బ్రహ్మ మహా పురాణము
212 - రుక్మిణ్యాదీనాం పరలోక గమనమ్
వ్యాసులు:
అర్జునోపి తదాన్విష్య కృష్ణరామ కళేబరే
సంస్కారం లంభయామాస తథాన్యేషా మనుక్రమాత్
అష్టౌ మహిష్యః కథితా రుక్మిణీ ప్రముఖాస్తు యాః
ఉపగృహ్య హరేర్దేహం వివిశు స్తా హుతాశనమ్
రేవతీ చైవ రామస్య దేహమా శ్లిష్య సత్తమాః
వివేశ జ్వలితం వహ్నిం తత్సంగాహ్లాదశీతలమ్
ఉగ్రసేనస్తు తచ్ఛ్రుత్వా తథైవానకదుందుభిః
దేవకీ రోహిణీ చైప వివిశు ర్జాతవేదసమ్
తతోర్జునః ప్రేతకార్యం కృత్వా తేషాం యథావిధి
నిశ్చక్రామ జనం సర్వం గృహీత్వా వజ్రమేవ చ
వ్యాసులు:
అర్జును డప్పుడు కృష్ణ బలరామ శరీరములను వెదకి వానికిని మఱి యితర శరీరములకు సంస్కారమును గావించెను. మఱియును అష్ట మహిషులు రుక్మిణి మొదలగు వారు హరి శరీరమునం బుట్టిన యగ్ని యందు బ్రవేశించిరి. రేవతియు బలరాము దేహము గౌగలించు కొని తత్స్పర్శ వలన గలిగిన యానందముచే చల్లబడిన యగ్ని యందు ప్రవేశించెను. ఆపై నర్జునుడు వారికి ప్రేత కృత్యములను యథా విధిగ జరిపి తక్కిన జనమును వజ్రుని దీసికొని వెళ్ళెను.
ద్వారవత్యా వినిష్క్రాంతాః కృష్ణపత్న్యః సహస్రశః
వ్రజం జనం చ కౌంతేయః పాలయం శనకైర్యయౌ
సధా సుధర్మా కృష్ణేన మర్త్యలోకే సమాహృతా
స్వర్గం జగామ భో విప్రాః పారిజాతశ్చ పాదపః
యస్మిన్దినే హరిర్యాతో దివం సంత్యజ్య మేదినీమ్
తస్మిన్దినేవతీర్ణోయం కాలకాయః కలిః కిల
ప్లావయామాస తాం శూన్యాం ద్వారకాంచ మహోదధిః
యదుశ్రేష్ఠ గృహం త్వేకం నాప్లావయత సాగరః
నాతిక్రామతి భో విప్రా స్తద ద్యాపి మహోదధిః
నిత్యం సంనిహిత స్తత్ర భగవా న్కేశవో యతః
తదతీవ మహాపుణ్యం సర్వపాతక నాశనమ్
విష్ణుక్రీడాన్వితం స్థానం దృష్ట్వా పాపా త్ప్రముచ్యతే
ద్వారవతి నుండి బయలు దేరిన వేల కొలది కృష్ణ భార్యలకు వజ్రునికి నతడు రక్షణ యిచ్చి యాదరించెను. కృష్ణునిచే భూమికి గొని రాబడిన సుధర్మ యను దేవ సభ పారిజాత వృక్షము స్వర్గమునకు వెళ్ళి పోయెను. హరి మేదినిని విడిచి స్వర్గా రోహణము చేసిన నాడే కలి నల్లని శరీరముతో భూమికి దిగెను. మహా సముద్రము నిర్జనమైన ద్వారకను ముంచి వేసెను. ఒక్క కృష్ణ గృహమును మాత్రము ముంచ లేదు. ఆ గృహ మందెపుడును భగవంతు డీనాటికిని యుండుటచే నేడును సముద్రుడు తన హద్దుదాటి దాని నాక్రమింపడు. అది మహాపుణ్య స్థానము సర్వపాప హరము. విష్ణువు క్రీడించిన స్థానము. దానిని దర్శించిన పాపము వోవును.
