బ్రహ్మ మహా పురాణము

191 - బాలకృష్ణ చరితే అక్రూర గమన వర్ణనమ్‌

వ్యాసులు:

అక్రూరోపి వినిష్ర్కమ్యస్యందనే నాశుగామినా

కృష్ణసందర్శనాసక్తః ప్రయయౌ నందగోకులమ్‌

చింతయామాస చాక్రూరో నాస్తి ధన్యతరోమమ

సోహ మంశా వతీర్ణస్య ముఖం ద్రక్ష్యామి చక్రిణః

అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మేనిశా

య దున్ని ద్రాబ్జపత్రాక్షం విష్ణో ర్ద్రక్ష్యా మ్యహం ముఖమ్‌

పాపం హరతి యత్పుంసాం స్మృతం సంకల్పనామయమ్‌

తత్పుండ రీకనయనం విష్ణో ర్ద్రక్ష్యామ్యహంముఖమ్‌

నిర్జగ్ముశ్చ యతో వేదా వేదాంగాన్యఖిలాని చ

ద్రక్ష్యామి తత్పరంధామ దేవానాం భగవన్ముఖమ్‌

యజ్ఞేషు యజ్ఞపురుషః పురుషైః పురుషోత్తమః

ఇజ్యతేయోఖిలాధార స్తం ద్రక్ష్యామి జగత్పతిమ్‌

ఇష్ట్వా య మింద్రో యజ్ఞానాం శతే నామరరాజతామ్‌

అవాప త మనంతాది మహం ద్రక్ష్యామి కేశవం

నబ్రహ్మా నేంద్ర రుద్రాశ్వివస్వాదిత్యమరుద్గణాః

యస్య స్వరూపం జానంతి స్పృశత్యద్య స మాంహరిః

సర్వాత్మా సర్వగః సర్వః సర్వభూతేషు సంస్థితః

యోభవ త్యవ్యయో వ్యాపీ వీక్ష్యతే సమయాహరిః

మత్య్సకూర్మవరాహాద్యైః సింహరూపాదిభిః స్థితమ్‌

చకార యోగతోయోగం స మా మాలాపయిష్యతి

సాంప్రతం చ జగత్స్వామీ కార్యజాతేవ్రజే స్థితిమ్‌

కర్తుం మనుష్యతాం ప్రాప్తః స్వేఛ్ఛాదేహధృ గవ్యయః

యోనంతః పృథీవీం ధత్తే శిఖరస్థితిసంస్థి తామ్‌

సోవతీర్ణో జగత్కార్యే మామక్రూరేతి వక్ష్యతి

పిత్రబంధు సుహృద్భాతృ బంధుమిత్రమయీమిమామ్‌

యన్మాయాం నాలముత్తర్తుం జగ త్తస్మై నమోనమః

తరంత్యవిద్యాం వితతాం హృది యస్మిన్ని వేశితే

యోగమాయామిమాం మర్త్యాస్తస్మై విద్యాత్మనే నమః

యజ్ఞభుగ్యజ్ఞపురుషో వాసుదేవశ్చ శాశ్వతైః

వేదాంతవేదిభిర్వష్ణుః ప్రోచ్యతే యో నతోస్మి తమ్‌

తథా తత్ర జగద్ధామ్ని ధార్యతే చ ప్రతిష్టితమ్‌

సదసత్త్వం స స త్త్వేన మయ్యసౌ యాతు సౌమ్యతామ్‌

స్మృతే సకల కల్యాణభాజనం యత్ర జాయతే

పురుషప్రవరం నిత్యం వ్రజామి శరణం హరిమ్‌

వ్యాసులు:

