లోమహర్షణుడు:
మనోర్వైవస్వతస్యాన న్పుత్రా వై నవ తత్సమాః
ఇక్ష్యాకుశ్చైవ నాభాగో ధృష్టః శర్యాతి రేవ చ
నరిష్యంతశ్చ షష్ఠో వై ప్రాంశూ రిష్టశ్చ సప్తమః
కరూశశ్చ పృషధ్రశ్చ నవైతే ముని సత్తమాః
అకరో త్పుత్రకామస్తు మను రిష్టిం ప్రజాపతిః
మిత్రావరుణయోర్విప్రాః పూర్వమేవ మహామతిః
అనుత్పన్నేషు బహుషు పుత్రేష్వేతేషు భోద్విజాః
తస్యాం చ వర్తమానాయా మిష్ట్యాం చ ద్విజసత్తమాః
మిత్రావరుణయోరంశే మను రాహుతిమావహత్
తత్ర దివ్యాంబరధరా దివ్యాభరణభూషితా
దివ్యసంహననాచైవ ఇలా జజ్ఞ ఇతి శ్రుతిః
తా మిలే త్యేవ హోవాచ మను ర్దండధర స్తదా
అనుగచ్ఛస్య మాం భద్రే తమిలా ప్రత్యువాచహ
ధర్మయు క్తమిదం వాక్యం పుత్రకామం ప్రజాపతిమ్
లోమహర్షణుడు:
వైవస్వత మనువునకు తొమ్మండ్రు కుమారులు గల్గిరి. వారు తండ్రియంత వారు. ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు, రిష్టుడు, కరూశుడు, పృషధృడు యనువారు. వారు కల్గక ముందు మనువు మిత్రా వరుణుల నుద్దేశించి పుత్రకామేష్టి నొనరించెను. అందతుడు మిత్రా వరుణుల నెంచి యాహతు లిచ్చెను. అక్కడ దివ్యాంబరా భరణములు దాల్చి దివ్య శరీరముతో ఇల యను నంగన యావిర్భ వించెనని వినికిడి. మనువు దండ ధరుడై యామెను ఇలా ఇలాయని పేర్కొని ఓ కల్యాణి నా వెంట రమ్మని పిలిచెను. పుత్రకామి యైన యా ప్రజాపతింగని ధర్మయుక్త ముగ నిట్లు పల్కెను.
మిత్రావరుణయోరంశే జాతాస్మి వదతాం వర
తయోః సకాశం యాస్యామి నమాం ధర్మహతాం కురు
సైవ ముక్త్వా మనుం దేవం మిత్రావరుణయో రిలా
గత్వాంతికం వరారోహా ప్రాంజలి ర్వాక్య మబ్రవీత్
నేను మిత్రా వరుణుల యంశమున బుట్టిన దానను. వారి సన్నిధి కేగెదను. నన్ను ధర్మదూరు రాలింగా వింపకు మని పలికి వారికడ కేగి ప్రాంజలియై యిట్లనియె.
అంశేస్మి యువయో ర్జాతా దేవౌ కిం కిరవాణి వామ్
మనునా చాహ ముక్తా వా అనుగచ్చస్వ మామితి
తౌ తథావాదినీం సాధ్వీమిలాం ధర్మపరాయణామ్
మిత్రశ్చవరుణ శ్చోభా వూచతు స్తాం ద్విజోత్తమాః
ఓ మిత్రా వరుణ దేవతలార! మీ యంశముచే జనించి నదాన. మీకేమి సేయుదును. మనువు తన నమవర్తింపు మన్నాడని యిల పలికినంత వారు ధర్మ పరాయణ యగు నా సాధ్వింగూర్చి యిట్ల పలికిరి.
అనేన తవ ధర్మేణ ప్రశ్రయేణ దమేన చ
సత్యేనచైవ సుశ్రోణి ప్రీతౌ స్వో వరవర్ణిని
అవయోస్త్వం మహాభాగే ఖ్యాతిం కన్యేతి యాస్యసి
మనో ర్వంశకరః పుత్ర స్త్వమేవ చ భవిష్యసి
సుద్యుమ్న ఇతి విఖ్యాత స్త్రిషు లోకేషు శోభనే
జగత్ర్పియో ధర్మశీలో మనో ర్వంశవివర్ధనః
మానిని! నీ ధర్మము వినయము ఇంద్రియ నిగ్రహము సత్యమను వానికిం బ్రీతు లైతిమి. ఓ సుందరి! మహానుభావ యగు నీవు మా కన్యవుగా ఖ్యాతి నందుదువు. మనువునకు వంశ కరుండగు కుమారుడవు గూడ నీవ యయ్యెదవు. జగత్ర్పి యుడవు ధర్మ శీలుడవు. మను వంశ వర్ధనుడ వయ్యెదవు. నుద్యుమ్నుడను పేర ముల్లోకము లందు ప్రసిద్ధుడ వయ్యెదవు.