పార్థః పంచనదే దేశే బహుధాన్య ధనాన్వితే
చకార వాసం సర్వస్య జనస్య ముని సత్తమాః
తతో లోభః సమభవ త్పార్ధేనై కేన ధన్వినా
దృష్ట్వా స్త్రియో నీయమానా దస్యూనాం నిహతేశ్వరాః
తతస్తే పాపకర్మాణో లోభోపహతచేతనసః
ఆభీరా మంత్రయామాసుః సమేత్యాత్యంత దుర్మదాః
ఆయమేకోర్జునో ధన్వీ స్త్రీజనం నిహతేశ్వరమ్
నయత్యస్మానతిక్రమ్య ధిగేత త్క్రియతాం బలమ్
హత్వా గర్వసమారూఢో భీష్మద్రోణ జయద్రథాన్
కర్ణాదీంశ్చ న జానాతి బలం గ్రామనివాసినామ్
బలజ్యేష్టాన్నరానన్యా న్గ్రామ్యాంశ్చైవ విశేషతః
సర్వానేవావజాతి కిం వో బహుభిరుత్తరైః
తతో యష్టి ప్రహరణా దస్యవో లోష్టహారిణః
సహస్రశోభ్యధావంత తం జనం నిహతేశ్వరమ్
తతో నివృత్తః కౌంతేయః ప్రాహాభీరాన్హసన్నివ
నివర్తధ్వ మధర్మజ్ఞా యదితోనముమూర్షవః
ఆవజ్ఞాయ వచస్తస్య జగృహుస్తే తదా ధనమ్
స్త్రీజనం చాపి కౌంతేయా ద్విష్వక్సేన పరిగ్రహమ్
పార్ధుడు ధాన్యధన సమృద్ధ మైన పంచనద దేశమందు యాదవ జనమున కంతకు నివాస మేర్పరచెను. అవ్వల కలి ప్రభావము చేత మానవులలో లోభగుణ మంకురించెను. భర్తలను గోల్పోయిన స్త్రీలు చోరులకు సంబంధించిన వారిని ధనుర్ధారి యైన యొక్క అర్జునుడు తీసికొని పోయి రక్షణ యిచ్చుట చూచి లోభ వశులై పాపులైన యాభీరులు (అడవి మూకలు) పొగరు గొని యొండొరు లిట్లు ఆలోచించిరి. ఈ అర్జును డొక్కడు విల్లుగొని భర్తలు చని పోయిన స్త్రీజనమును గొనిపోవు చున్నాడు. మనలను లెక్కచేయుట లేదు. కనుక మన బలము జూపింతము. భీష్మ ద్రోణ జయద్రధ కర్ణాది వీరులను జంపి గర్వమెక్కి గ్రామ వాసులగు మన బలమేదో యెరుగ కున్నాడు. బలాఢ్యు లగు పెక్కు గ్రామముల వారి నందరిని అవమానించు చున్నాడు. మీరెవ్వరును బదులు పలుక వలదు. అన కర్రలు కత్తులు గొని దస్యులు (గూండాలు) వేల కొలది పరువు లెత్తిరి. అంత నర్జునుడు వెను దిరిగి యయ్యా భీరులం గని “మీరు బ్రతుక దలతురేని వెనుకకు పొండు” అన నాతని మాటను ధిక్కరించి వాండ్రెల్ల స్త్రీలను కృష్ణ భార్యలను నర్జునుని చెంత నుండి లాగికొని పోయిరి.
తతోర్జునో ధనుర్దివ్యం గాండీవ మజరం యుధి
ఆరోపయితు మారేభే న శశాక స వీర్యవాన్
చకార సజ్యం కృచ్ఛ్రాత్తు తదభూ చ్ఛిథిలం పునః
న సస్మార తథాస్త్రాణి చింతయన్నపి పాండవః
శరాన్ముమోచ చైతేషు పార్థః శేషా న్సహర్షితః
న భేదం తే పరం చక్రు రస్తా గాండీవధన్వనా
వహ్నినా చాక్షయా దత్తాః శరాస్తేపి క్షయం యయుః
యుధ్యతః సహ గోపాలై రర్జున స్యాభవతక్షయః
ఆచింతయత్తు కౌంతేయః కృష్ణస్యైవహి తద్బలమ్
యన్మయా శరసంఘాతైః సబలా భూభృతో జితాః
