227 - ముని వ్యాస సంవాదే విష్ణుపూజా కథనే వైష్ణవానాం గతిఖ్యాపన వర్ణనమ్‌

విష్ణు భక్తులు పొందు ఉత్తమ గతిని నిరూపించుట

మునులు:

అహో! కృష్ణస్య మాహాత్మ్యం శ్రుత మస్మాభిరద్భుతమ్‌

సర్వపాప హరం పుణ్యం ధన్యం సంసార నాశనమ్‌

సంపూజ్య విధివద్భక్త్వా వాసుదేవం మహామునే

కాం గతిం యాంతి మనుజా వాసుదే వార్చనే రతాః

కిం ప్రాప్నువంతి తే మోక్షం కిం వా స్వర్గం మహామునే

అథవా కిం మునిశ్రేష్ఠ ప్రాప్నువం త్యుభయం ఫలమ్‌

ఛేత్తు మర్హసి సర్వజ్ఞ సంశయం నో హృది స్థితమ్‌

ఛేత్తా నాన్యోస్తిలోకేస్మింస్త్వ దృతే మునిసత్తమ

మునులు:

ఆశ్చర్యకరమును సర్వపాప హరమును పుణ్య కరమును ధన్యత కలిగించునదియు సంసార బంధ నాశనము నగు శ్రీకృష్ణ మహాత్మ్యమును మేము వింటిమి. చాల సంతోష మయినది. ఓ మహామునీ! మానవులు వాసుదేవుని అర్చించుట యందాసక్తులయి భక్తితో విధి విధానమున అతని నర్చించు వారు ఏ గతిని పొందుదురు? స్వర్గమునా? మోక్షమునా? రెంటినా? మా ఈ సంశయమును ఛేదించుము. ఓ మునిశ్రేష్ఠా! అందులకు నీవు తప్ప సమర్థులు మఱెవ్వరును లేరు. అని మునులు వ్యాసునడిగిరి.

వ్యాసులు:

సాధుసాధు మునిశ్రేష్ఠా భవద్భి ర్య దుదాహృతమ్‌

శృణుధ్వ మానుపూర్వ్యేణ వైష్ణవానాం సుఖావహమ్‌

దీక్షామాత్రేణ కృష్ణస్య నరా మోక్షం వ్రజంతి వై

కిం పున ర్యే సదా భక్త్యా పూజయం త్యచ్యుతం ద్విజాః

న తేషాం దుర్లభః స్వర్గో మోక్షశ్చ మునిసత్తమాః

లభంతే వైష్ణవాః కామా న్యా న్యావ్యాంఛంతి దుర్లభాన్‌

రత్నపర్వత మారుహ్య నరో రత్నం యథాదదేత్‌

స్వేచ్ఛయా మునిశార్ధూలా స్తథా కృష్ణా న్మనోరథాన్‌

కల్పవృక్షం సమాసాద్య ఫలాని స్వేచ్ఛయా యథా

గృహ్ణాతి పురుషో విప్రా స్తథా కృష్ణా న్మనోరథాన్‌

శ్రద్ధయా విధివ త్పూజ్య వాసుదేవం జగద్గురుమ్‌

ధర్మార్థ కామమోక్షాణాం ప్రాప్నువంతి నరాః ఫలమ్‌

ఆరాధ్య తం జగన్నాథం విశుద్ధే నాంతరాత్మనా

ప్రాప్నువంతి నరాః కామా న్సురాణా మపి దుర్లభాన్‌

యేర్చయంతి సదా భక్త్వా వాసుదేవాఖ్య మవ్యయమ్‌

న తేషాం దుర్లభం కించి ద్విద్యతే భువనత్రయే

ధన్యాస్తే పురుషా లోకే యేర్చయంతి సదా హరిమ్‌

సర్వ పాపహరం దేవం సర్వకామ ఫలప్రదమ్‌

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః స్త్రియః శూద్రాంత్య జాతయః

సంపూజ్య తం సురవరం ప్రాప్నువంతి పరాం గతిమ్‌

తస్మా చ్ఛృణుధ్వం మునయో యత్పృచ్ఛత మ మానఘాః

ప్రవక్ష్మామి సమాసేన గతిం తేషాం మహాత్మనామ్‌

వ్యాసులు:

ముని శ్రేష్ఠులారా! వైష్ణవులకు సుఖము కలిగించు మీ ప్రశ్నకు సమాధానమును వినుడు. నరులు కృష్ణుని దీక్షా మాత్రము చేతనే ముక్తి పొందుదురు. ఎల్లప్పుడును భక్తితో ఆ అచ్యుతుని పూజించు వారి విషయము చెప్ప వలసిన దేమి? ఓ మునిసత్తములారా! వారికి స్వర్గము కాని మోక్షము కాని దుర్లభము కాదు. వైష్ణవులు తాము కోరిన కోరికలు ఎంత దుర్లభము లైనను పొంద గలరు. రత్న పర్వతము నెక్కిన వారు రత్నములను వలెను కల్ప వృక్షము నాశ్రయించి ఫలములు కోసి కొన్నట్లును వారు జగద్గురుడగు వాసుదేవుని విధి ననుసరించి అర్చించి నందులకు ఫలముగా ధర్మార్థ కామ మోక్ష ఫలములను పొందుదురు. జగన్నాధుని విశుద్ధమగు అంతఃకరణముతో ఆరాధించిన మానవులు దేవతలకును దుర్లభములగు కామితములు పొందుదురు. సర్వ పాప హరుడును సర్వ కామిత ఫలముల నిచ్చు వాడునగు శ్రీహరిని అర్చించు నరులు లోకమున ధన్యులు. ఏల యన బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులును కడజాతి వారును స్త్రీలును ఆ దేవ శ్రేష్ఠుని అర్చించుటచే ఉత్తమ గతిని పొందుదురు. కనుక ఓ మునులారా! అట్టి మహనీయులు పొందు ఉత్తమ గతిని సంగ్రహముగా చెప్పెదను. వినుడు.