నివృత్తా సాతు త చ్ఛ్రత్యా గచ్చంతీ పితు రంతికాత్
బుధే నాంతర మాసాద్య మైథునా యోపమంత్రితా
సోమపుత్రాద్భుధా ద్విప్రాస్తస్యాం జజ్ఞే పురూరవాః
జనయిత్వా తతః సా త మిలా సుద్యుమ్నతాం గతా
సుద్యుమ్నస్యతు దాయాదా స్త్రయః పరమధార్మికాః
అంతనామె వారి మాటలు విని వెనుదిరిగి పోవుచు దారిలో బుధునిచే గామింప బడి సంగమము వడసి సోమ పుత్రుడగు నాతని వలన పురూరవు డను కొడుకుం గనియెను. అవ్వల నామె సుద్యుమ్నుడను పేర మగవా డయ్యెను. సుద్యుమ్నుని దాయాదులు పరమ ధార్మికులు ముగ్గురు.
ఉత్కలశ్చ గయశ్చైవ వినతాశ్వశ్చ భోద్విజాః
ఉత్కలస్యోత్కలా విప్రా వినతాశ్వస్య పశ్చిమా
దిక్పూర్వా మునిశార్దూలా గయస్యతు గయా స్మృతా
ప్రవిష్టే తు మనౌ విప్రా దివాకర మరిందమమ్
దశధా తత్పు నః క్షత్రమకరో త్పృథివీ మిమామ్
ఇక్ష్వాకుర్జ్యేష్ఠ దాయాదో మధ్యదేశ మవాప్తవాన్
కన్యాభావాత్తు సుద్యుమ్నో నైతద్రాజ్య మవాప్తవాన్
వశిష్ఠవచనా త్త్వాసీత్ప్రతిష్ఠానే మహాత్మనః
ప్రతిష్ఠా ధర్మరాజస్య సుద్యుమ్నస్య ద్విజోత్తమాః
తత్పురువనే ప్రాదాద్రాజ్యం ప్రాప్య మహాయశాః
మానవేయో ముని శ్రేష్ఠాః స్త్రీపుంసోర్లక్షణై ర్యుతః
ధృతవాం స్తా మిలేత్యేవం సుద్యుమ్నేతి చవిశ్రుతః
ఉత్కలుడు, గయుడు, వినతాశ్వుడు ననువారు ఉత్కలుని భార్య ఉత్కల, వినతాశ్వుని వల్లభ పశ్చిమ దిక్కు, గయుని భార్య ప్రాగ్దిక్కు గయ యను పేర్లందినది. మనువు సూర్యునందు జొచ్చి నంతట నీతని దాయాదులు క్షత్రజాతి వారీ పృథివిని బది భాగము లొనరించిరి. జ్యేష్ఠుడు ‘ఇక్ష్వాకువు’ మధ్య దేశమును బడసెను. సుద్యుమ్నుడు మున్ను కన్యయై యున్నందున రాజ్య భాగము లేని వాడయ్యెను. వశిష్ట వచనముచే ప్రతిష్ఠాన మందు ధార్మికుడైన సుద్యుమ్నునకి ప్రతిష్ఠ (ఉనికి) లభించెను. దానినితడు పురూరవున కొసంగెను. సుద్యుమ్నుడు మనువు కుమారుడయ్య స్త్రీ పుంస లక్షణములు గలవాడై (ఇల-సుద్యుముడు నని పిలువ బడుచు) పృథివిం ధరించెను.
నారిష్యంతాః శకాః పుత్రా నాభాగస్యతు భో ద్విజాః
అంబరీషోభవత్పుత్రః పార్థి వర్షభసత్తమాః
ధృష్టస్య ధార్ష్టకం క్షత్రం రణదృప్తం బభూవ హ
కరూశస్య చ కారూశాః క్షత్రియా యుద్ధదుర్మదాః
నాభాగధృష్టపుత్రాశ్చ క్షత్రియా వైశ్యతాం గతాః
ప్రాంశోరేకోభవత్పుత్రః ప్రజాపతి రితి స్మృతః
నరిష్యంతస్య దాయాదో రాజా దండధరో యమః
శర్యాతే ర్మిథునం త్వాసీదానర్తో నామ విశ్రుతః
పుత్రః కన్యా సుకన్యా చ యా పత్నీ చ్యవనస్య హ
ఆనర్త స్యతు దాయాదో రైవో నామ మహాద్యుతిః
అనర విషయశ్చైవ పురీ చాస్య కుశస్థలీ
రైవన్య రైవతః పుత్రః కకుద్మీ నామ ధార్మికః
జ్యేష్ఠః పుత్రః స తస్యా సీద్రాజ్యం ప్రాప్య కుశస్థలీం
సకన్యా సహితః కృత్వా గాంధర్వం బ్రహ్మణోంతికే
ముహూ ర్తభూతం దేవస్య తస్థౌ బహుయుగం ద్విజాః
ఆజగామ స చైవాథ స్వాం పురీం యాదవై ర్వృతామ్
కృతాం ద్వారవతీం నామ బహుద్వారాం మనోరమామ్
భోజవృష్ణ్యంధకై ర్గుప్తాం వసుదేవవురోగమైః
తత్త్రైవ రైవతో జ్ఞాత్వా యథాతత్త్వం ద్విజోత్తమాః
కన్యాం తాం బలదేవాయ సుభద్రాం నామరేవతీమ్
దత్త్వా జగామ శిఖరం మేరో స్తపసి సంస్థితః
రేమే రామోపి ధర్మాత్మా రేవత్యా సహితః సుఖీ