మిషతః పాండుపుత్రస్య తతస్తాః ప్రమదోత్తమాః
అపాకృష్యంత చాభీరైః కామా చ్చాన్యాఃప్రవవ్రజుః
తతః శరేషు క్షీణేషు ధనుష్కోట్యా ధనంజయః
జఘాన దస్యూంస్తే చాస్య ప్రహారా న్జహసు ర్ద్విజాః
పశ్యత స్త్వేవ పార్థస్య వృష్ణ్యంధకవరస్త్రియః
జగ్మురాదాయ తే మ్లేచ్ఛాః సమంతాన్ముని సత్తమాః
అంత నర్జునుడు యుద్ధ మందు వమ్మువోయి గాండీవము నెక్కుపెట్ట బూనెను. కాని అతని కశక్య మయ్యె. కష్టము మీద నెక్కు పెట్టినను క్షణములో నది శిథిలమై పోయెను. దివ్యాస్త్రము లతనికి జ్ఞాపకమే రాలేదు. చేనున్న తక్కిన యస్త్రములను వారిపై విసరెను. కాని యవి యన్నియు గ్రుంగి పోయి శత్రు భేదముం జేయ వయ్యెను. ఖాండవ వన దహన సమయమున నగ్ని యిచ్చిన యక్షయ బాణములు కూడ అప్పుడు క్షయించి పోయినవి. గోపాలురతో పోరుచున్న యర్జునునికి హైన్య స్థితి వచ్చెను. అపుడర్జునుడు శరజాలముచే బలాఢ్యులగు రాజులను నేను గెలుచుట కృష్ణుని యొక్క బలమే యని తలంచెను. అతడు చూచు చుండగనే యుత్తమ స్త్రీ వర్గమును ఆ భీరులు లాగికొని పోయిరి. కొందరు స్త్రీలు తమంతనే కామ ప్రవృత్తితో ఆ మూక వెంట పడిపోయిరి. ఆర్జునుడు శస్త్రాస్త్రములచే గొట్టు చుండ వాండ్రు పకపక నవ్వు చుండిరి. ఇట్లు మ్లేచ్ఛులు పార్థుడు చూచు చుండగనే వృష్ణ్యంధక కులాంగనల నందరం గొనిపోయిరి.
తతః స దుఃఖితో జిష్ణుః కష్టం కష్టమితి బ్రువన్
అహో భగవతా తేన ముక్తోస్మీతి రురోద హ
తద్ధను స్తాని చాస్త్రాణి స రథస్తే చ వాజినః
సర్వ మేకపదే నష్టం దాన మశ్రోత్రియే యథా
అహో చాతి బలం దైవం వినా తేన మహాత్మనా
య దసామర్థ్యయుక్తోహం నీచై ర్నీతః పరాభవమ్
తౌ బాహూ స చమే ముష్టిః స్థానం త త్సోస్మి చార్జునః
పుణ్యేనేవ వినా తేన గతం సర్వమసారతామ్
మమార్జునత్వం భీమస్య భీమత్వం తత్కృతం ధ్రువమ్
వినా తేన యదాభీరై ర్జితోహం కథమన్యథా
ఆంతట జిష్ణువగు (అర్జునుడు) కష్టము! కష్ట మనుచు భగవంతునిచే విడువ బడితి నని యేడ్చెను. అదే ధనుస్సు అవే యమ్ములు అదే రథము అవే గుఱ్ఱములు. వేద విదుడు వేదా నుష్ఠాతయు కాని వానికి చేసిన దానము వలె నొక్క యడుగులో సర్వము వమ్మై పోయినది. ఆహా! విధి యెంత బలీయము. ఆ మహానుభావుడు లేనంతట వట్టి చేతగాని దద్దమ్మనై పనికి మాలిన వారిచే నవమానింప బడితిని. అవే బాహువులు అదే పిడికిలి. అదేచోటు. ఆ అర్జునుడనేయై యున్నాను. పుణ్యముతో నాస్వామితో నెడబాటు ననంతయు నిస్సారమై పోయినది. నా యర్జునత్వము భీముని భీమత్వము కృష్ణుని వలన నీయ బడినవే. నిజము. ఆయన లేమి నీ చచ్చు గొల్లలకు నేను బెండు వడితిని.
