః పునః

వ్యాసులు:

అటుపై శచీదేవితో గూడిన అదితికి సత్యభామ మ్రొక్కి మాయెడ ప్రసన్ను రాలవు గమ్మని మరిమరి కోరెను.

మత్ప్రాసాదా న్న తే సుభ్రు జారా వై రూప్యమేవ చ

భవిష్యత్యనవద్యాంగి సర్వకామా భవిష్యసి

అదితియు నా ప్రసాదమున ముదిమి రూప వికృతియు నీకు కలుగదు. సర్వకామ సిద్ధి నంద గలవని దీవించెను.

వ్యాసులు:

అదిత్యా తు కృతానుజ్ఞో దేవరాజో జనార్దనమ్‌

యథావత్పూజయామాన బహుమాన పురఃసరమ్‌

తతో దదర్శ కృష్ణొపి సత్యభామా సహాయవాన్‌

దేవోద్యానాని సర్వాణి నందనాదీని సత్తమాః

దదర్శ చ సుగంధాడ్యం మంజరీపుంజధారిణమ్‌

శైత్యాహ్లాదకరం దివ్యం తామ్రపల్లవ శోభితమ్‌

మధ్యమానేమృతే జాతం జాతరూప సమప్రభమ్‌

పారిజాతం జగన్నాథః కేశవః కేశి సూదనః

తం దృష్ట్వా ప్రాహ గోవిందం సత్యభామా ద్విజోత్తమాః

వ్యాసులు:

అదితి యనుజ్ఞ గొని దేవేంద్రుడు హరిని సబహుమానముగ యథావిధి బూజించెను. అవ్వల కృష్ణుడు సత్యభామ వెనుకొన నందన వనము మొదలైన దేవోద్యాన వనము లన్నింటిని దర్శించెను. మరియు సువాసనల నించు పూల గుత్తులతో చలువలం జిమ్ముచు నెర్రని చివుళ్ళతో నాహ్లాదకరమై యమృత మథనము నందు పుట్టి సువర్ణ ప్రభ నొప్పు దివ్యమైన పారిజాతమును దర్శించెను. ఆ దివ్యతరు రత్నమును గని భామా రత్నము సత్యభామ యిట్లనియె.

సత్యభామ:

కస్మాన్న ద్వారకామేష నీయతే కృష్ణ! పాదపః

యది తే తద్వచః సత్యం సత్యాత్యర్థం ప్రియేతిమే

మద్గృహే నిష్కుటార్ధాయ తదయం నీయతాం తరుః

నమే జాంబవతీ తాదృ గభీష్టన చ రుక్మిణీ

సత్యే! యథా త్వమిత్యుక్తం త్వయా కృష్ణ సకృత్ప్రియమ్‌

సత్యం తద్యది గోవింద నోపచారకృతం వచః

తదస్తు పారిజాతోయం మమ గేహవిభూషణమ్‌

బిభ్రతీ పారిజాతస్య కేశపాశేన మంజరీమ్‌

సపత్నీనామహం మధ్యే శోభేయమితి కామయే

సత్యభామ:

కృష్ణ! యీ దివ్య వృక్షము ద్వారకకు మన మేల గొని పోరాదు? సత్య నాకెంతెని ప్రియురాలను నీ మాట నిజమే యగు నేని నాయింటి పెరటిలో నాటుటకు దీనిం గొనిరమ్ము. నీయంతగ ప్రేమ పాత్రము జాంబవతి గాదు. రుక్మిణియు గాదు. అని పలు మారులు పలికితివి. ఆ పలుకులు నిజ మైనచోనది మాట మాత్రము కాదేని (ఉపచార మాత్రమున నన్నది కాదేని) యీ పారిజాతము నా గృహ భూషణ మగుగాక! ఈ పారిజాత కుసుమ మంజరిని నా కొప్పునం దుఱుము కొని సవతుల నడుమ నందరి కన్న మిన్నగ రాణింప గోరు చున్నానని పలుక

వ్యాసులు:

ఇత్యుక్తః స ప్రహస్యైనం పారిజాతం గరుత్మతి

ఆరోపయామాస హరి స్తమూచుర్వనరక్షిణః

వ్యాసులు:

కృష్ణుడు నవ్వి పారిజాతము గరుడునిపై కెక్కించెను. అతనిం గని నందన వన పాలకు లిట్లనిరి.