నాభాగుని కొడుకులు నరిష్యంతులు శకులు ననువారు. అతనికి అంబరీషుడును పుత్రుడై జనించెను. ధృష్టునికి రణదృప్త మయిన క్షత్రజాతి ధార్ష్టికమను పేర నుదయించినది. కరూశునికి కారూశులు కల్గిరి. వారును యుద్ధమునం దుద్ధతులు. నాభాగ ధృష్ట సంతానమైన క్షత్రియులు వైశ్యత్వము నందిరి. ప్రాంశువునకు ప్రజాపతి యను కుమారుడు గల్గెను. నరిష్యంతుని దాయాది దతంధరుడు. శర్యాతికి ఆనర్తుడను కుమారుడు సుకన్య యను కన్యయు మిథునము దయుంచెను. సుకన్య చ్యవన మహర్షి కిల్లా లయ్యెను అనర్తుని దేశ మానర్తము. అతని రాజధాని కుశస్థలి. ఆనర్తుని దాయాది రైవుడని నాతడు మహా తేజస్వి. రైవుని పెద్ద కొడుకు (రైవతుడు కకుద్మియను పేరు గలవాడు ధార్మికుడు. కుశస్థలి రాజధానిగా రాజ్య మేలినవాడు. తన కన్యకతో నేగి బ్రహ్మ సన్నిధి నొక్క ముహూర్త కాలముండి గాంధర్వమును (సంగీతమును) విన్నవాడు. అమ్ముహూర్త కాలము పుడమిపై పెక్కు యుగమ్ము లయ్యెను. అతడు తన రాజధానికి దిరిగి వచ్చెను. అప్పుడా నగరమును యాదవు లావరించి యుండిరి. పెక్కు ద్వారములు గలదియై యప్పుడది ద్వారకయను పేర మనోహర మయ్యెను. అది భోజన వృష్ణ్యంధక కులము వారగు వసుదేవాదుల పాలన మందుండెను. రైవతుడది తెలిసి కొని బలదేవునకు దన కన్యను (రేవతిని) సుభద్రయను పేరు గల దానిని నొసంగెను. ఆ మీద మేరు శిఖరమున కేగి తపస్సు నందుండెను. ధర్మాత్ముడగు బలరాముడును రేవతీదేవితో సుఖముగ విలసించెను.
మునులు:
కథం బహుయుగే కాలే సమతీతే మహామతే
న జరా రేవతీం ప్రాప్తా రైవతం చ కకుద్మినమ్
మేరుం గతస్య వా తస్య శర్యాతేః సంతతిః కథమ్
స్థితా పృథివ్యా మద్యాపి శ్రోతు మిచ్ఛామ తత్త్వతః
మునులు:
పెక్కు యుగములు గడచె గదా? రేవతికి కకుద్మికి (రేవతుని కుమారునికి) ముదిమి రాలేదేమి? మేరువున కేగిన శర్యాలికిని గల్గిన సంతతి యిప్పటికిని పృథివియం వెట్లున్నది. ఈ విషయము స్పష్టముగ వినగోరు చున్నాము.
లోమహర్షణుడు:
న జరా క్షుత్పిపాసా వా న మృత్యు ర్మునిసత్తమాః
ఋతుచక్రం ప్రభవతి బ్రహ్మలోకే సదానఘాః
కకుద్మినస్తు స్వర్లోకం రై వతస్య గతస్య హి హృతా
పుణ్యజనైర్విప్రా రాక్షసైః సా కుశస్థలీ
తస్య భ్రాతృశతం త్వాసీ ద్ధార్మికస్య మహాత్మనః
తద్వధ్యమానం రక్షోభి ర్దిశః ప్రాక్రామ దప్యుత
విద్రుతస్య చ విప్రేంద్రా స్తస్య భ్రాతృశతస్యవై
అన్వవాయస్తు సుమహాం స్తత్ర తత్ర ద్విజోత్తమాః
తేషాం హ్యేతే మునిశ్రేష్ఠాః శర్యాతా ఇతి విశ్రుతాః
క్షత్రియా గుణసంపన్నా దిక్షు సర్వాసు విశ్రుతాః
సర్వశః సర్వగహనం ప్రవిష్టాస్తే మహౌజనః
నాభాగరిష్ఠపుత్రౌ ద్వౌ వై శ్యౌ బ్రాహ్మణతాం గతౌ
కరూశస్య తు కారూశాః క్షత్రియా యుద్ధదుర్మదాః
పృషధ్రో హింసయిత్వా తు గురోర్గాం ద్విజసత్తమాః
శాపాచ్చూ ద్రత్వమాపన్నో నవైతే పరికీర్తితాః
లోమహర్షణుడు:
అనఘులార! బ్రహ్మ లోకమున ముదిమి యుండదు. అకలి దప్పిక లుండవు మృత్యు వుండదు. ఋతు చక్రము తిఱుగదు స్వర్లోక మేగిన రేవత కుమారుడగు కక్కుద్మి యొక్క రాజధాని కుశస్థలి రాక్షసులచే హరింప బడెను. అతనికి సోదరులు నూరు గురుండిరి. కాని వారు రక్షోగణము బారిబడి చావు దప్పి నలు దెసలకు బారి పోయిరి. వారి వంశ మందందు చెల్లా చెదరైనది. వారి పరంపర వారు శర్వాతులను పేరందిరి. గుణ వంతులయిన యా క్షత్రియులు సర్వ దిక్కులంటి పోయి గహనములం జొచ్చిరి. నాభాగుని యొక్కయు నరిష్టుని యొక్కయు కొడుకు లిర్వురు వైశ్యులు బ్రాహ్మణత్వముం బడసిరి. కరూశుని సంతతి కారూశులు. వృషదుడను వాడు గురు ధేనువును హింసించి, గురు శాపముచే శూద్రత్వ మందెను. ఇది యా తొమ్మండ్ర చరిత్ర.