వ్యాసులు:
ఇత్థం వదన్యయౌ జిష్ణు రింద్రప్రస్ధం పురోత్తమమ్
చకార తత్ర రాజానం వజ్రం యాదవనందనమ్
స దదర్శ తతో వ్యాసం ఫాల్గుణః కాననాశ్రయమ్
తముపేత్య మహాభాగం వినయేనాభ్యవాదయత్
తం వందమానం చరణా వవలోక్య సునిశ్చితమ్
ఉవాచ పార్థ విచ్ఛాయః కథమంత్యంత మీదృశః
అజారజోనుగమనం బ్రహ్మహత్యాథవా కృతా
జయాశాభంగదుఃఖీ వా భ్రష్టచ్ఛాయోసి సాంప్రతమ్
సాంతానికాదయో వా తే యాచమానా నిరాకృతాః
అగమ్య స్త్రీరతిర్వాపి కేనాసి విగతప్రభః
భుంక్తేప్రదాయ విప్రేభ్యో మిష్టమేక మథో భవాన్
కిం వా కృపణ విత్తాని హృతాని భవతార్జున
కచ్చిన్న సూర్యవాతస్య గోచరత్వం గతోర్జున
దుష్టచక్షుర్హతో వాపి నిఃశ్రీకః కథమన్యథా
స్పృష్టో నఖాంభసా వాపి ఘాటాంభఃప్రోక్షితోసివా
తేనాతీవాసి విచ్ఛాయో న్యూనై ర్వా యుధి నిర్జీత
తతఃపార్థో వినిశ్వస్య శ్రూయతాం భగవన్నితి
ప్రోక్తో యథావ దాచష్ట విప్రా ఆత్మపరాభవమ్
వ్యాసులు:
ఇట్లర్జునుడు పలుకుచు నింద్ర ప్రస్థమున కేగి యాదవ కుమారుడగు వజ్రుని యందు రాజును గావించెను. అవ్వల నడవిలో నున్న వ్యాసుని మహానుభావుని దర్శించి సమీపించి యడకుప దోప నమస్కరించెను. అట్లు మ్రొక్కిన యర్జునుని వ్యాస భనవానులు తేరి పార జూచి యర్జునుడే యని నిశ్చయమునకు వచ్చి పార్ధా! ఈ విధముగ మిక్కిలి వన్నె దరిగి యున్నాడ వేమి? గొర్రెల పరాగము వెంబడింప వలసి వచ్చెనా? బ్రహ్మ హత్యకు బాల్పడితివా? గెలుపునం దాశా భంగమై దుఃఖము గల్గెనా! విన్న వోయి యున్నాడవు. నిన్ను యాచింప వచ్చిన సాంతాని కాదులను లేదని నిరాకరించి పంపితివా! (సాంతానికుడు = పుత్రుడు మొదలగు వాడు) అగమ్యా గమనము జేసితివా! (కూడని స్త్రీతో సంగమము) ప్రభ దరిగి యుండుటకు గారణ మేమి! విప్రులకు బెట్టక నీవొక్కడవే మధు రాన్నములను దింటివా? కాక దీనుల ధనములను హరించితివా? సూర్య వాతమునకు (వడ దెబ్బకు) గురి కాలేదు కదా! ఎట్లు శోభ గోల్పోయి తివి? దృష్టి దోషము తగిలెనా నభోదక స్పర్శ కల్గినదా! (గోళ్ల యొక్క స్పర్శ కల్గిన యుదక మశుచి యన్న మాట) మట్టి కుండ నీటిచే ప్రోక్షింప బడితివా! (తడుప బడితివా) నీకన్న తక్కువ వారిచే గెలువ బడితివా! ఇట్లు ఛాయ దరిగి యున్నావేమి? పార్థుడంతట నిట్టూర్పు పుచ్చి భగవంతుడ! వినుము అని తన పరాభవ వృత్తాంతమును జరిగినది జరిగిన ట్లిట్లు చెప్పెను.
అర్జునుడు:
యద్బలం యచ్చనస్తేజో యద్వీర్యం యత్పరాక్రమః
యా శ్రీశ్చాయా చనః సోస్మాన్పరిత్యజ్యహరిర్గతః
ఇతరేణేవ మహతా స్మితపూర్వాభిభాషిణా
హీనా వయం మునే! తేన జాతాస్తృణమయా ఇవ
అస్త్రాణాం సాయకానాం చ గాండీవస్య తథా మమ
సారతా యాభవన్మూర్తా స గతః పురుషోత్తమః
యస్యావలోకనాదస్మాం శ్రీర్జయః సంపదున్నతిః
న తత్యాజ స గోవింద స్త్యక్త్వాస్మాన్భగవాన్గతః
భీష్మద్రోణాంగ రాజాద్యా స్తథా దుర్యోధనాదయః
యత్ర్పభావేణ నిర్డగ్ధాః స కృష్ణస్త్యక్తవాన్భువమ్
నిర్యౌవనా హతశ్రీకా భ్రష్టచ్ఛాయేవ మే మహీ