వనపాలురు:

భోశ్శచీ దేవరాజస్య మహిషీ తత్పరిగ్రహమ్‌

పారిజాతం న గోవింద హర్తుమర్హసి పాదపమ్‌

శచీవిభూషణార్ధాయ దేవైరమృత మంథనే

ఉత్పాదితోయం నక్షేమీ గృహీత్వైనం గమిష్యసి

మౌఢ్యాత్ప్రార్ధయసే క్షేమీ గృహీత్వైనం చ కో వ్రజేత్‌

అవశ్యమస్య దేవేంద్రో వికృతిం కృష్ణ యాస్యతి

వజ్రోద్యతకరం శక్ర మనుయాస్యంతి చామరాః

తదలం సకలైర్దేవై ర్విగ్రహేణ తవాచ్యుత

విపాకకటు యత్కర్మ న తచ్ఛంసంతి పండితాః

వనపాలురు:

దేవరాజ పట్టమహిషి శచేదేవి, ఆమె సొత్తు పారిజాతము. గోవింద దానిని నీవు కొల్లగొన దగదు. శచీదేవి యలంరారము నకే దేవత లమృత మంథనమున దీని నావిర్భవింప జేసినారు. దానిం జేకొని నీవు క్షేమమున నరుగ జాలవు. తెలియక దీనిని గోరెదవు. ఎవడు దీనింగొని పోగలడు? దీని వలన దేవేంద్రుడు వికృతి నంద గలడు. (అతని మనసు చెడునని భావము.) వజ్రముం జేబూనిన శక్రుని నమరులు వెంబడింప గలరు. దేవత లందరి తోడి విరోధము అచ్యుత! నీకు వలదు. పరిణామ మందు కటువైన (చేదైన) పనిని పండితులు మెచ్చరు (పర్యవసానమున దేవ విరోధము కొని తెచ్చు విషమమైన పని యీ పారిజాతా హరణమని భావము) అని వన పాలకులు పలుక

ఇత్యు క్తే తై రువాచైతా న్సత్యభామాతికోపినీ

ప్రచండ కోపమున సత్యభామ యిట్లనియె.

సత్యభామ:

కా శచీ పారిజాతస్య కోవా శక్రః సురాధిపః

సామాన్యః సర్వలోకానాం యద్యేషోమృత మంథనే

సముత్పన్నః పురా కస్మా దేకో గృహ్ణాతి వాసవః

యథా సురా యథా చేందు ర్యథా శ్రీ ర్వనరక్షిణః

సామాన్యః సర్వలోకస్య పారిజాత స్తథా ద్రుమః

భర్తృ బాహు మహాగర్వా ద్రుణద్ధ్యేన మథో శచీ

తత్కథ్యతాం ద్రుతం గత్వా పౌలోమ్యా వచనం మమ

సత్యభామా వద త్యేవం భర్తృగర్వోద్ధతాక్షరమ్‌

యది త్వం దయితా భర్తు ర్యది తస్య ప్రియా హ్యసి

మద్భర్తుర్హరతో వృక్షం తత్కారయ నివారణమ్‌

జానామి తే వతిం శక్రం జానామి త్రిదశేశ్వరమ్‌

పారిజాతం తథాప్యేనం మానుషీ హరయామి తే

సత్యభామ:

పారిజాతమునకు శచి యెవతె? సురాధిపుడు శక్రు డెవరు? ఈ వృక్ష మమృత మథనము నందే పుట్టిన యెడల యిది సర్వ లోకములకు జెందిన సమాన మైన యాస్తి. వాసవు డొక్కడే దాని నెందులకు గైకొనును? దేవతలు చంద్రుడు లక్ష్మి సర్వ లోకమునకు సామాన్య ధన మైనట్టు పారిజాత వృక్షముc గూడ సామాన్యమే. మగని బాహువుల నండగొని గనిని గర్వాతి శయముచే నిపుడు శచి దీనిని నిరోధించు చున్నది. అందు వలన పరుగునం బోయి పౌలోమికీ నా మాటను చెప్పుదు. భర్తృ గర్వమున (సౌభాగ్య గర్వమున) నుద్ధత మైన భాషలో సత్యభామ యిట్లు చెప్పు చున్నది. నీవు గనక మగనికి గూర్చు దానవేని యతనికి ప్రియురాల వైన నీ తరువును హరించు నా భర్త నాపింపుము. నీ మగని నింద్రు నెరుగుదును. దేవతలకు ప్రభువని యెరుగుదును. అదంతయు నట్లుండ మనుష్య స్త్రీని నేను నా పారిజాతమును గొనిపోయు చున్నానని సత్యభామ పలుక

వ్యాసులు:

ఇత్యుక్తా రక్షిణో గత్వా ప్రోచ్చైః ప్రోచు ర్యథోదితమ్‌

శచీ చోత్సాహయామాస త్రిదశాధిపతిం పతిమ్‌

వ్యాసులు:

వనపాలకు లేగి సత్యభామ చెప్పినది చెప్పినట్లు పెద్దగ ఘోషించుచు శచీదేవికి జెప్పిరి. శచియు దేవాధిపతిని ప్రోత్సహించెను.