వైవస్వతస్య తనయా మునేర్వై మునిసత్తమాః
క్షువతస్తు మనోర్విప్రా ఇక్ష్వాకు రభవ త్సుతః
తస్య పుత్రశతం త్వాసీ దిక్ష్వాకో ర్భూరి దక్షిణమ్
తేషాం వికుక్షి ర్జ్యేష్ఠస్తు వికుక్షిత్వా దయోధతామ్
ప్రాప్తః పరమధర్మజ్ఞ సోయోధ్యాధిపతిః ప్రభుః
శకుని ప్రముఖా స్తస్య పుత్రాః పంచశతం స్మృతాః
ఉత్తరాపథదేశస్య రక్షితారో మహాబలాః
చత్వారింశద్దశాష్టౌచ దక్షిణస్యాం తథా దిశి
వశాతిప్రముఖా శ్చాన్యే రక్షితారో ద్విజోత్తమాః
ఇక్ష్వాకుస్తు వికుక్షిం వా అష్టకాయా మథాదిశత్
మాంసమానయ శ్రాద్ధార్థం మృగాన్హత్వా మహాబల
శ్రాద్ధకర్మణి చోద్దిష్టో అకృతే శ్రాద్ధకర్మణి
భక్షయిత్వా శశం విప్రాః శశాదో మృగయాం గతః
ఇక్ష్వాకునా పరిత్యక్తో వశిష్ఠ వచనా త్ర్బభుః
వైవస్వత మనువు మునియే. అతడు తుమ్మగా నందుండి ఇక్ష్వాకువు పుట్టెను, అతనికి నూర్గురు పుత్రులు పుట్టిరి. వారు భూరి దక్షిణ లిచ్చి యజ్ఞములు గావించిన వారు, వారు వికుక్షి పెద్దవాడు . కుక్షిలేని వాడగుటచే అయోధ్యత్వమును పొందెను (ఎదిరి యుద్ధము చేయ నశక్యము గాని వాడయ్యెను.) అందు చేతనే యతని రాజధాని అయోధ్య యన బడెను. అయన పుత్రులు శకుని మొదలయిన వారయిదు వందల మంది ఉత్తరా పథము నేలు వారైరి. మహా బల శాలురు. యేబది ఎనిమిది మంది దక్షిణ దిశను బాలించిరి. ఇక్ష్వాకువు వికుక్షిని అష్టకా శ్రాద్ధమందు మాంసము తెమ్మని పంపెను. శ్రాద్ధ నిమిత్తము గనుక శశమును (కుందేటి జాతి) జంపి యతడా మాంసమును తానే దిని శశాదుడను పేరంది, వశిష్ఠు మాటం బట్టి ఇక్ష్వాకుచే పరిత్యక్తుడై వేటకు బోయెను.
ఇక్ష్వాకౌ సంస్థితే విప్రాః శశాదస్తు నృపోభవత్
శశాదస్య తు దాయాదః కకుత్థ్సో నామ వీర్యవాన్
అనేనాస్తు కకుత్థ్సస్య పృథు శ్చానేనసః స్మృతః
విష్టరాశ్వః పృథోః పుత్ర స్త స్మాదార్ద్ర స్త్వజాయత
అర్దృస్య యువనాశ్వస్తు శ్రావస్త స్త త్సుతో ద్విజాః
జజ్ఞే శ్రావస్తకో రాజా శ్రావస్తీ యేన నిర్మితా
శ్రావస్తస్య తు దాయాదో బృహదశ్వో మహీపతిః
కువలాశ్వః సుతస్త స్య రాజా పరమ ధార్మికః
ఇక్ష్వాకు వుండగనే శశాదుడు రాజయ్యెను. శశాదుని దాయాదుడు కకుత్థ్సుడు. మంచి బలశాలి. ఆయన కొడుకు అనేనుడు. (ఏనస్సు పాపము ఆది లేనివాడు అనేనస్సు) అతిని కొడుకు ప్భథుడు. వానికి విష్టరాశ్వుడు. వానికార్ద్రుడు. వానికి యువనాశ్వుడు, వానికి శ్రావుడు, గల్గిరి. శ్రావస్తకుడు శ్రావుని కుమారుడు శ్రావస్తి నగర నిర్మాత. వాని కొడుకు బృహ దశ్వుడు వాని సుతుడు కువలాశ్వుడు. పరమ ధర్మమూర్తి. ధుంధువను వానివ సంహరించి ధుంధుమారు డననయ్యె.