విభాతి తాత నైకోహం విరహే తస్య చక్రిణః
యస్యానుభావాద్భీష్మాద్యై ర్మయ్యగ్నౌ శలభాయితమ్
వినా తేనాద్య కృష్ణేన గోపాలై రస్మి నిర్జితః
గాండీవం త్రిషులోకేషు ఖ్యాతం యదనుభావతః
మమ తేన వినాభీరై ర్లగుడైస్తు తిరస్కృతమ్
స్త్రీసహస్రాణ్యనేకాని హ్యనాథాని మహామునే
యతతో మమ నీతాని దస్యుభిర్లగుడాయుధైః
ఆనీయమానమాభీరైః సర్వం కృష్ణావరోధనమ్
హృతం యష్టి ప్రహరణైః పరిభూయ బలం మమ
విఃశ్రీకతా నమే చిత్రం యజ్జీవామి తదద్భుతమ్
నీచావమానపంకాంకీ నిర్లజ్జోస్మిపితామహ
అర్జునుడు:
మా బలము మా తేజస్సు మా వీర్యము మా పరాక్రమము మా సిరి మా కాంతి యెవరో యట్టి హరి మమ్ము వీడి వెళ్ళినాడు. చిరునవ్వుతో ముచ్చటించు మా స్వామి ఆ మహానుభావుడు అన్యుడట్లు మమ్ము విడిచి వెళ్ళినాడు. దానిచే నా సర్వా యుధములు తృణ ప్రాయము లైనవి. అస్త్రములు శస్త్రములు గాండీవము యొక్క మూర్తీ భవించిన సారమెల్ల తానైన యా పురుషోత్తముడు వెళ్ళి పోయినాడు. ఎవని చూపున మమ్ములను శ్రీ జయము సంపత్సమృద్ధి విడువ లేదో యట్టి గోవిందుడు భగవంతుడు విడిచి వెళ్ళి నాడు. భీష్మ ద్రోణులు అంగరాజు (కర్ణుడు) దుర్యోధనాదులు నే ప్రభువు ప్రభావముచే సమూలము నిర్దగ్ధలైరో యట్టి కృష్ణుడు భూమిం బాసినాడు. యౌవనము బాసి హతశ్రీయై వన్నె దరిగి చక్రాయుధుని విరహము వలన నేనొక్కడనే కాదు ఈ పృథివి కుములు చున్నది. ఏ స్వామి యను భావము వలన లీల వలన నేనను నగ్ని యందు భీష్మాదులు మిడుత లైరో యట్టి కృష్ణుని బాసి గొల్లల కోడిపోయితిని. ఎవ్వని యను భావముచే త్రిలోకు ప్రసిద్ధ మైనదో యట్టి గాండీవము కృష్ణుడు లేమిని గొల్లల బడితె లకు లొంగి పోయినది. హరి లేమిని ఎన్నో వేల మంది స్త్రీలు ఆనాధలు వట్టి కట్టెలతో దొంగలచే గొనిపో బడినారు. నా బలమును ధిక్కరించి గొల్లలు నేను గొని వచ్చుచున్న కృష్ణుని యంతః పురమంతయు కర్రలతో నదలించి తోలికొని పోబడినారు. నేను సిరి గోల్పోవుట వింత గాదు. బ్రతికి యుండుట అదే యత్యద్భుతము. నీచుల వలని యవమానమను ఱొంపిని బూసికొని తాత! దిక్కుమాలి సిగ్గుమాలిన వాడ నైతిని.
శ్రుత్వాహం తస్య తద్వాక్య మబ్రవం ద్విజసత్తమాః
దుఃఖిత్స్య చ దీనస్య పాండవస్య మహాత్మనః
అలంతే వ్రీడయా పార్థ! న త్వం శోచితు మర్హసి
అవేహి సర్వభూతేషు కాలస్య గతి రీదృశీ
కాలో భవాయ భూతానా మభావాయ చ పాండవ
కాలమూలమిదం జ్ఞాత్వా కురుస్జైర్యమతోర్జున
నద్యః సముద్రా గిరయః సకలా చ వసుంధరా
దేవా మనుష్యాః పశవ స్తరవశ్చ సరీసృపాః
సృష్టాః కాలేన కాలేన పునర్యాస్యంతి సంక్షయమ్
కాలాత్మకమిదం సర్వం జ్ఞాత్వా శమ మవాప్నుహి
యథాత్థ కృష్ణమాహాత్మ్యం తత్తథైవ ధనంజయ
భారావతారకార్యార్థ మవతీర్ణః సమేదినీమ్
భారాక్రాంతా ధరా యాతా దేవానాం సంనిధౌ పురా
యదర్థ మవతీర్ణోసౌ కామరూపీ జనార్దనః
తచ్చ నిష్పాదితం కార్య మశేషా భూభృతో హతాః
వృష్ణ్యంధక కులం సర్వం తథా పార్థోప సంహృతమ్