త్యక్త్యా మానుష్యకం దేహం రోగాయతన మధ్రువమ్‌

జరామరణ సంయుక్తం జలబుద్భుద సంనిభమ్‌

మాంస శోణి తదుర్గంధం విష్ఠామూత్రాది భిర్యుతమ్‌

అస్థిస్థూణమమేధ్యం చ స్నాయు చర్మశిరాన్వితమ్‌

కామగేన విమానేన దివ్యగంధర్వనాదినా

తరుణాదిత్య వర్ణేన కింకిణీజాలమాలనినా

ఉపగీయమానా గంధర్వై రప్సరోభి రలంకృతాః 

వ్రజంతి లోకపాలానాం భవనం తు పృథక్పృథక్‌

మన్వంతర ప్రమాణం తు భుక్త్వా కాలం పృథ క్పృథక్‌

భువనాని పృథక్తేషాం సర్వభోగై రలంకృతాః

తతోంతరిక్షం లోకంతే యాంతి సర్వసుఖప్రదమ్‌

తత్ర భుక్త్వా వరాన్భోగా న్దశ మన్వంతరం ద్విజాః 

తస్మాద్గంధర్వలోకం తు యాంతి వై వైష్ణవా ద్విజాః 

విశన్మన్వంతరం కాలం తత్ర భుక్త్వా మనోరమాన్‌

భోగా నాదిత్యలోకం తు తస్మా ద్యాంతి సుపూజితాః

త్రింశ న్మన్వంతరం తత్ర భోగా న్భుక్త్వాతిదైవతాన్‌

తస్మా ద్ర్వజంతి తే విప్రా శ్చంద్రలోకం సుఖప్రదమ్‌

మన్వంతరాణాం తే తత్ర చత్వారింశ ద్గుణాన్వితమ్‌

కాలం భుక్త్వా శుభాన్భోగా న్జరామరణ వర్జితాః

తస్మా న్నక్షత్ర లోకం తు విమానైః సమలంకృతవమ్‌

వ్రజంతి తే మునిశ్రేష్ఠా గుణైః సర్వై రలంకృతాః

మన్వంతరాణాం పంచాశ ద్భుక్త్వా భోగాన్యథేప్సితాన్‌

తస్మా ద్ర్వజంతి తే విప్రా దేవలోకం సుదుర్లభమ్‌

షష్టి మన్వంతరం యావ త్తత్ర భుక్త్వా సుదుర్లభాన్‌

భోగాన్నానావిధా న్విప్రా ఋగ్‌ ద్వ్యష్టకసమన్వితాన్‌

శక్రలోకం పునస్తస్మా ద్గచ్ఛంతి సురపూజితాః 

మన్వంతరాణాం తత్త్రైవ భుక్త్వా కాలం చ సప్తతిమ్‌

భోగానుచ్చావచాన్దివ్యా న్మనసః ప్రీతివర్థనాన్‌

తస్మా వద్ర్వజంతి తే లోకం ప్రాజాపత్య మనుత్తమమ్‌

భుక్త్వాత త్రేప్సితాన్భోగా న్సర్వకామ గుణాన్వితాన్‌

మన్వంతర మశీతిం చ కాలం సర్వసుఖప్రదమ్‌

తస్మా త్పైతామహం లోకం యాంతి తేవైష్ణవా ద్విజాః 

రోగములకు ఆశ్రయము అస్థిరము జరా మరణ యుక్తము నీటి బుడగతో సమము మాంస రక్తముల దుర్గందము కలది మల మూత్రాది యుక్తము ఎముక లనెడి కట్టు కొయ్యలతో కూర్చ బడినది అపవిత్రము నులి నరములతో చర్మముతో రక్త నాళములతో కూడినది అగు మానవ దేహమును విడిచి సంకల్పముతో నడచునది దివ్య గంధర్వుల సంగీతముతో కూడినది లేత సూర్యుడు వలె ప్రకాశించు నది చిఱు మువ్వల గుత్తుల మాలలు కలది అగు విమానము నెక్కి గంధర్వులు గానము చేయు చుండ అప్సర లలంకరించు చుండ వేరు వేరుగా ఆయా లోకపాలుర లోకములకు పోవుదురు. ఒక్కొక్క లోకమున ఒక్కొక్క మన్వంతర కాలము సర్వ భోగములను అనుభవించి వారు అంతట సర్వసుఖ ప్రదమగు అంతరిక్ష లోకమునకు వత్తురు. అచ్చట శ్రేష్ఠ మగు భోగములు పది మన్వంతరముల పాటు అనుభవించి అక్కడ నుండి గంధర్వ లోకమునకు పోయి ఇరువది మన్వంతరముల పాటు మనోహరములు భోగము లనుభవింతురు. అచటి నుండి అదిత్య లోకములకు ఏగి అచ్చట చక్కగా పూజల నందు కొనుచు ముప్పది మన్వంతరముల కాలము దేవతలకును దుర్లభము లగు భోగము లనుభవింతురు. అట నుండి సుఖ ప్రదమగు చంద్ర లోకమునకు పోయి నలువది మన్వంతరములు అట నుండి నక్షత్ర లోకమున ఏబది మన్వంతరములు దేవ లోకమున అఱువది మన్వంతరములు అట నుండి ఇంద్ర లోకమున డెబ్బది మన్వంతరములు అట నుండి ప్రజాపతి లోకమున ఎనుబది మన్వంతరములు జరా మరణములు లేక ఉత్తమము లగు భోగములను అనుభవించి బ్రహ్మ లోకమునకు పోవుదురు.