మునులు:
ధుంధోర్వధం మహాప్రాజ్ఞ శ్రోతుమిచ్ఛామ తత్త్వతః
యద్వధా త్కువలాశ్వోసౌ ధుంధుమారత్వ మాగతః
మునులు:
ఓ సూత! ఎవని వధించి కువలాశ్వుడు ధుంధుమారు డయ్యెనో ఆ ధుంధువధను గూర్చి విన గోరు చున్నాము.
లోమహర్షణుడు:
కువలాశ్వస్య పుత్రాణాం శత ముత్తమధన్వినామ్
సర్వే విద్యాసు నిష్ణాతా బలవంతో దురాసదాః
బభూవు ర్ధార్మికాః సర్వే యజ్వానో భూరిదక్షిణాః
కువలాశ్వం పితా రాజ్యే బృహదశ్వో న్యయోజయత్
పుత్ర సంక్రామిత శ్రీస్తు వనం రాజా వివేశహ
త ముత్తంకోథ విప్రర్షిః ప్రయాంతం ప్రత్యవారయత్
లోమహర్షణుడు:
కువలాశ్వునికి నూర్గురు కొడుకులు ఉత్తమ ధానుష్కులు అందరు విద్వాంసులు. అజయ్యులు ధార్మికులు. ఎల్లరు భూరి దక్షిణులయిన యజ్వలు. బృహదశ్వుడు కువలాశ్వుని రాజ్య మందుంచి వనమునకు ప్రస్థానము సేయబోగా యతని నుత్తంక మహర్షి పోవలదని వారించెను.
ఉత్తంకుడు:
భవతా రక్షణం కార్యం తచ్చ కర్తుం త్వ మర్హసి
నిరుద్విగ్న స్తపశ్చర్తుం నహి శక్నోమి పార్థివ
మామా శ్రమసమీపే వై సమేషు మరుధన్వసు
సముద్రో వాలుకాపూర్ణ ఉద్దాలక ఇతి స్మృతః
దేవతానామ వధ్యశ్చ మహాకాయో మహాబలః
అంతర్భూమిగత స్తత్ర వాలుకాంతర్హితో మహాన్
రాక్షసస్య మధోః పుత్రో ధుంధుర్నామ మహాసురః
శేతే లోకవినాశాయ తప ఆస్థాయ దారుణమ్
సంవత్సరస్య పర్యంతే స విశ్వాసం విముంచతి
యదా తదా మహీ తత్ర చలతిస్మ సరాధిప
తస్య నిశ్వాసవాతేస రజ ఉద్దూయతే మహత్
అదిత్యపథమావృత్య సప్తాహం భూమికంపనమ్
స విస్ఫులింగం సాంగారం సధూమ మతిదారుణమ్
తేన తాత నశక్నోమి తస్మిం స్థాతుం స్వఆశ్రమే
తం మారయ మహాకాయం లోకానాం హితకామ్యమా
లోకాః స్వస్థా భవంత్యద్య తస్మిన్వినిహతే త్వయా
త్వం హి తస్య వధాయైకః సమర్థః పృథివీపతే
విష్ణువా చ వరో దత్తో మహ్యం పూర్వయుగే నృప
యస్తం మహాసురం రౌద్రం హనిష్యతి మహాబలమ్
తస్యం త్వం వరదానేన తేజశ్చాఖ్యాపయిష్యసి
నహి ధుంధు ర్మహాతేజా స్తేజసా ల్పేన శక్యతే
నిర్దగ్ధుం పృథివీపాల చిరం యుగశతైరపి
వీర్యం చ సుమహ త్తస్య దేవైరపి దురాసదమ్
స ఏవముక్తో రాజర్షి రుత్తంకేన మహాత్మనా
కువలాశ్వం సుతం ప్రాదా త్తస్మై ధుంధునిబర్హణే
ఉత్తంకుడు:
నీవు రక్షణ సేయ వలసిన వాడవు అందల కర్హుడవు. నేను ఆందోళనము లేకుండ తపస్సు జేయుటకు చాలను నా ఆశ్రమ సమీపమున చదునైన మరుధన్వము లనెడి ప్రదేశము లందు సముద్రుడు వాలుకా పూర్ణుడై (ఇసుక మేటలు వేసినది) ఉద్దాకుడని పిలవ బడును. ఆ సుముద్ర మందు దేవతలకేని యవధ్యుడు మహా కాయుడు బలశాలి ఇసుక లోన శయనించి యుండు మధు పుత్రుడగు ధుందుడను మహాసురుడు. లోక నాశనమునకు దారుణ తప మొనరించు చుండును. సంవత్సరము చివర వాడొకసారి నిట్టూర్పు పుచ్చును. అప్పుడు భూకంపము వచ్చును. వాని నిఃశ్వాస వాయువుచే నిసుకలేచి ఏడు రోజులు ఆదిత్య మండలము దాక కప్పి వైచును. మిణుగురులతో, నిప్పులతో, పొగతో నది యతి దారుణము నగనుండును. నేనచట తప మొనరింపం నిలువ లేకుంటిని. లోక క్షేమమునకు నీవు వాని సంహరింపుము. తన్మారణ మొనరింప లోకములు స్వస్థము లగును. నీవొక్కడవ వాని సంహరింప సమర్ధుడవు. వానం జంపిన వానికి వరములిచ్చి వాని ప్రతాప ఖ్యాతి గావింపు మని విష్ణువు నాకు వరమిచ్చెను. వాడు మహా తేజస్వి. అల్ప తేజస్వి చేత మడియడు అన నా ఉత్తంకుని పలుకులు విని