నకించి దన్యత్కర్తవ్య మస్య భూమితలేర్జున
తతో గతః స భగవా న్కృతకృత్యో యథేచ్ఛయా
సృష్టిం సర్గే కరోత్యేష దేవదేవః స్థితిం స్థితౌ
అంతే లయం సమర్థో యం సాంప్రతం వై యథాకృతమ్
తస్మాత్పార్థన సంతాప స్త్వయాకార్యః పరాభవాత్
భవంతి భవకాలేషు పురుషాణాం పరాక్రమాః
యతస్త్వయైకేన హతా భీష్మద్రోణాదయో నృపాః
తేషా మర్జున కాలోత్థం కిం న్యూనాభిభవో న సః
విష్ణోస్తస్యానుభావేన యథా తేషాం పరాభవః
త్వత్త స్తథైవ భవతో దస్యుభ్యోంతే తదుద్భవః
సదేవోస్య శరీరాణి సమావిశ్య జగత్థ్సితిమ్
కరోతి సర్వభూతానాం నాశం చాంతే జగత్పతిః
భవోద్భవే చ కౌంతేయ సహాయన్తే జనార్దనః
భవాంతే త్వద్విపక్షాస్తే కేశవే నావలోకితాః
కః శ్రద్దధ్యాత్సగాంగేయా న్హన్యాస్త్వం సర్వకౌరవాన్
ఆభీరేభ్యశ్చ భవతః కః శ్రద్దధ్యా త్పరాభవమ్
పార్థైత త్సర్వభూతేషు హరేర్లీలావిచేష్టితమ్
త్వయా యత్కౌరవా ధ్వస్తా యదాభీరైర్భవాన్జితః
గృహీతా దస్యుభిర్యచ్చ రక్షితా భవతా స్త్రియః
తదప్యహం యథా వృత్తం కథయామి తవార్జున
అర్జునుని దుఃఖము విని దీనుడై యేడ్చు చున్న మహాత్ముడైన యా పాండవుని యొక్క యమ్మాట విని నేనిట్లంటిని. (వ్యాసులు) పార్థ! సిగ్గు పడవలదు. ఏడువకుము. సర్వ భూతముల యెడల కాలము యొక్కగతి యిట్టిదని యెఱుంగుము. భూతముల పుట్టుకకు గిట్టుటకు కాలము కారణము. ఇది కాల నిమిత్త మని యెరిగి స్థైర్యము నొందుము. నదులు సముద్రములు పర్వతములు వసుథ మనుష్యులు పశువుల చెట్లు పాములు కాలముచే నృజింప బడి కాలము చేతనే క్షయించును. సర్వమును కాల స్వరూపముగ దెలిసి శాంతి నొందుము. ధనంజయ! కృష్ణ ప్రభావము నీవన్నది యంతయు నంతే. భార హరణమునకు భూమి యందత డవతరించి నాడు. భూదేవి భార వశయై మున్ను దేవత లందరి దరి కేగినది. అందులకే కామరూపి యైన భగవంతు డవతరించి ఆ పని జరిపి నాడు. రాజులను గూల్చినాడు. తుదకు దాను జన్మించిన వృష్ణ్యంధక కులము గూడ నుప హరించి నాడు. ఇతని కింక నీ భూతలమున జేయవలసి నది కొంచెము కూడలేదు, అందుచే గృత కృత్యుడై భగవంతుడు యథేచ్ఛగా నిర్గమించి నాడు. సృష్టి స్థితి లయములు మూడును శ్రీహరి లీలలే. పార్థ! పరాభవమునకు సంతాప వడకుము. పురుషుల పరాక్రమములు కాగల కాలము లందగు చుండును. బీష్మ ద్రోణాదులు నీచే గూలుట కాలము వలననే. పరమాత్మ యను భావము ననే వారి పరాభవము. తక్కువ వారి వలన నీకు పరాభవము. ఆ దేవుడు స్థితి లయములు చేయు నపుడు అన్య శరీరము లందావేశించు చుండును. కాగ లప్పుడు హరి నీకు సహాయు డయ్యెను. కానపుడు నీ శత్రువులు హరి దృష్టిలో పడినారు. నీవు గాంగేయుని తోడి కౌరవుల నెల్ల గూల్చితి వన్న నెవడు నమ్మును? అట్లే యెందులకు గాని యా భీరుల కోడితి వన్నను నెవడు నమ్మును? ఇవి సర్వ భూతముల యందు హరి యొక్క విలాసము. అతని చేష్ట. నీచే గౌరవులు ధ్వంస మగుట యాభీరులకు నీ వోడుట నీ రక్షణ లోనున్న స్త్రీలు దొంగలచే బడుట యను విషయములో జరిగినది నీకు చెప్పు చున్నాను వినుము.