తతః సమస్త దేవానాం సైన్యైః పరివృతో హరిమ్‌

ప్రవృత్తః పారిజాతార్థ మింద్రో యోధయితుంద్విజాః

తతః పరిఘనిస్త్రింశ గదాశూల వరాయుధాః

బభూవుస్త్రిదశాః సజ్జాః శక్రే వజ్రకరే స్థితే

తతో నిరీక్ష్య గోవిందో నాగరాజోపరి స్థితమ్‌

శక్రం దేవపరీవారం యుద్ధాయ సముపస్థితమ్‌

చకార శంఖనిర్ఘోషం దిశః శబ్దేన పూనయన్‌

ముమోచ చ శరవ్రాతం సహస్రాయుత సంమితమ్‌

తతో దిశో నభశ్చైవ దృష్ట్వా శరశతాచితమ్‌

ముముచు స్త్రిదశాః సర్వే శస్త్రాణ్య శస్త్రాణ్యనేకశః

ఏకైకమస్త్రం శస్త్రం చ దేవైర్ముక్తం సహస్రధా

చిచ్ఛేద లీలయైవేశో జగతాం మధుసూదనః

పాశం సలిలరాజస్య సమాకృష్యోరగాశనః

చచాల ఖండశః కృత్వా బాల పన్నగదేహవత్‌

యమేన ప్రహితం దండం గదాప్రక్షేప ఖండితమ్‌

పృథివ్యాం పాతయామాస భగవాన్దేవకీసుతః

శిబికాం చ ధనేశస్య చక్రేణ తిలశో విభుః

చకార శౌరిరర్కేందూ దృష్టి పాతహతౌజసౌ

నీతోగ్నిః శతశో బాణై ర్ద్రావితా వసవో దిశః

చక్రవిచ్ఛిన్నశూలాగ్రారుద్రాభువి నిపాతితాః

సాధ్యా విశ్యేచ మరుతో గంధర్వాశ్చైవ సాయకైః

శార్ఙ్గణా ప్రేషితాః సర్వే వ్యోమ్ని శాల్మలితూలవత్‌

గరుడశ్చాపి వక్త్రేణ పక్షాభ్యాం చ నఖాంకురైః

భక్షయన్నహనద్దేవా న్దానవాంశ్చ సదా ఖగః

తతః శరసహస్రేణ దేవేంద్ర మధుసూదనౌ

పరస్పరం వవర్షాతే ధారాభిరివ తోయదౌ

ఐరావతేన గరుడో యుయుధే తత్రసంకులే

దేవైః సమేతై ర్యుయుధే శక్రేణ చ జనార్దనః

చిన్నేషు శీర్యమాణేషు శస్త్రేష్వ స్త్రేషు సత్వరమ్‌

జగ్రాహ వాసవో వజ్రం కృష్ణశ్చక్రం సుదర్శనమ్‌

తతో హాహాకృతం సర్వం త్రైలోక్యం సచరాచరమ్‌

వజ్రచక్రధరౌ దృష్ట్వా దేవరాజ జనార్దనౌ

అంతట నెల్ల దేవ సేనలు తన్న నుగమింప పారిజాతము కొర కింద్రుడు యుద్ధము సేయింప ప్రవృత్తు డయ్యెను. అవ్వల పరిమ నిస్త్రింశ గదా శూలాద్యా యుధ విశేషములను గొని త్రిదశు లింద్రుడు వజ్రాయుధము గొని నిలువ యుద్ధ సన్నద్ధులైరి. అంతట గోవిందు డైరావత గజరాజ మందున్న శక్రుని దేవ పరివారమును యుద్ధ సన్నద్ధులం గని దిక్కులు పిక్కటిల్ల శంఖ నిర్ఘోష మొనరించెను. వేలు లక్షలుగ బాణములను వదలెను. దిక్కులు నాకాశము బాణములు నిండ దేవత లనేక శస్త్రాస్త్రము లను విసరిరి. జగదీశ్వరుడు మధుసూదను డొక్కొక అస్త్రమును శస్త్రమును వేవేలు తునకలుగ భేదించెను. వరుణుని పాశము నురగాశనుడు (గతుత్మంతుడు) పాముపిల్ల దేహ మనట్లు ఖండ ఖండముల సేసి ఎగిరెను. భగవంతుడు దేవకీ కుమారుడు యముడు వదలిన దండమును గదచే నడచి ఖండించి పొడమిం బారవైచెను. ఆ ప్రభువు శౌరి కుబేరుని పల్లకిని చక్రముచే నువ్వు గింజంత తునక తునకలు సేసెను. సూర్య చంద్రులకు దేరిపార జూచి తేజో హీనులం గావించెను. అగ్ని వందల కొలది బాణములకు గురి యయ్యెను. వసువులు నలు దిక్కులకు దరుమ బడిరి. చక్రాయుధముచే శూలగ్రములు దెగబడ రుద్రులు పుడమిపై వడగొట్ట బడిరి. శార్జ్గ (శారర్గ్జ మను ధనుస్సును బట్టెడి హరి) సాధ్యులను విశ్యే దేవతలను మరుత్తులను గంధర్వుల నమ్ములచే నాకాశమున బూరుగు పింజల నట్లు ఎగుర గొట్టెను. గరుడుడు తుండముతో రెక్కలతో గోటి కొనలతో దేవ దానవులను దినుచు చంపు చుండెను. బాణ సహస్రముల నింద్రో పేంద్రులు రెండు మేఘములు వర్ష ధారల నట్లొండురు లపై వర్షించు కొనిరి. సంకుల యుద్ధమున గరుడు డైరావతముతో దేవతలతో నింద్రునితో జనార్ధునుడును బోరిరి. శస్త్రములు నస్త్రములును తెగి విరిగి విడిపోవ సత్త్వరముగ నింద్రుడు వజ్రమును బట్టెను. కృష్ణుడు సుదర్శన చక్రము నెత్తెను. అంత చరాచర మగు ముల్లోక మెల్ల వజ్ర చక్ర ధరులైన యా దేవరాజ జనార్ధనుల జూచి హాహాకార మొనరించెను.

క్షిప్తం వజ్రమథేంద్రేణ జగ్రాహ భగవాన్హరిః

నముమోచ తదా చక్రం తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్‌

ప్రనష్ట వజ్రం దేవేంద్రం గరుడక్షత వాహనమ్‌

సత్యభామాబ్రవీద్వాక్యం పలాయన పరాయణమ్‌

అవ్వల నింద్రుడు విసరిన వజ్రాయుధము జేతం బట్టకొని శ్రీకృష్ణడు చక్రా యుధమును మాత్రము వదలక నిలునిలు మని తర్జించెను. వజ్రము గోల్పడి వాహనము గరుడుని దెబ్బతిను నంత పలాయన మంత్రము జపింప నున్న శచీవతిం గని సత్యభామ యిట్లనియె.