బృహదశ్వుడు:
భతవన్న్యస్తశస్త్రోహ మయం తు తనయో మమ
భవిష్యతి ద్విజశ్రేష్ఠ ధుంధుమారో న సంశయః
స తం వ్యాదిశ్య తనయం రాజర్షి ర్ధుంధుమారణే
జగామ పర్వతాయైవ నృపతిః సంశితవ్రతః
బృహదశ్వుడు:
తన సుతుని కువలాశ్వుని జూపి స్వామి! నేనస్త్ర త్యాగము చేసితిని. ఈతడు ధుంధు వధ యొనరింప జాలునని చెప్పి తీవ్రతపో నిష్ఠకై పర్వతమున కేగెను.
లోమహర్షణుడు:
కువలాశ్వస్తు పుత్రాణాం శతేనసహ భోద్విజాః
ప్రాయా దుత్తంకసహితో ధుంధో స్తస్య నిబర్హణే
తమావిశ త్తదా విష్ణు స్తేజసా భగవా న్ప్రభుః
ఉత్తంకస్య నియోగాద్వై లోకానాం హితకామ్యయా
తస్మిన్ప్రయాతే దుర్ధర్షే దివి శబ్దో మహానభూత్
ఏష శ్రీమా నవధ్యోద్య ధుంధుమారో భవిష్యతి
దివ్యైర్గంధైశ్చ మాలైశ్చ తం దేవాః సమవాకిరన్
దేవదుందుభయశ్చైవ ప్రణేదు ర్ద్విజసత్తమా
స గత్వా జయతాం శ్రేష్ఠ స్తనయైః సహా వీర్యవాన్
సముద్రం ఖానయామాస వాలుకాంతర మవ్యయమ్
తస్య పుత్రైః ఖనద్భిశ్చ వాలుకాంతర్హిత స్తదా
ధుంధు రాసాదితో విప్రా దిశ మావృత్య పశ్చిమామ్
ముఖజే నాగ్నినా క్రోధా ల్లోకా నుధ్వర్తయన్నివ
వారి సుస్రావ వేగేన మహోదధి రివోదయే
సోమస్య మునిశార్దూలా వరోర్మికలిలో మహాన్
తస్య పుత్రశతం దగ్ధం త్రిభి రూనం తు రక్షసా
తతః స రాజా ద్యుతిమా న్రాక్షసం తం మహాబలమ్
ఆససాద మహాతేజా ధుంధుం ధుంధు వినాశనః
తస్య వారిమయం వేగ మాపీయ స నరాధిపః
యోగీ యోగేన వహ్నించ శమయామాస వారిణా
నిహత్య తం మహాకారం బలే నోదకరాక్షసమ్
ఉత్తంకం దర్శయామాస కృతకర్మా నరాధిపః
ఉత్తంకస్తు వరం ప్రాదా త్తస్త్మె రాజ్ఞే మహాత్మనే
దదౌ తస్యాక్షయం విత్తం శత్రుభి శ్చాపరాజితమ్
ధర్మేరతిం సతతం చ స్వర్గే వాసం తథా క్షయమ్
పుత్రాణాం చాక్షయాన్ లోకాన్ స్వర్గే యే రాక్షసా హతాః
లోమహర్షణుడు:
ఓ బ్రాహ్మణులారా! కువలాశ్వుడు నూర్గురు కొడుకులతో ధుంధుని పైకి దండెత్తెను. ఉత్తంకు డాతని వెంట నుండెను. అప్పుడు విష్ణు భగవాను డాతని నావేశించెను. అతడెత్తి చసువేళ ‘‘నీతడు శ్రీమంతుడు. అవధ్యుడు. తప్పక ధుంధువును జంప గలడ’’ ను శబ్దము నింగిని విన బడెను. అతనిని దేవతలు దివ్య గంధ మాల్యములచే ముంచెత్తిరి. దేవ దుందుభులు మ్రోగెను. అతడు సుతులతో నేగి సముద్రమును మూల మట్టుగా త్రవ్వించెను. పడమటి దిశ నా రక్కసుడు బయలువడి వారి నెదిరించెను. వాని ముఖాగ్ని పెనుగాలితో రేగి లోకముల దహించి నట్లయ్యెను. వెల్లువలై నీరుబికెను. మువ్వురు దక్క తక్కిన వారెల్లరు దగ్ధులయిరి. అవ్వల రాజు వాని పైకెత్తెను. యోగి గావున యోగ బలమున జలము నించి యగ్నిని శమింప జేసెను. ఉదక రాక్షసుడగు వానిని గూల్చి యుత్తంకునికి జూపెను. అక్షయ ధనము అరి విజయము ధర్మ మందాసక్తి అక్షయ స్వర్గ వాసమను వరములుత్తం కుడాఱేని కిచ్చెను. రాక్షసుని చేగూలిన కుమారులకు క్షయ లోకములు గలుగు నట్లును వర మిచ్చెను.