అష్టావక్రకథ
ఆష్టావక్రః పురా విప్ర ఉదవాసరతోభవత్
బహూన్వర్షగణాన్పార్థ గృణన్బ్రహ్మ సనాతనమ్
జితేష్వసురసంఘేషు మేరుపృష్ఠే మహోత్సవః
బభూవ తత్ర గచ్ఛంత్యో దదృశుస్తం సురస్త్రియః
రంభాతిలో త్తమాద్యాశ్చ శతశోథ సహస్రశః
తుష్టువుస్తం మహాత్మానం ప్రశశంసుశ్చ పాండవ
ఆకంఠమగ్నం సలిలే జటాభారధరం మునిమ్
వినయావనతాశ్చైవ ప్రణేముః స్తోత్రతత్పరాః
యథా యథా ప్రసన్నోభూ త్తుష్టువుస్తం తథా తథా
సర్వాస్తాః కౌరవశ్రేష్ఠ! వరిష్ఠం తం ద్విజన్మనామ్
మున్ను సనాతన బ్రహ్మో పాసనము జేయుచు నష్టావక్రుడు పెక్కేండ్లు నీటనే నివాస ముండెను. ఆసురు లోడిన తరువాత మేరువుపై బెద్ద యుత్సవ మయ్యెను. అది చూడ నేగుచు దేవతా స్త్రీలు ఆతనిం జూచిరి. రంభా తిలోత్తమ మొదలైన వారు నూర్లు వేలుగ నమ్మహాత్ముని స్తుతించిరి. ప్రశంసించిరి. అతడు కంఠము వరకు మునిగి పెను జడలు దాల్చి యుండ వినయమున నమరాంగనలు మ్రొక్కిన బ్రసన్నుడై యిట్లనియె.
అష్టావక్రుడు:
ప్రసన్నోహం మహాభాగా భవతీనాం యదిష్యతే
మత్తస్తద్ర్వియతాం సర్వం ప్రదాస్యామ్యపి దుర్లభమ్
అష్టావక్రుడు:
నేను ప్రసన్నుడ నైతిని. తామేది కోరిన నిచ్చెదను కోరు కొనుడన
వ్యాసులు:
రంభాతిలోత్త మాద్యాశ్చ దివ్యా శ్చావ్సరసో బ్రువన్
వ్యాసులు:
రంభ, తిలోక్తమ మొదలైన వారు నీవు ప్రసన్నుడ వైన మేము పడయని భాగ్యమేమున్న దనిరి.
అప్సరసలు:
ప్రసన్నే త్వయ్యసంప్రాప్తం కిమస్మాకమితి ద్విజాః
ఇతరాస్త్వబ్రువన్విప్ర ప్రసన్నో భగవాన్యది
తదిచ్ఛామః పతిం ప్రాప్తుం విప్రేంద్ర పురుషోత్తమమ్
అప్సరసలు:
కాని వారిలో కొందరు ప్రసన్నుడ వైతివేని నిన్ను భర్తగా కోరెద మనిరి.
వ్యాసులు:
ఏవం భవిష్యతీత్యుక్త్వా ఉత్తతార జలాన్మునిః
తముత్తీర్ణం చ దదృశు ర్విరూపం వక్రమష్టధా
తం దృష్ట్వా గృహ్యమానానాం యాసాం హాసః స్ఫుటోభవత్
తాః శశాప మునిః కోప మవాప్య కురునందన!
వ్యాసులు:
అట్లేయగు నని యతడు నీళ్ళ నుండి లేచెను. అయ్యెడ నాతని నెనిమిది వంకరలు గల వికృత రూపునిగా జూచిరి. చూచి చాటు వడుచున్న యయ్యింతుల పరిహాస మాతనికి స్పష్ట మయ్యెను.
అష్టావక్రుడు:
యస్మాద్విరూపరూపం మాం మత్వా హాసావమాననా
భవతీభిఃకృతా తస్మా దేష శాపం దదామి వః
మత్ప్రసాదేన భర్తారం లబ్ధ్వా తు పురుషోత్తమమ్
మచ్ఛాపోపహతాః సర్వా దస్యుహస్తం గమిష్యథ
అష్టావక్రుడు:
దాన గోపించి అతడు నా విరూపము చూచి హసించి యవమానము చేసితిరి కావున నా దయ చేతనే బురుషోత్తముని భర్తగ బొంది నా శాపముచే దొంగల చేత జిక్కె దరనెను.