మన్వంతరాణాం నవతి క్రీడిత్వా తత్రవై సుఖమ్‌ 

ఇహాగత్య పున స్తస్మా ద్విప్రాణాం ప్రవరే కులే

జాయంతే యోగినో విప్రా వేదశాస్త్రార్థ పారగాః 

ఏవం సర్వేషు లోకేషు భుక్త్వా భోగా న్యథేప్సితాన్‌

ఇహాగత్య పున ర్యాంతి ఉప ర్యుపరిచ క్రమాత్‌ 

సంభవే సంభవే తేతు శతవర్షం ద్విజోత్తమాః 

భుక్త్వా యథేప్సితా న్భోగా న్యాంతి లోకాంతరం తతః 

దశజన్మ యదా తేషాం క్రమే ణైవం ప్రపూర్యతే 

తదాలోకం హరే ర్దివ్యం బ్రహ్మలోకా ద్ర్వజంతితే 

గత్వా తత్రాక్షయా న్భోగా న్భుక్త్వా సర్వగుణాన్వితాన్‌

మన్వంతరశతం యావ జ్షన్మమృత్యు వివర్జితాః 

గచ్ఛంతి భువనం పశ్చా ద్వారాహస్య ద్విజోత్తమాః 

దివ్యదేహాః కుండలినో మహాకాయా మహాబలాః

క్రీడంతి తత్ర విప్రేంద్రాః కృత్వా రూపం చతుర్భుజమ్‌

దశకోటి సహస్రాణి వర్షాణాం ద్విజసత్తమాః 

తిష్ఠంతి శాశ్వతే భావే సర్వై ర్దేవై ర్నమస్కృతాః

తతో యాంతి తు తే ధీరా నరసింహగృహం ద్విజాః

క్రీడంతే తత్ర ముదితా వర్షకోట్యయుతానిచ 

తదంతే వైష్ణవం యాంతి పురం సిద్ధనిషేవితమ్‌

క్రీడంతే తత్ర సౌఖ్యేన వర్షాణా మయుతానిచ

బ్రహ్మలోకే పున ర్విప్రా గచ్ఛంతి సాధకోతిమాః 

తత్ర స్థిత్వా చిరం కాలం వర్షకోటిశతా న్బహూన్‌ 

నారాయణపురం యాంతి తత స్తే సాధకేశ్వరాః 

భుక్త్వా భోగాంశ్చ వివిధా న్వర్షకోట్యర్బుదానిచ

అనిరుద్ధపురం పశ్చా ద్దివ్యరూపా మహాబలాః 

గచ్ఛంతి సాధకవరాః స్తూయమానాః సురాసురైః

తత్ర కోటి సహస్రాణి వర్షాణాం చ చతుర్దశ

తిష్ఠంతి వైష్ణవా స్తత్ర జరామరణ వర్జితాః

ప్రదుమ్నస్య పురం పశ్చాద్గచ్ఛంతి విగతజ్వరాః

తత్ర తిష్ఠంతి తే విప్రా లక్షకోటిశత త్రయమ్‌ 

స్వచ్ఛందగామినో హృష్టా బలశక్తి సమన్వితాః

గచ్ఛంతి యోగినః పశ్చా ద్యత్ర సంకర్షణః ప్రభుః

తత్రోషిత్వా చిరం కాలం భుక్త్వా భోగా న్సహస్రశః

విశంతి వాసుదేవేతి విరూపాఖ్యే నిరంజనే 

వినిర్ముక్తాః పరే తత్త్వే జరామరణవర్జితే 

తత్రగత్వా విముక్తా స్తే భవేయు ర్నాత్ర సంశయః 

ఏవం క్రమేణ భుక్తింతే ప్రాప్నువంతి మనీషిణః 

ముక్తించ మునిశార్దూలా వాసుదే వార్చనే రతాః 

ఇట్టి వైష్ణవులు బ్రహ్మ లోకమున తొంబది మన్వంతరములు నమస్త సుఖములను అనుభవించి మరల ఈ భూ లోకమునకు వచ్చి బ్రాహ్మణులలో ఉత్తమ వంశమున యోగులుగా వేద శాస్త్రార్థ పారము నెఱిగిన బ్రాహ్మణులుగా జన్మింతురు. మరల క్రమ క్రమముగా పైకిపైకి పోవుచు ప్రతి జన్మము నందును నూఱేసి నంవత్సరమలు జీవించి యథేప్సితము లగు భోగముల ననుభవించి లోకాంతరము నకు పోవుదురు. ఇట్లు పది జన్మము లైన తరువాత వారు బ్రహ్మలోకము నుండి దివ్య మగు విష్ణు లోకమున కేగుదురు. అచ్చట నూర మన్వంతరముల కాలము సర్వ గుణములతో కూడిన అక్షయ భోగములను అనుభవించి జన్మ మరణములు లేని వారయి వారాహ మూర్తి యొక్క లోకమున కేగుదురు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఈ వైష్ణవులు అచ్చట మహా బలము చతుర్బాహువులు కలది యగు దివ్య మగు మహా శరీరము కలిగి సర్వ దేవతల నమస్కారము లందు కొనుచు పదివేల కోట్ల సంవత్సరములు ముక్తి సుఖము ననుభవించు చుందురు. అట నుండి నరసింహ దేవుని గృహమున కేగి పదివేల కోట్ల సంవత్సరములు విహరించి తదంతమున విష్ణు లోకమునకు పోయి అచ్చటను అనేక కోట్ల సంవత్సరమలు ఆనందింతురు. తరువాత ఈ సాధ కోత్తములు బ్రహ్మ లోకమున నూర్ల కోట్ల సంవత్సరము లనేకము లానందించి నారాయణుని పురమున కేగి అర్బుదముల కోట్ల సంవత్సరము లుండి యానందించి దివ్య రూపులై మహా బలులై సురాసురుల స్తోత్రము లందు కొనుచు అనిరుద్ధుని పురమున జరా మరణములు లేక పదు నాలుగు వేల కోట్ల సంవత్సరము లుండి ఏ సంతాపము లును లేక ప్రద్యుమ్న పురమునకు పోయి అచట మూడు వందల లక్షల కోట్ల సంవత్సరములు సుఖింతురు. తరువాత ఈ యోగులు బల శక్తితో కూడి స్వచ్ఛంద గమనము కల వారగుచు సంకర్షణ లోకము చేరి అచట చాల కాలము సహస్ర విధములగు భోగముల ననుభవించి సర్వ మోక్షమును పొంది సర్వదోష రహితము జరా మరణ రహితము నగు వాసుదేవ నామము గల పరతత్త్వము నందు ప్రవేశింతురు. ఇది నిశ్చయము. ఓ ముని శ్రేష్ఠులారా! వాసుదేవా ర్చనమున ఆసక్తులు పొందు ఫలములు సుఖములు ఇట్టివి.