తస్యపుత్రాస్త్రయః శిష్టా ధృఢాశ్వో జ్యేష్ఠ ఉచ్యతే
చంద్రాశ్వకపిలాశ్వౌ తు కనీయాం సౌ కుమారకౌ
ధౌంధుమారేర్దృఢాశ్వస్య హర్యశ్వశ్చా త్మజః స్మృతః
హర్యశ్వస్య నికుంభో భూత్క్షత్ర ధర్మరతః సదా
సంహతాశ్వో నికుంభస్య సుతో రణవిశారదః
ఆకృశాశ్వకృశాశ్వౌ తు సంహతాశ్వసుతౌ ద్విజాః
తస్య హైమవతీ కన్యా సతాం మన్యా దృషద్వతీ
విఖ్యాతా త్రిషు లోకేషు పుత్ర శ్చాస్యాః ప్రశేనజిత్
లేభే ప్రసేన జిద్భార్యాం గౌరీం నామ పతివ్రతామ్
అభిశస్తాతు సా భర్త్రా నదీవై బాహుదా భవేత్
తస్యపుత్ర్యో మహానాసీ ద్యువనాశ్వో నరాధిపః
మాంధాతా యువనాశ్వస్వ త్రిలోక విజయీ సుతః
తస్య చై త్ర రథీ భార్యా శశిబిందోః సుతా భవత్
సాధ్వీ బిందుమతీ నామ రూపేణాసదృశీ భువి
ప్రతివ్రతా చ జ్యేష్టా చ భ్రాతౄణా మయుతస్యవై
తస్యా ముత్పాదయామాస మాంధాతా ద్వౌ సుతౌ ద్విజాః
పురుకుత్సంచ ధర్మజ్ఞం ముచుకుందం చ పార్థివమ్
పురుకుత్స సుతస్త్వాసీత్త్రదస్యు ర్మహీపతిః
నర్మదాయా మథోత్పన్నః సంభూత స్తస్య చా త్మజః
సంభూతస్య తు దాయాద స్త్రిధన్వా రిపుమర్దనః
రాజ్ఞ స్త్రి ధన్వన స్త్వాసీ ద్విద్వాం స్త్రయ్యారుణః ప్రభుః
తస్య సత్య వ్రతోనామ కుమారో భూ న్మహాబలః
పరిగ్రహణ మంత్రాణాం విఘ్నం చక్రే సుదుర్మతిః
యేన భార్యా కృతోద్వాహా హృతా చైవ పరస్య హ
బాల్యా త్కా మాచ్చ మోహాచ్చ సాహసా చ్చాపలేన చ
జహార కన్యాం కామార్తః కన్యచి త్పుర వాసినః
అధర్మశంకునా తేన తం త్రయ్యారుణో త్యజత్
అపధ్వంనేతి బహుశో వద న్క్రోధ సమన్వితః
సో బ్రవీత్పితరం త్యక్తః క్వ గచ్ఛామీతి వై ముహుః
పితా చ తమథోవాచ శ్వపాకైః సహవర్తయ
నాహం పుత్రేణ పుత్రార్థీ త్వయాద్య కులపాంసన
ఇత్యుక్తః స నిరాక్రామ న్నగరా ద్వచనా త్పితుః
న చ తం వారయామాస వశిష్ఠో భగవానృషిః
సతు సత్యవ్రతో విప్రాః శ్వపాకావసథాంతికే
పిత్రా త్యక్తో వసద్వీరః పితా ప్యస్య వనం యయౌ
తత స్తస్మింస్తు విషయే నావర్షత్పాకశాసనః
సమా ద్వాదశ భో విప్రా స్తేనాధర్మేణ వై తదా
దారాంస్తు తస్య విషయే విశ్వామిత్రో మహాతపాః
సంన్యస్య సాగరాంతే తు చకార విపులం తపః
తస్య పత్నీ గలే బద్ధ్వా మధ్యమం పుత్ర మౌరసమ్
శేషస్య భరణార్థాయ వ్యక్రీణా ద్గోశతేన వై
తం చ బద్ధం గలే దృష్ట్వా విక్రయార్ధం నృపాత్మజః
మహర్షిపుత్రం ధర్మాత్మా మోక్షయామాస భో ద్విజాః
సత్యవ్రతో మహాబాహు ర్భరణం తస్య చాకరోత్
విశ్యామిత్రస్య తుష్ట్యర్థ మనుకంపార్థ మేవ చ
సోభవ ద్గా లవో నామ గలే బంధా న్మహాతపాః
మహర్షిః కౌశికో ధీమాం స్తే న వీరేణ మోక్షితః