వ్యాసులు:
ఇత్యుదీరితమాకర్ణ్య మునిస్తాభిః ప్రసాదితః
పునః సురేంద్ర లోకం వై ప్రాహ భూయో గమిష్యథ
ఏవం తస్య మునేః శాపా దష్టావక్రస్య కేశవమ్
భర్తారం ప్రాప్య తాః ప్రాప్తా దస్యుహస్తం వరాంగనాః
తత్త్వయా నాత్ర కర్తవ్యః శోకలేశోపి పాండవ
తేనైవాఖిలనాథేన సర్వం తదుపసంహృతమ్
భవతాం చోపసంహార మాసన్నం తేన కుర్వతా
బలం తేజస్తథా వీర్యం మాహాత్మ్యం చోపసంహృతమ్
జాతస్య నియతో మృత్యుః పతనం చ తథోన్నతేః
విప్రయోగావసానం తు సంయోగః సంచయః క్ష (యాత్క్ష) యః
విజ్ఞాయ న బుధాః శోకం న హర్ష ముపయాంతి యే
తేషామేవేతరే చేష్టాం శిక్షంతః సంతి తాదృశాః
తస్మాత్త్వయా నరశ్రేష్ఠ! జ్ఞాత్వైతద్భ్రాతృభిః సహ
పరిత్యజ్యాఖిలం రాజ్యం గంతవ్యం తపసే వనమ్
తద్గచ్ఛ ధర్మరాజాయ నివేద్యైత ద్వచో మమ
పరశ్వో భ్రాతృభిః సార్ధం గతం వీర యథా కురు
ఇత్యుక్తో ధర్మరాజంతు సమభ్యేత్య తథోక్తవాన్
దృష్టం చైవానుభూతం వా కథితం తదశేషతః
వ్యాసవాక్యం చ తే సర్వే శ్రుత్వార్జున సమీరితమ్
రాజ్యే పరీక్షితం కృత్వా యయుః పాండుసుతా వనమ్
ఇత్యేవం వో మువిశ్రేష్ఠా విస్తరేణ మయోదితమ్
జాతస్య చ యదోర్వంశే వాసుదేవస్య చేష్టితమ్
వ్యాసులు:
దానికడలి వారు బ్రతిమాల ఆ ముని యింద్ర లోకమునకు నామీద నేగుదురని యను గ్రహించెను. ఇట్లు అష్టావక్రుని శాపము వలన జరిగిన దానికి నీవు కొంచెము కూడ శోకింప బనిలేదు. ఈ సంహారమే కాదు కొలది కాలములో మీరు నుపసంహరింప బడుదురు. పుట్టిన వానికి గిట్టుటయు మీద నుండుటయు సంచయము క్షయము (ప్రోగు చేయుట పోగొట్టు కొనుట) గలిసి విడివడు టయుం దప్పదు. స్వభావ మని దీని నెరింగిన పండితులు క్రుంగరు పొంగరు. అట్టి పండితుల నడవడిని అలవరుచు కొన్నవారు కూడ వారి వలెనే యున్న వారును గలరు. కావున నరశ్రేష్ఠ! సోదరులతో నిది యెఱింగి రాజ్యము విడిచి తపము సేయ వనమునకు వెళ్ళ దగును. ఈ నా మాటను ధర్మరాజునకు జెప్పుము. ఎల్లుండి సోదరులతో గూడ నుత్తమగతి మహాప్రస్థానము జేయుడు. అని తెలుప బడి పార్థుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి యదంతయు తెల్పెను. వారందరు నర్జునుని వచనము విని పరీక్షిత్తును రాజ్యమున నుంచి వనమునకు జనిరి. ఓ ముని శ్రేష్ఠులార! విస్తరముగ నిట్లు యదు వంశము నందు బుట్టిన వాసుదేవుని యొక్క చరిత్రము మీకు దెలిపితిని.
Summary of chapter 105 of the Brahma Mahā Purana is as follows:
The path that the soul of the deceased takes after departing the body is described. The messengers of Yama (Yamadūtas), the long journey through various planes, the review of accumulated karma by Citragupta in Yama's court, and the judicial process by which rewards and punishments are assigned are narrated. The chapter serves as a powerful eschatological teaching on the certainty of divine justice and the importance of dharmic living.