సత్యభామ:

త్రైలోక్యేశ్వర నో యుక్తం శచీభర్తుః పలాయనమ్‌

పారిజాతస్రగా భోగా త్త్వాముపస్థాస్యతే శచీ

కీదృశం దేవరాజ్యం తే పారిజాత స్రగుజ్జ్వలామ్‌

అపశ్యతో యథాపూర్వం ప్రణయాభ్యాగతాం శచీమ్‌

అలం శక్ర ప్రయాసేన న వ్రీడాం యాతు మర్హసి

నీయతాం పారిజాతోయం దేవాః సంతు గతవ్యథాః

పతిగర్వావలేపేన బహుమానపురః సరమ్‌

న దదర్శ గృహాయాతా ముపచారేణ మాం శచీ

స్త్రీత్వాదగురుచిత్తాహం స్వభర్తుః శ్లాఘనాపరా

తతః కృతవతీ శక్ర భవతా సహ విగ్రహమ్‌

తదలం పారిజాతేన పరస్వేన హృతేన వా

రూపేణ యశసాచైవ భవేత్త్స్రీ కాన గర్వితా

త్రిలోకేశ్వరా! శచీ భర్తకు బారి పోవుట యుక్తము గాదు. పారిజాత కుసుమ మాలసిగను ముడుచు కొని శచి నిన్ను సేవిం పగలదు. పారిజాత మాలచే దేజ రిల్లుచు వలపు గొని యేతెంచిన శచిని మునుపటి యట్లు గనని నీ దేవ సామ్రాజ్యమే బాటిది? ఇంద్రా చాలు చాలు సిగ్గు వడకుము. దేవతలు పారిజాతము గౌంపోదురు గాక. వారు వ్యధపడ కుందురుగాక. పతి గర్వమున తాను గర్వము గొని తన ఇంతటికి వచ్చిన నన్ను శచి బహుమానముగ జూడలేదు. స్త్రీనగుట వలన ఉదారమైన మనస్సు లేని దాననై నా భర్తను మెచ్చు కొనుటయే పనిగా నో యింద్రా! నీతో తగవు బెట్టు కొంటిని చాలు పరుల సొత్తుతో దొంగిలుటతో పారిజాతముతో బనిలేదు. రూపమునకు కీర్తికి నేమాడుది గర్వింపదు? అని పలుక

వ్యాసులు:

ఇత్యుక్తో వై నివవృతే దేవరాజ స్తయా ద్విజాః

ప్రాహ చై నామలం చండి సఖి! ఖేదాతి విస్తరైః

న చాపి సర్గ సంహార స్థితి కర్తాఖిలస్య యః

జితస్య తేన మే వ్రీడా జాయతే విశ్వరూపిణా

యస్మిన్జగత్సకల మేతదనాదిమధ్యే

యస్మాద్యతశ్చన భవిష్యతి సర్వభూతాత్‌

తేనోద్భవప్రళయ పాలన కారణేన

వ్రీడా కథం భవతి దేవి నిరాకృతస్య

సకల భువన మూ ర్తేర్మూర్తిరల్పా సుసూక్ష్మా

విదిత సకల వేదై ర్జాయతే యస్య నాన్యైః

తమజమకృత మీశం శాశ్వతం స్వేచ్ఛయైనం

జగదుపకృతి మాద్యం కోవిజేతుం సమర్థః

వ్యాసులు:

నింద్రుడు సంరంభము డిగి ఓ సఖి చండి(తీవ్ర కోపమున) మిగుల ఖేదపడ వలదు. సృష్టి స్థితి సంహారకర్త యగు విశ్వ స్వరూపునిచే నోడుటకు నేను సిగ్గు పడను. ఎవని యందీ జగమెల్ల నున్నదో, కల్గు చున్నదో, లయించు చున్నదో యట్టి ప్రభువు చేత నోడిన వానికి సిగ్గేల కల్గును. సకల భువన స్వరూపుడగు నాయన సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపము సకల వేదవిధులచే నెరుగ బడునది ఆన్యులచే నెరుగ బడుటెట్లు? అట్టి యజుని, నీశ్వరుని శాశ్వతుని తనంతట తాను జగ దుపకారము సేయు మొట్టమొదటి వాని నెవ్వడు జయింప సమర్థుడు?