వానికి మిగిలిన కుమారులు ముగ్గురు. పెద్దవాడు దృఢాశ్వుడు, చంద్రాశ్వ కపిలాశ్వులు తరువాతి వారు. ధుంధుమార కుమారుడైన దృఢాశ్వునికి హర్యశ్వడను వాడు కలిగెను. వానికి నికుంభుడు దయించే. అతడు క్షత్ర ధర్మపరుడు. అతని కొడుకు సంహతాశ్వుడు. రణ విశారదుడు. వాని తనయులు అకృశాశ్వ కృశాశ్వులు. కూతురు హైమవతి, దృషద్వతి అని ఖ్యాతి గాంచెను. ఆమె కొడుకు ప్రసేనజిత్తు. అతడు గౌరియను భార్యను బడసెను. ఆమె మహాసాధ్వి. భర్తృ శాపముచే నామె బాహుద యను నదియయ్యె. అతని కొడుకు యువనాశ్వుడు వాని కొడుకు మాంధాత. త్రిలోక విజయి యాయన. అతని భార్య చైత్రరథి. శశిబిందుని కూతురు సాధ్వి. బిందుమతి యను పేరు కలది. పరమ సుందరి పదివేల మంది కామె యప్పగారు. ఆమె యందు మాంధాత యిర్వురు కుమారుల గనెను. పురుకుత్సుడు ముచికుందు డనువారు వారలు. పురుకుత్సుని సుతుడు త్రసదస్యుడు. నర్మద యందు గలిగిన వాడు. వాని కొడుకు సంభూతుడు. వాని కుమారుడు త్రిధన్వుడు. శత్రు మర్దనము జేసిన వాడు. ఆయన తనయుడు విద్వాంసుడు త్రయ్యారుణుడు ప్రభువు. వాని కుమారుడు సత్య వ్రతుడు మహా బలాశాలి క్రూరుడు. పరిగ్రహణ మంత్రములకు విఘ్నముల కల్పించి మరొక్కని భార్యను హరించిన వాడు. బాల్యము చేత కామముచే మోహముచే సాహసముచే చాపల్యముచే వాడంతః పురమున నివసించు నొక గృహస్థుని కన్యను హరించెను. త్రయ్యారుణుడు ఆ యధర్మ శంకచేత క్రోధ సమన్వితుడై అతనిని నిందించి పరిత్యజించెను. నేనెక్కడకు బోదునని వాడనెను. నీవు శ్వపచులతో గూడి యుండుమని తండ్రి యనెను. నీవు కుల పాంసనుడవు. నీచే నేను పుత్రవంతుడ గాననియె. వాడు తండ్రి మాటను బట్టి నగరమును వీడి పోయెను. ఋషియైన వశిష్ఠ భగవానుడు పోవలదని వానిని వారింపడయ్యె. ఆ సత్య వ్రతుడు శ్వపాకుల పాకలదరి వసించు చుండెను. కొన్నాళ్ళకు దండ్రియు నవ్వనంబున కరిగెను. అంతట నింద్రుడా రాజ్యమున వర్షింప డయ్యె. ద్వాదశ వర్ష క్షామ మేర్పడెను. విశ్వామిత్రుడు తన భార్య నాతని దేశమున వదలి సాగరాంతమున విపుల తప మ్మెనరించెను. ఆయన భార్య నడిమి కొడుకును గల మందు బంధించి కొనపోయి తక్కిన బిడ్డలను బోషించుటకై నూరు గోవుల వెల కమ్మెను. అట్లు గలమందు బంధితుడైన వాని జూచి సత్యవ్రతుడు (రాజ కుమారుడు) విడిపించి యాతనిం దాను భరించెను. విశ్వామిత్రుని సంతోష పెట్టుటకు, అతని యను గ్రహము బొందుటకు నతడట్లు సేసెను. గలబంధన మందిన కతన నాతడు ‘గాలపుడు’ అనంబరగెను. కౌశిక మహర్షి యా వీరుని వలన నటు విముక్తి బడసెను.
Summary of chapter 7 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The divine origin of Soma (the Moon) is narrated. Born of Atri's intense tapas, Soma illuminates the three worlds and is installed as lord of medicinal herbs, brāhmaṇas, and the night. The chapter describes how he became the progenitor of the Candravṃśa (Lunar Dynasty), setting the stage for subsequent genealogical narratives.