అక్రూరుడు గమన వేగము గల రథమున వెడలి కృష్ణదర్శ నాసక్తిచే నంద గోకులమున కేగెను. ఏగుచు ద్రోవలో నాకన్న ధన్యతముడు లేడు. హరి యంశమున నవతరించిన యా చక్రప్రాణి నెమ్మోము జూడ నున్నాను. ఇపుడు జన్మము సఫల మైనది. ఈ రాత్రి సుశోభనముగ దెల్లవారినది. విచ్చిన తామర రేకులట్లు కన్నులు గలయా విష్ణు ముఖమును దర్శింప నున్నాను. దేనిం దలచి కొన్న భావము పోవునో యట్టి పుండరీక నయనుని నెమ్మోము నిప్పుడు జూడ నున్నాను. ఎందుండి యెల్ల వేదములు వేదాంగములు వెలు వడినవో దేవతల కెల్ల నెయ్యది పరంధామమో యట్టి భగవంతుని ముఖము చూడబోవు చున్నాను. యజ్ఞము లందు యజ్ఞ పురుషునిగ పురుషులచే పురుషోత్తముడు గనే సర్వాధార మూర్తి యజింప బడునో యట్టి జగద్భర్తను జూడ నున్నాను. నూరు యజ్ఞముల యందెవ్వని నుపాసించి యింద్రుడు దేవేంద్ర పదవి నందెనో యట్టి యంతువడని యాదిగల స్వామిని గేశవుని గన నున్నాను. బ్రహ్మ యింద్ర రుద్రాశ్వినీ వసు ఆదిత్య మరుద్గణము లెవ్వని రూప మెరుగరో యట్టి హరి నన్ను దాకు చున్నాడు. సర్వమునుందానై సర్వ భూతము లందుండి సర్వమగు సర్వవ్యాపి యిపుడు నాకు గనబడు చున్నాడు. మత్స్య కూర్మ వరాహ నారసింహా ద్యవతార యోగమును యోగము చేత నొనరించిన యా దేవుడు నన్నిపుడు పలుకరింప నున్నాడు. అవ్యయు డైన హరి జగత్ర్పభువు ఇపుడు వ్రేపల్లె యందునికి జేయ స్వేచ్ఛా శరీర ధారియై మనుష్య రూపమొంది స్థితికార్య నిర్వహణమునకు వచ్చి యున్నాడు. ఏ యనంతుడు శిఖరాది విశిష్ట పృథివిని ధరించునో యా దేవుడు జగత్కార్య నిర్వహణమునకు నవతరించిన మహానుభావుడు అక్రూరయని నోరార నన్ను బిలువ నున్నాడు. తండ్రి బంధువు చెలి తమ్ముడు అన్నయను జుట్టరికము లతో నల్లుకొని యున్న జగత్తు ఎవ్వని మాయచే దాట శక్యమగాదో యట్టి మాధవునికి నమస్కారము. ఎవ్వడు హృదయ మందు బ్రవేశించి నంతట మర్త్యులు (మరణ స్వభావం గలవారు) సువిస్తరమైన యవిద్యను యోగ మాయను దాటుదురో యట్టి కేవలజ్ఞాన స్వరూపుడైన వానికి నమస్కారము. యజ్ఞ భోక్త యజ్ఞ పురుషుడు వాసుదేవుడు అని యెవ్వడు వేదాంత మెరిగిన వారిచేత గీర్తంప బడునో యట్టి విష్ణువునకు నేను వినతుడ నయ్యెదను. జగధారుడగు నా పరమాత్మ యందు నిలుప బడి సరసద్రూప జగత్తు ధరింప బడుచున్నది. అట్టి స్వామి నా యెడల ప్రసన్ను డగుగాక! నరుడెవ్వని స్మరణ మాత్రమున సకల కల్యాణ భాజన మగునో యట్టి పురుషోత్తముని హరిని నిత్యము శరణోందెను.

వ్యాసులు:

ఇత్థం స చింతయన్‌ విష్ణుం భక్తినమ్రాత్మమానసః

అక్రూరో గోకులం ప్రాప్తః కించిత్సూర్యే విరాజతి

స దదర్శ తదా తత్ర కృష్ణమాదోహనే గవామ్‌

వత్సమధ్యగతం పుల్లనీలోత్పలదలచ్ఛవిమ్‌

ప్రపుల్లపద్మపత్రాక్షం శ్రీవత్సాంకితవక్షసమ్‌

ప్రలంబబాహు మాయామతుం గోరస్థల మున్నసమ్‌

సవిలాసస్మితాధారం బిభ్రాణం ముఖపంకజమ్‌

తుంగర క్తనఖం పద్భ్యాం ధరణ్యాం సుప్రతిష్ఠితమ్‌

బిభ్రాణం వాససీ పీతే వన్యపుష్ప విభూషితమ్‌

సాంద్రనీలలతాహస్తం పితాంభోజావతంసకమ్‌

హంసేందకుందధవలం నీలాంబరధరం ద్విజాః

తస్యాను బలభద్రం చ దదర్శ యదునందనమ్‌

ప్రాంశుముత్తుంగబాహుం చ వికాశిముఖపంకజమ్‌

మేఘమాలాపరివృతం కైలాసాద్రి మివాపరమ్‌

తౌ దృష్ట్వా వికసద్వక్త్రసరోజః స మహామతిః

పులకాంచిత సర్వాంగ స్తదాక్రూరో భవద్విజాః

యఏతత్సరమం ధామ ఏత త్తత్పరమం పదమ్‌

అభవద్వాసుదేవోసౌద్విధా యోయం వ్యవస్థితః

సాఫల్యమక్షోర్యుగపన్మమాస్తు దృష్టే జగద్ధాతరి హాసముచ్చైః

అప్యంగ మేత ద్భగవత్ర్పసాదాద్దృత్తాంగసంగే ఫలవ ర్త్మ తత్న్యాత్‌

అథైవ స్పృష్ట్వా మమహ స్తపద్మం కరిష్యతి శ్రీమదనంతమూర్తిః

యస్యాంగులి స్పర్శహతాఖిలాఘైరవాప్యతే సిద్ధి రమత్తమా సరైః

తథాశ్విరుద్రేంద్ర వసుప్రణీతాదేవాః ప్రయచ్ఛంతి వరం ప్రహృష్టాః

చక్రం ఘ్నతాదైత్యపతేర్హృతాని దైత్యాంగనానాం నయనాంజనాని

యంత్రాంబు విన్యస్య బలి ర్మనోజ్ఞానవాప భోగాన్వసుధాతలస్థః

యథామరేశ స్త్రిదశాధిపత్యం మన్వంతరం పూర్ణ మవాప శక్రః

అథాపిమాం కంసపరిగ్రహేణ దోషాస్పదీభూత మదోషయుక్తమ్‌

కర్తా స మానోపహితం ధిగస్తు యస్యాత్మనః సాధు బహిష్కృతోయః

జ్ఞానాత్మ కస్యాఖిలసత్వరాశే ర్వ్యా వృత్త దోషస్యసదాస్ఫుటస్య

కింవా జగత్యత్ర సమస్త పుంసా మజ్ఞాత మస్యాస్తి హృదిస్థితస్య

తస్మాదహం భక్తి వినమ్రగాత్రో వ్రజామి విశ్వేశ్వర మీశ్వరాణామ్‌

అంశావతారం పురుషోత్తమస్య అనాదిమధ్యాంత మజస్య విష్ణోః

అని యిట్లు భక్తి నమ్రమైన తన మనస్సుతో విష్ణువుని దలచుచు నక్రూరు డించుక పొద్దుండ గనే గోకులముం జేరెను. అత డచట నావుల పాలు బిదుకుచు నున్న కృష్ణుని దూడల మధ్యనున్న వానిని ప్రపుల్ల పద్మ పత్రాక్షుని శ్రీవత్సాంకిత వక్షుని యాజాను బాహుని నెత్తైన వెడద యురము గలవాని నున్నత వాసుని సవిలాస మందహాస భరిత వదనారవిందుని నెత్తై మెరుపు జిందునఖములతో పీతాంబరము నుత్తరీయముం దాల్చి వనమాలా భూషితుడై తెల్ల దామర పూవు శిరమునం దాల్చియున్న హరిని యక్రూరుడు సందర్శించెను. హంసవలె చందమామ వలె మొల్లలవలె తెల్లనై నల్లని వలువ దాల్చిన యదు నందనుని బలభద్రు నా కృష్ణుని వెనుక జూచెను. అతడు న్నతుడు ఉన్నత బాహువులు గలవాడు సవికాసమైన ముఖారవిందము గలవాడునై మేఘముల గుంపుతో నలము కొన్న మఱొక కైలాస పర్వత మట్లున్న బలరామ మూర్తిని గాంచెను. ఆ యిద్దరిని జూచి యమ్మతి మంతుడు ముఖ పద్మము విప్పార మేనెల్ల గగుర్పోడువ నక్రూరుడు ఇది పరంధామము. ఇదియే యా పరమ పదము. ఇదే య వ్వాసుదేవు డిరు తెరగులై యిచట నున్నాడు. అజగద్విధాత దర్శనమున నాకనుగవ సాఫల్యమందు గాక! నన్ను గౌగలించి కొని నించు ఆ అవ్యాజమైన యా నవ్వు అ భగవంతుని ప్రసాదమే అది నా సర్వార్థ సిద్దికి మార్గమగు గాక! ఎవ్వడు కొనవేల స్పృశించిన మాత్రన సర్వ పాపములు తూలి పడునట్టి యానంతమూర్తి నాహన్త పద్మమును శ్రీమంతమును శోభావంతమును జేయును. దాన నింద్ర మరుద్రు ద్రాశ్విని దేవత లందఱు నాయెడ బ్రసన్నులై వరమ్ము లిత్తురా? ఎవ్వడు దైత్యరాజ బలమును చంపి భార్యల కనుల గాటు కల నెల్లందుడిచి వైచె నెవ్వని చేతిలో దాన ధార వోసి యవనిపై నుండియే అమర లోకేంద్ర భోగముల నందెనో ఎవ్వనిం గొలిచి ఇంద్రుడు మన్వంతరము దాక స్థిరమై యుండు స్వర్గ సామ్రాజ్యాధి పత్యము నంచెనో అట్టి సాక్షా ద్భగవంతుడు కంసుని పరిగ్రహముచే (నన్ను తన వానిగా మిత్రకోటి లోనికి స్వీకరించుటచే) దోషమునకు స్థానమై నట్టియు నిర్దోషినై అత్మ బహిష్కరింప బడినట్టి దురభిమానిని నగు నన్ను గూర్చి నిందయగు గాక! (నన్ను నేనే ఛీ యనుకొన వలసి యున్న దన్నమాట) కేవల జ్ఞానమై సత్వ నిధియై యదోషియై అందరును సులభముగా దేట పడక అందరి హృదయము లందు నుండెడి ప్రభువునకీ జగమునం దెలియని దేమున్నది? అందువల్ల భక్తిచే మోము వంచి యీశ్వరుల కెల్ల నీశ్వరుడైన యా విశ్వేశ్వరుని అనాది మధ్యావసానుడు అజుడు నగు విష్ణువు యొక్క ఆ యంశావతార మూర్తిని దర్శింప నేగెదను.